అనీమూన్ - మద్దూరి నరసింహమూర్తి

Anee moon

కిట్టిగాడు సుబ్బిగాడు లంగోటి దోస్తులు. ఆళ్ళ మనువులు సుమారుగా ఒకేసారి అయేయి. అప్పుడే ఇద్దరూ ఒట్టేసుకున్నారు - ఇద్దరూ ఇయ్యమందాలని.

కిట్టిగాడికి ‘పుంజు’, సుబ్బిగాడికి ‘పెట్ట’ కలగడంతో - మరోతూరి ఇద్దరూ ఒట్టేసుకున్నారు - ముందేసుకున్న ఒట్టు నిజం సెయ్యాలని.

కిట్టిగాడు పుంజుని ‘రామిగాడు’ అని పిలుసుకుంటూంటే –

సుబ్బిగాడు పెట్టని ‘లచ్చిమి’ అని పిలుసుకుంటున్నాడు.

రెండు నెలల వ్యవధిలో, పై లోకాలకి ఎల్లిపోతే --

‘ఆడకూతురి పెంపకం నీవల్ల కాదు, నువ్వు లచ్చిమితో వచ్చి మాతోనే ఉండు. మాకు మాత్రం ఇంకెవరున్నారు’ అని -- అత్తోరు సుబ్బిగాడిని లచ్చిమిని ఆళ్ళ ఊరుకి తీసుకుపోయేరు.

దాంతో, పదేళ్ళై ఈ పిల్లలు ఒకరినొకరు సూసుకోనేలేదు. కిట్టిగాడు సుబ్బిగాడు అడపా తడపా ఏ సంతలోనో జాతరలోనో కలుసుకొని ఒకరి కుశలం ఇంకొకరు తెలుసుకుంటూ, ఆళ్ళ ‘ఒట్టు’ గుర్తుసేసుకొనేవారు.

“ఆ ‘సీమిడి ముక్కు దాన్ని’ ఓడు సేసుకుంటాడు ?” అంటున్న రామిగాడుతో –

“అలా కాదురా అబ్బీ, ఎప్పుడో పదేళ్ల కిందట సూసేవు లచ్చిమిని. ఇప్పుడు కూడా అలానే ఉంటాదేటిరా” అని సద్ది సెప్తున్నాడు కిట్టిగాడు.

అయినా, రామిగాడు ఇనుకుంటేగదా.

“పదేళ్ళ ఒయసప్పుడు కూడా ‘దిసమొలగా తిరిగే నిసిగ్గు గాడిని’ ఎవత్తి సేసుకుంటాది ?” అని లచ్చిమి ఎదురు తిరుగుతూంటే –

“అలా కాదే అమ్మీ, ఎప్పుడో పదేళ్ల కిందట అలా తిరిగే ఓడని, ఇప్పుడు కూడా అలానే ఉంటాడేంటే, నీ తెలివి తక్కువ కానీ” అని సద్ది సెప్తున్నాడు సుబ్బిగాడు.

అయినా, లచ్చిమి 'ఊ' అన్నదే లేదు.

-2-

ఈ పిల్లల యవ్వారం ఇలా ఉంటే ఈళ్ళకి మనువెట్టా అగుద్దని –

ఓతూరి, ఇద్దరూ సంతకాడికి పిల్లలతో పోయి - ఆళ్ళిద్దరూ ఒకరినొకరు సూసుకొనేటట్టు సేసీసరికి –

కండలు తిరిగిన శరీరంతో బింగించి కట్టిన పంచెతో మొనగాడిలా ఉన్న రామిగాడు -- సినెమాలో ఈరోలా లచ్చిమి కళ్ళనిండా నిండిపోయేడు.

వయసు పొంకంతో సిదిమితే కందిపోతుందన్న అందంగా ఉన్న లచ్చిమి మీద రామిగాడు మనసు పడ్డాడు.

అలా ఒకరినొకరు నచ్చుకొన్న ఆళ్ళ మనువు జరిగిపోనాది.

తొలి రేత్రి, ఆళ్ళ మజ్జలో గాలి కూడా దూరడానికి సందులేనట్టు ఒకటైపోనారు.

ఒయసు పొంగు హడావిడి సల్లబడిన కాసేపటికి –

“అవునే లచ్చిమీ, నేను దిసమొలతో తిరిగేవోడినని నన్ను సేసుకోనన్నావట. మరి ఇప్పుడు కూడా నేను దిసమొలతోనే ఉన్నాను కదా. నన్ను ఇడిసిపెట్టేస్తావా ఏంటి”

“ఫో బావా, నువ్వలా అనబోకు, నాకు తెగ సిగ్గుగా ఉంది.”

ఇద్దరూ కిలకిలా నవ్వుకుంటూ ఒకరినొకరు సూసుకుంటూ అలా ముచ్చట్లు సెప్పుకుంటూంటే --

“నీకేదేనా కోరిక ఉంటే సెప్పు, తీర్సేస్తాను. ఆలి కోరిక తీరచనోడు మగాడే కాడు”

“నాకొక కోరిక ఉంది కానీ, సెపితే, నవ్వుతావేమో”

“లేదులే, సెప్పు”

“కొత్తగా పెళ్ళైన డబ్బున్నోళ్ళు గొప్పోళ్ళు అదేదో ‘అనీమూన్’ కి ఎల్తారు అంటారు కదా. మనం కూడా దానికి ‘ఇమానం’లో ఎల్లలన్నదే నా కోరిక" అని సిగ్గుపడ్డ లచ్చిమిని దగ్గరగా అదుముకుని -

“ఒక మాసం పోతే, మన పల్లెకి కూడా ఇమానం ఒస్తుందట. పది రోజులు పోతే, టికెట్లు ముందుగా అమ్ముతారట. అది ఎక్కడకెళ్తుందో ఇచారించి, నిన్ను తీసుకుపోయి నీ కోరిక తీర్సేస్తాను.”

“నువ్వెంత మంచోడివి బావా” అని రామిగాడిని హత్తుకున్న లచ్చిమి – “పెనిమిటంటే ఇలా ఉండాలి” అని ఇంకోతూరి బావని తన బాహువుల్లో బందీ సేసింది.

“బావోయి, ఇమానం ఎక్కడానికి బోలెడు జనం ఉంటారు కందా, అందుకే అది రాగానే లగెత్తుకెల్లి, మనం కూసుందికి నీ తుండుగుడ్డ పరిసీ. నేను మెల్లిగా ఎనకాతల ఎక్కేస్తాను.”

-3-

“ఓస్, అదెంత పని. పరుగు పందెంలో నన్ను మించిన మొనగాడేడీ ఈ సుట్టుపట్ల” అంటూ లచ్చిమిని దగ్గరగా తీసుకున్నాడు రామిగాడు.

జనాన్ని విమాన ప్రయాణానికి అలవాటు చేయాలన్న సదుద్దేశంతో –

తొలి రోజు ప్రయాణానికి కొన్నవారి టిక్కెట్లు లాటరీ తీయాగా వచ్చిన ఇద్దరికి, టిక్కెట్ల సొమ్ములో సగం వాపసు ఇస్తామని -- ప్రభుత్వం వారు నిర్ణయించేరు.

రామిగాడిని లచ్చిమిని అదృష్టం వరించి, వారి ఆనందాన్ని ద్విగుణీకృతం చేసింది.

విమానం బయలుదేరిన కొంతసేపటికి బండి తోసుకుంటూ వస్తూ, అందరితో పాటూ రామిగాడు లచ్చిమి దగ్గరకి వచ్చిన ఎయిర్ హోస్టెస్ -- "మీకేమేనా కావాలండీ" అని మర్యాదగా నెమ్మదిగా అడిగింది.

"ఏమే లచ్చిమి, చాయి తాగుదామా"

"అలాగే బావా"

"రొండు చాయి"

"రెండు వందలు - కాష్ ఇస్తారా, కార్డా"

"ఏటీ రొండు చాయి రొండొందలా! ఒద్దులే" ఆశ్చర్యం చికాకు కలగలిపేడు రామిగాడు.

అంతే ఆశ్చర్యంలో ఉన్న లచ్చిమి - "బావా, ఈళ్ళ ఏపారం సానా బాగుందే."

"సక్కగా సెప్పేవే"

"ఓ పని సేద్దాం. ఇమానం దిగినప్పుడు, ఆ బండి మనకి ఎంతకి అమ్ముతారో కనుక్కో. కొనేసుకుందాం. మన ఊరికి ఇమానం ఒచ్చినప్పుడల్లా, ఇద్దరం ఆ బండితో ఇమానంలో చాయి అమ్ముకొని, బోలెడు దుడ్లు లెక్కెట్టుకోవోచ్చు. అంతేకాక, ఇమానంలో తిరుగుడే తిరుగుడు." అని –

సలహా ఇచ్చిన లచ్చిమిని మెచ్చుకోలుగా సూసి ----

తన జుబ్బాలో ఉన్న దుడ్లు తీసి లెక్కెట్టసాగేడు రామిగాడు.

*********

మరిన్ని కథలు

Parikinee
పరికిణీ
- రాము కోలా దెందుకూరు
Atchi vachhina moorkhulul
అచ్చి వచ్చిన మూర్ఖులు
- డి.కె.చదువుల బాబు
Avakaram
అవకరం
- డి.కె.చదువుల బాబు
Nalugu prasnalu
నాలుగు ప్రశ్నలు .
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
Satpravarthana
సత్ప్రవర్తన
- చెన్నూరి సుదర్శన్
Chalicheemalu kaadu
చలిచీమలు కాదు
- జి.ఆర్.భాస్కర బాబు
Enta chettuki anta gaali
ఎంతచెట్టుకు అంత గాలి
- కాశీవిశ్వనాధం పట్రాయుడు
Mandakini
మందాకిని
- సడ్డా సుబ్బారెడ్డి