" ఇప్పుడు చలికాలం కదా. నువ్వూ, నీ పిల్లలూ ఎప్పుడు ఫోన్ చేసినా దగ్గులు, జలుబులతో ఉండటం చూస్తున్నాను. ఈ సీజన్లో నీళ్ళు కాచుకుని తాగాలి. డైరెక్ట్ గా ఫిల్టర్లో నీళ్ళు కూడా తాగడం అంత మంచిది కాదు. అలా అని నువ్వు నీ చిన్న పిల్లలతో పొయ్యి మీద నీళ్ళు కాచుకోవడం కష్టమైన పని. . . ఇప్పుడు అంతా ఇన్స్టంట్ యుగం. ప్రస్తుతం కోవిడ్ వైరస్ బారిన పడి ఎంతోమంది తీసుకుంటున్నారు. జాగ్రత్తగా ఉండాలి. డాక్టర్లు వేడి నీళ్ళు తాగాలని చెపుతున్నారు. గత రెండేళ్లుగా నేను కెటిల్ తోనే నీళ్ళు పెట్టుకుంటున్నాను. హటాత్తుగా అది పని చెయ్యకపోవడంతో పక్కన పడేసి ఒక వారం రోజుల పాటు నీళ్ళు స్టవ్ మీద కాచుకోవడం మొదలు పెట్టాను. అది ఎంత కష్టమో అనుభవిస్తే కానీ తెలియలేదు. అనుకోకుండా మన ఇంటి పక్కన ఉన్న షాపులో ఎలక్ట్రీషియన్ చూసి రిపైర్ చెయ్యడంతో మళ్ళీ నా వ్యాపకం నిర్విగ్నంగా జరుగుతోంది. . . . ఈ లోపలే మీ అన్నయ్య నేను ఇబ్బంది పడుతున్నానని కొత్తది కొని పారేశాడు. . తల్లి తండ్రులకు ఎక్కడ అసౌకర్యంగా ఉంటుందేమోనని వాడు ఎప్పుడూ మా గురించే ఆలోచిస్తూ ఉంటాడు. నాకు నా వ్యాపకాలు చూసుకోవడానికి ఒక కంప్యూటర్ కొనిచ్చాడు . పడుకుని చూసుకోవడానికి ఒక టాబ్లెట్ కూడా ఉంది. సరే ఇవన్నీ పక్కన పెట్టు. నా ఆలోచన ఎప్పుడూ నీ గురించే. నీకు నేను ఏ వస్తువూ సమకూర్చలేకపోతున్నాననే దిగులుతో రాత్రిళ్ళు సరిగ్గా నిద్ర కూడా పట్టడం లేదు. అసలు నీకు ఎందుకు ఫోన్ చేస్తున్నాను అంటే ఇప్పుడు నా దగ్గర ఉన్న కొత్త ఎలక్ట్రిక్ కెటిల్ అలా నిరుపయోగంగా ఉంచకుండా నీకిస్తే ఉపయోగించుకుంటావని మీ అమ్మా, నేను అనుకుంటున్నాము. ఈ సారి అక్కడకొచ్చినప్పుడు తీసుకుని వస్తాను. నీకు ఏదో ఒకటి ఇవ్వాలని మా తాపత్రయం. మీరు కొనుక్కోలేరని కాదు. ఉన్న వస్తువును ఎందుకు వేస్ట్ చేయాలని . ముఖ్యంగా ఈ చలికాలమంతా నువ్వూ, నీ పిల్లలూ, బద్దకించకుండా వేడి నీళ్ళు తాగండి " అని కూతురు రాజీకి ఫోన్ చేసి చెప్పాడు మధుసూధన రావు. .
కూతురు చిన్న ఇబ్బంది పడినా అతని మనసు ఊరుకోదు. తనేమేనా ఆస్తులు, ఇళ్ళు ఇవ్వలేక పోవచ్చు చిన్న చిన్న వస్తువులు కూడా కొని ఇవ్వలేక పోతే ఉండి ఏం ప్రయోజనం ? తన బంధువుల్లో ఎంతోమంది పుట్టింటికొచ్చి ఎన్నో విలువైన సామాన్లు తీసుకుపోతూ ఉంటారు. ఇంకొంతమంది అయితే ఆడ పిల్లల పేరు మీదట ఫిక్సెడ్ డిపాజిట్లు కూడా చేసేసి వాళ్ళకు అవసరం లేకపోయినా అది వాళ్ళ బాధ్యతగా చేస్తూ ఉంటారు. ఇలాంటి ఆలోచనలు మధుసూధన రావులో ఎప్పుడూ వస్తూనే ఉంటాయి.
"అయ్యో వద్దు నాన్నా . ఈయన ఇంట్లో ఎవరి వస్తువులు ఒప్పుకోరు.ఇంట్లో ఏదైనా కొత్త వస్తువు కనపడిందంటే "ఇది ఎక్కడనుండి వచ్చింది ? నేను కొనలేని అసమర్ధుడిగా కనిపిస్తున్నానా ? ప్రతీదీ వాళ్ళనీ , వీళ్ళనీ అడుక్కుంటావు" అంటూ నా ప్రాణం తీస్తారు. . కొంటె తను కొనాలి లేకపోతే నోరుమూసుకుని ఉండాలి. అదో రకం మనస్తత్వం. ప్రస్తుతం నీళ్ళు పొయ్యి మీద పెడుతున్నాను. పైగా ఈ కరెంట్ వస్తువులు ఎక్కువగా వాడితే కరెంట్ బిల్లు కూడా పెరిగిపోతుంది. మళ్ళీ దానికి సమాధానం చెప్పుకోలేక నేనే ఇబ్బంది పడాలి. నువ్వు నా మీద ప్రేమతో ఇలాంటి పనులు చేసి నాకు ఇంట్లో మనశ్శాంతిని లేకుండా చేయకు " అంటూ తండ్రికి ఖరాఖండిగా చెప్పేసింది రాజీ.
రాజీ కొత్తగా కాపురం పెడుతున్నప్పుడు మధుసూధన రావు భార్య తరపు వాళ్ళు వాషింగ్ మెషీన్ , రైస్ కుక్కర్లు, స్టీల్ సామాను లాంటివి ఎన్నో ఇవ్వాలని శతవిధాలా ప్రయత్నం చేసినా ఒక వస్తువు కూడా ఇంట్లోకి రానియ్యలేదు మధుసూధన రావు అల్లుడు విశ్వం.
"ఇతనేమిటో మాకు అర్ధం కావడం లేదు. ఈ రోజుల్లో వాళ్ళు ఇవ్వలేదు వీళ్ళు ఇవ్వలేదు అంటూ అందరినీ ఆడిపోసుకునే అల్లుళ్లే ఎక్కువ. ఇనప సామాన్లు, పాత సామాన్లు అయితే తీసుకోకూడదు అని కొంతమంది అనుకుంటారు. మేము ఎంతో ప్రేమగా కొత్త వస్తువులు కొని ఇద్దామనుకున్నా అతను కొరకరాని కొయ్యలా ఉంటాడు " అంటూ వాపోయే వాళ్ళు.
విశ్వం దృష్టిలో ఎవరైనా తనకు వస్తువులు ఇవ్వాలని చూస్తున్నారు అంటే అవి వాళ్ళకు పనికి రాక పోతేనే ఇస్తారని, ఇంట్లో చెత్తను అంతా వదుల్చుకోవాలని చేసే ప్రయత్నమే నని అతని ఉద్దేశ్యం.
** ** **
" విశ్వం గారేనా మాట్లాడుతున్నది ?" అవతల నుండి ఫోన్ రావడంతో విశ్వం తీసుకున్నాడు.
"అవునండీ. ఎవరు మీరు మాట్లాడేది ?" అడిగాడు విశ్వం కొత్త గొంతు విని ఆశ్చర్యపోతూ.
" నమస్తే సార్. నేను బాలా నగర్ విశాల్ ఫర్నీచర్ ఏజెన్సీస్ నుండి మాట్లాడుతున్నాను. కంగ్రాచులేషన్స్ సార్. మీకు లాటరీలో సోఫాసెట్, కిచెన్ వేర్స్ వచ్చాయి సార్. మొన్న వారం రోజుల క్రితం మేము నిర్వహించిన బిజినెస్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్లో భాగంగా మన ఏరియాలో ఒక లాటరీ నిర్వహించాము. అందులో కాలనీలోని ఇతర మహిళలతో పాటు , మేడమ్ గారు కూడా ఒక లాటరీ టికెట్ తీసుకున్నారు. . . మీరు అవైలబుల్ గా ఉంటే ఈ రోజు మీకు డెలివేరి ఇస్తాము. . ఈ శుభవార్త మేడమ్ గారుకి కూడా చెప్పండి. " అంటున్నాడు షాపు యజమాని.
విశ్వం ఆశ్చర్య పోయాడు. తన భార్య తనతో చెప్పలేదే ఈ విషయం అనుకుని అడిగాడు " ఏమోయ్. ఈ మధ్య ఏమైనా లాటరీ టికెట్ కొన్నావా ఏమిటి ? మనకు ఫర్నీచర్ లాటరీలో వచ్చిందని ఇప్పుడే ఎవరో ఫోన్ చేసి చెపుతున్నారు " అన్నాడు నమ్మశక్యం కానట్టుగా చూస్తూ .
" నిజమా ? మనకు లాటరీలో సామానులు వచ్చాయా ? ఎంత మంచి విషయం చెప్పారండీ. . కాలనీలో అందరూ కొంటూ ఉంటే ఒక యాభై రూపాయలే కదా అని నేను కూడా ఒక లాటరీ టికెట్ తీసుకున్నాను. ఇది నాకు కలలో కూడా ఊహించని సంఘటన . పోనీలెండి అంతా మన పిల్లల అదృష్టం. .నాకు చాలా సంతోషంగా ఉందండి.మన మీద ఎటువంటి ఆర్ధిక భారం పడకుండా మనకు కావల్సిన సామానులు ఫ్రీగా వస్తున్నాయి అంటే ఎగిరి గంతెయ్యాలి . మనం కొనుక్కోకుండా ఆలస్యం చేసినందుకు మంచే జరిగింది. పైగా మా నాన్నా వాళ్ళు ఇస్తానన్నామీరు వద్దనడం మన విలువను మనం కాపాడుకున్నట్టయ్యింది. ముందు ఆ షాపు వాడికి ఫోన్ చేసి వాట్స్ యాప్లో మన క్లియర్ అడ్రెస్ ఇవ్వండి " అంటూ మొగుడిని కంగారు పెట్టేసింది రాజీ.
" ఆ .. ఆ. ఆ పని ఆల్రెడీ చేశాను. ఇంకో గంటలో సోఫా సెట్టూ. కిచెన్ వేర్ అవన్నీ వచ్చేస్తాయి. ముందు సోఫాలు ఎటువైపు వెయ్యాలో చూడు . వాటికి పసుపు బొట్టు కూడా పెట్టు .." అంటూ హడావిడి పెట్టాడు.
"ఒరేయ్ బుజ్జీ, చంటీ మన ఇంటికి సోఫా వస్తోందిరా. ఎంచక్కా మీరు దాని మీద కూర్చుని మీ హోం వర్క్ చేసుకోవచ్చు. నిద్ర వస్తే పడుకోవచ్చు. ఇంకా దానితో పాటు కుర్చీలు కూడా వస్తాయి. వాటిని పాడుచేయొద్దే " అంటూ పిల్లలతో తన సంతోషాన్ని పంచుకుంది రాజీ.
అనుకున్నట్టుగానే ఇంకో గంటలో బాలా నగర్ ఫర్నీచర్ వాళ్ళు విశ్వం ఇంట్లో సామాన్లు డెలివేరి చేసి వెళ్ళిపోయారు. . విశ్వం మొహం వెలిగిపోతోంది.
"ఏదైనా మనకు అదృష్టం కలిసి రావాలి. లేదా మనం మన కష్టార్గితంతో వస్తువులు కొనుక్కోవాలి కానీ ఎవరో వాడి పారేసిన వస్తువులు తీసుకోవాల్సిన ఖర్మ నాకు పట్టలేదు. ఇంట్లో ఏ ఫర్నీచర్ లేదు అంటూ గొడవ పెట్టేదానివిగా నేనేమీ కొనలేని వాడిగా తీసేస్తూ. ఇప్పుడు చూడు అదృష్టం మనల్ని వెతుక్కుంటూ మన తలుపు తట్టింది . నేనెప్పుడూ నా విలువను తగ్గించుకోవడానికి ఇష్టపడను. నువ్వూ మీ వాళ్ళూ గుర్తు పెట్టుకోండి. " అంటూ సోఫాలో వాలిపోయి రిలాక్సెడ్గా టీవీ చూస్తూ అన్నాడు.
** ** **
పదిహేను రోజుల క్రితం సంగతి. తండ్రీ కూతుళ్ల మధ్య ఒక గంటసేపు ఆసక్తికరమైన సంభాషణ జరిగింది. దాని ఫలితంగానే లాటరీలో ఫర్నీచర్ వచ్చిన ఉదంతం. '
"ఇక మీ ఆయన వినడు. ఇంట్లో కావలసినవి తను కొనడు. మధ్యలో బాధపడేది నువ్వు. దీనికి నేనో ఉపాయం ఆలోచించాను . మీకు లాటరీ వచ్చినట్టుగా కథ సృష్టిస్తాను. షాపులో మీకు కావలసిన ఫర్నీచర్కయ్యే మొత్తం ఖర్చును నేనే భరించి డాక్యుమెంట్స్ అవీ మీ ఆయన పేరుమీద ఇమ్మని షాపు వాడితో చెపుతాను. ఇందుకు ఎవరికీ అనుమానం రాకుండా నేను పక్కా వ్యూహ రచన చేస్తున్నాను. ఆ విధంగా ఫ్రీగా వచ్చిన సామాను ఆనందంగా తీసుకోక ఏం చేస్తాడు మీ ఆయన ? నువ్వు మాత్రం లాటరీ టికెట్ తీసుకున్నట్టుగానే నాటకం ఆడు. ఆ సామాను లాటరీలో వచ్చినట్టే డిసైడ్ అయిపో. ఇంతకన్నా నాకు ఏ ఉపాయం తట్టడం లేదు. . నేనేమీ పరాయి వాళ్ళకు ఏదీ ఇవ్వడం లేదు. నా కూతురికి ఇచ్చుకుంటున్నాను. . ఇక నువ్వు సామానులు కోసం ఎదురు చూస్తూండు " అంటూ తండ్రి మధుసూధన రావు పక్కా స్కెచ్ వేసి చెప్పడం , వెంటనే ఆచరణలో పెట్టడం రాజీకి ఎప్పటికీ ఆశ్చర్యంగానూ, వింత అనుభూతిగానూ అనిపిస్తూనే ఉంటుంది. ******
సమాప్తం