అనగనగా ఒక అడవిలో మణి అనే కోతి ఉండేది.ఒకరోజు అది దిగులుగా ఉండడం గమనించిన తల్లికోతి ఎందుకు దిగులుగా ఉన్నావని అడిగింది. "అమ్మా!కోకిలపాట కమ్మగా ఉంటుందని, నెమలి నాట్యం అద్భుతంగా చేస్తుందని, చేప ఈత చూడ ముచ్చటగా ఉంటుందని, చిలుక అందం, మాట ఆకర్షణగా ఉంటాయని అడవంతటా పొగుడుతుండారు.నాకూ అలా ప్రశంసలు అందుకోవాలనే కోరిక బలంగా ఉంది. ఏ కళావిద్య నాకు రాదు కదా! నేను ఏదీ నేర్చుకోలేకపోయానే అని దిగులుగా ఉంది" చెప్పింది మణి. "దీనికే ఇంత దిగులు చెందాలా? పట్టుదల, ఏకాగ్రత ఉంటే ఇప్పుడు కూడా నేర్చుకోవ చ్చు.పల్లెకు వెళ్లు.అక్కడ మనుష్యులు ఏదో ఒక పని చేస్తుంటారు. నీకు నచ్చిన విద్యను చూసి నేర్చుకునిరా "అంది తల్లికోతి. ఆమాటలకు మణి సంతోషపడింది. తెల్లవారు ఝామున లేచి దగ్గరలో ఉన్న పల్లెకు చేరుకుంది. అక్కడ ఇంటి ముందు ఇల్లాలు ముగ్గువేస్తూ కనిపించింది. ఓ గోడపై కూర్చుని పరిశీలించసాగింది. తెల్లని పొడిని చేతిలోకి తీసుకుని, చేతిని తిప్పుతూ పొడిని వదులుతూ ఉంటే అందమైన ముగ్గు తయారైంది.రకారకాల రంగులతో ముగ్గును అలంకరించడం, పూలు ఉంచడం చూసింది. 'ఆహా!ఇది ఏమిటో !ఎంత అందంగా తయారయింది'అనుకుంటూ ఆశ్చర్యపో యింది. ఆ ఇంట్లో నుండి పాప బయటకు వచ్చింది."అమ్మా!ముగ్గు ఎంతబాగుందో" అంది.ఆమాట విన్న మణి 'దీనిపేరు ముగ్గు అన్నమాట'అనుకుంటూ మనసులో పదే పదే ఆపేరు తల్చుకుని పేరును గుర్తుపెట్టు కుంది.అడవికి వెళ్లి "అమ్మా తెల్లని పొడి నుండి చాలా విచిత్రంగా ముగ్గు వచ్చింది. రంగులు అద్దితే ఎంతో అందంగా తయారయింది"అని అమ్మకు చెప్పింది. ఆరోజు నుండి ప్రతిరోజూ పల్లెకువెళ్లి ముగ్గువేసే విధానం ఏకాగ్రతతో గమనించసాగింది. అలా చాలా రోజులు ఏకాగ్రతగా గమనించి, కష్టపడి గుర్తుంచు కుంటూ నాలుగురకాల ముగ్గులు నేర్చుకుంది.అడవినుండి పళ్లు తీసుకుని వెళ్తూ ఆఇంటి పాపకు పళ్లుఇస్తూ పరిచయం పెంచుకుంది. పాప అమ్మ కూడా మణికి పరిచయమయింది. ఒక రోజు ఆఇంటి ముందు నేను ముగ్గు వేస్తానని పాపఅమ్మను అడిగింది మణి. ఆమె ఆశ్చర్యపోయి, ముచ్చటపడి పొడిని, రంగులను,పూలను ఇచ్చింది. మణి అందమైన ముగ్గును వేసింది.రంగులు అద్దింది.పూలతో అలంకరించింది. "ముగ్గు అచ్చం నేను వేసినట్లే చాలా బాగుంది " అంటూ ఆమె మణిని అభినందించింది. మణి సంతోషంతో ఉక్కిరి బిక్కిరయింది. అడవిలో ముగ్గులు వేసుకుంటానంటే ఆమె చాలాపొడి, రంగులు ఇచ్చి, ఎప్పుడు పొడి, రంగులు కావాలన్నా నన్ను అడుగు ఇస్తాను" అని చెప్పి పంపింది. మణి ఉదయమే తాను ఉంటున్న చెట్టు పరిసరాలను అమ్మ సాయంతో శుభ్రం చేసింది.నీళ్లు చల్లి రంగుల ముగ్గును వేసింది.అందమైన ఆముగ్గు గురించి మణి వేసిందని పక్షులద్వారా అడవి అంతటా తెలిసిపోయింది.జంతువులన్నీ వచ్చి చూసి ప్రశంసించి వెళ్తున్నాయి. తన విద్యను అంతా మెచ్చుకుంటుంటే మణి చాలా ఆనందపడి పోయింది. విషయం మృగరాజుకు తెలిసింది. తన గుహ ముందు ముగ్గు వేయమని సింహం కబురంపింది. విషయం తెలిసి జంతువులన్నీ చూడడాని కొచ్చాయి.పొడిని తీసుకుని చుక్కలు పెట్టి వయ్యారంగా చేతిని తిప్పుతుంటే అందమైన ముగ్గు రావడం, రంగులతో, పూలతో అద్బుతంగా తయారవడం ఆశ్చర్యంతో కళ్లప్పగించి చూసి జంతువులు,సింహం మణిని ప్రశంసలతో ముంచెత్తాయి. "ఈ విద్య ఎలా నేర్చుకున్నా వు?" అంది సింహం. మణి తాను నేర్చుకున్న విధం చెప్పింది. "ఏదైనా సాధించాలనే పట్టుదల,పనిమీద ఏకాగ్రత,మనమీద మనకు సాధించగలననే నమ్మకం,కృషి ఉంటే అనుకున్నది సాధించవచ్చు. అందుకు ఈ మణికోతి ఉదాహరణ. మనకు స్ఫూర్తి"అని సింహం ప్రశంసించి కానుకలిచ్చింది. తనబిడ్డ సాధించిన విజయానికి తల్లికోతి మురిసిపోయింది. ఆరోజు నుండి మణి ఎప్పుడు పొడి, రంగులు కావాలన్నా పల్లెకెళ్లి పాపఅమ్మను అడిగి తెచ్చుకునేది. అడవిలో ముగ్గుల మణిగా పేరు స్థిరపడిపోయింది.