" నువ్వు పెద్ద తోపు వి రా " "ఛ ఛ ఏమిటి ఇలాంటి మాటలు వచేస్తున్నాయి. షార్ట్ ఫిలిమ్స్ ఎక్కువ చూస్తూ ఉంటే ఇదే ఫలితం" అనుకున్నాడు ఆనంద్ అద్దం లో తన అందాన్ని తాను చూసుకుని మురిసి పోతూ. ఎవరూ లేనప్పుడు తనలో తాను పైకి మాట్లాడు కోవటం అతనికి అలవాటు. ఎవరి మటుకు వాళ్ళకి అద్దంలో చూసుకుంటున్నప్పుడు, చాలా అందమయిన వ్యక్తిని చూస్తూన్న అనుభూతి కలగడం మామూలే అయినా, ఆనంద్ నిజంగా చాలా అందం గా ఉంటాడు. ఎంత అంటే సులోచనారాణి నవలా హీరో అంత అని చెప్పినా, ఊహ కి రావడానికి, పెళ్లిచేసిచూడు, పాతాళ భైరవి, మిస్సమ్మ, దాకా ఎన్ టి రామారావు అంత అని చెప్ప వచ్చు.
అద్దం లో మళ్ళి ఒక మాటు చూసుకుని, ఎడమ పక్కన మీసం కొద్దిగా తేడా ఉంటే కత్తెర తో చిన్న గా సవరించి, క్రాఫింగ్ మళ్ళీ చూసుకుని, సినిమా లలో శోభన్ బాబు లాగ రెండు వెంట్రుకలు లాగి నుదుటి మీద కి రౌండ్ తిప్పాలా వద్దా అన్న సంధిగ్ధం లో ఉండగా " ఆ అమ్మాయి కాఫీ షాప్ కి వచ్చి వెయిట్ చేస్తూ ఉంటుందేమో. ఎంత సేపురా ఆ మేకప్? త్వరగా వెళ్ళు " అన్న తల్లి భారతి గారి మాటలతో , ఫినిషింగ్ టచ్ ఇంకేమైనా ఇవ్వాలా అని మళ్ళీ అద్దం లో ఒక మాటు చూసుకున్నాడు.
"ఇదుగో వేడుతున్నా " అని లేచి కారు తీసి బయలు దేరాడు. చూడ బోయే అమ్మాయి ఫోటో ముందే చూసినా, అతని అనుభవం లో, ఫొటోలో అమ్మాయికి అసలు అమ్మాయికి చాలా తేడా ఉండడం గత అనుభవం. పెళ్లి ఫోటోలు తీయడం లో నిష్ణాతుడయిన ఒక ఫోటో గ్రాఫర్, ఎలాంటి అమ్మాయి ని అయినా అందంగా చూపించే టెక్నీక్ కనిపెట్టాడు. ఇది తెలిసి కొంత మంది, ఆ ఫోటో గ్రాఫర్ ఫోటో లు కాకుండా వేరే పంప మని అడగడం మామూలు అయింది. అనంద్ కూడా అదే జాగ్రత్త పడ్డాడు. డ్రైవ్ చేస్తున్నా అతని ఆలోచనలు చిన్న తనం లోకి వెళ్లి పోయాయి.
****
ఆనంద్, చాలా అంద గాడు అన్న విషయం మిగతా వాళ్ళు అందరు గుర్తించినా, తాను అందంగా ఉంటాను అన్న విషయం అతనికి పన్నెండేళ్లు దాటే దాకా తెలియదు. హై స్కూల్ లో చేరక ముందు ఒక ప్రైవేట్ స్కూల్ లో చదివి నప్పుడు శ్రీలక్ష్మి, అనంద్ చెల్లెలు సంధ్య క్లాస్మెట్ అయితే, ఆమె అక్క వరలక్ష్మి అనంద్ క్లాస్ లో చదివేది. వరలక్ష్మి, సంధ్య ఇద్దరు మంచి స్నేహితులు అయ్యారు. ఇద్దరు సంధ్య ని కలవడానికి తరుచు అనంద్ ఇంటికి వచ్చేవారు. ఆ ఇద్దరినీ అనంద్ పెద్దగా పట్టించు కునేవాడు కాదు. ఒకటి రెండు మాట్లు, ఎవరు లేనప్పుడు వర లక్ష్మి, అనంద్ కి, చాక్లెట్ ఒక మాటు , సెంట్ వాసన తో ఉన్న రంగు సుద్ద ముక్కలు ఇంకో మాటు ఇవ్వ బోతే అసంకల్పితం గా అవి తీసుకో లేదు. " తాను ఉన్నంత సేపు నిన్ను చూడడం తో టే సరపోతుంది " అని ఒక మాటు సంధ్య, వరలక్ష్మి గురించి అన్న మాటల వల్ల అతనికి తన అందం గురించిన స్పృహ మొదటి సారి కలిగింది. అయితే సంధ్య ఇంకోమాటు చెప్పిన విషయం అతనికి పెద్ద షాక్. "నువ్వు వరలక్ష్మి ఏమి ఇచ్చినా తీసుకో లేదట కదా? " ఏమో నాకు గుర్తు లేదు " అన్నాడు అనంద్. ఆది నిజం కాదని తెలిసినా " మేమిస్తే ఎందుకు తీసుకుంటాడు? కమిషనర్ గారి అమ్మాయిలు ఇస్తే తీసుకుంటాడు కానీ " అని వర లక్ష్మి అంది అని సంధ్య చెప్ప గానే ఆనంద్ షాక్ తిన్నాడు. తన మనసు లోలోపల ఉన్న రహస్యాలు వరలక్ష్మి కి ఎలా తెలిసాయి? అంటే తనని చాలా నిసితం గా గమనిస్తోంది అన్న మాట. చాలా మాట్లు, వరలక్ష్మి, శ్రీ లక్ష్మి, అక్క చెల్లెళ్ళు ఇద్దరు సంధ్య ని కలవ డానికి వచ్చినప్పుడు తాను అరుగు మీద నుంచోవడం గుర్తు కు వచ్చింది. అతను అక్కడ ఎందుకు నుంచుంటున్నాడు అన్నది అతనకే తెలుసు. కొద్ది నెలల క్రితం కొత్త గా ట్రాన్స్ఫర్ మీద ఆ ఊరు వచ్చిన మునిసిపల్ కమిషనర్ గారు, అనంద్ వాళ్ల ఇంటికి దగ్గర లోనే ఒక ఇంట్లో దిగడం, ఆయన ఇద్దరు కూతుళ్లు, అనంద్ ఇంటి మీదుగా రోజూ సాయంత్రం దగ్గర లోనే ఉన్న గణపతి మాస్టారు ఇంటికి ట్యూషన్ కి వెళ్లడం గమనించాడు. అతని కి తెలియకుండానే, ఇద్దరు అక్కా చెల్లెళ్ళ లో చిన్న అమ్మాయి సునంద అంటే అతనికి ఇష్టం కలగడం జరిగి, రోజూ వాళ్ళు వచ్చే టైం కి అరుగు మీద నుంచుని వాళ్ళ ని చూడడం జరుగుతోంది. పెద్దమ్మాయి రమణి తల ఎత్తేది కాదు కానీ, సునంద ఒక్క మాటు అనంద్ కేసి కుతూహలం గా చూసి తల తిప్పుకునేది. ఆ చూపు కోసం అతను రోజూ అక్కడ నుంచోవడం ఇంకెవరు గమనించ లేదు అనుకున్నాడు. తన కి వాళ్ళ మీద ఆసక్తి ఎక్కడో మనసులోనే ఉన్న విషయం అయినా, వరలక్మి అది పసి గట్టేయడం అతనికి చాలా ఆశ్చర్యం వేసింది. అడ పిల్లలు ఎంత గమనిస్తారో అప్పుడు తెలిసింది అతనికి. . కమిషనర్ గారు ట్రాన్ఫర్ అయి వెళ్లి పోయి సునంద జ్ఞాపకాల మరుగున పడి పోయినా, తన అందానికి సరిపోయే అమ్మాయి సునంద కంటే అందం గా ఉండే ఆమ్మా యే నని మనసు లో పడి పోయింది. తన భార్య ని చూసి, తన మీద జాలి పడే కంటే, ఈర్ష్య పడే అంత అందం గా ఉండాలని మనసులో నాటుకుంది. మంచి ఉద్యోగం లో సెటిల్ అయి నాలుగేళ్లు అవుతున్నా పెళ్లి లేట్ అవడానికి ముఖ్య కారణం, సునంద బెంచ్ మార్క్ దాటి న అమ్మాయి తారస పడక పోవడమే. తల్లి ఎంత పోరుతున్నా తన మనసు కు అన్ని విధాలా నచ్చే అమ్మాయి కోసం ఎదురు చూస్తూనే ఉన్నాడు. ఇంత వరకు తాను కాదన్నవాళ్ళే కానీ తనని కాదన్న అమ్మాయిలు తారస పడక పోవడం, తన అందం మీద అతనకి ఉన్న అభిప్రాయం ఇంకా బలపడటం జరిగింది. అతని పిన తల్లి కొడుకు జగన్ విషయం లో చాలా మంది అమ్మాయిలు అతనిని వద్దనడం అనంద్ చూస్తూనే ఉన్నాడు.తనకి ఆలా జరగడం అసంభవం అనుకున్నాడు. ఆవేళ ఎప్పటి లాగే ఇంటికి వచ్చి టిఫిన్ తింటూ ఉంటే తల్లి వచ్చి "దుర్గ పిన్ని ఒక సంబంధం చెప్పిందిరా. వాళ్ళ జగన్ కి జాతకాలు నప్ప లేదుట మీ ఆనంద్ కి సరిపోతుంది " అని వివరాలు చెప్పింది. ఇదిగో ఈ నెంబర్ కి ఫోన్ చేసి మాట్లాడు అని ఫోన్ నెంబర్ ఇచ్చింది. " ఆ అమ్మాయి నీతో మాట్లాడిన తరువాతే కలుస్తుంది ట. " అంది వంట ఇంట్లోకి వెళ్లి పోతూ. " జాతకాలు నప్పడం కాదు, జగన్ గాడు ఆఅమ్మాయికి నచ్చి ఉండడు " అనుకున్నాడు మనసులో. "చూద్దాం ఈవిడ ఎలా ఉంటుందో" అనుకుంటూ తల్లి ఇచ్చిన నెంబర్ కాల్ చేశాడు. అవతల గొంతు బట్టి అమ్మాయి తండ్రి కాబోలు అనుకున్నాడు. " నేను జగన్నాధరావు గారి అబ్బాయి నండి" అని చెప్ప గానే, ఆయన ఒక్క క్షణం గుర్తు పట్ట నట్టు అనిపించి, వెంటనే " ఓ! నువ్వా బాబు, అమ్మాయి కి ఇస్తాను అని ఫోన్ వాళ్ళ అమ్మాయికి కాబోలు ఇచ్చాడు. ఆయన గొంతులో సంస్కారం, ఆప్యాయత రెండు కల గలిసి ఉన్నట్టు అనిపించింది అనంద్ కి. " హలో, కాళింది అండి " తండ్రి ఎవరు ఫోన్ చేశారో సంజ్ఞ చేసి చెప్పినట్టున్నాడు, వెంటనే సబ్జెక్టు లోకి వచ్చింది. " మీరు ఫోన్ చేస్తారని దుర్గ ఆంటీ చెప్పారు"అంది " ఫార్మల్ పెళ్లి చూపులు కంటే, ఇద్దరం కలిసి ఎక్కడయినా ముందు మాట్లాడుకుంటే బాగుంటుందని అన్నారట కదా " అన్నాడు " ఆలా ఏమీ లేదండి మీ పేరెంట్స్ తో మా ఇంటికి వచ్చినా సంతోషమే " ఆమె ఆ మాటలు అన్న పధ్ధతి కి మనసు లో చాలా సంతోషించాడు. " లేదండి ముందు మనం మాట్లాడుకుని తరువాత పెద్ద వాళ్ళని కలుపుదాం. ఎక్కడ?ఎప్పుడు కలుద్దామో చెప్పండి. మీకు ప్రిఫెరెన్సు ఏమైనా ఉందా నేను చెప్పనా? " అన్నాడు. " మీరు టైం, ప్లేస్ చెప్పండి" అంది కాళింది. " హిమాయత్ నగర్ లో వుడ్ ల్యాండ్స్ అని ఉంది. ఆది మీకు దగ్గర గానే ఉంటుంది కాబట్టి సులువు అవుతుంది " అన్నాడు. ఎప్పుడు కలవాలో నిర్ణయించు కున్నారు. ***** ఇది జరిగి రెండు రోజులయింది.ఇవాళ అనుకున్న సమయానికి వుడ్ ల్యాండ్స్ కి బయలు దేరాడు. హోటల్ దగ్గర పడుతున్న కొద్దీ అతని ఆలోచన ఒకటే. ఫోటో లో ఉన్నట్టే ఉంటుందా లేక నిరుతస్సాహ పరుస్తుందా అని అతనికి లోపల పీకుతోంది. దానికి కారణం లేక పోలేదు. గతం లో ఫోటో లో చాలా అందం గా కనపడ్డ వాళ్ళు తీరా ప్రత్యేక్షం గా చూస్తే ఫోటోగ్రాఫి స్కిల్ ఎంత మోసం చేయ గలదో అర్థం అయి ఆశ్చర్య పోవలిసి వచ్చింది. అదుచేత ఇప్పుడు హోటల్ దగ్గర అవుతున్న కొద్దీ అతని ఉత్కంఠ పెరిగింది. కారు పార్క్ చేసుకుని హోటల్ లో ప్రవేశించి గ్రౌండ్ ఫ్లోర్ లో ఉన్న రిస్టోరాంట్ ప్రవేశం ఇవతల సోఫా ఉంటే అందులో కూర్చున్నాడు. రిస్టోరాంట్ లో చాలా మందే ఉన్నట్టున్నారు. ఆమె వచ్చిన తరువాత, ముందుగా అనుకున్నట్టు మేడ మీద ఉన్న ఏసీ హాల్ లో కి వెడదామని ప్లాన్. అనుకున్న టైం దాటి పావు గంట అయినా కాళింది రాలేదు. ఇంకాసేపు చూసి కాల్ చేద్దాం అనుకుంటూ ఉండగా మెరుపు తీగ లాగ లేత ఆకుపచ్చ రంగు చీర లో గుమ్మం ముందు ప్రత్యక్ష మయింది. అదే మొదటి సారి కాబట్టి ఒక్క క్షణం పట్టింది గుర్తు పట్ట డానికి. దగ్గరికి వచ్చి చిరునవ్వు తో విష్ చేసింది. ఆనంద్ తేరుకుని, అతను కూడా విష్ చేసి పైకి వెడదామా అని మేడ మీదకి దారి తీశాడు. లాంజ్ లో ఉన్న కొద్ధి మందీ , కింద హాలు లో టేబుల్స్ దగ్గర ఉన్నవాళ్లు కాళింది ని ఆశ్చర్యం గా చూడటం గమనించాడు. ఇంచు మించు అతనిని ఎవరు పట్టించు కోలేదు. తన భార్య పట్ల ఇతరులు నుంచి ఎలాంటి స్పందన ఊహించు కున్నాడో ఆది అప్పుడే కొద్దిగా అనుభవం లోకి వచ్చేసింది. అక్కడ మేడ మీద ఏసీ హాల్ లో పెద్ద గా జనం ఉండరు. ఉన్న పది,పదిహేను టేబుల్స్ లోను అయిదు ఆరు టేబుల్స్ వద్దనే కొంత మంది ఉన్నారు. కింద హాల్ లో లాగే, ఇక్కడ కూడా అందరు కాళింది ని చూడటం గమనించాడు. కొంచం వెనక గా కాళీ గా ఉన్న టేబుల్ దగ్గర కూర్చున్నారు. ఎదురు గా కూర్చున్న కాళింది ని మొదటి సారి గా పరిశీలన గా చూశాడు. ఇంత అందమయిన అమ్మాయి, ఇంతవరకు పెళ్లి అయిపోకుండా, తన దాకా రావడం అతనికి ఆశ్చర్యం కలిగింది. అటుగా వచ్చిన ఒకళ్లిద్దరు బేరర్లు కూడా కళ్ళు తిప్పుకుంటూనే ఆమెని గమనించడం చూశాడు. ఒకతను దగ్గరికి వచ్చి మెను కార్డు ఇస్తే, ఒక్క పది నిముషాలు టైం ఇవ్వండి అని చెప్పి కార్డు కాళింది కి ఇచ్చాడు. ఆమె మెను కార్డు చూస్తుంటే ఆమె కేసి మొదటి సారి పరిశీలన గా చూశాడు. ఫొటోలో కంటే చాలా ఎక్కువ అందం గా ఎ అమ్మాయేనా ఉండటం ఇదే చూడటం అతను. ఇంత అందమయిన అమ్మాయి తనని ఒప్పుకుంటుందా అని ఒక్క క్షణం అనిపించినా తాను కూడా ఏమీ తక్కువ కాదన్నది మనసు లో మెదలి స్థిమిత పడ్డాడు. "ఒక మాటు మెను చూసి, మీరే ఏవైనా లైట్ గా ఆర్డర్ చేయండి" అంది ఆర్డర్ ప్రధానం కాదన్నట్టు అతని కళ్ళ ల్లోకి చూస్తూ. ఆమె కళ్ల అందం చూసి ఇంకోమాటు ఆశ్చర్య పోయాడు. అతని చెల్లెలు సంధ్య ఎప్పుడూ, ఏదో మామూలు గా పౌడర్ రాసుకుని, కాటుక, బొట్టు పెట్టుకోవడం కన్నా ఎక్కువ మేకప్ చేసుకోవడం చూడ లేదు. కానీ కాళింది లో అతను ఒక ప్రత్యేకత గుర్తించాడు. ఆది ఆమె మేకప్ చేసుకున్న విధానం. కొట్టొచ్చే లా లేక పోయినా లైట్ గా లిప్స్టిక్ వేసుకుందని గమనించాడు. నిశ్చయం గా ఆమె మేకప్ లో , ఇదీ అని ప్రత్యేకంగా ఏదీ చెప్ప లేక పోయినా ఆమె అందాన్ని మేకప్ ద్విగుణీ కృతం చేసిందని అతనికి అనిపించింది . బేరర్ వస్తే, ముందు గులాబ్ జాం స్వీట్, ఆ తరువాత ఐస్ క్రీం అని ఆర్డర్ చేశాడు. బేరర్ ఉన్న కొద్దీ సెపూ కాళిందిని చూస్తూనే ఉండటం అతను గమనించక పోలేదు. మెల్లి గా కబుర్ల లో పడి ఒకళ్ళ గురించి ఒకళ్ళు, చదువు, అభిరుచులు, హాబీలు, సినిమాలు అన్నీ ఒకటి తరువాత ఒకటి అన్నీ మాట్లాడు కున్నారు. మధ్య లో బేరర్ తెచ్చిన ఐటమ్స్ చాలా స్లో గా కానిచ్చారు. ఆమె తో మాట్లాడు తున్నంత సేపు, ఆమె ముఖం లో కనపడే ఒక రక మయిన గ్లో ని చూసి ఆశ్చర్య పోయాడు. ఆమెని తన పక్కన భార్యగా ఊహించు కుంటే ఒక అడుగు పొడుగు అయినట్టు ఫీల్ అయ్యాడు. మిగతా అన్ని విషయాలు మాట్లాడి, అడుగుదామా వద్దా అని తట పటాయించి చివరికి అన్నాడు. " మా ఇల్లు విశాలం గానే ఉంటుంది. మా అమ్మ నాన్న లతో కలిసి ఉండడానికి మీకు అభ్యంతరం ఉండదు అనుకుంటా " అన్నాడు. " ఆలా ఎందుకు అడిగారు? మా అన్నయ్య, వదిన మాతోటే ఉంటారు " ఆది చాలా చిన్న విషయం అన్నట్టు. బిల్లు తీసుకొని వచ్చినప్పుడు, కార్డు తిరిగి తెచ్చినప్పుడు బేరర్ కళ్ళు తిప్పుకోకుండా కాళింది ని చూడడం, అనంద్ దృష్టిని తప్పించు కోలేదు. ****** ఇరు కుటుంబాలు కలిసి మాట్లాడుకోవడం, ఎంగేజ్మెంట్ ఫంక్షన్, తరువాత పెళ్లి, అనుకుకున్న ట్టు గా వరస గా జరిగి పోయాయి. ఎంగేజ్మెంట్ సమయం లోను, పెళ్లి లోను, బంధువులు, మిత్రులు అందరిదీ ఒకటే అభిప్రాయం. ఈడు జోడు చాలా బాగుంది అని అందరూ అనడం తో భారతి గారు ఎన్నిమాట్లు ఇద్దరికీ కలిపి దిష్టి తీసిందో ఆమెకే తెలియదు. ఇక అనంద్ విషయం చెప్పనే అక్కరలేదు. సునంద కంటే అంద మయిన అమ్మాయినే చేసుకోవాలనే కోరిక తీరడం, మిత్రుల అభినందనలు అన్ని కలిపి అతన్ని క్లౌడ్ నైన్ ఎక్కించాయి. పెళ్లికి వచ్చిన, సంధ్య స్నేహితురాలు వరలక్ష్మీ " మొత్తానికి కమిషనర్ గారి అమ్మాయిలకంటే అంద మైన అమ్మాయినే మీ అన్నయ్య చేసుకున్నాడు" అని సంధ్య తో అనడం అతను ఆశించిన ఫైనల్ సర్టిఫికెషన్. **** అనంద్ ఇంట్లో గ్రౌండ్ ఫ్లోర్ లో రెండు బెడ్ రూంలు, ఫస్ట్ ఫ్లోర్ లో రెండు ఉన్నాయి. అక్కడ మాస్టర్ బెడ్ రూం లో తగినంత స్పేస్ తో ఒక డ్రెస్సింగ్ రూం కూడా ఉంది. కాళింది తన ముఖ్య మయిన సామాను అక్కడ పెట్టుకుంది. ఆమె వచ్చిన తర్వాత మరుసటి రోజు, కాళింది కింద వంట ఇంట్లో ఉండగా, ఆమె డ్రెస్సింగ్ రూం లో సెల్ మోగింది. ఆది తీసుకువెళ్లి ఆమెకి ఇద్దామని అక్కడికి వెళ్ళాడు. సెల్ తీసుకుని వెనక్కి వస్తూ డ్రెస్సింగ్ టేబుల్ చూసి స్టన్ అయిపోయాడు. అతను ఎప్పుడూ చూడని అనేక రకాల, పౌడర్లు, క్రీములు, చిన్న చిన్న బ్రష్ లు చూసి అతనికి మతి పోయింది. ఆమె ఇంట్లో ఉన్నప్పుడు పెద్ద మేకప్ లేక పోయినా ఆమె అందానికి వచ్చిన లోటు ఏమీ లేకపోయినా, మొదటి సారి కలిసినప్పుడు, ఆ తరువాత ఫంక్షన్స్ లోను మేకప్ ఆమె అందాన్ని ద్విగుణీకృతం చేసిదన్న దాంట్లో సందేహం లేక పోయినా, దాని వెనక ఇంత సరంజామా ఉన్న దన్న సంగతి అతని కి తెలియదు. అయితే ఆ తర్వాత కాలం లో జరిగిన కొన్ని సంఘటనలతో అందుమయిన భార్యను పొందాను అనే కేక్ మీద ఐసీంగ్ లాగ ఆమె వ్యక్తిత్వం లోని ప్రత్యేకతలు తెలిసి చాలా చాలా ఆనందించాడు. కాళింది కాపురానికి వచ్చిన నాలుగో రోజు ప్రొద్దుట, డ్రాయింగ్ రూం లో పేపర్ చదివి, మేడ మీదకి వెళ్ళ డానికి లేచాడు. దగ్గర లోనే కిచెన్ లోంచి తల్లి మాటలు వినపడ్డాయి " కాళిందీ ఈ ఉప్మా పట్టుకుని వెళ్లి వాడికి ఇయ్యి. ముందు ఆ ఆప్మా లో కొంచం పెద్ద గా ఉన్న మిరపకాయలు, కరివేపాకు ఏరి టీసేసి పక్కన పెట్టి ఇయ్యమ్మా . చిన్న చిన్న పచ్చిమిరపకాయలు ఉంచు పరవాలేదు " అంది ఆనంద్ త్వరగా పైకి వెళ్ళిపోయి బెడ్ రూం లో వెయిట్ చేస్తున్నాడు. తల్లి మాటలు కాళింది అమలు చేస్తుందా లేదా అన్న కుతూహలం అతనికి కలిగింది. కొద్ది సేపట్లో రెండు ప్లేట్లలో ఉప్మా తో కాళింది పైకి వచ్చింది. ఒకప్లేటు అక్కడ ఉన్న చిన్న టేబుల్ మీద పెట్టి, ఒక ప్లేటు అనంద్ చేతికి ఇచ్చి " నాకు కరివేపాకు, పెద్దపచ్చి మిరప కాయలు తీసేసి ఇవ్వండి. అవి ఉంటే చిరాకు నాకు " అంది అతని కేసి చిలిపి గా చూస్తూ. తల్లి మాటలు విన్నాడు కాబట్టి ఆమె చిలిపి తననానికి ముగ్ధుడయాడు. వెంటనే సీరియస్ గా ప్లేట్ చేతిలోకి తీసుకుని ఒక అయిదు నిముషాలు దృష్టి పెట్టి ఆ పని చేసి తిరిగి ప్లేట్ ఆమెకి ఇవ్వడానికి తల ఎత్తాడు. ఆమె తాను తెచ్చిన రెండో ప్లేట్ అతని చేతిలో పెట్టి " ఇప్పుడు తినండి " అంది తాను చేసిన పనే ఆమె చేసిందని ప్లేట్ చూస్తే అర్థం అయింది. ప్లేట్ లో పెద్ద పచ్చి మిరప కాయలు, కరివేపాకు ఒక పక్కకి తీసి పెట్టి ఉన్నాయి. ఇద్దరు ఒకళ్ళ ని ఒకళ్ళు చూసుకుంటూ టిఫిన్ పూర్తి చేశారు. ప్లేట్ లు తీసుకుని వెనక్కి వెడుతూ " ఇలా ఉండాలి మన దాంపత్యం " అంది నవ్వుతూ. మొట్ట మొదటి సారి గా ఆమె అందాన్ని ద్విగుణీకృతం చేసే ఆమె చలాకీతనం అతన్ని ఇంకో మేఘం పైకి ఎక్కించింది. ఆనంద్ తల్లి భారతి గారి మొక్కు తీర్చడం కోసం కుటుంబం అంతా తిరుపతి ప్రయాణం కట్టారు. పెళ్లికి వచ్చిన సంధ్య, భర్త రాఘవ కూడా వచ్చారు. ఎంత ముందు రిజర్వేషన్ చేసినా ఒకటి కూడా లోయర్ బెర్త్ దొరకక పోవడం తో, అనంద్ తండ్రి రామనాధం గారి గురించి కొంచం ఆందోళన పడ్డారు. అందరు ట్రైన్ ఎక్కారు. ట్రైన్ బయలు దేరిన తరువాత. "లోయర్ బెర్త్ ఎవరయినా ఇస్తారేమో" అంది భారతి గారు. కాళింది, ఇప్పుడే వస్తానని చెప్పి కంపార్ట్మెంట్ లోనే మిగతా కేబిన్స్ వైపు వెడితే, అనంద్, తన అవసరం ఉంటుందేమో నని వెనకే వెళ్ళాడు. అందరూ కాళింది ని, క్రీగంట కొందరు, కన్నార్ప కుండా కొందరు చూడడం గమనిస్తూనే ఉన్నాడు. ఒక మధ్య వయస్కుడుని ఎంచుకుని కాళింది అడగ్గానే అయన సంతోషం గా ఒప్పుకున్నాడు. ఆమె అడిగిన పద్ధతి, అవతలి స్పందన చూసి మొత్తం అందరికి లోయర్ బెర్తులు కావాలన్నా దొరుకుతయేమో అనిపించింది. అందమయిన యువతి అడిగితే కాదనే వాళ్ళు తక్కువ మంది ఉంటారేమో అనుకున్నాడు. మొత్తం వ్యవహారం లో కాళింది హుందా గా ప్రవర్తించిన తీరుకి అతను మనసు లోనే ఆనంద పడ్డాడు. ఆమె చాలాకీ తనం తో కూడిన చొరవ, రద్దీ హోటళ్ళ లో సీట్ దగ్గర నుంచి, తిరుపతి నుంచి ఫ్లైట్ క్యాన్సిల్ అయినప్పుడు ఇంకో ఫ్లయిట్ లో టికెట్స్ సంపాదించడం వరకు అనేక సందర్భాలలో ఉపయోగ పడటం అలవాటు అయిపోయింది. వెంకటేశ్వర స్వామి గర్భగుడి లో అందరినీ ఒక్క క్షణం కూడా నిలపడ నివ్వని పూజార్లు, వీళ్ళ కుటుంబాన్ని పక్కాగా ఎక్కువ సేపు నుంచో నివ్వడం ఆమే సాధించినదే అనుకోవడం లో సందేహం లేదు. వంద నోట్లు ఎమన్నా చేతులు మారాయా లేదా అని తరువాత అడగాలి అనుకున్నాడు. తిరుపతి నుంచి వచ్చిన తరువాత సంధ్య భర్తతో కలిసి దగ్గర లోనే ఉన్న అత్త్తారింటికి వెళ్ళింది. అనంద్, కాళింది ఇద్దరు సెలవు పెట్టి హానీ మూన్ కి కులూ మనాలి వెళ్లి వచ్చి ఎవరి ఉద్యోగాలు లో వాళ్ళు చేరి పోయారు. **** ఈడూ జోడూ అద్భుతం అని అందరు ఆనుకునే లా భార్య దొరకడం, అంతకు మించి బంగారానికి తావి అబ్బయినట్టు ఆమె వ్యక్తిత్వం లో ఔన్నత్యం అన్నీ ఉక్కిరి బిక్కిరి చేసినా అతనిలో ఒక భయం ప్రారంభం అయింది. ఎప్పుడు ప్రారంభం అయింది అన్నదాని కన్నా ఎందుకు ప్రారంభం అయిందో నన్నది ముఖ్యం. అతను సినిమాలు, చూడటం నవలలు చదవటం కొంచం ఎక్కువే. ఎప్పుడు సినిమా చూస్తున్నా, కథ లో విలన్ లేకుండా హీరో, హీరయియిన్ జీవితం ఆనందం గా డ్యూయెట్ లతో, హాస్యం తో నడుస్తున్న ప్పుడు భయం స్టార్ట్ అవుతుంది. ఎప్పుడో అప్పుడు కథలో కష్టాలు ప్రారంభం అవాలి కదా? అవి చివరికి తీరినా, అసలు కష్టాలు లేకుండా సినిమా తీయడు కదా? ఒక రకమయిన భయం తో కూడిన ఉత్కంఠ మొదలు అవుతుంది. ఇదిగో తన వైవాహిక జీవితం పట్ల అతనికి ఎందుకో అలాంటి భయం ప్రవేశించింది. అది ఒకరోజు అనుకోకుండా ప్రారంభం అయింది. ఆ వేళ సంధ్య వాళ్ళ అత్త్తారింటి నుంచి వచ్చింది. తనని పుట్టింట్లో కొన్నాళ్ళు ఉండి రమ్మని అనంద్ బావగారు రాఘవ వెళ్ళిపోయాడు. సంధ్య, కాళింది షాపింగ్ కి వెళ్ళ డానికి ప్రోగ్రాం వేసుకున్నారు. కింద డ్రాయింగ్ రూం లో అనంద్ పేపర్ చదువుతూ కూర్చున్నాడు. సంధ్య తయారయి వచ్చి కూర్చుని కాళింది కోసం వెయిట్ చేస్తోంది. అరగంట అయినా కాళింది కిందకి దిగి రాలేదు. గతం లో కూడా అతను గమనించాడు ఎక్కడికి వెళ్లాలన్నా కాళింది తయారయి కిందకి రావడం లేట్ చేస్తుంది. సంధ్య మూడో మాటు వాచీ చూసు కుంటూ ఉంటే అతనికి కోపం లోపల సుళ్ళు తిరుగు తోంది. కాళింది మెల్లిగా దిగి వచ్చింది. ఆమె ని చూడ గానే ఆ మేకప్ లో ఆమె అందం అతన్ని కట్టి పడేసింది. " ఎంత సేపు? తయారావడం? " అన్నాడు, అప్పటికే కోపం తగ్గినా, కొంచం విసుగు చూపిస్తూ. కాళింది నవ్వి ఊరుకుని " సారీ సంధ్యా రా వెడదాం " అని సంధ్య ని తీసుకుని వెళ్ళిపోయింది. వాళ్ళు వెళ్లిన తరవాత అతని ఆలోచనలు మేకప్ వల్ల ద్విగుణీ కృతమయిన కాళింది అందం మీదకి పోయాయి. తాను పక్కన ఉండగా ఆమె అందాన్ని ఇతరులు గుర్తించడం అతనికి ఆనందం కలిగించినా, ఇప్పుడు అతని ఆలోచనలు అదివరకు లేని కొత్త మార్గం లో వెళ్లాయి. ఆమె అందం తాను పక్కన లేకుండా మిగతా మగవాళ్ళకి కనువిందు చేయ బోతోంది అన్న ఆలోచన ఒక్క మాటుగా అతని లో ఒక నెగటివ్ ఫీలింగ్ ఆవరించు కుంది. ఏదో మామూలుగా సంసార పక్షంగా మేకప్ చేసుకుంటే ఎవరూ పట్టించు కొక పోవచ్చు. కాళింది చేసుకునే మేకప్ చాలా ప్రత్యేకంగా ఉండి అందరిని తల తిప్పి చూసేలా ఉంటుంది. డ్రాయింగ్ రూం లోంచి పైకి బెడ్ రూం లోకి వెళ్లి రొటీన్ గా చేసుకునే బ్యాంకు పనులు అవీ చేసు కోవడానికి లాప్టాప్ తెరిచినా దృష్టి నిలవ లేదు. చిన్న గా ప్రారంభం అయి అతని సమస్య మహా వృక్షం అయి కూర్చుంది. అసలు ఈ మేకప్ తగ్గించి సంధ్య వాళ్ళ లాగ సింపుల్ గా బయటికి వెళ్లొచ్చు కదా అని కాళింది కి చెబుదామా అన్న ఆలోచన వచ్చింది. కానీ ఆ ఒక్క విషయం లో తప్ప ఆమె ప్రవర్తన తన పట్ల, మిగతా కుటుంబ సభ్యుల పట్ల ఎంత సంస్కార వంతం గా వుంటుందో గుర్తుకు వచ్చి ఆమె మనసు నొప్పించేలా ఏమీ అనబుద్ది కాలేదు. సంధ్య, కాళింది తిరిగి వచ్చిన తరువాత ఆరోజు, ఆ తరువాత కొంత తమాయించు కున్నా లోలోపల పడుతున్న మధనం అతను అంతకు ముందు చేసుకున్న నిర్ణయాన్ని నిలప లేదు. సందర్భం వచ్చి నప్పుడు కాళింది తో ఆమె మేకప్ విషయం లో కొన్ని సూటీ పోటు మాటలు అనకుండా ఉండ లేక పోయాడు. ఆమె కొంచం ఆశ్చర్య పోయింది, ఎందుకు అనంద్ ఆలా అంటున్నాడా? అని. ఆమె కొంచం స్వతంత్ర భావాలు కలది కాబట్టి, తన మేకప్ విషయం లో ఆనంద్ జోక్యం ఆమె కి రుచించ క పోయినా, ఆమెది వివాదాలు కొనసాగించే స్వభావం కాదు కాబట్టి అతనే మారతాడని ఆశించి తన రొటీన్ లో పడి పోయింది. ** ఆ వేళ సంధ్య సినిమా కి వెడదామని అంటే, బుక్ చేసుకుని ముగ్గురు ఇనార్బిట్ మాల్ కి వెళ్లి డిన్నర్ చేసి సినిమా కి వెళ్లేలా ప్లాన్ చేసుకుని బయలు దేరారు. కాళింది ఏమీ తగ్గించ కుండా తన మామూలు మేకప్ చేసుకుంది గతం లో అయితే, కాళింది పక్కన ఉంటే, అందరూ ఆమె కేసి చూస్తున్నప్పుడు గర్వంగా ఫీలయిన వాడు ఈ మాటు లోలోపల రగిలి పోయాడు. డిన్నర్ అయిన తరువాత ఇంకా సినిమా కి టైం ఉంటే సంధ్య, కాళింది, మాల్ లో తిరిగి వస్తామని వెడితే, ఆనంద్ బుక్ స్టాల్ దగ్గర ఒక కుర్చీ లో కూర్చుని ఆలోచన ల లో పడ్డాడు. భార్య రూపవతి శత్రు అని ఎక్కడో చదివిన సంగతి గుర్తుకు వచ్చింది. అప్పుడు అర్థం అవనిది ఇప్పుడు కొంచం కొంచం అర్థం అవుతోంది. సంధ్య ఉండగానే ఒక మాటు " ఎందుకు ఈ మేకప్పులు? మొగాళ్ళ బుర్రలు పాడు చేసేలా? " అని కూడా అనడం తో అనంద్ ఈ విషయం ఎక్కువ ఆలోచిస్తున్నాడని సంధ్య గమనించింది. ఎవరో బురఖా వేసుకున్న యువతులు ఇద్దరు అతని ముందు నుంచి వెళ్లారు. వాళ్ళ ని చూసి, అది చాలా మంచి పధ్ధతి అనుకుని వాళ్ళ భర్తలు తన పడుతున్న మనో వేదన లాంటిది పడనక్కర లేకుండా భలేగా ఉందే అనుకున్నాడు. వాళ్లిద్దరూ సినిమా టైం కి తిరిగి వచ్చేదాకా అవే ఆలోచనల లో ఉన్నాడు. ***** రాఘవ కి ఆఫీస్ పని మీద జర్మనీ వెళ్లే పని పడటం తో, సంధ్య వెళ్లడం ముందుకు జరిగి హైదరాబాద్ లోనే ఉండి పోయింది. అనంద్ ప్రవర్తన లో మార్పు, సూటీ పోటీ మాటలు, కాళింది ని కూడా ఆందోళన పరిచింది. సంధ్య వెళ్లే రోజు దగ్గర పడేదాకా పెద్ద మార్పు లేకుండా రోజులు గడిచాయి. సంధ్య వెళ్లే రోజు రానే వచ్చింది. వెళ్లే ముందు తన ఫ్రెండ్ వరలక్ష్మి ఇంటికి వెళ్లి వద్దా మని అంటే కాళింది తయారవడానికి అద్దం ముందు నుంచుంది. ఎందుకో ఆమెకి పెద్ద గా మేకప్ చేసుకోవాలని అనిపించ లేదు. ఆనంద్ మాటలు గుర్తుకు రావడం కూడా కొంత కారణం. కానీ వరలక్ష్మి తన మేకప్ విధానానికి పెద్ద అడమైరర్ అని గుర్తుకు వచ్చి ఆలోచన లో పడింది. చిన్న గా అలికిడి అయితే వెనక్కి తిరిగి చూస్తే ఆనంద్ నవ్వుతూ నుంచున్నాడు. అతని చేతిలో చిన్న ప్యాకెట్ ఉంది. " ఏమిటి విశేషం అంది?" కొంచం ఆశ్చర్యం గా అతను గతం లో లాగా హుషారు గా చిలిపి గా నవ్వుతూ ఉంటే. " నిన్న ఒక ఫ్రెండ్, ఫ్యామిలీ తో షాపింగ్ లో కలిశాడు. అతని భార్య చెప్పింది. మార్కెట్ లోకి ఈ మేకప్ క్రీమ్ కొత్త గా వచ్చింది ట. పెద్ద గా గ్రీజీ గా లేకుండా చర్మానికి చాలా మేలు చేస్తుందట. చాలా ఖరీదు. నీకు తీసుకోవాలని అనిపించింది. ఇవాళే ట్రై చేయి అని చెప్పి, బుగ్గ మీద చిన్న చిటిక వేసి వెళ్లి పోయాడు. కాళింది కి ఆశ్చర్యం తో తెరుకోవడానికి కొద్ది గా సమయం పట్టింది. అయితే కాళింది కి తెలియనిది అంత క్రితం రోజు సంధ్య కి ఆనంద్ కి మధ్య జరిగిన సంభాషణ క్రితం రోజు సాయంత్రం సంధ్య, కాళింది దగ్గర లోనే ఉన్న సాయిబాబా గుడి కి వెడదామని అనుకున్నారు. అనంద్ డ్రాయింగ్ రూం లో ఉన్నాడు. సంధ్య, కాళింది కిందకి రావడానికి వెయిట్ చేస్తోంది. ఎప్పటి లాగే కాళింది మేకప్ వల్ల డిలే చేయడం మీద అనంద్ కామెంట్ చేశాడు. "గుళ్ళోకి కూడా అంత మేకప్ అవసరమా? అక్కడ అంతా ఆడవాళ్లేమో కదా? " అని అతను అనగానే " అన్నయ్యా ఆడవాళ్లు మేకప్ గానీ,నగలు చీరలు తో అలంకరణ కానీ ఎందుకు చేసుకుంటారు అనుకుంటున్నావు? " అడిగింది. " మగవాళ్ల ని ఆకర్షించ డానికి కాదా? " అంత కన్నా ఏముంటుంది అన్నట్టు. " పెళ్లి కి ముందు విషయం ఏమో కానీ పెళ్లయినఆడవాళ్లకు మాత్రం, పరాయి మగ వాళ్ళు దృష్టి లో ఉండరు. అలంకరణ కానీ, నగలు, చీరలు కానీ మిగతా ఆడవాళ్ళ దృష్టి లో పడడానికి మాత్రమే. ఇతర ఆడవాళ్లు అసూయ పడటానికో , అభిమానం పొందడానీకో ఏదయినా అవచ్చు కానీ మగవాళ్ళు వాళ్ళ దృష్టిలో ఉండరు. నువ్వు అనవసరం గా బుర్ర పాడు చేసుకుంటున్నావు " అంది నవ్వుతూ. అనంద్ కి ఒక్క మాటు వెయ్యి టన్నులు బరువు దించేసినట్టు ఫీలయి ఆనందం లో పడ్డాడు. ఎప్పటి లాగే అతను చూసే సినిమాల లో కధలు సుఖాంతం అవడం గుర్తుకు వచ్చింది. భార్య రూప వతి శత్రు అన్న వాక్యం లో శత్రు అన్నది ఇతర ఆడవాళ్ల దృష్టి లో నన్న మాట, అని నవ్వుకున్నాడు. సమాప్తం. .