"బాస్ టూరునుండి గంట క్రితమే వచ్చాడుట . ఇక్కడేదో కొంప ములిగిపోయినట్టు ఇంకో అరగంటలో ఆఫీసుకు వచ్చేస్తున్నట్టు ఫోన్ చేసి చెప్పాడు . ఇక మీరు అటెన్షన్ లో ఉండండి సుబ్రమణ్యం గారు . రాగానే మిమ్మల్ని వంద ప్రశ్నలు అడుగుతాడు " అన్నాడు రమేష్ సుబ్రమణ్యంను కంగారు పెడుతూ.
"అవును సుబ్రమణ్యం గారు . ఈ నాలుగు రోజులు జాలీగా గడిపేసాం. ఆయన మామూలుగానే ఆఫీసులోకి వస్తున్నాడు అంటే మీకు ఒక పులినో, సింహాన్నో చూసినట్టుంది. లకీగా మాకు అటువంటి ఇబ్బందులు ఆయనతో లేవులెండి. " అన్నాడు స్టాఫ్ కామేశ్వర రావు వెకిలిగా నవ్వుతూ. .
కామేశ్వర రావు ఆఫీసులో ఏ పనీ లేకుండా చీటీలు వేసుకుంటూ అన్ని డిపార్ట్మెంట్లు తిరిగేస్తూ ఉంటాడు. బాస్ ప్రత్యేకంగా అతనికి ఏ పనీ చెప్పడు కనుక బాస్ అంటే అతనికి భయం లేదు. పైకి మాత్రం తను కూడా భయభక్తులు ఉన్నట్టు నటిస్తాడు అంతే. బాస్ వాసన్ కూడా ఒకసారి చీటీ వేసి లక్ష రూపాయలు ఎత్తాడు. నెలా నెలా వాయిదాలు కట్టే విషయంలో బాసును కామేశ్వర రావు అంతగా బలవంతం చేయడు . అందుకే ఒకరి మీద ఒకరికి పరస్పర గౌరవం.
అన్నట్టుగానే బళ్ళున తలుపు తెరుచుకుంటూ లోపలికి వచ్చేశాడు వాసన్.
స్టాఫ్ అంతా లేచి నిలబడ్డారు.
"మిస్టర్. మణ్యం ఒకసారి లోపలికి రండి " అంటూ తన క్యాబిన్ లోపలికి వెళ్ళి సుబ్రమణ్యాన్ని పిలిచాడు. ఆ స్వరంలో తీవ్రత చోటుచేసుకుంది. .
" వస్తున్నాను సార్. అంటూ మాస్టర్ ఫైల్ తీసుకుని లోపలికి పరిగెట్టాడు సుబ్రమణ్యం బరువుగా ఊపిరి బిగపెడుతూ.
" అసలు అలా ఎలా జరిగింది ? మీ మీద ఆఫీసు వదిలేసి వెళ్తే అంతేనన్నమాట. త్వరలో మీకు ప్రమోషన్ రావడం కోసం మన హెడ్డాఫీసు వాళ్ళకు కూడా రికమెండ్ చెయ్యడం నా బుద్ది పొరపాటు అయిపోయింది. . పని విషయంలో మీరు ఇంత నిర్లక్ష్యంగా ఉంటారని నేను అనుకోలేదు. మీ వల్ల కంపినీకి రావలసిన నాలుగు లక్షల రూపాయలు ఆగిపోయాయి. కష్టమర్ కు కావల్సిన స్పెసిఫికేషన్ ప్రకారం మెటీరియల్ తయారు చెయ్యడంలో పెద్ద తప్పు జరిగింది. ఆ సరుకు వాళ్ళు తీసుకోవడం లేదు. దాని వాల్యూ కూడా ఇవ్వకుండా ఆపేశారు. . ఇప్పుడు ఈ నష్టం ఎవరు భరించాలి ? ఈ విషయంలో నేను మన మేనేజ్మెంట్ కు ఎంత నచ్చ చెప్పినా వాళ్ళు వినరు. మరి దీని గురించి ఏదో ఒకటి డిల్లీ ఆఫీసుకు చెప్పాలి. ఇది ఉద్యోగాలకే ముప్పు వచ్చే విషయం మరి. " అన్నాడు వాసన్ సుబ్రమణ్యానికి మరింత చెమటలు పట్టిస్తూ.
సామాన్యంగా ఆ డిపార్ట్మెంట్లో ప్రొడక్షన్ ప్రోగ్రామ్ తయారు చేసేటప్పుడు దానిమీద ఫైనల్గా వాసన్ సంతకం పెట్టాకనే అది ప్రొడక్షన్ వరకు వెళ్తుంది. వాసన్ అనుకోకుండా టూరులో వెళ్ళడం వల్ల ఆ ప్రోగ్రామ్ మీద ఆయన తర్వాత ఇన్చార్జ్ సుబ్రమణ్యం సంతకం పెట్టాల్సి వచ్చింది. దాన్ని ఎవరూ క్రాస్ చెక్ చేయకపోవడం హడావిడిగా చూసుకోకుండా సుబ్రమణ్యం సంతకం పెట్టడం జరిగిపోయింది. ప్రొడక్షన్ వాళ్ళకు ఈ విషయం తెల్సినా కావాలనే చెప్పలేదు.
" ఈ విషయంలో నేను బాధ్యత తీసుకోలేను సుబ్రమణ్యం గారు. అదేదో మీరే మేనేజ్మెంట్ తో మాట్లాడి సమస్యను పెద్దది కాకుండా చూసుకోండి " అంటూ ఫైళ్ళు చూసుకోవడంలో మునిగిపోయాడు. ఈ తప్పు తన హయాంలో జరగనందుకు ఆయన హాయిగా ఊపిరి పీల్చుకున్నాడు .
సుబ్రమణ్యం అపరాధిలా వాసన్ ముందు చేష్టలుడికి నిలబడి పోయాడు.
" హు. చెప్పండి సుబ్రమణ్యం. ఏం చెప్పాలని అనుకుంటున్నారు. జరిగింది వెయ్యి, రెండు వేలు కాదు నాలుగు లక్షలు . మీరే పార్టీకి ఫోన్ చేసి పొరపాటు జరిగింది అని చెప్పి ఈ సారికి ఆ సామాను ఎలాగో వాడుకోమని ప్రాధేయపడి బిల్ అమౌంట్ కట్టెయ్యమని చెప్పండి. ఇంకా ఈ విషయం సీరియస్ అయ్యే అంతవరకు ఆగొద్దు." అన్నాడు వాసన్ తనకు ఏమీ పట్టనట్టుగా బయటకు వెళ్లబోతూ .
" సారీ సార్ . పెద్ద పొరపాటు జరిగిపోయింది. కంప్యూటర్ ఆపరేటర్ కూడా చూసుకోలేదు. . అర్జెంట్గా సరుకు పంపించాలని పార్టీ నుండి ఫోన్ వస్తే అప్పటికప్పుడు ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చింది. . సమయానికి మీరు కూడా లేరు. ఈ సారికి నా పొరపాటు మన్నించి ఆ పార్టీ వాళ్ళతో మాట్లాడి ఈ గండం నుండి బయట పడేయ్యండి సార్ . జీవితాంతం మీకు ఋణపడి ఉంటాను " అని వాసన్ రెండు చేతులు పట్టుకుని బ్రతిమాలాడు సుబ్రమణ్యం. .
" ఏం మాట్లాడుతున్నారు మీరు ? మిమ్మల్ని నేను సంజాయిషీ అడగడం లేదు. జరిగింది చిన్న తప్పా ? నష్టం నాలుగు లక్షలయ్యా బాబూ ? ఈ మెటీరియల్ దేనికి ఉపయోగిస్తారో మీకు తెలుసా ? బ్యాటరీలు తయారు చెయ్యడానికి . మీరు పంపిన సరుకు వాడితే మొత్తం బ్యాటరీలు అన్నీ డిశ్చార్జ్ అయిపోతాయి. . వాళ్ళ మార్కెట్ అంతా పడిపోయి వాళ్ళకు చెడ్డ పేరు వచ్చేస్తుంది. వాళ్ళకు చెడ్డ పేరు వస్తే మన కంపినీకి వచ్చినట్టే కదా. సారీ సుబ్రమణ్యం. నేను మాత్రం ఈ విషయంలో ఏమి చేయలేను. " అన్నాడు వాసన్ . అతని ముఖం కఠినత్వంగా మారింది ఆ సమయంలో .
సుబ్రమణ్యం ఎటూ ఆలోచించుకోలేని పరిస్తితిలో అచేతనుడై చాలా సేపు నిలబడి పోయాడు. బాసు కొరకరాని కొయ్య. ఆయన మనసు కరిగేటట్టుగా లేదు. ఆ డిపార్ట్మెంట్ లో రాత్రింపగళ్ళు పనిచేసినందుకు తనకీ శిక్ష తప్పదు. . అంతా తన దురధృష్టం.
రాత్రి ఎంతసేపైనా నిద్ర పట్టలేదు. మనసంతా కకావికలంగా ఉంది.ఎలాగైనా నెత్తి మీద నుండి ఈ బరువును దించుకోవాలి. ఇక బాస్ ను నమ్ముకోవడం దండగ. ఏదో విధంగా పార్టీని వేడుకుని ఆ సరుకు వాడుకోమని చెప్పాలి. లేకపోతే తన ఉద్యోగం పోవడమే కాకుండా సరైన మెటీరియల్ పంపనందుకు మొత్తం డబ్బు తనని కట్టమని అన్నా కూడా ఆశ్చర్యం లేదు. .
ఉదయాన ఆఫీసుకు వస్తూనే జీవన్ అండ్ కంపినీ ప్రొప్రయిటర్ రాజాసింగ్ కు ఫోన్ చేశాడు మనసులో చెలరేగుతున్న అలజడిని బలవంతాన అణిచిపెడుతూ.
" సారీ సుబ్రమణ్యం గారు ? ఆ రాంగ్ మెటీరియల్ తీసుకుని నేనేం చేసుకోవాలి ? వేరే దానికి కూడా ఉపయోగించుకోవడానికి పనికి రాదు. పైగా ఇంకో నాలుగు రోజుల్లో నేను వాళ్ళకు బ్యాటరీలు సప్లయ్ చెయ్యాలి. చేయలేక పోతే మా కంపినీని వాళ్ళు బ్లాక్ లిస్టులో పెడతారు. ఇప్పటికిప్పుడు నాకు వేరే కంపినీ వాళ్ళు కూడా సరుకు సప్లయ్ చేయలేరు. మళ్ళీ మేము నిలదొక్కువడానికి చాలా సమయం పడుతుంది. . నేను ఈ సరుక్కి ఒక్క రూపాయి కూడా పంపించలేను. ఇంకో రెండు రోజుల్లో మీ సామాను మీకు రిటర్న్ వచ్చేస్తుంది. దానికి ట్రాన్స్పోర్ట్ చార్జెస్ మీ కంపినీనే భరించాలి " అంటూ ఖరాఖండిగా చెప్పేశాడు రాజాసింగ్. .
ఏదో రకంగా రాజాసింగ్ ను కన్విన్స్ చేయాలి అనుకున్న సుబ్రమణ్యానికి ఆ అవకాశం కూడా పోయింది. ఉద్యోగం పోతే వేరే ఉద్యోగం వెతుక్కోవచ్చు. రిటర్న్ వచ్చే మెటీరియల్ ఇంకా ఎందుకూ పనికిరాదు. దానికి వచ్చే నష్టం తన మీదే పడుతుంది ? అందులో ఒక్క వంతు కూడా తను భరించే శక్తి లేదు . అతని మైండ్ అంతా అల్లకల్లోలంగా ఉంది. కొన్నాళ్లుగా బాస్ వాసన్ తనతో సరిగ్గా ఉండటం లేదు. ఇప్పుడు ఈ రాంగ్ సప్లయ్ విషయంలో ఆయన తల్చుకుంటే వెంటనే పని అయిపోతుంది. ఆయన చేసిన తప్పులకు ఎన్నో సార్లు అవతల కస్టమర్లను ఒప్పించిన సందర్భాలు ఉన్నాయి. ఎందుకో తన విషయంలో మాత్రం గట్టి పట్టు పట్టాడు.
అప్పటికే కొన్నాళ్లుగా సుబ్రమణ్యం విపరీతమైన తలనొప్పితో బాధపడుతున్నా తన ఉద్యోగ ధర్మంలో ఎవరికీ ఎటువంటి ఇబ్బందిని కలిగించక ముందుకు వెళ్లిపోతున్నాడు. ఇప్పుడు కొత్తగా వచ్చిన సమస్యతో అతను పూర్తి నెర్వస్ అయిపోయాడు. నిలబడిన చోట కాళ్ళు తిమ్మిరెక్కిపోతున్నాయి. చాలా సార్లు కింద పడబోయి తమాయించుకునే వాడు. అతని పరిస్తితి చూసి పక్క డిపార్ట్మెంట్ అతను ఒకరు తనకు తెలిసిన ఆసుపత్రికి తీసుకెళ్ళాడు. .
డాక్టర్ అన్ని పరీక్షలు చేశాక " మీకు వచ్చినది న్యూరో సమస్య అని అర్ధం అవుతోంది. . ఇది విపరీతమైన టెన్షన్, పనిలో ప్రెషర్ ఎక్కువవడం వల్ల నెర్వస్ సిస్టమ్ బలహీనమయ్యి శరీరంలో ఏ అవయవమైనా దెబ్బతినే అవకాశం ఉంటుంది. . దీనికి సరైన వైద్యం జరగకపోతే ఫిట్స్ లోకి కూడా దారితీసే పరిస్తితులు ఎక్కువ. ఇక్కడ మాకున్న టెక్నాలజీ ప్రకారం నా దగ్గర ట్రీట్మెంట్ దొరకదు. . మీరు వెంటనే సిటీలో ఏదైనా సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిలో చూపించండి. ఆలస్యం చేయకండి. " అని ఆ డాక్టర్ చేతులెత్తేశాడు.
"నా ఆరోగ్య రీత్యా నాకు వారం రోజులు సెలవు కావాలి. నేను వెంటనే హైదరాబాద్ వెళ్లి ఎవరినైనా న్యూరాలజిస్ట్ ను కలవమని ఇక్కడ లోకల్ డాక్టర్ చెప్పారు . ఈ వారం రోజులు నేను ఎటువంటి ప్రెషర్ తీసుకోలేను. నన్ను మన్నించండి " అంటూ లీవ్ లెటర్ వ్రాసి వాసన్ టేబుల్ మీద ఉంచాడు సుబ్రమణ్యం అసంకల్పితంగా రెండు చేతులు జోడించి నమస్కారం చేస్తూ.
వాసన్ సుబ్రమణ్యం లీవ్ లెటర్ పక్కన పారేస్తూ " అసలు మీకేమేనా అర్ధమవుతోందా ? కాస్త బుర్ర పెట్టుకుని ఆలోచించండి. ఒక పక్క మీరు చేసిన పొరపాటుకు మీ సీటుకే ప్రమాదం వచ్చే పరిస్తితులు ఉన్నాయి అని నేను మొత్తుకుంటూ ఉంటే సెలవు కావాలని ఏ మొహంతో అడుగుతున్నారు ? ఇప్పటికే మీ విషయం హెడ్ ఆఫీసు వరకు వెళ్లిపోయింది. మీకు సెలవు గ్రాంట్ చేస్తే ముందు నా ఉద్యోగం పోతుంది . జరిగిన ప్రమాదాన్ని చక్కబెట్టే అంతవరకు ఇక్కడ నుండి కదలడానికి వీల్లేదు " అంటూ విచక్షణారహితంగా మాట్లాడాడు వాసన్.
మధ్యాన్నం లంచ్ కని ఇంటికి వెళ్లిన సుబ్రమణ్యం అటునుండి అటే హైదరాబాద్ ట్రైన్ ఎక్కేశాడు. ఇప్పుడు అతనికి బాస్ బెదిరింపులు, కస్టమర్కి జరిగిన నష్టం గురించి గుర్తు రావడం లేదు. ముందు తన ఆరోగ్యం గురించే అతనికి బెంగ పట్టుకుంది. ఇప్పుడు తనకు ఏమైనా అయ్యిందంటే తన భార్య, పిల్లలు అనాధలైపోతారు.
డాక్టర్లు స్కాన్నింగ్ చేసి సుబ్రమణ్యం మెదడులో నీరు చేరిందని చాలా రోజులుగా ఈ సమస్యను పట్టించుకోకపోవడం వల్ల అది ఒక పెద్ద కణితిగా ఏర్పడిందని దానివల్ల ఇతర దుష్పరిణామాలు కలగక ముందే ఆపరేషన్ చేసి కణితిని తొలగించాలని చెప్పడంతో దగ్గర బంధువులు అతన్ని ఆసుపత్రిలో చేర్చారు. సుబ్రమణ్యం ప్రమాద పరిస్తితిలో ఆసుపత్రిలో ఉన్నాడని ఆ కంపినీలో అందరికీ తెలిసిపోయింది.
ఒక వారం రోజుల తర్వాత సంగతి . తనని చూడటానికి ఎవరో వచ్చారని చెపితే కళ్ళు తెరిచి చూశాడు సుబ్రమణ్యం. ఎదురుగా జీవన్ అండ్ కంపినీ ప్రొప్రయిటర్ రాజాసింగ్. అతన్ని చూడగానే సుబ్రమణ్యంలో వణుకు ప్రారంభమయ్యింది. రెండు చేతులు జోడించాడు అప్రయత్నంగా. కళ్లనుండి కన్నీళ్లు కారిపోతున్నాయి.
"సుబ్రమణ్యం గారు . మీరేమీ కంగారు పడకండి. నేను మిమ్మల్ని బాధపెట్టడానికి రాలేదు. మీ సమస్య ఇంత తీవ్రమవుతుందని నేను ఊహించలేదు. మీ విషయంలో మొదట నేను కొద్దిగా కరటుగా వ్యవహరించిన మాట నిజం. కానీ మీరు తీవ్రమైన అనారోగ్య సమస్యతో ఆసుపత్రిలో చేరారని తెలిసాక నా మనసు నాలో ఎక్కడో దాగివున్న మానవత్వాన్ని మేలుకొలిపింది. . . అసలు మీ కంపినీ చరిత్రలోనే రాత్రింపగళ్ళు కస్టమర్ల కోసం టెన్షన్లు తీసుకుని రోగాల బారిన పడి సీరియస్ అయ్యి ఆసుపత్రుల పాలైన వాళ్ళే లేరు. మీదే మొదటి కేసు. . పేరుకు మీ పైన వాసన్ అనే బాస్ ఉన్నా అర్ధరాత్రైనా, అపరాత్రైనా మా ఫోనులు అటెండ్ అయ్యి సకాలంలో మా సరుకును దగ్గరుండి డిస్పాచ్ చేస్తున్న మిమ్మల్ని మర్చిపోతే మేము కృతఘ్నులం కింద లెక్కే. ? అసలు మీ బాస్ తలుచుకుంటే ఈ సమస్యను ఇంతవరకు రానియ్యకుండా పరిస్తితిని చక్కబెట్టి ఉండే వాడు. కానీ మొదటినుండి మీకు ఎందుకో ఆయన సహాయ పడటం లేదు. పని విషయంలో మీరు ఎక్కువ శ్రద్ద తీసుకోవడం, దగ్గరుండీ నెత్తిమీద వేసుకోవడం ఆయనకు ఒక రకమైన అసూయతో కూడిన అసహనం మిమ్మల్ని ఏదో ఒక విషయంలో ఇరికించాలని ప్రయత్నిస్తున్నట్టు నాకు అర్ధం అవుతోంది. . పైపెచ్చు మిమ్మల్ని విపరీతమైన టెన్షన్ కు గురి చేశాడు. చాలా వ్యవస్థలలో వాడుకుని వదిలేసే వాళ్ళు ఎంతోమంది ఉంటారు. మీరు బెఫికర్ గా ఉండండి. మీరు పంపిన సరుకును నేను వేరే చోట వాడుకుంటాను. నేను ఈ రోజే దాని తాలూకు డబ్బు మీ వాళ్ళకు పంపించేస్తాను. ఇక ఆ విషయం మర్చిపొండి. మీరు సత్వరమే కోలుకుని తిరిగి మీ పనుల్లోకి రావాలని ఆ భగవంతుని కోరుకుంటున్నాను" అంటూ రాజాసింగ్ తన అస్తిత్వాన్ని, వ్యక్తిత్వాన్ని మానవీయ కోణంలో వ్యక్తపరిచి సుబ్రమణ్యానికి గట్టి భరోసానిస్తూ అక్కడనుండి కదిలాడు.
జరిగింది కలో నిజమో తెలియని పరిస్తితి. ఒక పెద్ద పెను ప్రమాదాన్నుండి తనని కాపాడిన రాజాసింగ్ పట్ల అతని మనసు కృతజ్ఞతా భావంతో నిండిపోయింది. . ఇప్పుడు అతని ముఖంలో ఇంతకు ముందున్న భయం తాలూకు లక్షణాలు లేవు. అదే అతన్ని అనుకున్న సమయం కన్నా తక్కువ కాలంలో అనారోగ్యం నుండి బయట పడేటట్టు చేసి తిరిగి ఉత్సాహంగా విధినిర్వాహణలోకి అడుగు బెట్టేటట్టు పురికొల్పింది . ******
సమాప్తం