చంద్రయ్య పెళ్లి - కాశీవిశ్వనాధం పట్రాయుడు

Chandrayya pelli

కౌశిక్ ,కృష్ణ, లిఖిత, శివాని,మానస హరి సౌమ్య, సాయి, శ్యామ్, అంజు, శ్రావ్య , అందరూ కలిసి దిండ్లు, మంచినీళ్ళ చెంబులు పట్టుకుని, పొలోమని పేదరాశి పెద్దమ్మ ఇంటికి వచ్చేసారు. "మామ్మా ఇవాళ నీ దగ్గరే మా పడకలు" అన్నాడు అందరిలో పెద్దవాడైన హరి. "ఏమిటి విశేషం అందరూ కలిసి నా మీదకి దండయాత్రకు వచ్చేరు" అంది పేదరాశి పెద్దమ్మ. "మరేమో… మరేమో … అక్క అన్నయ్య వచ్చేరు, అందుకే నేను కూడా వచ్చేను" అంది అంజు పెద్దమ్మ ఒళ్ళో చేరిపోతూ . "సరే పదండి" అని చెప్పి వాకిట్లో పక్కలు పరిచింది పెద్దమ్మ. పెద్దమ్మ కి అటూ ఇటూ అంజూ కౌశిక్ చేరిపోయారు. అంజు పక్కన ఆడ పిల్లలు, కౌశిక్ పక్కన మగ పిల్లలు తమ దిండ్లు సర్దుకున్నారు. "ఇంతకీ ఈ పిల్ల సైన్యం ఎందుకు వచ్చిందో చెప్పలేదు." అంది పెద్దమ్మ. "ఏ ముందీ కథ చెప్పమని మా మామ్మని అడిగాను. 'అనగనగా రాజు రాజుకు ఏడుగురు కొడుకులూ' అని మొదలు పెట్టింది. వెన్నెల్లో పడుకున్నప్పుడు అలాంటి కథలెవరైనా వింటారా చెప్పు? అందుకే నేను, తమ్ముడు శ్యామ్, నీ దగ్గరికి బయలుదేరాము. అంతే వీళ్ళందరూ కూడా నాతో జతకట్టారు." అన్నాడు సాయి. "అవును మామ్మా చల్లగా ఉంది. చక్కగా వెన్నెల ఉంది. మంచికథ చెప్పవా?" అంది మానస. ఆకాశం లో నవమి చంద్రుడు కాస్త వంగి 'పెద్దమ్మ ఏం కథ చెప్తుందా' అన్నట్టు చూస్తున్నాడు. పెద్దమ్మ చంద్రుని వైపు చూసి "నీ కథే చెప్తాను లేవయ్యా!" అంటూ మొదలుపెట్టింది. "ఒకప్పుడు దక్షుడు అని ఒక మారాజు ఉండేవాడు. ఆయనకి ఉన్న కూతుళ్ల లో 27 మంది చక్కని చుక్కలు. వాళ్ళే అశ్వని, భరణి,కృత్తిక…. మొదలైన వారు." "ఆగాగు, మా అమ్మ వల్లె వేయించింది. నక్షత్రాల పేర్లు కదూ! నేను చెప్తా" అంది సౌమ్య అడ్డుతగులుతూ. "నువ్వండవే అక్కా. అన్నీ నీకే వచ్చని మహా గొప్ప. నువ్వు చెప్పు పెద్దమ్మా!" అంది శ్రావ్య. మూతి ముడుచుకుంది సౌమ్య. సౌమ్య కి, శ్రావ్య కి తల నిమిరి నవ్వుకుని చెప్పడం ప్రారంభించింది పెద్దమ్మ. "అవునర్రా వాళ్ళే! ఆ 27 మంది అక్క చెల్లెళ్లను చంద్రునికిచ్చి పెళ్లి చేశాడు దక్షుడు." "చంద్రునికి 27 మంది పెళ్ళాలా "అంది శివాని. "అవునర్రా! అయితే అందరూ చక్కని చుక్కలే అయినా నాలుగో పిల్ల రోహిణీ అంటే చంద్రునికి బాగా ఇష్టం. దాంతో ఎక్కువ సేపు రోహిణి దగ్గరే ఉండేవాడు. మిగతా 26 మందికి ఉడుకుబోత్తనం, దుఃఖం వచ్చింది. వాళ్ళ నాన్న దగ్గరికి ఏడ్చుకుంటూ వెళ్ళి చెప్పారు. కూతుళ్ళందరు ఒకేసారి ఏడ్చేసరికి దక్షుడుకి అల్లుడుమీద కోపం వచ్చేసింది. నచ్చచెప్పడానికి బదులు అల్లుడిని శపించేశాడు." "అయ్యో!" అన్నారు శ్యామ్, కృష్ణ ఒకేసారి. "ఏమని శపించాడు?" అని అడిగాడు కౌశిక్. "చంద్రునికి క్షయరోగం రావాలని." 'అయ్యో నాన్నా నచ్చ చెప్పమంటే రోగం ఇచ్చావే' అనీ మళ్లీ ఏడ్చారు కూతుళ్ళు. 'సర్లే' అని నాలిక్కర్చుకుని, "నెలలో 15 రోజులు తగ్గుతాడు మళ్లీ పుంజుకుంటాడు" అన్నాడు దక్షుడు. ఆసరికే చంద్రునికి ఉప్పు అందిపోయింది. పడుతూ లేస్తూ… పడుతూ లేస్తూ… రోహిణి తో కలిసి వచ్చేశాడు. 'నన్ను మన్నించు మామయ్యా' అన్నాడు. 'సర్లే అల్లుడూ ఇకమీదట అమ్మాయిలందరితోను నువ్వు సరదాగా ఉండాలి'. అని చెప్పి ఇటుతిరిగి 'మీ ఆయన పున్నమినాడు మీలో ఎవరి తో కలిసి ఉంటే వారి పేరుతోనే ఆ నెలని పిలుస్తారు' అన్నాడు దక్షుడు. అలా పున్నమ్మి నాడు చిత్త తో ఉంటే అది చైత్రమాసం అయ్యింది. రెండో పున్నమి విశాఖ తో ఉంటే అది వైశాఖం అయ్యింది. ఇలా పన్నెండు నెలలకు 12 పేర్లు వచ్చాయి." చెప్పింది పెద్దమ్మ. "అయితే సరే పెద్దమ్మా ఎల్లుండి పున్నమి నాడు ఏ నక్షత్రం ఎదురుగా ఉంటాడో అమ్మని అడిగి చెప్తా" అంది శ్రావ్య. "సరే! సరే! అంజు, కృష్ణ ఎప్పుడో నిద్రపోయారు. మీరు కూడా పడుకోండి." అని చెప్పి, పెద్దమ్మ లేచి, మంచి నీళ్లు తాగింది. చందమామకు శుభరాత్రి చెప్పి పిల్లలంతా నిద్రలోకి జారుకున్నారు. పెద్దమ్మను చూసిన చంద్రుడు సిగ్గుపడి నవ్వేశాడు.

మరిన్ని కథలు

Panipilla
పనిపిల్ల (క్రైమ్ కథ)
- చెన్నూరి సుదర్శన్
Bhavaateetam
భావాతీతం
- DODDIPATLA KALYAN KISHORE
Prema falam
ప్రేమ ఫలం
- పి. రాజేంద్రప్రసాద్
Neethone nenunta
నీతోనే నేనుంటా
- కాశీవిశ్వనాధం పట్రాయుడు
Amlet damlet
ఆంమ్లేట్ - డాంమ్లేట్ .
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
REkkala kastam
రెక్కల కష్టం
- వరలక్ష్మి నున్న