మా బాలకాండలో కిష్కింద కాండ - వారణాసి సుధాకర్

Maa balakanda lo kishkindakanda

మా చిన్నప్పుడు మేం బయట ఏదైనా కొనుక్కు తినాలంటే భయం. ఐపీసీ సెక్షన్ ఏంటో తెలీదు కానీ, చాలా క్రమశిక్షణాచర్యలుండేవి. పాపం ఇంట్లో పెద్దవాళ్ళే... అంటే, ఆడవాళ్ళే, కట్టెల పొయ్యిలతో తంటాలు పడి, వాళ్ళకి వచ్చిన జంతికలు, బొబ్బట్లు, బూర్లు, మిఠాయి, కారప్పూస, బెల్లం గవ్వలు, కజ్జికాయలు, గార్లు - ఆవళ్ళు, లాంటి దేశవాళీ పిండివంటలే చేసి, డబ్బాల్లో దాచి, ఆరారగా పెట్టేవాళ్ళు. స్కూలు నించి రాగానే, "అమ్మా, ఏమైనా పెట్టు " అనడగడం మాకు రివాజు ! వాళ్ళు పెట్టినవేవో హడావిడిగా బొక్కేసి, కొన్ని జేబులో వేసుకుని, ఆటలకి పరిగెత్తడం ఆనవాయితీ. మానాన్న, బిళ్ళలు, పిప్పరమెంట్లు అనే వెరైటీ చిరుతిళ్ళు కొని తెచ్చి, ఒక సీసాలో వేసి, ఒక రహస్య ప్రదేశంలో దాచేవారు. ఎందుకో చెప్పఖ్ఖర్లేదుగా ? వాటికి మాత్రం రేషను ఉండేది. పిల్లలంటే, ఒకళ్ళా - ఇద్దరా ? 6-10 మధ్య ఉండేది ఆ సంఖ్య. ఎంతమందికని కొనగలరు, పంచగలరు ? పులిహార, పిండిపులిహార లాంటివి చేస్తే, పండగేదో వచ్చినట్టే ! ఇంక వచ్చే పండగని బట్టి, ఉండ్రాళ్ళు, క్షీరాన్నాలు, పరవాన్నాలు, దద్ధోజనాలు, చక్రపొంగళ్ళు, పాలవాళ్ళ గేదెలు ఈనితే, వాళ్ళు కనికరిస్తే, జున్ను ప్రత్యేక పేకేజీ ! సుబ్రమణ్య షష్టి నాడు మాత్రమే, ఖజ్జూరప్పళ్ళు , జీళ్ళు మంజూరు. ఏ కాలంలో వచ్చే పళ్ళు ఆ కాలం లో నాగాలేకుండా పట్టించేవాళ్ళం అనుకోండి... అరటిపళ్ళు లేని రోజు లేదు, ఆవకాయ్ కలపని భోజనం లేదు ! శ్రావణమాసంలో శనగలు హోరెత్తుతాయి కాబట్టి, వాటిని సాతాళించినా, రుబ్బి మసాలావడల్లాగ వేసినా, ఓ పట్టు పట్టేవాళ్ళం..అది అలాంటిలాంటి పట్టు కాదు, ఉడుం పట్టు ! ఇంక మావిడిపళ్ళు, సీతాఫలాల కాలంలో వాటికి న్యాయం చెయ్యడంలో మాకు సాటి లేదని ప్రతీతి ! మా దొడ్లోనే కాసే సపోటాలు, జామ కాయలు మా ఇంటికి నిత్య అతిథులుగా వచ్చే వానరసేనతో పంచుకుని, తినేవాళ్ళం. పాపం, అవీ బతకాలిగా ? జీవకారుణ్యం ! మా దొడ్లోనే ద్రాక్ష గుత్తుల్లాగ వేలాడే రాచ ఉసిరికాయల్ని ఒడుపుగా కోసి, స్కూలు సంచీలో వేసుకుని, ఉప్పూ - కారం ఒక కాయితం పొట్లంలో కట్టి, ప్రజాపంపిణీ వ్యవస్థను ఏర్పాటు చేసి, స్కూలుకెళ్ళాక, 'ఔటు బెల్లు' కొట్టాక, నావర్గం వాళ్ళకి మాత్రమే రంజుగా పంచి, మురిసిపోయేవాణ్ణి ! వాళ్ళలో కొంతమంది, వస్తుమారక పద్ధతిలో, వాళ్ళ జేబుల్లోంచి తీసిన తాయిలాల్ని, నాకు 'కాకెంగిలి' చేసి, పెట్టేవాళ్ళు. ఫుల్హటి ఉసిరికాయల దెబ్బతో పులిసిపోయిన పళ్ళు, రెండుమూడ్రోజుల్దాకా సతాయిస్తూనే ఉండేవి. 💐💐 ఎప్పుడైనా, మా అమ్మ శలవుమీదుంటే, "ఏదైనా పెట్టు" అనడానికి లేదు కాబట్టి, రెండు కొబ్బరికాయల్ని దభేల్ మనిపించి, ఒక ఏబులం బెల్లంముక్క జతచేసి, కలిపికొడితే వుండేదీ... 'ఉమ్...మ్హ '! రాచఉసిరికాయల్ని మా డాబామీద ఎండబెట్టుకుని, అవి కిస్మిస్ ల్లాగా అయ్యాక, జేబునిండా వేసుకుని, స్కూలుకెళ్ళేలోపు చప్పరించేసేవాళ్ళం. మా క్లాసులో, "ఆవకాయ బద్ద" గాడని, పేరుమోసిన కిష్టిగాడు ఉండేవాడు. వాడు, అన్నం తిన్నాక, కంచంలో రెండు- మూడు ఆవకాయ బద్ధల్ని మిగుల్చుకుని, వాళ్ళమ్మ చూడకుండా, కడిగేసి, వాటిని జేబులో వేసుకుని, స్కూలుకి తెచ్చుకునేవాడు. ఆ బద్ధల్ని, కొంచెం కొంచెంగా చప్పరిస్తూ, తన్మయత్వంతో కళ్ళుమూసుకుని, ఊగేవాడు. ఆ రహస్యం నాకొక్కడికే చెప్పాడు. నేనుకూడా ఆ తన్మయత్వం అనుభవిద్దామని, ఆవకాయ బద్దల్ని ఖంగారులో కడక్కుండానే, జేబులో వేసేసిన కారణంగా, మా అమ్మకి తెలిసిపోవడం, మా నాన్నకి చెప్పెయ్యడం, వెంఠనే జరిగిపోయి, సెషన్స్ కోర్టులో లాగ, ప్రత్యేక విచారణ జరిపి, ఆయన మొదటి తప్పుగా భావించి, హెచ్చరికతో వదిలేశారు. నీతి : "దెబ్బలు తినడం కంటే, బద్దలు వదిలెయ్యడం తెలివైన పని !" అని భావించి, 'జానేదో' అని వదిలేశానుగానీ...లేకపోతేనా...మా ఇంటి ఆవకాయ జాడీల్లో అస్సలు బద్దలు, పెచ్చులు లేని పిండిమాత్రమే మిగిలేది ! అప్పట్లో మా ఊళ్ళో కొత్తగా వచ్చిన "పీకే డాల్" అంటే, "పిడత కింద పప్పు" ని ఎంతగా పోషించామని? డబ్బులెక్కడివని అడక్కండి ! బ్యాడ్మింటన్ ఆటలో చెమటోడ్చి, పావలా మ్యాచ్ లు నెగ్గి, పోషించాం. 💐💐 మా దొడ్లో...రేవులోతాడిల్లా పెరిగిన ఆరు తాటిచెట్లుండేవి. వాటిలో ఐదు మగవి, బిక్కు బిక్కు మంటూ వాటి మధ్య ఒక్కటే "నీడలేని ఆడది !" మేము వాటికి, "పంచ పాండవులు - ద్రౌపది" అని పేరెట్టాం. మగచెట్లు ప్రసాదించిన చితుకులు, నీళ్ళ పొయ్యిలో వేసి, మంట పెట్టడానికి, దీపావళి నాడు తిప్పడుపొట్లం కట్టడానికి మాత్రమే ఉపయోగిస్తాయి అనుకున్నాం కానీ, ద్రౌపదికి మాతృత్వాన్ని ప్రసాదించడానిక్కూడా ఉపయోగిస్తాయని, మా సైన్స్ పాఠంలో ఎక్కడా చెప్పలేదు ! తనకి 'ద్రౌపది' అని పేరెట్టాక, దానికి ధైర్యం వచ్చినట్టుంది, ఆ పంచ భర్తలకు, వేసంకాలం రాగానే, ఉప పాండవుల్ని ఇద్దామనే ఉద్దేశంతో అనుకుంటా... విపరీతంగా ముంజకాయలు కాసేసేది. ఉప పాండవులు బతికి బట్టకట్టినట్టు, మా తెలుగు పుస్తకంలో, 'భారతకథ' అధ్యాయంలో లేనికారణంగా, మేము ఆ ముంజికాయల్ని, మా పాలేరు చేత దింపించి, చొక్కాలు విప్పి మరీ జుర్రేసేవాళ్ళం. కొన్ని ఉప పాండవుల్ని ముందుచూపుతో ముదరనిచ్చి, తాటికాయంత అయ్యాక, తాటిపళ్ళకి మేమే రసం తీసి, మా అక్కచెల్లెళ్ళకిస్తే, వాళ్ళు పల్లెపడుచుల్లాగ, తాటిరొట్టి వేసి, స్త్రీధనంగా కొన్నింటిని తీసుకుని, మిగిలినవాటిని మా మొహాన కొట్టేవారు. తాటి టెంకల్ని మాత్రం ఎందుకు వదలాలి అనే 'రీసైక్లింగ్' ఆలోచనతో, మా ఇటికలగుట్ట పక్కనే భద్రంగా పాతిపెట్టేవాళ్ళం. కొన్నిటిని బుర్రగుంజుగాను, ఎక్కువవాటిని తేగలుగాను మార్చుకుని, తంపట వేసిన తేగల్ని, తెగ తినేవాళ్ళం. తరవాత కొంతసేపు, పళ్ళు కుట్టుకుంటే కుట్టుకున్నాం కానీ, దాని తస్సాదియ్యా... తేగల రుచివేరు ! తేగల మధ్యలో వుండే చందమామని మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ తినద్దని, మా అమ్మమ్మ ఆర్డినెన్సు జారీ చేసింది. "ఎందుకు ?" అని మేం తెల్లమొహం వేస్తే, ఆవిడ మొహం ఎర్రగా చేసుకుని, "చదువు రాదర్రా , బడుద్ధాయిలూ" అన్నాక, బెద్దవాళ్ళు చెప్పిన సైన్సు ఫాలో అవడం మా తక్షణ కర్తవ్యంగా భావించి, అలాగే కానిచ్చాం. 💐💐 వారానికోసారి, నాగా పెట్టకుండా వచ్చే మా ఊరి కోతుల మూకని చూస్తే, మాకు భయం - దడ - వణుకు - కోపం - కక్ష - పగ ! ! ఏలననగా... అవి గుంపులుగా ఐకమత్యం ప్రదర్శిస్తూ, పూరి జగన్నాధ్ సినిమాల్లో మాఫియా విలనుల్లాగ వచ్చి, మా దొడ్డంతా స్వైరవిహారం చేస్తూ, మా కళ్ళెదురుగుండానే మేము పెంచుకుంటున్న పాదుల్ని, మేము 'పండుతాయిలే' అని దాచుకున్న జామకాయల్ని, సపోటాకాయల్ని, సగం సగం కొరికి పడేస్తూ, వాటి పిల్లలు అరటి చెట్ల మీద ఆడుకంటూ, వాటి ఆకుల్ని విరిచేస్తుంటే, "జీవహింస తప్పు " అని చెప్పిన వాణ్ణి కొట్టాలనిపించేది. "వానర హత్య తప్పుకాదేమో..." అనికూడా అనిపించేది. 💐💐 మా పిల్లకాయల్ని సామూహికంగా కంటిచూపుతోనే భయపెట్టి, కులస్త్రీలను కరిచినంత పనిజేసి, దొడ్డివైపున వున్న రుబ్బురోలులో సంసారపక్షంగా మినప్పప్పు రుబ్బుకుంటున్న స్త్రీలను, బెద్దవాళ్ళని కూడా చూడకుండా, తరిమికొట్టి, రోట్లోవున్న అరవీశడు పప్పుని అప్పనంగా తినేస్తున్న కోతిమొహాల్ని కిటికీల్లోంచి ధైర్యంగా చూస్తున్న మాకు, ఒళ్ళుమండి, కళ్ళుమండి, "వానర హత్య తప్పు కానేకాద"నిపించేది ! కిటికీ ఊచల మధ్యలోంచి, వాటిని భయపెట్టాలని, "ఉష్షు...ఉష్షు..." అని మేము అరిస్తే, అవి నోరెళ్ళబెట్టి, రివర్సు గేరులో మమ్మల్ని భయపెట్టేవి ! కానీ, తలుపుతీసి, కర్ర ఝళిపించేటంత దమ్ముల్లేక, కిమ్మనకుండా, అవి పోయేదాకా మాకు మేమే 'గృహనిర్బంధం శిక్ష' విధించుకుని, ప్రతీకారేచ్ఛతో రగిలిపోయేవాళ్ళం ! మా బాల్య శత్రువులైన కోతులు, దీపావళినాడు వస్తే, వాటిమీద సిసింద్రీలు, టపాకాయలు, వీలయితే, లక్ష్మీబాంబు వేసేద్దామని రహస్యంగా రిజల్యూషను పాస్ చేసేశాం. కానీ...అవి మాకంటే తెలివైనవని, దీపావళినాడు చెట్లు దిగవని, వాటి పిల్లల్ని కూడా దిగినివ్వవని, వాటి 'నాయకన్' ఆ బొండుకోతి చెప్పేస్తుందని మా నాన్నచెప్పాక, మాకు నీరసం వచ్చింది. తరవాత ఎప్పుడో ఐదారేళ్ళ తరవాత తెలిసింది, ఒక్క పంగలకర్ర చూపిస్తే చాలు, అవన్నీ 'పప్పప్పప్పరారే' అని ! ఏమిలాభం ? అప్పటికే జరిగిపోయిన నష్టాన్ని, ప్రభుత్వం వారు ఆర్నెల్ల తరవాత పంపించే తుఫాను నష్టాన్ని అంచనా వేసే బృందంవాళ్ళు కూడా అంచనా వెయ్యలేరు ! నష్టపరిహారం ఇప్పించలేరు ! ముఖ్యంగా, ఆ నీచ వానరాలు, అన్నీ తినేస్తే తినేశాయి కానీ, మా ఇంటికి రాయివేటు దూరంలో.. మేము సులభంగా వాడుకోలేకుండా ఎక్కడో దూరంగా కట్టించిన మా 'సులభ్ కాంప్లెక్స్' ని మేము సమీపించడానికి కూడా లేకుండా, వాటి గోడలనిండా కొలువుతీరి, మమ్మల్ని ఇబ్బందిపెట్టిన పాపాన్ని అవి మూటకట్టుకున్నాయి. ఇంతకింతా అనుభవిస్తాయని, శపించేసే వాళ్ళం ! అవి మాత్రం హాయిగా, మా గోడల్ని, చెట్లని, అరుగుల్ని, ఉచితంగా తమ 'సులభ్ కాంప్లెక్స్' లాగ వాడుకున్నాయ్. అవి వెళ్ళిన తరవాత, మేము పారిశుధ్యకార్మికుల అవతారం ఎత్తేవాళ్ళం. ఇప్పటివాళ్ళెంత అదృష్ట వంతులో కదా ! బయటికే వెళ్ళక్కర్లేకుండా, డైనింగు హాలు గోడ అవతలే రెస్ట్ రూములు ! ఫ్రిజ్జు తలుపు తీస్తే, అస్సలు ఖాళీ అనేది లేకుండా, చాక్లెట్లు, కేకులు, ఐస్ క్రీములు, స్వీట్లు, ఫ్రూట్లు ! ఎటొచ్ఛీ, పాపం, డాక్టర్లు తినద్దంటున్నారు... వీళ్ళ ఫ్యామిలీ ప్యాక్ లు చూసి ! మాకు 'సిక్స్ ప్యాక్' అంటే ఏవిటో తెలీదు కానీ, మొన్నటిదాకా, అప్పడం పొట్టలే ఉండేవి. ఈమధ్యే కాస్త "రిచ్ లుక్ " వచ్చిందిలెండి ! 💐💐 చిన్నప్పుడు, మావూరి వెంకటేశ్వరా టాకీసు సెంటర్లో, వీరాస్వామి మిఠాయికొట్టుమీద కన్నేశాను. "ఏం కొనేటట్టు లేదు, ఏం తినేటట్టు లేదు, నాగులోరి నాగన్నా" అని పాడుకుంటూ, వీరాస్వామిని చూసి తెగ జాలిపడిపోయేవాణ్ణి. ఎందుకంటే, వాడు చుట్టూ అన్ని స్వీట్లు పెట్టుకుని, ఈగల్ని తోలుకోడం తప్ప, తినలేడు కదా అని ! ఓరోజు, భీష్మ సినిమా చూసి, బయటికొచ్చి, ఎన్టీఆర్ లాగ కాళ్ళు ఎడంగా పెట్టి, భీష్మ ప్రతిజ్ఞ చేశాను, (పెళ్ళి చేసుకోనని కాదు), "నేను పెద్దయ్యాక, పెద్ద ఉజ్జోగం చేసి, బోల్డు జీతం సంపాదించేసి, ఈ వీరాస్వామి కొట్లో వున్న స్వీట్లన్నీ కొనేసి, మాయాబజార్ లో యశ్వీయార్ లాగ మధ్యలో కూచుని, అన్నీ హాంఫట్ చేసేస్తాన"ని! 💐💐 ప్రస్తుత పరిస్థితి కూడా చెప్పాలిగా ? పుల్లారెడ్డి స్వీట్లు, సహదేవరెడ్డి స్వీట్ల పక్కనించే వెడుతున్నా, జేబులో ఎన్ని డెబిట్ కార్డులు, క్రెడిట్ కార్డులు, 'గూగుల్ పే' లు వున్నా, అటువైపు చూడబుద్ధి వెయ్యదేంటి ? ఓహో... అప్పుడు డబ్బుల్లేవు, ఇప్పుడు తినడానికి లేదు కదా ? సరి సరి !!! అయినా...చిన్నప్పణ్ణుంచీ తిన్నవి చాల్లే ! ఇప్పటి కుర్రాళ్ళూ తినాలిగా... వాళ్ళకొదిలేద్దాం... "త్యాగశీలివయ్యా...మనిషీ... అనురాగశీలివయ్యా..."💐💐💐💐💐💐

మరిన్ని కథలు

Nijamaina deepavali
నిజమైన దీపావళి.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
Tagina saasti
తగిన శాస్తి
- Naramsetti Umamaheswararao
Ganji kosam
గంజి కోసం
- B.Rajyalakshmi
Ante maremee samasyalu levu
అంతే, మరేమీ సమస్యలు లేవు
- మద్దూరి నరసింహమూర్తి
O anubhavam
ఓ అనుభవం
- జి.ఆర్.భాస్కర బాబు