శృంగవరం అనేగ్రామంలో రత్తమ్మ అనేవితంతువు, ఆఊరి షావుకారు ఇంట్లో పనిచేస్తుండేది.
సదానందుడు కాశీయాత్రకువెళుతూ,తన ఇరువురు శిష్యులతో విశ్రాంతికొరకు శృగవరం గ్రామదేవాలయ మడపంలో బసచేసి,రాత్రివేళలో ఆఊరిప్రజలకు పురాణా సంబంధిత విషయాలు తెలియజేస్తూ,అక్కడకు వచ్చేభక్తులు తీసుకువచ్చే పాలు,పండ్లు,ఇతర ఆహరపదార్ధాలు స్వీకరించేవాడు.
సదానందుడు ప్రతిరోజు పురాణ సంబంధిత విషయాలు చెపుతున్నాడని తెలుసుకున్న రత్తమ్మ ఏదో ఒకఫలహరం చేసుకువెళ్ళి అరటిఆకులో సదానందునికి సమర్పించి,ఆయనచెప్పే పురాణసంబంధిత విషయాలు ఆసక్తిగా వినసాగింది.
ప్రతిరోజు రాత్రితొమ్మిది గంటలకు ప్రారంభమైన సదానందుని ప్రవచన రాత్రి పొద్దుపోయేదాక సాగేది. రత్తమ్మకు ఉదయానే నిద్రలేచి షావుకారు ఇంట్లో పనికివెళ్ళడానికి కొంతఆలస్యం కాసాగింది.
అదిగమనించిన షావుకారు "రత్తమ్మా ఏమిటి ఎన్నడూలేనిది గతనాలుగు రోజులుగా ఆలస్యంగావస్తున్నావు? "అన్నాడు.
"అయ్యగారు మనఊరికి సదానందస్వామివారు వచ్చారు.కాశీకి కాలినడకన వెళుతూ విశ్రాంతికొరకు ఇక్కడ ఆగారు. ప్రతిరోజు రాత్రి పురాణ ప్రవచనంచేస్తున్నారు గతనాలుగురోజులుగా వారి ప్రవచనం వినడానికి వెళుతున్నా. ప్రవచనం బాగా పొద్దుపోయేవరకు సాగడంతో,నాకు నిద్ర చాలక ఆలస్యంగా వస్తున్నాను" అన్నది రత్తమ్మ.
" రత్తమ్మ సమయం వృధాచేసుకుంటున్నావు. చదువుకున్నమాకే ఆపురాణాలు అంతగా అర్ధంకావు చదువులేని నీవు ఎలా అర్ధం చేసుకుంటావు. ఏది గతనాలుగురోజులుగా నీవు విన్న పురాణ ప్రవచనాలలో కొన్నివివరించు" అన్నాడు షావుకారు.
మౌనంగా నిలబడింది రత్తమ్మ.
"ఇప్పటికైనా అర్ధమైఇందా? అవన్ని మాలాంటి వారేకే,మీకుకాదు. సరే ఆపేడతట్టలో బావిలోనీళ్ళు తోడి పసువుల కుడితితొట్టిలోపోయి "అన్నాడు షావుకారు.
"అయ్యగారు పేడతట్టలో నీళ్ళు ఎలానిలుస్తాయీ? "అన్నది రత్తమ్మ.
"నేను నీయజమానిని చెప్పినపని చెయి "అన్నాడు షావుకారు.
పలుమార్లు బావిలోనీళ్ళు తోడీ పెడతట్టలో పోసి కుడితితొట్టిదగ్గరకు వెళ్ళసాగింది రత్తమ్మ. "రత్తమ్మ ఇప్పటీకైనా అర్ధమైయిందా? పేడతట్టలో నీళ్ళు ఎలా నిలవవో మీలాంటి చదువురానివారి బుర్రలో పురాణ విషయాలు అలా నిలువవు "అన్నాడు షావుకారు.
"అయ్యగారు పేడతట్టలో నీళ్ళు నిలబడకపోయినా నీళ్ళుపోయడంవలన దానికిఉన్న పేడఅంతాశుభ్రంగాపోయి కొత్తతట్టలామారింది. మేము చదవలేకపోవచ్చు కాని విషయంవిని దానిలోమంచి,చెడు తెలుసుకోగలిగే శక్తి ప్రతివారిలోనూ ఉంటూంది. మీరు చేయించేపూజలలో పంతులుగారు చదివేమంత్రాలన్ని సంస్కృతంలో ఉంటాయి.ఒక్కటి మీకు అర్ధంకాదు అంతమాత్రాన ఆయన చదివే మంత్రాలు వ్యర్ధంకావుగా! మనంపెట్టే ప్రసాదం భగవంతుడు స్వీకరించడని మనకుతెలుసు కాని మనం ప్రసాదం పెట్టకుండా పూజచేయలేముగా,ఆప్రసాదం దేవుని పేరిట కొందరి ఆకలిని కొంతవరకైనా ఆపగలుగుతుంది. మొదటరాతలేనప్పుడు నోటితో చెప్పుకున్న కథలకు తరువాత రాతరూపం కలిగించారు అన్నది తమకు తెలియనిదికాదు. కథా,కవితా,పురాణం ఏదైనా చదువుకున్నవారికే అయితే మరి ఈలోకంఅంతా అందరికి ఎలాచేరింది? అందరు చదువుకున్నవారు కాదే! "అన్నది రత్తమ్మ.
"నిజమే విషయపరిజ్ఞానం కలిగిఉండటానికి విద్యకు సంబంధంలేదు. ఈరోజు నేను వస్తున్నాను,సదానందుని ప్రవచనం వినడానికి "అన్నాడు షావుకారు.