రూప కల్పన - జీడిగుంట నరసింహ మూర్తి

Roopakalpana

నారాయణ మా కుటుంబానికి ఎలా పరిచయం అయ్యాడో నాకు సరిగ్గా గుర్తులేదు కానీ ఎప్పుడో మా అన్నయ్యలతో స్నేహం చేసే వాడుట. వాళ్లు ఉద్యోగరీత్యా మా ఊరు విడిచి వెళ్లిపోయాక అతను ఒంటరి అయిపోయాడు.

నారాయణ వయసు ఇరవై రెండేళ్ళు పైనే ఉంటుంది. నన్ను అప్పుడప్పుడు చూసినా మాట్లాడాలంటే మొహమాటం. . . అయినా కూడా నేనే కలిపించుకుని అతనితో స్నేహబంధాన్ని పెంచుకోవడం మొదలుపెట్టి అప్పుడప్పుడు ఇంటికి తీసుకు వచ్చే వాడిని. .

ఆ నాటినుండి అతను మా ఇంట్లో వాళ్ళకు కూడా పరిచయం అయ్యాడు.

ఆశ్చర్యంగా అతను రాగానే మా మా నాన్నగారు నవ్వుతూ పలకరించే వాడు. బహుశా అతన్ని చూస్తే మా అన్నయ్యలను చూసినట్టు ఉంటుంది అనుకుంటా. ఏ కారణం వల్ల నైతే నేమి కానీ అతనితో మా యావత్ కుటుంబానికి ఆత్మీయ బంధం ఏర్పడిపోయింది. .

నారాయణకు ఆ వయసులోనే విపరీతమైన సినిమా పిచ్చి ఉందని మేమంతా గ్రహించాం. ఒకటి రెండు సార్లు నన్ను కూడా సినిమాలకు తీసుకెళ్ళాడు. ఆ వూళ్ళో ఉన్న అన్ని థియేటర్లలోనూ టికెట్లు ఇచ్చేవాడి దగ్గరనుండి గేట్ కీపర్ వరకు అతనంటే తెలియని వాళ్ళు లేరు.

ఇప్పుడంటే హాళ్ళకు వెళ్ళి సినిమాలు చూడాలంటే ఎక్కువమంది ఆసక్తి చూపడం లేదు కానీ అప్పట్లో మా ఇంట్లో ఇంటిల్లిపాది ఒకే రిక్షాలో ఎక్కి ఎక్కడో ఊరికి మూలనున్న హాలులలో కూడా మంచి సినిమాలుగా పేరుపొందినవాటినన్నీ చూసేసే వాళ్ళం. అటువంటి అలవాటు ఎంతోకొంత ఉన్న మాకు నారాయణకు సినిమా పిచ్చి ఒక రేంజ్ లో ఉందని తెలిసి మా అమ్మా, నాన్నలు అస్సలు ఆశ్చర్యపోలేదు.

మా నాన్నగారు వృత్తి రీత్యా ఒక కళా శాలలో అధ్యాపకుడు . . లలిత కళలు అంటే బాగా ఇష్టం. మరోపక్క ఇంటికి ఎంతోమంది కవి పండితులు వచ్చి కొత్తగా వ్రాసిన వాళ్ళ సాహిత్యాన్ని మా నాన్నకు వినిపించడం, వాటిపై ఆయన సలహాలు తీసుకోవడం , చర్చోపచర్చలు జరగడం నిత్యకృత్యమే. పరోపక్క తీరిక ఉన్నప్పుడు ఉత్తమ చిత్రాలను ఎంచుకుని వాటిమీద సమీక్షలు వ్రాసి వివిధ పత్రికలకు పంపడం మా నాన్న అలవాట్లలో ఒకటి. అడపాదడపా ఆయన సమీక్షలు వ్రాసి బహుమతులు కూడా పొందే వారు. . కొన్ని పత్రికలు ఆయన చేసే సమీక్షల కోసం ఎదురు చూసే వాళ్ళు కూడా. .

సమీక్షలు వ్రాయడానికి చాలా సార్లు ఆయా సినిమాలకు వెళ్తే కానీ దాంట్లో ఉన్న మంచీ చెడులు తెలియవు కనుక ఆయనకు ఎక్కువగా సినిమాల పిచ్చి ఉన్న నారాయణ ఒకరకంగా ఉపయోగపడ్డాడు.తను చూసిన సినిమాల గురించి బాగుందో లేదో అన్న విషయాన్ని నారాయణ దగ్గర తెలుసుకున్నాకనే ఆయన ఆ సినిమాలకు వెళ్ళే వాడు. .

నారాయణ వాళ్ళ ఇల్లు మా ఇంటి నుంచి మూడు కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఎర్రని ఎండలో సినిమా చూసి వచ్చిన నారాయణ వాళ్ళ ఇంటి వరకు నడవలేక మధ్యలో మా ఇంటి దగ్గర ఆగిపోయే వాడు. అతన్ని చూస్తే మా అమ్మగారికి ఎంతో జాలేసేది . ఎండను పడి వచ్చిన నారాయణకు ఒక పెద్ద గ్లాసుడు నిమ్మకాయ మజ్జిగ ఇచ్చి ఆ తర్వాత భోజనానికి కూడా కూర్చోమనేది. ఆ విధంగా మా ఇంట్లో వారితో నారాయణకు విపరీతమైన అనుబంధం అల్లుకుపోయింది.

తనకొడుకును ఆదరించి మా కుటుంబంలో ఒక వ్యక్తిగా చూసుకుంటున్నట్టు నారాయణ తల్లి తండ్రులకు తెలిసి ఎన్నోసార్లు మా ఇంటికి వచ్చి పరిచయం చేసుకోవాలని ప్రయత్నం చేసే వాళ్ళు. మధ్య మధ్యలో నారాయణ తల్లి మా అమ్మగారితో పిచ్చాపాటి కబుర్లు చెప్పే స్తాయికి వెళ్లింది.

నారాయణను మా ఇంట్లో వాళ్ళు ప్రత్యేకంగా చూస్తూండటం వల్ల ఒకరోజు అతనే మా అమ్మతో అన్నాడు

" పిన్ని గారూ !మీరు నన్ను మీ కొడుకుగా భావించి బజార్లో ఏవైనా పనులుంటే నిర్మొహమాటంగా చెప్పి చేయించుకోండి. ఎలాగూ పని లేకుండా బడుద్దాయి లాగా తిరుగుతున్నాను. చిన్న చిన్న పనులేనా చేసీ ఋణం తీర్చుకొనియ్యండి "అన్నాడు స్వచ్చమైన మనసుతో.

ఆ రోజు నుండి తనే కలిపించుకుని బజారునుండి కూరలు తేవడం, పిండి ఆడించుకుని రావడం,, ఆయిల్ మిల్లు నుండి ఫ్రెష్ గా పట్టిన నువ్వుల నూనె , తెలగపిండి లాంటివి తెచ్చిపెడుతూ ఉండే వాడు. . .

ఒక రోజు యధాలాపంగా నారాయణను అడిగారు మా నాన్న గారు .

" నారాయణా నేను ఎప్పుడూ అడగలేదు . ఏం చదువుకున్నావు ? ఉద్యోగానికి ఎక్కడా ప్రయత్నం చెయ్యడం లేదా ?" అని .

"లేదు మాష్టారు. స్కూల్ ఫైనల్ తో నా చదువు ఆగిపోయింది. ఇంతోటి చదువుకు ఉద్యోగం ఎవరు ఇస్తారు ? చేస్తే ఏదైనా వ్యాపారం చెయ్యడం లేదంటే సినిమాలలో ప్రయత్నించాలని ఉంది " అన్నాడు నారాయణ ముసిముసి నవ్వులు నవ్వుతూ..

దానితో మా నాన్న గారు షాక్ తిన్నట్టయ్యాడు.

"చదువు ఆపేశావా ? నిన్ను చూడగానే నేను అలా అనుకోలేదు. నువ్వు రోజుకొక సినిమా చొప్పున చూసేస్తూ ఉంటే ప్రస్తుతం ఏదో ఖాళీగా ఉన్నావు కాబట్టి తోచక సినిమాలు చూస్తున్నావు అనుకున్నానే తప్ప ఇలా చదువును పక్కన పెట్టేసి పోకిరీ సినిమాల మీద నీ జీవితమంతా వేస్ట్ చేసుకుంటున్నావని తెలిస్తే నిన్ను ఎప్పుడో హెచ్చరించే వాడిని. ముందు చదువు ముఖ్యం. మనలాంటి వాళ్ళకు చదువు లేకపోతే ఎందుకూ పనికి రాము. .. నువ్వు రేపటినుండి ఈ సినిమాలు తగ్గించి చదువు మీద దృష్టి పెట్టు. అందుకు సంబంధించి ఒక టీచర్ గా నేను నా సాయం నేను చేస్తాను. నాకు వీలుంటే మీ నాన్న గారితో ఒకసారి మాట్లాడి నిన్ను ఇలా ఎందుకు వదిలేశారో అడగదల్చుకున్నాను. ఈ విషయంలో వాళ్ళు నిన్ను పట్టించుకోకుండా ఊరికే వదిలేశారని అనిపిస్తోంది. " అన్నారు మా నాన్న బాధగా నిట్టూరుస్తూ.

"లేదు మాస్టారు . దయచేసి మీరు నన్ను బాగుచెయ్యాలని ఆలోచన చేయకండి. . నల్ల రాయినుండైనా తెల్ల గంధాన్ని తీయవచ్చునేమో కానీ నాకు విద్యా ధానం చెయ్యడం కల్ల. ఈ విషయంలో మా ఇంట్లో వాళ్ళు తీవ్రంగా ప్రయత్నం చేసి విసిగిపోయి ఆఖరికి నన్నిలా వదిలేశారు.అప్పటినుండి ఏమీ తోచక ఇలా సినిమాలకు అలవాటు పడిపోయాను. అయితే దయచేసి నన్ను చెడిపోయిన వాడిలాగా భావించకండి. ఏదో ఒక రోజు నేను సినిమా ఫీల్డ్ లోకి అడుగుబెడతాను. అక్కడ కలిసి రాకపోతే ఎవరైనా మిత్రులతో కలిసి వ్యాపారం మొదలుపెడతాను .." అంటూ మనసులోని అభిప్రాయాన్ని మా నాన్న ముందుంచాడు నారాయణ . అతను అంత గట్టిగా చెప్పాక మా నాన్న అతని మనసును ఏదో విధంగా చదువువైపు మళ్లించాలని చేసిన ప్రయత్నాన్ని ఆ క్షణంలో విరమించుకున్నాడు.

"అయితే సినిమా ఫీల్డ్ కు వెళ్లాలని అనుకుంటున్నావన్న మాట. అసలు అందులోకి వెళ్లాలంటే కనీసం డ్రామా ఫీల్డ్ లోనేనా అనుభవం ఉండాలి .మరి నువ్వు ఎప్పుడైనా నాటకాలలో వేషాలు వేశావా ?" అని అడిగాడు.

"అబ్బే అటువంటిదేమీ లేదండీ . కానీ నేను ఇప్పటివరకు సుమారు 350 అన్ని పాత , కొత్త సినిమాలు చూసి ఉంటాను. అందులో నటించిన నటులందరి నటనను ఆకళింపు చేసుకున్నాను. వాళ్ళల్లో చాలా మంది నటుల గొంతులను కూడా అనుకరించగలను. ఈ అనుభవం చాలదంటారా చెప్పండి " అన్నాడు నారాయణ. అతనిలో ఆత్మవిశ్వాసం పాళ్ళు ఎక్కువగా కనిపిస్తోంది. ,

అతను చెప్పిన విషయాలు విని మా నాన్న తనలో తను నవ్వుకున్నాడు.

"సినిమాలు చూడటం వేరోయ్. కనీసం ఒక రెండు మూడు సినిమాలలోనైనా నటించిన అనుభవం లేకపోతే ఆ దరిదాపులకు కూడా ఎవరినీ రానియ్యరు. లేదంటే మనకు విపరీతంగా డబ్బు , ఆస్తులు కలవాళ్లం అయ్యుండాలి. అప్పుడు మనమే నిర్మాతలం, మనమే హీరోలం... అనిపించుకోవచ్చు . అయితే మీ ఆర్ధిక పరిస్తితి నాకు తెలియదు. మీకు అంత శక్తి ఉంటే నీ నిర్ణయంలో తప్పేమీ లేదు " అన్నారు మా నాన్న చిరునవ్వే సమాధానంగా. .

నేను ఒకరోజు నారాయణ తో పాటు వాళ్ళ ఇంటికి వెళ్ళాను. వాళ్ళ తల్లిదండ్రులు నన్ను ఎంతగానో ఆదరించారు. చూస్తుంటే వాళ్లు పెద్దగా ఉన్నవాళ్లు కాదు. ఆయన ఎక్కడో పత్రిక ఆఫీసులో పనిచేస్తున్నట్టు తెలిసింది. పెద్ద కుటుంబం. నారాయణ ఆ ఇంట్లో అందరికన్నా పెద్దవాడు. అతను ఎంతో కొంత సంపాదించి కుటుంబానికి ఉపయోగపడతాడని చూశాం కానీ ఇలా ఏ పనీ లేకుండా ఊరుమీద పడి తిరుగుతాడని అనుకోలేదు " అన్నాడు ఆయన మాటల మధ్యలో నారాయణ గురించి అసంతృప్తిని వ్యక్తపరుస్తూ.

మేమంతా చదువుకొని ఉండటం వల్ల మాతో స్నేహం చేస్తే నారాయణ కూడా బాగుపడతాడని వాళ్ళు ఆశపడ్డారుట. అయితే అంతలోనే చదువు పూర్తి చేసుకుని మా అన్నయ్యలు ఉద్యోగాల పేరుమీదట వేరే ఊళ్ళకు వెళ్ళి పోవడంతో వాళ్ళకు నిరాశే ఎదురయ్యింది.

"బాబు మీ నాన్నగారు అధ్యాపకుడిగా ఉన్నారు కదా. ఆయన కానీ తల్చుకుంటే మా వాడిని ఎలాగో అలాగా ప్రైవేట్ గానైనా బియ్యే అయినా పూర్తి చేయిస్తే వాళ్ళ కాళ్ళు , వీళ్ళ కాళ్ళు పట్టుకుని నేను పని చేస్తున్న పత్రిక ఆఫీసులోనే ఏదో ఒక ఉద్యోగం ఇప్పించడానికి ప్రయత్నం చేస్తాను. ఒకసారి వచ్చి మీ నాన్నగారిని ఓసారి కలవాలనుకుంటున్నాను.ఆయనకు ఎప్పుడు వీలవుతుందో కాస్త కనుక్కుని చెపుతావా ? " అన్నాడు ఆయన నాతో ఆశాభావంతో.

"లేదు అంకుల్.అదీ అయ్యింది. మా నాన్నగారు ఆ విషయాన్ని గురించే నారాయణను కదిపి చూశారు. ఆయన మోహమ్మీదే మీ అబ్బాయి తనకు చదువు మీద ఏ మాత్రమూ ఇంట్రెస్ట్ లేదని చెప్పేసాడు. మీరు ప్రత్యేకంగా వచ్చి ఇంకా చేసేది ఏమీ లేదు. సహాయం ఏదైనా చేయాలని చూస్తే సినిమాలలో అవకాశం వచ్చేటట్టు చూడమంటున్నాడు. మా నాన్న స్టూడెంట్ రామనాధం అనే ఒకతను ఇప్పుడు సినిమాల్లో విలన్ వేషాలు వేస్తున్నాడు. అతని వల్ల ఏమైనా ఉపయోగం ఉంటుందేమో ఒకసారి మీరు మా నాన్న గారిని అడిగి చూడండి . అదృష్టం బాగుంటే ఏమైనా అవకాశం దొరకొచ్చు " అంటూ నారాయణ వాళ్ళ నాన్నకు ఒక క్లూ ఇచ్చాను. .

నారాయణ ఏ విధంగానూ సినిమాలలో నెగ్గుకు రాలేడు అని మా నాన్న నమ్మకం. అతను ఏమంత అందగాడు కాదు. పైగా పెర్సనాలిటీ లేదు. బక్క పీచుగా ఉంటాడు. పోనీ ఏ జానపద సినిమాలలో హీరోకి అనుచరుడు వేషం వేసినా ఆ సంపాదన ఒక్క పూట భోజనానికి సరిపోదు . అనుకున్నట్టుగా నారాయణ వాళ్ళ నాన్న ఆ రోజు పనిగట్టుకుని మా నాన్న గారిని కలిసి మనసులోని ఉద్దేశ్యాన్ని బయట పెట్టాడు.

ఆఖరికి నారాయణ తండ్రి కూడా కొడుకును సినిమాలలో పెట్టడానికి ఫిక్స్ అయిపోయాడని తెలిసి చేసేది ఏమీ లేక ఒకనాటి ఆయన స్టూడెంట్ రామనాధం ఫోన్ నెంబర్ తెలుసుకుని అతనితో ఉన్న విషయం చెప్పాడు.

"మాస్టారు. ఇప్పుడు సినిమా ఫీల్డ్ చాలా క్లిష్టతరంగా ఉంది. ఇక్కడ బ్రతకాలంటే ఎన్నో డక్కామొక్కీలు తినాలి. ఈ ఫీల్డ్ లో ఉన్న వాళ్ళు చాలామంది నిలదొక్కుకోలేక ఆకలి చావులు చచ్చారు. నాకే ప్రస్తుతం అవకాశాల కోసం వెతుక్కునే పరిస్తితి వచ్చింది. మీ ఇష్టం. నా దగ్గరకు పంపిస్తే పంపండి. కానీ నేను అతని పూర్తి బాధ్యతను తీసుకోలేను. అవసరమైతే లైట్ బాయిగానో, భోజనాలు సప్లయ్ చేసే హెల్పర్ గానో కూడా పనిచేయడానికి సిద్దపడిపోవాలి. అదృష్టం బాగుంటే వాళ్ళను, వీళ్ళను పరిచయం చేసుకుని తనకేదేనా టాలెంట్ ఉంటే చిన్న చిన్న వేషాలు వేసి మెల్ల మెల్లగా పైకి ఎగబాకాలి . ఇవన్నీ ముందు అతనితో ఇక్కడ ఉన్న ఇబ్బందులు కూడా ఒకటికి పదిసార్లు చెప్పి అప్పుడు నిర్ణయించుకోమనండి. సాధ్యమైనంతవరకు అతన్ని బాగా డిస్కరేజ్ చేయండి ..." అంటూ రామనాధం ఒకరకంగా నారాయణ రావడం ఇష్టం లేనట్టుగానే సూత్ర ప్రాయంగా చెప్పాలనుకున్నది చెప్పేశాడు.

సినిమా నటుడు రామనాధం , మా నాన్నగారి మధ్య జరిగిన సంభాషణను ఏ మాత్రమూ దాచుకోకుండా నారాయణకు చెప్పడం అతను మొండిగా "మాస్టారు ! మీరు ఏమీ అనుకోకుండా అతని ఫోన్ నెంబర్, చిన్న లెటర్ వ్రాసి ఇవ్వండి మిగతాది నేను చూసుకుంటాను " అంటూ పీకల మీద కూర్చుని పట్టుదలతో తను సాధించాలనుకున్నది సాధించి ఒక రోజు ఆ వూరు విడిచాడు.

ఇది జరిగి చాలా కాలం అయిపోయింది. నారాయణ ఎక్కడున్నాడో ఎవరికీ తెలియదు. ఏం చేస్తున్నాడో తెలియదు. మా నాన్న కూడా వేరే బాధ్యతలతో ఆ విషయం పట్టించుకోవడం మానేశాడు. నేను కూడా ఉద్యోగం రావడం వల్ల చాలా దూర ప్రాంతం వెళ్ళి పోవడం వల్ల నారాయణ నా మనసులోంచి కూడా మెల్లమెల్లగా తొలగిపోయాడు.

కొన్నాళ్ళ తర్వాత నేను ఏదో పనిమీద నేను పుట్టి పెరిగిన ఊరుకు వెళ్ళాను. ఆ తర్వాత ఆచూకీ చేస్తే నారాయణ తల్లి తండ్రులు కూడా చాలా కాలం క్రితం ఆ వూరు విడిచి వెళ్లిపోయారని, ఇప్పుడు ఎక్కడున్నారో కూడా తెలియదని చెప్పడంతో ఎందుకో అసంకల్పితంగా పాత రోజులు గుర్తొచ్చి మనస్సు చివుక్కుమంది.

మా నాన్న స్టూడెంట్ రామనాధం కూడా ఇప్పుడు లేడని అనారోగ్యంతో కాలం చేశాడని పేపర్లో వచ్చింది. దానితో నారాయణ విషయం చెప్పే వాళ్ళు కూడా లేరు.

ఆ రోజు ఏదో షూటింగ్ నేను పని చేస్తున్న ఊళ్ళో జరుగుతూంటే అనుకోకుండా నా కొలీగ్స్ ప్రోత్సాహంతో నేను కూడా వెళ్ళాను. అక్కడ నారాయణను చూసి చెప్పలేనంత ఆశ్చర్యం వేసింది. ఇప్పుడు అతను ఎన్నో చిన్నా చితకా వేషాలు వేసి ప్రస్తుతం సహ దర్శకుడిగా చాలా చిత్రాలకు పని చేస్తున్నట్టు చెప్పాడు. ఇంకో ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే ఇప్పుడు అతని ముసలి తల్లి తండ్రులు అతనితోనే ఉన్నారుట. మొదటినుండి నారాయణ పట్టుదలకు ఒక ముగింపు దొరికినందుకు నాకు చాలా ఆనందమేసింది. అవును మరి . కుడి చెయ్యి పనిచెయ్యకపోతే ఎడమ చెయ్యికి బలం రెండింతలు ఎక్కువవుతుంది. చదువు అంటక సినిమాల పిచ్చిలో చెడిపోతాడనని మేమూ, మాతో పాటు నారాయణ తల్లి తండ్రులు అనుకున్నది "అది నిజం కాదు ..అదృష్టం కలిసి వస్తే మనిషి సాధించలేనిది ఏమీ లేదు" అని నారాయణ నిరూపించడమే కాకుండా వీడు ఎందుకూ పనికిరాడు అనుకున్న అతని తల్లి తండ్రులకు అతనే ఆధారమయ్యాడు.కొన్ని జీవితాలు ముందుగానే రూపకల్పన చెయ్యబడతాయని చెప్పడానికి నారాయణ ఒక ఉదాహరణ *******

సమాప్తం

మరిన్ని కథలు

Panipilla
పనిపిల్ల (క్రైమ్ కథ)
- చెన్నూరి సుదర్శన్
Bhavaateetam
భావాతీతం
- DODDIPATLA KALYAN KISHORE
Prema falam
ప్రేమ ఫలం
- పి. రాజేంద్రప్రసాద్
Neethone nenunta
నీతోనే నేనుంటా
- కాశీవిశ్వనాధం పట్రాయుడు
Amlet damlet
ఆంమ్లేట్ - డాంమ్లేట్ .
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
REkkala kastam
రెక్కల కష్టం
- వరలక్ష్మి నున్న