తనఇంటి అరుగుపైన కథ వినడానికి చేరిన పిల్లలకు మిఠాయిలు పంచిన తాతగారు 'పిల్లలు కోపము,భయాన్ని ఎన్నడు మీదరికీ రానివ్వకండి. హైందవ సాంప్రదాయం ప్రకారం మనలోని 6 గుణాలు:1. కామం,2. క్రోధం,3. లోభం,4. మోహం,5. మదం,6. మత్సరం.వీటిని షడ్ గుణాలు అంటారు.మానవుడు ఈ షడ్గుణాలకు అతీతంగా జీవించాలని వాటి బలహీనతకి గురి కాకూడదని మనపెద్దలు చెపుతుంటారు.
షడ్గుణాలలో ఒకటైన క్రోధం అనగా కోపం లేదా ఆగ్రహం. మన మనసుకు నచ్చని లేదా మన అభిప్రాయాన్ని మరొకరు విమర్శించినా లేదా వ్యతిరేకించినా వారిపై మనకు కలిగే వ్యతిరేకానుభూతి లేదా ఉద్రేకాన్ని కోపంగా నిర్వచించవచ్చు. దీని పర్యవసానంగా ఎదుటివారిపై దాడిచేయటం, వారిని దూషించటం మొదలైన వికారాలకు లోనై తద్వారా వారి,, చూసేవారి దృష్టిలో మన స్థానాన్ని దిగజార్చుకోవడం జరుగుతుంది. అందుకే క్రోధం కలిగినప్పుడు ఆవేశానికి లోను కాకుండా మనకు మనం శాంతపర్చుకోవడం ఎంతైనా అవసరం.
శాంతము గలవారు ఎంతటి కష్టతరమైన కార్యాన్నిసాధించగలరు . శాంతమూర్తులు దయాదాక్ష్యణ్యాలు, జాలీ,సానుభూతి, సేవాభావం, ఉపకారబుధ్ధికలిగిఉంటారు."కోపమున ఘనత కొంచమైపోవును "అన్నాడు వేమన."తనకోపమెతనశత్రువు-తనశాంతమె తనకురక్ష" అంటాడు సుమతిశతక కర్త."శాంతమూ లేక సౌఖ్యములేదు"అంటారు త్యాగయ్య.కలహం,కలత-కల్లోలం-దౌర్జన్యం-భయం-దురాశ- ఇవన్ని మనిషికి నెమ్మదిలేకుండాచేస్తాయి.నిరాశ,నిస్పుహ,ఆవహింపబడి నరకప్రాయమైన జీవితం లభిస్తుంది.శాంతమూర్తిఅయినవారు సమాజపరంగా ఎంతోగౌరవింపబడతారు. మౌనం చాలాగొప్పది.పెద్దలఎదుట తక్కువమాట్లాడాలి ఎక్కువవినాలి.
కృషితో నాస్తి దుర్భిక్షం, జపతో నాస్తి పాతకమ్, మౌనేన కలహో నాస్తి, నాస్తి జాగరతో భయమ్. మౌనం అనగా వాక్కుని నియంత్రించడం; లేదా మాటలాడడం తగ్గించడం. ఇదొక అపుర్వమైన కళ, తపస్సు. మాటలను వృథాగా వినియోగించకుండా దైవమిచ్చిన వరంగా భావించి ముక్తసరిగా అవసరం మేరకే మాట్లాడటం సర్వదా శ్రేయస్కరం. వినేవారికి ఇంపుగా, హితంగా, మితంగా మాట్లాడాలని, అలా చేతకానప్పుడు మౌనమే మేలని విదురనీతి వివరిస్తోంది.పాపాల పరిహారార్ధం నిర్దేశించబడిన ఐదు శాంతులలో మౌనం ఒకటి. ఈ పంచ శాంతులు: ఉపవాసం, జపం, మౌనం, పశ్చాత్తాపం, శాంతి.మౌనంగా ఉండేవారిని మునులు అంటారు.మాట వెండి అయితే, మౌనం బంగారం అని సామెత.మాట్లాడటం ద్వారా శక్తిని వృథా చేసుకునేకంటే మౌనంగా ధ్యానం చేయడం ద్వారా ఆధ్యాత్మికంగా ఉన్నత స్థితికి చేరుకోవచ్చుఅన్నారు స్వామి వివేకానంద.నేరనిర్థారణ సందర్భాల్లో నేరస్థుడు మౌనం వహిస్తే నేరం అంగీకరించిన భావం వస్తుంది కాబట్టి ఆ సమయంలో మౌనాన్ని ఆశ్రయించడం అనుకూలం కాదు.అతిగా మాట్లాడేవారికి విలువ తగ్గిపోతూ ఉంటుంది.
మౌనం మూడు విధాలుగా చెప్తారు.
వాజ్మౌనం: వాక్కును నిరోధించడమే వాజ్మౌనం. దీనినే మౌనవ్రతం అంటారు. ఇలాంటి మౌనం వల్ల పరుష వచనాలు పలుకుట, అబద్ధము లాడుట, ఇతరులపై చాడీలు చెప్పుట, అసందర్భ ప్రలాపాలు అను నాలుగు వాగ్దోషాలు హరించబడతాయి.
అక్షమౌనం: అనగా ఇంద్రియాలను నిగ్రహించడం. ఇలా ఇంద్రియాల ద్వారా శక్తిని కోల్పోకుండా చేస్తే ఆ శక్తిని ధ్యానానికి, వైరాగ్యానికి సహకరించేలా చేయవచ్చును.
కాష్ఠమౌనం: దీనినే మానసిక మౌనం అంటారు. మౌనధారణలో కూడా మనస్సు అనేక మార్గాలలో పయనిస్తుంది. దానిని కూడా అరికట్టినప్పుడే కాష్ఠమౌనానికి మార్గం లభిస్తుంది. దీని ముఖ్య ఉద్దేశము మనస్సును నిర్మలంగా ఉంచుట. కాబట్టి ఇది మానసిక తపస్సుగా చెప్పబడింది.
మౌనం ఆరోగ్య వృద్ధికి తోడ్పడుతుంది. దీనివలన దివ్యశక్తి ఆవిర్భవిస్తుంది. బాహ్య, ఆంతరిక సౌందర్యాలను పెంచుతుంది. మనోశక్తులు వికసిస్తాయి. ఎదుటవారిలో పరివర్తనను తెస్తుంది. ఆధ్యాత్మిక శక్తి ఉత్పన్నమై ఆత్మకి శాంతి లభిస్తుంది. సమయం సదుపయోగమౌతుంది.పతంజలి మహర్షి తన యోగ సిద్ధాంతంలో అవలంబించవలసిన మౌనానికి ప్రాధాన్యతనిచ్చారు. మౌనాన్ని అవలంబించిన మహాత్ములలో రమణ మహర్షి, శ్రీరామకృష్ణ పరమహంస, స్వామి వివేకానంద, మహాత్మాగాంధీ మున్నగు వారెందరో ఉన్నారు.
శాంతమూర్తిఅయిన బుధ్ధుడు దేశాటనచేస్తూ అడవిమార్గన వెళుతూ,దారిలోని ఒచెరువు గట్టున ఉన్న చెట్టునీడలో ధ్యానంచేస్తూ కూర్చున్నాడు.అదేబాటన గుర్రంపైవెళుతున్న ఆదేశరాజు, ధ్యానంలోఉన్నబుద్ధునిచూసి "ఏయ్ దొంగసన్యాసి కళ్లుతెరువు పనికి సోమరులై తేరగాదొరికే తిండి తింటూ బ్రతికేవాళ్లు సమాజానికి చీడపురుగులు నీలానేనుఉంటే ఇన్ని భయంకరయుధ్ధాలు చేసేవాడినా ఇంతసువిశాల రాజ్యంస్ధాపించేవాడినా"అంటూ పలుదుర్బాషలాడాడు. కళ్లుతెరిచిన బుద్దుడు"కూర్చోండి మహారాజా నన్ను తిట్టి అలసిపోయారు. ఈచల్లని నీరుతాగి సేదతీరండి"అన్నాడు .రాజుకు కోపంపోయింది నేను ఇంతగా తిట్టినా ఇతను యింత శాంతంగా ఎలా ఉండగలిగాడు అనుకున్నాడు. అదిగమనించినబుద్దుడు చిరునవ్వుతో"నాయనా ఇంతకుమునుపు కొందరు తీపిపదార్ధాలు తీసుకువచ్చి నన్ను స్వీకరించమన్నారు.నేను తిరస్కరించాను.వాటినివారే తిరిగితీసుకువెళ్లారు.ఇప్పుడు అలనా నే నీతిట్లను నేను స్వీకరించడంలేదు"అన్నాడు.చేతులు జోడించిన మహారాజు "అయ్యనన్నుమీశిష్యుడిగా స్వీకరించండి.కోపము,ఆశ,అసూయ,భయం మొదలైనగుణాలు అశాంతికి గురిచేస్తాయి.సంతృప్తి,శాంతి,ప్రేమ ఆనందాన్నికలిగిస్తాయి అనితెలుసుకున్నాను.అన్నాడు .ప్రేమగా అతన్ని ఆశీర్వదించాడుబుధ్ధుడు.రాజుమనసు మారింది రక్తపాతాలుజరిపిన వాడు శాంతమూర్తిగామారిపోయాడు.బాలలు ఆరాజు ఎవరోతెలుసా? అతనే 'అశోకచక్రవర్తి'