ముందే కూసిన కోయిల - శ్యామకుమార్ చాగల్

Munde koosina koyila

అది పేరున్నపెద్ద కాలేజీ. కోఎడ్యుకేషన్ అవటం తో కాలేజీ అంతటా రంగులతో కళకళ లాడుతూ వుంది.

కాంటీన్ అంతటా సందడిగా వుండి, టేబుల్స్ ఏవీ ఖాళీ లేకుండా కిటకిట లాడుతూ వుంది.

గౌరవ్, శౌర్య ,తేజ ,ముగ్గురు ప్రాణ స్నేహితులు వారికెదురుగా వారితో చాలా స్నేహంగా మసలుకునే రమ్య , అరుణ,స్వరూప కూడా కూర్చుని మిర్చీలు తింటూ మాట్లాడుకుంటున్నారు.వారికి గ్రూప్ సిక్స్ అని పేరు పడింది.

"కాలేజీ లో మనమే అన్నింటా ఫస్ట్ మార్క్ ". అన్నాడు గౌరవ్.

"అన్నింటా కాదు లే . ఇంగ్లీష్ లాంగ్వేజీ లో సాకేత్ మాత్రమే టాప్ ర్యాన్క్ . అతన్ని మీరు చేరుకోలేరు. "అంది అరుణ

"అవును బహుశా ఈ సంవత్సరం అన్నింటిలో అతడే టాప్ కు వెళ్లే ట్టుగా కనపడుతున్నాడు." అంది రమ్య.

" ఇంటర్నల్స్ లో వస్తే కాదు, పబ్లిక్ ఎగ్జామ్స్ లో రావాలి." చిరాకుగా అన్నాడు శౌర్య.

అప్పుడే సాకేత్, నీలిమ కలిసి నవ్వు కుంటూ క్యాంటీన్ లోకి అడుగు పెట్టారు. వాళ్లిద్దరూ ఈ లోకం తో పని లేనట్లుగా మాట్లాడుకుంటూ కూర్చున్నారు.

వారిని చూసి " అదుగో మీ మాటల్లోనే వచ్చాడు సాకేత్ " అని సాకేత్ వేపు కళ్ళతో సైగ చేసాడు గౌరవ్.

అందరూ అటు వేపు చూసారు.

"అది సరే కానీ వాడి ఫేసుకి అందమైన నీలిమ తో స్నేహం ఏంటీ ?" వెక్కిరింతగా అన్నాడు తేజ.

"నీకెందుకు కుళ్ళు , పైగా నువ్ ఆ అమ్మాయిని చూసి మొదట్లో లొట్టలేశావుగా ,నీకు ముందే చెప్పాను నీలిమ కు తన బావ తో ఎప్పుడో పెళ్లి కుదిరింది అని, కాబట్టి బ్రతికి పోయావు . ఆ అమ్మాయి ఎవరికీ చెప్పదు. కానీ నాకు చుట్టాలు కనుక తెల్సు. సాకేత్ అనవసరంగా ఫూల్ అవుతున్నాడు" అంది రమ్య.

" అవును నిజమే పాపం సాకేత్, పూర్ ఫెలో.. అయినా నీలిమ తో తిరిగే ముందు వాడి మొహం వాడు అద్దం లో చూసుకోవాలి కదా "అన్నాడు గౌరవ్.

" మీరందరూ కూడా నీలిమ ను చూసి ఆహా ఓహో అనుకున్నారు..నేను అసలు సంగతి చెప్పిన తర్వాత కదా మీరా అమ్మాయిని పట్టించోకోలేదు " అంది రమ్య నింపాదిగా, తేజ ను చిరాకుగా చూసి.

" అవును నిజమేననుకో, ఏదో జూనియర్ కదా, కాస్త సహాయం అవసరం ఉంటుందేమోనని కాస్త చూసాం ..అంతే "అన్నాడు తేజ భుజాలు తడుముకుంటూ, పేలవంగా నవ్వి..

తేజ సమర్థించుకోవటానికి పడుతున్న బాధలు చూసి అందరూ నోటికి చేతులు అడ్డం పెట్టుకుని నవ్వసాగారు.

రెండు సంవత్సరాలనుండీ కాలేజీ లో ఎక్కడ చూసినా నీలిమ ,సాకేత్ కలిసే కనిపించే వారు. అందమైన నీలిమ ను సాకేత్ పక్కన చూసినప్పుడల్లా అబ్బాయిలందరూ కుళ్ళుకునేవారు.

ఒక రోజు కాలేజీ స్పోర్ట్స్ స్టేడియం లో మెట్ల మీద కూర్చున్న గౌరవ్, దూరంగా , కుర్చీలలో కూర్చున్న నీలిమ, సాకేత ను చూసి " రమ్య, నువ్ చెప్పిన ట్లు కాకుండా ఆ నీలిమ తప్పనిసరిగా సాకేత్ నే చేసుకునేట్లుగా కనపడుతోంది." అన్నాడు రమ్య కు వాళ్ళిద్దరినీ చూపిస్తూ.

"అవును నాకూ అలాగే అనిపిస్తోంది " అన్నాడు శౌర్య.

"అనవసరంగా నీలిమ ను తప్పు పట్టాము. అయినా సాకేత్ మంచివాడు . అంతే కాదు తెలివైన వాడు. మంచి సెలక్షన్ నీలిమది." అంది స్వరూప.

ఆ రోజు తేజ , గౌరవ్ ఇద్దరూ కలిసి కాలేజీ మెట్లు ఎక్కుతుండగా నవ్వుతు సంతోషంగా ఎదురొచ్చి చేతులు కలిపాడు సాకేత్.

"హలో సాకేత్ ! పరీక్షలకు ప్రేపరేషన్ ఎలా నడుస్తోంది ?" అన్నాడు తేజ.

"ఓకే ..ఇంకో నెలలో పరీక్షలు మొదలవుతాయిగా "అన్నాడు. అతని మొహం లో ప్రపంచం లో వుండే ఆనందం అంతా కనపడుతోంది..

" నైస్...ఏదైనా గుడ్ న్యూస్ ఉంటే మాత్రం మాకు చెప్పు బాస్ "అన్నాడు గౌరవ్ చిలిపిగా నవ్వుతూ.

"అందులోని మర్మం తెలిసి మనస్ఫూర్తిగా నవ్వాడు సాకేత్."తప్పకుండ గౌరవ్..కానీ ఇంకా ఇప్పుడే కాదు. దానికి ఇంకా సమయం వుంది. "అన్నాడు.

అంతలోనే అక్కడకు వచ్చిన నీలిమ సాకేత్ ను చూసి " సాకేత్ వన్ మినిట్ "అంది దూరంగా నిలబడి.

"క్యారీ ఆన్ సాకేత్ " అంటూ అక్కడనుండి కదిలారు గౌరవ్, తేజ.

"కలుస్తాను "అని చెప్పి నీలిమ వేపు వడిగా అడుగులు వేసాడు సాకేత్. సాకేత్ తో కలిసి లైబ్రరీ వేపు వెళ్ళింది నీలిమ.

" ఏంటి సాకేత్ ఎటెళ్ళావు..గంటనుండీ వెదుకుతున్నాను." అంది నీలిమ సాకేత్ చేయి పట్టుకుని.

"రాగానే క్లాస్ లోకి వెళ్లాను..ఏమైంది నీలిమ "అన్నాడు. నీలిమ చేయి పట్టుకుని ఉన్నంత సేపూ అతని మనసు ఆకాశం లో తేలియాడుతూ వుంది.

సంతోషంగా చెప్ప సాగింది నీలిమ. అతనికేమీ వినపడటం లేదు.

చెప్పటం ఆపి, నవ్వుతూ లైబ్రరీ లోకి వెళ్లిపోయింది నీలిమ. ఆకాశం లోనుండీ దిగివచ్చిన అప్సరస ను మొదటి సారి చూస్తున్నట్లుగా చూస్తూ అచేతనంగా నిలబడి పోయాడు సాకేత్.

మరుసటి నెల పరీక్షలు అయిపోయాయి. అందరూ రకరకాల టూర్లకు వెళ్ళిపోయి, తిరిగి పరీక్ష ఫలితాలు వెలువడే ముందు రోజు మళ్ళీఇళ్లకు చేరుకున్నారు.

అనుకున్నట్లుగానే గౌరవ్, తేజ, శౌర్య , ముగ్గురికీ డిస్టింక్షన్ లో పాస్ అయినట్లుగా ఆ రోజు తెలియ గానే అందరూ కలిసి కాన్వొకేషన్ నాడు కాలేజీ కి వెళ్లారు. కాలేజీ అంతా విద్యార్థుల అరుపులతో కోలాహలంగా వుంది. ఒకరికొకరు కలుసుకుంటూ శుభా కాంక్షలు చెప్పుకుంటూ మనసారా కౌగిలింతలతో, కేరింతల తో పండగ వాతావరణం నెలకొంది.

అరుణ, రమ్య ,స్వరూప వచ్చి శౌర్య , తేజ , గౌరవ్ లను కలిశారు.

"మొత్తానికి మన అందరికీ మంచి రిజల్ట్స్ వచ్చాయి "అంది అరుణ తృప్తిగా అందరికీ చేతులు కలుపుతూ.

"కాలేజీ ఫస్ట్ ఎవరనేది తెలిసినప్పుడు ఇంకా హ్యాప్పీగా ఉంటుంది "అన్నాడు తేజ.

"అవును ..నీలిమ కనపడ లేదు "అన్నాడు శౌర్య

"పరీక్షలయ్యాక నీలిమ పెళ్లి అయిపోయిందిగా " అంది అరుణ.

" ఎవరితో ? సాకేత్ తోనేనా ? ?" ఆసక్తిగా,ఆతృతగా అడిగాడు గౌరవ్

" సాకేత్ తో ఎలా అవుతుంది. ముందే చెప్పాం గా ..తన బావ తోనే అని. తాను కూడా ఫస్ట్ క్లాస్ వచ్చింది. తెలివైంది కదా "అంది రమ్య. అది విన్న స్నేహితులందరూ విస్తు పోయారు

"అయ్యో మరి సాకేత్ ? పాపం ..వాడు కనిపించడం లేదే ఇక్కడ " అన్నాడు గౌరవ్చు, సాకేత్ కొరకు చుట్టూ వెదుకుతూ.

" బహుశా సాకేత్ కాలేజీ మొదటి ర్యాన్క్ వచ్చాడనుకుంటా "అన్నాడు శౌర్య

" లేదు ..సాకేత్ నెంబర్ లేదు. ఫెయిల్ అయ్యాడు "అంది అరుణ.

"ఫెయిలా !!! ఇంపాసిబుల్ .కాలేజీ లో మొదటి ర్యాన్క్ రావలసిన వాడు ..ఫెయిల్ కావటం ఏంటి !" అంటూ కొయ్యబారి పోయారు శౌర్య, గౌరవ్,తేజ.

"అవును ..ప్రేమా? మజాకా ?" అన్నారు అరుణ, రమ్య, స్వరూప ఒక్క స్వరంతో .

***అయిపోయింది.****

మరిన్ని కథలు

Prema falam
ప్రేమ ఫలం
- పి. రాజేంద్రప్రసాద్
Neethone nenunta
నీతోనే నేనుంటా
- కాశీవిశ్వనాధం పట్రాయుడు/kasi viswanadham patrayudu
Amlet damlet
ఆంమ్లేట్ - డాంమ్లేట్ .
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
REkkala kastam
రెక్కల కష్టం
- వరలక్ష్మి నున్న
ఓ breaking news
ఓ బ్రేకింగ్ న్యూస్
- బివిడి ప్రసాద రావు
chettu baadha
చెట్టు బాధ
- లక్ష్మీ కుమారి.సి