ఈరోజయినా గ్రేస్ టైము 8:10 లోగా కాకుండా ఠంచనుగా ఆఫీసు టైము 8 కల్లానో, లేదా అంతకుముందేనో చేరిపోవాలని తలచి, పంతం మీద గబగబా తయారయిపోయాను. 7:45 కల్లా వాకిట్లోకి వచ్చేశాను. గబగబా స్కూటర్ తీశాను. ‘బజాజ్’ కాదు కదా, కుక్క కాలెత్తినట్టు, కిక్ కొట్టేముందు వంచక్కర్లేదు. నాది ‘లాంబ్రెటా మాక్ 1.25 సి.సి.’ ఇలా కిక్ కొడితే, అలా స్టార్ట్ అయిపోతుంది! అని గర్వపడ్డాను. (అప్పట్లో ఆ రెండు స్కూటర్లే ఉండేవి. బైక్‌లు, మోపెడ్స్ ఉండేవే కావు. అక్కడక్కడ మోటార్ సైకిల్స్ కనిపించేవి. అంతే!)
బలమంతా ఉపయోగించి, గట్టిగా ఒక కిక్ కొట్టాను. ఏక్సిలేటర్ రైజ్ చేసేవుంచాను.
స్టార్ట్ అవలా! అవమానం అనిపించింది. ఒళ్ళు మండిపోయి, రెండు కిక్‌లు మరింత గట్టిగా కొట్టాను. ‘ఉఁహుఁ!’ మొరాయించింది.
గుప్పుమని వస్తున్న పెట్రోలు వాసన నా ముక్కుపుటాలకి అప్పుడు తెలిసింది. అనుమానం వేసింది. 'నిన్ననే కదా ఇంటికొచ్చేముందే పెట్రోల్ కొట్టించిందీ!' అని, ఆశ్చర్యపోతూ, పెట్రోల్ ట్యాంకు మూత తీసి చూశాను.
ఒక్క చుక్క లేదు!
‘ఏంటయిందబ్బా!’ అనుకున్నాను. ‘నా స్కూటరు, వాకిట్లోనే ఉందికదా, ఎవరో దొంగతనం చేసుంటారు!’ అనుకోలేదు. అలాటివాళ్ళెవరు, మా ఇరుగుపొరుగున లేరు. ఏదో ఎమర్జన్సీ వచ్చి, అర్ధరాత్రి నన్ను డిస్టర్బ్ చెయ్యడమెందుకు, పొద్దున్న చెప్పొచ్చులే అని తలచి, ఎవరో పాపం, సమయానికి నా స్కూటర్ కనిపించి, చొరవతో నా పెట్రోలు తీసుకునివుంటారు. అని సర్దుకున్నాను.
గత్యంతరం లేక, అరకిలో మీటరు దూరంలోవున్న పెట్రోల్ బంక్ కి, క్వింటాలుంపావు బరువున్న లాంబ్రెటా మాక్‌ని, తొందర తొందరగా మోసుకుంటూ, సారీ, తోసుకుంటూ వెళ్ళాను.
ట్యాంక్ ఫుల్ చేయించాను.
ఒక్క కిక్ కొట్టాను. బర్ర్ మని స్టార్ట్ అయింది లాంబ్రెటా.
ఇంకా 5 నిముషాలుంది 8 అవడానికి. ఓ.కే.! మూడున్నర కిలోమీటర్ల దూరం హైవే మీద. ఎంతసేపు మూడు నిముషాల్లో చేరిపోతాను. అని రఁయ్యిమని సాగిపోయాను. గుప్పు గుప్పుమని పెట్రోలు వాసన. హడావుడిలో పెట్రోల్ ట్యాంక్ మూత సరిగా పెట్టలేదేమో, పెట్రోలు బయటకి చిమ్ముతోంది కాబోలని పట్టించుకోలేదు. ఒకటే ధ్యాస! ఒకటే ధ్యానం! ఈరోజయినా, 8 లోపు కాకపోయినా, 8కైనా ఆఫీసు చేరాలి.
ఆఫీసు మరో అరకిలోమీటరు ఉందనగా, బండి బాగా స్లో అయిపోతూ, పూర్తిగా ఆగిపోయింది. సరిగ్గా అక్కడే నా స్కూటర్, రెగ్యులర్ మెకానిక్ వర్క్‌షాపు! స్టాండు వేశాను. వాణ్ణో కేకవేసి ఆఫీసు వైపు వెళ్ళే వెహికల్స్ కోసం చూశాను. అక్కడ హైవే మీద ఇప్పుడు నేనొచ్చిన దిశలో, ఏదో వాటర్ ట్యాంకరో, ఫయిరింజనో వెళ్ళినట్టు, చార! ‘నా స్కూటర్ నుండి కారిన పెట్రోలు ధార’ అని గ్రహించడానికి క్షణం పట్టలేదు. అయినా, పట్టించుకోలేదు.
ఆఫీసువైపు వెళ్తున్న కొలీగ్ని ఆగమని సైగ చేశాను. అతడు, అతడి బజాజ్ ఆపగానే, నేనెక్కేశాను.
ఈలోపలే మెకానిక్, నా స్కూటర్ స్టాండు తీస్తున్నాడు. “పెట్రోల్ లీక్ అవుతోంది. కాస్త చూడు. నేను సాయంత్రం వస్తాను.” అని చెప్పాను. కాదు కాదు! అరిచాను.
సరిగ్గా నేను ఆఫీసులోకి అడుగుపెట్టేసరికి 8:05.
వరండాలోనే మా బాస్ హాజరు!
“ఏమయ్యా! ఆఫీసు టైము 8:10 కాదయ్యా! 8:00! నీకెన్నిసార్లు చెప్పినా అర్థమయినట్టు లేదు. గ్రేస్ టైము అనేది, అప్పుడప్పుడు ఉపయోగించుకోడానికి. ప్రతిరోజూ నువ్వు గ్రేస్ టైంలోనే వస్తావేంటి?” అన్నాడు, చిరాగ్గా! నిస్సహాయంగా! అంతకంటే, అతడేం చెయ్యలేడు! అనలేడు! అది రూల్స్ కి విరుద్ధం.
నాకు అతడికంటే ఎక్కువ చిరాకు వేసింది, స్కూటర్ మీద కోపం!
అది అతనిమీద చూపించాను.
“నాకంటే ముందరే, నా కొలీగ్స్, మీరూ వచ్చి మాత్రం, ఏం ఉద్ధరిస్తున్నారు? ప్యూన్స్, ఇంకా లోపల టేబుళ్ళూ కుర్చీలు తుడుస్తున్నారని, మీరంతా ఇక్కడే ఈ క్యారిడార్లోనే పడి ఏడుస్తున్నారుగా! ఐ మీన్ నిలబడేవున్నారుగా! టైం వేస్టు!” అన్నాను, పెడసరంగా.
అది, సరిగ్గా, అదే టైముకి నా ప్రక్కనుండి, అదే క్యారిడార్లో నుండి, నాలాగే ‘గ్రేసు టైములో’ ఫస్ట్ ఫ్లోర్‌లోకి వెళ్ళబోతున్న, మా సి.ఇ.ఓ. చెవుల్లో పడింది.
వెంటనే, నా నోట్లోంచి అసంకల్పితంగా, “సారీ!” అని వచ్చేసింది.
అతను, చిన్నగా తలాడించుకుంటూ, “యు హేవ్ ఎ పోయింట్!” అని గొణుగుతూ ఆ కొసనున్న మెట్లెక్కి వెళిపోయాడు.
అందరూ అప్రతిభులయి చూస్తూవుండిపోయారు! మా బాస్, ‘నీకు మూడింది!’ అన్నట్టు నావైపు చూసి, అతడి చాంబర్ తలుపు తోసుకుని లోపలకి వెళిపోయాడు.
నేనెప్పటిలాగే పట్టించుకోలే!
అయితే అప్పుడేం జరిగింది అన్నది ఈ కథకి సంబంధించిన విషయం, నా స్కూటర్‌కి సంబంధించిన విషయం, కాకపోయినా; ఆ సంగతి ఎత్తాను కాబట్టి, పూర్తిచేసేస్తాను.
“కొద్ది క్షణాల్లోనే సి.ఇ.ఓ., అతడి చాంబర్లోకి, పెర్సోనల్ మ్యానేజర్‌ని, ఎడ్మినిస్ట్రేషన్ మ్యానేజర్నీ పిలిచాడు. నన్ను కూడా రమ్మని స్వయంగా అతడే నాకు ఇంటర్‌కంలో చెప్పాడు.
మారుమాటాడకుండా నేను వెళ్ళాను.
నేను వెళ్తుంటే, నా కొలీగ్స్, ‘అయిపోయిందివాళ వీడి పని! వీడి తలపొగరు ఇవాళ్టితో అణగిపోతుంది!’ అని ఆనందపడ్డారు.
నేను మెట్లెక్కి, నేరుగా సి.ఇ.ఓ. చాంబర్లోకెళ్ళి అతనికెదురుగా, ఈయిద్దరు మ్యానేజర్ల కుర్చీలకి వెనుకగా, చేతులు కట్టుకు నిలబడ్డాను.
“ఊఁ! అయితే, టైము వేస్టు కాకుండా ఉండాలంటే, మానేజ్మెంట్ ఏం చెయ్యాలంటావ్?” అని సూటిగా నన్ను ప్రశ్నించాడు సి.ఇ.ఓ.
నేను వెంటనే, తటపటాయించకుండా, నానోటికొచ్చింది చెప్పాను.
“సర్! స్టాఫ్ వచ్చే కనీసం పదిహేను నిముషాల ముందు, అంటే 7:45 కల్లా ‘ప్యూన్స్’ వచ్చి టేబుళ్లు, కుర్చీలు శుభ్రంగా తడిగుడ్డపెట్టి తుడిచినా, అందరూ వచ్చేలోగా 8 కల్లా ఫర్నీచరంతా ఆరిపోతుంది. ఎవరూ, అవి ఆరేంతవరకు, పది-పదిహేను నిముషాలు క్యారిడార్లో నిలబడక్కర్లేదు. అంతమంది వర్కింగ్ టైం వేస్ట్ అవదు.”
వెంటనే, కుర్చీలో కూర్చొనివున్న పెర్సోనెల్ మానేజర్, కొంచెం వెనక్కి మొహం తిప్పి, నావైపు చూశాడు. నన్ను కసిరినట్టుగా, “అలా ఎలా కుదురుతుంది? అలా మనం ప్రతిరోజూ 15 నిముషాలు ముందు రమ్మనలేం! ఫ్యాక్టరీ ఏక్ట్ ప్రకారం, ఒక వర్కర్ని, రోజుకి 8 గంటలకంటే ఎక్కువ గంటలు పనిచెయ్యమనడం చట్ట విరుద్ధం.” అన్నాడు.
అసలు సంగతి, ‘ఈ కుర్ర వెధవ నా పరిధికి సంబంధించిన విషయంలో వేలు పెడుతున్నాడనే ఉక్రోషం!’ అని నేను గ్రహించాను.
అయినా, ఎప్పటిలాగే పట్టించుకోలే!
ఫెడేల్మని, నేను,
“8 గంటలకంటే ఎక్కువ గంటలు పనిచెయ్యమని ఎవడు చెప్పాడు? ‘వాళ్ళ టైము మార్చండి.’ అని చెప్తున్నాను.
ఇప్పుడు వాళ్ళందరూ కూడా, మనందరితోపాటు, ‘జనరల్ షిఫ్ట్’లో 8 నుండి 12, 1 అవర్ లంచ్ బ్రేక్ తరవాత తిరిగి సెకండ్ హాఫ్ 1 గంట నుండి 5 వరకు పని చేస్తున్నారు.
శనివారాలు మనందరకీ ‘హాఫ్ డేవే!’ మధ్యాహ్నం పూట సెలవు. వాళ్లకి మాత్రం ‘హాఫ్ డే’ సెలవు లేదు. మనం ఒక వారంలో 42 గంటలు పని చేస్తే చాలు. కానీ 44 గంటలు పని చేస్తున్నాం. అది కాక ఇంచుమించు ప్రతి శనివారం, మనమంతా కనీసం ఒంటిగంట వరకు పనిచేస్తూనేవుంటాం. మన సంగతి పక్కనపెట్టండి.
వాళ్ళకి మాత్రం వారానికి పనిగంటలు 48. వాళ్లకి శనివారాలు మధ్యాహ్నం పూట మనమంతా వెళిపోయాక, ఇక్కడ ఆఫీసులో చేసే పనేం లేక, వాళ్ళంతా ఏదోవొక రూంలో చేరి, 1 గంట నుండి 5 వరకు డచ్చాలు కొడుతుంటారు. 5 ఎప్పుడవుతుందా, కార్డులు పంచ్ చేసి ఇళ్ళకు పోదామా అని ఎదురుచూస్తుంటారు.
ఆ నాలుగయిదు గంటలు వృథా!
అదే వాళ్ళంతా, ప్రతిరోజూ ఒక పావుగంట మనకంటే వేగం 7:45 కి వచ్చారనుకోండి. అలాగే సోమవారం నుండి శుక్రవారం వరకు మన తరవాత 5:15 కీ, శనివారం మాత్రం మన తరవాత 1:15 కీ వెళ్ళారనుకోండి. మొత్తం ఆ నాలుగు గంటలు సద్వినియోగం చేసినట్టే!
అలా శనివారం 1:15 తో, ఒక వారంలో వారు చెయ్యాల్సిన మొత్తం 48 గంటలు పూర్తయినట్టే. అక్కడితో వాళ్ళని కార్డ్ పంచ్ చేసి ఇళ్ళకి వెళిపోమనండి.
అలా వాళ్ళ వర్కింగ్ అవర్స్ ఎడ్జస్ట్ చేస్తే, ఎవరి టైమూ వృధా అవదు.
వాళ్ళకి కూడా శనివారం మధ్యాహ్నం పూట మనలాగే సెలవు దొరుకుతోందని, సంతోషంగా ఒప్పుకుంటారు. అలా వాళ్ళని ఒప్పిస్తే, అది చట్ట విరుద్ధం కాదు.” అని చెప్పాను.
నేను చెబుతున్నంతసేపు, పెర్సోనెల్ మానేజర్ ఆశ్చర్యంగా నావైపు చూస్తుండిపోయాడు.
ఎడ్మినిస్ట్రేషన్ మానేజర్, నన్ను మెరుస్తున్న కళ్ళతో మెచ్చుకోలుగా చూశాడు.
సి.ఇ.ఓ. నావైపు ప్రశంసాపూర్వకంగా చూసి, తలాడించాడు. “యు కెన్ గో!” అన్నాడు.
--: oo(O)oo :--
సాయంత్రం ఆఫీసు నుండి బయటపడి, మెకానిక్ దగ్గరకి నడచుకుంటూ వెళ్ళాను. నా మొహం చూస్తూనే, నాకంటే దీనంగా మొహం వేల్లాడేశాడు, వాడు.
“సార్! ఈమధ్యనే ఏవరేజ్ సరిగా ఇవ్వట్లేదని, కార్బరేటర్ కొత్తది వేయించారు. అంతకుముందే, ఒక్క కిక్ కి స్టార్ట్ అవట్లేదని, మాగ్నెట్, ప్లగ్ చాంబర్, ప్లగ్గులు, అన్నీ మార్పించేశారు. కిక్ అప్పుడప్పుడు జామ్ అవుతోందని, పిస్టన్ మార్పించారు. దానికిముందే, మొత్తం కేబుల్స్, క్లచ్ ప్లేట్లు, కొత్తవి వేయించారు. అలా ఒక్కొక్కటీ ఒక్కొక్కటీ మార్చేసి ఇంచుమించు అన్ని సామాన్లకీ కలిపి ఇప్పటివరకు మీరు ఖర్చు చేసింది చూస్తే, నాకే గుండె తరుక్కుపోతోంది. కొత్త స్కూటర్ వచ్చివుండేది, ఆ డబ్బులతో!” అన్నాడు. నామీద జాలితో.
నేను మనసులోనే, “కొత్తబండి కొనాలంటే, డబ్బులన్నీ ఒకేసారి ఇవ్వాలి. ఇలా అయితే, కొంచెం కొంచెంగా ఖర్చుపెడుతూ, బండి సాగిపోతోంది. ఏదోవొక బండంటూ సమయానికి చేతిలో ఉంది, పని నడచిపోతోంది. నీకేం చెప్పను నా అవస్థ!” అనుకున్నాను.
అతడితో, “ఇంతకీ ఇప్పుడేంటి ప్రోబ్లం?” అనడిగాను.
“పెట్రోల్ ట్యాంక్ బొక్కపడింది.” అతడి భాష అది.
“ఎక్కడ కన్నం పడింది?” అనడిగాను.
“ఒకదగ్గరని కాదు. మొత్తం అంచు అంతా, చుట్టూరా బొటబొటా కారిపోతోంది. రిపేర్ కుదరదు. కొత్త ట్యాంకీ కొనాల్సిందే.” అని చావుకబురు చల్లగా చెప్పాడు.
పర్సు తీసి, అతడడిగినన్ని డబ్బులిచ్చాను. “ఈరోజే, ఎలాగైనా ఇటు రాయపూరో, అటు భిలాయో వెళ్ళి కొనుక్కురా! ఇంకా ఏమైనా స్పేర్స్ కావాలేమో ఇప్పుడే చూసుకుని, అవి కూడా తీసుకురా!” అని మరిన్ని డబ్బులిచ్చాను. “అన్నీ ఫిట్ చేసి బండి నడిపి చూడు. నీకు శాటిస్ఫాక్షన్గావుంటే, వీలయితే, రాత్రే ఇంటికి తెచ్చీ బండి. రేపట్నుంచి టైముకి వెళిపోవాలి, ఆఫీసుకి.” అన్నాను.
‘నీ మొహం! నువ్వేం టైముకి వెళ్తావులే, ఈబండి మీద!’ అన్నట్టు నావైపొక చూపు చూశాడు.
“అలాగే సార్! ఏరాత్రికయినా, మీ స్కూటర్ మీయింటికి తెచ్చేస్తాను.” అని మాటిచ్చాడు.
చెప్పినట్టే, పాపం, ఆరాత్రి నాబండి సరిచేసి తెచ్చిచ్చాడు.
ఇస్తూ ఇస్తూ ఒకమాటన్నాడు.
“సార్! ఇన్ని చేయించారు. ఒక్కసారి, మొత్తం బండంతా ఓవరాలింగ్ చేయించేయండి. మ్యాట్లు కూడా మార్పించేయండి. దాంతోపాటు ఒక కోట్, సింగిల్ కోట్, స్ప్రే పెయింటింగ్ కూడా చేయించేశారంటే, కొత్తపెళ్లికూతుర్లా నిగనిగలాడిపోతుంది మీ బండి! కొన్ని సంవత్సరాల పాటు తిరిగి చూసుకోనక్కర్లేదు. ఓవరాలింగ్కి కొంత ఇస్తే చాలు. మిగిలినది, పని అయ్యాక. అలాగే స్ప్రే పెయింటింగ్ చేసేవాడు, నా ఫ్రెండే! వాడికి నెల్లాళ్ళు ఆగి, ఇచ్చినా ఫరవాలేదు! ఏమనుకోడు.” అని రాయితీలిచ్చి ఊరించాడు.
“సర్లే! వచ్చే వారం, జీతాలొచ్చాక చూద్దాం!” అన్నాను, మొహమాటపడిపోతూ.
--: oo(O)oo :--
మెకానిక్ మాట ఇచ్చినట్టుగా, కన్సెషనల్ రేటుకే, లాంబ్రెటా స్కూటర్ థరో ఓవరాలింగ్, చేశాడు. పెయింటింగ్ అరువుకి చేయించాడు.
ఆరోజు సాయంత్రం ఇంటికి తీసుకువచ్చి గుమ్మంలో పెట్టాడు. ఆ సాయంసంధ్య వేళ వాకిట్లో అలా ఆ బండిని చూస్తూ తన్మయత్వంతో ఉండిపోయాను.
నిగనిగలాడుతూ, కొత్త పెళ్ళికూతురు కాదు కాని, నా కళ్ళకి మంచి పంచకళ్యాణి గుఱ్ఱంలా కనిపించింది. ఒక క్షణం నా దిష్టే తగులుతుందేమో, అనిపించింది నాకు.
నేను, నా భార్యా పిల్లలే కాక, ఒక్కొక్కసారి మా తోడల్లుడి పిల్లలిద్దర్నీ కూడా కూర్చోబెట్టేసినా కిక్కురుమనేది కాదు. పిచ్చి..డ! అంత మంచి బండి!
అలా దాని మీద తిరిగిన క్షణాలు, అది నాతో పాటు చేసిన ఇన్నేళ్ళ ప్రయాణాలు, నెమరువేసుకుంటూ ఇంట్లోకి అడుగుపెట్టాను.
నా వెనకే మా ఆఖరి తమ్ముడు లోపలికి వచ్చాడు.
వస్తూనే, “ఎంత కొత్తగా ఉందో! మన బండే!” అన్నాడు, ఆశ్చర్యపోతూ.
“ఒక రౌండ్ వేసి రానా!” అనడిగాడు, ముచ్చటపడిపోతూ.
“ఊఁ వెళ్ళిరా! మెకానిక్ ‘ఒకసారి నడిపి చూడండి. మీకేమైనా లోటుపాట్లు కనిపిస్తే చెప్పండి. సరిచేసేస్తాను.’ అన్నాడు. నాకేం లోపాలు కనిపించలేదు! చూడు! నీకేమైనా అనిపిస్తే చెప్పు.” అన్నాను.
వాడలా స్కూటర్ తీసి ముందు నాలుగో బ్లాకు వైపు వెళ్తున్నట్టనిపించింది. ఆ బ్లాక్ మలుపు తిరిగితే, అదంతా ఖాళీ ప్రదేశం! పెద్ద ఆట మైదానం! అక్కడే రౌండ్లు కొడతాడు కాబోలు! అనుకున్నాను.
ఎన్ని చక్కర్లు కొట్టినా తనివి తీరడం లేదు కాబోలు! ఎంతసేపయినా తిరిగి రాలేదు!
ఈలోగా నేను ఫ్రెష్ అవడం, కాఫీ త్రాగడం అన్నీ అయిపోయాయి.
బయటకొచ్చేసరికి, ఇద్దరు కుర్రాళ్ళు, నా స్కూటర్ని అతికష్టం మీద తోసుకుని వస్తున్నారు. మెకానిక్ చెప్పిన నవ వధువు ఇలా కార్లోంచి దిగుతూనే, అలా అమాంతం ఆమెను ఏ రోడ్డు రోలరో బుల్డోజరో కుమ్మేస్తే ఎలా అయిపోతుందో, అలా! నా పంచకళ్యాణి పంచ ప్రాణాలు నిలబడ్డపాటుగా హరించేస్తే ఎలావుంటుందో అలా! నా స్కూటర్ నవనాడులూ బయటకొచ్చి వేళ్ళాడుతున్నట్టు, రబ్బర్ పైపులూ, మ్యాటూ, కన్ను లొట్టపోయి హెడ్ లైటు, కాళ్ళు సొట్టపోయినట్టు వంకర టింకరగా కదుల్తూ టైర్లు, ఆరు లంఖణాలు చేసిన అరవ నాపసానిలా కదలడానికి మొరాయిస్తోంది. ఆ ప్రక్కనే, మాతమ్ముడు, లైలాకోసం తపిస్తూ ఇసుక తుపానులో చిక్కుకుపోయిన మజ్నూలా, ఒళ్ళంతా డేక్కుపోయి, గుడ్డలన్నీ పీలికలయిపోయి, జుత్తంతా దుమ్ముకొట్టుకుపోయి కనిపించాడు.
నా గుండె కలుక్కుమంది.
బండి కోసం కాదు!
‘నా తమ్ముడికేం కాలేదు కదా!’ అని.
“ఏమయిందిరా! నీకేం దెబ్బలు తగల్లేదు కదా! పద! డాక్టర్ దగ్గరకి వెళ్దాం!” అన్నాను, కంగారుగా.
వాడు బిత్తరపోయి నావైపు చూశాడు. ఆ బండి తెచ్చిన వాళ్ళు అతి కష్టం మీద స్టాండ్ వేశారు.
“వాడికేం కాలేదు భయ్యా!” అన్నారు.
వాడేమో, “అది కాదన్నయ్యా! కొత్త బండి!” అన్నాడు. వాడి కళ్ళల్లో నీళ్ళు చిప్పిల్లాయి. గొంతులోనే కాదు, కాళ్ళలో కూడా వణుకు.
“పిచ్చాడా! దానికేముందిరా! మన మెకానిక్ ఉన్నాడుగా, వాడు చూసుకుంటాడు దాని సంగతి! నీకేం కాలేదుగా! ముందు లోపలకి వెళ్ళి కాళ్ళూ చేతులూ మొహం కడుక్కో. లేదా స్నానం చెయ్యి. బట్టలు మార్చుకుని పద. డాక్టర్ దగ్గరకెళ్దాం. ఎక్కడ దెబ్బలు తగిలాయో ఏంటో!” అన్నాను. వాడు లోపలకి వెళ్ళాడు.
అప్పుడు, వాడితో పాటు వచ్చిన కుర్రాళ్ళు, అసలేం జరిగిందో, చెప్పారు.
“మేము అక్కడే, ఆ నాలుగో బ్లాక్ అవతల మైదానంలో, ఫుట్‌బాల్ ఆడుతున్నాం.
వీడు ఇటునుంచి రఁయ్యిమని అటు వచ్చి, నాలుగో బ్లాక్ దగ్గర హార్న్ కొట్టి, రోజూ లాగే, అటువైపు మైదానం వైపు మలుపు తిప్పాడు.
మేము అరుస్తూనే ఉన్నాం ‘చూసుకో చూసుకో’ అని.
పాపం! చూసుకునేలోగానే, అంత స్పీడులో వచ్చి దభ్ మని పడ్డాడు.
“ఎక్కడ?” అన్నాను ఆందోళనగా.
“అదేంటి? మీకూ తెలీదా! అక్కడ నాలుగో బ్లాకు తరవాత మరో బ్లాకు కడుతున్నారు. దానికి పునాదులు ఇవాళ్ళే తవ్వారు. ఇందాకలే గోతులు తియ్యడం పూర్తయింది. డ్రమ్ములో ఏవో అడ్డం పెట్టాలని చెప్పి, ఇప్పుడే పనివాళ్ళు అవి తేడానికి అటు వెళ్ళారు. ఈలోగానే వీడొచ్చి ఆ పునాదుల్లో స్కూటర్‌తో సహా పడ్డాడు.”
“ఆఁ! పునాదుల్లో పడ్డాడా! కాలు చెయ్యీ ఏం విరగలేదు కదా! తలకేం దెబ్బ తగల్లేదు కదా!” అని కంగారుగా ఇంట్లోకి పరుగెత్తాను.
“ఏం కాలేదు భయ్యా! ...” అని వాళ్ళు వెనకనించి అరుస్తూనేవున్నారు.
--: oo(O)oo :--
ఆ మర్నాడు మెకానిక్, ఒక తోపుడుబండితో (ఠేలాతో) ఇంటికి వచ్చాడు. అప్పుడు, అలా పునాదుల్లో తుక్కయిపోయిన నా బండిని చూసి కళ్ళనీళ్ళ పర్యంతం అయాడు.
“ఇదేంటి సార్! ఇప్పటికి మీ స్కూటర్లో మిగిలున్న పాత పార్ట్స్ రెండే! ఒకటి హ్యాండిల్ నుంచి ఫ్రంట్ వీల్కున్న ఫోర్క్, రెండోది గేర్‌బాక్స్. మిగిలినవన్నీ కొత్తవే!
ఇప్పుడు ఈరెండు కూడా పాడయిపోయాయి. పనికి రావు.
ఫోర్క్ బెండ్ అయిపోయింది. లేత్ మీద పెట్టి సరి చేసినా, పనికిరాదు. స్త్రెంగ్త్ ఉండదు. కొత్తదే కొనాలి. గేర్ బాక్స్ బద్దలయిపోయింది. రిపేర్ క్వశ్చనే లేదు. కొత్తది కొనాల్సిందే.
అంటే, ఇక మీ బండిలో ఛేసిస్ తప్పించి, అన్నీ కొత్తవే! నిజంగానే కొత్తబండి కింద లెక్క!”
అతడితో, “పోనీలే! జరిగిందేదో జరిగిపోయింది. మా తమ్ముడికేం కాలేదు! సంతోషం! స్కూటర్ తీసుకెళ్ళి మళ్ళీ కొత్తదిగా చేసి పట్రా!” అని చెప్పాను.
అప్పుడు తోపుడుబండివాడు, స్కూటర్ని, వాడి తోపుడుబండిపైకి మెకానిక్, మాతమ్ముళ్ళ సాయంతో ఎక్కించి పడుకోబెట్టాడు.
వాళ్ళు, అలా మా బండిని తోపుడుబండి మీద తీసుకువెళుతుంటే, మా ఆఖరి తమ్ముడు, కళ్ళొత్తుకున్నాడు.
“నావల్లే, గొడారివాడు చచ్చిన గేదెని తీసుకెళ్తున్నట్టు, ఇలా మనబండిని వీళ్ళు తీసుకెళ్తున్నారు.” అని బాధపడ్డాడు.
నేను అనునయంగా వాడి భుజం తట్టాను.
ఆ తరవాత రెండురోజుల్లో మళ్ళీ నాబండి కొత్తగా తయారయి ఇంటికి తిరిగొచ్చింది.
--: oo(O)oo :--
నా పాత కొత్త ‘లాంబ్రెటా మాక్’ని వాకిట్లో ఆపి, ఇంట్లోకొచ్చేసరికి, మా ఆఖరి చెల్లి, ఒక కవర్ తెచ్చి నాచేతికిచ్చింది. అది విప్పి చూసేసరికి, అందులో బజాజ్ కంపెనీవాళ్ళ లెటర్.
ఎప్పుడో నేను ‘బజాజ్ చేతక్’ స్కూటర్ కోసం 500 రూపాయలు కట్టి బుక్ చేసుకున్న నెంబర్‌కి, ఇప్పుడు మాయింటికి దగ్గరలో రాయపూర్లోవున్న వాళ్ళ షో రూంకి వెళ్ళి ఒక నెల రోజుల్లోగా, డెలివరీ తీసుకోమని ఆఫర్!
ఒకవేళ ఇచ్చిన గడువులోగా స్కూటర్ కొనుక్కోలేకపోతే, ముందు కట్టిన 500 గల్లంతేనని ఆ ఉత్తరం తాత్పర్యం.
ఏం చెయ్యను! ఆమాత్రం ఈమాత్రం సేవింగ్స్లోవున్న డబ్బులు కూడా ఈ డొక్కు స్కూటరే ఏనుగులా పెట్రోలు రూపంలో తాగేసింది, రిపేర్ల రూపంలో తినేసింది. ఇప్పుడెలా!
ఎవరికైనా, నా ‘చేతక్’ నెంబర్ని ఇచ్చేస్తే సరి! కనీసం ఈ 500 రూపాయలయినా దక్కుతాయి. అదృష్టం బాగుంటే, ఎక్కువే దొరకొచ్చు. కానీ అక్కర్లేదు! నేను డిపాజిట్ చేసినవి దొరికితే చాలు! నా కొలీగ్స్‌కి ఎవరికైనా కావాలేమో, రేపు ఆఫీసులో అడగాలి అనుకున్నాను.
--: oo(O)oo :--
అనుకున్నట్టుగా, ఆ మర్నాడు చాలామందినే ఎవరికైనా నా ‘బజాజ్ చేతక్’ నెంబరు కావాలేమోనని అడిగాను. ‘నాకొద్దంటే నాకొద్దు.’ అన్నారు. అందరికీ ఒకటే ప్రోబ్లం! ‘ఒకేసారి అంత డబ్బు, ఎక్కణ్ణుంచి తెస్తాం!’ అన్నది.
ఆ తరవాత రెండు రోజులకి, ఏవో డి.ఏ. ఎరియర్స్ ఖాతాలో పడ్డాయని తెలిసి, పాస్‌బుక్ అప్డేట్ చేయించుకుందామని బ్యాంక్‌కి వెళ్ళాను.
నన్ను చూడగానే, బ్యాంక్ క్లర్క్, “మీరుకాని వస్తే, ఒకసారి అతన్ని కలవమని, మా మానేజర్గారు మీతో చెప్పమన్నారు.” అన్నాడు.
‘ఎందుకా!’ అని సంశయిస్తూనే, బ్యాంక్ మానేజర్, రూంలోకి వెళ్ళాను.
నన్ను చూస్తూనే అతను, కూర్చోమని సీట్ ఆఫర్ చేశాడు.
ఆ తరవాత, అతను నాతో, “మీరొకసారి, నన్ను, ‘మీ బ్యాంక్, స్కూటర్ కొనుక్కోడానికి వెహికల్ లోన్ గాని, పెర్సనల్ లోన్ గాని, ఇస్తుందా?’ అనడిగారు గుర్తుందా?” అన్నాడు.
“ఎందుకు గుర్తులేదండీ! ఏమీ, ఇప్పుడలాటిదేమైనా ఇస్తున్నారా?” అని ఆశగా అడిగాను.
“అది చెప్పడానికే మిమ్మల్ని పిలిచాను. ఈమధ్యనే మా బ్యాంక్ కొత్తగా ‘బిగ్ బయ్’ అని ఒక క్రొత్త స్కీం ఆరంభించింది. మీరే మా బ్రాంచిలో ఆ స్కీము ద్వారా మొదటి లబ్దిదారుడవాలని చెప్తున్నాను. ఆ స్కీంలో మీలాటి రెగ్యులర్ ఇన్‌కం ఉండి, మా బ్యాంకులో సేలరీ జమ అవుతున్న ఖాతాదార్లకి మాత్రమే, స్కూటర్, ఫ్రిజ్, టి.వి., టూ-యిన్-వన్ టేప్-రికార్డర్, మ్యూజిక్ సిస్టం, ఏవైనా గృహ సంబంధిత ఉపకరణాలు, వస్తువులు, వాహనాలు కొనుక్కోడానికి మా బ్యాంక్ అతి తక్కువ వడ్డీకి ఋణం ఇస్తుంది.
కావాలంటే మీరు ఆ సదుపాయాన్ని స్కూటర్ కొనడానికి ఉపయోగించుకోండి.” అని చెప్పాడు.
నా మొహం ఆనందంతో విప్పారింది.
“కచ్చితంగా, ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటాను.
నాదగ్గర ఆల్రెడీ, ‘బజాజ్ చేతక్’ ఆఫర్ లెటర్ ఉంది. ఆ స్కూటర్ కొనాలని చాలారోజులయి అనుకుంటున్నాను. ఇన్నాళ్ళకి అది మీ దయవల్ల నెరవేరుతోంది.” అని చెప్పాను.
అతను వెంటనే, సొరుగులోంచి ఆరు పేజీల లోన్ అప్లికేషన్ ఫారం తీసి నాకిచ్చాడు. “ఇప్పుడే, ఇది నింపి, నా చేతికివ్వండి. మీకొచ్చిన ‘బజాజ్ చేతక్’ ఆఫర్ లెటర్, ఏ డీలర్ దగ్గర్నుంచి బండి కొంటున్నారో, ఆ డీలర్ కొటేషన్, తెచ్చి ఇస్తే చాలు! మీరు కట్టాల్సిన మినిమం డిపాజిట్ మీ ఖాతాలోంచి జమ చేసేసుకుంటాం. దాని గురించి మీరేం వర్రీ అవకండి. మిగిలిన మా బ్యాంక్ ఫార్మాలిటీస్ అన్నీ పూర్తవగానే, మీకు కబురుచేస్తాను. ఏక్సెసరీస్, ఇన్స్యూరెన్సులతో సహా మొత్తం కొటేషన్ వాల్యూకి, మీ డీలర్ పేర్న మీకు చెక్కు ఇస్తాను. అది మీరు వాళ్ళ దగ్గర సబ్మిట్ చేసి, మీ బండి డెలివరీ తీసేసుకోవడమే!” అని అదేదో అతడు చెప్పినంత సులువన్నట్టు చెప్పాడు.
నాకు ఆ మాటకి గాలిలో తేలిపోతున్నట్టయింది. గబగబా ఆ ఫారం నింపి అతనికిచ్చేశాను.
ఆ తరవాత, చాలా రోజులయి, ‘బి.పి.ఎల్.’ కలర్ టి.వి. కొనాలనుకుంటున్నామన్న సంగతి గుర్తొచ్చింది.
అప్పుడతనితో, “కలర్ టి.వి., స్కూటర్, రెండూ కొనుక్కోడానికి లోన్ ఇస్తారా!” అనడిగాను.
“ఓ! తప్పకుండా ఇస్తాం! దానికేం భాగ్యం!” అని టపటపా టేబుల్ క్యాలిక్యులేటర్ మీద ఏవో అంకెలు కొట్టి, రమారమి ‘నెలసరి కిస్తు’ ఒక్కొక్కదానికీ ఎంతవుతుంది, రెండింటికీ కలిపి ఎంతవుతుందీ చెప్పాడు.
వెంటనే, నేను, “వద్దులెండి! లోన్ ఎలిజిబిలిటీ ఉందని, మీరిచ్చేసినా, నాకు ఇబ్బంది అవుతుంది. ప్రస్తుతానికి స్కూటర్ చాల్లెండి. కావాలంటే, స్కూటర్ లోన్ తీరిపోయాక, కలర్ టి.వి. గురించి ఆలోచించొచ్చు.” అని అతనికి థాంక్స్ చెప్పి అక్కడనుంచి కదిలాను.
--: oo(O)oo :--
ఆఫీసు విషయాలు తప్పించి, మాయింట్లో, మా కుటుంబ వ్యవహారాలూ, విషయాలూ అన్నీ మాయింటిల్లిపాదీ చిన్నా పెద్దా అందరం కలిసి కూర్చొని చర్చించుకుంటాం. మూకుమ్మడిగా ఒక నిర్ణయం తీసుకుంటాం.
అలాటిది, అనుకోకుండా బ్యాంకులో స్కూటర్ లోన్ ప్రస్తావన రావడంతో, ఆ సంగతి ముందుగా ఇంట్లో చర్చించడం జరగలేదు. అది నా మనసులో పీకుతోంది.
అందుచేత, జరిగిన విషయం, నేను తీసుకున్న నిర్ణయం చెప్పకుండా, ఆరోజు భోజనాల దగ్గర, ఈ విషయం చర్చకి పెట్టాను.
అప్పుడు నేను, నా భార్యా, నా ఇద్దరు తమ్ముళ్ళు, ఇద్దరు చెల్లెళ్ళు, ఇద్దరు అబ్బాయిలు (ఒకడు నాలుగవ తరగతి, ఒకడు రెండవ తరగతి చదువుతున్నారు) మొత్తం ఎనమండుగురం ఆరోజు చర్చలో పాల్గొన్నాం.
చర్చ మొదలెడుతూ నేను క్లుప్తంగా వాళ్లకి, “అప్పుడెప్పుడో మనం ‘బజాజ్ చేతక్ స్కూటర్’ కోసం పెట్టిన నెంబరు ఇప్పుడొచ్చింది మనకి. ఇప్పుడున్న స్కూటర్లలో అదే బెస్ట్! నెల్లాళ్ళలోగా స్కూటర్ కొనుక్కోవాలి. లేకపోతే ఆ ఆఫర్ మన చేతుల్లోంచి తప్పిపోతుంది. మళ్ళీ అలాటి అవకాశం ఇప్పుడప్పుడే మనకి దొరక్కపోవచ్చు. అదొక సమస్య!
రెండోది మనం ఆ మధ్యన కలర్ టి.వి.ల గురించి సర్వే చేశాం కదా! అప్పుడు ‘బి.పి.ఎల్. కలర్ టి.వి. ఈజ్ ద బెస్ట్!’ అని తేల్చాం.
ఈ రెండింటి కాస్ట్ లో పెద్ద తేడా లేదు.
అయితే, ఇప్పుడు మనకొచ్చిన మరో సువర్ణావకాశం ఏమిటంటే, ‘బ్యాంక్ లోన్!’
బ్యాంక్ మనకి కావాలంటే రెండూ కొనుక్కోడానికి లోన్ ఇస్తుంది. కాకపోతే, మనం వాయిదాలు కట్టలేం. కష్టం! అదో సమస్య!
అదే ఏదో ఒకటే కొనుక్కుంటే, కట్టాల్సిన కిస్తు, నెలనెలా సునాయాసంగా కట్టేయగలం.
మరో విషయం ఏంటంటే, అటు స్కూటర్, ఇటు టి.వి., రెండూ మనింట్లో ఉన్నవి పాతబడిపోయాయి. కానీ, రెండింటిలో మనం ఇప్పుడు ఒకటే కొనగలం!
అయితే అది ఏది? బజాజ్ చేతక్ స్కూటరా? బి.పి.ఎల్. కలర్ టి.వి.వా?
ఏది కొనాలి? అన్నది మనం తేల్చాలి!
అదే ఇవాళ్టి మన టార్గెట్!”
చాలాసేపు చర్చలు జరిగాయి.
నేను, మా చిన్నవాడు, మా మా ఇష్టాయిష్టాలని, అభిప్రాయాలని చెప్పొచ్చు; అంతవరకే కాని, ఓటింగ్‌కి అనర్హులం! ఒక్కొక్కరు ఒక్కొక్కలా సజెషన్స్ ఇచ్చారు. అవేవీ ఏకగ్రీవంగా అంగీకరించబడలేదు. ముగ్గురు స్కూటర్ అంటే, ముగ్గురు టి.వి.కి ఓటు వేశారు.
ఎటూ తేలకపోయేసరికి, ఇవన్నీ వినీ వినీ విసుగెత్తిన మా పెద్దబ్బాయి చివరకి ఏదోవొకటి తేల్చేయాలని పట్టుదలకి వచ్చి, కొన్ని ప్రశ్నలు వేశాడు.
“నాన్నగారూ! కొత్త స్కూటర్ ఎవరెవరు నడుపుతారు?”
“ప్రతిరోజూ ఆఫీసుకి ఈ డొక్కు స్కూటర్ మీద వెళ్ళే బదులు, నేను కొత్త బండి తీసుకువెళ్తానురా. అందుచేత ఒక విధంగా, నేనే ఎక్కువగా నడుపుతాను. అప్పుడప్పుడు మీ బాబాయిలు నడుపుతారు. మీ అత్తలు కూడా సరదాగా అప్పుడప్పుడు ఇక్కడే మైదానంలో రౌండ్లు కొడతారు.” అన్నాను.
“దాని రేటు, టి.వి. రేటు ఒకటే అన్నారు. అలాగే బ్లాక్ ఎండ్ వైట్ టి.వి. కంటే ఇంచుమించు కలర్ టి.వి. ఖరీదు నాలుగు రెట్లని చెప్పారు. అటువంటప్పుడు, మనం కలర్ టి.వి. కొంటే, మనకి వేరే దేశాల్లో ఏమి జరుగుతోందో కనిపిస్తుందా? తెలుస్తుందా?” అని మరో ప్రశ్న వేశాడు.
“తెలీదే నాన్నా! ఇక్కడ మన దూరదర్శన్ కేంద్రం వాళ్ళు చేసే ప్రసారాలు మాత్రమే సహజమైన రంగుల్లో చూడగలం అంతే!” అని సమాధానమిచ్చాను.
వాడు, “అన్ని రెట్లు డబ్బులు పెట్టి మనం ఈ ‘పశువు-కసువు’, ‘పేడ-పెంట’ కలర్లో చూడ్డానికా ఎందుకు? దండగ!” అన్నాడు.
నేను ఆతురతతో, “అయితే, మనం స్కూటర్ కొనేసుకుందామా?” అనడిగాను.
“ఆగండి! ఆలోచిద్దాం. కలర్ టి.వి. అయితే, బొంబాయినుంచి, ఢిల్లీనుంచి, ప్రసారమయే సినిమాలు, నాటకాలు, క్రికెట్, ఫుట్‌బాల్ ఆటలు, మిగిలిన ప్రోగ్రాములు, అవన్నీ నేచురల్‌గా కలర్లో కనిపిస్తాయిగా!” అని మళ్ళీ ప్రశ్నించాడు.
నేను, “ఓ! నిరభ్యంతరంగా కలర్లో కనిపిస్తాయి!” అన్నాను.
“అంటే, కలర్ టి.వి. అయితే, మీతో సహా మనందరం, ఇంటిల్లిపాదీ కలిసి కూర్చొని ఆనందిస్తాం! అదే స్కూటర్ అయితే, మీకొక్కరికే ఎక్కువ ఆనందం! మీరొక్కరే ఎంజాయ్ చేస్తారు! మాకు ఎంజాయిమెంట్ అప్పుడప్పుడే!” అన్నాడు.
“హారి పిడుగా! అయితే ఇప్పుడేమంటావ్?”
“స్కూటర్ వద్దు! లోన్ తీసుకుని మనం కలర్ టి.వి.వే కొందాం!” అని వాడు తీర్పు ఇచ్చేశాడు.
దానితో టి.వి.కి నాలుగు, స్కూటర్‌కి రెండు ఓట్లు పడ్డాయి.
వాడి లాజిక్‌కి అందరూ అబ్బురపడి టపటపా చప్పట్లు కొట్టేరు.
ఇంకేముంది! దాంతో ఇటువైపున్న ఆ రెండు ఓట్లు కూడా అటువైపే జంప్!
దాంతో టి.వి. వే, ఏకగ్రీవంగా ఎన్నుకోబడింది.
“పదిమంది ప్రయోజనం కోసం, ఒక్కరు త్యాగం చెయ్యడమే సరయిన న్యాయం!” అని మా పెద్దబ్బాయి నాకు గురు స్థానంలో కనిపించి, కనువిప్పు కలిగించాడు. నన్ను సక్రమ మార్గంలోకి మళ్ళించాడు.
‘గురు దేవో భవ!’ అనుకున్నాను.
వెంటనే, ఒక నిర్ణయానికి వచ్చాను.
ఆమర్నాడే బ్యాంకుకి వెళ్ళి, లోన్ అప్లికేషన్లో ‘బజాజ్ చేతక్ స్కూటర్’కి బదులు ‘బి.పి.ఎల్. కలర్ టి.వి.’ అని మార్చాలని.
దాంతోపాటే, మరొకటి కూడా దృఢంగా అనుకున్నాను.
ఆఫీసులో ఈ ‘బిగ్ బయ్’ స్కీం గురించి చెప్పి, ఎవరికైనా కావాలంటే, నా ‘బజాజ్ చేతక్ నెంబర్’ ఉచితంగానైనా ఇవ్వాలని. నేను కాకపోతేనేమి! నాలాటి నా కొలీగ్ ఎవరికైనా ఆ అవకాశం కల్పించాలని, ఆ ఆనందం పొందేలా చెయ్యాలని.
--: oo(O)oo :--
ఆ మర్నాడుదయం లాంబ్రెటా మాక్, కిక్ కొడుతూ అనుకున్నాను.
“పాతదైతేనేంటి, నా పంచకళ్యాణి మంచి కండిషన్లో ఉంది. అంతగా ఏదొచ్చినా చూసుకోడానికి మన మెకానిక్ ఉండనేవున్నాడు. టి.వి. లోన్ తీరేంతవరకు మరి కొన్నేళ్ళు, ఇలా దీంతో లాగించేయవచ్చు. ఇది నన్ను లాగేయవచ్చు.”
--: oo(O)oo :--