అపరాధి - జీడిగుంట నరసింహ మూర్తి

Aparadhi

"ఈ సారి ట్రిప్పులో ఈ వూళ్ళో మనం ముందుగా ఎవరిని కలుసుకోవాలో ఒకసారి అనుకుంటే అనవసరంగా టైమ్ వేస్ట్ కాకుండా ఉంటుంది" అన్నాడు చంద్రం లాడ్గింగ్ లో దిగాక బెడ్ మీద వెనక్కి వాలి రిలాక్సెడ్ గా తమ్ముళ్లతో .

"మనం ఈ వూళ్ళో ఈ కాలనీలో మొదటగా అద్దెకున్న ఇల్లు రమణమ్మ గారిది. ఆ ఇంటి వెనకాల సిమెంట్ రేకుల షెడ్డులో ట్రాన్స్పోర్ట్ కంపినీలో పని చేసే రమణ మూర్తి గారు ఉండేవారు. అప్పుడు మేము నీకన్నా చిన్న వాళ్ళం అవ్వడం వల్ల అంతగా మాకు వాళ్ళ గురించి జ్ఞాపకాలు లేవు గానీ నీకు వాళ్ళ కుటుంబం గురించి బాగా తెలుసు. ముందు రమణమూర్తి ఆ ఇంట్లోనే ఉన్నాడా లేదా అనేది మనం ఎంక్వైర్ చెయ్యాలి. ఎందుకంటే ఇంతకు ముందు ఎన్నో సార్లు వచ్చినా కూడా ఆయన్ని కలవలేకపోయాం. ఈ రోజు ఈ వూళ్ళో మనకు ఇది ఫస్ట్ ప్రైయారిటీ . " అన్నాడు విశ్వం ఎంతో ఎగ్జైట్మెంట్ తో.

లాడ్జింగ్ బయటే ఉన్న కొత్తగా వెలిసిన వినాయకుడి గుడిలో దర్శనం అయ్యాక వాళ్ళకు ఆ వూళ్ళో మంచి హోటల్ ఎక్కడుందో తెలుస్కోవాలనే వేట ప్రారంభమయ్యింది. ముందు కడుపులో ఆత్మారాముడిని తృప్తి పరిచాకనే ఆ వూళ్ళో ఎక్కడికైనా తిరగగలిగిన ఓపిక వస్తుంది అని అందరూ భావించాక దారిలో కనపడిన కొంతమందిని అడిగి చూశారు ఈ వూళ్ళో కొత్తగా ఏవైనా మంచి హోటళ్లు వచ్చాయా అని . .

అవతల వ్యక్తులు ఏదో వినకూడని ప్రశ్న విన్నట్టుగా మొహం పెట్టి "ఒకనాడు ఈ వూళ్ళో చాలా మంచి టిఫిన్ హోటళ్లు ఉండేవి అండీ . ఇప్పుడు వాటిని వేళ్ళ మీద లెక్కపెట్టొచ్చు. పనికిమాలిన రాజకీయాలతో వూరుని అందరూ కలిసి తగలేశారు. ఉన్నంతలో ఆ చెరువు కట్ట దగ్గర చెలమయ్య టిఫిన్ సెంటర్ అనేది ఉంది. కొద్దిగా వాడు డబ్బులు ఎక్కువ తీసుకున్నా క్వాలిటీకి కట్టుబడతాడు. ఒకసారికి పర్వాలేదు వెళ్ళి రండి " అన్నాడు ఒకాయన .

" ఏమిటి ఈ పెద్ద మనిషి ఇలా చెపుతున్నాడు ? కనీసం మంచి టిఫిన్ తినడానికి కూడా వీల్లేనంత దరిద్రంగా మారిపోయిందా ఈ వూరు ? ఇంతకు ముందు మనం ఈ వూళ్ళో ఉన్నప్పుడు మనుషులు కన్నా హోటళ్లే ఎక్కువగా కనిపించేవి. సరే పదండీ. ఆ చెలమయ్య హోటల్లోనే తినేసి ముందు రమణ మూర్తి ఇంటికి వెళ్దాం " ఆన్నాడు చంద్రం. అతను ఏ వూరు వెళ్ళినా ఆ వూళ్ళో మంచి హోటల్, ఫిల్టర్ కాఫీ దొరుకుతుందా అనేది చూసుకుంటాడు. ఎంతో ఆశగా వచ్చిన అతనికి ఈ వూళ్ళో హోటళ్ళ అధ్వాన్నపు పరిస్తితి గురించి విన్నాక చాలా నిరాశగా అనిపించింది.

" అనకూడదు కానీ అన్నయ్య. చాలా వూళ్ళల్లో ఇదే పరిస్తితి. సరే టిఫిన్ అంటే ఎలా ఉన్నా తినేస్తాం. ఇక మధ్యాన్నం భోజనం సంగతి గురించి ఆలోచించాలి. గతంలో ఒకసారి ఈ వూరు వచ్చినప్పుడు సరైన భోజనం దొరక్క విజయవాడ వరకు వెళ్ళాం గుర్తుందా. . మన దురదృష్టవశాత్తూ అక్కడ కూడా మనం ఆశించినట్టుగా లేదు. . ఆ తర్వాత చాలా కాలం పోయాక మళ్ళీ ఈ వూరు వచ్చాము. ఏదైనా బాగుపడి ఉంటుందేమో అన్న ఆశ ఇక్కడ ఈ వూళ్ళో వాళ్ళు చెప్పే తీరు చూస్తూంటే అసలు మనం ఇక్కడ పని త్వరగా ముగించేసుకుని వేరే వూరు వెళ్లిపోవడం మంచిదేమో అని అనిపిస్తోంది " అన్నాడు విశ్వం.

మధ్యాన్నం ఒంటిగంటవుతోంది. అనుకున్నట్టుగా చంద్రం అండ్ బ్రదర్స్ రమణ మూర్తి ఇంటివైపు దారితీశారు. అదే సిమెంట్ రేకుల షెడ్డు . అప్పటి ఇల్లే. ఏమీ మార్పు లేదు. పైపెచ్చు ఇంకా చెప్పాలంటే ఒక పక్కకు వంగి పోయి వుంది. ఇదేమేనా చరిత్రకు ఆనవాళ్ళా అంటే అదీ కాదు. అసలు కొన్ని ఇళ్ళు ఇంత ఘోరంగా ఎందుకుంటాయో, అందులో ఉండేవాళ్లు ఎలా నివాసముంటున్నారో అన్న అనుమానం ఎవరికైనా రాక మానదు.

ఏమో అప్పటి రమణ మూర్తి ఇంకా ఈ ఇంట్లో ఉండాలని ఏముంది ? క్రితం సారి ఎవరినో అడిగితే ఇంకా ఇదే షెడ్డులో ఉంటున్నాడని చెప్పినా వీలు కాక వెళ్లలేదు. కాబట్టి వుండే అవకాశం ఉంది అనుకుంటూ ముందుగా విశ్వం చిన్నగా తలుపు కొట్టాడు.

లోపలనుండి తెల్లగా నెరిసిపోయిన జుట్టు, గుంట కళ్ళతో , సన్నగా బక్కగా ఉన్న ఒక వ్యక్తి తలుపు తీసి " ఎవరండీ మీరు ?" అన్నాడు ఆశ్చర్యంగా చూస్తూ. కళ్ల కింద నల్లని గీతలు జీవితంలో ఎంతో అలిసిపోయినట్టుగా చెపుతున్నాయి

" చెపుతామ్ సార్ . మీరు రమణ మూర్తి గారేనా? " అన్నాడు విశ్వం.

" అవును అండీ. మీరూ ....? ఆశ్చర్యంగా అడిగాడు.

" చాలు మీరు రమణమూర్తి గారని కన్ఫర్మ్ అయిపోయింది. . మేము మీ కోసమే వచ్చాం హైదరాబాద్ నుండి. క్రితం సారి వచ్చినప్పుడే మీ వద్దకు రావాల్సింది వేరే కారణాల వల్ల రాలేకపోయాం. ఇప్పటికి మిమ్మల్ని చూసే అదృష్టం దక్కింది. బహుశా మీరు మమ్మల్నెవరినీ గుర్తు పట్టడం కష్టమేమో . ముప్పై ముప్పై ఐదు ఏళ్ల క్రితం మేము కూడా మీ వెనకాల వాటాలోనే ఉండేవాళ్లం. మా అమ్మగారు కృష్ణవేణి గారు . ఆవిడను మీరూ , మీ భార్య గారూ ఇద్దరూ పిన్ని గారూ అని ఎంతో ఆప్యాయంగా పిల్చుకునే వారు. ఎటువంటి బంధుత్వం లేకపోయినా మీ కుటుంబం , మా కుటుంబం ఎంతో కలిసిపోయి ఉండేది. పండగలూ, పబ్బాలు వచ్చాయంటే మీరు కూడా మా ఇంట్లోనే మాతోనే కలిసిపోయి పండగ చేసుకునే వారు. మీ పిల్లలు ఎప్పుడూ మా ఇంట్లోనే తిరుగుతూ ఉండేవాళ్లు. దొడ్లో అరటి చెట్లు కొట్టేసినప్పుడు మీరు కలిపించుకుని దానిలో దూట తీసివ్వడం, అరటి పువ్వులు ఒలిచి పెట్టడం లాంటి సహాయాలు మా అమ్మగారికి చేసి పెట్టడం ఆవిడ మీకు ఆ కూరలు వండిపెట్టి పంపడం ఇవన్నీ మాకు బాగా గుర్తు. ఆ రోజులు మళ్ళీ రావు. మిమ్మల్ని చూడగానే చాలా సంతోషం కలిగింది " అన్నాడు విశ్వం ఆనందంగా.

" అవును మీరు చెప్తూంటే అన్నీ గుర్తుకొస్తున్నాయి. . అలా కూర్చోండి. కాస్త టీ తాగాక అప్పటి విషయాలు మాట్లాడుకుందాం. అన్నట్టు మీరు మీ ఇంట్లో ఎన్నో వాళ్ళు ? అందరూ ఒకటేలా ఉండటం వల్ల గుర్తు పట్టలేకపోతున్నాను. ఏమీ అనుకోవద్దు. ఏం బాబూ అమ్మగారు, నాన్నగారు అంతా బాగున్నారు కదా ? ఒక్క నిమిషం . మా ఆవిడను , మా అబ్బాయిని పిలుస్తాను. దొడ్లో ఏవో పాదులు వేస్తున్నట్టున్నారు " అంటూ దొడ్డివైపు వెళ్ళి వాళ్ళను పిల్చుకొచ్చాడు రమణ మూర్తి.

చేటంత మొహం చేసుకుని గదిలోకి వచ్చింది జయలక్ష్మి . వెంటనే గుర్తు పట్టలేకపోయినా నవ్వు మొహంతో " చాలా సంతోషంగా ఉంది బాబూ మిమ్మల్ని చూస్తూంటే. పిన్ని గారు బాగున్నారా ? ఈ మధ్యలో మీరందరూ ఎక్కడున్నారో మాకు అసలు తెలియదు. మీరు మా వెనకాల పోర్షన్ లో ఉన్నప్పుడు ఆ రోజులే వేరు. పిన్నిగారు మన మధ్య ఏ చుట్టరికమూ లేకపోయినా మమ్మల్ని ఎంతో ప్రేమగా కళ్ళల్లో పెట్టుకుని చూసుకునే వారు. ఉంటారా రెండు రోజులు ఈ వూళ్ళో ? మీరు అలా కూర్చుంటే భోజనం రెడీ చేసేస్తాను. భోజనాలయ్యాక అన్ని విశేషాలు మాట్లాడుకుందాం ." అంది జయలక్ష్మి. ఆమెలో అప్పటి ఆప్యాయత కొట్టొచ్చినట్టు కనిపిస్తోంది.

"ఆ .. ఆ .. ఈ వూళ్ళో ఒక రోజైనా ఉండి ఇక్కడనుండి భీమవరం , సామర్లకోట లో చుట్టాలను చూడటానికి వెళ్దామని అనుకుంటున్నాం. పర్వాలేదు అమ్మా. . మీతో కొద్దిసేపు కూర్చుని అప్పటి అన్ని విశేషాలు మాటలాడుకున్నాకే వెళ్తాం" అన్నాడు ఆ సోదరులలో ఒకరైన సుధాకర్ .

"అన్నట్టు మీకు ఇద్దరు పిల్లలు కదా. అప్పట్లో వాళ్ళిద్దరిని మా అన్నయ్యలు ఎత్తుకుని ఆడించే వారు . ఇతను మీ అబ్బాయా ? అమ్మాయి ఎక్కడుంది ?" అని అడిగాడు విశ్వం రమణమూర్తి కొడుకును పరికించి చూస్తూ.

"అవునవును . అప్పుడు వీళ్ళు చిన్న పిల్లలు. అమ్మాయి పక్కింటికి వెళ్ళినట్టుంది. వీడు మా అబ్బాయి మధు. బియ్యే చదివాడు. చాలా రోజులనుండి ఉద్యోగ ప్రయత్నాలలో ఉన్నాడు. ఎక్కడా అవకాశాలు దొరకడం లేదు " అన్నాడు రమణారావు నిస్పృహతో. .

రమణమూర్తి కొడుకు మధు ఒక పక్కగా నిలబడి వచ్చిన వాళ్ళను చూస్తున్నాడు. చూడటానికి చాలా బలహీనంగా కనిపిస్తున్నాడు. తండ్రిలాగానే గుంటకళ్లు.

విశ్వం ఆ ఇల్లును పరికించి చూశాడు. . ఇంటినిండా దేవుడి ఫోటోలు , పాత కేలండర్లతో నిండిపోయి ఉంది. అంత చిన్న గదిలోనే ఒక పక్క పాత కాలపు పట్టెమంచం. దానిమీద మాసిన బట్టలు అడ్డదిడ్డంగా పడేసి ఉన్నాయి. మరో పక్క నల్లగా అట్టకట్టేసిన రెండు ప్లాస్టిక్ కుర్చీలు చూస్తూంటే ఆ ఇంట్లో దరిద్ర దేవత తాండవమాడుతున్నట్టు అనిపించింది. జయలక్ష్మి మంచమ్మీద ఉన్న మాసిన బట్టలను తీసేసి మంచం కిందకు తోసేసి దానిమీద కూర్చోమని వచ్చిన వాళ్ళకు చెప్పింది.

"అంతా హైదరాబాద్ లోనేనా ఉండటం ? అక్కడేనా ఉద్యోగాలు ? " అడిగాడు రమణమూర్తి .

" అవును . ఇతను పెద్దన్నయ్య చంద్రం. . పెద్దవాడవడం వల్ల మీరు గుర్తు పట్టలేక పోయి ఉండొచ్చు.. ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలకు పెద్ద అధికారి. ఈ అన్నయ్య వల్లే మా ఇంట్లో ఇద్దరు ముగ్గురికి ఉద్యోగాలు దొరికాయి. ఇంకా ఎంతోమందికి సహాయపడ్డాడు. మంచి పేరుంది. . మీరు అప్పట్లో ఎంతో ఆప్యాయతగా "పిన్నిగారు " అంటూ పిల్చుకునే మా అమ్మగారు రెండేళ్ల క్రితం చనిపోయారు. నాన్నగారు అంతకు ముందే వెళ్ళిపోయారు " అన్నాడు విశ్వం.

"అయ్యో. అయితే ఇప్పుడు ఇద్దరూ లేరన్నమాట. మిమ్మల్ని అందరినీ చూస్తూంటే అప్పటి రోజులే గుర్తొస్తున్నాయి. మీ అమ్మగారు , నాన్నగారు మమ్మల్ని మీతో పాటు కన్న పిల్లలని కింద చూసుకునే వారు. మళ్ళీ అటువంటి వారు ఈ కాలంలో దొరకడం కష్టం. మీరు మాట్లాడుకుంటూ ఉండండి. నేను ఇప్పుడే భోజనం తయారు చేస్తాను " అంది జయలక్ష్మి . అప్పట్లో ఇంట్లో ఆడపిల్లలు లేకపోవడం వల్ల ఆమెను అక్కగారిగా భావించి అలాగే పిలవడం గుర్తొచ్చింది విశ్వానికి.

చంద్రం విశ్వాన్ని బయటకు పిలిచి "ఇప్పుడు వీళ్ళ పరిస్తితే బాగున్నట్టు అనిపించడం లేదు. ఇంకా భోజనం అదీ అంటూ ఇక్కడ ఉండటం బాగుండదు. కాసేపు మాట్లాడేసి ఈ వూళ్ళో ఏదైనా హోటల్ చూసుకుని భోజనం చేసేద్దాం " అన్నాడు.

అన్నగారి అభిప్రాయంతో ఏకీభవించాడు విశ్వం.

"ఇప్పుడు మీకు శ్రమ ఇవ్వడం మాకు ఇష్టం లేదు. ఈ వూళ్ళో మమ్మల్ని తెలిసిన వాళ్ళు ఎవరో పిలిచారు. మళ్ళీ ఈ సారి వీలు చూసుకుని మీకు ముందే చెప్పి వస్తాం. అప్పుడు తప్పకుండా మీ ఇంట్లోనే భోజనం చేస్తాం " అంటూ మర్యాదగా రమణ మూర్తి కుటుంబం ఇవ్వాలనుకున్న ఆతిద్యాన్ని సున్నితంగా తిరస్కరించారు ఆ అన్నదమ్ములు . .

"మా అన్నయ్య రెండు తెలుగు రాష్ట్రాలకు పెద్ద అధికారి. మాలో చాలామందికి ఉద్యోగాలు ఇప్పించాడు, ఎంతోమందికి సహాయ పడ్డాడు. మంచి పేరుంది. " అన్న మాట రమణ మూర్తిలో ఆశను కలిపిస్తోంది. ఎలాగైనా తన కొడుక్కి ఏదో ఒక ఉద్యోగం వచ్చేటట్టు చూసి పుణ్యం కట్టుకోమని చెప్పాలని ఆ దంపతులు వాళ్ళను ఆ పూటకు వాళ్ళింట్లోనే భోజనం పెట్టి తమ గోడు విన్నవించుకోవాలని ప్రయత్నం చేస్తున్నారు.

వాళ్ళింట్లో ఆ అన్నదమ్ములు భోజనం చెయ్యడానికి ఆసక్తి చూపక పోవడంతో రమణ మూర్తి దంపతులకు నిరాశ కలిగించినా, ఇక చల్ల కొచ్చి ముంత దాచడం అనవసరం అనుకుని తన కొడుకు మధుకు ఎక్కడో అక్కడ ఏదో ఒక ఉద్యోగం వచ్చేటట్టు చూసి మా కుటుంబాన్ని ఆదుకోమని మనసులోని మాటను బయట పెట్టేశారు.

ఆ ఇంట్లో పరిస్తితి చూశాక, పైగా వాళ్ళు తమ చిన్నప్పుడు ఎంతో చనువుగా కలిసిపోయి ఉండటం ఇవన్నీ గుర్తుకు తెచ్చుకున్న చంద్రం తప్పకుండా ఏదో ఒక ఉద్యోగాన్ని వచ్చేటట్టు చేస్తాను అని వాళ్ళకు హామీ ఇవ్వడంతో వాళ్ళ మొహాలలో ఆనందం వెల్లి విరిసింది.

ఒక గంట రమణమూర్తి ఇంట్లో గడిపి ఆ చుట్టుపక్కల రోడ్లు, షాపులు అన్నీ ఒకసారి కలియ తిరిగిన అనంతరం అందరూ కలిసి భోజనం చెయ్యడానికి హోటల్ వెతుక్కుంటూ వెళ్లారు. ఆ ట్రిప్పులో చంద్రం, అతని సోదరులు అనుకున్నట్టుగానే భీమవరం, ఆ చుట్టుపక్కల ప్రాంతాలు వెళ్ళి ఆ వూళ్ళో తెలిసిన చిన్నప్పటి మిత్రులను, బంధువులను కలుసుకుని తిరిగి హైదరాబాద్ కు ప్రయాణం అయ్యారు. ఈ వూళ్ళల్లో ఎక్కడైనా మంచి భోజనం, టిఫిన్లు దొరుకుతాయని ఆశించిన వాళ్ళకు చాలా నిరాశే ఎదురయ్యింది. దానితో ఇప్పుడిప్పుడే ఇటువైపుగా రావడం అనవసరం అని ఆ సోదరులంతా తీర్మానించుకున్నారు.

** ** ** **

రోజులు గడుస్తున్నాయి. ఈ మధ్యకాలంలో ఎవరికీ రమణ మూర్తి కుటుంబం గుర్తుకు రాలేదు. రమణమూర్తి కుమారుడికి ఉద్యోగం ఇప్పించి వాళ్ళ కుటుంబాన్ని ఆదుకుంటానని మాటిచ్చిన చంద్రం ఎందుకొచ్చిన తలనొప్పి అనుకున్నాడో ఏమిటో ఎంతమటుకు తన ఎదుగుదల , తన వాళ్ళ బాగు గురించి ఆలోచిస్తూ ఆ విషయమే పక్కకు పెట్టి మానవతా విలువలకు నీళ్ళు వదిలేశాడు. విశ్వానికి అప్పుడప్పుడు రమణమూర్తి కుటుంబానికి తన అన్నగారు ఇచ్చిన మాట గుర్తుకు వచ్చినా అశక్తుడు అవ్వడంతో లోలోపలే బాధపడే వాడు.

ఇక ఆ వూరు వెళ్ళి చేసేది ఏమీ లేదు అని అందరూ కలిసి ఒక నిర్ణయానికి వచ్చినా కూడా తాము పుట్టిన వూరితో అంత తేలిగ్గా బంధాలు వదులుకోలేక బంధువుల ఇంట్లో రాజమండ్రిలో పెళ్ళికి వెళ్తూ మార్గమధ్యంలో అందరూ కలిసి ఆ వూళ్ళో ఆగారు. రమణమూర్తి కుటుంబానికి ఇచ్చిన మాట నిలబెట్టుకోవడంలో చొరవ చూపలేక పోవడం ఒక రకంగా వాళ్ళల్లో అపరాధ భావం తలెత్తి మరోసారి వాళ్ళను చూడాలన్న కోరిక మనసులో మెదిలినా వాళ్ళ ఆశను నిరాశను చేసిన తమ మొహాలు చూపించడానికి విముఖత కలిగి రైల్వే స్టేషన్ లోనే చాలాసేపు ఉండిపోయారు.

"బాగున్నారా ?" అంటూ ఎవరో పలకరించేసరికి అటువైపుగా చూశారు చంద్రం అతని సోదరులు. ఆయన సుబ్బారావు గారు. ఆ వూళ్ళో తెలుగు టీచర్గా చేసి రిటైరయ్యి చాలా కాలం అయ్యింది. ఇంతకు ముందు వచ్చినప్పుడు చంద్రం బ్రదర్స్ ప్రత్యేకంగా ఆయన్ని కలుసుకోవడంతో రైల్వే స్టేషన్ లో గుర్తుపట్టి పలకరించాడు . ఆయన ఇల్లు రమణ మూర్తి ఉంటున్న వీధిలోనే ఆఖరి ఇల్లు.

మాటల మధ్యలో " మీ వీధిలో ఉంటున్న రమణ మూర్తి గారి కుటుంబం ఎలా ఉన్నారు ? కనిపిస్తూ ఉంటారా ?" అని అడిగాడు విశ్వం .

"ఏం కనపడటమో ఏమో . వాళ్ళ జీవితమంతా పూర్తి విషాద మయం. కొడుక్కి ఉద్యోగం రాక ఈ మధ్య ఆత్మహత్య చేసుకోవడం, దానితో రమణమూర్తి అతని మీద బెంగపెట్టుకుని తీవ్ర అనారోగ్యంతో చనిపోవడం ఇక మిగిలిన అతని కూతురు , భార్య ఈ వూరు వదిలి పెట్టి ఎక్కడికో వెళ్ళి పోవడం వరస పెట్టి జరిగిపోయాయి. పాపం ఆ కుటుంబాన్ని తెలిసిన వాళ్ళు కూడా ఎవరూ ఆదుకోలేకపోయారు " అని చెప్పేసరికి ఆ మాటలు చెళ్లుమని కొరడాతో కొట్టినట్టుగా అయ్యి ఉలుకూ పలుకూ లేకుండా కొయ్యబారిపోయాడు చంద్రం. ముఖంలో రక్తమంతా తోడేసినట్టయ్యింది.

"పొరపాటు జరిగిపోయిందిరా విశ్వం . మనం మాటల మనుష్యులమే కానీ చేతల మనుష్యులం కాము. మన అమ్మ, నాన్న వ్యక్తిత్వం మనకు రాలేదు. కేవలం స్వార్ధంతో బ్రతికేస్తున్నాము. మనలో ఏ మాత్రం మానవత్వం ఉన్నా రమణ మూర్తి గారి కుటుంబం ఇంత అధోగతి పాలయ్యేది కాదు. ఆ కుటుంబం ఉసురు భవిష్యత్తులో మనం ఎన్ని మంచి పనులు చేసినా కూడా తీరేది కాదు. నేను పెద్ద పొజిషన్ లో ఉన్నానని ఆ కుటుంబానికి సహాయపడతానని ఆశ కలిపించి వాళ్ళ భవిష్యత్తును కాలరాశాను. నాకు నిష్కృతి లేదు. " అంటూ అపరాధిలా అక్కడే ఉన్న బల్ల మీద భారమైన మనసుతో కూర్చుండిపోయాడు చంద్రం ***

మరిన్ని కథలు

Garudayya bharya
గరుడయ్య భార్య
- నారంశెట్టి ఉమామహేశ్వరరావు
Bakkati pellam-laavati mogudu
బక్కటి పెళ్ళాం - లావాటి మొగుడు
- మంత్రిప్రగడ ఆంజనేయులు
Barlo taagudu intlo vaagudu
బార్లో తాగుడు - ఇంట్లో వాగుడు
- మంత్రిప్రగడ ఆంజనేయులు
Panipilla
పనిపిల్ల (క్రైమ్ కథ)
- చెన్నూరి సుదర్శన్
Bhavaateetam
భావాతీతం
- DODDIPATLA KALYAN KISHORE
Prema falam
ప్రేమ ఫలం
- పి. రాజేంద్రప్రసాద్
Neethone nenunta
నీతోనే నేనుంటా
- కాశీవిశ్వనాధం పట్రాయుడు
Amlet damlet
ఆంమ్లేట్ - డాంమ్లేట్ .
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు