సమయస్ఫూర్తి - - బోగా పురుషోత్తం, తుంబూరు.

Samaya spoorthi
నారప్ప ఇంట్లో ఓ గాడిద, కుక్క ఉండేవి. నారప్పకు కుక్క అంటే ఎంతో మక్కువ. నిత్యం అతని ఇంటికి కాపలా కాస్తూ రక్షణ కల్పించేది. అతడిని కంటికి రెప్పలా కాపాడేది. ఈ కారణంగా కుక్కకు మంచి పుష్టికరమైన ఆహారం పెడుతూ ప్రేమతో పెంచుకున్నాడు.
గాదిదకు ఇది రుచించలేదు. రోజూ బండెడు బట్టలు మోస్తూ చాకిరి చేస్తే తనను పట్టించుకోవడం లేదని లోలోన కుమిలిపోయేది. సగం కడుపు కూడా నిండని ఆహారంతో దుఖి:స్తూ గడిపేది. తనను పట్టించుకోని యజమాని నారప్పపై ఓ కన్నేసింది. ఎప్పటికైనా తన కష్టం గుర్తించలేకపోతాడా? అని ఆలోచించసాగింది.
యజమానిపై మిక్కిలి ప్రేమకురిపించే కుక్కను అనుక్షణం గమనించ సాగింది.
ఓ రోజు తన యజమాని ఎక్కడి నుంచో యాభైవేల రూపాయల అప్పు తెచ్చి తన కూతురి పెళ్లికోసం అని దాచాడు. బిక్కుబిక్కుమంటూ లోపల పడుకున్నాడు నారప్ప. లోపల తన మంచం పక్కనే కుక్కను పడుకోబెట్టాడు. మంచు దట్టంగా కురుస్తూ చలిపెడుతోంది. ఆ చలిలోనే బయట ఓ చెట్టుకు గాడిదను కట్టేశాడు. గాడిదకు చలివేస్తుండడంతో నిద్ర పట్టక మెలుకువతో చుట్టూ చూడసాగింది.
ఆ పల్లెంతా గాఢ నిద్రలో వుంది.అప్పుడు అల్లంత దూరంలో కుక్కల అరుపులు వినిపిస్తున్నాయి. గాడిద అప్రమత్తమైంది.కొద్ది సేపటికి బూట్ల చప్పుడు వినిపించింది. లోపల గాఢ నిద్రలో వున్నారని గమనించిన దొంగ తలుపులు పగులగొట్టి లోనికెళ్లి పాత బీరువాలో భద్రంగా దాచిన యాభైవేలు రూపాయలతో పాటు నాల్గు సవర్ల బంగారం తీసుకుని దొంగ బయటకు నడిచాడు. నారప్ప భయంతో రక్షణ కోసం కుక్కవైపు చూశాడు. ఫలితం లేకుండా పోయింది. దాచుకున్న డబ్బు, నగలు దొంగల పాలైంది.నారప్పకు ఏమి చేయాలో దిక్కుతోచలేదు. జీవితకాలం కష్టించి సంపాయిందిన డబ్బు, నగలు దోచుకుపోతుంటే నిస్సహాయంగా దిక్కులు చూస్తుండి పోయాడు.
అదే సమయానికి గాడిద అప్రమత్తతతో దొంగకోసం ఎదురు చూడసాగింది. కొద్ది సేపటికి నోట్లకట్ట సంచితో ఆనందంతో బయటకు వచ్చిన దొంగ దగ్గరకు వెళ్లింది. గాడిద ఆలస్యం చెయ్యకుండా దొంగ వీపుపై వెనక కాళ్లతో బలంగా ఈడ్చి కొట్టింది. ఊహించని పరిణామానికి దొంగ గావుకేకపెట్టి కుప్పకూలాడు. చేతిలో సంచి కిందపడి నోట్ల కట్టలు చెల్లాచెదురయ్యాయి.
దాన్ని అందుకోవడానికి పైకి లేచేందుకు యత్నించాడు. నడుం విరిగి పైకి లేవలేక పోయాడు.
గాడిద బిగ్గరగా అరవడంతో చుట్టుపక్కల వున్న వాళ్లంతా అక్కడికి చేరుకుని పట్టుకుని పోలీసులకు అప్పగించారు.
నారప్ప తన కష్టార్జితం డబ్బు, నగలు దొరికినందుకు ఆనందించాడు. గాడిద సమయస్ఫూర్తి వల్లే తనకు మంచి జరిగిందని గ్రహించాడు.
అప్పటి దాకా తిండిపెట్టకుండా కష్టపెట్టి మానసిక క్షోభపెట్టినందుకు క్షమించమని గాడిదను కోరాడు నారప్ప.
బాగా తిండి పెట్టి ఆప్యాయంతో చూసుకున్న కుక్క సోమరితనంతో నిద్రపోయి తనకు కీడు చేసి విశ్వాసం కోల్పోయినందుకు నారప్ప ఆగ్రహంతో వెళ్లగొట్టాడు.
కోపం చూపి తిండి పెట్టక ఆకలితో మాడ్చినా ప్రతీకారం మాని సమయస్ఫూర్తితో ప్రత్యుపకారం చేసిన గాడిదను ఏ లోటూ లేకుండా కన్నబిడ్డలా చూసుకున్నాడు నారప్ప.

మరిన్ని కథలు

Panipilla
పనిపిల్ల (క్రైమ్ కథ)
- చెన్నూరి సుదర్శన్
Bhavaateetam
భావాతీతం
- DODDIPATLA KALYAN KISHORE
Prema falam
ప్రేమ ఫలం
- పి. రాజేంద్రప్రసాద్
Neethone nenunta
నీతోనే నేనుంటా
- కాశీవిశ్వనాధం పట్రాయుడు
Amlet damlet
ఆంమ్లేట్ - డాంమ్లేట్ .
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
REkkala kastam
రెక్కల కష్టం
- వరలక్ష్మి నున్న