రొటేషన్ - జీడిగుంట నరసింహ మూర్తి

Rotation

"బ్రీఫ్ కేసులో రెండు జతల బట్టలు వేసుకో . ఇరవై సంవత్సరాల క్రితం మనం పనిచేసిన ఊళ్ళో మన పాత కొలీగ్ ప్రేమనాధ్ అనుకోకుండా చాలా కాలం తర్వాత నా కాంటాక్ట్ నెంబర్ దొరికి ఫోన్ చేశాడు. ఊరు కూడా ఇప్పుడు బాగా డెవలప్ అయ్యిందిట. ఎవరికి వారు చెట్టుకు, పుట్టకు అంటూ వెళ్ళి పోగానే అతను మాత్రం అదే వూళ్ళో భార్యతో సహా స్కూలు ప్రారంభించి ఇప్పుడు బాగా సెటిల్ అయ్యాడుట. అప్పటి కొలీగులు ఎవరెక్కడ ఉన్నా , ఆ వూరు వస్తే తను తన గెస్ట్ హౌస్ లో ఉంచి చుట్టుపక్కల వూళ్ళన్నీ సరదాగా చూసొద్దాం అన్నాడు. నువ్వు నేనూ ఇప్పుడు ఏ బాధ్యతలు లేకుండా ఖాళీగా ఉన్నాం కాబట్టి నీ తరపున కూడా నేను మాటిచ్చేశాను. ఇంకో ఇద్దరు ముగ్గురు నా కాంటాక్ట్ లో ఉన్న అప్పటి మన మిత్రులను కూడా ప్రయత్నిస్తున్నాను. అందరమూ కలిసి వచ్చే ఆదివారం బయలు దేరి వెళ్లాలని గట్టిగా అనుకుంటున్నాను. అదీ అసలు విషయం. అయితే మనం మగవాళ్లం మాత్రమే ఆ వూరు వెళ్లబోతున్నాం" అని మధుసూధన్ అనగానే చాలా ఎక్గైటింగ్ గా అనిపించింది రమణ మూర్తికి.

సన్యాసాడి పెళ్ళికి గడ్డంతో సహా ఎరువే అన్న సామెతగా ఎక్కడికైనా వెళ్ళాలి అంటే అన్నీ కొనుక్కోవాల్సిందే. రిటైరయ్యి ఇంట్లో కూర్చున్న వాడు ఇంట్లో పాత చొక్కా, ఒక లుంగీతో ఉన్నా రోజులు గడిచిపోతాయి. ఎటొచ్చీ ఏదైనా ఊరు వెళ్లాలన్నా, వేడుకలకు అటెండ్ అవ్వాలన్నా అన్నీ చూసుకోవాల్సిందే.

మంచి బట్టలు ఏమైనా ఉన్నాయా అని బీరువా తెరిచి చూశాడు రమణ మూర్తి. రెండు మూడు ఇస్త్రీ చేసిన షర్ట్లు, ప్యాంట్లు కనపడ్డాయి కానీ అవి మరీ పాతవిలా అనిపించాయి. బీరువాలోనే లోపల గుట్టలు గుట్టలుగా పడివున్న ఫ్యాంట్, షర్ట్ గుడ్డలు మూలుగుతున్నాయి. అవి కుట్టించు కోవడానికి ఎవరో అన్నట్టు ఈ రోజుల్లో ఆస్తులు కుదువబెట్టాల్సిందే. ఏ టైలర్ దగ్గరకు వెళ్ళినా జతకు ఎనిమిదొందలకు తక్కువ కుట్టు కూలి తీసుకోకుండా వదలడం లేదు. పోనీ రెడీ మేడ్ కొందామంటే అవి భుజాలు దిగిపోయి ఉండటమో, చంకల కింద, నడుము దగ్గర బిగుతుగా ఉండటమో అయ్యి కనీసం వాటిని లూజు చెయ్యడానికి కూడా వీల్లేనంత టైట్ గా ఉండటం అతని అనుభవంలో ఉంది.

"లేదు అలా ఎన్నాళ్లని వాటిని అలా అల్మారాలో పడేసి ఉంచడం ? డబ్బులైతే అయ్యాయి కానీ మనకు కావలసిన కొలతలతో కుట్టించుకుంటే కొన్నాళ్ళ పాటు వాటిని ఉపయోగించుకోవచ్చు . మందులకు వేలకు వేలు ఖర్చు పెట్టుకోవడం లేదా ? ఇదీ అంతే " అనుకుని గట్టిగా తీర్మానించుకుని తనకు బాగా తెలిసిన టైలరింగ్ షాపుకు వెళ్ళాడు రమణ మూర్తి.

" బాబూ ఈ రెండు ప్యాంట్లు, చొక్కాలు ఒక నాలుగు రోజులలో కుట్టి ఇవ్వాలి. అర్జెంట్గా ఒక పెళ్ళికి వెళ్లాల్సి వుంది. ఇవ్వగలవా మరి ?" అని అడిగాడు రమణ మూర్తి.

బట్టలు కుట్టడానికి ఇచ్చిన ప్రతి వాళ్ళు, ఫోటోలు తీయించుకోవడానికి వెళ్ళిన వాళ్ళు వాటితో అవసరం లేనప్పుడు ఎన్నాళ్ళైనా ఉండగలరు కానీ ఒకసారి ఆ పనుల మీద షాపులకు వెళ్ళాక "మాకు అర్జెంట్ గా కావాలి. ఊరు వెళ్తున్నామ్ " అంటూ అబద్దమాడని వాళ్లంటూ ఉండరు. రమణ మూర్తి కూడా అటువంటి బాపతే అని ఆ టైలర్ మనసులో అనుకుని అలాగే ఇస్తాను అంటూ తెచ్చిన గుడ్డలు సరిపోతాయా లేదా అని అని కొలవ సాగాడు.

" ఏమిటి సార్ ? ఎక్కడ కొన్నారు ఈ గుడ్డలు ? ఇది ప్యాంటుకు తక్కువ , లాగూకు ఎక్కువ లా ఉంది. ఇక షర్ట్లు అయితే మీకు ఫుల్ హ్యాండ్ కావాలంటున్నారు. దీనితో కనీసం చిన్న పిల్లలకు కూడా కుట్టడానికి సరిపోదు . పైగా ఈ షర్ట్ పీసులు చాలా పాతవిలా ఉన్నాయి. లోపల పెద్ద పెద్ద తుప్పు పట్టిన మరకలు . కుట్టిచ్చినా మీరు మాత్రం ఎలా వేసుకుంటారు ? వేరే గుడ్డలు ఉంటే తీసుకురండి " అని పక్కన పడేశాడు.

రమణ మూర్తి లోపల రక్తం మరిగిపోయినట్టయ్యింది. అంటే అల్మారాలో ఉన్న బట్టలన్నీ ఈ బాపతే అయ్యుండాలి. ఎవరింటికెళ్లినా రొటేషన్ లో వచ్చిన పాత బట్టలు ఏదో రకంగా వదిలించుకోవడానికి ప్రయత్నం చేసి అవి ఇస్తూ కాళ్ళకు దణ్ణం కూడా పెట్టించుకుంటారు. తీసుకున్న వాళ్ళు ఇంకొక్కళ్ళు ఇస్తారు. అంతటితో ఆగుతుందా వాళ్ళు మరొకళ్ళకు ఇస్తారు. ఇవన్నీ పది మంది చేతులు మారుతాయి. చివరకు ఎవరో ఒకరి చేతిలో అలుగు గుడ్డలు అయిపోక మానవు. . ఇక ఆడవాళ్ళకు ఇచ్చే జాకెట్టు గుడ్డలు, చీరలూ అంతే . పని మనుషులు కూడా తీసుకోకుండా పక్కన పడేస్తున్నారు. ఇలా గొప్పకొద్దీ ఇవ్వడం మానేసి ఏ పిల్లల చేతిలోనో ఒక అయిదొందలు పెట్టినా అవతల వాళ్ళు సంతోషిస్తారు. పోనీ మగవాళ్ళకు ఒక లుంగీ పంచ, ఆడవాళ్ళకు వంటింట్లో పనికి వచ్చే ఏదో వస్తువు ఇవ్వచ్చు కదా. అమ్మో అవి అంటే మళ్ళీ డబ్బు పెట్టి కొనాలి. ఇవన్నీ ఎవరో అప్పనంగా ఇచ్చినవి. ఏదో రకంగా ఎప్పటికైనా వదిలించుకోవాలని ప్రతి ఇంట్లోనూ ఒకటే తాపత్రయ పడిపోయి ఇచ్చినట్టు క్రెడిట్ కొట్టేయ్యాలని చూస్తూ ఉంటారు. లేని వాళ్ళు పోనీ ఆ పని చేశారు అంటే బాగా డబ్బు ఉండీ కోట్ల రూపాయల ఖరీదైన భవంతుల్లో ఉండే వాళ్ళు కూడా ఇలాంటి విషయంలో పీనాసి తనాన్ని ప్రదర్శిస్తూ ఉంటారు." మా ఇంటికొచ్చిన వాళ్ళను సగర్వంగా గౌరవించుకోవడం మా సంప్రదాయం" అంటూ రొటేషన్ సరుకును అంటగట్టే వాళ్ళు ఎంతోమంది ఉంటారు. ఇటువంటి సంఘటన్లు రమణ మూర్తి తన కళ్ళారా ఎన్నో ఇళ్లళ్లలో చూసేశాడు.

ఒక రోజు అతను తన భార్యతో బాగా దగ్గర వాళ్ళ ఇంట్లో ఫంక్షన్ కు వెళ్ళాడు. వాళ్ళు తిరిగి వెళ్ళి పోతూ ఉంటే "ఇదిగో మణీ. మేమంటే ఈ వూళ్ళో అందరికీ ఇష్టమే. ఎవరింటికి వెళ్ళినా బట్టలు పెట్టకుండా పంపరు. ఆ అల్మారా నిండా ఎన్నో కొత్త చీరలు మూలుగుతున్నాయి . ఆ సిల్క్ చీరలు నేను అసలు కట్టుకోను. నీకు కావాలంటే చెప్పు మొత్తం అన్నీ మూటగట్టి ఇస్తాను . నువ్వు వద్దంటే మా పని మనిషికి ఇచ్చేస్తాను. " అని అతని భార్యతో అంటూంటే రమణ మూర్తి పైకి కోపం ప్రదర్శించకుండానే మనసులోనే అణుచుకుంటూ " పోనీ మీ పని మనిషికే ఇచ్చేయ్యరాదూ ? పాపం వాళ్ళు కష్టపడి ఇళ్ళల్లో పని చేసుకుంటూ ఉంటారు . వాళ్ళు అయితే ఏవిచ్చినా సంతోషంగా తీసుకుంటారు. ఇంకా ఎక్కువ కాలం బీరువాలలో ఉంచుకోకండి. చెదలు పట్టిపోతాయి " అన్నాడు ఎటో చూస్తూ. ఆ క్షణంలో ఆ చుట్టాలావిడ మొహం నల్లగా తారు డబ్బాలా మారిపోవడం రమణ మూర్తి దంపతులు స్వయానా చూశారు.

ఉసూరుమని టైలర్ దగ్గరకు తీసుకెళ్లిన బట్టల మూటను మోసుకుంటూ ఇంటికి వచ్చాడు రమణ మూర్తి.

" ఇదిగో మణీ. రేపు నువ్వో పని చేయ్యాలోయ్. ఆ అల్మారాలో ఉన్న మనకు ఎవరెవరో ఇచ్చిన రొటేషన్ బట్టలన్నీ బయటకు తీసి తలగడాలకు ,పరుపులకు కవర్లు, , కిటికీలకు కర్టెయిన్లు కుట్టించెయ్యి. ఇంకా మిగిలితే వేడి గిన్నెలు దించుకోవడానికి, చేతులు తుడుచుకోవడానికి ఉపయోగించుకో. షర్ట్ గుడ్డలు కట్ చేస్తే జేబు రుమాళ్ల కింద పనికి వస్తాయి. అవి చొక్కాలు కుట్టించుకోవడానికి ఎందుకూ పనికి రావు. కిలోలు కొద్దీ బజారులో దొరికే జాకెట్టు గుడ్డలు నీకు పెట్టిన వాటితో నీ చీరలు ఫాల్స్ కుట్టుకో. ఏ బట్టలూ పొరపాటున కూడా ఇంటికొచ్చిన అతిధులకు పెట్టి అందరూ చేసే తప్పులూ మనం చేసి అవతల వాళ్ళ ఉసురు పోసుకోవద్దు. " అంటూ ఆ రోజు టైలర్ దగ్గర తనకు జరిగిన అవమానం గురించి చెప్పి అప్పటివరకూ ఆ బట్టలను ఇంటికొచ్చిన వారికి అంటగట్టాలని వాటిని కదపకుండా ఉంచిన తన భార్య మనసులోని ఆలోచనలకు కళ్ళెం వేశాడు రమణ మూర్తి.

ఆ రోజు మధుసూధన్ నుండి ఫోన్ వచ్చింది.

"నేనేనయ్య మధుసూధన్ని మాట్లాడుతున్నాను. మొన్న నేను చెప్పాను కదా ఒక రెండు మూడు రోజులు కర్నూలు ప్రోగ్రామ్ వేసుకుంటున్నాం అక్కడ ఉన్న మన ఫ్రెండ్ రమ్మన్నాడని . అనుకోకుండా ఆ ప్రోగ్రామ్ కాన్సిల్ అయ్యింది. అతని దగ్గర చుట్టాలు ఎవరో పోయారుట. మళ్ళీ చెప్పాక అప్పుడు ఈ ప్రోగ్రామ్ గురించి ఆలోచిద్దాం. నిన్ను నిరాశ పరిచినందుకు ఏమీ అనుకోకు " అంటున్నాడు మధుసూధన్.

దానితో రమణ మూర్తి నెత్తిమీద పాలు పోసి నట్టయ్యింది. హమ్మయ్య. ఈ బట్టలు కుట్టించువోవడం ఒక కొలిక్కి రాలేదు. పైగా తను మానసికంగా ఎందుకో రెండు రోజులనుండి ఈ ప్రోగ్రామ్ అంటే అంత ఆసక్తి చూపించలేక పోతున్నాడు కూడాను.

. ** ** **

రమణ మూర్తి ఇప్పుడు చాలా రిలాక్సెడ్ గా తను స్వయంగా కొనుక్కున లుంగీ , బనీను ధరించి పేపర్ చదువుకుంటూ హాయిగా రోజులు గడిపేస్తున్నాడు ******

సమాప్తం

మరిన్ని కథలు

Prema falam
ప్రేమ ఫలం
- పి. రాజేంద్రప్రసాద్
Neethone nenunta
నీతోనే నేనుంటా
- కాశీవిశ్వనాధం పట్రాయుడు/kasi viswanadham patrayudu
Amlet damlet
ఆంమ్లేట్ - డాంమ్లేట్ .
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
REkkala kastam
రెక్కల కష్టం
- వరలక్ష్మి నున్న
ఓ breaking news
ఓ బ్రేకింగ్ న్యూస్
- బివిడి ప్రసాద రావు
chettu baadha
చెట్టు బాధ
- లక్ష్మీ కుమారి.సి