నవ్వకండి! ఏడవండి! ప్లీజ్! - V C S S V SRINIVASU

Navvakandi Edavandi please

తెనాలిని ఆనుకొని ఉన్న ఓ పల్లెటూళ్ళో 'పరోపకారం హాస్పిటల్' అనే పేరుతో ఆసుపత్రిని నిర్వహిస్తున్నారు డాక్టర్ పాపారావ్, డాక్టర్ పంకజం దంపతులు. ఆ ఊళ్ళోనే కాక, పక్క ఊళ్ళల్లోకూడా ఎవరికి కడుపొచ్చినా, కాలునొచ్చినా ఈ ఆసుపత్రే దిక్కు. ఓ రోజు, "డాక్టర్! డాక్టర్!" అంటూ కంగారుగా అరుస్తూ డాక్టర్ గదికి పరిగెత్తుకొచ్చింది సిస్టర్. ఓ పేషంటుకు పదినిముషాలనుంచి ఎంతో శ్రద్ధతో ఇంజక్షన్ ఇస్తున్న డాక్టర్ పాపారావ్, సిస్టర్ అరుపులకు అదిరిపడడంతో, అతని చేతిలోని సూది పేషంటు నడుములో ఠక్కుమని విరిగిపోయింది. "అయ్యబాబోయ్! చచ్చాను డాక్టర్!" అరిచాడు బాధతో పేషంటు. "అబ్బబ్బా! ఏంటయ్యా! అటు ఆ సిస్టర్ కంగారుతో, ఇటు నువ్వేమో బాధతో 'డాక్టర్ డాక్టర్' అని అరుస్తుంటే, నేనెలా చచ్చేదీ?" పేషంటును విసుక్కుంటూ సిస్టర్ వైపు చూశాడు డాక్టర్ పాపారావ్ ఏంటి సంగతన్నట్లు. "డాక్టర్! మూడో నంబరు బెడ్ మీదున్న అమ్మాయి ఓ మగపిల్లాడ్ని ప్రసవించింది......" అని ఆమె ఇంకా ఏదో చెప్పబోయింది. డాక్టర్ పాపారావ్ మధ్యలో అడ్డుకొని, "చాలా బాగుందమ్మా! బ్యాంకన్నాక అరువిస్తుంది - గర్భిణన్నాక ప్రసవిస్తుంది. ఇందులో అంతలా ఆశ్చర్యపోయేదేముంది?" అసహనంగా అన్నాడు. "అది కాదు డాక్టర్! పుట్టగానే 'కేర్ కేర్' మని ఏడవాల్సిన ఆ పసికందు 'హి...హి...' అంటూ విరగబడి నవ్వుతున్నాడు" అసలు సంగతి చెప్పింది సిస్టర్. "నవ్వుతున్నడా!" అదిరిపడ్డాడు డాక్టర్ పాపారావ్. వెంటనే తేరుకుని, 'పద చూద్దామని' సిస్టర్ తో చెప్పి, నడుములో సూది విరిగిపోయిన పేషంటువైపు తిరిగి "ఏమయ్యా! విరిగిపోయిన సూది సులభంగా బయటికి రాడానికి మంచి ఉపాయమేదైనా ఈలోపు ఆలోచించి పెట్టుకో. నేను రాగానే, ఆ ప్రకారం చేసేద్దాం. సరేనా?" అని పసికందును చూడ్డానికి పరుగుతీశాడు. ఆపకుండా నవ్వుతున్న పసికందును తేరిపారచూసి బుర్ర గోక్కున్నాడు డాక్టర్ పాపారావ్. "ఏవండీ! ఇలాంటి కేసును ఎప్పుడూ చూడలేదు. దీనికేమీ పరిష్కారంలేదా?" భర్తనడిగింది డాక్టర్ పంకజం. "పంకజం! నువ్వేమీ కంగారుపడకు. ఇలాంటి చిత్రమైన మెడికో సమస్యలకు చక్కని పరిష్కారాలు చెప్పే మా గురువుగారు డాక్టర్ గుర్నాధంగారిని ఇప్పుడే పిలిపిస్తాను" అని డాక్టర్ గుర్నాధంగారికి ఫోన్ చేశాడు డాక్టర్ పాపారావ్. "హలో! గురువుగారు! నేను డాక్టర్ పాపారావ్ ని. మీరు అర్జంటుగా ఓసారి మా హాస్పిటల్ కు రావాలండి". "అబ్బే కుదరదయ్యా! రేపు మా పెళ్ళిరోజు" చెప్పారు డాక్టర్ గుర్నాధంగారు. "అయ్యో! నేనన్నది రేపు కాదండి. ఇవాళే. ఇపుడే" ఆయన సరిగ్గా వినలేదేమోనని నొక్కి చెప్పాడు డాక్టర్ పాపారావ్. "నేను సరిగ్గానే విన్ననయ్యా! కాని, రేపు లక్షరూపాయలు పెట్టి చీర కొనాలని మా ఆవిడ నా పీకమీద కత్తి పెట్టింది. ఆ కత్తిని ఇవాళ ఏ పేషంటుమీదో దింపితేనే కదా మా ఆవిడకు నేను చీర కొనగలిగేది!" "గురువుగారూ...... మీ ఆవిడకు ఆ చీరేదో నేను కొనిపెడతాను. కాని, దయచేసి మీరు ఉన్న ఫళాన రావాలండి" వేడుకొన్నాడు డాక్టర్ పాపారావ్. "ఛ!ఛ! మా ఆవిడకు నువ్వు చీర కొనడమేంటయ్యా అసహ్యంగా" చిరాగ్గా అన్నారు డాక్టర్ గుర్నాధంగారు. "పోన్లెండి బాబూ! ఆ చీర కొనడానికయ్యే డబ్బేదో నేనిచ్చుకుంటాను సరేనా! కాని, మీరు మాత్రం దయచేసి వెంటనే రావాలి. ఎందుకంటే, మా ఆసుపత్రి పరువుకు సంబంధించిన సమస్యొకటి వచ్చి పడింది". ఇక ఎక్కువగా బ్రతిమాలించుకోడం బావుండదని డాక్టర్ గుర్నాధంగారు పదినిముషాల్లో పరోపకారం హాస్పిటల్లో వాలిపోయారు. ఎవరో చక్కిలిగింతలు పెడుతున్నట్లుగా విపరీతంగా నవ్వుతున్న పసిగుడ్డును తీక్షణంగా పరిశీలించి నోరిప్పారాయన. "ఊఁ... అరవై ఏళ్ళ తర్వాత మరోసారి ఉపద్రవం పుట్టిందన్నమాట" తల పంకిస్తూ అన్నారు డాక్టర్ గుర్నాధంగారు. ఉపద్రవం అన్నమాట వినగానే పసిబిడ్డడి తల్లి బెంబేలెత్తిపోయి, డాక్టర్ పాపారావ్ మెడలోని స్టెతస్కోపును రెండు చేతులతో పట్టుకొని బిగించేస్తూ "డాక్టర్! ఈ పెద్ద డాక్టర్ గారు ఉపద్రవం అంటుంటే నాకేదో భయంగా ఉంది. నా బిడ్డవల్ల ఏదైనా అనర్ధం జరుగుతుందా? లేకపోతే, వాడికేదైనా అవుతుందా? అసలు నా బిడ్డ నవ్వడం ఆపుతాడా లేదా?" ప్రశ్నల పరంపరను కురిపించింది. "తల్లీ! నీ బిడ్డ నవ్వడం ఆపుతాడో లేదో చూద్దాంగాని, నువ్వీ స్టెతస్కోపు వదలకపోతే నేను ఊపిరి ఆపేసేలా ఉన్నాను" అని ఆమె చేతులనుంచి తన స్టెతస్కోపును వదిలించుకున్నాడు. డాక్టర్ గుర్నాధంగారివైపు తిరిగి, "గురువుగారు! ఈ ఉపద్రవమేమీటండీ! అసలీ సమస్యకు పరిష్కారం ఉందా లేదా?" టెన్షను తట్టుకోలేక అడిగాడు డాక్టర్ పాపారావ్. "పాపారావ్! ఉపద్రవమని ఎందుకన్నానో నా గతం చెప్తే నీకే అర్ధమవుతుంది. అయినా, నా గతం వినగానే, ఈ సమస్యకు పరిష్కారం నీ నోటితో నువ్వే చెప్తావు" అని డాక్టర్ గుర్నాధంగారు తన గతాన్నిలా చెప్పుకొచ్చారు. "సరిగ్గా అరవై ఏళ్ళ క్రితం నేనూ ఇలాగే నవ్వుతూ పుట్టాను. నా నవ్వు వల్ల సమాజానికి, నాకు మంచికన్నా చెడే ఎక్కువ జరిగేది. నాకెవరిమీదైనా కోపం వచ్చి వాళ్ళని తీక్షణంగా చూసి నవ్వితే, వారి కాలో, చెయ్యో విరగడమో లేక కాపురం కూలడమో జరిగేది. నాకు కాస్త జ్ఞానం రాగానే, ఇలా చేయడం తప్పని నన్ను నేను చాలా నిగ్రహించుకున్నాను. నాకున్న ఈ విపరీత నవ్వు సమస్యవల్ల, నన్ను బళ్ళోనుంచి రెండు, మూడుసార్లు గెంటేసారు. నా చదువు పెరిగినట్టే, కళాశాలలో కాలుపెట్టేటప్పటికి నా నవ్వు కూడా పెరిగింది. నా నవ్వును అపార్ధంచేసుకున్న అమ్మాయిలు నా చెంపలు పగలకొట్టడాలు, నా నవ్వును తగ్గించాలని నా మిత్రులు సూదులతో గుచ్చడాలు జరిగాయి. కాని, ఐదు నిముషాలే ఆ బాధ. మళ్ళీ నవ్వేనవ్వు. తరగతిలోకూడా ఉపాధ్యాయులు చెప్పే విషయాలకు విపరీతంగా నవ్వేవాడిని. అదృష్టమేమిటంటే, నేను బాగా చదివే విద్యార్ధినవడంవల్ల నన్ను తిట్టేవారుకాదు. మా తరగతిలో ఒక అమ్మాయుండేది. ఎప్పుడూ ఏదో కోల్పోయినదానిలా చాలా గుంభనంగా ఉండేది. కోపం కూడా బాగా ఎక్కువే. ఎవరితోనూ మాట్లాడేదికాదు. ఎప్పుడూ నన్నే గమనిస్తుండేది. ఒకరోజు విరామసమయంలో, తరగతిలో ఒంటరిగా కూర్చున్న ఆమెను చూసి, ఎప్పుడూ అలా గుంభనంగా ఉంటే జీవితం చాలా చప్పగా ఉంటుందని, ఏమీ సాధించలేమని, కాబట్టి, నాఅంత కాకపోయినా, వీలైనంతవరకు నవ్వుతూ జీవితాన్ని ఆస్వాదించాలని, నవ్వే అదృష్టం మనుషులకే ఉందని, ఇంకా ఎన్నో విషయాలు ఓ పావుగంట చెప్పాను. మర్నాడు ఆ అమ్మాయి, ఓ ప్రదేశం పేరు చెప్పి, సాయంత్రం ఆరుగంటలకు తనను అక్కడ ఒంటరిగా కలవమని చెప్పింది. ఆహా! నా సుభాషితాలు చాలా బాగా నచ్చినట్లున్నాయి. కళాశాలలో అయితే బావుండదని బయటకలవమంది అనుకొని చాలా సంతోషించాను. ఆమెను నవ్వించడానికి బోలెడన్ని జోక్స్ సిద్ధంచేసుకుని, ఆమె చెప్పిన ప్రదేశానికి చేరేంతలో, అక్కడ ఒక గుంపు కనిపించింది. నలుగురైదుగురు ఆడవాళ్ళు, ఓ పదిమందిదాకా మగవాళ్ళు ఉన్నారు. ఓహో! ఆ అమ్మాయే కాదు, వాళ్ళందరూ నవ్వలేని సమస్యతో బాధపడుతున్నట్లున్నారు. అందుకే, వాళ్ళనూ తీసుకొచ్చింది. మరీ మంచిది. ఆ అమ్మాయితో పాటు, వాళ్ళందరినీ నవ్వించే అవకాశం భలేగా దక్కింది అని సంబరపడ్డాను. గుంపుదగ్గరకెళ్ళి వాళ్ళను పరిశీలనగా చూశాను. అందరూ చీమకుట్టినవాళ్ళలా చిరాకు మొహాలతో ఉన్నారు. ఆమె దగ్గరకెళ్ళి వీళ్ళంతా ఎవరని అడిగాను. నాకేం జవాబు చెప్పకుండా, ఆమె తన పక్కనే ఉన్నతనికి నన్ను చూపించింది. అతనికి ఆమె పోలికలు బాగా ఉన్నాయి. బహుశా, ఆమె అన్నయ్య అయివుంటాడు. నా దగ్గరకొచ్చి నా చొక్కా గుండీలు విప్పడం మొదలెట్టాడు. అసలే నేను నవ్వులబండిని. ఈ పనికి నాకు నవ్వాగడంలేదు. నవ్వుతూనే, మాట్లాడలేక చేతులతోనే సైగ చేశాను, ఎందుకన్నట్లు. అతనూ సైగలే చేశాడు, కాసేపు ఒపికపట్టమన్నట్లు. చొక్కా విప్పేశాడు. ఆడవాళ్ళుకూడా ఉండటంతో, కాస్త సిగ్గనిపించినా, నాకు నవ్వాగడంలేదు. అయినా, కాస్త నా నవ్వు తగ్గించుకుని, మీ అందరూ కూర్చుంటే, మీకు చాలా విషయాలు చెప్పి నవ్విస్తానన్నాను. అక్కర్లేదు, నీకే మేము ఓ విషయం చెప్తాం అన్నారు. ఓ పొడవాటి తాడును తీసుకొచ్చారు. నన్ను అక్కడున్న చింతచెట్టు దగ్గరికి తీసుకెళ్ళారు. నాకేం అర్ధంకావడంలేదు. ఆ చెట్టుకి నన్ను కట్టేశారు. గుంపులో ఒకడొచ్చి చింతబరికెతో నాకొక్కటిచ్చాడు. నొప్పితోనే నవ్వుతూ అడిగాను. ఎందుకు కొడుతున్నారని. ఆ అమ్మాయి అన్న చెప్పడం మొదలెట్టాడు. "మా చెల్లిని నవ్వమంటావా, పైగా నవ్వలేకపోతే పశువంటావా" అంటూ వాడూ ఒక వాతపెట్టాడు. "నవ్వమన్నానుగానీ, నేనేమన్నా ప్రేమించమన్నానా?" బాధతోనే అడిగాను. "అదిగో నవ్వమనడమే ఒక తప్పు, మళ్ళీ ప్రేమంటావా?" అంటూ ఈసారి ఓ ఆడమనిషి నాలుగు దెబ్బలేసి తన కసితీర్చుకుంది. మళ్ళీ ఆ అమ్మాయి అన్న నోరిప్పాడు. "నవ్వితే మా వంశం నాశనమవుతుందని మాకు శాపం ఉంది. దానివల్ల మేము తరతరాలుగా నవ్వకుండా మా వంశాన్ని కాపాడుకుంటూ వస్తుంటే, మా చెల్లి దానిమానాన అది చక్కగా చిరాకు పడుతుంటే, దానిని నవ్వమనడమే కాక, మా అందర్నీ నవ్వమంటావా? మా వంశాన్ని నాశనం చేద్దామని చూస్తావా?" అంటూ నాకు వాతలే వాతలు. నాకు వాతలు పెట్టడం, నేను కేకలు పెట్టడం చూసి, మిగతావాళ్ళూ వచ్చి నాకు తలోటి ఇచ్చి ముచ్చట తీర్చుకున్నారు. నొప్పి తట్టుకోలేక, ఆ అన్నగాడితో "బాబూ, ఇంకెప్పుడూ మీ చెల్లిని నవ్వమనను. అసలు మీ చెల్లిజోలికే రాను" అన్నాను. "నువ్వు మా చెల్లి జోలికి రావడం కాదు. అసలు ఆ కళాశాల జోలికే రావద్దు. లేకపోతే నవ్వుకోడానికి నువ్వుండవ్" అంటూ నన్ను హెచ్చరించి, నా కట్లు విప్పి, చొక్కా ఇచ్చి పంపించేశారు. మర్నాడే, నా కళాశాలను మార్చేశాను. కాని, నా నవ్వులో మార్పురాలేదు. నవ్వుకుంటూనే, వైద్యవిద్యాభ్యాసం పూర్తిచేశాను. ఓ అనుభవజ్ఞుడి దగ్గర చేరాను - వృత్తిలో అనుభవంకోసం. నా నవ్వును తట్టుకోలేక, ఓ రోజు నన్ను పిలిచి, వైద్యుడనేవాడు ఎప్పుడూ గుంభనంగా ఉండాలని, మానసికరోగిలా అలా పిచ్చిపిచ్చిగా నవ్వితే, వృత్తిలో రాణించడని చెప్పి, నా నవ్వు తన వృత్తికే ఎసరు పెడుతోందని, నన్ను వెళ్ళిపొమ్మన్నాడు. తర్వాత, నా సొంతంగా వైద్యవృత్తి మొదలెట్టాను. కొన్నాళ్ళకి, మా ఇంటినుంచి కబురొచ్చింది. మా తాతగారికి సుస్తీ చేసిందని. మా తాతగారికి సుస్తీచేసిందనే కబురుతోపాటు ఇంకోటికూడా చెప్పారు. నాకు పెళ్ళిసంబంధం చూసామని. రెండ్రోజుల్లో పెళ్ళి. వెంటనే రమ్మని. నాకు పెద్దవాళ్ళంటే గౌరవంవల్ల, అకస్మాత్తుగా పెళ్ళికుదిర్చినా, తాతగారి ఆరోగ్యరీత్యా ఈ నిర్ణయం తీసుకుని ఉంటారు, పైగా నా బాగోగులు వాళ్ళకు తెలియదా, అంతేకాక పెళ్ళి ఎప్పుడో ఒకప్పుడు చేసుకోవల్సిందేగా అనుకొని నేనేమీ ఎదురుచెప్పలేదు. పెళ్ళిగురించి తియ్యటికలలుకంటూ, మా ఊరికెళ్ళాను. మా తాతగారికి మామూలు జ్వరమే. మందులిచ్చి తగ్గించేశాను. "మనవడా నీ పెళ్ళి చూస్తే ఓ పనైపోతుందని నిన్ను కంగారుపెట్టాను" అన్నారు. ఆ రోజు పెళ్ళిరోజు. పీటలమీద కూర్చున్నాను. ఇంతలో, పెళ్ళికూతుర్ని తీసుకొస్తున్నారు. ఆమెను చూశాను. అంతే, అచేతనంగా ఉండిపోయాను, విద్యుతాఘాతం తగిలినవాడిలా. ఆమె లావుగా లేదు. సన్నగా చాలా చక్కగా ఉంది. అందవికారంగా అస్సలు లేదు. చాలా బావుంది. కాని, ఆ అమ్మాయి ఎవరో కాదు. కళాశాలలో చదివే రోజుల్లో నన్ను కొట్టించిన అమ్మాయి. పీటమీద నుంచి పడిపోబోతుంటే, పురోహితుడు గట్టిగా పట్టుకొని కూర్చోబెట్టాడు. బంకరాసిన పీటమీద కూర్చున్నట్లయ్యింది నా పరిస్థితి. పెళ్ళి చేసుకోడం మానేద్దామనుకున్నాను. కాని, అప్పటి దేహశుద్ధి గుర్తొచ్చింది. చచ్చినట్టు పెళ్ళిచేసుకున్నాను. విచిత్రమేమిటంటే, పెళ్ళయిన మరుక్షణంనుంచి నా భార్య నవ్వడం మొదలెట్టింది. కాని, ఇదిగో, ఇలా దాదాపు ముప్పైఐదేళ్ళనుంచి నేను మాత్రం నవ్వుకు దూరమయ్యాను". "అంటే.........పెళ్ళే ఈ విపరీత నవ్వు సమస్యకు పరిష్కారమా?!" ఆశ్చర్యం, అనుమానం కలగలిపి అడిగాడు డాక్టర్ పాపారావ్. "చెప్పానా! నీ నోటితో నువ్వే ఈ సమస్యకు పరిష్కారం చెప్తావని" మెచ్చుకోలుగా అన్నారు డాక్టర్ గుర్నాధంగారు. "కాని, ఈ పసికందుకు పెళ్ళేమిటి గురువుగారు! అయినా, శాస్త్రం ఒప్పుకుంటుందా?" సందేహం వెలిబుచ్చాడు డాక్టర్ పాపారావ్. "నా అనుభవంతో చెప్తునానయ్యా! పెళ్ళయిన మరుక్షణం ఈ పసికందు ఠక్కున నవ్వాపేసి ఏడవడం మొదలెడతాడు చూడు. ఇక శాస్త్రమంటావా, అది నాకు తెలియదుగాని, నా ఎరుకలో శాస్త్రాలు బాగా తెలిసిన ఓ శాస్త్రులుగారున్నారు. అతన్నిప్పుడే పిలిపిస్తాను" అని డాక్టర్ గుర్నాధంగారు శాస్త్రులుగారికి ఫోన్ చేసి పిలిపించి, పసికందు సమస్యకు పెళ్ళి అనివార్యమని, అయితే, పసికందుకు పెళ్ళి జరిపించడం శాస్త్రసమ్మతమేనా అని అడిగారు. "ఓ.....జరిపించచ్చు నాయనా! పసికూన ఆడైనా, మగైనా బేషుగ్గా జరిపించచ్చు. ఈ పసికూన చేతులకు మంగళసూత్రాన్ని తాకించి, ఆ మంగళసూత్రాన్ని ఓ పెళ్ళికాని అమ్మాయి పెళ్ళైన పెద్దల సమక్షంలో 'ఈ పసికూనే ఇకనుంచి తన భర్తని, ఈ పెళ్ళిని తూతూ మంత్రంలా భావించనని, మరో మగపురుగువైపు కన్నెత్తి చూడనని' ప్రమాణం చేసి, తన మెడలో వేసుకుంటే సరి, పెళ్ళయిపోయినట్లే. అయితే, ఇలా ఆ అమ్మాయి తన జీవితాన్ని త్యాగం చేసినందుగ్గాను, మామూలుగా అయితే పసికూన తల్లిదండ్రులు పాతిక పట్టుచీరలు, యాభై తులాల బంగారం, అరకోటిన్నొక్క రూపాయలు ఆ అమ్మాయికి కట్నంగా ఇచ్చుకోవాలి. కాని, పసికూన జననం ఇంటిలోకాక ఆసుపత్రిలో అయినందుగ్గాను, ఈ పెళ్ళితంతును భుజాన వేసుకోడమేకాక, ఆ కట్నమేదో కూడా ఈ ఆసుపత్రి నిర్వాహకులే ఇచ్చుకోవాల్సి ఉంటుంది. కట్నం విషయంలో కక్కుర్తిపడితే మాత్రం పెళ్ళి పెటాకులై పోతుంది, ఆసుపత్రి సర్వనాశనమయిపోతుంది. జాగ్రత్త! ఆఁ....." హెచ్చరిస్తూ, సందేహ నివృత్తి చేశారు శాస్త్రులుగారు. "ఏవండీ! మనకేంటండీ ఈ లంపటం! పెళ్ళికాని అమ్మాయంటే ఇప్పటికిప్పుడు ఎక్కడ దొరుకుతుంది? పైగా, ఆసుపత్రిమీద బ్యాంకునుంచి తీసుకున్న అప్పుందాయె మనకు" భర్త చెవిలో గొణిగింది డాక్టర్ పంకజం. "పంకజం! అమ్మాయి గురుంచి నువ్వేమీ వర్రీ అవకు. సిస్టర్ ను నేనొప్పిస్తాగా. ఇక డబ్బంటావా, అవసరం లేకపోయినా, పేషంట్లకు కుట్లేసో, కట్లుకట్టో సంపాదిద్దాంలే" ధైర్యం చెప్పాడు డాక్టర్ పాపారావ్. "ఇదిగో నేను మళ్ళీ చెప్తున్నాను. తెలిసీ పెళ్ళి జరిపించకుండా తప్పించుకుందామనుకున్నా, కట్నం విషయంలో వేషాలేసినా, ఆసుపత్రి సర్వనాశనమవడం ఖాయం" గట్టిగా చెప్పారు శాస్త్రులుగారు, డాక్టరు దంపతుల గుసగుసలు విని. "అబ్బబ్బా! శాస్త్రులుగారు! మీరు మాటిమాటికి సర్వనాశనమని అనకండి. నాకు గుండెదడ పెరుగుతుంది" ఏడుపు ముఖం పెట్టి అన్నాడు డాక్టర్ పాపారావ్. "అయ్యో నాయనా! ఈ ఆసుపత్రి సర్వనాశనమైతే, దీన్నే నమ్ముకున్న మీరు సర్వనాశనమవుతారని సర్వనాశనమనే పదాన్ని వాడాను కాని, మీరు సర్వనాశనమవడం నాకేమైనా సర్వనాశనమా! అదే, సరదానా!" ఇక శాస్త్రులుగారిని ఎంత తక్కువ మాట్లాడిస్తే అంత మంచిదని నిర్ణయించుకున్న డాక్టర్ పాపారావ్ వెంటనే వార్డుబాయ్ ని పిలిచి, అతని చేతిలో డబ్బులు పెట్టాడు - మంగళసూత్రం కొనుక్కురమ్మని. ఇంతలో, "డాక్టర్! డాక్టర్!" అంటూ పెద్ద గొంతుతో అరుచుకుంటూ పక్కగదిలోనుంచి పరిగెత్తుకొచ్చింది సిస్టర్. సిస్టర్ ఏం చెబుతుందా అని డాక్టరు దంపతులు చలిజ్వరం వచ్చినవారిలా వణుకుతూ ఒకరి చేతులు ఒకరు గట్టిగా పట్టుకున్నారు, ధైర్యం కోసం. "డాక్టర్! తొమ్మిది, పది నంబరు బెడ్ల మీదున్న గర్భిణులిద్దరూ కవలలను ప్రసవించారు. నలుగురూ ఏడవకుండా, పడీపడీ నవ్వుతున్నారు డాక్టర్!" "హాఁ.....మరో నలుగురా!!!........నవ్వుతున్నారా!!!" డాక్టరు దంపతులు ఒకరినొకరు గట్టిగా కావలించుకొని, గుడ్లు తేలేసి కుప్పకూలిపోయారు.

మరిన్ని కథలు

Nijamaina deepavali
నిజమైన దీపావళి.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
Tagina saasti
తగిన శాస్తి
- Naramsetti Umamaheswararao
Ganji kosam
గంజి కోసం
- B.Rajyalakshmi
Ante maremee samasyalu levu
అంతే, మరేమీ సమస్యలు లేవు
- మద్దూరి నరసింహమూర్తి
O anubhavam
ఓ అనుభవం
- జి.ఆర్.భాస్కర బాబు