బంధం - - బోగా పురుషోత్తం

Bandham

అది ఒక పల్లెటూరు. ఆ ఊరిలో నిరుపేదలు నివసించేవారు. వారంతా కూలి పనులు చేసుకుని నివసించేవారు.

అదే ఊరిలో ఆదెయ్య ఒకడే భూస్వామి. అతనికి వంద ఎకరాల పొలం వుంది. ఎటు చూసినా రెండు కిలోమీటర్ల మేర పచ్చని పంట పొలాలు వున్నాయి. ఆదెయ్య చూడడానికి పెద్ద ఆస్తులున్న వాడిలా ఏమీ కనిపించడు. సాధారణ మనిషిలా బతికేవాడు. ఎందరికో తన పొలంలో పని కల్పించి ఆదుకునేవాడు. వారికి ఏ కష్టం వచ్చినా పరిష్కారం చూపేవాడు. అతని భార్య ఆదెమ్మది రాతిగుండె. దయాగుణం లేదు. కూలీలకు కళ్ల ఎదుటే కష్టం వచ్చినా చూస్తూ పలకరించేది కాదు. నిత్యం వచ్చే ఆదాయానికి తగినట్లు ఖర్చులు బాగా చేసేది. ఇది భర్త ఆదెయ్యకు నచ్చలేదు. తన పొలంలో ఏటా వచ్చే వరి ధాన్యంను ఆ ఊరి పేదలకు పంచిపెట్టేవాడు. అతనిది దయార్థహృదయం కావడంతో ఆ ఊరి ప్రజలకు ఆదెయ్య ఆరాధ్య దైవమయ్యాడు. ఇది చూసిన ఆదెమ్మ వున్న ఆస్తినంతా ఖర్చుచేస్తున్నావని నెత్తినోరు కొట్టుకునేది.

ఆదెయ్యకు ఇది నచ్చలేదు. నిత్యం ప్రజల్లో వుంటూ వారిని ఆదుకునేవాడు.

ఓ సారి ఆనందయ్య అనే స్వామి వాళ్ల ఇంటికి వచ్చాడు. ఆయన ఆదెయ్య ఇంటిని బాగా పరిశీలించాడు.తాను ఓ గొప్ప యోగినని, తనకు భిక్షం వేస్తే ఏమి తలిస్తే అది జరుగుతుందని, ఆకలిగా వుందని అర్థించాడు. అయినా ఆదెమ్మ మనసు కరగలేదు. ఆదెయ్య స్వామిని చూసి ‘‘ స్వామీ.. మీరు మహోన్నతులు.. అన్ని తెలిసిన వారు.. నాకు ఓ సమస్య వుంది. దయచేసి పరిష్కారమార్గం చూసించండి..’’ చేతులు జోడిరచాడు.

‘‘ నీ సమస్య నాకు తెలుసు నాయనా..పిల్లలు లేరనే నీ బాధ..’’ అన్నాడు స్వామి.

‘‘ ఆవును స్వామీ..’’ అన్నాడు ఆదెయ్య.

వెంటనే స్వామీజీ ‘‘ నాయనా.. పిల్లలు లేరని దిగులు చెందకు..నీవు గొప్ప దయగల వాడివని అడిగిన వారికి లేదనకుండా దానం చేస్తావని విన్నాను..దయచేసి నాకు మీ ఇంట్లో వున్న బంగారం అంతా దానం చెయ్యి..మన పక్క ఊర్లో గంగమ్మ తల్లికి బంగారు రథం చేయిస్తున్నాము..దయచేసి దానం చెయ్యి..నీకు అంతా మంచి జరుగుతుంది..సంకల్పం సిద్ధిస్తుంది..’’ అన్నాడు.

ఆదెయ్య ఆలోచించలేదు. వెంటనే లోనికెళ్లి బీరువాలో వున్న అరకేజీ బంగారాన్ని తెచ్చి దానం ఇచ్చాడు.

ఇదంతా చూస్తున్న ఆదెమ్మ గుండె గుబేల్‌ మంది. జీర్ణించుకోలేకపోయింది. అప్పటి నుంచి దాచి వుంచిన నగలన్నింటిని భర్త చేతికి దొరకనివ్వకుండా వంటిమీద వేసుకుని సినిమాలకు, షికార్లకు తిరిగేది.

ఓ రోజు వంటి నిండా బంగారు నగలు ధరించి ఓ పెళ్లికి బయలుదేరింది. పక్క ఊర్లోనే పెళ్లి వుండడంతో నడుచుకుంటూ వెళుతోంది.. దారి మధ్యలో ఏరు వుంది. ఏటిలో నడిచి వెళుతుండగా గుబురుగా వున్న చెట్లలోంచి నలుగురు ముసుగు దొంగలు వచ్చి కత్తులు చూపి ఆదెమ్మ మెడ, వంటిపై వున్న నగలను లాక్కెళ్లి పారిపోయారు. అల్లంత దూరంలో వెనుకనే వస్తున్న ఆదెయ్య ఇది చూసి అవాక్కయ్యాడు. ఆదెమ్మ భయంతో కళ్లు తిరిగి పడిపోయింది. తర్వాత ముసుగు దొంగల కోసం చెట్లలో వెతికారు. వారి ఆచూకీ కనిపించలేదు. ఆదెమ్మ ముఖంపై నీళ్లు చల్లడంతో పైకి లేచింది. ఊపిరి పీల్చుకుని ఇంటికి చేరుకున్నారు.

మరుసటి రోజు ఆదెమ్మ బంగారు నగలు దొంగతనం గురించి పోలీసులకు ఫిర్యాదు చేస్తామని భర్తకు చెప్పింది.ఆయన సరే అని బయలుదేరాడు. దార్లో నడుచుకుంటూ వెళుతున్నారు. వీధి చివర్లో వున్న చెన్నయ్య వారి వెనుకే వస్తున్నాడు.

నగలు ఎలాంటి ఉపయోగం లేకుండా దొంగల పాలయ్యాయని, రెండు నెలలకు ముందు వచ్చిన స్వామీజీకి దానం ఇచ్చినా గుడి రథానికి దానం చేశామన్న తృప్తి మిగిలేదని, ఇప్పుడు ఏమీ లేకుండా చేశావని ‘‘ అంతా నీ వల్లే జరిగింది.. ఇప్పటికైనా మార్పు రాదా? నీ తీరు మార్చుకో..’’ తిడుతున్నాడు ఆదెయ్య.

ఆదెమ్మ తిట్లను దిగమింగుకుంటూ మౌనంగా నడుస్తోంది. ఇదంతా వెనుకే వస్తున్న చెన్నయ్య వింటున్నాడు. కాస్త వేగంగా నడిచి వారి ముందు కొచ్చాడు ‘‘ అయ్యా..అయ్యా.. పోయిన నగలు మీవేనా? మా పక్కింటి పిల్లలు నలుగురు నగలు కొట్టుకొచ్చిన సంగతిని వాళ్ల అమ్మానాన్నలు గుసగుసలాడుకుంటుండటం తాను విన్నాను..అందరినీ ఆదుకునే మిమ్మల్ని మోసం చేయడం చాలా అన్యాయం ..’’ అన్నాడు చెన్నయ్య.

‘‘ అంటే నగలు దొంగిలించింది మన ఊరి వాళ్లేనా?’’ ప్రశ్నించాడు ఆదెయ్య.

‘‘ అవును..అవును..’’ అంటూనే ఊళ్లోకి పరిగెత్తాడు చెన్నయ్య.

ఆదెమ్మ, ఆదెయ్య ముందుకు నడిచి పోలీసు స్టేషన్‌లోకి అడుగుపెట్టారు.

సబ్‌ ఇన్‌స్పెక్టర్‌ లేకపోవడంతో బయట వరండాలో కూర్చున్నారు. కొద్ది సేపటికి బయటకు వెళ్లిన ఎస్‌ఐ బుల్లెట్‌ బండిలో పెద్దగా శబ్దం చేసుకుంటూ లోనికి ప్రవేశించాడు. ఆదెమ్మ, ఆదెయ్య అతని వెనుకే నడిచారు.

అప్పటికే చెన్నయ్య పక్కింటి పిల్లలు, వాళ్ల అమ్మానాన్నలను వెంటబెట్టుకుని పరిగెత్తుకుంటూ పోలీసు స్టేషన్‌ వద్దకు చేరుకున్నారు. అప్పటికే ఫిర్యాదు రాసివ్వడానికి పేపరు తీసుకున్నాడు ఆదెయ్య.

చెన్నయ్య లోనికెళ్లి ‘‘సార్‌..సార్‌.. అయ్యగారి నగలు దొంగిలించింది వీరి పిల్లలే.. ఇదుగోండి.. దయచేసి కేసు పెట్టకండి..’’ ఎస్‌ఐని వేడుకున్నాడు చెన్నయ్య.

‘‘ సామీ..సామీ.. ఇందా మీ నగలు..కూటికి లేనోళ్లం.. మీరిచ్చిన బియ్యం తిని బతికాము..ఇప్పుడు మీరు అని తెలియక మా పిల్లలు నగలు దొంగిలించారు..కాపాడిన కళ్లనే పొడిచేశారు. మీలా ఆదుకునే వాళ్లకి ద్రోహం చేస్తే కళ్లు పోతాయి..నాశనం అయిపోతారు.. తప్పయిపోయింది.. అన్నం పెట్టిన చేరుతలనే నరికేశారు..క్షమించండి సామీ..ఇందా మీ నగలు..’’ అంటూ ఆదెయ్య చేతిలో పెట్టారు పిల్లల తల్లిదండ్రులు.

‘‘ అయ్యో ఏదో పిల్లలు పొరబాటు చేశారు..దీనికే అలా క్షమించమని అడగడం దేనికి?’’ అన్నాడు ఆదెయ్య.

ఇదంతా ఎస్‌ఐ చూశాడు. ఆ పిల్లలను పిలిచి ‘‘ ఎందుకు దొంగతనం చేశారు..?’’ అని గద్దించాడు.

వాళ్లు వణికిపోయి ‘‘ స్కూళ్లో ఇరవై వేల రూపాయలు ఫీజు కట్టాలి..ఇంట్లో అడిగితే మా అమ్మానాన్నలు ఇవ్వలేదు.. ఇక వేరే దారిలేక ఇలా చేశాము..క్షమించండి సార్‌..’’ చేతులు జోడిరచారు పిల్లలు.

‘‘ అవసరం లేదు..ఇదిగో ఈ నగలు తీసుకెళ్లి పిల్లల ఫీజు చెల్లించి బాగా చదివించండి..’’ అన్నాడు ఆదెయ్య.

ఆదెయ్య మంచి మనసుకు ఎస్‌ఐ ఆశ్చయ్యపోయాడు. అతని దయార్థ హృదయానికి పిల్లల తల్లిదండ్రులు ‘‘ మీ సాయం ఈ జన్మలో మరిచిపోలేము సామీ’’ అని కృతజ్ఞతలు తెలిపారు.

ఇదంతా చూస్తున్న ఆదెమ్మ ‘‘ నన్ను క్షమించండి..నాకు పిల్లలు లేరన్న లోటు లేదు..అందరినీ ఆదుకుంటుంటే వారు వృద్ధిలోకి వచ్చి మంచిగా బతికితే మనకూ ఆనందమే కదా..అది తెలియక ఇన్నాళ్లు నిన్ను తిట్టాను..’’ అంది.

భార్యలో వచ్చిన మార్పుతో ప్రజల మధ్య బంధాలు, బాంధవ్యాలు పరిఢవిల్లి పిల్లలు లేని లోటు తీర్చినందుకు ఆదెయ్య ఎంతో ఆనందించాడు.

మరిన్ని కథలు

Garudayya bharya
గరుడయ్య భార్య
- నారంశెట్టి ఉమామహేశ్వరరావు
Bakkati pellam-laavati mogudu
బక్కటి పెళ్ళాం - లావాటి మొగుడు
- మంత్రిప్రగడ ఆంజనేయులు
Barlo taagudu intlo vaagudu
బార్లో తాగుడు - ఇంట్లో వాగుడు
- మంత్రిప్రగడ ఆంజనేయులు
Panipilla
పనిపిల్ల (క్రైమ్ కథ)
- చెన్నూరి సుదర్శన్
Bhavaateetam
భావాతీతం
- DODDIPATLA KALYAN KISHORE
Prema falam
ప్రేమ ఫలం
- పి. రాజేంద్రప్రసాద్
Neethone nenunta
నీతోనే నేనుంటా
- కాశీవిశ్వనాధం పట్రాయుడు
Amlet damlet
ఆంమ్లేట్ - డాంమ్లేట్ .
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు