క్షోభకు తెర - జీడిగుంట నరసింహ మూర్తి

Kshobhaku tera

"బాగుంది అన్నయ్య . నీ పాలసీ. . అనవసరంగా ఎవరితోనూ సుధీర్ఘంగా చర్చలు పెట్టుకోవు. అవతల వాళ్ళు నీ ఫోన్ కోసం ఎదురు చూడాలే తప్ప ఏ పని లేనట్టు , ఎవరు దొరుకుతారు అన్నట్టు సాధ్యమైనంతవరకు ఏదైనా ముఖ్యమైన సమాచారం నీ దగ్గర ఉంటే తప్ప నువ్వు ఎవరికీ ఫోన్ చెయ్యవు. ఒకవేళ చేసినా , అవతల వాళ్ళు మాట్లాడినా అందులో ఎవరిమీద చాడీలు కానీ ఇతరుల కుటుంబాల గురించి అనవసర ప్రసంగాలు కానీ చెయ్యవు. అందుకే ఎవరి ఊసురూ తగలకుండా చక్కగా ఆరోగ్యం కాపాడుకుంటున్నావు. కుటుంబంలో మంచి ఎదుగుదల కనిపిస్తోంది .." అన్నాడు గోపాల్ అన్నగారు సుబ్బారావు నుద్దేశించి.

"అవునురా. నువ్వు చెప్పినట్టు నాకు అటువంటివి ఇష్టం లేదు. ఎవరు ఏమి అనుకున్నా పర్వాలేదు. నా పద్దతి నేను మార్చుకోను. అయితే ఎప్పుడైనా ఒకచోట కలిసినప్పుడు ఎలాగూ తప్పదు. అప్పుడు కూడా వాళ్ళ గురించి, వీళ్ళ గురించి దుర్భాషలు ఆడటం, అపార్ధాలు చేసుకోవడం లాంటివి నేను చెయ్యను. ఎవరు చేసినా ఖచ్చితంగా ఖండిస్తాను. నా విషయంలో అటువంటి ఇబ్బందే లేదు. నేను వాటికి చాలా దూరంగా ఉంటాను. ఇక నీ విషయానికొస్తాను. నేను నీకన్నా పెద్ద వాడినిగా చెపుతున్నాను. నీ పద్దతులు వేరు. . నీకు ఎన్ని ముఖ్యమైన పనులున్నా అవతల వాళ్ళు కాలక్షేపానికి ఫోన్ చేసినా నీ పనులు అన్నీ మానుకుని వాళ్ళను ఎంటర్ టైన్ చెయ్యడానికి ప్రయత్నిస్తావు. వాళ్ళు" నువ్వు మమ్మల్ని ఎంటర్ టైన్ చేసేది ఏమిటి ? నీ వల్ల మాకు ప్రయోజనం ఏముంది ? నీకు తోచక కొట్టుకుంటున్నావు. అందుకే మాట్లాడుతున్నావు" అంటూ నిన్నే ఆడిపోసుకుంటారు. ఈ క్రమంలో నీచేత వాళ్ళు అనవసరమైన వాగుళ్లు వాగిస్తారు. మాట్లాడుకోవడానికి ఏ సబ్జెక్టు లేకపోవడం వల్ల "ఫ్లో" లో ఒక గంటా రెండు గంటల సేపు మన చుట్టాలను గురించి ఉన్నవీ , లేనివీ కలిపించి మాట్లాడుకోవడం, మీ బలహీనతలను బయట పెట్టుకోవడం, మీ సొంత వాళ్ళను గురించే చెడుగా వర్ణించి చెప్పడం ,చివరకు ఇవన్నీ ఒకరు కొకరు కథలు వ్రాసుకుని పత్రికలకు పంపడం, అది అవతల వాళ్ళు చూసి మిమ్మల్ని దుమ్మెత్తి పొయ్యడం, ఇవన్నీ మామూలేగా. ఇవన్నీ నా కవసరం అంటావా ? ఉదాహరణకు నేను మీ ఇంట్లో వాళ్ళ గురించి ఏవేవో ఉన్నవీ లేనివీ కలిపించి చెపుతున్నాను అనుకో. రేపు ఏదో అవసరం మీద మీ ఇంటికి రాగలనా ? మీ ఇంట్లో భోజనం చెయ్యగలనా ? మీ మొహాల్లోకి చూడగలనా ? అసలు వాళ్ళ ముందు తలెత్తుకోగలమా ? ఇలా ఫోనుల్లో అనవసర ప్రసంగాలు చేసే వాళ్ళకు జీవితం గురించి సరైన అవగాహన లేదని నేను అంటాను.రోజూ మనం చేసుకోవాల్సిన ఎన్నో పనులను పెండింగ్ పెట్టి ఇలా కాలక్షేపం చెయ్యడం వల్ల నలుగురిలోనూ పలచనైపోవడం తప్ప ఏ ప్రయోజనం ఉండదు. నేను మటుకు నా పనులు పూర్తిగా చేసుకున్నాకనే మిగిలిన వాటికి ప్రాధాన్యతనిస్తాను. ఈ క్రమంలో ఎవ్వరూ ఏమి అనుకున్నా, ఏం వాగినా నేను లెక్క చెయ్యను. ....ఇప్పుడు కూడా నీతో ఇంతసేపు ఎందుకు మాట్లాడుతున్నానంటే మనిద్దరం ఒక ముఖ్యమైన సబ్జెక్టు గురించి , చాలా అవసరమైన విషయాలు గురించి చెప్పుకుంటున్నాం., పైగా నువ్వు నీ వ్యక్తిగత పనులను పక్కన పెట్టి నీ వాళ్ళను నిర్లక్ష్యం చేసి నీ మొత్తం సమయాన్ని వృధా చేసుకుంటున్నావని తెలిసి నువ్వు నా కన్నా చిన్న వాడివి కాబట్టి చనువుతో నిన్ను ఒకరకంగా హెచ్చరిక చేస్తున్నాను. ....అంతే తప్ప ఇప్పుడు నాకు పనులేమీ లేక ఈ ప్రసంగాలు చెయ్యడం లేదు .. నువ్వు గ్రహిస్తే అంతే చాలు ....మరి ఉంటాను. ఏదైనా ముఖ్యమైన విశేషాలు ఉంటే మాత్రం నువ్వు ఎప్పుడైనా ఫోన్ చేయొచ్చు. .." అంటూ ఫోన్ పెట్టేశాడు సుబ్బారావు.

ఇద్దరి మధ్యా ఫోనులో సంభాషణలు ముగిశాక గోపాల్ తన గదిలోకి వెళ్ళి మంచమ్మీద పడుకుని ఆలోచిస్తున్నాడు.

అవును తన అన్నగారు సుబ్బారావు చెప్పినట్టు తను తన కుటుంబం కోసం ఒక్క నిమిషం కూడా వెచ్చించడం లేదు. ఎవరి పనులు వాళ్ళు చేసుకుంటూ , వాళ్ళ కుటుంబాలకు పూర్తి ప్రాముఖ్యత నిచ్చుకుంటూ , ఎవరి స్వేచ్ఛను వారు సంపూర్ణంగా అనుభవిస్తూ, కేవలం కాలక్షేపానికి మాత్రం తనని ఉపయోగించుకుని పైపెచ్చు అకారణంగా తను అపార్ధాలకు గురవుతూ , మనస్థాపాలు చెందుతూ , గొడవలు పడుతూ కొడుకును కోడలను , కూతురిని, అల్లుడును కూడా సరిగ్గా చూసుకోక వాళ్ళతో వారానికొకసారైనా మంచీ చెడూ మాట్లాడటానికి సమయం కేటాయించక పోవడం తను చేసిన క్షమించరాని తప్పు. తన ప్రవర్తన తెలిసిన వాళ్ళు తనకు చాలా సార్లు గడ్డిపెట్టినా తను ఎప్పుడూ లక్ష్య పెట్టలేదు. అవతలవాళ్లు మాకు మా కుటుంబం తప్ప మాకు ఎవ్వరూ ముఖ్యం కాదని తెగేసి చెపుతున్నా కూడా తనకు బుద్ది రావడం లేదు. అయినా కూడా తనకు సిగ్గులేకుండా ఆత్మవంచన చేసుకుంటూ బలిపశువులా మారిపోతున్నాడు . తన నోటినుండి అవతల వాళ్ళ గురించి అనవసర మైన సమాచారాన్ని, అభియోగాలను చెప్పించి చివరకు అవతల వాళ్ళతో "నీ గురించి వాడు ఇలా అంటున్నాడు " అంటూ తన మీదే వాటిని రుద్ది తనకు జీవితంలో ఎటువంటి మనశ్శాంతి లేకుండా చేస్తున్న వాళ్ళను గురించి ఇప్పుడు తీవ్రంగా ఆలోచిస్తున్నాడు .

.అవతలి వాళ్ళ వల్ల దమ్మిడీ ఉపయోగం లేకపోయినా వాళ్ళ కందరికీ తను బానిసలా ఎందుకుండాలి ? తను ఎంతగా నష్టపోతున్నాడో ఇప్పుడు అర్ధం అవుతోంది. .. వీటికన్నిటికీ తన విపరీతమైన మొహమాటమే. అవతల వాళ్ళు ఏమనుకుంటారో అనుకుంటూ వాళ్ళు ఆడించినట్టు ఆడుతున్నాడు. . ఇప్పటికైనా తన పాలసీ మార్చుకోవాలి. లేకపోతే అయిన వాళ్ళందరికీ దూరం అవుతాడు. తన కుటుంబ పరువు రోడ్డున కెక్కుతుంది...."

తనకి ఇప్పటికీ ఆ సంఘటన బాధపెడుతూనే ఉంటుంది. ఆ రోజు తన కూతురు, అల్లుడిని కొత్తగా కాపురం పెట్టించే రోజు. ఒక పక్క అల్లుడు తల్లి తండ్రులు వచ్చి కూర్చున్నారు. వాళ్ళందరికీ స్నానానికి నీళ్ళు, టిఫిన్లు కోసం తనూ, తన భార్య నానా హడావిడి పడుతున్నారు. మరో పక్క ఫోనుల్లో ఎవరెవరో తనని, తన భార్యను విసిగిస్తున్నారు. కాపురం పెట్టేటప్పుడు దగ్గర చుట్టాలందరినీ పిలవమని బలవంతం చేస్తున్నారు. వాళ్ళకు సమాధానాలు చెప్పి వదుల్చుకునే టప్పటికి అతని వియ్యాల వారు , అల్లుడు కస్సుబుస్సు మంటూ ఎంతో దూరం నుండి ప్రయాణం చేసి వచ్చిన మమ్మల్ని ఊరికే కూర్చోపెట్టి కనీసం టిఫిన్స్ కూడా పెట్టకుండా వాళ్ళ వాళ్ళతో కబుర్లు వేసుకుంటూ మమ్మల్ని కావాలని అవమానించారు " అంటూ అక్కడికక్కడే తీవ్రంగా దుర్భాష లాడటం తను జీవితంలో మర్చిపోలేడు . అవును నిజమే ఆ విషయాన్ని తల్చుకుంటూ ఉంటే నిలువెల్లా వణికి పోతూ ఉంటాడు. . ఇప్పటికీ వియ్యాల వారు, అల్లుడు వాళ్ళకు ఆ రోజు జరిగిన అవమానపు తాలూకు భయంకరమైన క్షణాలను మర్చిపోలేక పోతున్నారు.

ఏది ఏమైనా ఇన్నాళ్ళు తను వ్యవహరించిన తీరుకు, తనను బాధించిన పరిస్తితులకు శాశ్వత పరిష్కారం కనపడుతోంది. . తన విషయంలో ఎవరు ఏమనుకున్నా, ఎటువంటి విమర్శలు చేసినా అందరిలోనూ అవమానించాలి అని చూసినా తను ఇక ఏ మాత్రమూ చలించేది లేదు. ఈ క్షణం నుండి తన పాలసీ కూడా మార్చుకోబోతున్నాడు. .. ఆలస్యం అయినా సరే. ఇప్పటికైనా తను తన సమయాన్ని తన కుటుంబం కోసం వెచ్చించ బోతున్నాడు .

ఆలోచనల నుండి తేరుకున్న గోపాల్ ఇక ఈ క్షణం నుండి తను ఆచరించవలసిన నియమావళి గురించి గట్టిగా తీర్మానించుకున్నాక ఇన్నాళ్ళు అతను అనుభవించిన మానసిక క్షోభకు తెరపడినట్టయ్యింది. ******

సమాప్తం

మరిన్ని కథలు

Bhavaateetam
భావాతీతం
- DODDIPATLA KALYAN KISHORE
Prema falam
ప్రేమ ఫలం
- పి. రాజేంద్రప్రసాద్
Neethone nenunta
నీతోనే నేనుంటా
- కాశీవిశ్వనాధం పట్రాయుడు
Amlet damlet
ఆంమ్లేట్ - డాంమ్లేట్ .
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
REkkala kastam
రెక్కల కష్టం
- వరలక్ష్మి నున్న
ఓ breaking news
ఓ బ్రేకింగ్ న్యూస్
- బివిడి ప్రసాద రావు