నేనో పార్టీ పెడుతున్నాను - జీడిగుంట నరసింహ మూర్తి

Neno party pedutunnanu

" సూర్యా రావు గారు . మీతో పని పడింది. అలా కాసేపు హోటల్లో కూర్చుని టీ తాగుతూ మాట్లాడుకుందాం. మీరు ఫ్రీయే కదా ?" అడిగాడు వెంకటరావు సూర్యా రావు భుజమ్మీద చనువుగా చెయ్యి వేస్తూ.

"భలే వారండీ. ప్రత్యేకంగా అలా అడుగుతారే ? ఫ్రీగా ఉన్నా లేకపోయినా మీ కోసం ఒక ఐదు నిమిషాలు కేటాయించలేనా ? . చెప్పండి పర్వాలేదు . అయితే ఒక విషయం. నేను మాట సాయం అయితే చేయగలను. డబ్బు సర్ధడం లాంటి విషయాలలో మాత్రం పూర్తిగా అశక్తుడిని " అన్నాడు నవ్వుతూ సూర్యా రావు.

"అబ్బే. అటువంటి అవసరం నాకు ప్రస్తుతం లేదు లెండి. రెండు మూడు రోజుల క్రితం నేను మీకు ఒక విషయం చెప్పాను గుర్తుందా ? అదేనండీ. నేనో రాజకీయ పార్టీని పెట్టాలనే ఆలోచనలో ఉన్నానని చూచాయిగా అన్నాను కదా. అది ఇప్పుడు కార్యరూపం దాల్చబోతోంది. నాకు తెలిసిన ప్రముఖ నాయకులతో చర్చలు జరిగాయి. అయితే ఇప్పుడు మీతో ఎందుకు ఈ ప్రస్తావన తీసుకువస్తున్నాను అంటే మీరు నాకు ఈ విషయంలో అండగా ఉంటే పార్టీ అధికారంలోకి రాగానే అందులో మీకు ప్రముఖ స్థానం కలిపించడానికి సిద్దంగా ఉన్నాను. ఇక మీకు ఈ చిన్న చిన్న ఉద్యోగాలు, ఈ గాడిద చాకిరీలు చెయ్యాల్సిన ఖర్మ ఏమీ పట్టలేదు. . జీవితాంతం గుండె మీద చెయ్యి వేసుకుని హాయిగా బ్రతికేయొచ్చు . పైగా మీరు బాగా చదువుకున్నారు. మీ తెలివి తేటలు మన పార్టీకి బాగా ఉపయోగపడతాయి అని నా నమ్మకం. ఈ విషయంలో మీరు నాకు మీ సమయం ప్రత్యేకంగా కేటాయించాలి . అదే విషయం మీతో చెప్పాలనే నా ప్రయత్నం " అన్నాడు వెంకటరావు సూర్యారావుకు ఏవేవో ఆశలు కలిపిస్తూ. . .

"ఆ విషయం నాకొదిలేయ్యండి వెంకటరావు గారు. అంతకన్నా ముందు మనం పార్టీ పేరు రిజిస్టర్ చేసుకోవాలి. అందుకు ఎన్నికల కమీషనర్ ఒప్పుకోవాలి. ఆ తర్వాత పార్టీని నడపడానికి ఫండ్స్ సేకరించాలి. వివిధ ప్రాంతాలలో సభలు నిర్వహించాలి. అందుకోసం జనసమీకరణ చెయ్యాలి. ఆఫీసులు మానేసి విపరీతంగా ప్రచారం మొదలుపెట్టాలి. పార్టీని ఎస్టాబ్లిష్ చెయ్యడానికి ఎందరినో పట్టుకోవాలి. ఎంతో డబ్బు గుప్పించాలి. మరెందరినో ఒప్పించాలి. ఇవన్నీమన వల్ల అవుతుందంటారా ?" తన అనుమానాలు స్పష్టంగా వెంకటరావు మెదడు మీద రుద్దేశాడు సూర్య రావు .

"అవి ఎంతసేపయ్యా బాబూ. నా బ్యాక్గ్రౌండ్ తెలిస్తే మీరు అలా మాట్లాడరు. . రేపే మనం కలక్టర్ దగ్గరికి వెళ్తున్నాం. ఆయనతో మనం పెట్టబోయే పార్టీ విధివిధానాలు కూలంకషంగా చర్చించబోతున్నాం. కలక్టర్ గారి దగ్గరకు వెళ్ళేటప్పుడు లింగులిటుకు మని మనమిద్దరమూ వెళ్తే చాలదు. మనతో పాటు కొంతమందిని తీసుకెళ్లాలి.మీ డిపార్ట్మెంట్లో మీకింద పది మంది పనిచేస్తున్నారు కదా. రేపు ఆదివారం. వాళ్ళల్లో సగం మందినైనా మనతో వచ్చే ఏర్పాటు చేయండి. కలక్టర్ గారితో చర్చలు ముగిసిన తర్వాత మనం ఒక పత్రికా సమావేశం పెట్టాల్సి వుంటుంది. ఆ విషయం నేను ఆలోచిస్తాను . రేపటికల్లా కలక్టర్ గారితో చర్చించాల్సిన అజెండా తయారు చేసి ఉంచండి. అలాగే మీ డిపార్ట్మెంట్ వాళ్ళను కూడా. ఈ విషయంలో నేను ఎక్కువగా మిమ్మల్నే నమ్ముకున్నాను. నా ప్రయత్నం వృధా కాదని నా నమ్మకం. ఇక ఇంటికివెళ్ళి రెస్ట్ తీసుకోండి. రేపు ఆరు గంటల కల్లా మీరు నన్నోసారి కలవాలి " అంటూ భావోద్రేకంగా మాట్లాడేశాడు వెంకటరావు. .

" అంతా బాగానే ఉంది సార్. మీరు ఎటువంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా ఇటువంటి ప్రయత్నాలు తలపెట్టరు అని నేననుకుంటున్నాను. ఆల్ ది బెస్ట్ సార్ " అన్నాడు సూర్యా రావు చెయ్యి కలుపుతూ .

"ఆగండి ఆగండి. ఈ కాలనీలో మనకు మంచి రూమ్ ఒకటి దొరుకుతుందేమో చూడండి. మన పార్టీ వ్యవహారాలు చర్చించుకోవడానికి ఒక వేదిక అంటూ ఉండాలి కదా. లేదంటే మీలో ఎవరైనా మీ ఇళ్ళల్లో అవి నిర్వహించుకోవడానికి అవకాశం ఉంటే సరే. మీ రుణం నేను ఉంచుకోను. " అన్నాడు వెంకట్రావు హోటల్లో కూర్చుని సిగరెట్టు పొగ పైకి వదులుతూ. .

"సార్. అందరమూ ఇరుకు ఇళ్ళల్లో ఉంటున్నాం. పైగా వచ్చే పోయే వాళ్ళతో ఇంట్లో వాళ్ళకు కూడా ఇబ్బందిగా ఉంటుంది. ఇదిగో. ఈ హోటల్ మీద ఒక పెద్ద రూమ్ ఉన్నట్టు బోర్డు చూశాను. ఈ రూమైతే మనకందరికీ అనువైన ప్రదేశం. కింద హోటల్ కూడా ఉంది కాబట్టి మధ్య మధ్యలో కాఫీలు, టీలు, స్నాక్స్ తెప్పించుకోవడానికి ఈజీగా ఉంటుంది. మీరు 'యెస్' అంటే ఇప్పుడే మాట్లాడతాను. అయితే అడ్వాన్స్ ఎంత అడుగుతారో ఏమిటో ?" అన్నాడు సూర్యా రావు అనుమానాన్ని వెలిబుచ్చుతూ.

" భలేవాళ్ళు . అసలు ఈ రూమ్ పూర్తిగా తాత్కాలికం. తర్వాత పార్టీ ఆఫీసు పెట్టాలి అంటే కనీసం రెండు మూడు రూములున్న పోర్షన్ తీసుకోవాలి. ఏం పర్వాలేదు. ఫండ్స్ నేను సేకరిస్తాను. . ముందు మీరు ఈ హోటల్ వాడితో మాట్లాడండి . మంచి ఘడియ , రోజు చూసి అడ్వాన్స్ వాళ్ళ చేతుల్లో పెడతాం ... " అంటూ కాళ్ళ కింద నిప్పులు పోసేశాడు వెంకటరావు. .

వెంకటరావు ఒక ఎనిమిది నెలల క్రితం ఆ ప్రముఖ సంస్థలో అసిస్టెంట్ మేనేజర్ గా చేరాడు. ఆంగ్ల భాషలో విపరీతమైన ప్రావీణ్యం ఉంది. ఎన్నో సంస్థలలో ఎంతో అనుభవం ఉన్నవాడిలా మాట్లాడుతూంటే అతను పనిచేస్తున్న డిపార్ట్మెంట్ లో వాళ్ళే కాకుండా , ఇతర డివిజన్ లో వాళ్ళు కూడా అతని చుట్టూ మూగి సలహాలు తీసుకుంటూ ఉండటం, గంటల తరబడి అతనితో వివిధ అంశాలపైన చర్చలు చేస్తూ ఉండటం ఆ కంపినీలో పర్సనల్ డిపార్ట్మెంట్ వాళ్ళనే కాకుండా టాప్ మేనేజ్మెంట్ ను కూడా ఆశ్చర్యంలో పడేసింది. ముఖ్యంగా ఆ రోజు అతను ఎవరికో ఫోన్ చూస్తూంటే చాలా మంది విననే విన్నారు.

"అవును సార్ . ఈ విషయంలో మీ సహాయ సహకారాలు ఉంటే నేను ఖచ్చితంగా నెగ్గుకు రాగలను. నేను గతంలో మీకు అండగా నిలబడి అహర్నిశలూ మీ వెనకే ఉండి పార్టీని బలోపేతం చేసి పార్టీని అధికారంలోకి రావడానికి, అందులో మీకు మంచి స్థానం దొరకడానికి ఒక ముఖ్య వ్యక్తిగా పనిచేశానని మీకు బాగా తెలుసు. ఇప్పుడు మీ అవసరం నాకు బాగా వుంది. . నేను కొత్తగా రాజకీయ పార్టీ పెట్టడానికి అన్ని ఏర్పాట్లు చేసుకున్నాను. ఒకసారి మీరు నేను ఉంటున్న ఊరికి వస్తే అన్ని విషయాలు ముఖాముఖీ మాట్లాడుకుందాం. ప్రస్తుతం నేను పని చేస్తున్న సంస్థలో ఎక్కువగా బిజీగా ఉండటంతో మిమ్మల్ని వ్యక్తిగతంగా కలుసుకోలేకపోతున్నాను. నేను రోజూ ఫోనులో మీతో టచ్లో ఉంటాను సార్ . ఏమీ అనుకోకండి " అని ఫోన్ పెట్టేయబోతూంటే " ఆగండి వెంకటరావు గారు . మీరు ఇంత ఇమేజ్ పెట్టుకుని ఆ చిన్న కంపినీలో నెల జీతానికి పనిచేయడం ఏమిటో నాకర్ధం కావడం లేదు . సరే. సరే. ప్రస్తుతం నేను వేరే పని మీద క్యాంపుకు వెళ్తున్నాను. మనం తర్వాత మాట్లాడుకుందాం " అంటూ అవతల వ్యక్తి ఫోన్ పెట్టేశాడు. .

వెంకటరావు ఫోన్ స్పీకర్ ఆన్ చేసి ఉండటంతో వినాల్సిన ముఖ్యమైన వాళ్ళందరూ విననే విన్నారు. ఆ మాటలు విన్న అక్కడున్న వాళ్ళందరికీ మూర్ఛ వచ్చినంత పనయ్యింది.

వెంకట్రావు పని చేస్తున్న కంపినీతో సంబంధ బాంధవ్యాలు కలిగిన ఒక పారిశ్రామిక వేత్త అర్జెంట్గా తనకు తెలిసిన వ్యక్తికి ఉద్యోగం కావాలని, అనుకోని కారణాల వల్ల తన సంస్థలో అతనికి చోటు కలిపించలేకపోతున్నాని చెప్పడంతో ఎటువంటి అనుభవానికి సంబంధించిన ఆధారాలు సమర్పించకుండానే వెంకట్రావును ప్రస్తుత సంస్థలోకి తీసుకోవడం జరిగింది. అతని జీతం కూడా నెల జీతం కాకుండా సంవత్సరానికి ఒక పెద్ద మొత్తం ఇచ్చేలా అగ్రిమెంట్ అయ్యింది. అతనికి గెస్ట్ హౌస్ లో ప్రత్యేకంగా ఒక రూమ్ కూడా కేటాయించడం జరిగింది. చేరిన మొదటి రోజునుండి ఎన్నో విషయాలలో మేనేజ్మెంట్ కు విలువైన సలహాలు ఇవ్వడం, చాలా కాలంగా పెండింగ్ పడిఉన్న వివాదాస్పదమైన కోర్ట్ కేసులను చాకచక్యంగా పరిష్కారం చేయించడం లాంటి విషయాలలో వాళ్ళకు తలలో నాలుకలా ఉండి అతి తక్కువ కాలంలోనే అందరినీ ఆకర్షించాడు. మేనేజ్మెంట్ అతనికి బాగా విలువనిస్తూ ఉండటంతో మిగతా ఉద్యోగస్తులు కూడా వెంకటరావుతో చాలా గౌరవంగా ఉండేవాళ్లు.

గత కొన్నాళ్లుగా వెంకటరావు ఆఫీసుకు సూటూ బూటుతో దర్జాగా అడుగుపెడుతున్నాడు. అక్కడ సెక్యూరిటి వాళ్ళు కూడా అతనికి సెల్యూట్ చెయ్యడం , అక్కడికక్కడే అతను కోటు జేబులోంచి కొత్త కరెన్సీ నోట్లను తీసి వాళ్ళ చేతిలో పెట్టడం ఎంతోమంది కళ్ల పడి, కళ్ళప్పగించి చూస్తూంటే పర్సనల్ డిపార్ట్మెంట్లో కొత్తగా మిలటరీలో రిటైరయ్యి వచ్చి చేరిన నరసింహం అస్సలు జీర్ణించుకోలేక పోతున్నాడు. ఆ కంపినీలో పనిచేస్తున్న ఎంతోమంది పెద్ద ఆఫీసర్లతో పోల్చుకుంటే వెంకటరావుది చాలా చిన్న పోస్ట్ కింద లెక్క. ఏ మాత్రమూ నేపధ్యం లేకుండా కేవలం అవతలి వ్యక్తి బలవంతమ్మీద ఆ సంస్థలో ప్రవేశించిన వెంకట్రావును ప్రత్యేకంగా చూడవలసిన అవసరం ఎవరికీ లేదు. కానీ అతని ప్రవర్తన, అవతలి వారితో మాట్లాడుతున్న తీరు ,పోకడ అందరినీ మతి చెడగొడుతోంది.

అనుకున్నట్టుగానే వెంకట్రావు తన మిత్రగణంతో కలెక్టర్ ఆఫీసుకు బయలు దేరాడు. ముందుగానే అపాయింట్మెంట్ తీసుకోవడం వల్ల అతనికి కలెక్టర్ గారిని కలుసుకోవడం ఏమీ కష్టం అనిపించలేదు.

కలెక్టర్ గారు వెంకటరావు చెప్పిన విషయాలు అన్నీ విన్నాడు. "ఈ రోజుల్లో కొత్తగా పార్టీ పెట్టి నిలదొక్కుకోవడం చాలా కష్టం.అసలు మీకున్న గ్రౌండ్స్ ఏమిటి ?" అని అడుగుతూంటే వెంకటరావు తన ఫోన్ లోంచి ఒక నెంబర్ ఇచ్చి "సార్ ఈ నెంబర్ వ్యక్తితో మీరు దయ ఉంచి మాట్లాడితే నా గురించి అన్ని విషయాలు తెలుస్తాయి. "అన్నాడు.

కలెక్టర్ గారు వెంకటరావు ఇచ్చిన నెంబర్ కు ఫోన్ చేసి చూశాడు. "అవును. వెంకటరావు గారికి గతంలో చాలా రాజకీయ పార్టీలతో సంబంధం ఉంది.తను ప్రజలలో తిరిగి ఆయా పార్టీలను గెలిపించిన ఉదంతాలు ఉన్నాయి " అని చెప్పడంతో రెండు రోజుల్లో కలెక్టర్ కార్యాలయం నుండి సమాచారం వస్తుందని చెప్పి వెంకటరావును పంపించేశారు. వెంకటరావును అనుసరిస్తున్న వాళ్ళందరూ కలెక్టర్ నుండి ఏం సమాధానం వస్తుందోనని ఆతృతగా చూస్తున్నారు. .

** ** ** **

సూర్యా రావు ఇంటిముందు ఆటో ఆగింది. అందులోంచి నలభై ఏళ్ల స్త్రీ దిగింది. ఆమె పక్కన వెంకటరావు కూడా ఉన్నాడు. ఆ సమయంలో సూర్యారావు ఇంట్లోనే ఉండి టీవీలో న్యూస్ చూస్తున్నాడు. పక్కనే అతని భార్య భార్య రజని కూడా కూర్చుని అతన్ని ఏవో ప్రశ్నలు వేస్తోంది. .

"నమస్కారం అమ్మా. లోపలకు రావచ్చా ?" అని అడిగింది ఆ వచ్చిన స్త్రీ.

పక్కన వెంకటరావు ఉన్నాడు కాబట్టి ఆమె తప్పనిసరిగా అతని భార్య అయ్యి ఉంటుంది అని గ్రహించి నవ్వుతూ లోపలకు ఆహ్వానించాడు సూర్యారావు. . పరిచయాలు అయ్యాక మగవాళ్ళిద్దరూ ముందు గదిలో కూర్చుని కొత్తగా పెట్టబోయే రాజకీయ పార్టీ గురించి చర్చించుకుంటూ ఉంటే ఆ వచ్చినావిడ మధ్య గదిలో రజనీతో కూర్చుని "మీతో కొన్ని ముఖ్య విషయాలు మాట్లాడాలి. దయచేసి నాకు మీరు సహకరించాలి " అంది . అలా అంటూంటే ఆమె మొహంలో విపరీతమైన టెన్షన్ కనపడుతోంది.

రజని ఆశ్చర్యంగా ఆమె మొహంలోకి చూస్తోంది . ఆమె ఏమి చెప్పబోతోందో అని ఆతృతగా చూస్తోంది.

"అమ్మా. మీరు నాకో మాట ఇవ్వాలి. వెంకటరావు గారు నా భర్త.ఆయన చాలా కాలంగా సైకియాట్రిక్ డిజార్డర్ తో బాధపడుతున్నారు. చెయ్యడానికి ఒక ప్రభుత్వ శాఖలో మంచి ఉద్యోగం చేశారు.కొన్నాళ్లు రాజకీయ నాయకులతో తిరిగారు. కొన్ని సంవత్సరాల క్రితం చేస్తున్న ఉద్యోగంలో ఆయన మీద ఏదో నేరం మోపడం వల్ల మాకు ఎవరికీ కనపడకుండా ఐదు సంవత్సరాల పాటు అండర్ గ్రౌండ్ లోకి వెళ్ళి పోయి ఒక ఎనిమిది నెలల క్రితమే ఆశ్చర్యంగా ఇంటికి వచ్చారు. అప్పటివరకూ చేసిన ప్రభుత్వ ఉద్యోగం ఊడిపోయింది. జరిగిన సంఘటనల వల్ల మానసికంగా చాలా దెబ్బతిన్నాడు. చాలా సార్లు తనేం మాట్లాడుతున్నాడో , ఏం చేస్తున్నాడో తెలియని అయోమయ పరిస్తితిలోకి వెళ్లిపోయాడు. ఒక్కోసారి మళ్ళీ తెలివిగా మాట్లాడుతూ ఇంట్లో విషయాలు బాగానే పట్టించుకునే వాడు. ఇదంతా ఇలా ఉంటే ఒక పక్క పోలీసులు ఆయన కోసం నిఘా వేసి వెతుకుతున్నారు . మేమే వాళ్ళకు కనపడనియ్యకుండా జాగ్రత్త పడ్డాం. మా బంధువుల్లో బాగా ఇన్ఫ్లూయన్స్ ఉన్న ఒకాయన ఆయన్ని కేసుల్లోంచి బయట పడేసి ఈ వూళ్ళో తనకు తెలిసిన కంపినీలో ఉద్యోగం వేయించారు. నేను వేరే ఊళ్ళో ఇల్లు నడపడానికి నా అర్హతలకు తగిన ఉద్యోగం చేసుకుంటున్నాను. ఈయన ఇక్కడే ఈ వూళ్ళో గెస్ట్ హౌస్ లో ఉండి ఉద్యోగం కొనసాగిస్తున్నారు. అయితే ఈ మధ్య ఈయన గురించి నాకు ఒక భయంకరమైన నిజం తెలిసింది. తనో కొత్త రాజకీయ పార్టీ పెడుతున్నట్టు , అందుకు జనసమీకరణ చేస్తున్నట్టు ఎవరెవరితోనో ఫోన్లో మాట్లాడుతూ ఆఫీసులోనూ, బయట అలజడి సృష్టిస్తున్నారని కనపడిన వాళ్లందరి దగ్గరా అప్పులు చేసి జనాల్లో చులకన అయిపోతున్నారని మీరు వెంటనే వచ్చి ఆయన్ని అదుపులో పెట్టాలని ఫోనులు రావడంతో భయాంధోళనలతో భయపడి ఉదయాన్నే బయలుదేరి వచ్చాను. పరిస్తితి రోజురోజుకూ తీవ్రం అయిపోతోందని ఇక్కడ వాళ్ళు చెప్పడం, ఈయనకు ముఖ్యంగా మీ వారు పక్కనుండి చాలా ఎక్కువగా సహకరిస్తున్నారని తెలిసి ఇదంతా ఎటువంటి పరిస్తితులలోనూ నమ్మవద్దని ఆయన తీవ్రమైన మానసిక జబ్బుతో బాధపడుతున్నారని ఎవ్వరూ కూడా ఆయన వెంట ఉండొద్దని, సహకరించ వద్దని చెప్పడానికే నేను హుటాహుటిన బయలుదేరి వచ్చాను. నేను ఈ రోజే ఆయన్ని నాతో తీసుకుపోతున్నాను. నేను చెప్పిన విషయాలు మేము వెళ్లిపోయాక మీ వారితో పూర్తిగా మాట్లాడి మా ఆయన ఏవైనా ఈ వూళ్ళో అప్పులు చేసి ఉంటే అవన్నీ నేను తీర్చేస్తానని చెప్పానని ఆయనతో చెప్పండి. . ఇప్పటికే ఎంతోమంది ఆయన ప్రవర్తనతో విసిగెత్తి పోయి ఉంటారు. నేను వెంటనే ఆయన్ని కొన్నాళ్లు ఏదైనా మానసిక ఆసుపత్రిలో చేర్చి ఆయన ఆరోగ్యం కుదుటపడే పనిలో ఉంటాను. మీ అందరికీ ఆయన వల్ల కలిగిన ఇబ్బందికి నేను క్షమాపణ చెపుతున్నాను. ..." అంటూ వెంకటారావు భార్య బయటకు వెళ్ళి అతన్ని పెడరెక్కలు విరిచి అప్పటివరకూ అక్కడే ఆపి ఉంచిన ఆటోలో ఎక్కించుకుని తీసుకు పోతూ ఉంటే సూర్యా రావు ఈ హఠాత్ పరిణామానికి మ్రాన్పడి చూస్తూండి పోయాడు. ఆ తర్వాత భార్య ద్వారా అసలు విషయం విని అతనికి గుండాగినంత పనయ్యి అమ్మో ఎంత ప్రమాదం తప్పింది అని గుండె మీద చెయ్యి వేసుకున్నాడు. ఆ షాక్ నుండి మళ్ళీ కోలుకోవడానికి సూర్యా రావుకు చాలా సమయం పట్టింది. ******

సమాప్తం

మరిన్ని కథలు

Filter coffee
ఫిల్టర్ కాఫీ
- ఇందు చంద్రన్
Kshama lo dharitri
క్షమలో ధరిత్రి.
- Aduri.HYmavathisrinivasarao,
Marmam
మర్మం
- రాము కోలా దెందుకూరు
Korthi
కొర్తి
- బివిడి ప్రసాద రావు
Atrhata
అర్హత
- డి.కె.చదువుల బాబు
Antataa neeve
అంతటా నీవే
- షామీరు జానకీ దేవి
Ahakaram techhina sapam
అహంకారం తెచ్చిన శాపం
- గొట్టాపు శ్రీనివాస రావు