ఉదయం నుంచి పది సార్లు ఫోను చేసినా ఎత్తకుండా తప్పించుకున్నాడు , ఇక తప్పించుకోవటం కష్టం అని చివరగా రాత్రి తొమ్మిది కి నాన్న ఫోను ఎత్తాడు బోజనం ముగించబోతున్న ష్యాము కుమారు.
" ఒరేయ్ సిరికిన్ జెప్పడు శంఖు చక్ర యుగమున్ అన్నట్టు ఎత్తాలి రా ఫోను..న్యూ డిల్లి లో అంధ్రా భవన్ కి వెళ్ళి భేల్ పూరి ఆర్డరు చేసే మొహమూ నువ్వునూ" ఫోను లో మొసలి గొంతు
" నాన్నా ! ఎత్తాను గా ఫోను , వెంటనే మొదలు పెట్టాలా, ఉదయం నుంచి ఆఫేసులో బిజీ.. ఇదిగో ఇప్పుడే బోజనం చేస్తున్నా"
"ఒరేయ్ ఏం బిజీ రా... మీరు ఎ . సి. రూముల్లో కూర్చొని టిక్కు టిక్కు మని కొట్టుకునే కంప్యూటర్ ఉద్యోగాలు. మా కాలం లో మేము చేసాము రా.. అవి అసలు సిసలు ఉద్యోగాలు"
"అబ్బా సర్లే నాన్న విషయం చెప్పండి, మీరు ఉదయం నుంచి చేస్తున్నరు అంటే ఎదో ఉంటుంది గా".
"మొదట స్వ కార్యం , ఆ తర్వాత సమయం వుంటే స్వామి కార్యం అది లెక్క "
"నాన్నా మనుషుల బాష లో చెప్పవా.. ప్లీజ్ "
" అదే రా ఆఫీసు లో ఉన్నా, మన సొంత పనులు మొదట చేసుకోవాలి..తర్వత ఆఫేసు పని...సర్లే , ఇంతకీ నీ హైదరాబాదు మియాపూరు ఇంట్లో అద్దెకి ఉన్న వాడు కాళీ చేసాడా లేదా ? నన్ను రంగం లోకి దిగమంటావా ?"
"వొద్దు బాబోయి వొద్దు, నువ్వు దిగితే పెంట పెంట చేస్తావు. నీకు ఆరొగ్యం అంత బాగుందటము లేదు. నువ్వు మన ఊర్లోనే రెస్ట్ తీసుకో , నేను చూసుకుంటాను"
"అది కాదు రా ..మన హైదరాబాదు మున్సిపల్ ఆఫీసులో నాకు తెలిసినవాడు ఒకడు ఉన్నాడు.. ఏమాట కామాట వాడు అచ్చుం కోటా శ్రీనివాసరావు లా ఉంటాడు, నాకు బాగా క్లోసు..వాడితో చెప్పి"
"వొద్దంటే వొద్దు..నో మీన్స్ నో.. అయినా మనుషులని పోల్చకుండా మాట్లాడలేవా, చెప్పాను గా నేను చూసుకుంటాను"
"ఏం చూసుకుంటావో ఎమిటో, ఇప్పటికి రెండు సంవత్సరాలు దాటింది , సరెలే కరోనా వైరస్ గోల లో ఒక సంవత్సరం వొదిలేసాం, వాడు ఇంకా కాళీ చేయ్యలేదు"
" సర్లే నాకు ఇంకో ఫోను వస్తుంది, నేను మళ్ళీ చేస్తా " అనే అబద్దం తో ఫోను పెట్టేసి కంచం ఎత్తి కిచన్ సింకు వైపు నడిచాడు ష్యాముడు చేయి కడుక్కోడానికి.
అప్పటికే బోజనం ముగించి, హాలు సోఫా లో చతికిల పడి ఈ బాగోతం వింటున్న సతీ మణి సరళ నవ్వు ఆపుకుంటూ. "అయినా మీరు మరీనూ, నాకు డవుటే.. అసలు ఆ ఇల్లు ఇంకా మన పేరు మీద ఉందో , ఆ లాయరు టెనంటు అతని పేరు మీద రాయించేసుకున్నాడో ? "
" అబ్బా " చిరాగ్గా అని "నువ్వు మరీ భయ పెట్టకు" వచ్చి సరళ పక్కన చేరాడు
"అవును మరి ఎదో అంటారు గా పది ఏళ్ళు అద్దె కట్టి వుంటే టెనంటు కే హక్కులు ఉంటాయట"
"ఇదిగో మరీ తాతమ్మలా కబుర్లు చెప్పకు , కామన్ సెన్సె ఎమన్నా ఉందా.. అలాంటి రూల్ ఎక్కడన్నా ఉంటుందా " అని మేక పోతు గాంభీర్యం బయటకి ప్రదర్శించాడు, కాని, తను కూడా గూగుల్ లో చూస్తే ఇలాంటి తిక్క తిక్క సమాచారమే వచ్చింది, అందుకే తనకీ ఒక పక్క భయ్యం గానే ఉంది, కొంచెం సేపు ఆగి
"మనం కష్ట పడి సంపాదించిన డబ్బు తో కొనుక్కున్న అపార్ట్ మెంటు అది. పది ఏళ్ళు రెంట్ కడితే టెనంటు కి సొంతం అయిపోతే ఎవ్వడూ ఇళ్ళు కొనుక్కోడు, పది ఏళ్ళు అద్దె కట్టి కబ్జా చేసుకుంటాడు" అని ముగించాడు.
"సరేలే, ఎందుకీ గోల, వాడికే ఇల్లు అమ్మేయండి, ఒక పని అయిపోద్ది" సతీ మణి సలహా ఇస్తూ, లేచి బెడ్ రూము వైపు నడిచింది.
"చ్చ చ్చ ..నో వే " ఇక లాభం లేదు అనుకొని తన హైదరాబాదు మియాపూర్ అపార్ట్ మెంట్ లో అద్దెకుంటున్న వేణు కి ఫోను చేసాడు. చెయ్యగానే మొదటి రింగు కే ఎత్తడం వేణు ప్రత్యేకత.
ఒక్కోసారి అసలు రింగు చెయ్యకుండానే ఎత్తుతాడనిన్ను, దూర శ్రవణ సాంకేతిక పరిజ్ఞానం తో అతనికి ముందే తెలుస్తుందనిన్ను ష్యాముడు కి అనుమానం
" సార్ చెప్పండి సార్ మీ ఫోను గురించే వెయిట్ చేస్తున్నా " అంది ఫోను లో వాయిస్... ష్యాము కి వింత గా అనిపించిది "అదేంటి అండి ఇలా ...రాత్రి ఈ టైం లో నా ఫోను కోసం ..."
" అవన్నీ ఎందుకు లెండి , చెప్పండి సార్ "
"అదే మీరు ఎలా ఉన్నారు, మీ ఫామిలీ ఎలా ఉంది, ఆ మద్య మీ అబ్బయికి ఎదో వేరే స్కూలు చూడాలి అన్నారు.. " ష్యాము విషయం చెప్పకుండా నసిగాడు.
"అంతా మీ దయ సార్, చల్లగా ఉన్నాం, ఆల్ ఈజ్ వెల్ సార్, చెప్పండి" ఫోను లో వేణు
" ఆ అదే, అంటే... అదే..... మంచిది.. అదే , అదే ఇల్లు కాళీ"
" ఆ షూర్ సార్ తప్పకుండా , కాళీ చేసేద్దాం. మిమ్మల్ని ఇబ్బంది పెట్టే పని నేను ఎప్పుడూ చెయ్యను సార్. ఉంటా సార్"
అని ఫోన్ కట్ చేసాడు. ష్యాము కి అర్ధం కాలేదు ఎమి జరిగిందో.
***** ********
ఇక ఇలా లాభం లేదు అనుకొని ఒక వారం సెలవు పెట్టి హైదరాబాదు లో దిగాడు ష్యాముడు. దిగీ దిగంగానే , మారేడ్ పల్లి లో ఉన్న పెద మావయ్య ఇంటికి వెళ్ళాడు. కుశల ప్రశ్నలు అయ్యాక, స్నాన పానాదులు ముగించి, బోజనం చేసి , హాలు లో చతికిల పడ్డాడు ష్యాము.
"సొ ..ఇక నువ్వే డైరెక్ట్ గా ముఖా ముఖి తేల్చుకుంటానంటావ్ మీ లాయరు టెనంట్ తో " అంటూ హాల్ లోకి వస్తూ ఫేన్ ఆన్ చేసాడు పెద్ద మావయ్య.
"అంతే మావయ్యా.. మా చిన్నాన్న కొడుకు మురళి ఉన్నాడు గా వాడు కూడా మియాపూర్ కి దగ్గర లోనే ఉంటాడు , వాడిని తీసుకుని వెళ్తా"
"అదే మంచిది, ముఖం మీద కొట్టినట్టు చెప్తే ఖాళీ చెయ్యక ఎం చేస్తాడు వెధవ, అయినా అదేం చొద్యం రా.. నిన్ను మరీ మెతక మనిషి కింద లెక్క కట్టేసాడా ఎమిటి వాడు...అయినా అసలు సమస్య ఏమిటి, రెంటు సరిగ్గా కట్టడం లేదా"
"అబ్బే రెంటు లో ఎమీ తేడా రానీడు కానీ ఇల్లు బాగా పాడు చేసేసాడు మావయ్యా. గోడలన్ని కరాబు, గుమ్మాలకి చెదలు. పరిశుభ్రత లేదు . ఎవో కొంటె సాకులు చెప్తాడు. ఇంకో రెండేళ్ళు ఉన్నాడంటే ఇక ఆ ఇల్లు బాగు చేయించుకోడానికి కూడా పనికి రాదు. కాని ఫోను మాత్రం ప్రతి సారి ఎత్తి ' మిమ్మల్ని ఇబ్బంది పెట్టను ' అంటాడు. మనకి అస్సలు దన్ను లేదనుకుంటున్నాడు ఎమో. మా మురళి కి లోకల్ ఎం. ఎల్. ఎ బాగా తెలుసు, వాడితో వెళ్తున్నాలే రేపు"
"ఆ మేము వెళ్ళి నప్పుడు కూడా ఎదేదో వాగుతున్నాడు" అంది అత్తమ్మ కిచన్ లో పనులు చక్కబెట్టి హాల్ లో వచ్చి కూర్చుంటూ.
"ఆ అవును రా, అసలు మేము వాడి ఇంటికి వెళ్ళాలని వెళ్ళలేదు, అదే అపార్ట్ మెంట్ లో నా స్నేహితుడు ఉంటాడు , వాడిని కలుద్దాం అని వెళ్ళాము... వీళ్ళ ఇల్లు తలుపు తెరిచే ఉంటే, సరే కదా మన ష్యాము గాడి ఇల్లే కదా, అద్దెకి ఉన్న వాళ్ళ ని ఒక సారి పలకరిద్దాం అని వెళ్తే " అని మావయ్య ఆగితే
"ఏమిటి ఇల్లు కాళీ చేయించమని చెప్పడానికి మిమ్మల్ని పంపించాడా అని అడిగాడు రా. మరీ విడ్డూరం" అని అత్తయ్య ముగించింది
"మాకు సౌండ్ లేదు. వింత ఏంటంటే అసలు నువ్వు ఇల్లు కాళి చేయించాలనుకున్నావని, అతను రెండు ఏళ్ళు గా కాళీ చేయటం లేదని.. ఇవన్ని మాకు తెలియవు కదా.. నువ్వూ చెప్పలేదు. నీ అమ్మా నాన్న కూడా మాతో ఎప్పుడూ చెప్పలేదు" మావయ్య
"వింత విషయం ఇంకోటి రేయ్, మీ నాన్న ని పొగిడి నిన్ను తిట్టిన మొదటి వ్యక్తి వాడే రా ఈ ప్రపంచం లో" అంది అత్తమ్మ నవ్వుతూ
"పెద్దాయన ఎప్పుడూ కాళీ చెయ్యమని అడగ లేదు, వాళ్ళ అబ్బాయికే నేనంటే గిట్టదు, ఎదో పెట్టుకున్నాడు మనసులో అంటాడు ఏంట్రా" మావయ్య
"వాడి బొంద లే మావయ్యా, నాన్న గారు హైదరాబాదు లో ఉన్నప్పుడు వాడిని మరీ నెత్తి మీదకి ఎక్కించుకున్నారు లే"
"మీ నాన్న ని తీసుకొచ్చి ఒక వారం రోజులు వాడి ఇంట్లో వొదిలే రా, దెబ్బకి పారిపోతాడు వెధవ" అన్నాడు మావయ్య
"ఆ అవును అసలే లాయరు కదా.. నాన్న వీడిని రోజుకొకలా పోల్చి చావగొట్టాలి.. ఒక రోజు ఒరేయ్ జస్టిస్ చౌదరీ అని ఇంకో రోజు చెట్టుకింద ప్లీడరు అనీ, బారిస్టరు పార్వతీసం అనీ, ఇంకో రోజు ఎమయ్యా వకీలు సాబు అనీ" ష్యాము నవ్వుతాలుగా
"అయినా లాయరు కి, పోలీసు వాళ్ళకి ఇల్లు అద్దె కి ఇవ్వద్దు అంటారు రా, అసలు మీరు ఎలా ఇచ్చారు . నాకయితే వాడు కాళీ చెయ్యడు అనిపిస్తుంది" అతమ్మ లోపలకి వెళ్ళిపోయింది
ష్యాము కి గుండె లో రాయి పడ్డట్టు అయింది. నవ్వు ఆపేసాడు.
*******************************
"ఆఫీసు లేదా ఈ రోజు , కేసులు వాయిదా పడ్డాయా, " అంది భార్య వంట ఇంట్లొంచే, బోజనం చేసి హాలు లో లుంగీ లో విశ్రమిస్తున్న వేణు కి వినపడేలా గట్టిగా
"ఏడిసావ్ , వెళ్తాను, నువ్వేం ఘనకార్యం వెలగబెట్టాలట, ఆ టు నాట్ సెవన్ పంకజం తో పిచ్చాపాటి లేక ఆ సెవన్ నాట్ ఫోర్ సౌమ్య తో టి. వి. సీరియల్ గురించి చర్చా గోష్టి అంతేగా ?"
వంట ఇంట్లొ నోటి కి మ్యూటు నొక్కి, ఎదో తిట్టుకుంటుంది.
"ఓనరు వస్తున్నాడు , వాడు వచ్చి వెళ్ళాక నే ఆఫీసుకి తగలడతా, అన్నట్టు నీకు చెప్పాను కదా ఆ ఫైవ్ ఫోర్టీన్ ఫాతిమ తో అస్సలు మాట్లాడకు అని, మానేసావా"
"అబ్బా !! మీరు మీ అనుమానం మరీనండి " అన్ మ్యూట్, పక్కనే కూచుంది.
"అనుమానం కాదే, ఆవిడా చాలా బేడ్ లేడీసు, అలాంటి స్నేహాలు మన కొద్దు. లాయరు నే(కోర్టు లో అబద్దాలు చెప్పి ఫీసు తీసుకునే వాడు) లయర్ ని (బయట అబద్దం ఉచితం గా చెప్పే వాడు) లాంగు డిస్టన్స్ లో స్మెల్ చేసి పట్టేస్తా" అన్నాడు గర్వం గా " మొన్న ఎవడో కాలేజి కుర్రాడి తో చుసా కోర్టు లో, అలా కోర్టుల చుట్టు తిరిగే వాళ్ళకి మనం దూరం గా ఉండాలి"
"మరి మీకో " నోటి కి మ్యూటు నొక్కి.
ఇంతలో ఇంటి బెల్ మోగింది "సర్దుకో , ఎంటా విరగ బాటు.. నువ్వు లోపల కెళ్ళు" అని భార్య పవిట సర్ది, తను పూర్తిగా లోపల కెళ్ళింది అని నిర్దారించుకున్నాక, ఇంటి తలుపు తీసాడు.
ఇంటి ఓనర్ ష్యాము , అతని కజిన్ తమ్ముడు మురళి తో తలుపు అవతల. వేణు తలుపు తీయగానే అతి వినయం ఒలక బోసాడు.
"రండి రండి రండి దయ చేయండి, తమరి రాక మాకెంతో సంతోషం సుమండి" వేణు తన చేతి కున్న వాచి చూసుకుంటూ "రెండు అన్నారు, దాదాపు మూడు అయ్యింది"
"ఆ అదే మీకు మెసేజు చేసా.." అని ష్యాము సంజాయిషీ చెప్తుంటే, వేణు ' ఎం పర్వాలేదు ' అన్నట్టు తల ఊపి, చెయ్యి చూపించాడు సోఫా వైపు , కూర్చోమని
వీళ్ళు హాలు లో సోఫాల లో కూర్చోగానే వేణు అర్దాంగి వీళ్ళకి మంచి నీళ్ళు గ్లాసులు తేసుకొచ్చి నించుండి పోయింది పరధ్యానం గా.
"ఏమిటే మనుషులని ఎప్పుడూ చూదలేదా, టేబుల్ మీద పెట్టి వెళ్ళు" అన్నాడు కొంచెం విసుగ్గా, అసలు అతనికి మంచి నీళ్ళు కూడా ఇచ్చే ఉద్ద్యేశ్యం కూడ లేదు. "మీ సొంత ఇల్లు సారు, మీరు ఎప్పుడయినా రావచ్చు, దానికి వివరణ ఎందుకు" అన్నాడు విసుగు తగ్గించి ష్యాము తో
ఇంతలో ఒక మెరుపు తీగ లాగ , ఒక చిచ్చర పిడుగు ఇంట్లో బెడ్ రూం లోంచి దూసుకుంటూ వచ్చి, ష్యాము చేతిలో వున్న మంచి నీళ్ళ గ్లాసుని ఒక్క కరాటే తన్ను తన్ని " హు హ " అని గట్టిగా అరచి. గోడ మీద ఒక మార్కర్ తో ఒక మనిషి బొమ్మ వేసి, దానికి అడ్డం గా ఎర్ర సిరా తో ఇంటు ( క్రాస్) మార్కు వేసి... " ఫసక్ " అనేసి లోపలకి పారి పోయాడు
దెబ్బకి ష్యాము పాంటు తడిసిపోయింది, భయానికి కాదు, ఆ పిల్లాడి తన్నుకి గ్లాసు లో నీళ్ళు, మీద ఒలికి పోవటం వల్ల. గ్లాసు కింద పడిన జోరు కి, ఫ్లోరింగు పలక లోంచి ఒక పెచ్చు తిన్నగా వచ్చి ష్యాము నుదిటి మీద గుచ్చుకుంది, ఇంకా నయ్యం గాజు గ్లాసు కాదు అనుకున్నాడు.
" మా అబ్బాయి అండి, చుసారా చాలా ఫాస్టు, మీరు అప్రమత్తం గా ఉండాలి, వాడు కరాటే లో బ్లాకు బెల్టు. " అని గర్వం తో నవ్వుతూ వేణు "మీరు అంత స్లో గా మందమతి లా ఉంటే ఎలా".
"ఫ్లోరింగు పలక..." ష్యాము నీళ్ళు నమిలి " గోడ మీద" అని మరక చూపిస్తూ తన నుదిటి మీద వేలు పెట్టి , గుచ్చుకున్న చోట గట్టిగా నొక్కుకున్నాడు, చిన్ని రక్తపు మరక
"ఆ గోడ మీద..ఆ భలే గమనించారే మీరు.. రండి చూపిస్తా" అని వేణు.. గోడ కింద బాగం లో కొడుకు చేసిన నిర్వాకం వొదిలి పెట్టి అదే గోడ మీద పైన ఉన్న ఫొటో లు చూపిస్తూ ఉపోథ్గాతం మొదలు పెట్టాడు. ఆ గోడ పై భాగం లో వేణు లాయర్ కోటు లో ప్రముఖులతో తీయించుకున్న ఫొటో లు ఫ్రేములు కట్టించి ఉన్నాయి వరుసలో, వేణు లేచి వాటి దగ్గరగా వెళ్ళి.
"ఇది వాల్ ఆఫ్ ఫేం అనుకోవచ్చు మీరు. చుసారా ఇది మన జిల్లా మేజిస్ట్రేటు భీమా రావు గారు, నాకు బాగా క్లోసు. ఇంకో ఫొటో చూపిస్తూ " ఇదిగో ఇది మన హై కోర్టు జడ్జి , ఇక ఇది చూడండి మన మాజీ గవర్నర్, ఇదిగో ఇది మన మాజీ సుప్రీము కోర్టు జడ్జి"
"ఇవన్నీ మాకెందుంకు ఇప్పుడు , నా ఫోను లో కూడా ఉన్నాయి ఫొటొ లు ఉన్నాయి..ఎం ఎల్ యే , కే సి ఆర్, కే టి ఆర్ తో , చూపించనా" కట్ చేసాడు మురళి. "ఇంతకీ మీరు ఎప్పుడు కాళీ చేస్తున్నారు" గదమాయించాడు.
వాల్ ఆఫ్ ఫేము నుంచి తిరిగి వచ్చి వేణు సోఫా లొకొచ్చి " చేసేద్దాం, నేను అస్సలు ష్యాము గారిని ఇబ్బంది పెట్టను, కదండి ష్యాము గారికి బాగా తెలుసు" అని వేణు ష్యాము ని చూపించాడు
ష్యాము ని ఎమి చెయ్యాలో అర్ధం కాలేదు. వెర్రి నవ్వులు నవ్వాడు.
"అ ఆ.. అంటే.."
"నేను మీరు ఫోను చేస్తే ఎప్పుడయినా ఎత్తకుండా ఉన్నానా ?"
ష్యాము తల అడ్డం గా ఊపాడు
"నేను ఎప్పుడయినా రెంటు కట్టకుండా ఉన్నానా "
లేదు అన్నట్టు మళ్ళీ తల అడ్డం గా ఆడించాడు ష్యాముడు
"రెంటు కట్టేసి, ఫోను ఎత్తితే ఇక్కడ శాశ్వతం గా వుండి పోతారా ? ఎప్పుడు కాళీ చేస్తారు , రెండు సంవత్సరాలు గా చెప్తున్నాడంట గా అన్నయ్య" మురళి
వేణు హటాత్తుగా సొఫా లోంచి లేచి , లోపలకి వెళ్ళాడు, మారు మాట్లాడకుండా..
"చుసావా అన్నయ్యా అలా ధబాయించి అడగాలి" మురళి మొహం లో ఆడంబరం
"సరేలే అందుకే గా నిన్ను తేసుకొచ్చింది, ఎమో ఏ గన్నొ తెచ్చి మనల్ని కాల్చేస్తే " లోపలకి వెళ్ళి ఇంకా రాని వేణు గురించి గుబులు గా
అప్పటిదాకా లుంగి బనీను తో ఉన్న వేణు, లోపలకెల్లి, ఫుల్ గా టాప్ టు బోటం వైట్ అండ్ వైట్, ఒక చేతి లో నల్ల లాయరు కోటు , ఇంకో చేతి లో ఒక సంచి వేసుకొని హాలు లో కొచ్చాడు, ఎదో కేసు వాదించడానికి సిద్దం అన్నట్టు
మురళి పక్క తిరిగి "ఇంతకీ మీరు ఎవరు ? నన్ను ఇల్లు కాళీ చేయమనడానికి మీకు ఏ హక్కు ఉంది, మీ మీద హెరాస్మెంటు కేసు పెట్టచ్చు తెలుసా. ష్యాము గారు మీకేమన్నా పవర్ ఆఫ్ అటార్నీ ఇచ్చారా ?"
కాఫీ టేబుల్ మీద ఉన్న పేపర్లు ఎవో హడావిడి గా వెతుకుతూ " నేను, ఓనర్ ష్యాము గారు ఎదో మాట్లాడుకుంటున్నాం, ఆయన రెండు కి వస్తా అన్నారు, నా గురించి అక్కడ కోర్టు దగ్గర జనాలు వెయిటింగ్, సరే కదా అని నేను గంట కి పైగా వేచి ఉన్నది, ఈ బెదిరింపులు వినడానికా, అదీ మీ దగ్గర నుంచి" వెతుకుతున్న కాగితాల్లో ఎదో దొరికింది, అది తీసి తన సంచి లో వేసి. "ష్యాము గారు మీరు ఎమీ అనుకోవద్దు, ఇతను మాట్లాడింది మర్యాద గా లేదు"
"అయినా మీరు ఇక వెళ్ళచ్చు , ష్యాము గారూ, మీకు ఫోను లో చెప్పాను కదా అండి నాకు కోర్టు లో పని ఉంది, అందుకే రెండు గంటలకి రండి అన్నాను, పొనీలే ఎదో ఒకటి , మనం మనము ఫోను లో మాట్లాదుకుందాం, అయినా నేను ఎప్పుడయినా మీ ఫోను ఎత్తకుండా ఉన్నానా" అన్నాడు ష్యాము పక్క తిరిగి. వేణు గొంతు లో బెదిరింపు లేదు, అలా అని విన్నపమూ లేదు, ఉత్త లాయరు గిరీ మాత్రం ప్రదర్శించాడు.
పక్కనే ఉన్న ఒక గుడ్డ తీసి తన వాల్ ఆఫ్ ఫేము దగ్గరకి వెళ్ళి, ఆ ఫొటో ఫ్రేము లు దులుపుతూ " మీరు ఇక దయచేయండి . నేను కోర్టు కి వెళ్ళాలి" అన్నాడు.
ష్యాము "లేదు లేదు అవును ఆయన ఫోను ఎప్పూడూ ఎత్తుతారు " అన్నాడు మురళి పక్క తిరిగి కోర్టు బోనులో సాక్షిలా
"అన్నయ్య నువ్వు ఊరుకో .. ఎది ముఖ్యం నీకు? ఫోను ఎత్తడమా ఇళ్ళు ఖాళీ చెయ్యడమా ?" మురళి కి మండింది ష్యాము అన్న మీద
ఇంతలో మళ్ళీ చిచ్చర పిడుగు లటుక్కున వచ్చి, ష్యాము ని మురళి ని పొట్ట లో గిబీ గిబీ మని కరాటే గుద్దులు గుద్ది, ' ఇక వెళ్ళండి అన్నట్టు ' గుమ్మం తలుపు తీసి, అదే దూకుడు తో మళ్ళీ బెడ్ రూం లోకి పారి పోయాడు.
తలుపు వైపు నడుస్తున్నారు ఇద్దరు ఇక గత్యంతరం లేక.
"ఏం పర్వాలేదు ష్యాము గారు ' మన ' ఇల్లే గా, కాళీ చేసేద్దాం, మిమ్మల్ని ఇబ్బంది పెట్టను" ఇంట్లొంచి.
' మన ' ష్యాము మన సులో గట్టిగా గుచ్చుకుంది.
***********************
ష్యాం కుమార్ హైదరాబాదు లో చదువుకున్నాడు అనే మాటే గాని పాత సిటీ అంత గా పరిచయం లేదు. కూకట్ పల్లి లో ఉన్న జె ఎన్ టి యు లో చదువు ముగియ గానే క్యాంపస్ జాబు తోనే నోయిడా ( దేశ రాజధాని డెల్లి కి అదే హై టెక్ సిటీ) కి బదిలీ అయిపోయి ప్రవాస ఆంధ్రుడు అయిపోయాడు. కొంచెం కంగారు గానూ మరికొంచెం భయం గానూ ఉంది. సికంద్రాబాద్ రైల్ స్టేషన్ దగ్గర " ఐదు " నంబర్ బస్ ఎక్కి మసాబ్ టాంకు దగ్గర దిగాడు. ఎవరూ గుర్తు పట్టకుండా నెత్తిన ఒక టోపీ, కళ్ళకి నల్లటి కూలింగ్ కళ్ళద్దాలు పెట్టాడు.
అక్కడ నుంచి ఆ ఏజెంటు చెప్పిన దారిలోనే ఏ ఆటొ, ఊబర్ తీసుకోకుండా కాలి నడకనే వెళ్తున్నాడు ష్యాము చీకటి లో. ఒకటిన్నర కిలో మీటర్లు చింతల్ వైపు నడిచాక , " గోల్డ్ వ్యాయామసాల " తారసపడింది. ఇదేదో డిటెక్టివ్ సినిమా లో లా థ్రిల్ల్ గానే ఉంది అనుకున్నాడు. ఎవ్వరూ తనని గుర్తుపట్టకూడదని నల్ల అద్దాలు పెట్టాడే గానీ , తనకే ఎమీ సరిగా కనపడి చావడం లేదు, అసలే రాత్రి పూట.
కరెక్టు గా ఏజెంటు చెప్పినట్టు దానికి ఎదురుగా ' బ్లూ సీ " ఇరానీ చాయి షాపు. అందులో కెళ్ళి కౌంటర్ లో ఉన్న గెడ్డం మనిషి తో " ఆకాశం ఎర్రగా ఉంది, మీ కొట్టు మాత్రం నీలి సముద్రము" అన్నాడు చాలా మెల్లగా తన ముందు వెనక ఎవరూ లేకుండా చూసుకొని. " ఆప్ తోడా దేర్ హో గయా " అనే శబ్ధం వినపడింది కౌంటర్ లో ఉన్న గెడ్డం మీసాల మద్య లోంచి, అతని నోరు మాత్రం కనపడలేదు ష్యాము కి ఎంత పరికించి చూసినా. ఆ గెడ్డం తన చేతికి ఉన్న గడియారం లో సమయం తొమ్మిది దాటడం చూస్తూ " ఉస్ చార్ నంబర్ మే బైటో, ఆయెగా ఉనో " అని నాలుగు నంబర్ టేబుల్ వైపు చెయ్యి చూపించాడు.
ష్యాము కూర్చున్న ఐదు నిమషాలకి పూల చొక్కా వేసుకున్న ఒక మనిషి వచ్చి అదే టేబుల్ మీద ఎదురు గా కూర్చున్నాడు.
" మీరు ఇక్కడకి రావటం ఎవరూ గమనించ లేదు కదా "
లేదు లేదు అన్నట్టు తల అడ్డం గా ఊపాడు ష్యాము.
" మనం వెళ్ళాల్సింది ఇంద్రానగర్ , నేనే మిమ్మల్ని తీసుకు వెళ్తా " చెయ్యెత్తి రెండు వేళ్ళు చూపించాడు చోటూ వైపు
" కానీ మీకు కళ్ళకి గంతలు కడతాము, మా వేన్ లోనే.." అనేంతలో చూపుడు వేలు బొటన వేలు ముంచిన రెండు ఇరానీ చాయి గ్లాసులు టేబుల్ మీద చోటు చేసుకున్నాయి.
" మీకు అంతా ఏజెంట్ చెప్పే ఉంటాడు గా " అన్నాడు అతను కొంచెం విసుగ్గా సిగరెట్ వెలిగిస్తూ.
ష్యాము అన్నిటికీ సమ్మతమే అన్నట్టు తల ఆడిస్తూ నాకూ ఒకటి అన్నట్టు సిగరెట్ వైపు చూసాడు ఆశగా " నా పేరు ష్యాము మీ పేరు " అన్నాడు.
ఒక సిగరెట్ ష్యాము కి ఇస్తూ పూల చొక్క. " నీకు మళ్ళీ రూల్స్ అన్నీ చెప్పాలా ? నా పేరు తో నీకు పనేంటి భే"
" ఓ సోరీ సోరీ , అలవాట్లొ పొరపాటు "
" టీ తాగేసాక .. అదిగో, వెనక డోర్ ఉంది కదా" అని అటుగా ఆ డోర్ వైపు కళ్ళ తో చూపిస్తూ " దాని లోంచి వెనక్కి చూడ కుండా సీదా వెళ్ళు, అక్కడే పార్క్ చేసి ఉంది మనం వెళ్ళే ఎర్ర వేన్...ఆ నల్ల అద్దాలు తీసి జోబులో పెట్టుకో"
ష్యాము తల తిప్పి ఒకసారి ఆ వెనక డోర్ చూసుకుని తల ఊపాడు.
**********
ష్యాము కి కళ్ళ తో పాటు చెవులు నోరు కూడ మూసేసాడు పూల చొక్కా వేను లో ఎక్కగానే. వేన్ ఊరంతా తిరిగి, ఇంద్రా నగర్ చేరినట్టు ఉంది అనుకున్నాడు ష్యాము ఎందుకంటే బండి ఆగింది కాబట్టి. అసలు వీళ్ళు ఇంద్రా నగరే తీసుకొచ్చారో ఇంకెక్కడికో . అయినా అది తనకి అనవసరం. వచ్చిన పని ఇల్లీగల్ కాబట్టి ఇలాంటి తిప్పలు తప్పవు.
ఎవో గుసగుసలు వినపడ్డాయి . కళ్ళ కి మాత్రం గంతలు ఉంచి , మిగతావి అన్ని విప్పేసాడు. ఒక గొంతు ష్యాము తో " అ ఇ " అన్నది
" ఎంటి సార్ కాస్సేపు నోరు, చెవులు , కళ్ళు కట్టేసారని, నేను తెలుగు బాష మొత్తం మర్చిపొయ్యాను అనుకున్నారా .. అ ఆ ఇ ఈ ల నుంచి నేర్పిస్తున్నారా" ష్యాము తెలివిగా నవ్వాడు
" నొర్ముయ్ భే " అంది ఆ గొంతు. కాని ఈ భే, అక్కడ ఇరనీ చాయి దుకాణం లో భే కాదు. దానికీ దీనికీ అమెజాన్ కీ ఈబే కి ఉన్నంత తేడా అనుకున్నాడు, కాని బయటకి అనలేదు.
"కామెడి చేస్తే ఖాన్ కే నీచే ఎక్ ... ' అ ఇ ' నా కోడ్ , నీది చెప్పు భే"
భే లలో భేదం ఉన్నా, వాటి తీవ్రత లో ఏం తేడా లేదు.
" కా చే " సమాదానం చెప్పాడు తన ఏజెంటు చెప్పమనట్టు ష్యాము బేలగా.
" సరే " అని వాడు తనని చెయ్యి పట్టుకుని నడిపించి ఒక గది లోకి తీసుకెళ్ళి కుర్చీ లో కూర్చోపెట్టాడు. కళ్ళ కి గంతలు విప్పాడు, తీరా చూస్తే ఆ పూల చొక్క వాడు కాదు. వీడు చిన్న పిల్లాడి లా ఉన్నాడు, నున్న గా తెల్ల గా. మీసాలు గెడ్డం ఏం లేవు , క్లేన్ షేవ్.
అమ్మో వీళ్ళు చాలా జాగర్తలు పాటిస్తున్నారే అనుకున్నాడు ష్యాము కుమార్. ఒక రకం గా తనకి వాళ్ళ మీద అపారమయిన గౌరవం పెరిగింది.
తనని గది లో ఉంచి "మూసుకొని కూచో " అని వాడు వెళ్ళి పొతూ , గది అవతల నుంచి తలుపులు మూసే ముందు తన తల మాత్రం లోపలకి పెట్టి "భే" అనేసి తలుపులు మూసేసాడు.
తను కూచుంది ఎదో ఆఫీసు రూము లా ఉంది. మూల గా ఒక బీరువా, తన ఎదురు గా ఒక పెద్ద టేబుల్ , దాని మేద బోలెడు కాగితాలు, దస్తా వేజులు, ఫైళ్ళు, నోటు పుస్తకాలు , పెన్నులు సక్రమంగా సర్ది ఉన్నాయి. దానికి అటు వైపు ఒక కుషన్ కుర్చీ, తనది మాత్రం ప్లాస్టిక్ కుర్చీ. ఫేన్ కిర్రు కిర్రు మని తిరుగుతుంది.
చాలా సేపటికి, ఒక పొడుగాటి మనిషి, ఉంగరాల జుత్తు, చింపిరి గెడ్డం, చామన చాయ , నల్లటి పెద్ద సైజు కళ్ళద్దాలు. గంభీరం గా వచ్చి అవతల కుషన్ కుర్చీ లో కూర్చున్నాడు " అ ఇ " అంటూ
" కా చే ... నన్ను తీసుకొచ్చిన భే కి చెప్పాను గా.. అదే భే కాదు , అదే భాయ్ , నన్ను తేసుకొచ్చిన భాయ్ కి చెప్పాను గా".. అని మళ్ళీ కామెడి గా పళ్ళు ఇకిలించాడు ష్యాము, డిటెక్టివ్ నవలలో నిమగ్నమయిన పులకరింపుతో .
పొడుగాటి నల్ల కళ్ళద్దాలకి అది నచ్చినట్టు లేదు, అతను టేబుల్ మీద ఉన్న వాటిని ఒక మూలగా జరిపి. టేబుల్ సరుగు తెరచాడు, తన దగ్గర ఉన్న తాళం గుత్తి తో. దానిలోంచి ఒక పది పుస్తకాలు తీసి, వరసగా పేర్చాడు టేబుల్ మీద.
అతని అద్దాలు చూసి, ష్యాము కి కూడ గుర్తుకొచ్చి, తను కూడా నల్ల అద్దాలు జోబి లోంచి తీసి, పోటి గా పెట్టుకుంటూ ష్యాము " నా పేరు" . అతను కట్ చెసాడు "చుప్"
గాల్లో కి చూస్తూ ఎవో లెక్కలు వేస్తున్నట్టు వేళ్ళు కదిలించి, ఆ పుస్తకాల వరుసలో, ఒకటి ఎంచి మిగతావి అన్ని మళ్ళీ సరుగు లో పెట్టేసాడు. ఎంపిక చేసిన పుస్తకం లో పేజి లు తిరగేసాడు...ఎదో వెతుకుతున్నది దొరికినట్టు ఒక పేజీ లో ఆగి,
"ఆ చూడు, ఇవేనా మీ వివరాలు .. అన్నీ సరిగ్గా ఉన్నాయా చూడండి" అని ఆ పేజి చూపించాడు " మీ పేరు, మీ ఇంటి అడ్రెస్స్ , మీ ఇంట్లో అద్దెకున్న వాడి వివరాలు అన్నీ .. " అతను ఉన్నంత ఘంభీరం గా గొంతు లేదు, పీల గొంతు.
ఒక సారి ఆ పేజి అంతా పరికించి చూసి అవును అన్నట్టు తల ఊపాడు ష్యాము.
"ఒకే .. మీరు అడ్వాన్సు కట్టి వెళ్ళండి, పని పూర్తయ్యాక మిగతా మొత్తం మా భే... చ్చ చ్చ.. అదే మా బాయిస్ కలెక్టు చేసుకుంటారు"
"ఆ అంటే, పెద్ద గొడవలేం జరగవు కదా , అసలే మా టెనంటు లాయరు" ష్యాము
"కర్రా విరగదు విరిగినట్టు ఉంటుంది, పామూ చావదు కానీ అలా అనిపిస్తుంది, అసలు అక్కడ పాము ఉంటే గా..హ హ.. అంతా భ్రమ. రక్తం రాదు. కానీ వచ్చినట్టు అనిపిస్తుంది" ఆ పీల గొంతులో బడాయి.
"ఇంతకీ ఇల్లు కాళీ చేస్తాడా, లేదంటే నాకు కాళీ చేసినట్టు మాత్రం అనిపిస్తుందా" ష్యాము
"హెయ్ హే గుడ్ ఒన్ యా" కొంత నవ్వి, వెంటనే , తన ఘంబీర ధోరణి లో "ఇంకెప్పుడు ట్రై చెయ్యకండీ, వెళ్ళండి" అన్నాడు.
ఆ నల్లకళ్ళజోడు పుస్తకాలను తీసి టేబుల్ మీద పెడుతునప్పుడు రెండు విషయాలు గమనించాడు ష్యాము.
అన్ని పుస్తకాల మీద అడ్డంగా పెద్దగా ఒకటి రాసి ఉంది
పాండు -- జేంసు పాండు 0 0 7
అతను చివరగా ఎంపిక చేసి తనకి చూపించిన బుక్ మీద.
' అ ఇ కా చే ' అని పెద్ద గా , దాని కింద చిన్నగా
' అద్దె ఇల్లు కాళీ చేయిస్తాం '
***********************************
: నేల బాగా తడపి విత్తనం వేయటము :
----------------------------------------
వేణు కోర్టు కి వెళ్ళడానికి కారు తీసి వాళ్ళ అపార్ట్ మెంటు గేటు దాటి, ఒక్క పావు కిలో మీటర్ వెళ్ళగానే కారు వెనకాల టైరు తూలినట్టు అనిపించి, రోడ్డు కి వారగా కారు ఆపి, దిగి చుస్తే, టైరు పంక్చర్. ' చ ' అని దాన్ని ఒక్క తన్ను తన్ని, ' అబ్బా ఇప్పుడెలా ' అని తన సెల్ ఫోను లో ఎవో నంబర్లు స్క్రోల్ల్ చేస్తునాడు. ఇంతలో ఒక కారు తనకి దాటి ఒక పది అడుగుల దూరం వెళ్ళి ఆగింది. అందులోంచి ఒక పొడుగాటి మనిషి దిగాడు. ఉంగరాల జుత్తు, చింపిరి గెడ్డం, చామన చాయ , నల్లటి పెద్ద సైజు కళ్ళద్దాలు.
"ఎంటి సార్ కార్ ట్రబుల్ ? " అన్నాడు తన పీల గొంతు తో
"ఆ టైర్ పంక్చర్ లా ఉంది , నేను కోర్టు వెళ్ళాలి" వేణు
"ఒకే , నా దగ్గర టైర్ మార్చే జాకీ ఉంది, మీ కారు లో స్పేరు టైరు ఉంటే మనం ఇద్దరం మార్చేయొచ్చు "
"నిజంగానా ? ఆర్ యు షూర్ ? నేను నా మెకానిక్ కి కాల్ "
ఆ పీల గొంతు కట్ చేస్తూ " మీ మెకానిక్ కాళీ చూసుకొని వచ్చి చేసే సరికి మీకు టైం అయిపోతుంది సార్, ఇది పది నిమషాల పని, మనం ఇద్దరం చాలు "
"అయ్యో మీకు ఇబ్బంది.."
"ఎం పర్లేదు " అనే శబ్ధం వేణు చెవిలో పడే లోపే అతను , టైరు మార్చే సామగ్రి తో రెడీ అయిపోయాడు
"ఆరంబిద్దామా " అన్నాడు వేణూ కి ఇంక నిర్ణయం తీసుకునే అవకాసమే లేకుండా " నన్ను పాండు అంటారు "
"వేణు" అన్నాడు కారు వెనకాల డిక్కీ లోంచి స్పేరు టైరు తీస్తూ.
"ఎక్కడ మీరు ఉండేది " పీల పాండు
"ఇక్కడే సార్ , జస్ట్ కార్నర్ లో జనా సతి అపార్ట్ మెంటు "
"నిజమా, నేను దానిలోనే ఉండే వాడిని బి బ్లాక్ లో, ఇల్లు అమ్మేసి వెళ్ళి పోయాం, మీకు సేఫ్ గానే అనిపిస్తుందా అక్కడ" జాకీ తో కారు పైకి లేపాడు మొకాళ్ళ మీద కూచుని
"మాది ఎ బ్లాక్ , బానే ఉందే , మా ఓనర్ ఐదు ఏళ్ళు గా రెంటు కూడ పెంచలేదు, కొంచెం మెతక లెండి"
తనలో తాను నవ్వుకుంటూ " ఎందుకు మీరు కాళీ చేసారు " అంటూ కాళీ గా నుంచుంటే బాగోదని, మొకాళ్ళ గుంజి వేసాడు.
" ఎందుకు ఎమిటండి , పచ్చి మొసగాళ్ళు , దొంగతనాలు, అసోసిఏషన్ మీటుంగు లో ఇవేవి బయటకి రానివ్వరు . ఇంకా ఆ మెహర్ గాడేనా సెక్రెటరీ "
అవును అన్నట్టు తల ఊపాడు వేణు , స్పేరు టైరు అందిస్తూ
రెండు నిమషాల్లో టైరు మార్చి చేతులు దులుపుకున్నాడు పాండు
"చూడండి ఎంత చిన్న పని ఇది " తన పని ముట్లు అన్ని చక చకా బేగ్ లో సర్దేసాడు.
"ఏమో నండి వేణు గారు, మీకు నచ్చితే అక్కడే ఉండండి, అది మీ ఇష్టం. ఇంకో విషయం అక్కడ అద్దెకి ఉండే కాలేజి కుర్రాళ్ళ మీద ఒక కన్నేసి ఉంచండి , చాలా మంది ఆంటీ లతో రాసలీలలు. అంటే అఫైర్ లు కాదండోయి" తన బేగు పట్టుకుని తన కారు లో పెట్టడానికి వెళ్ళాడు వేణు ని కొంత సస్పెన్స్ లో ఉంచి
తిరిగి వచ్చి చేతులు దులుపు కుంటూ "మన ఆడవాళ్ళు ఒక్కరే ఉన్నప్పుడు బెల్ కొట్టడం, వీళ్ళు తీయగానే మత్తు మందు మొహం మీద చల్లడం.
' ఆ ఆంటీ ఇది ఫోర్ నాట్ ఒన్ ఆ ? అని తెలియనట్టు అడగటం. అసలు డోరు మీద ఉంటుంది గదా నంబర్ వాళ్ళ ఎదవ ప్రశ్న కాకపోతేను,
కానీ మన అమాయక పెళ్ళాలు, ఎదో వీళ్ళని కౌన్ బనేగా కరోర్ పతి లో ప్రశ్న అడిగి నట్టు
' అయ్యో కాదమ్మ బాబు ఇది ఫోర్ నాట్ ఫోరు ' అని పళ్ళు ఇకిలించడం , ఇంతలో మత్తు ఎక్కి పోతుంది.. వాడు లోపలకి వచ్చేయడం .. ఇవన్నీ నిమషాల్లో అయిపోతాయి వేణు గారూ. బయట నుంచి చూసే వాళ్ళకి ఎదో మనకి తెలిసిన వాడే లోపలకి వచ్చినట్టు అనిపిస్తుంది "
" ఆ లోపలకొచ్చి" వేణు లో అనుమాన బీజం నాటింది
"ఇంకేముందు , మీరు ఊహించలేరా ... ఇవాళ రేపు ఇంటర్నెట్ లో ఎలాంటి పిక్చర్లు, విడీయోలు, పైగా బ్లాకుమెయిల్ చెయ్యటం..అయినా మీకు బాగుంది, రెంటు తక్కువ కదా, మీరు ఆ ఇంట్లోనే ఉండండి"
వేణు ఆలోచనల్లో ఉండగా, మన పాండు జారుకున్నాడు. అసలు షేకు హాండ్ ఇచ్చి , ధన్యవాదాలు చెప్పి, ఫోను నంబర్ మార్చుకొని, కాఫీ కి ఇంటికి పిలుద్దాం అనుకున్నాడు వేణు, అసలు మన 0 0 7 అంత సమయం ఇస్తే గా.
**************
: ఎరువు వేసి మొక్క పెంచడం :
--------------------------------------
ష్యాము ఫోను మోగింది.
"ఎం సారు మా కేసు వాదిస్తవా ? " ఫోను లో పీల గొంతు
ఈ గొంతు ఎక్కడో వినట్టు ఉందే , సందేహం వేణు కి. కోర్టు లో వేల మంది వస్తూ, పోతూ...
"ఆ ఎవరు అండి ఇది ? " వేణు
"నేను సారు యాద్గిరి బావ ని, మీరు మా కేసు వాదిస్తరా లేదా , జరా జెప్పురి "
"మీరు నన్ను కోర్టు దగ్గర కలిసారా ? కేసు వివరాలు తెలుసు కోకుండా క్లైంటు ని కలవకుండా , ఎలా మరి... మీరు"
"గేం లే చానా సింపల్ సారూ, మా యాద్గిరి కి మలక్ పేట్ ల మకాన్ ఉంది గా"
"ఆ ఉంటే"
"గా ఇల్లు , కిరాయి కి ఇచ్చిండు, గా బట్టెబాజ్ భరత్ గానికి. గాడేమో ఐదు నెలల్ కెల్లి కాళీ చేయడం లే, గెంత చెప్పినా కాళి చేయడం లే, ఇక మా యాద్గిరి ఎమన్న ఊకుంటాడా, పోయి నాల్గు పీకిండు , గాని కాలు చేయి పల్గినయి"
"అయ్యో, ఉండు... ఇదేదో క్రిమినల్... అయినా నా ఫోను నంబర్ ఎవరు"
కట్ చెస్తూ పీల గొంతు "ఎవల్ నంబర్ ఇస్తే నీ కేం వాయ్ , నువ్వు వాదిస్తవా లేదా ?... ఇంతకీ విషయం ఎంటంటే, గా బట్టెబాజ్ గాడు, గిప్పుడు దవఖానా లో ఉన్నడు, సచ్చేట్టున్నడు..అందుకే ఈ పంచాయితీ.. సస్తే మా యాద్గిరి మీద కొస్తదా ? ఇదిగో సారు ఎవ్వన్ తోన్ చెప్పకు, గిది నీకూ నాకు మధ్య, గా కొట్టిన రోజున మా వాడు ఫుల్ పటాస్ లొ ఉన్నడు "
"ఒరేయ్ ఎవరు రా నువ్వు, అయినా ఇల్లు కాలీ చేయక పోతే చచ్చేలా కొట్టడం ఎంటి రా ?"
"గవన్ని నీ కెందుకు వయ్ , నువ్వు వాదిస్తవా లేదా ?... పది వేల కి పానాలు దీసే వస్తాదులు ఉన్నారు సార్. మా బావ ఏం తప్పు చేయలే, ఐదు నెలల కెల్లి కాళీ చేయనోన్ని కొట్టలా ,సంపాలా సార్"
వేణు కి ఎక్కడో తగిలింది.
"మీ గొంతు ఎక్కడో విన్నట్టు ఉంది , మీరు నా ఆఫీసు కి వచ్చారా ?"
"లేదు సార్ మనం ఎప్పుడు గల్వలే ..అయినా మా కేసు వాదిస్తవా లేదా ? నీకు ఫీసు గావాల్నా వొద్దా "
"బాబు ...కొట్టడం, హాస్పిటల్ అంటున్నావ్, ఇది క్రిమినల్ కేసు, నేను సివిల్ .."
వేణు పూర్తి చేసే లోగా ఫోను కట్
**************
: చివరిగా, మొగ్గ మొలిచి , పువ్వు పూయటం :
-----------------------------------------------
వేణూ ఆఫీసులో ఎవరో క్లైంటు తో కేసు విషయం చర్చిస్తున్నప్పుడు ఫోను మోగింది
"సారు మేం డి హెచ్ ఎల్ పార్సల్ నుండి, మీ ఇంటి తలుపు తెరవడం లేదు, ఇది సిగ్నేచర్ పెడితే గానీ డెలివెరీ చేయం సార్"
"డెలివెరీ ఆ ? మాకా ? మేము ఎం ఆర్డర్ చేయలేదే " వేణు సందిగ్దం లో పడ్డాడు
"ఎమో సార్ మీరు ష్యాము కుమారే కదా, ఫ్లాటు ఫోర్ నాట్ ఒన్ ఏ కదా, ఇంకెవరన్నా ఆర్డర్ ఇచ్చారేమొ సార్, సెండర్ వివరాలు లేవు ఇక్కడ, ఆన్ లైన్ పర్చేజి సార్"
"ఆ సర్లే ఇప్పుడేంటి , నేను ఆఫేసులో ఉన్నా" అన్నాడు వేణు విసుగ్గా
"అదేం లేదు సార్ , ఇందాక ఒక గంట క్రితం కూడా వచ్చా, ఎవ్వరూ తెరవలేదు, అందుకే మళ్ళీ ఇప్పుడు వచ్చా, ఈ ఒక్క పేకేజి కోసం ఇంత దూరం రావాలంటే... మీరే ఆలోచించండి సార్.. ప్లీజ్.. మీ నంబరే ఉంది ఆర్డర్ లో, అందుకే కాల్ చేసా"
సర్లే ఎవడు పంపితే ఎంటి, కానీ వేణు కి అర్ధం కానిది తన భార్య తలుపు ఎందుకు తీయడం లేదు అని. బాడ్ లేడీసు తో బాతాఖానీ లో పడి ఒళ్ళు మరచి పోయిందేమో
"ఒక్క నిమషం లైన్ లో ఉండవయ్యా " అని తన సెల్ ఫోను పక్కన పెట్టి , ఆఫీసు ఫోను లొంచి సతీ మణి కి ఫోను కలిపాడు...జవాబు లేదు. ఎక్కడికెళ్ళింది తనకి తెలియకుండా
ఆ డి హెచ్ ఎల్ వాడి తో "సారి బాబు, ఇంట్లో ఎవరూ లేరు... మరేం అనుకోకు, మళ్ళి రేపు రా ఇదే టైం కి , ఎవరో ఒకరు ఉండేలా నే చుస్తాలే "
"సరే సార్"
వేణు కి గుండెల్లో గుబులు మొదలయింది. అస్సలు తనకి చెప్పకుండా కిందకి పాలు తేవడానికి కూడ వెళ్ళదు, ఒక వేళ నిద్ర పోయినా, ఇంత మొద్దు నిద్రా ?? ఒక వేళ ఆ రోజు తనకి కారు సాయం చేసిన వాడు చెప్పినట్టు.. అమ్మో ఒక్క సారి గుండెల్లో గాబరా , క్లైంటు కి కొంటె సాకు చెప్పి హుటా హుటిన ఇంటికెళ్ళాడు
****
తలుపు చాలా సార్లు కొట్టాడు. తెరవ లేదు. సెల్ ఫోను ఎత్తడం లేదు. డి హెచ్ ఎల్ వాడు గంట పైగా వేచిచూసాడు, తనకి ఆఫీసు నుండి రావడానికి ఇంకొ గంట, ఇక వేణు కి గుండెల్లొ రైళ్ళు విమానాలూ పరిగెట్టాయి.
తన దగ్గర తాళం ఉంది, కానీ లోపలకి వెళ్ళే ధైర్యం చాలలేదు. ఒక పావు గంట సేపు చెడు ఆలోచనలన్నీ చెడుగుడు ఆడేసాయి. కింద కెళ్ళి, బడ్డీ కొట్లో ఒక కాఫీ తాగి, మళ్ళి పై కొచ్చి కాలింగు బెల్ల్ కొట్టాడు. ఇక ఆగలేక తాళం తీసుకొని లోపలకి వెళ్ళాడు
తన భార్య హాల్ లో సోఫా మీదే, వొళ్ళు తెలియకుండా పడుకొని ఉంది. "ఒసేయ్ వేణీ ఎంటా మొద్దు నిద్ర, లే" అరిచాడు వేణు
ఉలుకు పలుకు లేదు. వేణి అవతారం తన కి హృదయ వికారం గా ఉంది. జుట్టు చెదిరి పోయి, బొట్టు చెరిగి పోయి, చీర సగం కింద కి జారి పోయి. తను తట్టి లేపితే గాని వేణి కి తెలివి రాలేదు. అంతా అయిపోయిందని ఊహల్లోకి వెళ్ళిపోయాడు
"మీరెప్పుడు వచ్చారు.. టైం ఎంత అయ్యింది ?"
"ఎంటే మొద్దు నిద్ర"
"ఎమోనండి ఎవరో కుర్రాడు ఇది ఫ్లాట్ ఫైవ్ నాట్ టు ఏ నా ఆంటీ , అని అడిగాడు.."
కట్ చేసాడు వేణు " నువ్వు ఇంకేమి చెప్పకు, నాకేమి వినాలని లేదు"
"అది కాదండి ఆ అబ్బయి అలా.."
"వొద్దు అన్నానా, నువ్వు వెళ్ళి స్నానం చెయ్యి , నిన్ను చూడలేక చస్తున్నా.. ఏమీ జరిగినా ,జరగక పోయినా సరే, ఇంక చస్తే ఈ అపార్టు మెంటు లో ఉండేది లేదు, మనము కాళీ చేస్తున్నాం"
***********
ఆ రాత్రి పది దాటాక, ష్యాము ఫోను మోగింది టక్ మని ఎత్తాడు మొదటి రింగు కే
"మీ ఫోను కోసమే ఎదురు చూస్తున్నా వేణు గారు చెప్పండీ, ఎమన్నా ఇబ్బందా "
ఈ సారి విస్తుపోవడం వేణూ వంతు
"ఆ అదే.. ఎలా ఉన్నారు.. ఇల్లు.."
"ఏముంది సారు అంతా మీ దయ వల్ల చల్లగా ఉన్నాము.. ఇల్లు అంటున్నారు అదే ' మన ' ఇల్లు గురించా ? చెప్పండి " ష్యాము శాంతం గా, తన గొంతు లో ప్రతీకార భావావేశం అణుచుకుంటూ
వేణు కి వెటకారం అర్ధం అయింది. "ఎమీ లేదండి నాకు ఇంకో ఇల్లు అద్దె కి దొరికింది, మీ ఇల్లు వచ్చే వారం కాళీ చేస్తునా, అది చెప్దామని.
*********** సమాప్తం *********************