చల్లటి సాయంత్త్రం వేళ, ఇంటి ముందున్న ఉయ్యాల బల్ల మీద కూర్చొని వుంది హేమ. నిత్యం ఆ ఉయ్యాలకి సంబంధించిన, చిన్ననాటి జ్ఞాపకాలు నెమరు వేసుకుంటూ, సరదాగా వుండే హేమకి, ఇప్పుడు అవ్వన్నీ చెరిగిపోయి, కేవలం చేదు అనుభవాలు,
మనోవేదన మాత్రమే మిగిలాయి. దానికి కారణం మూడు నెలల క్రితం పరిచయం అయిన వరుణ్ మరియు అతని కుటుంబం.
*****
"జానకి...పరమానందయ్య గారు ఫోన్ చేసారు. ఈ ఆదివారం మంచి రోజు అంట. పెళ్లి చూపులు ఆ రోజు పెట్టుకోవచ్చన్నారు." రాత్రి భోజనాల వేళ భార్యని ఉద్దెశించి అన్నారు రఘురాం గారు.
"ఆదివారం ఐతే మరీ మంచిది. మన హేమకి కూడా సెలవు రోజే కదా. అలాగే చేద్దాం".
గదిలో ఉన్న హేమకి తల్లి మాటలు వినపడుతున్నాయి. తన జీవితంలో జరిగే మొట్ట మొదటి పెళ్లి చూపులు ఇది. ఆనందంతో పాటు, రకరకాల ఆందోళనలు కూడా మెదడుని చుట్టుముడుతున్నాయి. ప
ెళ్లి చూపులలో ఎలా ఉండాలి? ఎలా మాట్లాడాలి? అసలు తనని మాట్లాడనిస్తారా? తండ్రి చూపించిన ఫొటోలోని అబ్బాయి బాగానే వున్నాడు. కానీ అతడికి తను నచ్చుతుందా? ఇలాంటి ఆలోచనలతో ఆ రాత్రి హేమకి కలత నిద్రే పట్టింది.
ఆదివారం రానే వచ్చింది. అంతా రఘురాం గారింట్లో సమావేశం అయ్యారు. లోపల గదిలో ఒంటరిగా వున్న హేమ గుండె అతి వేగంగా కొట్టుకుంటోంది. ఎన్నో విషయాలు మాట్లాడాలని సిద్ధం చేసుకున్న ఆమెకి ఆ క్షణం మౌనమే తోడయ్యింది.
హాల్ లో ఏవో సంభాషణలు జరుగుతున్నా కూడా ఆమెకి మాత్రం తన ఊపిరి తప్ప ఏమి వినపడటం లేదు.
"నా పేరు గోపాలరావు, ఈమె నా శ్రీమతి సావిత్రి. నా పెద్ద కొడుకు విజయ్ , పెద్ద కోడలు సంగీత. వీడు మా చిన్న కొడుకు వరుణ్. ఈ అబ్బాయి కోసమే ఈ పెళ్లి చూపులు" అని గోపాలరావు గారు తన కుటుంబాన్ని పరిచయం చేస్తూ అన్నారు.
పరిచయ కార్యక్రమాలు, కుశల ప్రశ్నలు అయ్యాక అమ్మాయిని పరిచయం చేయాలని జానకి లోపలికి వెళ్ళింది.తల్లి రావటంతో హేమ గట్టిగా ఊపిరి పీల్చుకొని నిదానంగా హాల్ లో కి అడుగులు వేసింది.
"మా అమ్మాయి హేమలత" పరిచయం చేసారు రఘురాం గారు. "నమస్కారం అండి" వరుణ్ తల్లిదండ్రులని ఉద్దెశించి హేమ పలికిన మొదటి మాట. అందరికి కాఫీలు అందించిన అనంతరం తండ్రి పక్కగా వచ్చి కూర్చుంది.
తన గురించి తండ్రి చెప్తూ వున్నారు. హేమ కి మాత్రం దించిన తల ఎత్తబుద్ధి అవ్వలేదు. కాఫీ గ్లాసులు , చీర కట్టు, తల దించటం ఇవ్వని సినిమాలలో చూపించే ఓవర్ ఆక్షన్ అని అనుకునే హేమ కి అది అంతా యాదృచ్చికం అని
అప్పుడే అర్ధం అయింది. అందరి మధ్యలో కి వచ్చిన పావు గంట తరువాత, అది కూడా అతి కష్టం మీద తన కళ్ళధ్ధాల అంచు నుండి చాటుగా అరక్షణం పాటు వరుణ్ ని చూసింది. లేత నీలం రంగు చారల చొక్కా వేసుకున్న వరుణ్
చాలా హుందాగా వున్నాడు. పిల్లలిద్దరినీ మాట్లాడుకోనిధ్ధాం అన్న పెద్ద్దలు అనటం తో వరుణ్ హేమ లు బయట వున్న ఉయ్యాల బల్ల మీద చేరారు. హేమ కి పెద్ద భారం తగ్గినంత ప్రశాంతంగా వుంది.
కేవలం తను, వరుణ్ మాత్రమే ఉండటం తో.ఇది వరకున వున్న బిడియం, మొహమాటం దూరం అయ్యాయి.
వరుణ్ ఎడమ చివరన కూర్చుంటూ, హేమని చిరునవ్వు తో పలకరించి, చుట్టూ చూడసాగాడు. అతడు కూడా తన లాగే మొహమాట పడుతున్నాడని అర్ధం చేసుకున్న హేమ మరో చివరన కూర్చుంటూ
"హాయ్, నా పేరు హేమ, మీ ఫోటో ని వారం క్రితమే చూసాను" అంది.
"హాయ్, నేను వరుణ్. ఆ ఫోటో ఆరు నెలల క్రితంది లెండి" నవ్వేస్తూ అన్నాడు వరుణ్. ఫోటో లో కంటే ప్రత్యక్షం గా నే బాగున్నాడు అని హేమ అనుకుంటూ "ఎక్కడ జాబ్ చేస్తున్నారు మీరు? ఏ ఊరులో?" అని అడిగింది.
"హెచ్ సి ఎల్ లో అండి, హైదరాబాద్ లో చేస్తున్నాను. ప్రస్తుతం వర్క్ ఫ్రొం హోమ్ ఏ నడుస్తోంది. కాలేజీ రోజుల్లో నుండి ఆరేళ్ళుగా హైదరాబాద్ లో నే వున్నాను . మరి మీరు?"
"నాదీ అంతే. కాకపోతే ఇదివరకు రెండేళ్లు చెన్నై లో చేసాక ఈ మద్యే హైదరాబాద్ కి మార్చారు ."
"వామ్మో, చెన్నై ఆ , నాకు హైదరాబాద్ కె ఊరికి దూరం అనిపిస్తుంది, రెండు వారాలకొకసారి అయినా ఇంటికి రావాల్సిందే " అని అన్నాడు.
"ఇంటికి దూరంగా వున్నాం అని ఎందుకు అనుకోవాలి. నేను మాత్రం ఇదొక బాధ్యత గా ఫీల్ అవుతాను"అని అంది.
ఇంకా తన కుటుంబం గురించి, స్నేహితుల గురించి, అభిరుచుల గురించి ఎన్నో విషయాలు చెప్పుకొచ్చింది హేమ. హేమ మాటలు వరుణ్ కి చాల ఉపశమనాన్ని ఇచ్చాయి. తను కూడా బదులిస్తూ తన దినచర్య, అలవాట్ల గురించి వివరించాడు.
అలా వాళ్లిదరు దాదాపు అరగంట పైగా మాట్లాడుకున్నారు.
"నిజం చెప్పనా హేమ? పెళ్లి చూపులంటే...ఏదో వస్తాం, చూసుకుంటాం వెళ్ళిపోతాం అనుకున్నా కానీ , మీరు ఇంత సేపు మాట్లాడతారని నేను ఊహించలేదు. నాకు కూడా ఎలా మొదలుపెట్టాలో, ఎం మాట్లాడాలో అని భయపడుతూనే వచ్చాను.
కానీ మీరు నాలో కొత్త ధైర్యాన్ని నింపారు" అని మనస్ఫూర్తిగా అన్నాడు వరుణ్.
"నాకు మాత్రం కొత్త వ్యక్తి తో మాట్లాడినట్టు అనిపించలేదు. అంతా మంచే జరగాలని అనుకుందాం" అని హేమ చెప్తుండగా లోపల నుండి నవ్వులు వినిపించేసరికి "ఇక లోపలికి వెళదామా" అని వరుణ్ అనటం తో అయిష్టంగానే అతడిని అనుసరించింది.
మరి కొంత సేపు మాట ముచ్చట్లు అయ్యాక గోపాలరావు గారు , ఏ విషయమో మళ్ళి కబురు చేస్తాం అని అంతా సెలవు తీసుకున్నారు.
*********
మూడు రోజుల అనంతరం రఘురాం గారు పరుగు లాంటి నడకతో, కూతురి దగ్గరకి వచ్చి "హేమ, నువ్వు వాళ్ళకి నచ్చావ్ అంట.మనతో సంబంధం వాళ్ళకి సమ్మతమే అంట". హేమ కి కూడా వరుణ్ నచ్చాడని తెలుసుకున్న రఘురాం గారింట్లో
పెళ్లి సందడి మొదలయింది. కానీ నిశ్చితార్ధానికి మరో మూడు నెలల్లో ముహుర్తాలు లేనందున అంతా ఎదురు చూడాల్సి వచ్చింది.
పెద్దల అంగీకారం తో వరుణ్, హేమ లు ఫోన్ లో మాట్లాడుకోవటం మొదలుపెట్టారు.
"హేమ, పెళ్లి అయినా కూడా మా అన్నయ్యా, నేను కుటుంబం తో పాటు ఉమ్మడిగా ఉండాలనేది మా కోరిక. వేరే కాపురం, విడిగా ఉండటం అనే ఆలోచన మాకు లేదు". హేమ కి కూడా తనకి కాబోయే అత్తగారు, తోడికోడలు నిదానస్తులు గా నే అనిపించి,
తనకి కూడా అందరితో ఉండటం ఇష్టమే కనుక, వరుణ్ చెప్పిన దానికి అభ్యంతరం చెప్పలేదు.
వరుణ్ పది నిమిషాలాగి మళ్ళి ఫోన్ చేసాడు "హేమ, ఇద్దరం ఉద్యోగాలు చేస్తున్నాం. చివరికి ఇద్దరం అలిసిపోతాం. నువ్వు కొన్నాళ్ళు ఉద్యోగం మానేస్తే, మనకంటూ కొంత సమయాన్ని కేటాయించుకోగలం. నేను చెప్పేది కొంచెం శాంతంగా అలోచించి
నీ అభిప్రాయం చెప్పు" అని ముగించాడు. అంత వరకు హుషారుగా మాట్లాడిన హేమకి వరుణ్ మాటలతో గుండె అదిరిపోయింది. వేరే వేరే నగరాల్లో ఉండి, ట్రాన్స్ ఫర్ల కోసం ఎదురుచూస్తున్నా కూడా ఎంతో ఓపికగా కలిసి మెలసి ఉంటున్న
తన సహచరులని చూస్తూనే వుంది.వరుణ్ ది, తనది ఒకే ఊర్లో ఆఫీస్ కాబట్టి , ఉద్యోగం విషయం లో ఎటువంటి అభ్యంతరం చెప్పరు అనే తాను నమ్మింది. ఇప్పుడు వరుణ్ చెప్పిన మాటలకి హేమ కలవరపడుతోంది.
కానీ ఆలోచిస్తే అతను చెప్పిన మాటలు కూడా సబబు గానే తోచింది హేమ కి. ఇన్నేళ్లు ఇష్టమో, కష్టమో చేసింది. కొన్నాళ్ళు ఇంటి పట్టున ఉండి, వరుణ్ తో సమయం గడుపుతూ, అతని ప్రేమని పొందవచ్చని ఒక నిర్ణయానికొచ్చింది.
అదే విషయాన్ని వెంటనే వరుణ్ కి తెలియచేసింది.
"నువ్వు నిజంగా నాకు బాగా నచ్చేసావు హేమ, ఇంత తేలికగా ఒప్పుకుంటావు అనుకోలేదు. నువ్వు కచ్చితం గా మా ఫామిలీ తో తేలికగా కలిసిపోగలవు ". అతని మాటల్లో మొట్ట మొదటి సారి తన మీద అభిమానం తో కూడిన ప్రేమ కనిపించేసరికి
హేమ చాలా ఆనందపడింది. ఆనక వరుణ్ తల్లి, సావిత్రి , మాట్లాడుతూ... "ఎలా వున్నావ్ హేమ, ఎం అంటున్నాడు మా వాడు. నీకు వాడి ఫోటో కావాలని తెగ ఆరాట పడ్డావ్ అంట.వాడు నవ్వితే బాగుంటాడని కూడా అన్నావ్ అట.
బాగానే అలవాటు అయ్యాడన్నమాట మా అబ్బాయి నీకు. అసలు సంగతి ఏంటంటే మా అన్నయ్య గారి కుటుంబం నిన్ను చూడాలనుకుంటున్నారు. పెళ్లి చూపుల రోజు కుదరలేదు. అందుకే ఈ ఆదివారం నాడు వాళ్ళని తీసుకుకొని
మీ ఇంటికి వస్తాం. ఇందాకే మీ నాన్న గారికి ఈ విషయం చెప్పాము. మరి ఉంటానేం. ఆదివారం రోజు కలుద్దాం...హా మర్చిపోయాను, ఆ రోజు ఎరుపు రంగు చీర కట్టుకో, నాకు ఒకలాంటి సెంటిమెంట్ అది. " అని చెప్పి ఫోన్ కట్ చేసింది.
ఆవిడ మాటలకి హేమ కొంచెం ఇబ్బంది పడ్డా, తనకి వరుణ్ ని మరోసారి చూసే అవకాశం రాబోతోందని తెలిసి తెగ సంబరపడిపోయింది. ఆ మరుసటి రోజంతా హేమ కాబోయే అత్తగారు చెప్పినట్టు ఎర్ర చీర సిద్ధం చేసుకోటం లో మునిగిపోయింది.
*************
ఆదివారం నాడు సుమారు పది, పదిహేను మంది రావొచ్చని రఘురాం కుటుంబం భావించారు. కానీ ఆశ్చర్యం, అయిదు కార్లతో ముప్పై మంది కి పైగా వచ్చారు. సావిత్రి గారు హేమ దగ్గరకి వచ్చి, "చూడమ్మాయ్, అందరికి నమస్కారం పెట్టు.
నీకేం భయం లేదు. అదేంటి, ఈ బొట్టు ఇలా పెట్టావ్, కాస్త చిన్నది ఉండాలి. ఈ చెవి ఝంకాలు కొంచెం పెద్దవి వేసుకోవాల్సింది. సరే పోనిలే వాళ్ళు వచ్చేసారు, వెళదాం పద " అని కూడా తీసుకెళ్లింది. అప్పటికే ఆ మంది ని చూసి భయపడుతున్న
హేమకి ఆ మాటలు ఇంకాస్త గందరగోళాన్ని గురి చేస్తున్నాయి. ఆవిడ అందరిని పేరు పేరు న పరిచయం చేస్తూ వెళ్తోంది. హేమ కి అంతా బెరుకుగా, ఆందోళనగా వుంది. వరుణ్ కూడా వీళ్ళ గురించి ఏమి చెప్పలేదు. అతడి వైపు చూసింది.
వరుణ్ ఒక చివరన , ఫోన్ చూసుకుంటూ కూర్చున్నాడు. రఘురాం దంపతులు, వచ్చిన వాళ్ళకి టీ, స్నాక్స్ అందించటం లో మునిగిపోయారు. తన వయసు వాళ్ళే ఒక ముగ్గురు అమ్మాయిలు కనిపించారు హేమ కి.
కానీ వాళ్ళు పెద్దగా ఏమి మాట్లాడకపోయే సరికి, హేమ కూడా మౌనం వహించింది.ఆరోజు తనకి వరుణ్ తో మాట్లాడే అవకాశమే రాలేదు.
ఆనాటి కార్యక్రమం ముగిసి అంతా సెలవు తీసుకున్నాక, సావిత్రి హేమ తో "వెరీ గుడ్ , బాగానే నడుచుకున్నావ్ లే. ఇలానే నేను చెప్పిన మాటలు విను. సరే నా" అని నవ్వుతూ వెళ్లిపోయింది. ఆరోజంతా హేమ అసంతృప్తి గా నే గడిపింది.
ఆరోజు హేమ ఆఫీస్ పని చేసుకుంటుండగా ఫోన్ మోగింది.కట్ చేద్దాం అనుకుంటుంటే, చేస్తున్నది వరుణ్. వెంటనే లిఫ్ట్ చేసి "హలో వరుణ్. ఎం చేస్తున్నావు?"
"నేను హేమ" సావిత్రి గొంతు వినపడే సరికి హేమ అప్రమత్తం అయ్యింది. "ఈరోజు సాయంత్రం నీచేత చీరలు కొనిపిస్తా.
ఆరింటికల్లా నేను చెప్పిన షాప్ కి వచ్చేసేయి." అని చెప్పేసరికల్లా హేమ ఆలోచలో పడింది. తన తల్లి ని పిలువలేదు. పోనీ లే, ఆవిడ తో షాపింగ్ ఎలా ఉంటుందో చూడొచ్చని సిద్ధమైంది. పెద్ద బట్టల షాప్ ముందు కార్ దిగింది హేమ.
వెంటనే వరుణ్ నుండి మెసేజ్. "నేను రావటం లేదు హేమ, కాల్స్ వున్నాయి. అమ్మ నాన్న వస్తున్నారు. నువ్వే మేనేజ్ చేసేయి" అని అంటున్నాడు. హేమ కి కొంచెం నిరాశ గా వున్నా , పైకి వ్యక్తపరచలేదు.
వరుణ్ తల్లి తండ్రులని కలిసాక ముగ్గురు లోపలి వెళ్లారు. హేమ కోసం బట్టలు అని చెప్పిందే కానీ, సావిత్రి మాత్రం తన అభిప్రాయాన్ని అడగలేదు. ఆవిడ చూసినవే బాగున్నాయి అని, అవ్వే హేమకి బాగుంటాయి అని హేమ ని ఒప్పించేసింది.
మొత్తానికి ఏదో కొన్నాం అని అనిపించుకున్నారు. బయటకు వచ్చాక సావిత్రి "ఛీ..ఈ షాప్ లో ఏమి బాగోలేవు. ఎందుకు వచ్చామో ఏంటో. నిశ్చితార్ధానికి, పెళ్ళికి మాత్రం బట్టల కోసం వరంగల్ కే వెళదాం." అని చెప్పుకుంటూ పోతోంది.
హేమ కి మాత్రం అంతా గజిబిజి గా వుంది. ఏమి మాట్లాడకుండా ఇంటికి వచ్చేసింది.
ఆ రోజు రాత్రి...
"ఏం చేస్తున్నావ్ వరుణ్"
"ఇదిగో పక్కబట్టలు కింద వేసి సర్దుతున్నాను. ఇక పాడుకోటమే"
"కిందా? అదేంటి మంచం లేదా?"
"హా...అమ్మ నాన్న మంచం మీద పడుకుంటారు. మేము కింద" బదులిచ్చాడు వరుణ్.
హేమ కి అసలేం జరుగుతోందో అర్ధం అవ్వట్లేదు.
"నువ్వు కిందా ?"
"నేను కాదు. మేము. నేను అన్నయ్య వదిన కూడా కిందే పడుకుంటాం " అని అనటం తో హేమకి విషయం అర్ధం అయ్యింది. అంటే అందరూ కలిసి ఒకే గదిలో పడుకుంటారన్నమాట.
వీళ్లది రెండు పడక గదులు గల విశాలమైన ఇల్లు అని తండ్రి చెప్పటం ఆమెకి గుర్తుకు వచ్చింది. వరుణ్ సంగతి ఎలా వున్నా, వాళ్ళ అన్నయ్య, వదినలకి పెళ్లి అయ్యి ఐదేళ్లు అయింది. వాళ్లకి కూడా ఈ నియమం వర్తిస్తుందా?
హేమ కి తన భవిష్యత్ అంత శూన్యం గా కనిపిస్తోంది. అయినా కూడా ఆవేశం లో నిర్ణయం తీసుకోవద్దని, ఈ విషయమై మెల్లగా వరుణ్ తో మాట్లాడవచ్చని ఊరుకుంది.
వరుణ్ నే గమనిస్తున్న సావిత్రి గారు ఫోన్ తీసుకొని "ఏంటి హేమ, ఇంకా పాడుకోలేదా?"
"లేదు ఆంటీ...ఇప్పుడే మా భోజనాలు అయ్యాయి. మీరు తిన్నారా?"
"మా భోజనాలు ఎప్పుడో అయిపోయాయి. మేము ఈ పాటికి పడుకుండిపోతాము. నువ్వు కూడా రేపటి నుండి త్వరగా తినేసి పడుకో. నీకు కూడా అలవాటు అవ్వాలి కదా. గుడ్ నైట్"అని చెప్పి ఫోన్ పెట్టేసింది.
******************
ఈ సంఘటన అయ్యాక, వరుణ్ తో యాంత్రికం గా నే మాట్లాడుతోందే తప్ప, ఇది వరకటి అభిమానం చూపించలేకపోతోంది హేమ. ఆ పై వారం ఇరు కుటుంబాలు గుడి వెళ్లే కార్యక్రమం పెట్టుకున్నారని తెలుసుకున్న హేమ, ఈసారి ఎలాగైనా వరుణ్ ని,
తనకి కాబోయే అత్తగారిని ఆకట్టుకోవాలని ఉదేశ్యం తో మంచి బట్టలు, చెవి ఝంకాలు కొనుక్కొని తెచ్చుకుంది.
అనుకున్న రోజు రానే వచ్చింది. ఉదయం పదింటికి వచ్చిన వరుణ్ కుటుంబం, గుడి కి వెళ్లి, దర్శనం చేసుకొని, రఘురాం గారి ఆహ్వానం మేరకు మధ్యానానికల్లా వాళ్ళింటికి చేరారు. భోజనాలు అయ్యాక అందరూ పెరట్లో ఉయ్యాలా బల్ల దగ్గరకి చేరారు.
ఆట పాటలతో ఇరు కుటుంబాలు చాలా సందడి గ గడిపారు. సాయంత్రం టీ, ఫలహారం కూడా ముగించుకొని గోపాల రావు కుటుంబం సెలవు తీసుకున్నారు. సరదాగా గడిచిపోయిన ఆ రోజు ని తలుచుకొని
హేమ, గతం లో జరిగిన గందరగోళాలని మర్చిపోయింది.
వెంటనే ఫోన్ తీసుకొని "ఈరోజు చాలా హ్యాపీ గ వుంది వరుణ్. ఇంటికి చేరంగానే చెప్పు" అని మెసేజ్ చేసింది.
గంట అయ్యాక వరుణ్ తో కాల్ లో ..
"ఇంటికి వెళ్లిపోయారా వరుణ్?"
"హాయ్ హేమ...ఇప్పుడే వచ్చాం"
"నాకు ఈరోజు చాలా సంతోషం గా వుంది వరుణ్. ముఖ్యం గా మధ్యాహ్నం ఆడిన ఆటలు...." ఇంకా ఏదో చెప్తుంటే
"ఒక్క నిమిషం ఆగు హేమ. మళ్ళీ చేస్తాను" అని కట్ చేసాడు.
చెప్పినట్టే పది నిమిషాలకి వరుణ్ చేసాడు.
"ఈరోజు నువ్వు వేసుకున్న బట్టలు అస్సలు బాగోలేదు హేమ. ఇంకోసారి ఇలా వేసుకోకు" అన్న వరుణ్ మాటలకి హేమ మనసు చివుక్కుమంది.
వాళ్ళ పద్ధతులని అర్ధం చేసుకొనే, సంప్రదాయం గ వుంటుందనే ఆచి తూచి ఎంచుకున్నా కూడా బాలేదు అనటం హేమ సహించలేకపోయింది,
"ఎందుకు వరుణ్, ఏదైనా అసభ్యం గా ఉందా?"
"అదేం లేదు, ఇంకోసారి ఇలా వేసుకోకు అంతే" అని ఈసారి కొంచెం గట్టిగా నే చెప్పి ఫోన్ పెట్టేసాడు.
హేమ కి ఎం అర్ధం అవ్వలేదు.అంతా శూన్యంగా వుంది.సాఫ్ట్ వేర్ ఉద్యోగం చేస్తున్న కూడా ఏనాడూ అసభ్యకరంగా
బట్టలు వేస్కొదని తనకి పేరు.
అందులోనూ పెళ్లికి సంబంధించిన విషయం కాబట్టి ఇంకా జాగ్రత్త పడింది. ఇందులో వాళ్లకేం నచ్చలేదో అర్ధం కాలేదు హేమకి. ఆలోచన లో ఉండగానే వరుణ్ నుండి ఫోన్ వస్తోంది.
"ఏంటి వరుణ్. ఏమి చెప్పకుండా పెట్టేశావ్?" దిగులు పడుతూనే మాట్లాడుతోంది హేమ.
"నేను హేమ" అవతల సావిత్రి గొంతు.
"హాయ్ ఆంటీ," అన్యమస్కం గా నే చెప్పింది హేమ.
"చూడు హేమ, ఇంకోసారి ఇలాంటి బట్టలు వేసుకోకు. అస్సలు ఏమి బాలేదు. నీకు కావాలి అంటే నాకు చెప్పి ఉంటే నేను కొనిపించి వుండే దాన్ని కదా. నాకు తెలిసిన షాప్ లో ఇంత కంటే మంచివి, తక్కువలో వస్తాయి.
ఆ బట్టలకి, ఝంకాలకి ఎంత ఖర్చు పెట్టి ఉంటావో." అని దాదాపు నిలతీసినట్టే చెప్పేసి ఫోన్ కొడుకుకి ఇచ్చి వెళ్లిపోయింది. హేమ కి ఏడుపు ఆగలేదు.
"వరుణ్, నేను సెలెక్ట్ చేసుకున్న దాంట్లో తప్పు ఏం వుంది. నాకు తెలిసి ఇది మరీ అంతా పిచ్చి గా లేవు. మన ఇళ్లల్లో సాధారణంగా వేసుకునేవే. ఇందులో మీ అమ్మ గారు ఇంతలా తప్పు పట్టాల్సిన అవసరం ఏం వుంది.
కారణం చెప్తేనే కదా నాకు అర్ధం అయ్యేది."
"ఏంటి హేమ ఇంత చిన్న దాని గురించి అంతా లా మాట్లాడుతున్నావ్. మా అమ్మ సొంత కూతురికి చెప్పినట్టు చెప్పుకుంది. ఇందులో ఆవిడ ని తప్పు పడుతున్నావు ఏంటి.?"
"తప్పు పట్టటం కాదు వరుణ్.నాకు కూడా కొన్ని అభిప్రాయాలు ఉంటాయి.వాటిని కూడా గౌరవించమని చెప్తున్నాను. నాకు తెలిసినంత లో కుటుంబ సమావేశాలలో ఎంత సంప్రదాయంగా ఉండాలో అలంటి వాటినే వేసుకున్నాను నేను."
"ఒక్కసారి చెప్తే నీకెందుకు అర్ధం కాదు. బాలేదు అని అంటున్నా కదా ."
"అదే అడుగుతున్నాను. ఎందుకు బాలేదు. మీకోసం ఉద్యోగం మానేయాలి, ఉమ్మడి కుటుంబం లో ఉండాలి, మీకు నచ్చిన చీరలే కొనుక్కోవాలి, ఆఖరికి ఇంట్లో వేసుకొనే బట్టలు కూడా మీ ఇష్ట ప్రకారమే వేసుకోవాలంటే ఎలా వరుణ్.
నేను కూడా ఉద్యోగం చేస్తూ నలుగురిలో ఉండేదాన్ని నాకంటూ కొన్ని అభిరుచులు వుంటాయని మీరెందుకు అర్ధం చేసుకోరు. ఇంత సాధారణ విషయం మీకు ఎందుకు అర్ధం అవ్వట్లేదు? " కొంచెం ఆవేశం గా నే అడిగింది హేమ.
"నువ్వు మా అమ్మ ని చాలా తప్పు గ అర్ధం చేస్కుంటున్నావు హేమ. ఆమె అభిప్రాయం నీతో పంచుకోవటం లో తప్పేం వుంది. ఇంత చిన్నదానికి నువ్వు ఎందుకు ఇంత రాద్ధాంతం చేస్తున్నావు?
"ఇది నాకు మాత్రం చిన్న విషయం కాదు వరుణ్. నేను మీ అమ్మ గారిని కాదు. నువ్వే నన్ను అర్ధం చేసుకోలేకపోతున్నావు."
"నా జీవితం లో ఎవరు నన్ను ఇంత లా ఎదిరించలేదు హేమ. మంచి పిల్లవి, అర్ధం చేసుకుంటావు అని అనుకున్నాను కానీ..." అని ఇంకా ఏదో చెప్పబోతున్న వరుణ్ ఫోన్ ని కట్ చేసేసి తల్లి వొడిలో చేరి బోరున ఏడ్చేసింది హేమ.
ఇన్ని రోజులు సావిత్రి గారి ప్రవర్తన గమనిస్తున్న హేమ తల్లి కూడా కలవర పడింది. ఆడపిల్ల వాళ్ళం అని కూతురికి ఎలాగో ఆలా సర్దిచెప్పుకుంటూ వచ్చింది.
కానీ పరిస్థితి మరీ దారుణం గ ఉండటంతో, తాను కూడా తట్టుకోలేకపోతోంది. హేమ వెంటనే వరుణ్ నెంబర్ బ్లాక్ చేసేసి ఆరోజంతా ఏడుస్తూనే వుంది.
"వరుణ్....హేమ మళ్ళీ మాట్లాడిందా? ఏం అంటోంది పిల్ల?" కొడుకుని అడిగింది సావిత్రి.
"లేదమ్మా...నిన్నటి నుండి మాట్లాడలేదు. నేను ఫోన్ చేసినా కూడా ఎత్తట్లేదు"
అంతే...వెంటనే సావిత్రి భర్త తో పాటు హేమ ఇంటికి వచ్చేసింది. " నీకు ఏమైంది హేమ, వరుణ్ తో మాట్లాడట్లేదు అంట.
నీ ప్రాబ్లెమ్ ఏంటి. మీది చిన్న వయస్సు. క్షణికావేశం లో నిర్ణయాలు తీసుకోకూడదు."
హేమ చాలా సేపు ఏమి మాట్లాడలేదు.
"చెప్పమ్మా, మా అబ్బాయి తో ఏమైనా ఇబంది ఉంటే మేము సర్ది చెబుతాము." మొట్ట మొదటి సరి గోపాలరావు గారు హేమ ని అడిగారు. హేమ కొంచెం దైర్యం తెచ్చుకొని, "మీ అబ్బాయి నన్ను అర్ధం చేసుకోవట్లేదు అంకుల్.
నేను అడిగిన ప్రతి దాన్ని తేలిక గా తీసి పారేస్తున్నాడు."
"వాడు ఎప్పుడు అంతే లే అమ్మ. మేము నచ్చచెబుతాం లే. నువ్వేం కంగారు పడకు. కచ్చితం గా నువ్వే మా ఇంటికి చిన్న కోడలి గా వస్తావు" అని హామీ ఇచ్చి వెళ్లిపోయారు.
మరునాడు , అభిప్రాయం బేధాలు సర్దు మనువుతాయనే నమ్మకం తో రఘురాం గారు, వరుణ్ కి అతని తల్లి కి హేమ చేత క్షమాపణలు చెప్పమన్నారు.
వరుణ్ నే ఊహించుకుంటున్న హేమ, మారు మాట్లాడకుండా తండ్రి చెప్పింది చేయటానికి వరుణ్ నెంబర్ డయల్ చేసింది. ఎప్పటి లాగానే అటు వైపు నుండి ఆడ గొంతు.
"ఆంటీ..అయ్యాం సారీ. నేను వరుణ్ తో ఆలా మాట్లాడి ఉండకుండా ఉండాల్సింది."
"ఉ...."ఆవిడ గొంతు హెచ్చరిస్తున్నట్టు గానే వినపడింది.
"అయ్యాం సారీ ఆంటీ" ఏడుస్తూనే మళ్ళీ చెప్పింది హేమ.
"నువ్వేం చేయగలవు లే అమ్మ. నీకు పెద్దలంటే గౌరవం లేదు. కనీసం నా వయసుకైనా గౌరవం ఇవ్వాలనే ధ్యాస నీకు లేదు. మా అబ్బాయికి రాత్రంతా నిద్ర లేదు. ఆలోచిస్తూనే వున్నాడు. ఇంకా వాడిని ఇబ్బంది పెట్టటం నాకు ఇష్టం లేదు.
నాకు గౌరవం లేని చోట వాడికి కూడా ఉండటం ఇష్టం లేదు. నేను చెప్పేది నీకు అర్ధం అయ్యింది అనుకుంటా" అని తీవ్రంగా చెప్పి పెట్టేసింది సావిత్రి.
హేమ గుండె బద్దలయ్యింది. ఏమి చేసింది తాను? తన తప్పు లేకపోయినా కూడా సంధి కుదుర్చుకోవడానికి క్షమాపణలు కోరింది. ఈనాటి కోడళ్ళు చాలా మంది అత్తగారికి తిండి కూడా పెట్టరే? అలాంటిది వాళ్ళు చెప్పినవన్నీ
రెండో సారి చెప్పించుకోకుండా అంతా అనుసరించింది. అన్నిటికి తోడు "నువ్వు మీ తోటి కోడలు కలిసి ఉండాలి. నీకేం ఇబ్బంది వున్నా ఆమెని అడగొచ్చు" అని సావిత్రి చెప్పిన మాటలు గుర్తొచ్చాయి.
హేమ ఈ మనస్పర్థల గురించి ఆమెతో మాట్లాడే ప్రయత్నం చేసినా కూడా, సంగీత ఏమి మాట్లాడలేదు. దాదాపు సమవయస్కురాలయిన హేమ ని ఓదార్చే ప్రయత్నం కూడా చేయలేదు సంగీత.
వాళ్ళు వచినన్నాళ్లు ప్రేమ గ భోజనం వడ్డిస్తూ , వాళ్ళ ఆశీర్వాదాలు తీసుకునేది హేమ. అలాంటిది నీకు పెద్దలంటే గౌరవమే లేదు అన్న ఆవిడ మాటలు తలుచుకున్నప్పుడల్లా దుఃఖం ఆగట్లేదు.
కచ్చితంగా నువ్వే మా ఇంటికి చిన్న కోడలిగా వస్తావు అని పలికిన వాళ్లేనా కొద్ది గంటల్లోనే సంబంధాన్ని రద్దు చేసుకున్నది? వరుణ్ పట్ల తనకున్న అభిమానం పనికిరానిదా? తాను ప్రేమ లో ఓడిపోయినట్టేనా?
తాను ఇంకా గౌరవించటం, అభిమానించటం, ఆహ్వానించటం, ప్రేమించటం నేర్చుకోవాలా? ఆ మాటగా వస్తే వరుణ్ తన తల్లిదండ్రులకి ఇవ్వాల్సిన కనీస మర్యాద అయినా ఇచ్చాడా?
నేనే కొనిస్తాను అని చెప్పిందే కానీ, మీ ఉదేశ్యం ఏంటి అని ఏనాడూ ఆవిడ తన తల్లి అభిప్రాయాన్ని అడగలేదు. కానీ హేమ మాత్రం అవ్వేమి మనసులో పెట్టుకోవద్దు. రోజు రోజు కి ఆవిడ చెప్పిన మాట వెంటనే పాటించేయాలి.
తాను చిన్న పిల్లలా ప్రవర్తించలేదే. ఉద్యోగం చేస్తూ, బాధ్యతగా అటు తనకి తాను అలాగే తల్లిదండ్రులకి కూడా చేదోడు వాదోడు గ నిలిచింది. వరుణ్ పరిచయమయమైంది ఇరవై రోజులుగా మాత్రమే. కానీ అతనితో తన జీవితాన్ని ఊహించుకుంది.
ఏం నేరం చేసానని వరుణ్ కూడా అంతా తేలికగా వదిలి వెళ్ళిపోయాడు? ఇన్ని రోజూ అతను చూపించిన ప్రేమ నిజమేనా? లేక అతని తల్లి కి నచ్చాను కాబట్టే ఈ సంబంధం ఒప్పుకున్నాడా? ఈ మనోవ్యధ తనకి మాత్రమేనా? వరుణ్ కి లేదా?
ఉండి ఉంటే ఈ పాటికి ఫోన్ చేసేవాడే?
మూడు నెలలు గా ఆమె తీవ్ర నిరాశ లో వుంది. బ్లాక్ చేసిన నెంబర్ ల ని ఆన్ బ్లాక్ చేసింది. ఏ కాల్ వచ్చినా, ఏ మెసేజ్ వచ్చినా అది వరుణ్ నుండే అనుకోని ఆత్రంగా ఎదురు చుసిన హేమ కి నిరాశే మిగిలింది.
హేమ ని ఓదార్చటం జానకి, రఘురాం ల వాళ్ళ అవ్వలేకపోయింది. ఈ విషయం తెలుసుకున్న బంధువులు, స్నేహితులు కూడా చాలా సార్లు అన్ని విధాలా హేమ ని ఓదార్చే ప్రయత్నం చేసారు.
వాళ్ళ మాటలకి హేమ దైర్యం తెచ్చుకున్నా, కేవలం అది ఆ నిమిషం వరకే. వీళ్లంతా ఆమె మనుసుకి తగిలిన గాయం తాలూకా రక్త ప్రవాహాన్ని ఆపగలిగారే కానీ, మచ్చ మాత్రం అలాగే ఉండిపోయింది.
ఆనాడు వీళ్ళతో పాటు వచ్చిన ఆ ముప్పై మందికి కూడా ఈ విషయం తెలిసే ఉంటుంది. కానీ ఏ ఒక్కరు కూడా హేమ ని ఓదార్చే ప్రయత్నం చేయలేదు. బాధాకరమైన విషయం ఏంటంటే,
సంబంధం కుదిర్చిన పరమానందయ్య గారు కూడా,హేమ దే తప్పు అన్నట్లు మాట్లాడేసరికి ఆమె మనసు విరిగిపోయింది.
మనం ఏది ఇస్తే అదే తిరిగి వస్తుంది అంటారు. హేమ మనస్ఫూర్తిగా అభిమానించింది. కానీ తనకి కన్నీళ్లే మిగిలాయి.
********************
"ఆలోచనల్లో నుండి బయటికి వచ్చిన హేమ కళ్ళనుండి నీళ్లు, వెల్లువ లా ప్రవహించే సాగాయి. తన దగ్గరికి వస్తున్న తల్లి రూపం అస్పష్టంగా కనిపించింది.
జానకి హేమ కళ్ళు తుడుస్తూ "హేమ, మన జీవితం లో ఎన్నో ఎదురు దెబ్బలు తగులుతాయి. వాటి గురించే బాధ పడుతూ, ఆలోచిస్తూ ఉంటే మనం ముందుకి సాగలేము. నీ గురించి ఆలోచించని వాళ్ళ కోసం ఎన్ని రోజులని బాధ పడతావ్?
నిత్యం నీ క్షేమం కోరే మా కంటే, నిన్ను బాధ పెట్టిన వాళ్ళే ఎక్కువయ్యరా? మా గురించి ఆలోచించకపోయినా పరవాలేదు. కానీ గతాన్ని తలుచుకుంటూ, నిన్ను నువ్వు కోల్పోకూడదు.
ఇంత కంటే నేను ఏమి చెప్పలేను. ఒక్కటి మాత్రం గుర్తు పెట్టుకో హేమ, నువ్వు బాధ పడుతూ ఉంటే మేము మాత్రం ప్రశాంతంగా ఉండలేము."
ఆడపిల్లకి పెళ్లి చేసి అత్తవారింటికి పంపాలని ప్రతి తల్లిదండ్రుల కోరిక. కానీ పెళ్లి కంటే ముందు ప్రతి అమ్మాయి ఆత్మ విశ్వాసం, ఆర్ధిక స్వేచ్ఛ, ఆత్మ గౌరవం, మనోధైర్యం అనే వాటిని తనకి తాను ప్రతిజ్ఞ చేస్కోవాల్సినవి - నాతిచరామి.