కమ్యూనికేషన్ - ఆపాసా

Communicaion

అవి నేను ఎనిమిదవ తరగతిలోవున్న రోజులు.

ఒకరోజు మా మేషారు (మేమలాగే పిలిచేవాళ్ళం మా మాష్టారుని/సారుని), “రేపు కొత్త పాఠం ‘కమ్యూనికేషన్’ మీద మొదలెడతాను. పాఠం మొదలెట్టే ముందు, ‘కమ్యూనికేషన్’ మీదే సరదాగా, మీ అందరికీ రేపు, ఓ టెస్టు పెడతాను. చూద్దాం, ఎవరెంత తెలివైనవాళ్ళో కమ్యూనికేషన్లో!

ఏమీ చదువుకుని రానక్కరలేదు కానీ, కొంచెం బుఱ్ఱ ఉపయోగించి రాయండి. చాలు! ఫస్ట్, సెకండ్, వచ్చినవాళ్ళకి హెడ్­మాష్టారు­గారి చేత, మన క్లాసులోనే ‘బహుమతి’ ఇప్పిస్తాను.” అని చెప్పారు.

‘పోటీ’ అనేసరికి, అందరం హుషారుగా చప్పట్లు కొట్టాం.

ఇంటికెళ్ళాక, అన్నల్నీ, అక్కల్నీ, అమ్మనీ, నాన్ననీ, పిన్నిలనీ, బాబాయిలనీ, మాఁవయ్యలనీ, అత్తయ్యల్నీ, తాతయ్యలనీ, మామ్మల్నీ, ఇలా ఎవరింట్లో ఏ పెద్దవాళ్ళుంటే, వాళ్ళనుండి, మేమంతా ‘కమ్యూనికేషన్’ గురించి బోల్డంత సమాచారం సేకరించాం.

పోటీ కదా, మేము అలా సేకరించామన్న సంగతి ఒకరికొకరం చెప్పుకోకుండా, దొంగల్లా ఆ జ్ఞానాన్నంతా మాలోనే దాచేసుకున్నాం.

నాకైతే అందరికంటే ఎక్కువ ఎడ్వాంటేజ్! అదేంటంటే, మాయింట్లో నాకు మామ్మే కాక, అమ్మమ్మా ఉంది. అందరిళ్ళల్లో అలా ఉండరు!

ఆరోజు మా అమ్మమ్మ, నారదుడి కమ్యూనికేషన్ విధానం గురించి చెప్పింది.

మా నాన్నమ్మ నాకు, “పురాణాల్ని బట్టి, ‘కమ్యూనికేషన్­’లో అందరికంటే ‘హనుమంతుడు’ చెప్పుకోదగ్గవాడు. అతడే దిట్ట! అతడి నుంచి మనం ఈనాటికీ నేర్చుకోదగ్గది ఎంతో ఉంది! అని పది సెకన్లలో తేల్చేసే విషయాన్ని, పది నిముషాల్లో విడమరచి నాకర్థమయేలా ఎంచక్కా చెప్పింది.” అది మీకు చెప్పనుగా! రేపే పోటీ!

–-: oo(O)oo :--

మర్నాడు క్లాసుకి వెళ్తూనే, మేషారు, టెస్టు గురించి వివరించారు.

“ముందు అందరూ, మీ మీ చిత్తు పుస్తకాలు తీయండి.

కొత్త పేజీ తీసి ‘కమ్యూనికేషన్ టెస్ట్’ అని హెడ్డింగ్ పెట్టండి.

రెండో లైనులో, ఎడమవైపు మీ పేరు వ్రాయండి. కుడివైపు చివర, ఈరోజు డేట్ వెయ్యండి.

దాని దిగువ లైనులో, ఎడమవైపు మీ పేరు క్రింద క్లాసు, సెక్షన్ వ్రాయండి. కుడివైపు చివర, డేట్ క్రింద ఏవారమో వ్రాయండి.”

అని చెప్పారు.

అతను చెప్పడం ఇంకా పూర్తయిందో లేదో కాని, మేమంతా గబగబా రాసేశాం.

టెస్టు కోసం సిద్ధం అయిపోయాం!

“సమాధానాలు మీ చిత్తుపుస్తకంలోనే రాయాలి.

అందరికీ ప్రశ్న పత్రాలు ఇస్తాను. బోర్లించి ఉంచండి. నేను ‘స్టార్ట్’ అన్న తరవాతే మీరా ప్రశ్నాపత్రం తిప్పి చూడాలి. సమాధానాలు రాయటానికి 10 నిముషాల టైమిస్తాను.

ఈలోపలే రాయగలిగినన్ని సమాధానాలు రాసేసినవాళ్ళు, మీ రఫ్ బుక్స్ నాదగ్గర జమ చేసేసి బయటకి వెళ్ళి నించోండి. రాయలేనివాళ్ళు కూడా దిక్కులు చూస్తూ ఇక్కడ కూర్చోకుండా చిత్తుపుస్తకాలు నాకిచ్చేసి వెళిపొండి.

మీకిచ్చిన 10 నిముషాల టైము అయిపోగానే, నేను ‘స్టాప్’ అంటాను. నేను ‘స్టాప్’ అనగానే ఇంకా రాస్తున్న తెలివైన వాళ్ళు, వెంటనే ఆపేయాలి.” అని చెప్పారు.

మేమంతా, “ఓ” అని ఏకకంఠంతో సాగదీశాం.

మేషారు, క్లాసులోంచి ముగ్గురు విద్యార్థుల్ని పిలిచారు. వారి ముగ్గురికీ ప్రశ్నపత్రాల బొత్తి ఇచ్చి, మూడు వరుసల్లో కూర్చున్న స్టూడెంట్స్ అందరికీ పంచమన్నారు.

వారు పంచేసి వచ్చి వారి సీట్లలో కూర్చున్నారు.

అప్పుడు మేషారు, “అందరికీ ప్రశ్నపత్రాలు అందాయా?” అనడిగారు.

“ఆఁ” అని ఏకకంఠంతో క్లాసంతా ప్రతిధ్వనించేలా అన్నాం.

“అయితే శ్రద్ధగా వినండి! నేను ‘స్టార్ట్’ అనగానే, గాభరాపడిపోకుండా, అన్నిటికంటే ముందు ప్రశ్నపత్రం మొత్తం ఒకసారి చదవండి. ఆ తరవాత అన్ని ప్రశ్నల్లోకి, ఏ ప్రశ్నకి సమాధానం మీకు బాగా వచ్చో ఆ సమాధానంతో వ్రాయడం మొదలెట్టండి.” అని ఎప్పుడు చెప్పినట్టే చెప్పారు.

ఒక క్షణం తరవాత, “స్టార్ట్” అన్నారు.

అంతే! ఒక్కసారి ఒలింపిక్ పరుగు పోటీల్లో తూటా చప్పుడుకి పరుగెత్తిన వీరుల్లా రాయడం మొదలెట్టేశారు.

నేను మాత్రం గాభరాపడలేదు. బుద్ధిగా మామ్మ చెప్పినట్టు రెండు క్షణాలు కళ్ళు మూసుకుని దేముణ్ణి తలుచుకున్నాను. మెల్లగా కళ్ళు తెరచి, ప్రశాంతంగా ప్రశ్నపత్రాన్ని తిప్పి చదవడం మొదలెట్టాను.

‘ఆరోగ్యమే మహా భాగ్యము!’ గురించి ఐదు వాక్యములు వ్రాయుము. ‘ఆవు సాధు జంతువు!’ ఐదు వాక్యములు వ్రాయుము. ‘కప్ప ఉభయచరము’ - ఐదు వాక్యములు వ్రాయుము. ‘వార్తాపత్రికలు’ – వ్యాసం. పది పంక్తులకు తగ్గకుండా వ్రాయుము.

వీటికే 10 నిముషాల టైము చాలదు! ఇంకా బోల్డన్ని ప్రశ్నలున్నాయి! అని నాకు గాభరా మొదలయింది.

ఇటు అటు చూశాను. నా తోటి విద్యార్థులంతా అప్పటికే రఫ్­ బుక్­లో బరబరా బక్కిరేస్తున్నారు. గబగబ పేజీలు తిప్పేస్తున్నారు. నా గుండెల్లో దడ మొదలయింది. అయినా, బితుకుబితుకుమంటూ ముందుకు చదవసాగాను.

ఇక్కడివరకు చదివిన వాళ్ళు, మొదటి నాలుగు ప్రశ్నలకు సమాధానం వ్రాయనక్కరలేదు. మిగిలినవి శ్రద్ధగా చదివి, అర్థం చేసుకుని, సులువుగా వచ్చిన సమాధానంతో మొదలెట్టి పూర్తి చెయ్యండి. ‘పిల్లలపై సినిమా ప్రభావం’ – ఉంటుందా? ఉండదా? ఒక్క మాటలో సమాధానం ఇవ్వండి. “ఉంటుంది.” అని ఆ ప్రశ్నకి జవాబుతో రాయడం మొదలెట్టెద్దామా అనుకున్నాను. మళ్ళీ తమాయించుకున్నాను. ‘ఈ పరీక్ష మీకు బాగుందా! – అవును/కాదు లలో సమాధానం ఇవ్వండి. ‘ఇలాటి పరీక్ష ఇంతకుముందు మీరెప్పుడైనా వ్రాశారా?’ అవును/కాదు లలో సమాధానం ఇవ్వండి. “లేదు.” అని జవాబు రాయాలి. “ఇదే అన్నిటికంటే సులువయిన సమాధానం! దీనితోనే మొదలెట్టాలి.” అని వెంటనే నిర్ణయం తీసుకున్నాను.

ఆతరవాత, తొమ్మిదవ ప్రశ్నని చూశాను.

‘అప్పుడు మీరు గెలిచారా?’ - అవును/కాదు లలో సమాధానం ఇవ్వండి. ఈ ప్రశ్న వరకు మీరు ఏ సమాధానము వ్రాయకుండా, బుద్ధిగా తొమ్మిది ప్రశ్నలూ చదివారా? – మీ సమాధానం ‘అవును/కాదు’ లలో ఏదైనాసరే, మాట్లాడకుండా, మీ రఫ్ బుక్ లో ‘నేనే ఫస్ట్!’ అని వ్రాయండి. మీ పుస్తకం మడిచి, మెల్లగా మాష్టారుగారికిచ్చేసి, చల్లగా క్లాసులోంచి బయటకు జారుకోండి.

నవ్వకూడదు! తల దించుకుని వెళిపోవాలి.”

నేను ఉత్సాహంతో ఉప్పొంగిపోయాను. సంతోషం పట్టలేకపోయాను.

పెద్ద పెద్ద అక్షరాలతో, క్రాస్­గా ఆ పేజీలో ‘నేనే ఫస్ట్!’ అని రాసేశాను.

తల వంచుకుని, నా రఫ్ బుక్ మేషారు­కిచ్చేసి వరండావైపు అడుగేశాను.

నాకంటే రెండడుగుల ముందు, తలవంచుకుని, అప్పటికే ఒక అమ్మాయి క్లాసు రూము దాటుతోంది.

నేను వరండాలోకి చేరగానే, నన్ను చూసి కిసుక్కున నవ్వింది.

నేను పడి పడి నవ్వాను.

–-: oo(O)oo :--

ఆ తరవాత కొంతసేపటికి, మేషారు, వరండాలోవున్న మాయిద్దరినీ, క్లాసులోకి పిలిచారు. మేము వెళ్ళి మా జాగాల్లో కూర్చున్నాం.

మిగిలిన వాళ్ళందరూ నిలబడివున్నారు.

అప్పుడు, మేషారు,

“వార్తాపత్రికలు చదువుతూవుండిపోయినవాళ్ళు కూర్చోండి” అనేసరికి, ధడేల్ మని ఐదుగురు కూర్చుండిపోయారు.

“ఊఁ కప్పగంతులు వేస్తున్నవాళ్ళు?” అనేసరికి, మరో నలుగు కూర్చుండిపోయారు.

“ఇంకా గడ్డిమేస్తూనే ఉండిపోయినవాళ్ళో?”, అనేసరికి పొలోమని అందరూ కూలబడిపోయారు; ఒక్కడుతప్ప.

“నువ్వేంరా! ఆరోగ్యం బాగాలేదా! ఇంకా అక్కడేవున్నావ్?” అనడిగారు.

“అవునండీ! నిన్నట్నుంచీ జ్వరమండీ.” అని నీరసంగా సమాధానమిచ్చాడు, వాడు.

“అలాటప్పుడు స్కూలుకెందుకు వచ్చావు?”

“పోటీకదండీ! అందుకని వచ్చానండి.”

“సర్లే! కూర్చో.” అన్నారు.

నాతో, “­హెడ్­మాష్టార్­గారి­కి పోటీ అయిపోందని, చెప్పి, రా.” అన్నారు.

నేను ప్రక్కనున్న రూంకి పరుగున వెళ్ళి, హెడ్­­మేషారి­కి చెప్పొచ్చాను.

కొద్దిసేపట్లో, అతనొచ్చి, మా మేషారు దగ్గర కాగితం చూసి నవ్వుకున్నారు.

అప్పుడు మమ్మల్నందర్నీ ఉద్దేశించి, “పిల్లల్లారా చూశారా, ఏమయిందో! మీ మాష్టారు చెప్పినప్పుడు శ్రద్ధగా విన్నారు. కానీ, అతను చెప్పింది చెప్పినట్టు చెయ్యకుండా, ఆచరించకుండా, అతి తెలివికి పోయారు. లేకపోతే, మీరందరూ విజేతలయివుండే వారు.

అంటే, పెద్దవాళ్ళు మనకి హితవు చెప్తున్నప్పుడు మనం శ్రద్ధగా వినడంతో, గంగిరెద్దులా తలూపడంతో సరిపోదు.

ఆ విన్నది తు.చ. తప్పక పాటించాలి. అప్పుడే మనం మన లక్ష్యాన్ని సాధించగలం. గమ్యాన్ని చేరుకోగలం.

అలా విన్నది అమలుపరచి ఈరోజు పోటీలో గెలుపొందిన మీ ఫ్రెండ్స్­నిద్దర్నీ మీ చప్పట్లతో ప్రోత్సహించండి.” అన్నారు.

వాళ్ళలా చప్పట్లు కొడుతుంటే, మాయిద్దర్నీ స్టేజీ మీదకి పిలిచారు.

ఆ అమ్మాయికి ప్రథమ బహుమతి, నాకు ద్వితీయ బహుమతి ప్రదానం చేశారు.

–-: oo(O)oo :--

మరిన్ని కథలు

Vikatakavi vinta padyaalu
వికటకవి - వింతపద్యాలు.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
Kaalani kaagitam
కాలని కాగితం.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
Gnana tatwam
జ్ఞానతత్వం
- - బోగా పురుషోత్తం, తుంబూరు.
Garudayya bharya
గరుడయ్య భార్య
- నారంశెట్టి ఉమామహేశ్వరరావు
Bakkati pellam-laavati mogudu
బక్కటి పెళ్ళాం - లావాటి మొగుడు
- మంత్రిప్రగడ ఆంజనేయులు
Barlo taagudu intlo vaagudu
బార్లో తాగుడు - ఇంట్లో వాగుడు
- మంత్రిప్రగడ ఆంజనేయులు