ఆశ - డి వి డి ప్రసాద్

Aasha

"మాష్టరుగారూ!" అని ఎవరో పిలవడంతో అటు తిరిగి చూసాడు రామనాథం.

"నేను సార్! గుర్తు పట్టలేదా! మీవద్ద స్కూల్లో చదువుకున్న గిరిధర్‌ని సార్!" అన్నాడా యువకుడు. లాల్చీ, షరాయి వేసుకున్నాడు. ఖరీదైన కళ్ళద్దాలు ధరించి చాలా స్టయిల్‌గా ఉన్నాడు. తనని గుర్తు పట్టలేదని అతని వాలకం చూసి తెలుసుకున్న గిరిధర్, "నేను సార్! రామాపురం సర్పంచ్ కొడుకుని సార్! మీరు రామాపురంలో హెడ్ మాస్టరుగా ఉన్నప్పుడు మీవద్ద చదువుకున్నాను సార్!" అన్నాడు.

అప్పుడు గుర్తు వచ్చింది రామనాధానికి. తను ఆ ఊళ్ళో హెడ్‌మాష్టరుగా ఉన్నప్పుడు తన వద్ద చదువుకున్నాడు గిరిధర్. స్కూల్‌కి సరిగ్గా వచ్చేవాడు కాదు. తోటి విద్యార్థులతో తగువులు పెట్టుకొనేవాడు, వాళ్ళ పెన్నులు, పుస్తకాలు కొట్టేసేవాడు. మందలిస్తే ఎదురు తిరిగేవాడు. అతని తండ్రికి చెప్పినా ఫలితం శూన్యం. పైగా తన కొడుకు ప్రయోజకుడవుతున్నాడని, తనకు వారసుడిగా రాజకీయాల్లో బాగా రాణిస్తాడని సంతోషపడేవాడు గిరిధర్ తండ్రి భూషయ్య.

"ఆఁ... గుర్తొచ్చింది. ఇప్పుడు కూడా అల్లరి చిల్లరిగా తిరుగుతున్నావా, లేక ఏదైనా ఉద్యోగం గానీ, వ్యాపారంగానీ చేస్తున్నావా?" అడిగాడు రామనాధం.

ఆ మాటలకి నొచ్చుకున్నాడు గిరిధర్. "సార్! అలాంటి పనులెప్పుడో మానేసాను, నేనిప్పుడు రకరకాల వ్యాపారాలు చేస్తున్నాను. చిట్‌ఫండ్, ఫైనాన్స్ కంపెనీలు నడుపుతున్నాను. రాజకీయాల్లోకి కూడా ప్రవేశించ బోతున్నాను." అన్నాడు.

"అలాగా, సంతోషం! ఇప్పటికైనా దారిలో పడ్డావు." మనస్ఫూర్తిగా అన్నాడు రామనాధం. కొంతసేపు మాట్లాడుకున్నాక, "అన్నట్లు మాస్టారుగారూ, మీరు రిటైరయ్యారు కదా! మీకు రిటైర్మెంట్ డబ్బులు అందే ఉంటాయి. నేనో ఫైనాన్స్‌కంపెనీ నడుపుతున్నాను. మీరు మా స్కీములో ఓ పదిలక్షలు జమ చేస్తే, అయిదేళ్ళలో ఇరవై లక్షలు అవుతుంది. ఏ బ్యాంక్ కూడా అంత వడ్డీ ఇవ్వదు కదా! అంతేకాక, మీరు డబ్బులు జమ చేసినప్పుడే లక్షకి వెయ్య చొప్పున బోనస్ క్యాష్‌బాక్ కూడా దొరుకుతుంది." అంటూ జేబులోంచి ఓ నోట్ల కట్ట చూపించి విలాసంగా చెప్పాడు గిరిధర్.

ఆ నోట్లకట్టవైపు ఆశగా చూసాడు రామనాధం. గిరిధర్ చెప్పింది నిజమే! ఇప్పుడు ఏ బ్యాంకు కూడా ఆరు, ఏడు శాతం మించి వడ్డీ ఇవ్వడం లేదు. బ్యాంక్‌లో డబ్బులు ఉంచుకునేకన్నా ఫైనాన్స్ కంపెనీలో జమచేస్తే మంచి రాబడి ఉంటుందని భావించాడు రామనాథం.

"అలాగే బాబూ, నాకింకా డబ్బులు చేతికి రాలేదు. వచ్చే నెల్లో వస్తుంది. వచ్చాక తప్పకుండా నీ ఫైనాన్స్ స్కీంలో తప్పక చేరతాను." హామీ ఇచ్చాడు రామనాధం.

అనుకున్నట్లుగానే నెలరోజుల్లో రామనాధం చేతికి డబ్బులు అందాయి. ఇంటి మరమత్తుకోసం కొంత డబ్బులు ఉంచి, మిగతా డబ్బులు గిరిధర్ ఫైనాన్స్ కంపెనీలో కట్టడానికి అతనిచ్చిన విలాసం వెతుకుంటూ బయలుదేరాడతను.

తీరా అక్కడికి వెళ్ళి చూసేసరికి, ఆ ఫైనాన్స్ ఆఫీసు మూసేసి ఉంది. ఆఫీసు బయట పెద్ద తాళం కప్ప వేళ్ళాడుతోంది. అక్కడంతా గొడవగొడవగా ఉంది. కానీ బయట బోలెడంతమంది జనం లబోదిబోమంటున్నారు. కొంతమంది బోర్డు తిప్పేసిన కంపెనీపైన ఆగ్రహం చెందుతూ దాడికి పాల్పడటానికి ప్రయత్నిస్తున్నారు. వాళ్ళని అదుపులోకి తేవడానికి పోలీసులు శతవిధాలా ప్రయత్నిస్తున్నారు. అక్కడున్నవాళ్ళందరూ ఆ కంపెనీలో తమ కష్టార్జితాన్ని జమచేసి సర్వం పోగొట్టుకున్నారు. అక్కడ పరిస్థితి చూస్తూనే అంతా బోధపడింది రామనాధం మాష్టరుకి. తన అత్యాశ ఎలాంటి విపత్కర పరిస్థితికి దారి తీయబోయిందో అర్ధమైందతనికి. మొత్తం మీద గిరిధర్ నిర్వాకం ఇదా అని మనసులో అనుకున్నాడు. చిన్నప్పటి బుద్ధి ఇంకా పోలేదని, పైగా గురువైన తననికూడా దొచుకుందామనుకున్నాడని బాధపడ్డాడు రామనాథం. తన కష్టార్జితం గంగపాలు కాకపోవడంతో ఊపిరిపీల్చుకున్న రామనాధం అక్కణ్ణుంచి వెనుదిరిగాడు.

మరిన్ని కథలు

Kaalani kaagitam
కాలని కాగితం.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
Gnana tatwam
జ్ఞానతత్వం
- - బోగా పురుషోత్తం, తుంబూరు.
Garudayya bharya
గరుడయ్య భార్య
- నారంశెట్టి ఉమామహేశ్వరరావు
Bakkati pellam-laavati mogudu
బక్కటి పెళ్ళాం - లావాటి మొగుడు
- మంత్రిప్రగడ ఆంజనేయులు
Barlo taagudu intlo vaagudu
బార్లో తాగుడు - ఇంట్లో వాగుడు
- మంత్రిప్రగడ ఆంజనేయులు
Panipilla
పనిపిల్ల (క్రైమ్ కథ)
- చెన్నూరి సుదర్శన్
Bhavaateetam
భావాతీతం
- DODDIPATLA KALYAN KISHORE