"వీడు మీ ఫ్లాట్ వెతుక్కుంటుంటే తీసుకొచ్చేను కృష్ణారావు గారూ. ఉదయాన్నేఇంత పెద్ద ప్యాకెట్ పట్టుకొని వచ్చేడు, నా అంత పొడుగుంది. ఏమిటుందేమిటి అందులో" కుతూహలంగా అడిగేరు పక్క ఫ్లాట్ లో ఉండే ఆనందరావు గారు.
"ఏమో నాకు మాత్రం ఏమి తెలుసు, ఇంకా విప్పందే"
"మీరు మరీ విచిత్రంగా చెప్తారు. మీరు తెప్పించుకున్నది కాకపోతే, తెచ్చి మీకు ఇస్తాడేమిటి వాడు"
"అవుననుకోండి, అయినా ప్యాకెట్ విప్పితే తెలుస్తుంది నేను తెప్పించుకోవాలన్నదే వచ్చిందా, లేక ఇంకేదేనా తగలడిందా అని"
"అయితే, ఇంకా ఆలస్యమెందుకు, విప్పండి చూద్దాం."
"ఇప్పుడు కాదు లెండి, నేను స్నానానికి వెళ్ళాలి. ఆ తరువాత పూజ చేసుకొని, టిఫిన్ చేసి, తాపీగా విప్పి చూస్తాలెండి" ఎలాగేనా ఆనందరావుని వదిలించుకోవాలని చెప్పేరు కృష్ణారావు.
"వెధవది అంత పెద్ద ప్యాకెట్ ఏమిటో చూడాలన్న కుతూహలం నన్ను నిలవనివ్వడం లేదు. నేను ఒక గంట తరువాత వస్తాను. నేను వచ్చేవరకూ అది విప్పకండేం. ప్యాకెట్ విప్పుతూంటే బయటకు రాబోయే ఆ వస్తువేమిటా అని కుతూహలంగా చూడడంలో మంచి మజా ఉంటుంది."
"సరే లెండి, మీ మజాని నేను జాగ్రత్తగా కాపాడతాను. ప్రస్తుతానికి మీరు వెళ్తే, నా పనులన్నీ అయిన తరువాత మిమ్మల్ని కేకేస్తాను. వద్దురుగాని"
వెళ్లలేక వెళ్లలేక వెళ్ళేరు ఆనందరావు.
మరో గంట గడిచిందో లేదో కృష్ణారావు ఇంటి బెల్లు మోగింది.
తలుపుతెరిచిన కృష్ణారావుగారి శ్రీమతి "జరూరి పని ఉండి, ఆయన బయటకు వెళ్ళేరు. రాత్రికి ఆలస్యంగా వస్తానని చెప్పేరు, అన్నయ్యగారు." అని చెప్పగానే –
నీరసపడిపోయిన ఆనందరావు "ఆ ప్యాకెట్ విప్పేసేరేమిటి"
"లేదండి. ఆయనకీ తీరుబడి లేదు. రేపు విప్పుతానన్నారు"
"పోనీ నేను విప్పిపెట్టేదా"
"వద్దండీ, అడ్డమైనవాళ్లు విప్పడానికి నువ్వెలా ఒప్పుకున్నావని, నా మీద కేకలేస్తారు"
"నేను అడ్డమైన వాడినా అమ్మా" చిన్నబోయిన ఆనందరావు గారు మెల్లగా అడిగేరు.
-2-
"అబ్బే, ఏదో మాటవరసకు అన్నాను అన్నయ్యగారు"
"సరే. కృష్ణారావు గారు వస్తే, రేపు నన్ను పిలిచి నేను వచ్చిన తరువాత ఆ ప్యాకెట్ విప్పమని చెప్పమ్మా. అంతేకానీ తిరిగి తిరిగి వచ్చి ఈ రాత్రే ఆ ప్యాకెట్ విప్పవద్దను. రాత్రి నేను నిద్రని ఆపుకోలేక తొమ్మిది కాకుండానే పడుకోపడిపోతున్నాను." అని విచారంగా వెనక్కి వెళ్ళేరు ఆనందరావు.
మరునాటి ఉదయం ఏడో గంట కొడుతూండగా బెల్లు కొట్టిన ఆనందరావుకి తలుపు తీసిన కృష్ణారావు బయటకు వచ్చి అక్కడే ఉన్న మేజాలోంచి తీసిన జోళ్ళు వేసుకుంటూ "వాకింగ్ కి బయలుదేరేను వస్తారా"
"అబ్బే లేదండి. నాకు మోకాళ్ళు నొప్పి నేను రాలేను."
"మరేమిటి, ఇంత పొద్దున్నే దర్శనమిచ్చేరు"
"మీకు తెలియనట్టు అడుగుతారేమిటి. ఆ ప్యాకెట్ విప్పుతే చూద్దామని"
"అదా. మధ్యాహ్నం భోజనం అయిన తరువాత విప్పుదామని, అట్టే పెట్టేను."
"సరే. ఆ విప్పేదేదో మూడు గంటల తరువాత విప్పండి. మధ్యాహ్నం భోజనం చేసిన తరువాత ఓ గంట పడుకోకపోతే ఉండలేను. విప్పే ముందర నన్ను పిలవండేం" అని, విధిలేక వెళ్ళేరు ఆనందరావు.
సాయంత్రం నాలుగు దాటినా ఇంకా పిలుపు రాలేదేమిటా అని ఆలోచించిన ఆనందరావు ఉండబట్టలేక వెళ్లి కృష్ణారావుగారి ఇంటి బెల్లు మోగించేరు.
తలుపు తీసిన కృష్ణారావు నవ్వుతూ "ఏమిటి సర్" అని అడిగేరు.
వదనంలో విరజాజులు పూయిస్తూ "ఏమి తెలియనట్టు అడుగుతారేమిటి, ఆ ప్యాకెట్ విప్పితే చూద్దామని"
"అదా, ఇప్పుడు మేము సినిమాకి బయలు దేరుతున్నాము. అటునుంచటే హోటల్ కి వెళ్లి డిన్నర్ చేసి వచ్చిన తరువాత ఓపికుంటే ఈ రాత్రి విప్పుతాను, లేదంటే రేపే."
"అలాగా. సినిమా చూసి డిన్నర్ చేసి అలసటతో వచ్చి ఈ రాత్రి ఏమి విప్పుతారు లెండి. రేపు ఉదయం ఏడు అయిన తరువాత విప్పుదురుగాని. నన్ను పిలవడం మరచిపోకండేం"
"అలాగే, మీరు కూడా మాతోబాటూ సినిమాకి డిన్నర్ కి రాకూడదూ"
"లేదండీ. నాకు బయట తిళ్ళు పడవు. పైగా రాత్రి తొమ్మిది అవకుండానే నిద్ర వస్తుంది. మీరు వెళ్లి రండి." అని వెళ్లలేక వెళ్ళేరు ఆనందరావు.
తలుపు వేసి వచ్చిన కృష్ణారావుతో ఆయన శ్రీమతి "ఆయనని ఎందుకలా తిప్పుతారు. ఆ ప్యాకెట్ విప్పేస్తే పోయేది కదా"
-3-
"తిరగనీ మరో రెండు సార్లు. లేదంటే, మనం ఏమి తెప్పించుకుంటే ఆయనకెందుకు"
"ఏదో పెద్దాయన, కుతూహలం."
"అదే నేనది. ఆయనకి ఎందుకు ఆ వెధవ కుతూహలం"
"మీ ఇష్టం. సినిమాకి టైం అయిపోతుంది, తెమలండి."
"నేను పది నిమిషాల్లో తెమిలిపోతాను, నీదే ఆలస్యం"
మరునాడుకూడా ఉదయం ఆనందరావు రావడం కృష్ణరావు వాకింగ్ కి వెళ్లడం - ఆ ప్యాకెట్ విప్పే ప్రక్రియ మధ్యాహ్నంకి వాయిదా పడడం జరగడంతో -- విసిగిపోయిన ఆనందరావు మరి ఉండబట్టలేక "రెండు రోజులనగా వచ్చిన ప్యాకెట్ ఇంకా విప్పకుండా ఎలా ఉన్నారండీ"
"మరేమిటి చేయడం, నాకు సమయం కుదరడం లేదు.”
"ఇంతకీ ఏమిటి మీరు తెప్పించింది"
"చూడందే ఎలా తెలుస్తుంది "
"అది సరే. ఇంతకీ మీరు ఆర్డర్ ఇచ్చినది ఏమిటి"
"ఏదో ఒకటి ఆర్డర్ చేస్తూనే ఉంటాం లెండి. నేను వస్తాను వాకింగ్ వెళ్లి వచ్చి బయటకు వెళ్ళాలి, పని ఉంది."
"పోనీ ఈ రోజు మధ్యాహ్నం విప్పుతారా ఆ ప్యాకెట్"
"ఇప్పుడు చెప్పలేను, కానీ ఎప్పుడు విప్పినా మిమ్మల్ని పిలుస్తాలెండి."
"అలా అన్నారు, సంతోషం"
మరో రెండు రోజులైంది. పాపం ఆనందరావు వస్తూనే ఉన్నారు, కృష్ణారావు ఏదో కారణం చెప్పి ఆ ప్యాకెట్ విప్పడం వాయిదా వేస్తూనే ఉన్నారు.
మరో రోజు ఉదయం ఏడో గంటకు వచ్చిన ఆనందరావుని చూసిన కృష్ణారావు "నిన్న రాత్రి ఎనిమిదిన్నరకి మిమ్మల్ని పిలిచి ప్యాకెట్ విప్పుదామని మీ ఇంటి బెల్లు కొట్టేను. చెల్లెమ్మ వచ్చి, మీరు పది నిమిషాల కిందటే పడుకున్నారని చెప్పి, 'లేపమంటారా' అని అడిగితే, ఇంతోటి ప్యాకెట్ విప్పడం చూడడానికి బంగారం లాంటి మీ నిద్ర పాడుచేయడమెందుకని, నేనే వద్దన్నాను."
"అదేమిటో నిన్న రాత్రి బాగా ఆకలిగా ఉండి ఎనిమిది కాకుండా భోజనం చేసేసేను. తరువాత పావుగంటలో నిద్ర పట్టేసింది. ఇంతకీ ప్యాకెట్ విప్పేసేరేమిటి" అడిగేరు ఆనందరావు ఆత్రుతతో.
-4-
"నాకు మీకు ఒకేసారి సమయం కుదరడం లేదు. నిన్న రాత్రి పెద్దగా పనేమీ లేదు. అందుకే ప్యాకెట్ విప్పుదామని కూర్చుని చూద్దును, దాని సిగ తరగా, ఆ ప్యాకెట్ మన పక్క బ్లాక్ లోని నాలుగో అంతస్తులో ఉన్న కృష్ణరావుగారిది. ఆయనకి ఫోన్ చేస్తే వచ్చి, మోయలేక మోయలేక ఆ ప్యాకెట్ తీసుకొని వెళ్ళేరు.”
“అయ్యో అలాగా”
“అవును. మీరు ఆ ప్యాకెట్ తెచ్చిన వాడిని ఏ ఫ్లాట్ నెంబర్ కి వెళ్ళాలో కనుక్కోక నా పేరు చెప్పగానే మా ఫ్లాట్ దగ్గరకి తేవడం, వాడు చూసుకోకుండా నాకు ఇవ్వడం, నేనంతకంటే చూసుకోకుండా ఆ ప్యాకెట్ నా ఫ్లాట్ లో ఇన్ని రోజులు అనవసరంగా పెట్టుకున్నాను."
"ఇంతకీ ఆ ప్యాకెట్ లో ఏముంది"
"ఏమో, నేనడగా లేదు, ఆయన చెప్పాలేదు. మీకు ఇంకా కుతూహలంగా ఉంటే వెళ్లి ఆయనని అడగండి, నేను వాకింగ్ కి వెళ్లి వస్తాను."
"మీరైతే పక్క ఫ్లాట్ లో ఉన్నారని, మనం ఒకరికొకరు తెలుసని, మిమ్మల్ని అడగగలిగేను. ఆయనతో నాకు పెద్దగా పరిచయం లేదు. అలాంటిది వెళ్లి ఆయనని ఆ ప్యాకెట్ లో ఏముంది అని అడగను. వస్తాను లెండి" అని అంత పెద్ద ప్యాకెట్ లో ఏముందో తెలుసుకోవాలన్న తన కుతూహలం తీరలేదన్న విచారంతో వెనుదిరిగి వెళ్ళేరు ఆనందరావు.
***