సర్ప్రైజ్ షాక్ - కందర్ప మూర్తి

Surprise shock

పద్మనాభరావు బేంక్ సర్వీస్ ఎగ్జామ్స్ రాసి ఉద్యోగం సంపాదించేడు.

తెగ పొదుపరి. అన్నిటికీ జమాఖర్చులు రాసి పొదుపు పాటిస్తుంటాడు.
డ్యూటీకి వెళ్లేటప్పుడు పెద్దగా వర్షం, ట్రాఫిక్ సిగ్నల్సుతో పెట్రోల్ ఖర్చు
ఎక్కువౌతుందని స్వంత విహికిల్ వదిలి ఆర్టీసీ బస్ మీద ప్రయాణం చేస్తుంటాడు. లోన్ తీసుకుని కొన్న యమహా మోటర్ సైకిల్ నెల నెలా
ఎంత మైలేజ్, పెట్రోల్ మైంటినెన్స్ వివరాలు నోట్ చేస్తుంటాడు. బస్ చార్జీలతో సరిచూస్తాడు. ఈ వ్యవహారాలు చూసిన అతని సహచరులు
బడ్జెట్ పద్మనాభం అని నిక్ నేమ్ తగిల్చారు.
పద్మనాభం తండ్రి సుందరం గారు గ్రామ కరణం మున్సబు ఉద్యోగం
చేసేవారు.సంవత్సరాని కొకసారి తాలూకా ఆఫీసులో వారం పదిరోజులు
జమాబంది లెక్కల కోసం బయట ఉండేవారు. కాలక్రమేణ గ్రామాల్లో
కరణం మున్సబ్ ఉద్యోగాలు పోయి విలేజ్ రెవిన్యూ ఆఫీసర్ పోస్టులు
వచ్చి మొత్తం గ్రామీణ పరిపాలనా విధానమే మారిపోయింది.
భార్య చని పోవడంతో ఒక్కగానొక్క కొడుకును మేనత్త పెంచి
పెద్ద చేసింది. డిగ్రీ పూర్తయిన తర్వాత కొడుక్కి సుందరం గారు రెవెన్యూ
శాఖలో ఉద్యోగం కోసం ప్రయత్నింస్తుంటే ఆ ఉద్యోగం ఇష్టం లేని
పద్మనాభం బేంక్ సెలక్షన్ ఎగ్జామ్స్ రాసి సెలక్టయి జాబ్ సంపాదించాడు.
చిన్నప్పటి నుంచి తండ్రి అడుగు జాడల్లో నడిచి సంపాదనలో పొదుపు
నేర్చుకున్నాడు. పద్మనాభం దగ్గర ఒక ప్రత్యేకత ఉంది. ఏదైనా పని చేస్తే
సర్ప్రైజ్ కనపర్చాలనుకుంటాడు. శలవులో ఇంటికి వచ్చినా ముందుగా
తెలియచేసే వాడు కాదు.తండ్రి పెళ్లి సంబంధాలు చూస్తుంటే అత్తవారింటి
నుంచి ఆదాయం ఎంత వస్తుంది, ఆస్థిపాస్తులు లెక్కలు చూసేవాడు.
ఇలా ఒకటిరెండు మంచి సంబంధాలు వచ్చినా కట్నకానుకలు తను
అనుకున్నట్టు రావడం లేదని వదులు కున్నాడు. నేను బతికుండగా
పెళ్లి చేసుకుని కోడల్ని తెమ్మని సుందరం గారు బ్రతిమాలినా వినలేదు.
బేంక్ లో పద్మనాభంతో పని చేసే ఒక అమ్మాయిని ఇష్టపడినా అతని
పొదుపు పిసినారితనం తెల్సి ఒప్పుకోలేదు.
అనుకోకుండా పద్మనాభానికి ప్రమోషన్ మీద ఉత్తరాదికి పోష్టింగ్ వచ్చింది.
సేలరీ పెరుగుతుందన్న ఆనందంలో, తండ్రి అంతదూరం ఎందుకురా
అంటున్నా వినకుండా కొత్త ఉద్యోగంలో జాయిన్ అయాడు. ఇంటికి
రావాలంటే ఒకరోజు ప్రయాణం. ట్రైన్ చార్జీలు ఎక్కువని ఎప్పుడో కాని
ఇంటికి వచ్చేవాడు కాదు. కొడుకును చూడాలని సుందరం గారు ఎన్ని
సమాచారాలు పంపినా వచ్చేవాడు కాదు. అందువల్ల ఆయన ఆరోగ్యం
బాగులేదని కబురు పంపితే ఊరికి వచ్చిన పద్మనాభానికి అదంతా తనని
రప్పించడానికేనని తెలిసి అగ్గి మీద గుగ్గిలమయాడు.
కొద్ది రోజుల తర్వాత నిజంగానే సుందరం గారికి సుస్తీ చేసింది.
లేవలేని స్థితి. కొడుకును చూడాలని తహతహలాడుతున్నారు. ఎన్ని
సమాచారాలు పంపినా తనని రప్పించడం కోసమేనని లైట్ గా
తీసుకునేవాడు.
సుందరం గారు నిజంగానే సీరియస్ అని మేనమామ పంపిన
సమాచారం తెల్సి వెంటనే శలవు పెట్టి ఇంటికి వచ్చిన పద్మనాభానికి
గుమ్మంలో తండ్రి పార్థివ శరీరం స్వాగతం పలికింది. ఆఖరి సమయంలో
కొడుకు ముఖం చూడాలనుకున్న సుందరం గారి కోరిక తీరకుండానే
పోయారు.కొడుకు పద్మనాభానికి సర్ప్రైజ్ షాక్ ఇచ్చారు సుందరం గారు.
* * *

మరిన్ని కథలు

Panipilla
పనిపిల్ల (క్రైమ్ కథ)
- చెన్నూరి సుదర్శన్
Bhavaateetam
భావాతీతం
- DODDIPATLA KALYAN KISHORE
Prema falam
ప్రేమ ఫలం
- పి. రాజేంద్రప్రసాద్
Neethone nenunta
నీతోనే నేనుంటా
- కాశీవిశ్వనాధం పట్రాయుడు
Amlet damlet
ఆంమ్లేట్ - డాంమ్లేట్ .
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
REkkala kastam
రెక్కల కష్టం
- వరలక్ష్మి నున్న