కంచికెళ్ళిన కథ - ఆపాసా

Kanichikellina katha

కంచిలోకి ప్రవేశిస్తూనే నా ఒళ్ళు పులకరించసాగింది. దానికితోడు ఆ ఉషస్సమయంలో నులివెచ్చని సూర్యకిరణాలు శరీరాన్ని తాకుతూవుంటే, ఎంతో ఆహ్లాదకరంగా అనిపించింది.

నేను, నా భార్యా, కామాక్షి అమ్మవారి కోవెల ప్రాంగణంలోకి అడుగుపెట్టాం. అక్కడ, ద్వారంలోనే గజరాజు దర్శనం అయింది. మావటివాడు, ప్రక్కనే నిలబడివుండడంతో, అతడు మాచేతికందించిన అరటి అత్తాన్ని, నిర్భయంగా ఏనుగు తొండం చివర పెట్టాం. అమాంతం ఆ ఆరటిపళ్ళు నోట్లోకి తోసేసుకుంది. సంతోషంగా మా ఇద్దరి తలల్ని తొండంతో, పూజారి శఠగోపం పెట్టినట్టు, మృదువుగా తాకింది.

అదే ‘ఇష్ట కామ్య సిద్ధిరస్తు!’ అని దీవించినట్టు, కామాక్షమ్మవారి ఆశీర్వాదంగా మేమిద్దరం భావించాం. భక్తితో స్వీకరించాం.

మావటివాడికి, పర్సు తీసి నాకు తోచిన గాంధీ బొమ్మున్న పెద్ద నోటొకటి తీసి సమర్పించుకోబోయాను.

అతడు ‘నాకెందుకు డబ్బులు!’ అన్నట్టు విరాగిలా మొహం పెట్టి నావైపు చూశాడు.

అంతలోనే గజరాజు, తొండంతో నా మోచెయ్యి పట్టుకుంది.

తుళ్ళిపడ్డాను!

మావటివాడు తమిళంలో “దానికివ్వండి” అన్నాడు.

ఆ నోటు ఏనుగువైపు చాపేసరికి, అమాంతం అందుకుంది.

ఆ నోటు కూడా అరటిపళ్ళలాగే, ‘గుటకాయ స్వాహా!’ అని అదిరిపడ్డాను.

అబ్బే! నేను భయపడినట్టేం జరగలేదు.

నాచేతిలోంచి తీసుకుని, అదే ఊపుతో తన తొండంతో, ఆనోటుని సదరు మావటివాడికి అందించింది.

వాడు అది అందుకుని, ‘మహాప్రసాదం!’ అన్నట్టు కళ్ళకద్దుకుని, చొక్కా జేబులో పెట్టుకున్నాడు.

‘అమ్మ బైరాగీ!’ అనుకున్నాను.

అప్పుడు ఆ ప్రాంగణంలో పరికించి చూశాను. ధర్మ దర్శనం క్యూ ఖాళీగా కనిపించింది.

ధర్మ దర్శనం చేసుకుందామా! లేక అమ్మవారిని దగ్గరనుండి దర్శించుకోడానికి వేరే ఏదైనా స్పెషల్ మార్గం ఉందా! అని టికెట్ల కౌంటర్ ఎటువైపా? అని అటూయిటూ చూడసాగాను.

ఇంతలో ఎవరో మహానుభావుడు, అమ్మవారి దర్శనం చేసుకుని తిరిగి వెళిపోతున్నాడు కాబోలు, మా ఆవిణ్ణీ నన్నూ చూసి, ఆగాడు. మా ఆవిడతో, తెలుగులోనే, “తెలుగువాళ్ళా? అమ్మవారిని దగ్గరనుంచి దర్శించుకుందాం అనుకుంటున్నారా?” అనడిగాడు.

ఆమె, “ఔనండీ! లోపలకి ఎట్నుంచి వెళ్ళాలో తెలియక. ...” అంది.

అతను తిరిగి కోవెల వైపు దారి తీస్తూ, “ఇలా రండి నాతో”, అని వేరే డైరెక్టు త్రోవగుండా ఒక చిన్న మంటపం దగ్గరకు తీసుకునివెళ్ళాడు. మేమిద్దరం మంత్రముగ్ధుల్లా అతనివెంబడే నడిచాం. అతనితోపాటు ఉండడం మూలానేమో, మమ్మల్ని, అక్కడ సిబ్బంది ఎవరూ అడ్డలేదు. ఏమీ అడగలేదు.

నేరుగా ఆ మంటపం చేరాక, నాతో, “ఇక్కడ మీ చొక్కా విప్పేసి పడేయండి. తిరిగివచ్చి తొడుక్కుందురు గాని, అలాగే బెల్ట్, పర్సువంటి తోలుకి సంబంధించిన వస్తువులు కూడా ఇక్కడే పడేయండి. సెక్యూరిటీ గార్డున్నాడుగా, చూస్తుంటాడు. ఏం ఫరవాలేదు.” అన్నాడు.

“మొబయిల్ లోపలకి తీసుకురాలేదుగా!” అనడిగాడు.

“ఉఁహూఁ!” అన్నాను.

అక్కడ ఒక వేద పండితుడు, కోవెల్లోంచి బయటకు వస్తూ కనిపించాడు. అతనితో, ఇతను, “మా వాళ్ళు!” అని చెప్పాడు.

అతడు, బయటకు వస్తున్నవాడు కాస్తా, వెనుతిరిగాడు.

“నాతో రండి! అమ్మవారిని దగ్గరనుండి చూద్దురుగాని. కుంకుమార్చన కూడా చేయిస్తాను. కానీ, మీరు అమ్మవారిని చూస్తున్నంతసేపు, మాట్లాడకూడదు!” అని చెప్పాడు, మమ్మల్ని తీసుకుని వేరే దారిగుండా గర్భ గుడివైపు దారితీస్తూ.

మమ్మల్ని అంతవరకు తోడ్కొనివచ్చిన మహానుభావుడు, ఈ పండితుడికి మమ్మల్ని అప్పగించేయడంతో, అతని పని అక్కడితో అయిపోయిందన్నట్టు, గిరుక్కున వెనక్కి తిరిగి వచ్చిన దారంబడే వెళిపోయాడు.

మాకిదంతా ఏమిటో అర్థం కాలేదు!

అంతా మాయలా ఉంది!

మారుమాటాడకుండా, ఆ వేదపండితుడితో గుడిలోనికి వెళ్ళాం. అమ్మవారికి మహా అయితే, మూడు అడుగుల దూరంలోనేమో మమ్మల్ని ఒక ప్రక్కగా నిలబెట్టాడు. పరమాశ్చర్యం వేసింది! ‘అద్భుతం!’ అనిపించింది. ఆమె వైపు తదేకంగా తాదాత్మ్యం చెంది చూస్తూవుండిపోయాం!

ఆ అనుభూతి వర్ణనాతీతం!

అది అనుభవించిన మా మనసుకే తెలీదు! అదేంటో!

మాటలలో ఎలా చెప్పను!

అలా ఎన్ని క్షణాలో, నిముషాలో, మాకు తెలీదు, నిలబడిపోయాం! ఆమె కరుణా కటాక్ష వీక్షణాలలో తడిసిపోయాం!

తెలివి వచ్చేసరికి ఆమె పాదాలకి కొంచెం ముందుకివున్న శ్రీచక్రం వద్ద అప్పటికే కుంకుమార్చన జరుగుతోందని స్ఫురణకి వచ్చింది. మమ్మల్ని తోడ్కొని వచ్చిన ఆ పండితోత్తముడు అక్కడ నుంచి కొంచెం కుంకుమ తీసి, మా ఆవిడ చేతిలో వేశాడు.

తిరిగి అతనితోటే, సమాధి స్థితిలాంటి మా అనుభూతినుండి బయటపడలేక, అలాగే నడచి మంటపం వరకు వచ్చాం.

అక్కడ మమ్మల్ని వదిలేసి, అతడి మానాన అతడు చరచరా నడచుకుని బయటకు వెళిపోయాడు.

నేనక్కడే యాంత్రికంగా మంటపం దగ్గర ఆగి, నా చొక్కా వేసుకోసాగాను.

అప్పుడు, సెక్యూరిటీ గార్డు, నాతో, “ఇందాకల ఆఫీసరు గారు, మీరిద్దరూ అతని చెల్లీ, బావగారు అని చెప్పారండీ! కానీ మిమ్మల్నింతకు ముందెప్పుడూ నేను చూళ్ళేదు! ఏవూరు మీది?” అనడిగాడు.

అతడి ప్రశ్నకి ఉలిక్కిపడి ఈలోకంలోకొచ్చి పడ్డాను.

మనసులోనే, ‘అయుండొచ్చు! ఏ జన్మలోనో బంధుత్వముండివుండవచ్చు. ఇలా ఆ ఋణం తీర్చుకొమ్మని, ఆ అమ్మవారే పంపించిందేమో! అతణ్ణి!’ అనుకున్నాను.

గార్డుకి అసంకల్పితంగా, “విజయనగరం.” అని సమాధానమిచ్చేసి, అడుగు ముందుకేశాను.

నాతోపాటే మా ఆవిడ కూడా ప్రాంగణం వైపు నడుస్తూ, మమ్మల్ని ముందు లోపలకి తీసుకువెళ్ళినతనికోసం చూసింది.

అతనికి కృతజ్ఞతలు చెప్పుకుందామని. నేను కూడా చుట్టూ పరికించి చూశాను. కనిపించలేదు.

బయటకి వచ్చి, శివకంచి బయల్దేరుతూ కూడా అతనికోసం చూశాం. జాడ లేదు.

అప్పుడు మా ఆవిడ, నా మనసు గ్రహించినట్టు, “ఏఁవండీ! స్వయంగా కామాక్షి అమ్మవారే, అతడి మనసులో దూరి, మన కోరిక నెరవేరేటట్టు చేసిందేమోనండి! లేకపోతే మనబోటి వాళ్ళకి అంత అదృష్టమా! ఏ జన్మలో చేసుకున్న పుణ్యమో!” అని మురిసిపోయింది.

అప్పుడు మరొకతను, నావైపే చూస్తూవుండడం గమనించాను.

‘ఆఁ ఎవరోలే!’ అని పట్టించుకోలేదు.

--: oo(O)oo :--

కొద్దిసేపట్లోనే శివకంచిలో ప్రసిద్ధిగాంచిన శివాలయానికి చేరుకున్నాం.

దుర్భేద్యమైన కోటలాటి ఆ ‘ఏకాంబరేశ్వరాలయం, ఆలయ ప్రాంగణం’ చూసి, ‘ఆహా! పల్లవులు, చోళులు ఎంత గొప్పవారు! మన దేశ సంస్కృతిని, కళలను, తరతరాలకు తెలిసేలా ఎంత చక్కగా కాపాడారు!’ అనుకున్నాను.

ఆ శిల్ప సౌందర్యాన్ని, అక్కడి కోనేరుని, అందులో ఎగిసెగిసి పడే పెద్ద పెద్ద చేపల్ని, ఆ కోనేటికి అటువైపున వేద వేదాంగాలు, ఇతర శాస్త్రాలు అధ్యయనం చెయ్యటానికి వచ్చే అనేకమంది విద్యార్థులకి అనువుగావుండేలా ఆకాలంలోనే కట్టిన ఆ కట్టడాలని చూస్తూ, మైమరచిపోయాను. ఆ కాలంలోకి వెళిపోయాను.

అలా ఆ గుడి లోపలకి వెళ్ళి, ఏకాంబరేశ్వరుని దర్శించుకుని అక్కడ ఏ మామిడి చెట్టు క్రింద కామాక్షి అమ్మవారు తపస్సు చేసుకున్నారో, అది చూసి ఆ పురాణకాలంలోకి కూడా వెళిపోయాను.

అలా ఆ విశాల ప్రాంగణమంతా తిరుగుతూ, చూస్తూ, తన్మయత్వంతో బయటకివచ్చి అక్కడ ‘నంది’ దగ్గర ఫోటోలు తీసుకోసాగాం.

అప్పుడు చూశాను. అంతకుముందు కామాక్షి అమ్మవారి కోవెల బయట నాకు కనిపించిన వ్యక్తిని! నన్ను ఫాలో అవుతూ ఇక్కడవరకు వచ్చాడు! రావడమే కాకుండా, ఇంతసేపూ నన్నే, గమనిస్తున్నాడనీ అర్థమయింది.

‘సరే! ఎవరోలే! అక్కడ కామాక్షి అమ్మవారు ఎవరో ఒక మహానుభావుణ్ణి మాకోసం గుడిలోకి పంపించినట్టు, ఇక్కడకి ఇతణ్ణి ఈ శివుడే పంపించాడేమో! ఇక్కడ ఇంకేం జరగబోతోందో! ఎవరికి తెలుసు!’ అనుకున్నాను.

అలా అనుకుంటూ మా తదుపరి మజిలీ ‘విష్ణు కంచి’కి బయల్దేరుదామని త్వరపడుతున్నాం.

ఈలోగా మమ్మల్ని వెంబడించిన వ్యక్తి, నా దగ్గరకి వచ్చాడు.

నాతో బాగా పరిచయమున్నవాడిలాగా, “మీరు రచయిత కదా!” అన్నాడు.

“అవును!” అని మొహమాట పడిపోతూ,

“అంత ప్రఖ్యాత రచయితని కాదులెండి. ఏదో అడపాదడపా రాస్తుంటాను. నే రాసినవి వేళ్ళమీద లెక్కెట్టొచ్చు. అయినా నాలాటి అనామక రచయితని కూడా మీరెలా పోల్చారు!” అని నా విస్మయాన్ని దాచుకోకుండా, బహిర్గతం చేశాను.

అతను, చిన్నగా నవ్వాడు.

“మీరంతలా ప్రతి శిల్పాన్ని, కట్టడాన్ని, స్థలాన్ని, పట్టి పట్టి చూస్తూ, ఒళ్ళు మరచిపోతుంటే, ఈలోకాన్నే మరచిపోతుంటే కచ్చితంగా, ఏదోవొక ‘కళాకారులే’ అయుంటారని పోల్చేశాను.

అయితే మీ చేతిలో కుంచెలాటి పరికరాలు లేవు. ‘పెయింటర్’ కాదు. అలాగే ఏ నోట్­బుక్కో, ల్యాప్­టాపో, మరోటో తీసుకుని ఏమీ నోట్ చేసుకోటంలేదు. సో, మీరు రీసెర్చ్ స్కాలర్ కాదు, ఆర్కియాలజీ వాళ్ళు కాదు. మీలో మీరే ఏదో గొణుక్కుంటూ తల తన్మయత్వంతో ఊపేసుకుంటూనో, తొడ కొట్టేసుకుంటూనో లేరు. అందుచేత గాయకులు కాని, సంగీతజ్ఞులు కాని కారు. పోనీ టైట్ పైజామా కుర్తా వేసుకుంటే, ఏ డాన్సరో అనుకునేవాణ్ణి. అదీ లేదు.

మీరు ఎంచక్కా నాలా ప్యాంట్, షర్ట్ వేసుకున్నారు.

‘మరేం అవచ్చు?’ అని ఆలోచించాను.

మీరేం అనుకోకండి; ఇలా అంటున్నానని! మీలా ఏదో పోగొట్టుకున్నవాడిలా, ఒక వస్తువుని చూస్తున్నా దృష్టి అటువైపు కాకుండా దానిగుండా ఇంకెటో, ఎక్కడికో, వెళిపోతూవుండడం. దిక్కులు చూస్తూ, పిచ్చివాడిలా అయోమయావస్థలో మీ వాలకం కనిపించింది.

వెంటనే పసిగట్టేశాను, ‘రచయిత’ అని.

రచయితల్లోనే, అలా మమేకం అయిపోయే గుణం ఎక్కువగా ఉంటుందని, నా అభిప్రాయం.

అంతేకాదు, మీరేదో కథ ప్లాట్ కోసమో, కథలోని పాత్రకోసమో, ఆరంభం కోసమో, మలుపు కోసమో, మంచి ముగింపు కోసమో మథనపడుతున్నారనిపించింది. జుట్టు పీకేసుకుంటున్నారనిపించింది.

సహాయం చెయ్యాలనిపించింది.” అన్నాడు.

నేనతడి విశ్లేషణకి ఆశ్చర్యపోయాను! “నిజమే! ఇవన్నీ చూస్తున్నా, ఈసారి ఏ రసం మీద రాయాలా! అనే ఆలోచిస్తున్నాను.” అన్నాను అసంకల్పితంగా అతనితో.

అతడు “మీరిప్పుడు వెళ్ళేది ‘విష్ణు కంచే’ కదా! ఫరవాలేదు! బోల్డంత టైముంది. 12 వరకు తెరిచేవుంటుంది. ప్రశాంతంగా దర్శనం చేసుకోవచ్చు.

దారిలోనే మా గురువుగారి ఆశ్రమం. ఒక ఐదు నిముషాలు అక్కడ విశ్రాంతి తీసుకోండి. మా గురువుగారు, మీకు అవసరమైన మార్గదర్శనం చేస్తారు. పదండి. నావెనకే.

నాకేం మీరు దక్షిణలు అవీ ఇవ్వకర్లేదు!

మా గురువుగారికి కూడా అలాటి వాటి మీద వ్యామోహం లేదు! మీబోటి రచయితలకి మార్గదర్శనం చెయ్యడమే అతని పరమార్థం! మీరే కలుస్తారుగా! మీకే తెలుస్తుంది!” అని విష్ణు కంచి వైపు దారి తీశాడు.

మేము అతణ్ణి అనుసరించాం.

కొంచెం దూరం ప్రయాణం చేసేసరికి మాకు ఎడంవైపు ఒక ఆశ్రమం పేరు, దాని క్రింద పెద్ద బాణం గుర్తు వేసివున్న బోర్డు, కనిపించింది. అటువైపు మలుపు తిరుగుతూ చూశాను. ఆ బాణం గుర్తు క్రింద ఏదో ‘‘ప్లాట్ కావాలా? 50 నుండి 50000 ...” అని నెమరువేసుకున్నాను. అప్పటికే బోర్డు దాటేశాం. ఆ అంకెల తరవాత ఏముందో చూడలేకపోయాను.

మలుపు తిరిగిన, ఐదే ఐదు నిముషాల్లో ఆశ్రమం చేరిపోయాం.

నేను, నా భార్యా, అక్కడే ఆశ్రమ వాటిక వాకిట్లో చెట్టు క్రింద బెంచీ మీద కూర్చున్నాం.

“ఇక్కడే కూర్చోండి. గురువుగార్ని కలవడానికి, అతని పెర్మిషన్ తీసుకుని వస్తాను.” అని చెప్పి ఆ శిష్య పరమాణువు, లోపలకి వెళ్ళాడు.

మేమిద్దరం ఆ ఆశ్రమ ద్వారం వైపే కుతూహలంగా చూస్తున్నాం.

రెండు నిముషాల్లో, ఒక సాధువు తన పాంకోళ్ళు టకటకలాడించుకుంటూ, కాషాయం ధరించి మెళ్ళో రుద్రాక్ష మాలతో వచ్చాడు. గడ్డాలు మీసాలతో, తలపై ముడివేసిన శిఖతో, ఆ ఆజానుబాహుణ్ణి, ఆ స్ఫురద్రూపుణ్ణి చూసేసరికి, గభాల్న గౌరవంతో, నేను, మా ఆవిడ లేచి నిల్చున్నాం.

“నమస్కారం గురువు గారు!” అన్నాను వినయంతో, అప్రయత్నంగా.

అతడు, “నువ్వా! గురూ! నువ్వేంటిక్కడ? నువ్వెప్పుడు రాయటం మొదలెట్టావ్!” అన్నాడు ఆ స్వామీజీ, నన్ను చూసి ఆశ్చర్యపోతూ.

ఆ కంఠస్వరం వెంటనే గుర్తుపట్టాను. నా చిరకాలమిత్రుడిది! రెండు దశాబ్దాల పైనే అయింది, చివరిసారి విజయనగరంలో కలిసి.

“నువ్వేంటి గురూ! నువ్వేంటిక్కడ! ఈ వేషం ఏంటి?” అనడిగాను నేను కూడా ఆశ్చర్యంగా, తిరిగి చతికిలబడుతూ. అప్పుడు మా పూర్వాశ్రమంలో, ‘ఏరా అంటే ఏరా అని, ఒరేయ్ అని, గురూ అంటే గురూ’ అని అనుకుంటుండే వాళ్ళం. అలాటి స్నేహం మాది.

గబుక్కున ఆ బోర్డు మీద అంకెలు గుర్తొచ్చి,

“ఏమిటి ఈ స్వామీజీ వేషంలో, ప్లాట్లేమన్నా అమ్ముతున్నావా? ఏదో 50 నుండి 50000 వరకు అని కనిపించిందీ? ఏమిటది గజమే? అంత చౌకగానా! 50 కా? అంత ఖరీదైనవి కూడానా! 50000 గజమా?” అనడిగాను.

“గజమా! మూషికమా!” అన్నాడు.

తిరిగి కొనసాగించాడు.

“ఆరోజుల్లో, రోజుకో మంచి కథ, ఆఫ్­కోర్స్ ఏ లైబ్రరీలోని పుస్తకంలోదో, మాయింట్లోని గ్రంథాల్లోదో చదివినదే, మీకొచ్చి చెప్పేవాణ్ణి. ఆ తరవాత మనమంతా కలసి ఆ కథని విశ్లేషించుకునేవాళ్ళం, తీరిగ్గా విమర్శించుకునేవాళ్ళం. ఆ అలవాటు నాకు మెల్ల మెల్లగా వ్యసనం అయిపోయింది.

అక్కడ్నుంచి అలా అలా, దేశమంతా తిరిగాను. ఎక్కడ లేని సాహిత్యం, మన భాష, పర భాష అనే భేదం లేకుండా, నాకు అవకాశమున్నన్ని గ్రంథాలు చదివాను, అధ్యయనం చేశాను. ఔపాశన పట్టేశాను.

చివరకి నేను గ్రహించిందేంటంటే, నాకు తృప్తినిచ్చిన సాహిత్యం గత నాలుగు-ఐదు దశాబ్దాలలో ఎక్కువగా రాలేదు. ముఖ్యంగా మన భాషలో.

ఇప్పుడసలు చదివేవాళ్ళకంటే, రాసేవాళ్ళే ఎక్కువయిపోయారు.

అంతా స్పీడ్ అయిపోయింది. ఎవరికీ ఓపికల్లేవు. పెద్ద పెద్ద కథలు చదివేంత తీరికలేకుండా అయిపోయారు. అందుకని పత్రికలు కూడా పాపం ఎంత చిన్న కథ రాయగలిగితే అంత గొప్ప అన్న స్థాయికి ఎదిగిపోయాయి.

అలాగే నీలాటి కొందరు చాదస్తపు రచయితలు/రచయిత్రులు ఏ రసంలో వ్రాయాలీ, ఏ జోనర్­లో వ్రాయాలీ అన్నది తెలియక తికమక పడిపోతున్నారు.

అందుకే అలాటి రచయిత/త్రులకి, ఇప్పుడు ట్రెండ్ ఎలావుంది? ఏమిటి వ్రాయాలి? అన్నది మార్గదర్శనం చెయ్యడమే నా ప్రథమ కర్తవ్యంగా భావించి, నాకు తోచిన విధంలో ఉచిత సేవ చేస్తున్నాను.

నీకు తెలుసుగా, పెద్దలు మిగిల్చిపోయిన ఆస్తులు నాకు చాలానే ఉన్నాయి. వాటిలో కొంత మనవూరిలోవున్నవి అమ్మి పారేసి, ఇక్కడ చౌకలో దొరికితే కొంచెం ఎక్కువ వ్యవసాయ భూమి కొన్నాను. అవన్నీ నా శిష్యులే చూసుకుంటారు. నేను ఇదిగో ఇలా ఈ ఫార్మ్­హౌస్­లో ఈ మూల ఒక పర్ణశాల వేసుకుని ఇందులో కూర్చుంటాను.

నీలాటి వారికి ‘రచన’ల గురించి ‘ఉచిత’ అంటే ‘ఫ్రీ’ సలహాలు ఇస్తూ ఉంటాను.

కొందరికి వ్రాయాలనే కుతూహలం, భాష మీద పట్టు, మక్కువ ఉంటుంది. కానీ ‘ప్లాట్’ దొరకదు.

‘కథ కంచికి’ అని తెలుగు కథలన్నీ చేరేది ఇక్కడకే అని తలచి నీలాటి రచయిత/త్రులంతా చివరికి ఇక్కడకే చేరి, తమకొక కథయినా దొరక్కపోతుందా అని ఆశతో వెదుక్కోటానికి వస్తారని తలచి; నేను ఇక్కడే ఈ కంచిలోనే ఈ ఆశ్రమం పెట్టాను.

నీలాటివారికి ప్లాట్ చెబుతాను.

అది 50 పదాలదైనా 50,000 మాటలదైనా సరే, చెప్పగలను.

‘ఔనా!’ అని ఆశ్చర్యపోయాను.

“ఒక వాక్యంలో నాలుగే నాలుగు మాటల్లో ఒక కథకి ‘ప్లాట్’ చెప్పగలవా? క్లయిమాక్స్ అదిరిపోవాలి.” అని ఏమిటి చెప్తాడో చూద్దామని కుతూహలంతో అడిగాను.

అతడు ఆశువుగా, ‘ఓ!’ అని, ప్లాట్ చెప్పాడు.

ఒక వాక్యంలో, నాలుగు మాటల్లో!

“వాళ్ళిద్దరూ ప్రేమించుకున్నారు. పెళ్ళి చేసుకోలేదు!”

నా ఉత్సాహం పెచ్చు మీరింది.

“పది మాటల్లో మరో మంచి ప్లాట్? మలుపు ఉండాలి. క్లయిమాక్స్ నా ఊహకి అందకూడదు.” అని మెలికపెట్టాను, ప్రోత్సహిస్తూ.

“వాళ్ళిద్దరూ ప్రేమించుకున్నారు.” అని రెండు మాటలతో మొదలెట్టి, “ఆమెకి సడన్­గా మరొకతడిపై ప్రేమ కలిగింది.” అని ఐదు పదాలతో మలుపు తిప్పి, చిన్న విరామం తరవాత, మరో మూడు ముక్కలు “మొదటివాడు ఆమెని చంపేశాడు.” అని ముగించి షాక్ ఇచ్చాడు!

నేను వాడి పాండిత్య ప్రతిభకి అబ్బురపడ్డాను!

“అది సరే గాని, గురూ! మాటి మాటికీ నువ్వు ‘ప్రేమ’ చుట్టూరానే ప్లాట్లు చెబుతున్నావేంటి?

‘ఎన్ని వర్డ్స్ ప్లాట్’ అడిగినా 'ప్రేమే' చెప్తావా? మరోటి ఉండదా జీవితంలో! ఐ మీన్ సాహిత్యంలో!” అనడిగాను, అనుమాన నివృత్తికోసం.

“ఓరి పిచ్చాడా! ఎక్కుడున్నావు నువ్వు? ఏ లోకంలో ఉన్నావు? ఇప్పుడు కథలు చదివే వాళ్ళు తక్కువయిపోయారన్నాను కదూ ఇందాకలా!

ఇంకా సరిగా చెప్పాలంటే, ‘కొని చదివేవాళ్ళు’ ఇంకా బాగా తక్కువయిపోయారు! వృద్ధులు, వయోవృద్ధులకి కొనగలిగే స్థోమత లేదు. పిల్లలకి ఏదన్నా తినేదో, త్రాగేదో, ఆడుకునేదో అయితే కొన బుద్ధి వేస్తుంది గాని, నవలో, పత్రికో, కథల పుస్తకమో కొన బుద్ధి వెయ్యదు. అందుచేత వాళ్ళూ చదవరు.

అలాటప్పుడు, నిజానికి ‘కొని చదివే వాళ్ళు ఎవరు?’ పడుచు వాళ్ళు. వాళ్ళకే డబ్బులు పెట్టి కొనగలిగే సామర్ధ్యం ఉంది.

వారికి ఏ రుచి కావాలో, ఏ రసం అందించాలో, అదే బజార్లో అమ్ముడవుతుంది. దానికే గిరాకీ!

అర్థమయిందా!

అందుచేత, ‘ప్రేమ’, ‘సెక్సు’, ‘శృంగారం’ ఇవే ప్లాట్స్ ఉండాలి.

అంతేకాదు! నీ చుట్టూ జరుగుతున్నవీ, నీ సమాజంలో ప్రస్తుతం ఉన్నవీ ఎవడిక్కావాలి? అవెలాగా వాళ్లకి తెలుసు! అవక్కర్లేదు! ఊహాలోకాల్లోకి తీసుకువెళ్ళేవి, అభూత కల్పనలు, సహజంగా జరగనివి, కృత్రిమంగా, కృతకంగా ఉన్నవి అయితేనే, చదవడానికి భిన్నంగా ఉండి, యువ పాఠకుడు ఆనందిస్తాడు.

పాఠకుడు చదివేది, నీబోటి వాడి నీతులు, హితబోధలు వినడానికి కాదు.

వినోదం కోసం!

కొద్దిసేపు దైనందిన జీవితంలోంచి తప్పించుకుని మనసు తేలికపడేలా ఎక్కడెక్కడో విహరించి రావటానికి.

ఇప్పుడైనా, ఏమిటి వ్రాయడమా, ఎలా వ్రాయడమా అని ఆలోచిస్తూ, విరాగిలా అయిపోకు. జుత్తుపీకేసుకోకు.

నువ్వేదివ్వగలవో అది ఇవ్వకు.

అదెవరికీ అక్కర్లేదు!

అది కంచికి వెళిపోయినట్టే!

వారికేది కావాలో అది ఇవ్వు! అదెప్పటికీ కంచికి వెళ్ళదు! అజరామరం! సదా అమృతం త్రాగిన అమరుల్లా నవయవ్వనంలోనే ఉంటుంది. ...”

వాడు చెబుతున్న మాటలు నాకింక విన బుద్ధి వెయ్యలేదు!

వాడి మార్గదర్శనం తీసుకోదలచుకోలేదు!

వాడి మీద అసహ్యంతో లేచి, “ఇక వస్తాం గురూ! ఇక్కడ్నుంచి ఇలా విష్ణు కంచి చూసుకుని, అక్కడ్నుంచి అలా వేలూర్ శ్రీపురం లక్ష్మీదేవిని చూసుకుని, అలా బెంగళూరు వెళిపోతాం! మళ్ళీ ఇటు రాం!” అని చెప్పాను.

మనసులో మాత్రం, ‘ఇక ఛస్తే ఇటువైపు రాం! నీ దగ్గరకి, నీ ఛాయలకి ససేమిరా రాం! రాం రాం ...’ అని అనుకున్నాను.

ఆశ్రమం నుండి బయటపడేసరికి.

మేమిద్దరం ‘అమ్మయ్య!’ అని ఊపిరి పీల్చుకున్నాం.

మా ఆవిడ నాకో మంచి సలహా, “మీరు మాత్రం మీ పంథాలోనే రాయండి.” అని ఇచ్చింది.

అంతేకాదు, “మీ కథ ఎప్పుడూ కంచికి వెళ్ళదు!” అని ధీమా నింపింది. “ఎందుకంటే, మీపై కామాక్షమ్మ వారి కటాక్షం ఉందని, ఇందాకల అమ్మవారి కోవెలలోనే ఋజువయిపోయింది. ఈ ‘గురూ’ మాటలు పట్టించుకోకండి.” అని సలహా ఇచ్చింది.

--: oo(O)oo :--

మరిన్ని కథలు

Bakkati pellam-laavati mogudu
బక్కటి పెళ్ళాం - లావాటి మొగుడు
- మంత్రిప్రగడ ఆంజనేయులు
Barlo taagudu intlo vaagudu
బార్లో తాగుడు - ఇంట్లో వాగుడు
- మంత్రిప్రగడ ఆంజనేయులు
Panipilla
పనిపిల్ల (క్రైమ్ కథ)
- చెన్నూరి సుదర్శన్
Bhavaateetam
భావాతీతం
- DODDIPATLA KALYAN KISHORE
Prema falam
ప్రేమ ఫలం
- పి. రాజేంద్రప్రసాద్
Neethone nenunta
నీతోనే నేనుంటా
- కాశీవిశ్వనాధం పట్రాయుడు
Amlet damlet
ఆంమ్లేట్ - డాంమ్లేట్ .
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు