అవంతి రాజ్యాన్ని గుణశేఖరుడు పరిపాలిస్తుండేవాడు. అతనిమంత్రి పేరు సుబుద్ది. గుణశెఖరునికి ఉత్తమజాతి గుర్రాలు సేకరించి వాటిపైన స్వారిచేసే అలవాటు ఉండేది.
ఒకరోజు అరబ్బుదేశానికి చెందిన వ్యాపారి రెండు మేలుజాతి గుర్రాను గుణశేఖరునకు అమ్మాడు. వాటికి తగిన ధరచెల్లించి అశ్వశాలకు తరలించిన అనంతరం... "తమరి వద్ద ఇటువంటి మేలుజాతి గుర్రాలు ఎన్నిఉన్నా తీసుకురండి, వాటికి తగినధర చెల్లించి మేము కొనుగోలు చేస్తాము" అన్నాడు గుణశేఖరుడు .
అప్పుడు ఆగుర్రాల వ్యాపారి "ప్రభూ పలుదేశాలలో ఎన్నో ఉత్తమజాతి అశ్వాలు ఉన్నాయి. కాని నేను చిన్నవ్యాపారిని, తమరు దయ ఉంచి యాభైవేల వరహలు ముందుగా ఇప్పించగలిగితే నెలరోజుల వ్యవధిలో ఎన్నో ఉత్తమజాతి గుర్వాశీవౄనభీలను తమవద్ధకు తీసుకురాగలను " అన్నాడు.
"దానికేం అలానే ఇస్తాను, మంచి జాతి అశ్వాలను నెలలో తీసుకురండి" అని యాభైవేల వరహలు ఆ వ్యాపారికి ఇచ్చి పంపించాడు గుణశేఖరుడు.
అలా రెండు నెలల కాలం గడచింది. ఒకరోజు మంత్రి సుబుధ్ధితో సమావేశమైన రాజు గుణశేఖరుడు "మంత్రివర్య! నెలరోజుల్లో వస్తానన్న గుర్రాలవ్యాపారి రెండు నెలలైనా ఆ వ్యాపారి తిరిగి రాలేదు. అతను మనలను మోసగించాడంటావా? ఈవిషయం మనప్రజలకు తెలిస్తే మనలను అమాయకులుగా అనుకోరూ?" అన్నాడు.
"ప్రభు గతంలో తమరు అడిగిన మనరాజ్యంలోని అమాయకుల జాబితా" అని రాజుగారి చేతికి అందించాడు. జాబితా చూసిన గుణశేఖరుడు ఉలిక్కిపడుతూ "ఇదేమిటి మంత్రివర్య ఈ అమాయకుల జాబితాలో మెదటిగా నాపేరు ఉంది" అన్నాడు.
"అవును ప్రభూ ఒక్కసారి పరిచయం అయిన వ్యక్తికి అమాయకంగా మీరు నమ్మి యాభైవేల వరహలు ఇచ్చిపంపిన తమకు అది సముచితస్ధానమే" అన్నాడు మంత్రి సుబుధ్ధి.
"ఒకవేళ రేపటిరోజున ఆవ్యాపారి గుర్రాలతో వస్తే" కొపంగా అన్నాడు రాజు.
"కష్టపడకుండా ఆయాచితంగా యాభైవెలవరహలు వచ్చినా అవి వద్దని మీ వద్దకు గుర్రాలతో వ్యాపారి మమళ్ళి తమవద్దకు వచ్చాడంటే ... అంతకు మించిన అమాయకుడు మరొకరు ఉండరు. అప్పుడు ఉత్తమ అమాయకుల జాబితాలోనుండి తమరిపేరు తొలగించి అతని పేరు ప్రధమస్ధానంలో చేర్చుతాను ప్రభూ" అన్నాడు వెటకారంగా మంత్రి సుబుధ్ధి.
మంత్రి తెలివితేటలకు చిన్నగా నవ్వుకున్నాడు రాజు.