అమ్మమ్మ కథ - ఆపాసా

Ammamma katha

నా చిన్నతనంలో మా అమ్మమ్మ చెప్పిన వందల కథల్లో ఒక చిన్నకథ ఇది. రెండు లైన్లు కూడా ఉండదు.

బహుశః తరతరాలుగా చెప్పుకున్న కథ అయుంటుంది. అందుకే ఈకథ నేనెవరికి చెప్దామని ప్రయత్నించినా, అది మొదలెట్టగానే,

“చాల్లేవోయ్! పెద్ద చెప్పొచ్చావు! మాకీ కథ ఏనాడో తెలుసు!” అనేవాళ్ళు.

అయితే ఆ కథా కమామీషు, అదెప్పుడు, ఎక్కడ, ఎలా, ఎందుకు మా అమ్మమ్మగారు నాకు చెప్పాల్సి వచ్చిందీ అనేది మరికొన్ని పంక్తుల కథ.

ఆ వరసలకి శ్రీకారం చుట్టే ముందు అమ్మమ్మగారి గురించి చెప్పాలి కదా! అది మాత్రం కొంచెం పెద్దదే, ఈరోజుతో అయిపోదు. బహుశః రేపు ముగుస్తుంది. ఆ తరవాత ఆమె చెప్పిన కథతో మా అమ్మమ్మ కథ ముగిస్తాను.

అమ్మమ్మని తలచుకునేసరికల్లా, నేననే ఏంటి, ఎవరికైనా ఆనందమే! ఎక్కడలేని హుషారే!

ఎందుకంటే, ఎప్పుడో సెలవుల్లో కాని అమ్మమ్మావాళ్ళ ఊరు వెళ్ళం.

అలా ఎప్పుడన్నా మా స్నేహితులు, “మేం ఈ సెలవుల్లో మా అమ్మమ్మా వాళ్ళూరు వెళుతున్నామోచ్! నువ్వెళ్ళవుగా!” అనేవాళ్ళు, నన్నూరిస్తూ.

నేను ఉడుక్కునేవాణ్ణి. కానీ అది బయటపడనీకుండా, రోషంగా, “పొండిరా! మీరైతే అప్పుడప్పుడే వెళ్తారు. అప్పుడే మీకు అమ్మమ్మ ఉండేది. మాకైతే ఎంచక్కా మా అమ్మమ్మా వాళ్ళిల్లే మాయింటికొచ్చేసింది!” అని వాళ్ళమాటని తిప్పికొట్టేవాణ్ణి. తెలిసిన వాళ్ళు నోరు మూసుకునేవాళ్ళు. తెలియని వాళ్ళు నేనెందుకలా అన్నానో ఇతరులని అడిగి తెలుసుకునేవాళ్ళు.

అప్పుడు వాళ్లకి కూడా మా అమ్మమ్మగారి గురించి తెలిసేది.

“గం.భ.స. దొడ్డమ్మగారికి ...” అని సంబోధిస్తూ పోస్టు కార్డులొచ్చేవి, మాయింటికి.

ఒకసారి ఆమెని, “గం.భ.స. అని ఎందుకు రాస్తారు? ప్రియమైన దొడ్డమ్మగారికి అని చక్కగా రాయొచ్చుగా” అనడిగితే, అప్పుడు చెప్పారావిడ, నా మాతామహులు కాలం చేశారు కనుక, అలా “ప్రియమైన దొడ్డా” అనో, ఎంత చనువున్న వాళ్ళయినా “మై డియర్ దొడ్డా!” అనో అనకూడదు. అది సభ్యత కాదు. నువ్వు మాత్రం పెద్దాడివయ్యాక, నాకు “మై డియర్ అమ్మమ్మా! అని మొదలెట్టి ఎలావున్నావు? అని కుశలప్రశ్నలు వేసి, నువ్వక్కడ ఎలావున్నావో, ఏం చేస్తున్నావో, ఏం తింటున్నావో, అన్నీ వివరంగా రాయి.” అని చెప్పారు.

నేనప్పుడు, “నాకా అవకాశం రాదు అమ్మమ్మా! నేనెక్కడుంటే నువ్వక్కడేవుంటావు. ఎందుకంటే, నిన్నూ నాతోపాటే తీసుకెళిపోతానుగా!” అన్నాను.

ఆవిడ మురిసిపోయింది. ఎంతలా అంటే, నన్ను టక్కున అక్కున చేర్చేసుకుంది. “మా నాయన! మా నాయనే! నేను చచ్చిపోతానురా!” అని ఆనందంతో కళ్ళంబడి నీళ్ళు పెట్టేసుకుంది.

ఆవిడంతే! అలా ఎన్నిసార్లు చచ్చిపోయిందో!

అలా ఆవిడ ఎప్పుడు నన్ను దగ్గరకు తీసుకున్నా, ఆమె నేత చీర స్పర్శ ఇచ్చే ఆనందంలో ములిగిపోయేవాణ్ణి. అలాగని మా స్నేహితులిళ్ళల్లో తలచెడిన బామ్మగార్లలా, మా అమ్మమ్మగారు తెల్లటి మల్లు పంచె కట్టుకుని, ‘సిటీ పోలీసు’లా తెల్లని యూనిఫారంలో ఉండేవారు కారు.

చక్కని కోడంబాకం, మీనంబాకం, వెంకటగిరి రంగు రంగుల నేత చీరలు, మంచి మంచి జరీ అంచులున్నవే కట్టుకునేవారు. హుందాగా ఉండేవారు. చక్కగా తలకి నూనె రాసుకుని జుత్తు దువ్వుకునేవారు. జడ వేసుకునేవారు కాదు గాని, తలకి వెనుకవైపుకి వచ్చేలా చుట్ట చుట్టి ముడి వేసుకునేవారు. బయటకి వెళ్ళినప్పుడు తప్పనిసరిగా ఆ ముడికి పిన్నులు పెట్టుకునేవారు. తలలో పూలు పెట్టుకునేవారు కారు, కానీ నుదుటను మాత్రం గుండ్రంగా చక్కటి విభూతి బొట్టు పెట్టుకునేవారు. రెండు చేతులకీ బంగారుగాజులు వేసుకునేవారు. రోజూ రెండు పూటలా పూజ చేసుకునేవారు.

మా మాతామహులు “ఒకవేళ నేను కాని, ముందు పోతే, ఇప్పుడెలా ఉన్నావో అలాగే ఉండాలి, అలంకరించుకోవాలి. కట్టు, బొట్టు, జుట్టు అన్నీ. వేటిలోను భేదం రానక్కరలేదు. ఎవరయినా, నిన్నలావుండాలి ఇలావుండాలి అని నిర్బంధిస్తే, నువ్వు నిక్కచ్చిగా ‘ఇది మావారి చివరి కోరిక. నేనిలాగే ఉంటాను.’ అని నిర్భయంగా చెప్పు.” అన్నారుట.

అందుకనేనేమో మాతో పాటు, హరికథలకి, నాటకాలకి, సభలకి, సమావేశాలకి, నిస్సంకోచంగా వచ్చేవారు. సినిమాలకి కూడానండోయ్!

అయితే, మాతోపాటు ఆవిడ వచ్చేవారో, మేమే ఆమెతోపాటు వెళ్ళేవాళ్ళమో; నాకు ఇప్పటికీ అర్థం కాదు!

ఒకసారి అలాగే ‘జగదేకవీరుని కథ సినిమా ఫస్ట్ షో చూసి ఇంటికొచ్చాం. అప్పుడు నేను ఒకటో క్లాసనుకుంటాను. వచ్చీ రాగానే, మా అమ్మమ్మగారితో,

“అమ్మమ్మా! నేను ఐదుగురు అమ్మాయిల్ని పెళ్ళాడుతాను.” అని ఆలవోకగా చెప్పేశాను. అదేదో అంత సులువయిన పనన్నట్టు.

ఆమె, కసరలేదు, తిట్టలేదు, కోప్పడలేదు.

“ఎందుకు నాన్నా ఐదుగురు? ఒక్కరు చాలుగా!” అని ఆప్యాయంగా నన్నుదగ్గరకి తీసుకుని, అప్పటి నా చిన్ని బుఱ్ఱలో ఏముందో తెలుసుకుందామని, బుజ్జగిస్తూ అడిగారు.

నాకేం తెలుసు ఆమె తెలివితేటలు!

పిచ్చి వెధవలాగా, నా మనసులో ఉన్నది, యథాతథంగా, వాగేశాను.

“ఒకరు నా కాళ్ళు పట్టడానికి, ఒకరు నాకు పళ్ళు తినిపించడానికి, ఒకరు నాకు పాయసం అందించడానికి, ఒకరు విసనకర్ర విసరడానికీ.” అన్నాను.

“నలుగురే అయారు. మరి ఐదో అమ్మాయో? ఆమె ఎందుకు? నిన్ను పెళ్ళి చేసుకుని ఆమె ఏం చేస్తుంది?” అని ఆరా తీశారు.

నేను అమ్మమ్మవైపే జాలిగా చూస్తూ, “ఇంట్లో, నువ్వొక్కర్తివే అన్నీ చేస్తున్నావుగా. అందుకు. నీకు సాయం చెయ్యడానికి.” అన్నాను.

మళ్ళీ మా అమ్మమ్మ నన్ను ఆనందంతో హత్తుకుని, ఎప్పటిలాగే ఆమె అలవాటు ప్రకారం, చచ్చిపోయింది.

ఆ తరవాత మర్చిపోకుండా ఆమె, ఆ నా మాటలు, ఎన్నోసార్లు ఇద్దరికి చెప్పి మురిసిపోయింది.

ఒకరు అడిగిన వాళ్ళు. ఇంకొకరు అడగని వాళ్ళు. వాళ్ళిద్దరికే!

అక్కడితో అయిపోలేదు.

అలాగే ఆ తరవాతి సంవత్సరమే అనుకుంటాను ‘గుండమ్మ కథ మరో విజయావారి సినిమా. అప్పటికి నేను మూడవతరగతికి వచ్చేశాను. “ఇదేంటి? రెండు సినిమాలకీ మధ్య గ్యాప్ ఒక సంవత్సరమేగా! ఒకటో క్లాసు నుండి రెండుకి కదా రావాలి. మరి మూడోతరగతిలో ఎలావున్నాడు!” అని ఆశ్చర్యపోకండి! కరక్టే!

కానీ మా అమ్మమ్మా మజాకా!

ఆవిడ శిక్షణలో పెరిగాను. నిజానికి ఒళ్ళో కూర్చోబెట్టుకుని ‘ఓం నమః శివాయః! సిద్ధం నమః!’ అని ఓనమాలు దిద్దించింది మా నాన్నగారే అయినా, ‘అమ్మమ్మ దగ్గర్నుంచి అంమమ్మ’ వరకు అక్షరాలు నేర్పింది మాత్రం మా అమ్మమ్మే.

నా హుషారు చూసి, మా వీధి పురపాలక (పూరిపాక కాదు, మ్యున్సిపల్) బడిలో చేర్చడానికి, మా పెద్దక్క నన్ను తీసుకువెళ్ళింది.

అమ్మగారు (టీచర్. అదేమో నాకు తెలీదు. లేడీ టీచర్లనందర్నీ మరి అప్పట్లో అలాగే పిలిచేవాళ్ళు), మా అక్కతో, “వీడికి తలమీంచి చెయ్యి వేసి, అవతల చెవి పట్టుకోరా అంటే, చెవి సరిగా అందనైనా లేదు! ఇప్పట్నుంచే స్కూల్లో వేసేస్తారా! ఎన్నేళ్ళే వీడికి? ఆరేళ్ళన్నా వచ్చాయా?” అనేసరికి మా పెద్దక్క అడ్డగానో, నిలువుగానో తెలిసీ తెలియకుండా అదోలా బుఱ్ఱూపింది.

“ఇంకా ఎంతమందున్నారే నీకు తమ్ముళ్ళూ, చెల్లెళ్ళూ; మీయింట్లో?” అని ఉరిమింది.

మా అక్క గాభరాపడింది. “అదేమో! నాకు తెలీదు!” అంది.

ఈవిడ అయోమయంగా మా పెద్దక్క వైపు చూసింది, ఆ సమాధానానికి.

అప్పుడు తిరిగి మా అక్కే, ధైర్యం తెచ్చుకుని, “అదేమో! నాకు తెలీదు! మా అమ్మమ్మగారు, ‘ఇంట్లో వీడి అల్లరి భరించలేకపోతున్నాం, బడికి పంపించేస్తే సరి! తిక్క కుదురుతుంది వెధవకి!’ అన్నారు. నాతో ప్రత్యేకంగా మీ పేరు చెప్పి, మీ దగ్గరకి పంపించారు. ఆవిడ మీకు, “ఎలాగైనా వీణ్ణి మీ స్కూల్లో చేర్చెయ్యండి. వీడికి చదువు చెప్పడం, నావల్ల కావటం లేదు.” అని చెప్పమన్నారు.” అని ఒక్క గుక్కలో చెప్పేసి, అమ్మయ్య అని ఊపిరి తీసుకుంది.

ఆవిడ చేటంత మొహం (అంటే ఎంత విశాలమో నాకు తెలీదు) చేసుకుని,

“ఎవరూ! దొడ్డమ్మగారా!” అని, మారుమాటాడకుండా నన్ను బళ్ళో చేర్చేసుకుంది.

ఆరోజే మా అమ్మమ్మ మాట, ఇంట్లోనే కాదు బయట కూడా చెల్లుతుందని నాకు తెలిసింది.

దటీజ్ మై అమ్మమ్మ!

--: oo(O)oo :--

అలా అమ్మమ్మగారి ధర్మమా అని బడిలోకి, మా అమ్మగారి (టీచర్) ఒడిలోకి చేరాను. ఆవిడ చెప్పేవన్నీ వెంటనే అప్పజేప్పేసేవాణ్ణని, నేనంటే ముద్దు! అందుకే అలా ఒళ్ళో కూర్చోబెట్టుకునేవాళ్ళు. అలాగని అనుకునేవాణ్ణి. అదే అన్నానో రోజు గొప్పగా, ఆ స్కూల్లోనే వేరే తరగతిలో చదివే మా చిన్నక్కతో.

అసలు నాకలా అన్నీ అంత త్వరగా ఒంటబట్టేయడానికి కారణం, మా అమ్మమ్మ. ఆవిడ శిక్షణ. క్రమశిక్షణ.

రోజూ సాయంత్రం పూట చల్లబడ్డాక, మేమంతా ఆటలు ఆడుకుని ఇంటికి చేరాక, నూతి దగ్గర స్నానాలు చెయ్యడమో, కాళ్ళూ చేతులు మొహం కడుక్కోవడమో చేశాక, ఏడు-ఏడున్నరకల్లా భోజనాలు చేసేసేవాళ్ళం.

అప్పుడు ప్రాథమిక పాఠశాలలో చదువుకుంటున్న పిల్లలం మేమందరం, పెద్ద డాబా మీదకి వెళ్ళిపోయేవాళ్ళం.

అలా పెద్ద డాబా మీదకి చేరేసరికి, మా అమ్మమ్మగారు ఒకరి తరవాత ఒకరి చేత పద్యాలు, పాటలు, ఎక్కాలు, కథలు, చెప్పించేవాళ్ళు. అలా నాకు అన్నీ వేగంగా వచ్చేశాయి.

మా అమ్మమ్మగారు కొన్నాళ్ళు మా మాతామహులు పోయిన కొత్తల్లో, సంగీతం పాఠాలు చెప్పేవారుట. అయినా, మా చిన్నక్కని మాకు తెలిసిన బంధువులు ఒకాయన దగ్గరకి గాత్రం నేర్చుకోమని (అతనికి ఆ ఆర్జన కొంత ఆదరువుగా ఉంటుందని), ప్రతిరోజూ మధ్యాహ్నం పూట ఒక గంట పంపించేది.

అప్పట్లో మాకు, బడి, ఉదయం 7 నుండి 11 వరకు; తిరిగి మధ్యాహ్నం 2 నుండి సాయంత్రం 5 వరకు రెండు పూటలా ఉండేది.

అలాగే ఆ తరవాత అక్కడి సంగీత కాలేజీలోనే మా పెద్దక్కయ్య వీణ, మా చిన్నక్కయ్య గాత్రం నేర్చుకున్నారు.

నిద్రలొచ్చే టైముకి క్రింద గదుల్లోకి వెళిపోయేవాళ్ళం. వేసంకాలం అయితే, డాబా మీదే పడకలు. ఆ పక్కలు వెయ్యడంలాటి భారీ పనులన్నీ మా పెద్దమామయ్య, చిన్న మామయ్య చేసేవాళ్ళు. వాళ్ళు అప్పటికే హైస్కూలు! మా నాన్నగారి పెళ్ళికి మా పెద్దమామయ్యకి రెండేళ్ళే. చిన్నమామయ్యయితే పుట్టనేలేదు.

మా మాతామహులు పోయేటప్పటికి మా పెద్దమామయ్య నాలుగో క్లాసు, చిన్న మామయ్య రెండు చదువుతున్నాడు కాబోలు. అప్పటికి మా పెద్దక్కని ఇంకా బడిలో వెయ్యలేదు. మా అన్నకి అప్పుడప్పుడే మాటలు వస్తున్నాయిట. ఆసమయంలో మా అమ్మమ్మగారు పడే బాధలు చూడలేక, పిల్లల చదువులకి, వారి అభివృద్ధికి, అన్ని విధాల బాగుంటుందని తలచి, మా స్వస్థలం విజయనగరంలో మా స్వంతయింట్లో ఉండమని ఆమెని సంరక్షకురాల్ని చేశారు. అలా మా అమ్మమ్మగారిల్లే మాయింటికి వచ్చేసింది. మాకు ఇప్పటికీ రెండిళ్ళు లేవు. ఒకటే!

అదే మాయిల్లు. అదే మా అమ్మమ్మగారిల్లు.

అలా మేమంతా కలిసే పెరిగాం. ఒకటిగా. గుండమ్మ కథ వరకే కాదు. ఆ తరవాత కూడా.

అలా ‘జగదేకవీరుని కథ’ సినిమా తరవాత ఓరోజు సాయంత్రం, మా అమ్మగారు (మా టీచర్) మాయింటికి వచ్చారు.

అప్పుడు మా అమ్మమ్మగారు, మా అమ్మగారితో, “అదేంటే విడ్డూరం! శాంక్షన్ అయి ఇన్నాళ్ళయినా, ఇంకా ఒకటో తరగతి పిల్లలకీ, రెండో తరగతి పిల్లలకీ బెంచీల్లేవా? ఉత్తి నేలమీద కూర్చుంటున్నారా! ‘వీడు నీ ఒళ్ళో కూచుంటున్నాడని’ వీడి చిన్నక్క చెప్పేవరకు నాకు బెంచీల్లేవని తెలీలేదు. ఎన్నాళ్ళిలా? నన్నొచ్చి అడగమంటావా మీ హెడ్మాష్టర్ని?” అని నిలదీశారు.

అమ్మమ్మ కూడా మా వీధి బడి ఫర్నీచర్ కోసం, బీరువాలకోసం కొంత విరాళం ఇచ్చారని మా చిన్నక్కకి తెలుసు. అందుకే మా అమ్మమ్మకి ఇంకా బెంచీల్లేవని పితూరీ చేసిందేమో! అనుకున్నాను.

ఆమె బెదిరిపోయింది. “లేదు దొడ్డమ్మగారూ, తయారయిపోయాయి. ఇంకొద్ది రోజుల్లో వచ్చేస్తాయి. అయినా వీడికి నా దగ్గర చదువయిపోయింది. నా ప్రాణాలు తీసేస్తున్నాడు. ఒక్క క్షణం నిలకడగా ఉండడు. వీణ్ణి రెండో క్లాసుకి ప్రమోట్ చేసేస్తున్నాను. అది చెప్దామనే వచ్చాను.” అన్నారావిడ.

మా అమ్మమ్మగారు, “అంటే ఈ బడుద్ధాయిని భరించలేక నీ ఒళ్లోంచి తోసేస్తున్నావన్నమాట!” అన్నారు.

మా అమ్మగారు “ఎంత మాట, ఎంత మాట” అని భలేగా, సున్నితంగా, సుకుమారంగా, చప్పుడవకుండా లెంపలేసుకున్నారు.

“సర్లే!” అన్నారు.

అలా నాకు చేరిన సంవత్సరమే, ఒకటవ తరగతి నుండి ప్రమోషన్ వచ్చి, రెండవతరగతి పరీక్షలు రాశాను.

గుండమ్మ కథకల్లా మూడవ తరగతి.

అలా గుండమ్మ కథకల్లా, రెండో తరగతిలో ఉండడానికి బదులు, మూడవ తరగతికి వచ్చేశాను. (ఆ రోజుల్లో నాలాటి అల్లరివాళ్ళకందరికీ అదే శిక్ష!)

ఆ సినిమాలో అక్కినేని నాగేశ్వర్రావు అనుకుంటాను కారులో సర్రుమని వచ్చి ఒక ఇంటిముందు ఆగుతాడు. ఆ దృశ్యం నా మనసులో ఎలాటి ముద్ర వేసిందంటే, చెప్తే మీరు నవ్వుతారు.

ఇంటికొచ్చాక మా అమ్మమ్మతో, “నేను పేద్దవాణ్ణయ్యాక ఒక పేద్ద బంగళా కట్టిస్తాను. అందులో బోల్డన్ని గదులు, పెద్ద పెద్ద హాళ్ళు ఉంటాయి.” అని ఇంకా చాలా చాలా వర్ణించానుట.

నాకు బాగా గుర్తుండిపోయింది మాత్రం,

“మనింట్లో వాళ్ళందరూ క్రింది భాగంలోనే ఉంటారు. అక్కడా పనివాళ్ళుంటారు కానీ, అందరికంటే ఎక్కువమంది పనివాళ్ళు పై అంతస్తులో, మా అమ్మమ్మకి అంటే నీకు, సపర్యలు చెయ్యటానికి ఉంటారు. ఆ మొత్తం అంతస్తంతా నీ ఒక్కర్తికోసమే.

బంగళా మెయిన్ గేటు నుంచి నువ్వుండే అంతస్తు వరకు, అక్కడనుంచి రెండో వైపు గేటు వరకు, అలా గుఱ్ఱపునాడా ఆకారంలో వెడల్పయిన పెద్ద రోడ్డు, వంతెనలా వేయిస్తాను.

ఎందుకంటే, నువ్వు బయటనుండి కారులో వస్తే, సర్రుమని సరాసరి పై అంతస్తులోని నీ గది గుమ్మంవరకు నీ డ్రైవరు నీ కారుని సునాయాసంగా తీసుకువెళిపోవాలి. పనివాళ్ళు కారు తలుపు తీస్తే, నువ్వు కారు దిగి సరసరా నీ రూములోకి వెళిపోవాలి. అందుకు.”

ఆరోజు కూడా మా అమ్మమ్మగారు, పాపం, నేను కట్టిన గాలిమేడలో తేలిపోయారు. కారులో ఆమె అంతస్తులోకి వెళిపోయారు. ఎప్పుడూలాగే నన్నామె ముద్దులతో ముంచెత్తేశారు.

నా ఊహకి, ఆమె మళ్ళీ “నే చచ్చిపోతానురా నాన్నా!” అని ఆనందంతో మురిసిపోయారు. కన్నీళ్లు కార్చేశారు.

అలా ఎన్నో సినిమాలు, నాటకాలు, సంగీత కచేరీలు వగైరాలు జరుగుతుండగా, మా పెద్దమామయ్య విజయనగరంలో చదువు చాలించి, ఉద్యోగం దొరికిందని, సంపాదన కోసం మధ్య ప్రదేశ్ వెళ్ళాడు. అది కూడా ఎక్కడ? సరిగ్గా మా నాన్నగారు పని చేస్తున్న ఊరికి దగ్గరలోనే.

మా చిన్నమామయ్యకి విశాఖపట్నం గవర్నమెంట్ పోలిటెక్నిక్ కాలేజీలో సీటొచ్చి హాస్టల్­లో చేరాడు.

అప్పటికి విజయనగరంలో మా అమ్మమ్మగారి సంరక్షణలో మా స్వంతింట్లో నేను 5, పెద్ద తమ్ముడు 3, రెండో చెల్లి 1 వ తరగతి, మాయింటిదగ్గర పురపాలక ప్రాథమిక పాఠశాలలో; మా చిన్నక్క బ్రాంచి కాలేజీలో, అన్న పెద్ద కాలేజీలో (రెండూ హై స్కూళ్ళే, పేరుకు మాత్రం కాలేజీలు) చదువుతూ, మా పెద్దక్క ప్రయివేట్­గా మెట్రిక్­కి ప్రిపేర్ అవుతూ మిగిలిపోయాం.

--: oo(O)oo :--

మరికొన్నాళ్ళకి మా అమ్మమ్మగారు, “పెద్దాడు వెళ్ళిన ఊరు ఒట్టి అడవి ఊరు. ఒక హోటల్ లేదు. పాడూ లేదు. ఏ వస్తువుకావాలన్నా పొరుగునున్న పట్నంనుంచే తెచ్చుకోవాలి. వీడికి సరయిన తిండయినా లేకపోతే ఎలాగా! వాడి ఆరోగ్యం పాడయిపోతుంది. వాడి దగ్గరకి వెళిపోతాను.” అన్నారు.

ఏం చేస్తాం! మేమంతా ఆమెను చుట్టేసుకుని బావురుమన్నాం. “నువ్వు లేకపోతే మేమెలావుంటాం!” అని బెంబేలుపడిపోయాం!

అప్పుడావిడ “నేను కూడా మీలాగే ఇదంతా నడుపుతున్నది, నడిపిస్తున్నది, నేనేనని ఇన్నాళ్ళూ భ్రమలో ఉన్నానర్రా! నడిపేది, నడిపించేది పైవాడు! నాలాగే మీరూ నడవండి.” అని బుజ్జగించారు.

అలా భారంగా కొన్నిరోజులు గడిచాయి. మాకు వేసవి సెలవులు ఇచ్చారు.

అప్పుడు మొదటిసారి మా అమ్మమ్మవాళ్ళ ఇంటికి వెళ్లాం. అక్కడ మా అమ్మమ్మా, పెద్దమాఁవయ్యే ఉన్నది. మాఁవయ్య ఉదయం సైకిలుమీద ఆఫీసుకి వెళ్తే, తిరిగి ఏ రాత్రికో కాని వచ్చేవాడు కాడు.

అమ్మమ్మావాళ్ళింటికి ఉత్తరం వైపు నడకదారిలో రెండు కిలోమీటర్ల పైన నడచుకుని వెళ్తే, అక్కడొక హైస్కూలు ఉండేది. దక్షిణం వైపు ఒక కిలోమీటరు నడిస్తే కాని హైవేకి చేరం. అక్కడకి వెళ్తే కాని దుకాణాలు కనిపించవు. అవి కూడా ఓ రెండో మూడో ఉండేవి. అంతే! వాటిలో మనకి కావలసిన వస్తువులు సమయానికి దొరికాయా అదృష్టం! లేకపోతే పట్నం పోవాల్సిందే.

మా అమ్మమ్మగారింట్లో నాలుగురోజులుండి, మా వాళ్ళంతా మా నాన్నగారి దగ్గరకి వెళిపోయారు. నేను మాత్రం మా అమ్మమ్మగారి దగ్గరే ఉండిపోయాను.

ఒకరోజు, నడచుకుంటూవెళ్ళి, ఆ పల్లెటూర్లో హైస్కూలు ఎక్కడుందో కనుక్కుని, అక్కడకి వెళ్ళాను. అక్కడ హెడ్­మాష్టారు, మరొక వ్యక్తి మాత్రమే, అతని గదిలో కూర్చునివున్నారు.

నేను మాష్టారితో, నిర్భయంగా, “ఐ యాం తెలుగు మీడియం ఫిఫ్త్ పాస్” అని ఇంగ్లీషులో మొదలెట్టి వచ్చీరాని హిందీ, ఎక్కువగా తెలుగు, అక్కడక్కడ ఇంగ్లీషు ముక్కలు జోడించి నాక్కావలసినది అడిగేశాను.

అతను నా బాధని అర్థం చేసుకుని, ఇంగ్లీషులోనే, నాకర్థమయేలా, “వచ్చే నెల ఒకటో తారీఖున వచ్చి ఆరవ క్లాసులో జాయిన్ అవచ్చు. ఈలోగా మీ పెద్దవాళ్ళని, నీ ఐదో క్లాస్ పాస్ సర్టిఫికేట్, మీ స్కూల్ నుంచి టి.సి. తీసుకుని వచ్చి నన్ను కలవమను.” అని చెప్పారు.

“నీకు ఎడ్మిషన్ ఇస్తాను గాని, ఇక్కడంతా హిందీవే, హిందీ మీడియమే! మొదట్లో నువ్వు కొంచెం కష్టపడాలి. ఫరవాలేదులే!” అని భరోసా ఇచ్చారు.

సమయం చూసుకుని అమ్మమ్మకి చెప్పాలి అనుకున్నాను.

మా అమ్మమ్మగారు, ఇంచుమించు ప్రతిరోజూ, ఏదోవొకటి కొని పట్టుకురమ్మని నన్ను హైవేకి పంపించేవాళ్ళు. నేనూ సంతోషంగా ఎగురుకుంటూ, గెంతుకుంటూ వెళ్ళి కావలసినవి కొని తెచ్చేసేవాణ్ణి.

అలాగే ఒకరోజు అర్జంటుగా పచ్చిమిరపకాయలు కావాలంటే, పరుగెత్తుకుని వెళ్ళి తెచ్చాను. అప్పుడు మెల్లిగా ఆమెతో, స్కూలు ఎడ్మిషన్ గురించి చెప్పాలని తలచి, మరోలా మొదలెట్టాను.

“అమ్మమ్మా నేను ఇక్కడ నీతో ఈవూర్లో ఉండకపోతే, నీకూ మాఁవయ్యకీ చాలా కష్టం కదా!” అన్నాను.

వెంటనే ఆవిడ సంబరపడిపోతూ, “అవునురా నాన్నా! నువ్విక్కడే ఉండిపో! ఎంచక్కా నాదగ్గరేవుండి చదువుకోవచ్చు. మిగిలిన వాళ్ళని విజయనగరం వెళ్ళి తెలుగులోనే చదువుకోనీ.” అంటారని ఊహించాను.

అబ్బే! అలా అనలేదు.

“నేనూ విజయనగరంలో ఉన్ననాళ్ళూ ‘వీళ్ళకి నేనే దిక్కు! నేనే మొత్తం ఈయింటి భారాన్నంతా లాగుతున్నాను. నేను లేకపోతే, పాపం, వీళ్ళేమైపోతారో!’ అని సరిగ్గా ఇప్పుడు నువ్వు నాగురించీ ఎలా అనుకుంటున్నావో, నేనూ అలాగే మీగురించి అనుకునే దాన్ని. కానీ చూశావా! మీ పెద్దక్క అందుకుంది. నేను లేకపోయినా బండి సాగుతోంది. ఆగిపోలేదు.

అలా మనమెవరం, ‘ఎద్దుబండి కింద కుక్క’లా గర్వంగా ఫీల్ అయిపోనక్కరలేదు.” అన్నారు, ఆవిడ.

“ఎద్దుబండి కింద కుక్కా! అదేమిటది?” అనడిగాను.

అప్పుడు వివరంగా ఆ కథ చెప్పారు.

చివరకి, “అందుచేత నిజానికి నడిపేది ఆ బండివాడు, బరువు లాగేది ఆ ఎద్దు అయితే, దాని నీడలో సురక్షితంగా నడిచే కుక్కలాటి వాళ్ళం మనం!

కానీ, ‘మనమే అంతా! మనం లేకపోతే ఇంకేం లేదు!’ అని, మనం ఉన్నంతకాలం విర్రవీగుతాం!

నిజానికి నడిపించేది ఆపైవాడు, అది ఆరోజే చెప్పానుగా!

ఎలా జరగనున్నది అలా జరుగుతుంది. మనం మాత్రం మన పని మనం చేసుకుంటూపోవడమే!

అంతవరకే!

నాకర్థమయిందిలే నీ ట్రిక్కు.

ఈవంకన, ఇక్కడుండిపోదామని, తెలుగు నుంచి ఇప్పుడు హిందీ మాధ్యమంలో ఇక్కడ చదివీసుకోవచ్చని, నీ ఎత్తు! నాకు తెలీదనుకున్నావేంటి!” అని నన్నాశ్చర్యంలో ముంచేశారు!

“అమ్మ అమ్మమ్మా!” అనుకుని దిగ్భ్రాంతి చెందాను.

నేను తేరుకునేలోగా నా మార్గాన్ని తిరిగి మళ్ళిస్తూ, “పిచ్చి పిచ్చి వేషాలు వెయ్యక, విజయనగరం వెళ్ళి శుభ్రంగా మన మాతృభాషలో చదువుకో. బుద్ధిమంతుడవనిపించుకో!” అన్నారు.

ఆ తరవాత నా చదువు అక్కడ సాగి, తిరిగి నేను ఉద్యోగ ప్రయత్నాల కోసం మధ్య ప్రదేశ్ చేరాను.

సరిగ్గా అప్పుడే మా మాఁవయ్యకి వైజాగ్ ట్రాన్స్­ఫర్ అయింది.

అలా మరికొన్నేళ్ళ తరవాత నాకు మాఁవయ్య దగ్గర్నుంచి ఫోన్ వచ్చింది.

“ఒరేయ్! అమ్మమ్మకేం బాగులేదు! నిన్నే కలవరిస్తోంది. ఒకసారి రారా! నిన్ను చూసయినా కోలుకుంటుందేమో!” అని ఆర్తితో అడిగాడు.

నేను ఆఘమేఘాల మీద వైజాగ్ పరుగెత్తాను.

ఆసుపత్రికి చేరి, అమ్మమ్మని చూడ్డానికి ఆ స్పెషల్ రూంలోకి అడుగుపెట్టాను.

నోట్లోంచి, ముక్కులోంచి గొట్టాలు, మెడ దగ్గర నెక్­లైనర్స్, సెలైన్. ఇవేవీ కాదు, నేను చూస్తున్నది.

ఆమె కళ్ళు!

కళ్ళు నిర్మలంగా మూసుకునేవుంది. అవి చూశాను.

పసి పిల్లాడిలా ఆమె బుగ్గల్ని తపతపలాడించాను. చలనం లేదు.

అప్పుడన్నాడు మాఁవయ్య “స్పృహలో లేదు! వస్తే ఈరోజు స్పృహ రావచ్చు! లేకపోతే, కోమాలోకైనా వెళిపోవచ్చు. చెప్పలేం!” అన్నాడు.

అప్పుడు ఆమె బెడ్ పైనే, ఆమె పక్కనే కూచుండిపోయాను. చంటిపిల్లాడిలా ఆమె గుండెలపై వాలిపోయాను.

“ ‘నువ్వే చెప్తావుగా మనం ఎద్దుబండి కింద కుక్కల్లా కాకుండా, మనం చెయ్యవలసిన పనులేం మిగిలున్నాయో సరిగా తెలుసుకుని అవి పూర్తి చేసుకుంటూ ముందుకు సాగడమే మన పని అని. ‘లే! అమ్మమ్మా! మనం చెయ్యవలసిన పనులింకా చాలా మిగిలున్నాయి. ...” అని నా మాటలు ఇంకా గుండెలు దాటి, బయటకు రానేలేదు. కాని,

ఆమె మెదడుకి చేరినట్టు, అమ్మమ్మ ఒక్కసారి కళ్ళు తెరిచింది.

రెప్పలార్పకుండా నావైపు చూసింది.

“వచ్చేవా నాన్నా!” అన్నదేమో మరి! నా చెవులకది వినిపించలేదు.

ఆ తరవాత ఆనందంతో ఆమె ఎప్పుడూ అనే మాటా వినిపించలేదు

నా కళ్ళకి మాత్రం ఆమె కళ్ళనుండి కారుతున్న అశ్రుధారలే కనబడుతున్నాయి.

కొద్ది క్షణాల్లో అవి కూడా ఆగిపోయాయి.

ఆశ్చర్యం! ఇంకా ఆమె రెండు కళ్ళూ రెప్పలార్పకుండా నావైపే చూస్తున్నాయి.

ఈలోగా సిస్టర్ పిలిచింది కాబోలు గబగబా ఇద్దరు ముగ్గురు డాక్టర్లు వచ్చారు.

నేనిక కళ్ళార్పకుండా నన్నే చూస్తున్న మా అమ్మమ్మ కళ్ళ వైపు చూడలేకపోయాను.

గది బయటకి వచ్చేశాను.

అదీ అమ్మను కన్న అమ్మ, అమ్మమ్మ

మా అమ్మమ్మ!

ఎద్దుబండి కుక్కలా కాకుండా, ఎప్పటికప్పుడు తన కర్తవ్యాన్ని ఎరిగి తన బాధ్యతల్ని తెలుసుకుని, తను చెయ్యగలిగినది చేసి, సాగిపోయింది.

ఆరోజు ఆమె నాకా కథ చెప్పివుండకపోతే, గుణపాఠం నేర్పివుండకపోతే, ‘నేను నిమిత్తమాత్రుణ్ణి’ మాత్రమేనన్న జ్ఞానం, కలిగివుండేది కాదు!

ఈరోజుకీ అంతా నేనే, అంతా నా వలనే, అని ‘ఎద్దుబండి కింద కుక్క’లా భ్రమల్లోనే ఉండిపోయివుండేవాణ్ణేమో!

--: oo(O)oo :--

మరిన్ని కథలు

Panipilla
పనిపిల్ల (క్రైమ్ కథ)
- చెన్నూరి సుదర్శన్
Bhavaateetam
భావాతీతం
- DODDIPATLA KALYAN KISHORE
Prema falam
ప్రేమ ఫలం
- పి. రాజేంద్రప్రసాద్
Neethone nenunta
నీతోనే నేనుంటా
- కాశీవిశ్వనాధం పట్రాయుడు
Amlet damlet
ఆంమ్లేట్ - డాంమ్లేట్ .
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
REkkala kastam
రెక్కల కష్టం
- వరలక్ష్మి నున్న