అప్పుల గోల - ఆపాసా

Appula Gola

బాబాయితో మొబయిల్­లో మాట్లాడుతూనే, గబగబా నడచుకుంటూ అన్ని క్యూబిక్స్­నీ దాటి, నా ఆఫీస్ చాంబర్­లోకి, గాజు తలుపు తోసుకుని వచ్చాను. పెద్ద ఎగ్జిక్యూటివ్ టేబుల్­­కి అటువైపు చేరి, గోడకి దగ్గరగా, ద్వారానికి అభిముఖంగావున్న నా రివాల్వింగ్ చెయిర్­లో కూలబడ్డాను.

కూర్చుంటూనే, “సరే బాబాయ్! చెల్లాయి పెళ్ళికి నాకుమాత్రం రావాలని ఉండదా ఏంటీ! తరవాత మాట్లాడతాను. ఇప్పుడు కొంచెం అర్జెంటు పనివుంది. అది తెముల్చుకుని, ఓ పది నిముషాల్లో నేనే తిరిగి ఫోన్ చేస్తాను! సరేనా! ఉంటా! అని కాల్ కట్ చేశాను.

ఆలోచనలో పడ్డాను.

నా ఆలోచనలకి అంతరాయం కలిగిస్తూ, ‘టక్ టక్’ మని, నా చాంబర్ గాజు తలుపుపై చేతివేళ్ళ కణుపులతో ఎవరో కొట్టినట్టయింది.

అటు చూసేసరికి నాకంటే ఎక్కువ ఒత్తిడిగావున్న, మా కంపెనీ ‘కార్మికాధికారి’ మొహం కనిపించింది.

అతన్ని లోపలకి రమ్మన్నట్టు తల ఊపాను.

అతను సర్­సర్­మని వచ్చి నాకెదురుగావున్న కుర్చీల్లో ఒకదాన్లో కూర్చున్నాడు.

అతడి చేతిలోని పల్చని పారదర్శక ఫోల్డర్ నావైపు జరిపాడు.

నాతో, “మొత్తం మీద ఇవాళ్టికి, ఈ లోన్ కమిటీ మీటింగ్, పూర్తయ్యిందండీ.

కానీ, అటు యూనియన్ వాళ్ళు, ఇటు హెచ్.ఓ.డీ.లు, అందరూ వారి వారి రికమెండెడ్ కాండిడేట్స్­కి అడిగినంత ఋణం, ఇచ్చి తీరాలని, పట్టుపట్టుక్కూర్చున్నారు.

మన దగ్గరున్న శాంక్షన్డ్ ఎమౌంట్ తక్కువ! వీళ్ళ డిమాండ్ ఎక్కువ! అదెప్పుడు ఉన్నదేగా!

అందరి అప్లికేషన్సూ వడపోసి, జెన్యువిన్ వాటికి, ఒక నిష్పత్తిలో ఋణాలు మంజూరు చెయ్యటానికి వాళ్లని ఒప్పించేసరికి, తలనొప్పి వచ్చేసింది.

వారందరి సమ్మతితో ఎలాగైతేనేం, ఫైనల్ లిస్ట్ తయారయిపోయింది.

కాకపోతే ఈ ఇద్దరి కేసులు మాత్రం కొఱకరాని కొయ్యల్లా మిగిలిపోయాయి. వీళ్ళు మాత్రం ఒప్పుకోటం లేదు. కోరినంత లోన్ శాంక్షన్­ చేసి తీరాలని భీష్మించుక్కూర్చున్నారు, వీళ్ళిద్దరూ.

వారిద్దరినీ నా క్యూబిక్ దగ్గర ఉండమన్నాను.

మీరే మాట్లాడి, వారిద్దరికీ సర్దిచెప్పాలి. కమిటీ వాళ్ళ వల్ల కాలేదు. అన్నాడు బేలగా.

సరే! నా దగ్గరకి పంపించండి. అన్నాను. ఫోల్డర్ నాదగ్గరే వదిలేశాడు.

కార్మికాధికారి వెళ్ళి, నాదగ్గరికి ‘చంద్రాకర్ని ముందు పంపించాడు.

చంద్రాకర్ నమస్తే! సార్! అప్లికేషన్ చూశారుగా! మా చెల్లెలి పెళ్ళి. నేనసలెప్పుడూ తప్పనిసరయితే తప్ప, అప్పు చెయ్యను. ఆ సంగతి మీరు ఇప్పటికే మీ దగ్గరున్న నా డాటా నుంచి గ్రహించివుంటారు. మరోదారిలేక, ఈసారే, మొదటిసారి, కంపెనీ లోన్ కి అర్జీ పెట్టుకున్నాను.

కమిటీ వాళ్ళు, నాదెంత జెన్యువిన్ కేసయినా, నేనెంత అలవాటుగా అప్పు తీసుకునే బాపతు కాకపోయినా, కనికరం చూపలేమని, ఇంతకంటే ఎక్కువ ఇవ్వలేమనీ, ఏదో నాకు ముష్టి వేసినట్టు లోన్ డబ్బులు ఇస్తున్నారు.

అడక్క అడక్క అడిగాను. అదయినా ఎంత అవసరంలోవుంటే నేనడిగివుంటానో, మీరయినా అర్థం చేసుకుని, పూర్తి లోన్ ఎమౌంట్ ఇప్పించండి సార్! అని నిర్భయంగా తన వాదన వినిపించేశాడు.

నాదగ్గరకి వచ్చినవాళ్ళు, అంత ధైర్యంగా అసలు మాట్లాడరు. అందుకే చంద్రాకర్ మాటల్లోని, నిజాయితీనీ, అతడి అవసరాన్నీ గ్రహించగలిగాను.

అయినా, ఈ సంస్థకి ఛీఫ్­గా నా విద్యుక్తధర్మాన్ని నిర్వర్తించడానికే ప్రయత్నించాను.

ఏంటిది చంద్రాకర్! ఇదేం బాగులేదు! మీలాంటి చదువుకున్నవాళ్ళు, తెలివైనవాళ్ళు కూడా, ఇలా హ్యూజ్ ఫండ్స్ కోసం ఒత్తిడి చేస్తే ఎలా?

మీరడుగుతున్న అప్పుతో, చిన్న చిన్న మొత్తాలకి శాటిస్­ఫై అయే ఇతర కార్మికులని ఎంతమందిని కంపెనీ తృప్తిపరచగలదో ఆలోచించారా?

అసలు మీలాటి వాళ్ళు, అప్పులు చెయ్యకూడదు!అని సూటిగా అతడి మొహంలోకి చూశాను.

అతడు, “ఏం చెప్తున్నారు సార్! అప్పు చెయ్యకూడదా! అవసరానికి కూడా మరో గత్యంతరంలేనప్పటికీ, అప్పు చెయ్యకూడదా! భలే వారే!

ఈ మధ్యనే మన కంపెనీ, అరవై కోట్ల ‘పారీపశు’ లోన్ తీసుకుంది. ఆరు బ్యాంకులు కలిసి, మొత్తంగా ఒకటై, మనం కంపెనీకి ఆ ఋణం శాంక్షన్ చేశాయి.

ఇక మన ప్రభుత్వం ప్రతి ఏడాది చేసేది అదే! అప్పే! క్రిందటేడాడిది ఆర్థిక సంవత్సరం క్లోజింగ్ ప్రకారం, మనదేశం నెత్తిమీదున్న ఋణభారం 1,35,87,893 కోట్ల కోట్లు. అన్ని కోట్ల కోట్ల రూపాయలతో పోలిస్తే మన క్రెడిట్ అత్యంత స్వల్పం. ఆ క్రెడిటే 580 యు.ఎస్. డాలర్లు! అంటే రమారమి 46,400 కోట్ల రూపాయల క్రెడిట్!

అలా మన కంపెనీవే, మన ప్రభుత్వమే, గతిలేక చేయి చాచినప్పుడు, నాకెందుకు సార్ నామోషీ, అప్పడగడానికి!

అయినా మీరే, చాలాసార్లు చాలా సందర్భాల్లో, ఎంప్లాయర్ ఎప్పుడూ ఎంప్లాయీస్­కి తండ్రిలాటి వాడు! మనమంతా ఒక కుటుంబం! మన కంపెనీ పేరులోని మొదటి రెండు అక్షరాలు ‘ఎం.పి.’ అంటే మధ్యప్రదేశ్ అనుకునేరు, కాదు, ‘మాతాపితా’; అందుచేత మీకే సమస్య వచ్చినా నిర్భయంగా నాదగ్గరకి రండి.అని స్పీచిలిచ్చారు. మర్చిపోయారా!

మరి పిల్లలకి ఏదైనా అవసరమొచ్చినప్పుడు, పిల్లలు తమని పెంచి పోషిస్తున్న పేరెంట్స్­ని కాక ఇంకెవర్ని అడుగుతారు?

అది నా హక్కు! సమయానికి ఆదుకోవడం మీ బాధ్యత!” అని సినిమాలో డయలాగ్­లా ఆవేశంగా అప్పజెప్పేశాడు.

అతని నాలెజ్­కి, వాగ్ధాటికీ అబ్బురపడకుండా ఉండలేకపోయాను.

అయినా, అవి చూసి కాదు కదా, అప్పులిచ్చేది!

ఎలాగైనా అతణ్ణి ఒప్పించాలని, ఎమౌంట్ తగ్గించాలని, నాలో ఏమూలో దాగున్న నా పదవి ఇచ్చిన అహంకారానికి పౌరుషం వచ్చింది.

మరుక్షణమే, అతడి భార్య కూడా మంచి ఉద్యోగమే చేస్తోందని, ఆమెది కూడా మంచి సంపాదనే అన్న పోయింట్ గుర్తొచ్చింది. అయినా డైరెక్టుగా ఆ ముక్క అనలేదు.

మరోలా, “చంద్రాకర్ గారూ! మీరు చెప్పిన పోయింట్సన్నీ కరక్టే! కానీ, వాటికీ, ఇప్పుడు మన ఎంప్లోయీస్ అందరికీ అప్పులు ఇచ్చీగా మిగిలున్న డబ్బులుకీ, మీరు అప్పుకోసం చేసిన అర్జీకీ, ఎటువంటి సంబంధం లేదు!

మన రూల్స్ ప్రకారం, అంత ఎమౌంటుకి మీకు అర్హతలేదు! అని, అతని నోరు మూయించడానికి అసలైన అస్త్రం అప్పుడొదిలాను.

అయినా, చంద్రాకర్ గారూ! నాలుగు చేతుల్తో ఆర్జించే మీరే, ఇలా అప్పు కోసం అడగడం ఆశ్చర్యంగా ఉంది!

అందుచేత, మీకు ఋణం మంజూరు చెయ్యటానికి, నాకేం సరయిన కారణం కనిపించటం లేదు. అన్నాను.

అతడు నామాటలకి లొంగిపోడానికి బదులు, రెచ్చిపోయాడు.

అవును సార్! మీకు తెలిసింది అదే! నేనూ, నాభార్యా, ఇద్దరమూ ఆర్జిస్తున్నామని! అంతే! అంతేకాని, మాకు, నాలుగు చేతులతోపాటు పది పొట్టలు, వారిక్కావలసిన బట్టలు, ఇతరత్రా అవసరాలు కూడా ఉన్నాయని మాత్రం తెలీదు! తెలుసుకోలేరు!

నాకీ డబ్బు ఎంత అవసరమో ఇప్పటికైనా అర్థం చేసుకుని ఫుల్ లోన్ ఎమౌంట్ శాంక్షన్ చెయ్యండి!అని అతడే నా పై అధికారిలా, అధికారికంగా చెప్పాడు.

నా అహం దెబ్బతింది!

బయటకి కనపడనివ్వలేదు.

ప్రశాంతంగా, చూడండి చంద్రాకర్ గారూ! ఇప్పటికీ మించిపోయింది లేదు.

లోన్ కమిటీ సిఫార్స్ సంగతి మర్చిపోదాం.

నాకున్న ప్రత్యేక పవర్స్­ని ఉపయోగిస్తాను. నా పరిధిలో, మీరడిగినదాంట్లో సగం ఋణం శాంక్షన్ చెయ్యగలను.

ప్లీజ్! ఇంతకంటే మీకు నేనేం సహాయం చెయ్యలేను! నా లిమిట్ లో ఉన్నది ఇంతవరకే!

ఇది దాటి చెయ్యాలంటే, ఎం.డి.వే! అది సాధ్యం కాదు!

సగం ఎమౌంట్­కి ఒప్పుకుంటే, ఇప్పుడే ఎకౌంట్స్ డిపార్ట్­మెంట్­కి చెప్తాను!” అన్నాను. నాకు తెలుసు చచ్చినట్టు ఒప్పుకుంటాడని.

చంద్రాకర్ నాకంటే కూల్­గా, నెమ్మదిగా, “ఆ పనే చెయ్యండి సార్! ఇన్నాళ్ళ నా సిన్సియర్ వర్క్ కి సరయిన గౌరవం ఎం.డి.వే ఇవ్వగలడు. అతనికే కార్పోరేట్ ఆఫీస్­కి నా అర్జీని ఫార్వార్డ్ చెయ్యండి.” అని, అంతే నిర్మలంగా, నాకు నమస్కారమైనా పెట్టకుండా గిరుక్కున వెనక్కితిరిగి గ్లాస్ డోర్ తోసుకుని వెళిపోయాడు.

చంద్రాకర్ అటు వెళ్ళగానే, నేను ఆలోచనలో పడ్డాను.

అతడన్న మాటలు శూలాల్లా నా గుండెల్లో గుచ్చుకున్నాయి.

అతడన్నదాన్లో తప్పేముంది!

పిల్లలు పేరెంట్స్­నీ, పనివాళ్ళు యజమానినీ, ప్రజలు ప్రభుత్వాన్నీ, కాకపోతే ఇంకెవర్ని అవసర కాలంలో ఆదుకోమని అడుగుతారు! నిజమే!

అది వారి హక్కు!

అడిగినది దానం కాదు! అప్పు!

పైగా, మొదటిసారి అడిగాడు. అవసారినికి ఆదుకుంటే, అతడిలాటి సిన్సియర్ వర్కర్స్­ని ప్రోత్సహించినట్టూవుంటుంది. నా పదవికి గౌరవమూ దక్కుతుంది. ఈ కంపెనీ ప్రతిష్ఠ మరింత పెంచినట్టవుతుంది.

అంతే!

అతడి లోన్ అప్లికేషన్ మీద, ఇంగ్లీషులో, మా ఎం.డి.కి

“ఇది చాలా ప్రత్యేకమైన కేసు! ఇతని ఇన్నేళ్ళ సేవాసమయంలో ఒక్కసారి కూడా అప్పు తీసుకోలేదు. ఇతడు చాలా బాధ్యతగల పౌరుడు! దయచేసి, ఇతడు కోరిన మొత్తం సొమ్ము, అప్పు రూపేణా ఇప్పించమని ప్రార్థన!” అని రికమెండ్ చేస్తూ నా రిమార్క్ రాసి, సి.ఇ.ఓ.గా నా సంతకం పెట్టేశాను.

తృప్తిగా ఊపిరి పీల్చుకున్నాను.

--: oo(O)oo :--

[నిజంగానే చంద్రాకర్ మొత్తం సర్వీసులో రెండే రెండు సార్లు కంపెనీ లోన్ తీసుకున్నాడు. ఆరెండూ కూడా సిస్టర్స్ మ్యారేజెసప్పుడే. రెండుసార్లూ అతడు అడిగినంత అప్పూ ఇచ్చాం. అయితే, రెండోసారి నో వాదప్రతివాదాలు. ఇలాటి కేసు, నేను పనిచేసిన ఆ కంపెనీలో మరొకటి లేదు. అది ప్రత్యేకం! అది ఒక చరిత్ర!]

--: oo(O)oo :--

అలా చంద్రాకర్ లోన్ అప్లికేషన్ పై సి.ఇ.ఓ.గా నా రిమార్క్స్ రాసి, ఫోల్డర్ పక్కన పడేశాను.

బాబాయికి ఫోన్ చేశాను. మళ్ళీ నా సంజాయిషీ విపులంగా చెప్పాను.

“చెల్లాయి పెళ్ళికి నాకుమాత్రం రావాలని ఉండదా బాబాయ్! కానీ పరిస్థితులలా ఉన్నాయ్! రాగలనో లేనో, చెప్పలేను. సరిగ్గా అదే సమయానికి, మా కార్పొరేట్ ఆఫీస్ ముంబయిలో, బోర్డ్ మీటింగ్ ఉంది. అయినా ప్రయత్నిస్తాను.

ఏమాత్రం అవకాశంవున్నా ముహూర్తం వేళకైనా సరే, సరాసరి ముంబయినుంచే ఫ్లయిట్­­లో బయల్దేరి వచ్చి వాల్తాను. ముందునుంచి రాలేను. చెల్లాయికి నువ్వే నా పరిస్థితి బోధపడేలా చెప్పు.

తరవాత నేను, చెల్లికి ఫోన్ చేసి నచ్చచెప్తాను. నన్నర్థం చేసుకో!”

“సరేరా! నీయిష్టం మరి! చూసుకో!

చిన్నప్పట్నుంచి కలిసి పెరిగారు. అన్నదమ్ముల పిల్లల్లా ఉండరు, మీరిద్దరూ. ఊరువూరంతా మన సఖ్యత చూసి కుళ్ళుకుంటుంది.

అలాటిది నువ్వు కాని, ఆమె పెళ్ళికి రాకపోయావంటే, ఆమెకే కాదు, నాకు, మీ పిన్నికీ, అందరికీ వెలితిగా ఉంటుంది. ఆలోచించుకో!” అని మరోసారి హెచ్చరించి, మా బాబాయి, నా ఫోన్ కాల్ కట్ చేసేశాడు.

ఈలోగా రెండో మొండి లోన్ కేసు శాల్తీ, ‘మాదప్ప’ వచ్చాడు. అది కూడా మ్యారేజ్ లోనే!

లోపలకొస్తూనే నమస్కరించాడు. వినయంగా చేతులు కట్టుకుని నిలబడిపోయాడు.

“ఏంటి మాదప్పా, ఇంత అప్పా! అసలు నువ్వు తీర్చగలవా!

నీమీద ఎంత భారం పడుతుందో ఆలోచించావా?

నెలనెలా నీ జీతంలోంచి పెద్దమొత్తం అంతా కటింగ్స్­కే పోతే, నువ్వేం తింటావు? ఎలా ఉంటావు? ఆలోచించు!

తక్కువలో తక్కువ ఎంత సొమ్ముకావాలో, ఎంతలో మానేజ్ చేసుకోగలవో, చివరిసారిగా చెప్పు.” అని ప్రశాంతంగా అడిగాను.

మాదప్ప, జాలిగా మొహంపెట్టి, “సార్! అప్లికేషన్ చూశారు కదా సార్! శుభలేఖ కూడా జత చేశాను. మా కజిన్ పెళ్ళి. మాది ఉమ్మడికుటుంబం. ఇప్పటికీ మా నాన్నా, చిన్నాన్నా ఇద్దరూ కలిసే పొలం పన్లు చూసుకుంటారు. మాకు చిన్నాన్న పెదనాన్న పిల్లలని భేదం లేదు బాబూ! అందరం ఒకే కుటుంబంలా ఉంటాం.

అలాటిది నేను ఈ పెళ్ళికి వెళ్ళకపోతే, పెద్ద మొత్తం సాయం చెయ్యకపోతే, జీవితమంతా దెప్పుతారు. అయినా, ఒకరేదో అంటారని కాదు, నాకే ఏదో తప్పు చేసినట్టు మనసంతా గుబులయిపోతుంది.

అవసరంవున్నా లేకపోయినా, తమ ఎలిజిబిలిటీని బట్టి ఎంతోమంది మన కార్మికులు, కంపెనీ లోన్ తీసుకుంటారు. కొందరు ఆస్తులు జమ చేసుకుంటే, కొందరు వడ్డీకి తిప్పుతారు. కొందరు పొలాలు కౌలుకి తీసుకుంటారు.

నేనలాక్కాదు, బాబూ!

మరే దిక్కు లేనప్పుడే, చచ్చేంత అవసరం ఉన్నప్పుడే, అప్పు చేస్తాను. కంపెనీ లోన్­కి ఎప్లయి చేస్తాను. వడ్డీ లేని అప్పు కదా అని, మిగిలినవాళ్ళల్లా, ఇలా లోన్ పూర్తవగానే, అలా మళ్ళీ అప్లికేషన్ పెట్టను. అది మదుపుగా పెట్టి రెండింతలు, మూడింతలు చేసుకోను.

అవసరానికి మాత్రమే ఇలా మీదగ్గర చేయి చాస్తాను.

ఇన్ని సంవత్సరాలనుంచి పని చేస్తున్న నా కంపెనీవే నన్ను నమ్మి, ఇవ్వకపోతే, ఇక పై వాళ్ళేం నన్ను నమ్ముతారు, నాకేం ఇస్తారు! మీరే చెప్పండి, సార్! నన్నేం చెయ్యమంటారు?” అనడిగాడు దీనంగా మొహం పెట్టి.

మాదప్ప అన్నదానికి ఒక క్షణం ఆలోచించాను. నా మనసుకి మాత్రం ‘సరిగ్గా నా సమస్యే, మాదప్ప సమస్య కూడా. అది కజిన్ పెళ్ళి! ఆ పెళ్ళికి ఎలాగయినా సరే వెళ్ళాలి.

కాకపోతే, తేడా అల్లా ఇద్దరి ఆర్థిక పరిస్థితి. నాకది సమస్య కాదు!

అతడికి అదే పెద్ద సమస్య!

ఇమోషన్స్ మాత్రం ఇద్దరివీ ఒకటే!

అయినా, ఈ సంస్థకి ఛీఫ్­గా నేను కూర్చున్న ఈ కుర్చీకి న్యాయం చెయ్యాలి. దానికి నా మానవీయ దృక్పథం, అడ్డురాకూడదు. అలాగని మానవత్వం లేకుండా కఠోరంగానూ నా నిర్ణయం ఉండకూడదు.

వృత్తినీ, వ్యక్తిత్వాన్నీ, రెండింటినీ బేలన్స్ చేసుకోవాలి!’ అని తలచాను.

అతడి స్థానంలో నేనుంటే ఎలాటి నిర్ణయం సబబుగా ఉంటుందో ఆలోచించాను. క్షణంలో, అతడి ఆర్థిక సమస్యకి ఒక పరిష్కారం తట్టింది.

నోరు విప్పాను.

“మాదప్పా, నువ్వు ఇమోషనల్­గా కాకుండా ప్రాక్టికల్­గా ఆలోచించు.

నువ్వు చెప్పినదాన్ని బట్టి, నీ పరిస్థితిని అర్థం చేసుకోగలను. నాకూ అక్కచెల్లెళ్ళున్నారు.

నాకర్థమయిందేంటంటే, ఇప్పుడు మీ కజిన్ పెళ్ళికి నువ్వెళ్ళాలంటే, ఇక్కడ్నుంచి ముందు నువ్వూ, నీ భార్యా, పిల్లలు, రాయపూర్ వెళ్ళాలి. అక్కడనుంచి మీవూరు ‘ఉత్కూరుకి, డైరెక్టు ట్రెయిన్ లేదు.

తెలంగాణా-కర్ణాటక బోర్డర్, ఆల్­మోస్ట్ కర్ణాటక! అక్కడుంది మీ వూరు.

రాయపూర్ నుంచి నాగ్­పూర్, నాగ్­పూర్ నుంచి హైదరాబాద్, అలా అంచెలంచెలుగా రైళ్ళూ, బస్సులూ మారుతూ వెళ్ళాలి. రానుపోను ఆర్రోజులు పడుతుంది. పెళ్లిరోజుతో వారం. మరో వారం రోజులయినా అక్కడుంటావు. సగం నెల జీతం!

అదికాక, ఇంతమందికి టిక్కెట్లు, ప్రయాణం ఖర్చులు, ఇంటిల్లిపాదికీ గిఫ్టులు.

అలా ‘ఉత్కూరు చేరాలి. తిరిగి రావాలి.

వాటికే నువ్వు చేసిన అప్పులో రమారమి సగం డబ్బులు అయిపోతాయి.

ఇంత అప్పూ తీసుకుని, నీ దగ్గర మిగిలేదేమిటి?

సగం కూడా మిగలదు! ఆ డబ్బుల్లో నువ్వు పెళ్ళికూతురుకేమిస్తావు? పెళ్ళిఖర్చుకని మీ చిన్నాన్నకేమిస్తావు?

ఇంతా చేసి చేతులు దులుపుకుని వస్తావు. వచ్చాక ఈ ఋణభారం మోస్తూ, భారీ ఇన్­స్టాల్­మెంట్లు కడుతూ, భారంగా గడుపుతావు.” అని మాదప్ప మొహం వైపు, నిశితంగా చూశాను.

అతడి మొహం పాలిపోయింది. నిజమే కదా! అని ఆలోచనలోపడినట్టనిపించింది నాకు.

వెంటనే నేను, “మాదప్పా! అందుచేత నామాట విను! నువ్వోపని చెయ్యి. పెళ్ళికొడుకుది నాగ్­పూరే కదా! కాపురానికి, ఉత్కూరు నుంచి మీ చెల్లి, నాగ్­పూరెలాగా వస్తుంది. నాగ్­పూర్ మనకి చాలా దగ్గర. మీ కాబోయే బావగారితో, చెల్లెలితో, ఇప్పుడే ఫోన్ చేసి మాట్లాడు.

పెళ్ళయ్యాక వారిద్దరూ నాగపూర్­ చేరగానే, ఇక్కడకి మీయింటికి రావాలని, కొద్దిరోజులు మీయింట్లో ఉండాలని, నీ ఆతిథ్యం పొందాలని, నిన్నానందపరచాలని, ఆహ్వానించు.

నీకు సెలవు దొరకలేదని, పెళ్ళికి రాలేనని చెప్పు. మన్నించమని చెప్పు.

రేపే, తనకిష్టమొచ్చింది కొనుక్కోమని, మీ చెల్లెలికి కొంతా, పెళ్ళిఖర్చుకని చిన్నాన్నకి కొంతా, డబ్బు, ట్రాన్సఫర్ చెయ్యి.

అలాగయితే, నీకు సగం పైగా అప్పు బాధ తగ్గుతుంది. ఇన్­స్టాల్­మెంట్ ఎమౌంట్ భారం చాలా తేలికయిపోతుంది.

ఇవి కాక, సెలవు తీసుకోకపోవడం వలన, సగం నెల జీతం ఆదా అవుతుంది. అది వచ్చే జనవరిలో ఎన్­క్యాష్ చేసుకోవచ్చు.

పెళ్ళికి నువ్వు రాలేదని, మీవాళ్ళు కొంచెం బాధపడతారు గాని, సమయానికి నువ్వు అనుకున్నదానికంటే ఎక్కువే ఆర్థిక సాయం చేశావని సంతోషిస్తారు! అది సహజం!

నువ్వెళ్ళి ఇచ్చినా, వెళ్ళకుండా పంపించినా మీ చిన్నాన్నకి, ఈ సమయంలో ‘డబ్బు ముఖ్యం! చాలా అవసరం! నువ్వు వచ్చావా లేదా అన్నది అంత ప్రధానం కాదు!

శుభ సమయంలో మనవాళ్ళెవరూ లేకపోయినా, రాకపోయినా, అంతగా పట్టించుకోరు. ఎందుకంటే, శుభకార్యానికి మనం లేకపోయినా, సహాయం చెయ్యడానికి, అక్కడ చాలామందే ఉంటారు.

కార్యక్రమం సజావుగా జరిగిపోతుంది.

అందుచేత నువ్వెళ్ళకపోయినా, ఏమీ అనుకోరు! డబ్బు పంపించావంటే, నిన్ను క్షమించేస్తారు!

అదే కష్టకాలంలో అయితే, మనవాడన్న వాడు ఎక్కడున్నా అక్కడకి రెక్కలు కట్టుకు వాలాలి. ఆదుకోవాలి. కష్టంలో ఉన్నప్పుడు, పరాయివారెంత చేసినా, మనవాళ్ళసాటి కాదు.

ఇలా అన్నానని మరోలా అనుకోకు.

ఇప్పుడే, నువ్వడిగిన దానికి, సగం లోన్ శాంక్షన్ చేస్తున్నాను.

అలా అయితే, అన్ని సమస్యలు తీరుతాయి. నీ ఋణభారం తగ్గుతుంది.” అని చెప్పాను.

నేనిచ్చిన సలహా నచ్చినట్టుంది.

“సరే సార్! మీయిష్టం!” అన్నాడు మెల్లిగా.

నేను మాదప్ప లోన్ అప్లికేషన్­లో, ‘శాంక్షన్డ్’ అని సగం ఎమౌంట్ రాసి, సి.ఇ.ఓ. గా సంతకం పెట్టాను.

మాదప్ప మరోసారి నమస్కరించి, భారంగా అడుగులేస్తూ వెనుదిరిగాడు.

ఇద్దరిదీ కజిన్ మ్యారేజే అయినా, అతడి చెల్లెలి పెళ్ళికి అతడు వెళ్ళకపోయినా ఫరవాలేదని బోధపరిచాను. నేను మాత్రం మా సిస్టర్ వివాహానికి ఎలాగయినా వెళ్ళితీరాలనే నిర్ణయం తీసుకున్నాను.

మాయిద్దరి ఎమోషన్స్ ఒకటే అయినా, స్థితులు వేర్వేరు అయినంత మాత్రాన, ఇంత విపరీతమైన విరుద్ధమైన దుస్థితా అని మనసు కలచివేసింది.

ఏ మూలో అపరాధ భావంతో గుండె బరువెక్కింది.

తాపీగా గాజు తలుపువైపు సాగుతున్న మాదప్పనే అలా బరువెక్కిన గుండెలతో చూస్తూవుండిపోయాను.

--: oo(O)oo :--

మర్నాడు ఉదయం, నేను ఆఫీసుకొచ్చేసరికి, నా రూమ్ దగ్గర వెయిట్ చేస్తూ మాదప్ప కనిపించాడు.

నేను లోపలకి వెళ్తూ “రా మాదప్పా!” అని పిలిచాను.

అతడు నాతో పాటు, లోపలకి వచ్చి, “అయ్యా! మీరు చెప్పినట్టు, అన్నిటికంటే, ముందు ఇవాళ మనీ ట్రాన్సఫర్ చేసేశానయ్యా!

మా చిన్నాన్న నన్ను క్షమించేశాడు!

మా చెల్లాయి కూడా అంత బాధపడలేదు. “పోనీలే అన్నయ్యా! సెలవు దొరకకపోతే నువ్వుమాత్రం ఏం చెయ్యగలవు? పోనీ ఆతరవాత వీలునప్పుడు నాగపూర్ రా!” అని ఒప్పేసుకుంది.

మా కాబోయే బావగారయితే, చాలా సంతోషించాడు. తప్పకుండా మాయింటికి వస్తానన్నాడు.” అని సంబరపడిపోతూ చెప్పాడు.

అప్పుడు నేను తేలికపడిన మనసుతో, ‘అమ్మయ్య! ఒక చెల్లి పెళ్ళికి, ఒక అన్నయ్యని వెళ్ళకుండా చేసి, ఇద్దరికీ తృప్తి కలిగించాను! ఇక ఈ అన్నయ్య, తన చెల్లి పెళ్ళికి వెళ్ళి, అందరికీ తృప్తి కలిగించాలి!’ అని అనుకుంటూ, హుషారుగా నా ముంబయి ప్రయాణానికి సన్నాహాలు చెయ్యసాగాను.

--: oo(O)oo :--

మరిన్ని కథలు

Bakkati pellam-laavati mogudu
బక్కటి పెళ్ళాం - లావాటి మొగుడు
- మంత్రిప్రగడ ఆంజనేయులు
Barlo taagudu intlo vaagudu
బార్లో తాగుడు - ఇంట్లో వాగుడు
- మంత్రిప్రగడ ఆంజనేయులు
Panipilla
పనిపిల్ల (క్రైమ్ కథ)
- చెన్నూరి సుదర్శన్
Bhavaateetam
భావాతీతం
- DODDIPATLA KALYAN KISHORE
Prema falam
ప్రేమ ఫలం
- పి. రాజేంద్రప్రసాద్
Neethone nenunta
నీతోనే నేనుంటా
- కాశీవిశ్వనాధం పట్రాయుడు
Amlet damlet
ఆంమ్లేట్ - డాంమ్లేట్ .
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు