నిజాయతి   గెలిచింది - నారంశెట్టి ఉమామహేశ్వరరావు

Nijayitee gelichindi

కరాళ రాజ్యంలోని మారుమూల ప్రాంతంలో పాఠశాల నడుపుతున్నాడు సుబుద్ధి అనే గురువు. ఆ పాఠశాలలో ఎక్కువ మంది పేదపిల్లలే చదువుతున్నారు. ఆ ప్రాంతంలో పేదరికం , వెనుకబాటుతనం ఎక్కువ.

ఒకసారి ఆ పాఠశాల గురించి మంచిగా విన్నాడు సుబుద్ధికి విద్య నేర్పిన గురువు గౌతముడు. తన శిష్యుడు నడుపుతున్న పాఠశాలను సందర్శించాలన్న కోరిక గౌతముడికి కలిగింది. వెంటనే బయల్దేరి వెళ్ళాడు.

ఆ పాఠశాలలో వంద మంది పిల్లలు చదువుతున్నారు. పిల్లలంతా చక్కని క్రమశిక్షణతో మెలగడం చూసి వారి మీద ప్రేమ కలిగింది గౌతముడికి. వాళ్ళ మధ్యలో కూర్చుని చదువులో ఏకాగ్రత సాధించడం, విద్య వలన కలిగే ప్రయోజనాలు, విద్యాధికులకు దక్కే గౌరవం మొదలైన అంశాలను చక్కని కథలతో చెప్పి పిల్లల మనస్సులో చదువు ప్రాధాన్యతను పెంచాడు. పిల్లల ముఖాల్లో కనబడిన వెలుగు చూసి తన పర్యటన వృధా కాలేదనుకున్నాడు గౌతముడు.

అయితే ఆ విద్యార్థులతో గడుపుతున్న సమయంలో గౌతముడు ఒక విషయం గమనించాడు. అక్కడి విద్యార్థుల్లో పదిమంది కాళ్ళకి మాత్రమే చెప్పులున్నాయి. మిగతా పిల్లల కాళ్ళను చూసిన గౌతముడి మనసు చివుక్కుమంది. చెప్పులు లేకుండా పాఠశాలకు వచ్చే పిల్లల కాళ్ళకు రాళ్ళూ , ముళ్ళు బాధిస్తాయని ఆయనకు బాగా తెలుసు. చెప్పులు లేని పిల్లలకు సరిపడే చెప్పులను త్వరలోనే పంపించాలని నిర్ణయించుకున్నాడు గౌతముడు.

పదిహేను రోజుల తరువాత కొందరు శిష్యులు తోడురాగా తొంభయి మందికి అవసరమైన చెప్పులను తీసుకుని మరోసారి సుబుద్ధి నడుపుతున్న పాఠశాలకు వెళ్ళాడు గౌతముడు.

చెప్పుల మూటను పిల్లలకు దగ్గర్లో ఉంచి ఒక్కో జత తీసుకోమన్నాడు గౌతముడు. తమ గురువు వైపు ప్రశ్నార్థకంగా చూసారు పిల్లలంతా. ఫరవాలేదు తీసుకోమనట్టు సుబుద్ధి తలా ఊపడంతో పిల్లలంతా చెప్పుల జతల కోసం వెళ్లారు. పిల్లలందరూ చెప్పులు తీసుకున్నారు. కానీ ఆశ్చర్యమేమంటే ఇంకా పది మందికి చెప్పులు సరిపోలేదు.

‘తొంభై మంది విద్యార్థులకు తెచ్చిన చెప్పులు మరో పది మందికి సరిపోక పోవడమేమిటని’ ఆశ్చర్యపోయాడు గౌతముడు.

“ఈ మధ్య కొత్తగా పదిమంది విద్యార్థులు చేరారా?” అని అడిగాడు గౌతముడు. ‘అలాంటిదేమీ లేదని, అంతా పాతవిద్యార్థులేనని’ బదులిచ్చాడు సుబుద్ధి.

అయితే చెప్పులున్న పిల్లలే కొత్త చెప్పులకు మోజుపడి మరల తీసుకున్నారేమోనని అనుమానించాడు సుబుద్ధి.

పిల్లలకు బాల్యం నుండే నీతి, నిజాయతి నేర్పాలని నమ్మే సుబుద్ధి, పిల్లల తప్పును వాళ్లకు తెలిసేలా చేసేందుకు ప్రయత్నించాడు. చెప్పుల జత లేనివాళ్లే తీసుకోవాలని మిగతావారు తిరిగిచ్చేయాలని మరోసారి సూచించాడు.

సుబుద్ధి చెప్పిన తరువాత మరో తొమ్మిది జతల చెప్పులను వెనక్కి తిరిగిచ్చారు పిల్లలు. ఇంకా ఒక జత మాత్రం రాలేదు. గౌతముడి ముందు తన విద్యార్థులను చులకన చేయడం ఇష్టం లేని సుబుద్ధి “వీళ్లంతా అమాయకులు. వీళ్లకి మోసగించడం తెలీదు. ఎక్కడో పొరపాటు జరిగింది” అన్నాడు.

గౌతముడు కల్పించుకుని “సరస్వతీ దేవి విగ్రహం మీద ప్రమాణం చేసి నిజం చెప్పండి. చెప్పులున్నవాళ్ళు తిరిగిచ్చెయ్యాలి. లేదంటే చదువుల తల్లికి కోపం వస్తుంది” అని భయపెట్టాడు. అయినా ఫలితం లేకపోయింది.

“బాల్యం నుండే దేవుడంటే భయం లేని పిల్లలెవరో వీళ్ళలో ఉన్నారు. అందుకే భయపడడం లేదు. చిన్నప్ప్పుడే దేవుడి మీద , భక్తి , గౌరవం లేకపోతే ఎలాగని” శిష్యుడితో అన్నాడు గౌతముడు.

తప్పు చేసిన విద్యార్థిని పట్టుకోవాలన్న పంతం పెరిగింది ఆయనలో. ఈసారి పిల్లలతో మాట్లాడుతూ “మీలో ఒకరు మాత్రం చెప్పులుండీ మరో జతకి ఆశపడ్డారు. అలా తీసుకోవడం వలన అవసరమైన మరొకరికి చెప్పులు మిగల్లేదు. చెప్పులుండీ మరో జత తీసుకున్న విద్యార్థి ఎవరో తెలిస్తే వాళ్ళ పేరుని ధైర్యంగా నాతో చెప్పవచ్చు. అలా చెప్పినవారికి ఒక కలం బహుమతిగా ఇస్తాను” అని జేబులోని అందమైన కలాన్ని తీసి చూపాడు గౌతముడు.

ఆయనలా ప్రకటించగానే ఒక విద్యార్థి లేచి నిలబడ్డాడు. “ నా ప్రక్కన కూర్చున్న రాధకు చెప్పులున్నాయి. కానీ మరో జత ఇప్పుడు తీసుకుంది” అని చూపించాడు.

అందరి కళ్ళు రాధ వైపు తిరిగాయి.

సుబుద్ధికి రాధ మీద బాగా కోపం వచ్చింది. రాధని నిలుచోమని చెప్పాడు ఆయన. ‘మరో జత చెప్పులు ఎందుకు తీసుకున్నావని’ అడిగాడు . ఏమీ జవాబివ్వకుండా ఏడుపు మొదలు పెట్టింది రాధ.

సుబుద్ధి వెంటనే రాధ దగ్గరకు వెళ్లి అనునయిస్తూ “ నీవల్ల ఒక విద్యార్థికి చెప్పులు మిగల్లేదు. అలా చెయ్యడం తప్పు కదా. ఎందుకలా చేసావు’ అని అడిగాడు.

రాధ ఏడుస్తూనే “ నాకు నిజంగా చెప్పులు లేవు గురువుగారూ. నేను రోజూ వేసుకుని వస్తున్నవి మా అక్క చెప్పులు . నేను బడికి వస్తున్నప్పుడు రాయి గుచ్చుకుని పాదానికి గాయం అయింది . అప్పటి నుండి అక్క చెప్పులు వేసుకుంటున్నాను. అలా వేసుకుని వస్తున్నందుకు అక్క కోపంతో నన్ను కొట్టింది . మా నాన్నని చెప్పులు కొనమని అడిగితే డబ్బులు లేవని చెప్పాడు. అందుకే ఇంకా కొనలేదు. మీరు ఇందాక ప్రమాణం చేయమన్నప్పుడు కూడా నాకు నిజంగా చెప్పులు లేవు కాబట్టే ధైర్యంగా ప్రమాణం చేశాను. నాకు దేవుడంటే భయం , భక్తి ఉన్నాయి” అంది తన పాదాలకి అయిన గాయం చూపిస్తూ.

రాధ మాటలకు గౌతముడి గుండె కరిగిపోయింది. “ పిల్లలు దైవస్వరూపాలని తెలిసీ పంతంతో ప్రవర్తించాను. ఆ చెప్పులు నువ్వే ఉంచుకో. మరొక జత కాదు పది జతలు పంపిస్తాను. అవసరమైన వారికి ఇక ముందు ఇవ్వవచ్చు” అని మాట ఇచ్చాడు.

పిల్లల్లో నిజాయతీ చెక్కుచెదరలేదని తెలిసి సంతోషించడమే కాక రాజ్య పాలకుడైన సుద్యుమ్నుడికి చెప్పి సుబుద్ధి నడుపుతున్న పాఠశాలకు తగినన్ని సదుపాయాలను కల్పింపజేసాడు గౌతముడు . పిల్లల కష్టాలు తీరిపోవడంతో సుబుద్ధి శిక్షణలో ఉత్తమ విద్యార్థులుగా పిల్లలు తయారయ్యారు.
---***----

మరిన్ని కథలు

Prema falam
ప్రేమ ఫలం
- పి. రాజేంద్రప్రసాద్
Neethone nenunta
నీతోనే నేనుంటా
- కాశీవిశ్వనాధం పట్రాయుడు/kasi viswanadham patrayudu
Amlet damlet
ఆంమ్లేట్ - డాంమ్లేట్ .
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
REkkala kastam
రెక్కల కష్టం
- వరలక్ష్మి నున్న
ఓ breaking news
ఓ బ్రేకింగ్ న్యూస్
- బివిడి ప్రసాద రావు
chettu baadha
చెట్టు బాధ
- లక్ష్మీ కుమారి.సి