తనఖా ఇల్లు - ఆపాసా

Tanakha Illu

ఆ యిద్దరమ్మాయిలు ఇచ్చిన ట్యూషన్ డబ్బులు జేబులో వేసుకుని, వారింటినుంచి బయటపడ్డాను.

మాయింటి ముఖం పట్టాను. ఆఫీసు టైమవుతోందని, గబగబ నడుస్తూ, అనుకున్నాను.

“ఇంకొద్ది రోజులు ఇలాగే సాగితే, దీపావళికి దొరికే బోనస్ డబ్బులతో కలిపి, తాతగారు కట్టించిన ఇల్లు, తనఖా నుంచి విడిపించేయవచ్చు. నాన్నగారికిష్టం లేకపోయినా, పెద్దక్క పెళ్ళి సమయంలో సమయానికి సరిపడా డబ్బులు లేక, ఆ కష్ట సమయంలో, ఆయిల్లు అతను ‘తనఖా పెట్టాల్సివచ్చింది. అది విడిపించలేకపోయాననే బెంగతోనే పోయారు పాపం!

చివరిక్షణాల్లో నాతో, “నాన్నా! నీకేమీ ఆస్తులు ఇవ్వలేకపోయాను. పైగా, నీ నెత్తిన నే చేసిన అప్పులు పడేసి, నా బాధ్యతలు నీ నెత్తిన రుద్దేసి వెళిపోతున్నాను!” అని చెప్పి, కుమిలిపోయారు.

అప్పట్నుంచీ, ఆ ఇల్లు విడిపించాలనే నా తాపత్రయం!

అందరు తమ్ముళ్ళు, చెల్లెళ్ళూ, సహకరిస్తున్నారు కాబట్టి; పొదుపుగా, గుట్టుగా సంసారం ఈడ్చుకొస్తున్నారు కాబట్టీ, ఇన్నాళ్ళకి బాగానే డబ్బు పోగయ్యింది. పైసా పైసా పిసినారిలా పోగు చేశాం. ఎప్పటికప్పుడు బ్యాంకు ఖాతాలో వేస్తూవచ్చాం. ఎంతమంది ఎన్ని రకాల అప్పు అడిగినా, ఇవ్వకుండా, జాగ్రత్తపడ్డాం.

మొన్నటికి మొన్న, ఆ షావుకారు కూడా ఆశ చూపించాడు. వేలకు వేలు, లక్షలకి లక్షలు బ్యాంకిలో వేసుకుంటే ఏమొస్తుంది! నాకిచ్చేయ్. నేను రొటేషన్­లో పెడతాను. నీకు బ్యాంక్ ఇంటరెస్ట్ కంటే రెండు శాతం ఎక్కువ వడ్డీ ఇస్తాను. నీకెప్పుడు కావాలంటే అప్పుడు, నీ సొమ్ము అణాపైసలతో సహా తిరిగిచ్చేస్తాను. ఆలోచించుకోమన్నాడు. అయినా ఆశపడి ఇవ్వలేదు!” అని ఆలోచిస్తూ, ఇంటికి చేరాను.

అలా నా ఆలోచనల్లో, ఇంటికి చేరేసరికి, పెద్దచెల్లి, నాతో, “అన్నయ్యా! ఇంకోవారంలో చిన్నచెల్లి పుట్టినరోజు!” అని, ‘ఏం చెయ్యమంటావ్?’ అన్నట్టు నావైపు చూసింది.

“అవునమ్మా! గుర్తుంది. అంతేకాదు, ఈ నెలలోనే, దసరా! అది కూడా గుర్తుంది.” అన్నాను. అని, నా జేబులోంచి ట్యూషన్ డబ్బులు తీసి ఆమె చేతికిస్తూ, “లోపల పెట్టు.” అన్నాను.

ఆమె, అవి అందుకుంటూ, “మన అలవాటు ప్రకారం పుట్టినరోజుకొక జత, పుట్టినరోజుకి దగ్గరలో ఏ పండుగ పడితే, ఆ పండక్కో జతే కదా, వాళ్లకి బట్టలు కొనేది. అందుకని అడిగాను. పైగా ఇప్పుడున్నవన్నీ పొట్టయిపోయాయి. ఎదిగే వయసు కదా!” అంది.

“సరే! సాయంత్రం నేను ఆఫీసునుంచి అటే పార్ట్ టైం జాబ్­కి వెళిపోవాలి. పని ఎక్కువగావుంది. నువ్వే బజారుకి వెళ్ళి, చిన్నచెల్లికి రెండు జతల బట్టలు తీసుకో. ఒకటి పుట్టినరోజు కోసం, మరొకటి దసరాకి.

ఈ దీపావళికి వచ్చే బోనస్ ఎమౌంట్­తో, మనం ఇప్పటివరకు కూడవేసిన డబ్బులతో, మన ఇంటిని తనఖా నుండి విడిపించేయవచ్చు. అప్పుడు ఇంటిల్లిపాదికీ, సంక్రాంతికి బట్టలు తీసుకోవచ్చు.” అని చెప్పాను ఆనందంగా.

అప్పుడే చిన్న తమ్ముడు కూరల సంచీతో ఇంట్లోకి వచ్చాడు.

నాతో, ఫిర్యాదు చేశాడు. “చూడన్నయ్యా! ఎదురింటి వాళ్ళబ్బాయి, వెటకారంగా, నాతో, ‘అయిపోయిందా, తోటకూర, బంగాళాదుంపలు కొనడం! అవేగా ఇవాళ బజార్లో చౌకగా అమ్ముతున్నవి!’ అని అన్నాడు నన్ను చూసి.”

“పోనీలేరా! అందులో అబద్ధమేముంది! నిజమే కదా! అలా ఉడుక్కోకు.” అన్నాను.

“అది కాదన్నయ్యా! చిన్నన్న, ఏ వస్తువు కావాలన్నా, కష్టపడి సైకిలు తొక్కుకుని పెద్ద బజారుకి వెళ్ళి హోల్­సేల్ మార్కెట్ నుంచి తెస్తాడు. అలా మనందరం ఎవరికి తోచిన విధంలో వాళ్ళం పొదుపు చేస్తాం. కానీ, ఆ ఎదిరింటబ్బాయి, నేను, నువ్వూ, మనింట్లోవాళ్ళంతా పీనాసివాళ్ళమని అంటాడు. ‘అంతలా చెమటలు కక్కుకుని, కడుపు కాల్చుకుని, నిద్ర మానుకుని, ఆదా చేసి చచ్చేదెంత! ఎవరికోసం!’ అంటాడు.”

అప్పుడు నేను, “పోనీలేరా! ఎవరి ఆలోచనాసరళి వారిది. వాళ్ళు చేసే ఖర్చు, మనకి దూబరా అనిపించట్లా! అలాగే, వాడికి మనం చేసే పొదుపు, పిసినారితనంలా కనిపిస్తోంది. ఎవరి దృష్టికోణం వారిది. వాడంతట వాడికే ఏది కరక్టో, నెమ్మదిగా తెలుస్తుందిలే. వదిలేయ్! వాడి మాటలు పట్టించుకోకు.” అన్నాను.

ఇంతలో, పెద్ద తమ్ముడు, “అన్నయ్యా, ఆ షావుకారు, డబ్బులు వడ్డీకి తిప్పడం గురించి, నీకోసారి గుర్తుచెయ్యమన్నాడు." అని చెప్పాడు.

నేను, “వద్దురా! మనకా పాపపు సొమ్ము వద్దు! అయినా, మన డబ్బులు మన దగ్గరే ఉంటే, ఎప్పుడు కావాలంటే అప్పుడు అక్కరకి వస్తాయి. మనకి అవసరమున్నప్పుడు, మన డబ్బులే అయినా, మనదగ్గర లేకుండా మరొకరి దగ్గర ఉంటే, ప్రయోజనం ఉండదు. మన సొమ్ముకోసం మనమే దేవులాడాల్సొస్తుంది. ఇవన్నీ వాడికి చెప్పక్కర్లేదు. ఈసారి అటు వెళ్ళినప్పుడు, వాడితో సింపుల్­గా, ‘వడ్డీకి తిప్పడం, మా అన్నయ్యకిష్టం లేదన్నాడు.’ అని చెప్పేయ్!” అన్నాను.

--: oo(O)oo :--

రాత్రి 11:30 అయింది. అప్పుడే పార్ట్ టైం జాబ్ నుంచి ఇంటికి వచ్చాను.

అంతలోనే, గాభరాగా ఎదురింటబ్బాయి పరుగెత్తుకుని వచ్చాడు.

“భయ్యా! భయ్యా! నాన్నగారికేదో అయిపోతోంది! ఒళ్ళంతా చెమటలు కారిపోతున్నాయి.” అన్నాడు.

నాకనుమానం వేసింది. ‘హార్ట్ ఎటాక్’ ఏమో! అని.

వెంటనే, మా చిన్నతమ్ముడికి ఏ ఆటో కనిపిస్తే, ఆ ఆటోని ‘ఎమర్జన్సీ అని చెప్పి తీసుకురమ్మన్నాను. దగ్గరలోవున్న ఆసుపత్రికి వెళ్ళాలని చెప్పమన్నాను.

నేను, మా పెద్దతమ్ముడు, ఆ అబ్బాయితోపాటు, ఎదిరింటికి పరుగెత్తాం.

అప్పటికే ఎదురింటావిడ తువ్వాలు పెట్టి, వాళ్ళాయన­ ఒళ్ళు తుడుస్తోంది. అతనికి నిలువు నిపాదం ధారలా అభిషేకం చేస్తున్నట్టు చెమటలు కారిపోతున్నాయి.

వెంటనే, నేను మా పెద్దతమ్ముణ్ణి, ఎదురింటి అబ్బాయిని, దగ్గరలోవున్న ఆసుపత్రికి వెళ్ళి ‘కాజ్యువాల్టీ’కి సిద్ధం చెయ్యమన్నాను.

ఆవిడకీ, అతనికీ, గాభరాపడొద్దని ప్రశాంతంగా ఉండమని చెప్పాను. “మా చిన్నతమ్ముడు, ఆటో తేడానికి వెళ్ళాడు. ఏ క్షణాన్నయినా వచ్చేస్తాడు. ఆసుపత్రికి వెళ్దాం.” అని ధైర్యం చెప్పాను.

ఇంతలోనే, ఆటో వచ్చింది.

--: oo(O)oo :--

తెలతెలవారుతుండగా, మేము అన్నదమ్ములిద్దరం ఇంటికి తిరిగొచ్చాం.

అప్పుడు మాయింట్లో, మేము ఐదుగురం చర్చించుకున్నాం.

మా పెద్దతమ్ముడు, “ప్రస్తుతానికి ఎడ్మిట్ చెయ్యటానికీ, ప్రాథమిక చికిత్సకీ, సరిపడా ఆసుపత్రి వాళ్ళకి డిపాజిట్ చెయ్యటానికి వాళ్ళ దగ్గరున్న డబ్బులు సరిపోయాయి. ‘హార్ట్ ఎటాకే!’ సమయానికి చేర్చాం అని తేలింది. అబ్జర్వేషన్­లోవున్నారు. ‘ఐ.సి.యు.’ లో ఉంచారు.

ఒకవేళ, ఆపరేషన్ చెయ్యాల్సొస్తే మాత్రం, ఎక్కువ డబ్బులే కట్టవలసి వస్తుంది. అప్పుడెలాగా?” అని చర్చ మొదలెట్టాడు.

మా చిన్నతమ్ముడు, “మనకేం బాధ మధ్యలో! వాళ్ళే పడతారు, ఆ తిప్పలేవో!” అన్నాడు.

మా పెద్దచెల్లి, “ఇన్స్యూరెన్సులూ అవీ లేవా! కంపెనీవాళ్ళేం సాయం చెయ్యరా!” అనడిగింది.

చిన్నచెల్లి, మేమందరం మాట్లాడుతున్నవి వింటోంది.

అప్పుడు నేను, “ఇన్స్యూరెన్సేం లేదు కానీ కంపెనీ మెడికల్ స్కీంలో కవరేజ్ ఉంది. ఇప్పుడేం ఆర్థికంగా సహాయం చెయ్యరు. అయితే, ఆ తరవాత బిల్లులన్నీ పెట్టుకుంటే, ఎప్పటికో హెడ్ ఆఫీస్ నుంచి శాంక్షన్ అయాక, వాళ్ళు, వాళ్ళ రూల్స్ ప్రకారం ఎంత రీయింబర్స్ చెయ్యగలరో, అంత రీయింబర్స్ చేస్తారు. అవన్నీ టైం టేకింగ్. ఇప్పుడు మాత్రం పేషంట్ చేతినుండి పెట్టుకోవలసిందే.” అని వివరించాను.

మా పెద్దతమ్ముడు, “అంటే, వాళ్ళకి ఈ సమయంలో మనం తప్ప ఆదుకునేవాళ్ళు లేరా?” అనడిగాడు.

“కంపెనీ వాళ్ళని, వాళ్ళబ్బాయి ఎప్రోచ్ అయితే, ఏదైనా కొంత సొమ్ము, ‘ఎమర్జన్సీ లోన్ క్రింద దొరకొచ్చు. అయినా, అది చాలదు. ఇంకా ఎక్కువ డబ్బులే కావల్సొస్తాయి.”

మా చిన్నతమ్ముడు, “మనమేమో ఇన్నాళ్ళూ పీనాసివాళ్ళలాగా కష్టపడి కూడేసుకున్నాం. తీరా ఇప్పుడింక నేడో రేపో ఇల్లు విడిపించేస్తాం అనుకుంటుంటే, వీళ్ళకోసం ఆ డబ్బులేం మనం ఖర్చు పెట్టేయెద్దు! ఆ డబ్బులు ముట్టుకోడానికి నేనొప్పుకోను.” అన్నాడు కర్కశంగా.

అందరూ ఆలోచనలో పడ్డారు.

చిన్న చెల్లి దిక్కులు చూస్తోంది.

--: oo(O)oo :--

వారం రోజుల తరవాత ఎదురింటతనికి నయమయి ఆసుపత్రినుంచి ఇంటికి తిరిగివచ్చారు.

అప్పుడు ఎదిరింటావిడ నాతో, “నీకెలా కృతజ్ఞతలు చెప్పాలో తెలీటం లేదు! చిన్నవాడివైనా, సమయానికి సమయానికి వచ్చి దేముడిలా ఆదుకున్నావ్. అతన్నీ, అతనితో పాటు మమ్మల్నీ కాపాడావ్!” అనేసరికి;

అతను, “సమయానికి, చేతిలో చిల్లిగవ్వ లేదు. బ్యాంక్ ఖాతాలో కూడా అంతంతమాత్రమే ఎలాగరా దేముడా!” అని దిక్కుతోచక ఉన్నాను.

పైసా పైసా పొదుపు చేస్తూ, మీరంతా మీయిల్లు విడిపించాలని తాపత్రయపడుతున్నారని నాకు తెలుసు!

అలాటప్పుడు అన్నీ తెలిసిన నేనే, మిమ్మల్ని ఏ విధంగా సాయం చెయ్యమని అడగ్గలను!” అన్నాడు కుంచించుకుపోతూ.

అప్పుడు వాళ్ళబ్బాయి,

“భయ్యా! బుద్ధొచ్చింది భయ్యా! ఇన్నాళ్ళూ డాడీ సంపాదిస్తుంటే, బలాదూర్­లా ఖర్చు చేస్తూ, నిర్లక్ష్యంగా ప్రవర్తించాను. మీ గురించి చాలా చులకనగా భావించాను. సమయానికి మీరే కాని ఆదుకోకపోయుంటే, మీరు మీయిల్లు విడిపించడానికని దాచుకున్న డబ్బంతా ఆసుపత్రిలో కట్టకపోయుంటే, ఏమయివుండేదో తలచుకుంటుంటేనే భయమేస్తోంది!” అన్నాడు వణకుతున్న కంఠంతో.

అప్పుడు నేను మనసులోనే, మా పెద్దచెల్లికి కృతజ్ఞతలు చెప్పుకున్నాను! ఆమే కాని ఆరోజు మా అందరికీ అర్థమయేలా, “అలాక్కాదు. కంపెనీ ఇచ్చే లోన్ కాక, అతని ఆపరేషన్­కి కావలసిన మిగిలిన డబ్బు, ఎంత కావాలన్నా, మనం ఇద్దాం! ఇల్లుకేముంది! ఇప్పుడు కాకపోతే, తరవాతయినా విడిపించుకోవచ్చు! కానీ, ప్రాణం! అది విలువైనది! అమూల్యమైనది! అది కానీ పోతే, ఎంత డబ్బు ఖర్చుపెట్టినా తిరిగి రాదు! అందుచేత, అది ఎవరిదైనా, నాదయినా! వేరొకరిదైనా! సమయముండగానే కాపాడుకోవడం ముఖ్యం! డబ్బుకేముంది! ఈరోజు మన దగ్గరుంది. రేపు వాళ్ళదగ్గరుంటుంది! అవసరానికి పనికిరాని డబ్బు ఎవరిదగ్గర ఎంతుంటేనేంటి! దండగ! దానికి విలువే లేదు!” అని చెప్పకపోయుంటే, ఈ సహాయం చెయ్యగలిగివుండే వాళ్ళం కాదు! అనుకున్నాను.

అప్పుడు తిరిగి ఎదురింటబ్బాయి, “ఇకమీదట మాయింట్లో వినోదాలు, విహారాలు బంద్! దూబరా ఖర్చులు బంద్! మేమంతా, మీలాగే పొదుపుగా ఉండి, త్వరలోనే మీ బాకీ తీర్చేస్తాం!” అన్నాడు.

ఎదురింటతను, వాళ్ళావిడ కూడా అవునన్నట్టు తలలూపారు.

నేను, “ఆ తరవాతో!” అన్నాను, నవ్వేస్తూ.

ఆ అబ్బాయి కూడా నవ్వేస్తూ, “ఇప్పుడు బుద్ధొచ్చిందిగా; ఆ తరవాత గూడా, పొదుపుగానే ఉంటాం.” అన్నాడు.

--: oo(O)oo :--

ఎదురింటి వాళ్ళు ఇంకా మా అప్పు తీర్చలేదు.

వారి పొదుపు ఉద్యమం సాగుతోంది.

మా పొదుపు ఉద్యమం కూడా ఎప్పటిలాగే సాగుతూనేవుంది.

త్వరలోనే ఇల్లు విడిపించేస్తామని నమ్మకంగా ఉంది.

--: oo(O)oo :--

మరిన్ని కథలు

Amma krupa
అమ్మ కృప
- చలసాని పునీత్ సాయి
Vikatakavi vinta padyaalu
వికటకవి - వింతపద్యాలు.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
Kaalani kaagitam
కాలని కాగితం.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
Gnana tatwam
జ్ఞానతత్వం
- - బోగా పురుషోత్తం, తుంబూరు.
Garudayya bharya
గరుడయ్య భార్య
- నారంశెట్టి ఉమామహేశ్వరరావు