జలంధరుడు (పురాణ గాథలు-4) - కందుల నాగేశ్వరరావు

Jalandharudu

జలంధరుడు

(పురాణ గాథలు-4)

ఒకప్పుడు స్వర్గాధిపతి ఇంద్రుడు దేవతల గురువైన బృహస్పతితో కలిసి, శంకరుని దర్శించడం కొరకు కైలాసానికి బయలుదేరారు. ఈ విషయం గ్రహించిన పరమేశ్వరుడు వారిని పరీక్షిద్దామనుకొన్నాడు. ఒక దిగంబర సన్యాసి వేషంలో దారిలో వారికి అడ్డు నిలిచాడు. దేవేంద్రుడు ఆ దిగంబర సన్యాసిని చిన్న చూపు చూస్తూ “మేము శంకర దర్శనానికి కైలాసానికి వెళ్తున్నాము. శంకరుడు కైలాసంలోనే ఉన్నాడా? తెలిస్తే చెప్పు, లేదా మా దారికి అడ్డు తొలగు” అని పరుషంగా చెప్పాడు. ఆ సన్యాసి ఎన్ని సార్లు అడిగినా సమాధానం ఈయలేదు. కోపగించిన ఇంద్రుడు తన వజ్రాయుధంతో వానిని శిక్షింపబోయాడు. అప్పుడు సన్యాసి రూపంలో ఉన్న సదాశివుడు కోపంతో ఇంద్రుని వైపు చూసాడు. స్వర్గాధిపతి ఎత్తిన చేయి గాలిలో అలా చలనం లేకుండా ఉండిపోయింది. బృహస్పతి తన తెలివితేటలతో దిగంబర సన్యాసిని ఈశ్వరుడిగా గుర్తించాడు. చేతులు జోడించి భక్తితో స్తుతించాడు.

“ఓ మహాదేవా! ఈ దేవేంద్రుడు అజ్ఞానంతో చేసిన కార్యాన్ని క్షమించు. నీ మూడవ కంటిలో పుట్టిన కోపాగ్నిని దయతో ఉపసంహరించుకో” అని ప్రార్థించాడు. దేవేంద్రుడు శివుని పాదాలపై పడి శరణు కోరాడు.

“బృహస్పతీ! నీ స్తుతికి నేను సంతోషించాను. నీ కోరిక ప్రకారం ఈ ఇంద్రుని క్షమించి ప్రాణాలతో విడిచిపెడుతున్నాను. ఇంద్రుని ప్రాణాలు రక్షించావు కాబట్టి ఇప్పటి నుండి నీకు ‘జీవుడు’ అనే మరొక నామం ప్రసిద్ధి కెక్కుతుంది. నా ఫాలాగ్నిని ఇంద్రుడికి పీడ కలుగని విధంగా వేరొక చోట వదిలిపెడతాను” అని శంకరుడు కరుణతో పలికాడు. తన ఫాలనేత్రం నుండి పుట్టిన కోపాగ్నిని సముద్రంలోకి విసిరివేశాడు. తరువాత ఎవరి స్థానాలకు వారు చేరుకున్నారు.

ఆ విధంగా రుద్రతేజస్సు గంగాసాగర సంగమంలో బాలుని రూపాన్ని ధరించింది ఆ బాలుడు సముద్ర కెరటాలపై ఉయ్యాల లూగుతూ ఏడ్వడం మొదలెట్టాడు. ఆ రోధనకు ముల్లోకాలు తల్లడిల్లాయి. అంతట దేవతలు బ్రహ్మదేవుడి వద్దకు వెళ్ళి ఈ విషయాన్ని విన్నవించి శరణు కోరారు. బ్రహ్మదేవుడు సముద్రతీరానికి వచ్చి ఆ బాలుని చూచాడు. సముద్రుడు ఆ బాలుని విధాత ఒడిలో కూర్చుండబెట్టి జాతకకర్మాది సంస్కారాలు జరుపమని కోరాడు. ఈ బాలుడెవరని ప్రశ్నించిన బ్రహ్మకు “ఈ బాలకుడు గంగాసాగర సంగమంలో అకస్మాత్తుగా ఉదయించాడు. ఎవరి కుమారుడో తెలియదు” అని సాగరుడు చెప్పాడు.

సముద్రుని సమాధానానికి తల ఊపుతున్న బ్రహ్మగారి గొంతు పట్టి నొక్కాడు ఆ బాలుడు. ఒక్కసారిగా మెడ నొప్పిపుట్టి ఆయన కన్నుల నుండి నీరు కారింది. “ఇతడు నా కన్నుల నుండి నీరు కారేటట్లు చేశాడు కావున ఈ బాలుడికి ‘జలంధరుడు’ అని నామకరణం చేస్తున్నాను. ఈ బాలుడు సర్వశాస్త్ర పారంగతుడై, యుద్ధంలో ఎన్నడు పరాజయం చవిచూడని రాక్షస సార్వభౌముడు కాగలడు. విష్ణువుని కూడా పరాజితుని చేసి శివుని చేతిలో మరణిస్తాడు. సర్వాంగ సుందరి, పతివ్రతయైన స్త్రీ ఇతనికి భార్య కాగలదు” అని అతని జాతకాన్ని వివరించాడు. తరువాత బ్రహ్మ తన లోకానికి తిరిగి వెళ్ళాడు.

సముద్రుడు ఆ బాలకుని అల్లారు ముద్దుగా పెంచాడు. పెరిగి పెద్దవాడై సకలవిద్యల్లో అరితేరినవాడైనాడు. యుక్తవయస్సు రాగానే ‘కాలనేమి’ అనే రాక్షసరాజు కుమార్తె ‘బృందాదేవి’తో వివాహం జరిపించాడు. తారకాసుర, త్రిపురాసుర సంహారం తరువాత అనాథలైన దానవులంతా జలంధరుని కొలువులో చేరారు. ఒకనాడు జలంధరుడు మంత్రి, పురోహిత, సామంతులు పరివేష్టించిన సభలో రత్న సింహాసనంపై కూర్చొని ఉండగా అసురగురువైన శుక్రాచార్యులు అక్కడకు విచ్చేసారు. జలంధరునితో సహా సభలోని వారందరూ లేచి నిలబడి శుక్రాచార్యులకు స్వాగతం పలికి ఉన్నతాసనంపై కూర్చుండబెట్టారు.

కుశల ప్రశ్నల తరువాత జలంధరుడు శుక్రాచార్యుని “గురుదేవా! మన సోదరుడు రాహువు తల నరికి ఈ దుస్థితిని కల్పించిన దుర్మార్గుడెవరు? ఆ వృత్తాంతాన్ని చెప్పండి” అని అడిగాడు. పూర్వం దేవతలు దానవులు అమృతం కొరకు సముద్రాన్ని మధించడం, అప్పుడు పుట్టిన శ్రేష్టమైన వస్తువుల్ని దేవతలు హస్తగతం చేసుకోవడం, దేవతల మోసాన్ని గ్రహించి దేవతల పంక్తిని చేరి రాహువు అమృతాన్ని తాగుతుండగా విష్ణువు తన చక్రంతో రాహువు శిరస్సు ఖండించడం అంతా శుక్రుడు వివరించాడు.

ఇది విన్న జలంధరుడు ఆగ్రహంతో ఊగిపోయాడు. దేవేంద్రుడి వద్దకు తన దూతను పంపాడు. ఆ దూత అమరావతి చేరి నిండు సభలో ఇంద్రుడికి తన ప్రభువు సందేశాన్ని ఇలా వినిపించాడు. “ఓ దేవతాధమా! నా తండ్రియైన సముద్రుని మందర పర్వతంతో మధించి కల్పవృక్షము, కామధేనువు, ఐరావతము మొదలైన శ్రేష్టమైన వాటినన్నిటిని స్వార్థ బుద్ధితో నీ స్వంతం చేసుకున్నావు. వాటి ననన్నింటినీ నాకు సమర్పించి సకల దేవతలు నా శరణు వేడుకోండి. కానిచో నిన్ను సింహాసనం నుండి బ్రష్ఠుణ్ణి చేస్తాను”.

దూత సందేశానికి దేవేంద్రుడు కోపంతో “మీ రాక్షసులు దేవతలను, సాధువులను ఎన్నో కష్టాలకు గురిచేసారు. దానికి ప్రతీకారంగా మేము ఆ వస్తువులను సంగ్రహించవలసి వచ్చింది. వాటిని మీకు తిరిగి ఇచ్చేది లేదు. ఈ విషయాన్ని మీ ప్రభువుకు విన్నవించు” అని చెప్పాడు.

దూత తెచ్చిన సమాధానం విన్న జలంధరుడు కోపంతో పండ్లు పటపట కొరికాడు. రాక్షస సైన్యాన్ని సర్వ సన్నద్ధం చేశాడు. శుంభ, నిశుంభాది రాక్షసులతో కూడి జలంధరుడు అమరావతి చేరి నందనవనంలో విడిదిచేసాడు. దేవతలు కూడా యుద్ధానికి సన్నిద్ధులై రణరంగం చేరారు. ఇరు సైన్యాల మధ్య భీకర సమరం మొదలైంది. విరిగిన రథాలు, తొండాలు తెగిన ఏనుగులు, నేలకొరిగిన గుఱ్ఱాలతో కదనరంగం విషాద భరితంగా ఉంది.

యుద్ధరంగంలో ప్రాణాలు విడిచిన అసురులను శుక్రాచార్యుడు మృత సంజీవినీ విద్యతో బ్రతికిస్తున్నాడు. దేవ గురువు బృహస్పతి ద్రోణాద్రి నుండి తెచ్చిన ఓషధులతో దేవతలను పునర్జీవితులను చేస్తున్నాడు. అందువలన యుద్ధం ఎప్పటికీ పరిసమాప్తి కావడం లేదు. దేవతలను దేవగురువు పునర్జీవితులను చేస్తున్న విషయం తెలుసుకున్న జలంధరుడు తన భుజబలంతో ఆ ద్రోణ పర్వతాన్ని ఎత్తి సముద్రంలోకి విసిరివేశాడు.

అప్పుడు బృహస్పతి దేవతలతో “ఓషధులు కలిగిన ద్రోణపర్వతాన్ని దానవులు మాయం చేశారు. కనుక ఇక పైన మీలో ఎవరైనా ప్రాణాలు పోగొట్టకుంటే నేను మరల బ్రతికించ లేను. మీరు వెంటనే సురక్షిత ప్రదేశాలకు వెళ్ళి తలదాచుకోండి. శివతేజంతో జన్మించిన జలంధరుని మీరు ఓడించలేరు” అని ఉపదేశించాడు. గురువు మాటలు విని దేవతలు భయంతో మేరుపర్వత గుహల్లో దాగారు. జలంధరుడు విజయోత్సాహంతో అమరావతీ నగరాన్ని స్వాధీనం చేసుకొని అన్ని పదవుల్లో దానవులను నియమించాడు.

దేవతలు బ్రహ్మదేవుడికి తమ దుస్థితిని వివరించి జలంధరుని నియంత్రించే ఉపాయం తెలపమని కోరారు. విధాత ఈ ఆపదను గట్టెక్కించ గలవాడు నారాయణుడొక్కడే అని చెప్పి వారిని తీసుకొని వైకుంఠానికి వెళ్లాడు. అందరూ కలిసి హరిని ప్రార్థించారు. దేవతల మొర విని కరుణాసముద్రుడైన పురుషోత్తముడు “ఓ దేవతలారా! భయాన్ని విడిచి పెట్టండి. నేను జలంధరునిపై యుద్ధానికి సిద్ధమై వెళ్తున్నాను” అని చెప్పాడు.

జలంధరునితో యుద్ధానికి బయలుదేరిన సంగతి తెలిసిన లక్ష్మీదేవి హరిని “నాథా! నా తమ్ముడైన జలంధరుని వధించకండి” అని ప్ర్రార్ధించింది. అప్పుడు శ్రీహరి లక్ష్మీదేవితో “దేవీ! నా వైభవమంతా నీ తండ్రిగారు ఇచ్చిందే కదా! నీ మాటను నేను కాదనలేను. అదియును కాక జలంధరుడు రుద్రతేజంలో పుట్టినవాడు, బ్రహ్మ దగ్గర వరాలు పొందినవాడు, నీకు సోదరుడు కావున నా చేతిలో చావులేదు” అని చెప్పి యుద్ధానికి వెళ్లాడు.

. శ్రీహరి ఆయుధాలు ధరించి, గరుత్మంతుని అధిరోహించి, ఇంద్రుడు మొదలైన దేవతలతో కలిసి యుద్ధభూమికి చేరాడు. గరుత్మంతుని రెక్కల విసురుకు దానవులు ఎగిరి క్రింద పడ్డారు. జలంధరుడు ఒక్క క్షణంలో తేరుకొని గరుత్మంతుని తలపై మోదాడు. తన అనుచరులైన శుంభ, నిశుంభాది రాక్షస వీరులను యుద్ధరంగంలో నిలిపాడు. శూలాన్ని చేతపట్టి యుద్ధభూమిలో రుద్రుడై నిలిచాడు. కేశవుడు తమకు రక్షణగా ఉన్నాడనే ధైర్యంతో, దేవతలు రకరకాల ఆయుధాలతో రాక్షసులను హింసిస్తున్నారు. విష్ణువు ఖడ్గము ధరించి ముందు కురికి దైత్యుల తలలు నరకడం మొదలు పెట్టాడు. బాణాలతో జలంధరుని ధ్వజాన్ని, ధనస్సును, ఛత్రాన్ని ఎగర కొట్టాడు. జలంధరుడు ఒక్కసారిగా రథము నుండి క్రిందకు దూకి హరి వక్షస్థలాన్ని శూలంతో పొడిచాడు. మాధవుడు క్రోధంతో కౌమోదకి అనే గదను ఆ దానవుని పైకి విసిరాడు. అది జలంధరుని మెడలో పూలమాలగా మారిపోయింది.

శ్రీహరి ప్రసన్నుడై జలంధరుడి యుద్ధనైపుణ్యాన్ని మెచ్చుకొని ఏదైనా వరం కోరుకోమన్నాడు. అప్పుడు ఆ దానవుడు “బావా! నువ్వు అన్నమాట నిజమైతే, నా సోదరితో సహా నా ఇంట్లో నివసించాలి” – అని వరం కోరాడు. అలాగే అని చెప్పి విష్ణువు లక్ష్మీసహితుడై తన గణాలతో సహా ‘జలంధర నగరానికి’ వచ్చి నివసించాడు. స్వర్గము, వైకుంఠములోని పదవులన్నీ రాక్షసుల హస్తగతమయ్యాయి. జలంధరుడు భూలోకానికి వచ్చి ప్రజలను తన కన్నబిడ్డలవలె, ధర్మబద్ధంగా పరిపాలించ సాగాడు.

ఈ విధంగా జలంధరుడు మూడులోకాలకు ఆధిపత్యం వహించగా, దేవతలు దుఃఖంతో ఇక శంకరు డొక్కడే దిక్కని తలచి మనస్సులో స్తుతించారు. శివుని ప్రేరణతో నారదుడు జలంధర నగరానికి వెళ్ళి దేవతలను కలిసి వారిని ఊరడించాడు. తరువాత జలంధరుని భవనానికి వెళ్లాడు. ఆ దానవుడు నారదమహర్షికి స్వాగత మర్యాదలు చేసాడు. అప్పుడు నారదుడు “ఓ దానవ సార్వభౌమా! నువ్వు చాలా బుద్ధిమంతుడవు. పరాక్రమంలో నీకు సరియైనవారు లేరు. సాక్షాత్తు లక్ష్మి నారాయణులను నీ ఇంట్లో లేగదూడల్లా కట్టేసుకున్నావు. నేనీ మధ్య కైలాసం వెళ్లాను. అక్కడ పార్వతీ సహితుడైన పరమేశ్వరుడి చూసాను. ఆ పార్వతి ఎంత అందంగా ఉందో! ఇంత సంపద ఉన్న నీ దగ్గర అటువంటి స్త్రీరత్నం లేకపోవడం నిజంగా నీకు గొప్పలోటు” అని చెప్పి అక్కడి నుండి నిష్క్రమించాడు.

జలంధరుడు రాహువుని శివుని దగ్గరకు దూతగా పంపాడు. రాహువు కైలాసానికి వెళ్ళి శివునితో “త్రిలోకాధిపతి అయిన జలంధరుని దూతను నేను. రాక్షస సామ్రాట్టు ఆజ్ఞను మీకు విన్నవిస్తున్నాను- రాజ్యంలోని శ్రేష్టమైన వస్తువులన్నీ రాజుకే చెందుతాయనేది రాజనీతి. నిత్యం స్మశానంలో ఉండేవాడివి, కపాలాన్ని చేత ధరించేవాడివి అయిన నీకు హిమగిరి రాజతనయ పార్వతిని భార్యగా పొందే అర్హత లేదు. ఆమె నాకే చెందుతుంది. వెంటనే ఆమెను మాకు అప్పగించు” అని విన్నవించాడు.

రాహువు మాటలు వింటున్న శివుని భ్రూమధ్య నుండి రౌద్రుడు, పొడవైన బాహువులు, తాటి చెట్లలాంటి కాళ్ళు, శుష్కించిన దేహం కల పురుషుడు పుట్టి వెంటనే రాహువును పట్టుకొని మ్రింగబోయాడు. రాహువు భయంతో “దూతనైన నన్ను రక్షించు” అని శంకరుణ్ణి ప్రార్థించాడు. పరమేశ్వరుడు రాహువుని వదలిపెట్టమని ఆజ్ఞాపించాడు.

ఆ కింకరుడు “స్వామీ! నేను ఆకలితో మలమల మాడిపోతున్నాను. నాకు ఆహారాన్ని చూపించు” అని దీనంగా ప్రార్థించాడు. “అంత ఆకలిగా ఉంటే నీ కాళ్ళు చేతుల మాంసాన్ని నువ్వు తిను” అని శివుడు చెప్పగానే వాడు అలానే చేసాడు. వాడికి శిరస్సు ఒక్కటే మిగిలింది. శివుడు సంతోషించి ఆ కింకరుడితో “ఓ మహాగణా! నువ్వు నా ఆజ్ఞను వెంటనే పాటించావు. దుష్టులకు భయం కలిగించే నువ్వు ఈ పైన ‘కీర్తిముఖుడు’ అనే పేరుతో నా ద్వారం వద్ద ద్వారపాలకునిగా ఉండు. నన్ను పూజించడానికి వచ్చిన భక్తులు ముందు నిన్ను పూజిస్తారు” అని వరమిచ్చాడు.

రాహువు తిరిగి వచ్చి జలంధరునికి కైలాసంలో జరిగింది విన్నవించాడు. రాక్షసరాజు తన సైన్యంతో కలిసి కైలాసాన్ని ముట్టడించి శంఖాన్ని పూరించాడు. శివుడు ఉగ్రుడై వీరభద్ర, కార్తికేయ, నందీశ్వర, భృంగీశ్వరాదులను ఇతర ప్రమథ, రుద్ర గణాలను పోరుకు సిద్ధం చేశాడు. రణరంగం రక్తసిక్తమైంది. శుక్రుడు సంజీవిని విద్యతో ముక్తులైన దానవులను మరల బ్రతికిస్తున్నాడు. ఇది తెలిసి క్రోధుడైన శివుని ముఖం నుండి భయంకరమైన ‘కృత్య’ అనే క్షుద్రశక్తి పుట్టింది. పర్వతగుహ వంటి తన నోరు తెరచి శుక్రుని ఒడిసి పట్టి క్షణంలో ఆకాశంలో అదృశ్యమైంది. వెంటనే అసుర సైన్యం భయంతో చెల్లాచెదురైంది. అప్పుడు శివగణాలు ఉత్సాహంతో ముందుకు దూకాయి. శంభుడు స్వయంగా యుద్ధభూమికి వచ్చి జలంధరుని ధ్వజాన్ని, అశ్వాలను, ధనస్సును ఛేదించాడు. ఎదుటపడి రుద్రునితో పోరాడలేదని గ్రహించిన జలంధరుడు గాంధర్వమాయను ప్రయోగించాడు. నటరాజైన శంకరుడు గంధర్వ అప్సరల నృత్యప్రదర్శన తిలకిస్తూ మైమరచిపోయాడు. చేతిలోని ఆయుధాలు జారిపోయినా గుర్తించలేదు.

జలంధరుడు రుద్రుని రూపం దాల్చి పార్వతి చెంతకు చేరాడు. వచ్చినవాడు శివుడని భావించి ఉమాదేవి ఎదురేగి ఎదుట నిలిచింది. ఆమెను చూడగానే జలంధరుని జవసత్త్వాలు నశించాయి. రాక్షసుని మాయను గ్రహించిన జగన్మాత అదృశ్యమైంది. పార్వతి కనపడక జలంధరుడు తిరిగి యుద్ధభూమికి వెళ్ళాడు.

దానవుని దుష్ట బుద్ధిని అసహ్యించుకున్న దుర్గ మనస్సులో విష్ణువును స్మరించింది. ఆయన వెంటనే అక్కడ సాక్షాత్కరించాడు. పార్వతి విష్ణువుతో “లక్ష్మీపతీ! జలంధరుడు వాడి భార్య మంగళసూత్ర మహిమ చేతనే ఇంకా ప్రాణాలతో ఉన్నాడు. వాడు చేసిన దుష్టకార్యంతో మనకొక దారి చూపించి వాడి చావు వాడే కొని తెచ్చుకున్నాడు. నువ్వు వెంటనే వాని మందిరానికి వెళ్ళి అతని భార్య యొక్క పాతివ్రత్య ధర్మాన్ని పాడు చెయ్యి. వానిని వధించడానికి వేరొక ఉపాయము లేదు” అని చెప్పింది.

విష్ణువు కపటముని వేషంలో నగరం బయట ఉద్యానవనంలో బస చేశాడు. తన మాయతో జలంధరుని భార్య బృందకు, జలంధరుడు తల గొరిగించుకొని, దిగంబరుడై సముద్రంలో మునిగిపోతున్నట్లుగా తెల్లవారు జామున దుస్వప్నాన్ని కలిగించాడు. మెలకువ వచ్చిన బృంద భయంతో పరుగులు తీస్తూ ముని వేషంలో ఉన్న విష్ణువును చూసి తన భర్త క్షేమ సమాచారాన్ని తెలుపమని ప్రార్థించింది.

మౌనం వహించిన ముని ఆకాశంలోకి చూడగా రెండు కోతులు వచ్చి జలంధరుని శిరస్సును, మొండేన్ని, చేతులను తీసుకొని వచ్చాయి. వాటిని చూసి బృంద మూర్ఛపోయింది. కాస్సేపటికి తెలివి తెచ్చుకొని తన భర్తను బ్రతికించమని మునిని ప్రాధేయపడింది. ముని జలంధరుని బ్రతికించి అక్కడ నుండి అదృశ్యమయ్యాడు.

బృందాదేవి పునర్జీవితుడైన భర్తను కౌగలించుకొని ముద్దాడి ఎంతో సంతోషం పొందింది. భర్తతో వనమంతా విహరించి ఇష్టంతో సుఖించింది. తరువాత భర్త రూపంలో ఉన్నవాడు విష్ణువే నని గ్రహించింది. క్రోధంతో విష్ణువును “నీ అనుచరులిద్దరూ భవిష్యత్తులో నీ భార్యను అపహరిస్తారు. భార్యా వియోగంతో నీవు అలమటిస్తూ అడవుల్లో తిరుగుతావు” అని శపించింది. అపవిత్రమైన తన శరీరాన్ని అగ్నికి ఆహుతి చేసి ఆమె పరిశుద్ధురాలైంది. పతివ్రతా శిరోమణి, విష్ణుభక్తురాలు అయిన బృందాదేవికి ముక్తి లభించింది. ఆమె తేజస్సు పార్వతీదేవిలో లీనమైంది.

యుద్ధభూమిలో గంధర్వమాయ సమసిపోయి శివుడు చైతన్యవంతుడయ్యాడు. కాలి బొటన వ్రేలుతో సముద్రం నుండి భయంకరమైన చక్రాన్ని సృష్టించాడు. దానిని ప్రయోగించే సరికి అది జలంధరుని తల నరికి తిరిగి రుద్రుని చెంతకు చేరింది. అతని తల, మొండెము రథం పైననుండి పెద్ద శబ్దం చేస్తూ భూమి మీద పడ్డాయి. అతని నుండి ఉద్భవించిన దివ్య తేజస్సు శివునితో లీనమైంది.

దేవతలు, గంధర్వులు, సిద్ధులు, మునులు అందరూ జయజయ ధ్యానాలు చేశారు.

శంకరుని పలువిధాల స్తుతించారు

*శుభం*

మరిన్ని కథలు

Bhavaateetam
భావాతీతం
- DODDIPATLA KALYAN KISHORE
Prema falam
ప్రేమ ఫలం
- పి. రాజేంద్రప్రసాద్
Neethone nenunta
నీతోనే నేనుంటా
- కాశీవిశ్వనాధం పట్రాయుడు
Amlet damlet
ఆంమ్లేట్ - డాంమ్లేట్ .
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
REkkala kastam
రెక్కల కష్టం
- వరలక్ష్మి నున్న
ఓ breaking news
ఓ బ్రేకింగ్ న్యూస్
- బివిడి ప్రసాద రావు