కుమార విజయం ( పురాణ గాథలు-3 ) - కందుల నాగేశ్వరరావు

Kumara Vijayam

కుమార విజయం

(పురాణ గాథలు-3)

-1-

తారకాసురుడు అనే రాక్షసుడు బ్రహ్మదేవుని గూర్చి ఘోరమైన తపస్సు చేసి “స్వామీ! ఈ సృష్టిలో నా అంతటి బలవంతుడైన మరో పురుషుడు ఉండరాదు. శివవీర్యంచే జన్మించిన కుమారుడు దేవతల సేనాదిపతియై నాపై ఆయుధాన్ని ఎప్పుడు ప్రయోగిస్తాడో, అప్పుడు మాత్రమే నాకు మరణం కలగాలి అనే రెండు వరాలూ నాకు అనుగ్రహించు” అని కోరాడు. బ్రహ్మదేవుడు తారకాసురునికి అతను కోరిన వరాలను ప్రసాదించాడు.

తారకాసురుడు దేవతలనందరినీ ఓడించి బానిసలుగా చేసుకొని బాధించసాగాడు. దేవతలు అతనిపై ప్రయోగించిన ఆయుధాలు నిర్వీర్యమై పోయాయి. చివరకు విష్ణువు చేతిలోని సుదర్శన చక్రం కూడా వాడి మెడలో పూలమాలగా మారిపోయింది. తారకాసురుడి బాధలకు దేవతలందరూ దిక్కు తోచక బ్రహ్మ గారిని శరణు కోరారు. “నా వరాల వల్ల శక్తిని సాధించిన వాడిని నేను వధించ లేను. మీ కోరికను తీర్చగలవాడు శంకరుడు ఒక్కడే. శివ వీర్యం వల్ల జన్మించినవాడు మాత్రమే తారకాసురుణ్ణి చంపగలడు. సతీవియోగం తరువాత శివుడు హిమాలయాల్లో తపస్సులో ఉన్నాడు. పార్వతి చెలులతో కలిసి ఆయనకు సేవ చేస్తోంది. వారి వివాహం జరిగేటట్లుగా మీరు ప్రయత్నించండి. వారికి పుట్టిన కుమారుడు ఆ అసురుని వధించగలడు” అని ఉపాయం తెలిపాడు.

బ్రహ్మ తారకుని వద్దకు వెళ్ళి “కుమారా! నేను నీకు చాలా గొప్ప వరాలు ఇచ్చాను. కాని స్వర్గాధిపత్యం ఇవ్వలేదు. కనుక నీవు నామాట విని స్వర్గాన్ని త్యాగంచేసి భూమండలాధిపత్యాన్ని స్వీకరించు” అని నచ్చ చెప్పాడు. బ్రహ్మగారి మాటలను అంగీకరించి తారకుడు భూలోకంలో శోణితపురి వచ్చి పరిపాలించ సాగాడు.

-2-

పూర్వం దక్షయజ్ఞంలో ప్రాణత్యాగం చేసిన సతీదేవి మేనా హిమవంతుల పుత్రిక పార్వతీదేవిగా జన్మించింది. దేవతల ప్రణాళిక ప్రకారం శివుని వివాహం పార్వతీదేవితో జరిగింది. శంకరుడు పార్వతితో పరిణయ మహోత్సవ కార్యక్రమం పూర్తయిన తరువాత, అత్తమామల వద్ద శలవు తీసుకుని తన ప్రియసతితోను, రుద్రగణాలతోను కలిసి కైలాసం చేరుకున్నాడు.

కామేశ్వరుడు కాపురానికి కైలాసంలో రకరకాల లతలు సుగంధపుష్పవనాలతో నిండిన ఒక సుందరమైన ఏకాంత ప్రదేశాన్ని ఎంచుకున్నాడు. అక్కడ ఆమెకు కావలసిన అన్ని రకాల సదుపాయాలు సమకూర్చాడు. నానావిధ భోగవస్తువులతో కూడినదీ, రతిసుఖాలకు అనువైనదీ అయిన శయ్యాఫలకాన్ని సృష్టించాడు. కాళితో కలిసి ఆ ఏకాంత ప్రదేశంలో శృంగారక్రీడలు గడపసాగాడు. ఇలా ఆ ఆదిదంపతులు కాలగమనాన్ని మరచిపోయి వెయ్యి సంవత్సరాలు ప్రణయ పారవశ్యంలో మునిగిపోయారు.

అపుడు దేవతలందరూ దేవేంద్రుని నాయకత్వంలో మేరుపర్వతం దగ్గర సమావేశమై “శంకరుడు మనని రక్షించడానికై వివాహం చేసుకున్నాడు. అయినా ఇప్పటి వరకు పార్వతీపరమేశ్వరులకు త్రిపురాసురుని సంహరించే సంతానం కలుగలేదు. కనుక మనం బ్రహ్మదేవునితో కలిసి శ్రీహరి వద్దకు వెళ్ళి వారిని ఏదైనా ఉపాయం తెలపమని వేడుకోవాలి” అని నిర్ణయించారు.

దేవతల విన్నపం శ్రద్ధగా విన్న నారాయణుడు “దేవతలారా! మీరు చింతించకండి. మీకు మంచి జరుగుతుంది. శివపార్వతుల ప్రణయవిహారం పూర్తవడానికి ఇంకా సమయం కాలేదు. మనం వారి ఏకాంతానికి విఘ్నం కలుగజేయరాదు. అలా విఘ్నం కలిగించిన వారికి జన్మ జన్మల యందు భార్యా వియోగం కలుగుతుంది. పూర్వం ఇంద్రుడు రంభతో విహరిస్తుండగా వారికి విఘ్నం కలిగించినందుకు దుర్వాసమహర్షికి, మోహినీ చంద్రుల విహారానికి విఘ్నం కలిగించినందుకు గౌతమ మహర్షికి భార్యా వియోగం కలిగింది. ఆది దంపతులు మరొక వేయి సంవత్సరాలు అలా ఏకాంతంగా విహరిస్తారు. కనుక మీరు ఓపికతో వేచి ఉండండి. గడువు పూర్తయిన తర్వాత అక్కడకు వెళ్ళి ఆ శివతేజస్సును భూమి ధరించేటట్లు చేయండి. ఆ తేజస్సు నుండి శివపుత్రుడు స్కంధుడు జన్మిస్తాడు” అని వారికి ఉపదేశించాడు.

-3-

శివశక్తుల రతికేళి విలాసం భరించలేక భూమి, ఆది కూర్మము, ఆదిశేషువు కంపించారు. లోకాలన్నీ తల్లడిల్లిపోయాయి. అప్పుడు దేవతలు నారాయణునితో కలిసి కైలాసానికి వచ్చారు. కాని శివ మందిరంలో వారికి శివపార్వతులు కనపడ లేదు. శివగణాల ద్వారా వారున్న ప్రదేశాన్ని తెలుసుకున్న దేవతలు ద్వారం వెలుపల నిలిచి శివుని కాపాడమని స్తుతించారు. శివ శక్తుల ప్రణయానికి భంగం వాటిల్లింది. మహాదేవుడు దేవతల మొర విని పార్వతికి ఇప్పుడే వస్తానని చెప్పి ద్వారం దగ్గరకు వచ్చాడు. అప్పుడు బ్రహ్మ విష్ణులు అక్కడకు వచ్చి తారకాసురుడు మొదలైన రాక్షసులను సంహరించడానికి ఉపక్రమించమని శంకరుని వేడుకున్నారు. అప్పుడు శివుడు “నారాయణా! నేను ఆ ప్రయత్నంలోనే ఉన్నాను. నా తపస్సు పూర్తయే సమయంలో మీరు విఘ్నాన్ని కలుగజేసారు. ఇప్పుడు నా నుండి జారి పడుతున్న తేజస్సును గ్రహించగల వారెవరో చెప్పండి” అన్నాడు.

శివుని మాటలు విన్న దేవతలు అగ్నిని ప్రార్థించారు. అగ్నిదేవుడు ఆ శివతేజస్సును పావురం రూపంలో గ్రహించాడు. సంయోగమధ్యలో తనని శయ్య మీదే విడిచివెళ్ళిన శివుడు ఇంకా రాలేదేమిటా అనుకుంటూ ద్వారం దగ్గరకు వచ్చింది దుర్గాదేవి. జరిగిందేమిటో అర్థమైంది. కోపంతో “ఓ దేవగణాల్లారా! మీ స్వార్థం కోసం మా శృంగార సుఖానికి భంగం కలిగించారు. నన్ను తల్లిని అయ్యే భాగ్యానికి దూరం చేసారు. ఈ నాటి నుండి మీ దేవతల కెవ్వరికీ సంతాన ప్రాప్తి కలుగకుండు గాక! మీ భార్యలు గొడ్రాళ్ళు అవుగాక!” అని శపించింది. తరువాత అగ్నిని చూసి “అగ్ని! నీవు శివతత్త్వం తెలియని మూర్ఖుడివి. శివుని వీర్యాన్ని గ్రహించావు. నువ్వు నిత్య దుఃఖితుడివి, సర్వభక్షకుడివి అవుగాక!” అని శపించి తన గృహం లోనికి వెళ్ళిపోయింది.

-4-

అగ్ని భుజించినది ఏదైనాసరే అది దేవతలకు వాటాలుగా చేరుతుంది. ఆ విధంగా శివుని తేజంతో దేవతలందరూ గర్భాన్ని ధరించారు. లోపల నుండి శివుని వీర్యం దహించి వేస్తోంది. పార్వతీదేవి శాపం వల్ల దుఃఖితులయ్యారు. అందరూ శివుని ప్రార్థించారు. దయామయుడైన శివుడు వారితో ఆ తేజస్సును వాంతి చేసుకోమని సలహా ఇచ్చి స్వస్థత కలిగించాడు. అగ్నికి మాత్రం తాపం పోలేదు. శివుడు అగ్నికి ఉపకారం చేయడం కోసం “మాఘమాసంలో తెల్లవారుజామున స్నానం చేయడానికి నదీతీరానికి వచ్చిన స్త్రీల యందు ఉంచు. నీ తాపం పోతుంది” అని శలవిచ్చాడు.

సప్తర్షుల భార్యలు ఆకాశగంగలో మాఘస్నానం చేసారు. అరుంధతి తప్ప మిగిలిన ఆరుగురు శివమాయ వల్ల చలికి ఓర్వలేక అగ్ని సమీపానికి వెళ్ళి చలి కాచుకున్నారు. శివతేజస్సు వారి శరీరంలో ప్రవేశించి వారందరూ గర్భం దాల్చారు. ఆరుగురు మహర్షులు క్రోధంతో తమ భార్యలను త్యజించారు. వారు తమ పరిస్థితికి విచారించి, గర్భంలో ఉన్న శివతేజస్సును హిమాలయాల్లో కైలాస శిఖరంపై విడిచిపెట్టారు. హిమవంతుడు ఆ తాపం భరించలేక వాయుదేవత సహాయం కోరాడు. వాయుదేవుడు ఆ రేతస్సును ఎత్తుకు వెళ్ళి గంగలో వేశాడు. గంగ ఆ తేజస్సు భరించలేక తన కెరటాలతో విచ్ఛిన్నం చేస్తూ ఒడ్డున ఉన్న రెల్లుపొదల మధ్యకు చేర్చింది. ఇలా శివతేజస్సు ఆరు స్థానాల్లో పరిపక్వమై మార్గశిరమాసంలో శక్లపక్షంలో షష్ఠి నాడు ఈ భూమిపై అతి సుందరుడు, తేజోవంతుడు అయిన బాలకునిగా మారింది. శివతేజం నుండి శివకుమారుడు అవతరించాడు.

ఆ శిశువలా రెల్లుపొదలో పడి ఉండగా అస్త్రవిద్యలో ఆరితేరిన విశ్వామిత్ర మహర్షి ఆ బాలుని వద్దకు వచ్చాడు. ఆ శివపుత్రుని ప్రకాశాన్ని చూసి నమస్కరించాడు. వెంటనే ఆ బాలుడు “మహర్షీ! ఈశ్వరాజ్ఞ వల్ల నువ్వు నాదగ్గరకు వచ్చావు. నాకు వేదోక్తమైన సంస్కారాలు చెయ్యి” అన్నాడు. “నేను బ్రాహ్మణుడను కాను. నీకు సంస్కారాలు జరిపించే అధికారం నాకు లేదు” అన్నాడు విశ్వామిత్రుడు. దానికి కుమారుడు “నిన్ను బ్రహ్మగా అనుగ్రహిస్తున్నాను. నా ఉనికినీ, జన్మనూ రహస్యంగా ఉంచు. నువ్వు నాకు పురోహితుడవై బ్రహ్మర్షిగా మారి లోకంలో పూజ్యుడవౌతావు” అని చెప్పాడు. విశ్వామిత్రుడు ఆనందంగా ఆ బాలుడికి వేదోక్త సంస్కారాలు జరుపగా, శివపుత్రుడు మహర్షికి దివ్యజ్ఞానాన్ని గురుదక్షిణగా ఇచ్చాడు. కుమారుడు జన్మించిన సమయంలో కైలాసంలో పార్వతీపరమేశ్వరులు అనిర్వచనీయమైన సుఖప్రాప్తిని పొందారు. జగన్మాత మాతృభావన పొందగా పాలిండ్లలో పాలు చేపాయి.

అగ్నిదేవుడు వచ్చి ఆ బాలుడికి శక్తి అనే ఆయుధాన్ని మంత్ర సహితంగా బహూకరించాడు. శివకుమారుడు ఆ శక్తితో ఒక పర్వతాన్ని ఎక్కి శిఖరాన్ని విరగగొట్టాడు. శివకుమారుడు జన్మించిన సంగతి గ్రహించిన తారకాసురుడు ఆ కుమారుని వధించమని తన రాక్షస సైన్యాన్ని పంపాడు. కుమారుడు విరగగొట్టిన పర్వతశిఖరపు బండలు మీదపడి రాక్షస సైన్యం అంతమయ్యింది. ఆ శబ్దానికి ముల్లోకాలు కంపించాయి. స్వర్గలోకాధిపతి ఇంద్రుడు అక్కడికి వచ్చి ఆ శబ్దానికి కారకుడైన బాలుని చూచాడు. అతన్ని నిరోధించాలని అనుకున్నాడు. బాలుని రెండు బుజాల పైన, వక్షస్థలం పైన వజ్రాయుధంతో కొట్టగా ఐనశాఖుడు, విశాఖుడు, నైగముడు అనే ముగ్గురు వీరులు జన్మించారు. స్కందునితో కలిసి ఆ నలుగురూ ఒకే రూపంలో ఉన్నారు. వారు ఇంద్రుని చంపబోయారు. అప్పుడు ఇంద్రుడు ప్రాణ భయంతో తన లోకానికి పారిపోయాడు. బ్రహ్మదేవుడు వచ్చి కుమారుని శాంతింపజేసాడు.

అదే సమయంలో “కృత్తికలు” అనే ఆరుగురు మునిపత్నులు అక్కడకు వచ్చారు. ‘నాబిడ్డ’ అంటే ‘నాబిడ్డ’ అని వాదులాడు కున్నారు. కరుణామూర్తి అయిన స్కందుడు వారి మాతృప్రేమకు సంతోషించి ఆరు ముఖాలను పొంది వారందరి దగ్గర ఏకకాలంలో పాలు త్రాగాడు. కృత్తికలు ఆరుగురూ కుమారుని తమతో తీసుకువెళ్ళి అల్లారు ముద్దుగా పెంచుకున్నారు.

-5-

ఇలా ఉండగా ఒకనాడు పార్వతీదేవి శివునితో “ఆ నాడు మన ప్రణయ విహారం, దేవతలు కలిగించిన విఘ్నం వలన భగ్నమయ్యింది. అప్పుడు మీతేజస్సును ఏ దేవత గ్రహించింది? దాని ఫలితంగా జన్మించిన శిశువు ఎక్కడ?” అని ప్రశ్నించింది. ఈశ్వరుడు దేవతలను, కర్మసాక్షులనూ పిలిచి పార్వతి ప్రశ్నను వారి ముందు ఉంచాడు. వారందరూ వారికి తెలిసిన నిజాన్ని చెప్పారు. తమ కుమారుడు కృత్తికలచే పెంచబడుతున్నాడని తెలుసుకొని పార్వతీపరమేశ్వరులు ఎంతో సంతోషించారు. కార్తికేయుని తీసుకు రమ్మని రుద్రగణాలను కృత్తికల దగ్గరకు పంపించారు. కృత్తికలు గణాలను చూసి భయంతో కార్తికేయుని పట్టుకొని రక్షించమని వేడుకున్నారు. అప్పుడు ఆ కుమారుడు ఆయుధాన్ని ధరించి “తల్లులారా భయపడకండి. నా ఇష్టం లేకుండా నన్నెవరూ ఎక్కడికీ తీసుకుపోలేరు” అని ఓదార్చాడు.

అప్పుడు నందీశ్వరుడు ముందుకు వచ్చి “కుమారా! నీవు శివ పుత్రుడవు. విధివశాత్తు ఈ కృత్తికల వద్ద పెరుగుతున్నావు. శివుడు నిన్ను కైలాసానికి తీసుకు రమ్మని మమ్మల్ని పంపాడు. నీవు కారణ జన్ముడవు. దేవతలు నీకు వారి వారి ఆయుధాలు ఇస్తారు. నిన్ను దేవతలు తమ సర్వ సైన్యానికి సేనాధిపతిగా నియమిస్తారు” అని చెప్పాడు. స్కందుడు నందితో “సోదరా! నాకు అన్ని విషయాలు తెలుసు. ఈ కృత్తికలు యోగినిలు. వీరి పాలు త్రాగి వారి ఒడిలో నేను పెరిగాను. పెంచిన ప్రేమ గొప్పది కదా! నీవు నాకు సోదరసమానుడవు. నేను నీతో కైలాసానికి వస్తాను” అని చెప్పి నందీశ్వరునితో కైలాసానికి వెళ్లాడానికి పార్వతీదేవి పంపిన రథాన్ని అధిరోహించాడు. కృత్తికలు విచార వదనంతో రోధించడం మొదలెట్టారు. అప్పుడు స్కందుడు వారిని ఓదార్చి జ్ఞానోపదేశం చేసాడు.

కైలాసంలో శివపార్వతులు, బ్రహ్మ విష్ణులు, దేవేంద్రుడితో సహా దేవతలందరూ స్కందునికి స్వాగతం పలికారు. పార్వతీదేవి బాలుని వళ్ళంతో నిమిరి ఆనందంతో పరవశించింది. శివుడు కుమారుని తన తొడపై కూర్చుండబెట్టుకొని వినోదించాడు. దేవతలు షణ్ముఖుని రత్నసింహాసనంపై కూర్చుండబెట్టి సర్వతీర్థజలాలతో అభిషేకించారు. ఆ మహాసభలతోనే శివుడు కుమారుణ్ణి పట్టాభిషిక్తుణ్ణి చేసాడు. ఒక త్రిశూలాన్ని, పినాకినిని, శక్త్యాయుధాన్ని, పాశుపతాన్ని, శాంభవి విద్యను ప్రసాదించాడు. విష్ణువు రత్నకిరీటాన్ని, వైజయంతి కంఠహారాన్ని బహూకరించాడు. బ్రహ్మ యజ్ఞోపవీతాన్ని, గాయత్రీమంత్రాన్ని, వేదాలను, కమండలాన్ని, బ్రహ్మాస్త్రాన్ని బహూకరించాడు. ఇంద్రుడు ఐరావతాన్ని, వజ్రాయుధాన్ని ఇచ్చాడు. దేవతలందరూ వారి వారి అస్త్రాలను బహూకరించారు. పార్వతి పరమైశ్వర్యాన్ని, లక్ష్మీదేవి దివ్య సంపదను, సరస్వతి జ్ఞానాన్ని సంతోషంగా ఇచ్చారు. దేవతలు కుమారస్వామిని మంగళ స్నానాలు చేయించి, రత్న సింహాసనంపై కూర్చుండబెట్టి, తిలకం దిద్ది సర్వసేనలకు ఆధిపత్యాన్ని ఇచ్చారు. షణ్ముఖుని నాయకత్వంలో దేవతలు కైలాసం నుండి తారకాసుర సంహారానికి బయలుదేరారు.

-6-

దేవతల రాక్షసుల ఉభయ సైన్యాలు భూమి సముద్రాల సంగమ స్థానం వద్దకు వచ్చి చేరారు. వారి అరుపులకు సముద్ర ఘోష కూడా వినబడుట లేదు. కార్తికేయుడు విమానాన్ని అధిరోహించి యుద్ధం ప్రారంభించాడు. కొద్ది సేపటికి రణరంగమంతా రక్తపుటేరులతో నిండింది. తెగిన తలలు, విరిగిన బాహువులు కాళ్ళతో భూమి మహాభీభత్సంగా ఉంది. తారకాసురుని ఇంద్రుడు ఎదుర్కొన్నాడు. బ్రహ్మ వరంతో గర్వితుడైన తారకాసురుడు కొండచిలువ వంటి చేతులతో గదను పట్టి ఇంద్రుని తలపై మొత్తబోగా అది గురితప్ప ఐరావత కుంభస్థలాన్ని తాకింది. దానితో ఐరావతం కుప్ప కూలిపోయింది. అమరులందరూ అసురుల చేతిలో పరాజితులైన వీరభద్రుని వెనుకకు జేరారు. వీరభద్రుడు ప్రమథులతో కూడి త్రిశూలాన్ని చేత పట్టి తారకుని ఎదుర్కున్నాడు. వీరభద్రుని త్రిశూలం తాకి తారకుడు మూర్ఛిల్లి క్షణకాలంలో మరల తేరుకున్నాడు. వారి మధ్య భీకర పోరాటం సాగింది. అప్పుడు వాసుదేవుడు వచ్చి వీరభద్రునికి బాసటగా నిలిచాడు. పాంచజన్యం పూరించి వాసుదేవుడు నాలుగు చేతులతో ఆయుధాలను ధరించి కారకునితో పోరాడాడు. తారకుడు వర గర్వంతో పద్మనాభుని ప్రయోగాలన్నీ తిప్పికొట్టాడు. గెలుపు ఎవరికీ లభించడంతో లేదు.

సమయం మించి పోతుందని తెలిసిన బ్రహ్మ కుమార స్వామిని సమీపించి “కుమారా! ఈ దుష్టుడు నీ చేతిలో తప్ప ఇంకెవరు చేతిలోను చావడు. అదే నీ జన్మ కారణం. కాబట్టి వెంటనే వాడిని ఓడించి వధించు” అని చెప్పాడు. బ్రహ్మ మాటలకు ప్రసన్నుడై కుమారస్వామి విమానాన్ని దిగాడు. తారకుడు కూడా కుమారుని చూసి ఆయుధంతో ఆవేశంగా వచ్చాడు. ఇంద్రుని, విష్ణువును దూషించి తన పూర్వ పుణ్యాన్ని పోగొట్టుకున్నాడు. అలా నిందిస్తున్న తారకుని చూసి కోపంతో స్కంధుడు వానిని వజ్రాయుధంతో బలంగా కొట్టాడు. ఆ దెబ్బకు నేలకూలి క్షణకాలంలో తేరుకొని యుద్ధం మొదలు పెట్టాడు. స్కందుడు తారకుని సంహరించడానికి నిర్ణయించుకొని రకరకాల యుద్ధరీతులు ప్రదర్శించాడు. శక్తి ఆయుధంతో వాని శిరస్సు, కంఠం, తొడలు, మోకాళ్ళు, నడుము, వక్షస్థలం లాంటి శరీర భాగాలను గురిచూసి కొట్టాడు. తరువాత వారిద్దరూ బాహుయుద్ధం చేశారు. సకల దేవతాసమూహం వారిద్దరి యుద్ధక్రీడను ఆశ్చర్యంతో రెప్ప వాల్చకుండా చూసారు. చివరకు షణ్ముఖుడు శక్త్యాయుధాన్ని మహావేగంతో ప్రయోగించి ఆ అసురుని మట్టుపెట్టాడు. తారకుని ప్రాణాలు గాలిలో కలిసిపోయాయి.

ఈ విధంగా కుమారస్వామి తారకుని వధించడంతో దేవతల కష్టాలు తీరాయి. అందరూ జయజయ ధ్వానాలు చేసారు. తరువాత స్కంధుడు బాణాసురుని సంహరించి క్రౌంచుడు అనే పర్వతరాజును, ప్రలంభాసురుని సంహరించి కుముదుడు అనే రాజును రక్షించాడు. కుమారస్వామి తన తండ్రి ఆనందం కోసం ఆ ప్రదేశంలో ప్రతిజ్ఞ్నేశ్వర, కపాలేశ్వర, కుమారేశ్వర నామాలతో మూడు లింగాలను స్థాపించాడు. జయస్థంభ సమీపంలో స్థంభేశ్వర లింగాన్ని కూడా స్థాపించాడు. విష్ణుమూర్తి, ఇతర దేవగణాలు కూడా శివ లింగాలను స్థాపించారు.

ఈ కుమార విజయగాథ పరమ పవిత్రమైనది. ఇది సర్వ పాపహరము, సకల తాపహరము మరియు భక్తి ముక్తి ప్రదాయకము.

*శుభం*

మరిన్ని కథలు

Filter coffee
ఫిల్టర్ కాఫీ
- ఇందు చంద్రన్
Kshama lo dharitri
క్షమలో ధరిత్రి.
- Aduri.HYmavathisrinivasarao,
Marmam
మర్మం
- రాము కోలా దెందుకూరు
Korthi
కొర్తి
- బివిడి ప్రసాద రావు
Atrhata
అర్హత
- డి.కె.చదువుల బాబు
Antataa neeve
అంతటా నీవే
- షామీరు జానకీ దేవి
Ahakaram techhina sapam
అహంకారం తెచ్చిన శాపం
- గొట్టాపు శ్రీనివాస రావు