ముత్యాల హారం - మోపూరు రామశేషు

Mutyala Haaram

రా ధ చిరాగ్గా కాఫీ టేబుల్ మీద పెట్టి 'కాఫీ' అంటూ విసురుగా వెళ్ళింది. ఆ విసురుకు రాధ జడ సుధాకర్ నుదురు తాకుతూ వెళ్ళింది.

పేపర్ చదువుతున్న సుధాకర్ పేపర్ ను ఎడం చేత్తో తీసుకుని కుడిచేత్తో టీపాయ్ మీదున్న కాఫీని అందుకున్నాడు. రాధ చిరాకుకు కారణం తెలుసు. అందుకే మౌనంగా ఊరుకున్నాడు.

వంట ఇంట్లో గిన్నెలు, గ్లాసులు ఎగిరెగిరి పడుతున్న శబ్దాలు రాధ కోపం ఇంకా తగ్గలేదనే సూచిస్తున్నాయి.

సుధాకర్ హైదరాబాద్ లో డ్రగ్ ఇన్స్పెక్టర్ గా పనిచేస్తున్నాడు. వాళ్ళన్నయ్య నెల్లూరు పక్కన పల్లెలో పదెకరాల వ్యవసాయం చేస్తున్నాడు. పదెకరాలు అన్నమాటే కానీ ఏ రోజూ ఆ పంటలమీద రూపాయి వెనకేసుకోలేదు. విత్తనాలకని, ఎరువులకని అప్పుడప్పుడు సుధాకరే డబ్బులు ఇస్తుంటాడు.

మొన్న నాలుగు రోజుల క్రితం సుధాకర్ అన్నయ్య కొడుకు శివరామ్ ఇంటికి వచ్చి 'బాబాయ్ .... నాన్న అర్జంట్ గా నలభై వేలు ఇప్పించుకు రమ్మన్నాడు , కోతలు పెట్టుకున్నాం ' అన్నాడు.

శివరాం అడిగిన మొత్తాన్ని ఇచ్చాడు సుధాకర్. ఆరోజు నుండి రాధ ప్రచ్చన్నయుద్ధమే కొనసాగిస్తోంది. నిన్న రాత్రి సుధాకర్ ఆఫీసు నుంచి ఇంటికి రాగానే "ఏవండీ ... పక్కింటి పద్మజకి వాళ్ళాఆయన ముత్యాల హారం చేయించాడు . ఎంతో బాగుంది. అలాంటిదే నాకూ చేయించరూ ... " అడిగింది రాధ. 'అలాగే తీసుకుందువు గానీ రెండు నెలలు ఆగితే ఆ ఇంక్రిమెంట్ డబ్బులతో చేయిస్తాను' అన్నాడు సుధాకర్.

"అన్నిటికీ ఆ ఇంక్రిమెంట్ డబ్బులతో ముడిపెడితే ఎలా ? మీ అన్నయ్యకిచ్చిన ఆ నలభై వేలు అడగండి" అంటూ విసురుగా వంట ఇంట్లోకి వెళ్ళింది.

సుధాకర్ కి శివరాం నిన్ననే ఫోన్ చేసి 'బాబాయ్ ... నాన్న మీకివ్వాల్సిన డబ్బుల కోసం ప్రయత్నిస్తున్నాడు. పంటలో వచ్చిన డబ్బు అప్పులకే పోయింది. రెండు నెలలు ఆగమన్నాడు' చెప్పాడు.

సుధాకర్ కి తెలుసు "రెండు నెలలు కాదు రెండు సంవత్సరాలైనా ఆ డబ్బు ఇవ్వలేడని"!!

పేపర్ చదవటం పూర్తయింది. స్నానం చేసి వచ్చాడు. 'నాన్నా.. ప్రోగ్రెస్ రిపోర్ట్ మీద సంతకం చెయ్యలేదు' అంటూ సుధాకర్ కూతురు ఎనిమిదేళ్ళ లక్ష్మి వచ్చింది. సుధాకర్ ప్రోగ్రెస్ రిపోర్ట్ చూస్తూ 'గుడ్' అంటూ కూతురి బుగ్గలను ప్రేమగా నిమిరి సంతకం పెట్టాడు. "ఇంకా స్కూల్ వ్యాన్ రాలేదా? " అడిగాడు రాధని చూస్తూ సుధాకర్.

"ఈ రోజు బంద్. స్కూల్ లేదు " ఎటో చూస్తూ సమాధానమిచ్చింది రాధ.

"కోపంలో కూడా అందంగా ఉంటావని తెలుసు, కానీ ఇంత అందంగానా ?" రాధని కూల్ చేసే ప్రయత్నంలో మొదటి అడుగు వేసాడు సుధాకర్.

రాధ కోపంగా సుధాకర్ని చూస్తూ 'నన్నేం బుజ్జగించాలని చూడక్కర్లేదు' అంటూ సుధాకర్ ముందున్న ఖాళీ టిఫిన్ ప్లేట్ తీసేస్తూ చెప్పింది. సుధాకర్ చెయ్యి కడుక్కుని రాధ చెంగుతో చెయ్యి తుడుచుకుంటూ "నిన్ను సర్ ప్రైజ్ చెయ్యాలని ఇంతవరకు విషయం చెప్పకుండా నిన్ను వుడికించాను. నిన్న శివరాం మా ఆఫీసుకొచ్చి నలభై వేలిచ్చి అర్జెంటుగా పనుందని ఇంటికి రాకుండా వెళ్ళిపోయాడు. ఈ రోజే నువ్వు కోరిన 'ముత్యాల హారం' తీసుకువస్తాను. ఇక అలక మానినట్లేనా !"

ఆ మాటలతో రాధ ముఖంలో ఒక్కసారిగా ఆనందం వెల్లి విరిసింది. కానీ అది ముఖంలో కనబడనీయకుండా 'నేనేమీ అలగలేదు. నేను ఎప్పటిలాగానే వున్నాను. మీకే అలా అన్పించి వుంటుంది.' తప్పుని సుధాకర్ మీదకి తోసేస్తూ అంది. వాతావరణం తేలిక పడటంతో సుధాకర్ ఆఫీసుకి బయల్దేరాడు.

'నాన్న ! రేపు స్కూల్లో డ్రాయింగ్ కాంపిటేషన్ వుంది. వచ్చేటప్పుడు 'కలర్ పెన్సిల్స్' తీసుకుని రండి' చెప్పింది లక్ష్మి. అలాగే తల్లి ! అంటూ కూతురిని ముద్దాడాడు.

సుధాకర్ ఆఫీసు జీప్ లో నేరుగా పంజాగుట్ట లోని పెద్ద హోల్ సేల్ మెడికల్ షాప్ కి వెళ్ళాడు. సుధాకర్ ని చూడగానే షాపు ఓనర్ పరుగు పరుగున వచ్చి లోపలి తీసుకెళ్ళాడు. 'సాబ్ ! కబురెడితే నేనే వచ్చేవాడిని కదా అన్నాడు '. ఎక్స్ పైరీ అయిన మేడిసెన్స్ లేబుళ్ళు మార్చి అమ్ముకుంటున్నావ్ , పెద్ద కంపనీల పేర్లతో లోకల్ మందులు కలిపి అమ్మేస్తున్నావ్. నీ సరుకు సీజ్ చేస్తున్నా ... నిన్ను జైలు కి పంపిస్తా. వాళ్ళ షాపులో దొరికిన శాంపిల్స్ ను చూపిస్తూ అన్నాడు సుధాకర్.

షాపు ఓనరు సుధాకర్ చేతిలో యాభై వేలు పెట్టి 'సాబ్ ! కేసూ .. గీసూ ఏమీ వద్దు . ఇది వుంచండి. సరిపోకపోతే మళ్లీ పంపిస్తాను' ఇదంతా మాకు మామూలే అన్నట్టు చెప్పాడు.

నిజానికి శివరాం నలభై వేలు ఇవ్వలేదు. రాధకు కావాలని అబద్దం చెప్పాడు. ఆ డబ్బుల కోసమే ఇప్పుడు ఈ షాపు మీదకి రైడింగ్ కు వచ్చాడు. సుధాకర్ డబ్బులు జేబులో పెట్టుకుని 'కేవలం కేసు లేకుండా ఉండటానికే ఇది తీసుకున్నా. మందులు అమ్ముకోవడానికి కాదు. మర్యాదగా ఆ నకిలీ సరుకు అంతా డిస్పోజు చెయ్యండి' అంటూ జీపెక్కి వెళ్ళిపోయాడు.

'సరుకుని నిన్ననే అన్ని మెడికల్ షాపులకి పంపేసాం ... ఇప్పుడెలా ' అన్నాడు షాపులో పనిచేసే కుర్రాడొకడు. బయటకి పంపక అట్లే పెట్టుకుంటామా ? వీడి మామూలు వీడికి ముట్టింది గా ... మళ్ళీ వస్తే మళ్ళీ ఇద్దాం . ఇలాంటోళ్ళని ఎంతమందిని చూడలేదు ! చెప్పాడు ఓనరు.

జ్యూయలరి షాపుకెళ్ళి రాధకి కావాల్సిన 'ముత్యాల హారం' కొన్నాడు. అలాగే లక్ష్మి అడిగిన కలర్ పెన్సిల్స్ కొన్నాడు. సుధాకర్ ఫోన్ రింగ్ అయ్యింది. ఎత్తాడు . అవతల రాధ... ఏడుపు గొంతుతో 'ఏవండీ ... ! తొందరగా రండి . పాపకి కడుపు నొప్పి అంటే డాక్టర్ గారు ఇంజక్షన్ చేసారు . కానీ ఆ ఇంజక్షన్ నకిలీదంటా ... పాపా పరిస్థితి సీరియస్ గా వుంది .... ' రాధ ఏడుస్తూ చెబుతోంది.

సుధాకర్ కి కాళ్ళ క్రింద భూమి కదులుతున్నట్టు అనిపించింది. జేబులో వున్న 'ముత్యాల హారం' బయటకి తీసాడు. అది 'మృత్యు హారం' లా అనిపించింది.

మరిన్ని కథలు

Maa sir
మా సార్
- భాగ్యలక్ష్మి అప్పికొండ
Tulasidasu deevena
తులసీదాసు దీవెన
- నారంశెట్టి ఉమామహేశ్వరరావు
Kanuvippu
కనువిప్పు
- సరికొండ శ్రీనివాసరాజు
Sogasari pilli Gadasari Eluka
సొగసరి పిల్లి - గడసరి ఎలుక
- కాశీవిశ్వనాధం పట్రాయుడు/kasi viswanadham patrayudu
Vimanashrayam lo papa
విమానాశ్రయంలో పాప
- మద్దూరి నరసింహమూర్తి
Prasadam
ప్రసాదం
- మధనా పంతుల చిట్టి వెంకట సుబ్బారావు
Sundari maarindi
సుందరి మారింది
- జి.ఆర్.భాస్కర బాబు