ప్రేమ (మి) కులం - వారణాసి భానుమూర్తి రావు

Prema(mi)kulam

" రాగి సంగటి సేసినా! అదే ఎత్తుకొని పో నాయనా! ఈ పొద్దుకి సర్దుకో! నా బంగారు తండ్రివి కదూ! " అంది నారాయణమ్మ మనవడిని దగ్గరకు తీసుకొని తల నిమురుతూ. " పోయే! రోజూ రాగి సంగటేనా! నా కవమానం ఏస్తా వుండాది. మా స్నేహితులంతా నెల్లూరి బియ్యమన్నం తెస్తారు. నాకేమో రోజూ రాగి సంగటి , పచ్చి పులుసు కలిపిస్తావు. నేను ఇస్కూలుకి పోను. పో ! " అని మారాం చేశాడు చంద్రం‌. వున్నగా ఒక్క మనమడు చంద్రం నాలుగు మైళ్ళ దూరంలో వున్న హైస్కూల్లో తొమ్మిదవ తరగతి చదువుకొంటున్నాడు. వున్న పల్లెలో ఐదవ తరగతి వరకు ఎలాగో ఒకలాగా చదివి ఆరవ తరగతి కి బయట వూర్లో ఉన్న హైస్కూల్లో చేరాడు.‌ " ఏమి సేస్తాము ? మన లాంటి పేదోళ్ళకి బియ్యం కొనే స్థోమత యాడ వుండాది ? కూలి నాలీ చేసుకొని బతికే వాళ్ళము మనం. బియ్యం కేజీ కొనాలంటే నాలుగు రూపాయలు. అంత కూలి నాకు యాడ , ఎవరు ఇస్తారు నాయనా! అందుకే నూకలు కొని సంగటి సేత్తా వుండా! " అని చీర కొంగుతో కళ్ళు తుడుచు కొనింది నారాయణమ్మ. " అవ్వా! ఏడ్వద్దే! నువ్వు ఏడిస్తే నాకు గూడా ఏడ్పు వస్తాది. నువ్వు సెప్పి నట్లే ఇంటాను. రాగి సంగటే టిఫిన్ బాక్సుకు కట్టు. అదే బలం గదా! " అని తొందరగా స్కూలుకు రెడీ అయినాడు చంద్రం. నాలుగు మైళ్ళ దూరంలో ఉన్న హైస్కూలుకు నడిచి పోవల్ల అంటే కనీసం ఒక గంటయినా పడుతుంది. తెల్లవారి ఎనిమిది గంటలకు టిఫిన్ బాక్స్ కట్టుకొని , భుజాన పుస్తకాల సంచీ తగిలించుకొని పరుగులాంటి నడకతో నడిస్తే తొమ్మిది గంటలకు హైస్కూలు చేరుతారు. పది గంటలకు ప్రార్థనకు అందరూ బయట నిలబడి ఉంటారు. చాలా మంది పిల్ల కాయలు ఇలా బయట పల్లెల నుండి వచ్చి చదువు కొంటున్నోళ్ళే! మళ్ళీ సాయంకాలం ఐదు గంటలకు స్కూల్ నుండి బయలు దేరితే ఏడు గంటలకు ఇల్లు చేరుతారు. " జాగరత్త నాయనా! అందులో వానా కాలము. ఆ ఏట్లో నీళ్ళు వచ్చినాయంట. ఏట్లోంచి నడిచి వచ్చేటప్పుడు సూసుకొని రాప్పా! లేదంటే సుట్టేసుకొని బిడ్జి మీద నడిసి రాండి " అంది నారాయణమ్మ. " సరే లేయే ! " చంద్రం వడివడిగా అడుగులు వేసుకొంటూ వెళ్ళిపొయ్యాడు. మనవడి వంకే తదేకంగా చూస్తూ అలాగే నిలుచుండి పోయింది నారాయణమ్మ. ****************************************** నారాయణమ్మ కు రెండు కళ్ళూ ఆ మనమడు చంద్రమే! వాడి కోసమే తను బ్రతుకుతోంది. వాడ్ని ఎలాగో ఒకలాగు బాగా చదివించి ఒక ఇంటి వాడ్ని చెయ్యాలనేదే నారాయణమ్మ తాపత్రయం. భగవంతుడు తన కుటుంబానికి చేసిన అన్యాయానికి తనెప్పుడూ బాధపడలేదు. ఇదంతా తను పూర్వ జన్మలో చేసుకొన్న కర్మ అని అనుకొని బాధ పడుతుంది. కష్టాలు పడి పడి తన శరీరం కృంగి కృశించి పోయింది. నడుము వంగి పోయింది. కళ్ళల్లో కన్నీళ్ళు ఇంకి పోయినాయి. అయినా తను చంద్రం కోసం ప్రాణాలు అదిమి పెట్టుకొని బ్రతుకుతోంది. ఉన్నగా నొక్క కొడుకును అల్లారు ముద్దుగా పెంచి పెద్ద చేసి ఒక మంచి సంబంధం వెతికి పెళ్ళి చేసింది. చంద్రం పుట్టాక ఇక తన భాధ్యతలన్నీ తీరినట్లే అని సంబర పడి పోయింది. అంత లోనే విధి తన కుటుంబాన్ని వెక్కిరించింది. పంచాయతీ ఎన్నికల్లో తన కొడుకు ఒక పార్టీ కోసం పని చేశాడని ప్రత్యర్థులు ఒక కన్ను వేశారు. మనకు పార్టీలు వద్దు , ఆ రాజకీయాలు వద్దురా నాయనా అంటే తన కొడుకు విన లేదు. ఒక రోజు తన కొడుకును సారాయి అంగడికి తీసుకెళ్ళి ముక్కుల వరకూ తాపించి , మాటా మాటా అనుకొని , వూరవతల ఉన్న చెరువు కాడికి తీసుకెళ్ళి తల నరికేసి నారు. ఈ దుర్వార్త విని తన కోడలు బాపనోళ్ళ బాయిలో పడి ప్రాణాలు తీసుకొంది. మూడేళ్ళ చంద్రాన్ని తన మీద వదిలేసి కొడుకు కోడలు వూర్లోని రాజ కీయాలకు బలి అయిపొయినారు. అనాధగా మిగిలిన చంద్రాన్ని నాయనమ్మ సంరక్షణా బాధ్యతలు చేబట్టింది. నారాయణమ్మ గుండె ధైర్యాన్ని వూర్లో వాళ్ళు అందరూ మెచ్చు కొంటారు. అప్పటి నుండీ అన్నీ తానే అయి రెక్కలు ముక్కలు చేసుకొని కూలీ నాలీ చేసుకొని వచ్చిన డబ్బులతో మనవడ్ని పోషించు కొంటూ వస్తోంది. రోజంతా పొలంలో పని చేస్తే ఇరవై రూపాయలు ఇస్తారు.‌ వితంతు పెన్షన్ క్రింద ఐదు వందల రూపాయలు వస్తోంది.‌ అలాగే బ్రతుకు బండిని ఈడుస్తోంది నారాయణమ్మ. **************************************** మనిషిగా పుట్టాక కష్టాలు కన్నీళ్ళు మామూలే! కానీ ఎప్పుడో వస్తాయి. వెడతాయి. అలాగే సుఖాలు వస్తాయి. వెడతాయి. కానీ కొందరి జీవితాల్లో కష్టాలు తప్ప సుఖం అనేది వుండదు. దానికి నారాయణమ్మ జీవితమే దృష్టాంతం. చంద్రాన్ని హైస్కూల్లో వూర్లో పెద్ద కులపోళ్ళతో సమానంగా చదివిస్తావున్నదని పల్లెలో కొందరికి కంటగింపుగా మారింది. రామి రెడ్డి , సునీత, గోపాల్ రెడ్డి , గణేష్ , నాగరాజు ,ప్రమీల , రేణుక అందరూ ఒక జట్టుగా వెళ్ళి చదువుకొంటారు. రామిరెడ్డి , గోపాల్ రెడ్డి , నాగరాజ్ , గణేష్ అందరూ పదవ తరగతి స్కూల్ ఫైనల్ కి వచ్చారు. సునీత , చంద్రం తొమ్మిదవ తరగతి చదువు కొంటున్నారు. మిగతా వారంతా ఆరు , ఏడు తరగతుల్లో చదువుతున్నారు. రామిరెడ్డి కి సునీత చెల్లెలు. అన్నా చెల్లెలు కలిసి స్కూలుకు వెడతారు. సునీత మీద ఈగ వాలినా సహించ లేడు రామిరెడ్డి. చంద్రానికి సునీత అంటే చాలా ఇష్టం. అలాగే సునీత గూడా చంద్రాన్ని చూడందే వుండ లేదు. చంద్రం అన్ని సబ్జెక్ట్స్ లో చురుగ్గా వుంటాడు. టీచర్లు చెప్పింది అలాగే గ్రహిస్తాడు. సునీతకు గూడా రాని సబ్జెక్టు ను నేర్పిస్తాడు చంద్రం. *************************************** స్కూల్ లంచ్ టైం లో అందరూ కలిసే భోంచేస్తారు. కానీ చంద్రం మటుకు వారితో కూర్చొని భోంచెయ్యడానికి సిగ్గు పడతాడు. దానికి కారణం తను తెచ్చుకొనే రాగి సంగటి గాదు. రామిరెడ్డి , గోపాల్ రెడ్డి కి చంద్రం తమతో కూర్చొని తినడం ససేమిరా గిట్టదు. చంద్రానిది తక్కువ కులం అని వారి అభిప్రాయం. కానీ సునీతకు చంద్రం అలా వేరుగా ఎక్కడో కూర్చొని తినడం అసలు ఇష్టం లేదు. ఒక రోజు చంద్రానికి ఇష్టమని చేపల పులుసు చేయించి తీసుకొని వచ్చింది. కానీ చంద్రం ఆమె తెచ్చిన చేపల పులుసు తినడానికి ఒప్పు కోలేదు. అదీ వాళ్ళన్నయ్యకు తెలిస్తే తనను చాకిరేవులో బట్టలు బండకు కొట్టినట్లు తనని కొడ్తారు. అసలు చంద్రం సునీత తో కలుపు గోలుగా ఉండడం వారికి ఇష్టం వుండదు. ఆ రోజు చంద్రం కోసం తెచ్చిన చేపల పులుసు పార బొయ్యడం గమనించాడు. ఆ రోజంతా సునీత అన్నం , తన కిష్ట మైన చేపల పులుసు తినలేదు. ఈ విషయం తెలిసీ చంద్రం చాలా బాధ పడ్డాడు. ****************************************** మనిషి పుట్టుకతో ఏ కులంలో పుడతాడో మనిషికి తెలీదు. ఏ మతంలో పుడతాడో గూడా తెలీదు. కుల మతాల అడ్డు గోడల్ని కట్టుకొని మనిషి సాటి మనిషి పట్ల హీనంగా ప్రవర్తిస్తాడు. పుట్టుకతో కులాన్ని అంటగట్టే ఈ సమాజం మనిషిని జీవితాంతం చిత్రహింసల పాలు చేస్తుంది. ఈ సమాజం కుల వ్యవస్థను పూర్తిగా నిర్మూలించి మానవత్వాన్ని చాటు కొన్నప్పుడే సమాజంలో అన్ని వర్గాలూ పరిడవిల్లుతాయి. దేవుడి దృష్టిలో అందరూ సమాన మైనప్పుడు , మనుషులు సృష్టించుకొన్న ఈ కుల మతాలు ఎందుకు ఇన్ని వైషమ్యాల విషాన్ని వెదజల్లి సమాజాన్ని అస్తవ్యస్తంగా మారుస్తోంది? చంద్రం వయసులో చిన్న వాడయినా ఈ సమాజాన్ని బాగా అర్థం చేసుకొన్నాడు. తన నాయనమ్మ కేవలం తక్కువ కులం అయినందువలన ఎన్ని అవమానాలు ఎదుర్కొన్నదో! ఆ సాయంకాలం ఎంత సేపయినా చంద్రం ఇంటికి రాలేదు. నారాయణమ్మ భయ పడుతూ వూరి పొలిమేర వరకూ మనవడి కోసం ఎదురు చూసింది. భయంతో ఏడుస్తూ చంద్రం గురించి పల్లె లోని వారిని అందరినీ అడిగింది. రాత్రి ఎనిమిది గంటల సమయంలో ఒళ్ళంతా చీరుకు పోయి , రక్త మోడుతూ ఇంటికి చేరుకొన్న మనమడ్ని చూసి బావురు మంది నారాయణమ్మ. " ఏమయింది నాయనా? ఎందుకు అట్లా వణికి పోతా వుండావు! ఎందీ రక్తం ? ఒళ్ళంతా దెబ్బలు ఏంది నాయనా! నా బంగారు తండ్రీ ! " అని గట్టిగా ఏడుస్తూ మనమడికి సపర్యలు చేసింది. గాయాల్ని శుభ్రంగా తుడుస్తూ తనకు తెలిసిన ఆకు పసరు నాటు వైద్యం చేసింది. " ఏమి కాలేదులే నాయనమ్మా! మామిడి కాయలు కోస్తామని చెట్టు ఎక్కి క్రింద పడి పొయినాను." అని అబద్ధం చెప్పాడు చంద్రం. ఆ రాత్రి తనకు తగిలిన దెబ్బలకు జ్వరం వచ్చింది చంద్రానికి.‌ నాలుగైదు రోజులు స్కూలుకు పోవడం మానేశాడు. *************************************** సునీత కోసం దెబ్బలు తిన్న చంద్రం మెల్లగా కోలు కోవడం మొదలు పెట్టాడు. సునీత చంద్రానికి బాగా దగ్గరవుతుందని చంద్రాన్ని నిలదీసి కొట్టాడు రామి రెడ్డి. " మా సెల్లెలు తో ఇక క్లాసులు , పాఠాలు అని తిరిగినావంటే ఎముకలు ఏరేస్తా! నీ కులం ఏందీ? మా కులం ఏందో నీకు తెలుసా? " అని భయ పెట్టాడు రామిరెడ్డి . చంద్రం నిజంగానే భయ పడి పొయ్యాడు. అప్పటి నుండి సునీతకు కనబడకుండా తిరిగాడు. *************************************** అది వర్షాకాలం. ఎడ తెరపి లేని వానలు కురుస్తున్నాయి. వాగులు , వంకలు , చెరువులు పొంగి పొర్లుతున్నాయి. ఎక్కడ చూసినా నీరే! తమ పల్లెకు , హైస్కూలు ఉన్న టౌన్ కి మధ్యన ఉన్న బాహుదా ఏరు పొంగి పొర్లుతోంది. మోకాలి లోతు నీటిలో పాదాల కింద అతి వేగంగా ఇసుక జారి పోతున్నది. బాహుదా ఏరు దాటుకొని పోతే పల్లెకు తొందరగా పోవచ్చు. అదే ఆ ఏటి కడ్డంగా కట్టిన కర కట్టి రోడ్డు మీద పోతే చాలా దూరం నడవాలి. అందుకే ఏటిని దాటుకొని నడవడానికే చాలా మంది ఒకరి చేతులు ఒకరు పట్టుకొని నడుస్తారు. నీటి ప్రవాహం తక్కువగా వున్న ఎత్తు పల్లాల్ని చూసుకొంటూ నడచి వెడతారు. ఆ సాయంకాలం దట్టమైన మేఘాలు ఆకాశం నిండా పులుము కొన్నాయి. స్కూలు టీచర్లు మూడు గంటలకే స్కూలు మూసేసారు. తొందరగా ఇంటికి వెళ్ళమని పిల్లలకు చెప్పినారు. చంద్రం వడి వడిగా అడుగులు వేసుకొంటూ పల్లెకు బయలు దేరినాడు. తనకు కొంచెం దూరంలో సునీత తమ అన్నలతో గుంపుగా వెడుతోంది. ఏటి మధ్యలో సునీత ఆగి పోయి నట్లుంది. మిగతా పిల్లలంతా వడివడిగా ఏటి గట్టు చేరు కొన్నారు. ఒక్క సారిగా వరద ప్రవహించింది. వచ్చే ప్రమాదాన్ని పసి గట్టాడు చంద్రం. పరుగులాంటి నడకతో సునీతను చేరుకొన్నాడు చంద్రం. తన బలాన్నంతా ఉపయోగించి సునీతను వీపు మీద ఎక్కించు కొని ఈత కొడుతూ అవతలి గట్టుకు చేర వేశాడు. ఇద్దరి పుస్తకాలు , బట్టలు బాగా తడచి పొయ్యాయి. ఈ హడా వుడిలో సునీత స్కూలు బాగు ఏటి మధ్యలో ఉన్న పెద్ద ఎత్తు బండ మీద వదిలేసింది. నీటి ప్రవాహం తగ్గు ముఖం పట్టి నట్లుంది. సునీత వద్దంటున్నా వినకుండా ఆ ఎత్తయిన బండ మీదకు ఏటికి అభిముఖంగా వెళ్ళి పుస్తకాల సంచీని పొదివి పట్టుకొని వీపు మీద తగిలించుకొని ఏటి లోకి దూకి గట్టు చేరడానికి ప్రయత్నించాడు. అంతే! నీటి ఉధృతి ఎక్కువయింది. ఇందాక తను చూసిన ఎత్తయిన బండ పూర్తిగా మునిగి పోయింది. వుప్పెనలా పొంగి పొర్లుతున్న ఆ నీటి ప్రవాహానికి ఎదురొడ్డి ఈత కొట్టడం తనకు చాత కావడం లేదు. తన శక్తినంతా వుపయోగించినా ప్రవాహానికి తల వంచక తప్పలేదు. అశక్తుడై రెండు చేతులూ పైకి ఎత్తేశాడు. గంగమ్మ తల్లి చంద్రాన్ని తనలో కలుపు కొంది. చంద్రం ప్రాణాలు క్షణాల్లో అనంత వాయువుల్లో కలిసి పొయ్యాయి. ****************************************

మరిన్ని కథలు

Parikinee
పరికిణీ
- రాము కోలా దెందుకూరు
Atchi vachhina moorkhulul
అచ్చి వచ్చిన మూర్ఖులు
- డి.కె.చదువుల బాబు
Avakaram
అవకరం
- డి.కె.చదువుల బాబు
Nalugu prasnalu
నాలుగు ప్రశ్నలు .
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
Satpravarthana
సత్ప్రవర్తన
- చెన్నూరి సుదర్శన్
Chalicheemalu kaadu
చలిచీమలు కాదు
- జి.ఆర్.భాస్కర బాబు
Enta chettuki anta gaali
ఎంతచెట్టుకు అంత గాలి
- కాశీవిశ్వనాధం పట్రాయుడు
Mandakini
మందాకిని
- సడ్డా సుబ్బారెడ్డి