అంతర్మధనం - జీడిగుంట నరసింహ మూర్తి

Antharmathanam

"ఈ ఉగాది నుండి నేనో అద్భుతమైన నిర్ణయం తీసుకోబోతున్నాను. అదేమిటంటే బతికినన్నాళ్లు ఎవరితోనూ తగదా పెట్టుకోకూడదు. ఎవరిని ద్వేషించకూడదు. ఎవరిపైన అసూయ పడకూడదు ఇది నా నిర్ణయం. అన్నాడు విశ్వం ఎంతో విశ్వసనీయంగా తన అన్నగారితో ఫోనులో మాట్లాడుతూ..

"ఒరేయ్ బాబు ఇటువంటి కఠిన నిర్ణయాలు ఎందుకు తీసుకోబోతున్నావు ? ఇవన్నీ సాధ్యమయ్యే విషయాలేనా ? మనం సామాన్య మానవులం. మనకూ రాగద్వేషాలు ఉంటాయి. ఇటువంటి తీర్మానాలు అమలుచేయ్యడం మనలాంటి వాళ్ళ వల్ల కాదు . ఈ విషయంలో ఒకసారి ఆలోచించు. ఇదే మాట నువ్వు మామూలు రోజుల్లో అంటే ఏముందిలే దీనికి అని కొట్టిపారేయొచ్చు. కానీ నువ్వు పనిగట్టుకుని ఉగాది రోజే ఈ నిర్ణయం తీసుకుంటానని శపధం చేయాలని అనుకుంటున్నావు. కాశీలో ఏదైనా వదిలేయ్యాలని అనుకుని ఏదైనా మనకు ఇష్టమైనంది వదిలేసి ఆ వదిలేసినది మళ్ళీ కొనసాగిస్తే ఎంత పాపమో ఈ ఉగాదికి నువ్వు తీసుకునే నిర్ణయం కూడా కొన్నాళ్ళైనా కొనసాగించకపోతే అదీ పాపమే తెలుసుకో " అన్నాడు విశ్వం అన్నగారు మాధవ్ ఒక రోజు ఫోనులో. .

"కాశీలో మనకు ఇష్టమైన పదార్ధాలను వదిలిపెట్టడానికీ, దీనికీ పోలిక పెట్టకు. జిహ్వచాపల్యం వల్లనో, మర్చిపోవడం వల్లనో ఒక్కోసారి పొరపాటు చేసే అవకాశం ఉంది. కానీ ఇందులో ఏముంది ఇవన్నీ మంచి నిర్ణయాలేగా. పైగా ఇవి అందరూ ఆచరిస్తే ఎవరితోనూ ఏ గొడవలూ రావు. ఎటువంటి అనారోగ్యం దరిచేరదు. అదీ కాక మనందరికీ వార్ధక్యం ముంచుకొస్తోంది. ఏ క్షణంలో ఏమవుతామో తెలియదు. అందుకే ఇప్పటికైనా మించి పోలేదని ఈ నిర్ణయం" అన్నాడు విశ్వం.

"సరేలే నువ్వు ఎంతవరకు నిలబెట్టుకోగలవో నేను చూస్తాగా. గతంలో కూడా ఇలాంటి వాగ్ధానాలు రెండు మూడు సార్లు చేసినట్టున్నావు. కానీ ఎప్పటికప్పుడు పరగడుపే కదా. ఒకవేళ నువ్వు గాని కనీసం ఒక నెలరోజుల పాటు ఆచరించగలిగితే ఇక నేను కూడా వచ్చే ఉగాది నుండి నిన్ను అనుసరిస్తాను అన్నాడు మాధవ్.

ఉగాది రోజు మాధవ్ ఫోన్ చేసి అడిగాడు.

"ఈ ఉగాదికి మీ కొత్తల్లుడిని పిలిచావా ? ఒకవేళ వాళ్ళతో నువ్వు బిజీగా ఉంటే చెప్పు . రేపు మాట్లాడతాను. ఏమీ లేదు ఒక సారి పండగ శుభాకాంక్షలు చెపుదామని ఫోన్ చేశాను అన్నాడు మాధవ్ .

"లేదురా . నీ దగ్గర ఎందుకు దాచాలి కానీ ఒక సంవత్సరం నుండి ప్రతి పండక్కి రమ్మని పిలుస్తూనే ఉన్నాను. పెళ్ళిలో ఏదో తక్కువ చేసామంటూ వాళ్ళ వాళ్ళందరూ మనసులో ఏదో పెట్టుకుని ఇప్పటివరకు మా ఇంటి గడప తొక్కలేదు. నాకు కూడా ఈ గడ్డాలు పట్టుకుని బ్రతిమాలటాలు అంటే చిరాకు పుట్టిందిలే . . మన మీద ప్రేమ, గౌరవం ఉన్న వాళ్ళ కోసం వెంపరలాడటంలో ఆనందం ఉంటుంది కానీ , ఇలా వెంటపడి చివరకు భంగపడటం అంటే చాలా అసహ్యంగా అనిపిస్తుంది "అన్నాడు విశ్వం . వాళ్ళిద్దరి మధ్య దాపరికాలు అంటూ లేవు. బోల్డ్ గా అన్ని విషయాలు చెప్పేసుకుంటారు.

" ఏరా నీ కన్నా పెద్దవాడిని చెపుతున్నాను . నువ్వు చాలా తప్పు చేస్తున్నావని నాకు అనిపిస్తోంది. ఊరికే అలా ఫోన్ చేస్తే అల్లుడే కాదు ఎవరూ రారు. నువ్వు గట్టిగా తల్చుకుంటే అదేమంత కష్టం కాదు. మీ అమ్మాయి , అల్లుడు ప్రస్తుతం ఉండేది నీకు నూట ఏభై కిలోమీటర్ల దూరంలో. నా దృష్టిలో అదేమంత దూరం కాదు. . ఒకసారి మీ భార్యా , భర్తలు వెళ్ళి సగౌరవంగా వాళ్ళను ఆహ్వానిస్తే అది సంస్కారం అనిపించుకుంటుంది. వాళ్ళనే కాదు అతని తల్లి తండ్రులను కూడా అదే రీతిలో గౌరవించుకోవాలి. అప్పటివరకూ రావాలని ఉద్దేశ్యం లేని వాళ్ళు కూడా నువ్వు వాళ్ళ ఇంటికి వచ్చి మరీ పిలిచావని మనసు మార్చుకుని వచ్చే అవకాశం ఉండొచ్చు. . నువ్వు ఫోన్ చేసి చెప్పగానే నీ ఇంటి దగ్గర వాలి పోవడానికి పూర్వం అల్లుళ్లు కారు. వాళ్ళకు ఇగోలు ఉంటాయి. ..కాస్త వాళ్ళ మీద ద్వేష భావాన్ని పక్కన పెట్టి పిలవాల్సింది. అవసరమైతే బ్రతిమాలినా తప్పు లేదు. . అయితే ఈ పండక్కి కూడా మీ ఇంట్లో మీ ఇద్దరే అన్న మాట .." .." అన్నాడు మాధవ్ తమ్ముడి వైఖరికి నొచ్చుకుంటూ. .

" సరే నా విషయం అలా వుంచు. మీ ఇంట్లో ఈ ఉగాది ఎలా జరుగుతోంది ?" అని అడిగాడు విశ్వం ఆతృతగా.

" నువ్వు చెపితే ఆశ్చర్యపోతావు కానీ మా ఇంట్లో విషయం ఎంత చెప్పినా తక్కువే. ప్రతి యేడూ లాగానే ఈ ఉగాదికి కూడా మా ఇంట్లో కనీసం ఇరవై ముప్పై మంది జనాలతో సందడే సందడి. పొద్దున్నుండి ఒకటే కబుర్లు, కేకలూనూ. . మధ్యలో పంచాంగ శ్రవణం. చిన్న వాళ్ళను ఆశ్వీరదిస్తూ, పెద్ద వాళ్లనుండి దీవనలను అందుకుంటూ ఎంతో ఆనందంగా గడిపేస్తున్నాం . భోజన కార్యక్రమాలు పూర్తి అయ్యాక కొత్త బట్టలు పెట్టుకోవడం, కానుకలు ఇచ్చేవాళ్లు ఇచ్చుకోవడం, ఆ తర్వాత అందరమూ కలిసి దగ్గరగా ఉన్న ఏదైనా గుడికి వెళ్ళి దేవుని దర్శనం చేసుకుని ఇలాగే ప్రతి సంవత్సరం ఉగాది రోజు కలుసుకోవాలని , అందరూ సుఖ సంతోషాలతో ఉండాలని ఆ అమ్మవారిని కోరుకుంటాం. ఇంతకన్నా ఏముంటుందిరా జీవితంలో ?. అయితే ఇంకో విషయం. ఈ ముచ్చట ప్రతి సంవత్సరం మా ఇంట్లోనే జరుగుతుంది. డబ్బు విషయంలో ఎటువంటి రాజీ పడే పరిస్తితి లేదు. " అన్నాడు మాధవ్ . తన గురించి చెప్పుకుంటూ ఉంటే అతని గొంతులో గర్వం తొణికిసలాడుతోంది.

'" నీకేమిటిరా? నువ్వు వాళ్ళందరికీ రాజగురువు లాంటి వాడివి. మీలో ఒకరి వల్ల ఒకరికి ఎన్నో ప్రయోజనాలు ఉంటాయి. ఒకరి మీద ఒకరు ఆధారపడి బ్రతికేస్తూ ఉంటారు. ... అందరూ మీలా ఉండాలంటే ఎక్కడ సాధ్యమవుతుంది ?" అన్నాడు విశ్వం . అతని మాటల్లో అసూయ కొట్టొచ్చినట్టు కనిపిస్తోంది. .

** ** ** **

" నేను ఈ రోజు ఎవరికి ఫోన్ చేసినా అందరూ ఎంతో ఎంజాయ్ చేసేస్తున్నట్టు కనిపిస్తోంది. కనీసం ఒక్కళ్ళు కూడా ఈ పండక్కి మనమందరమూ మా ఇంట్లో సరదాగా గడుపుదాం రండి అన్న వాళ్ళు లేరు . ఎవరికి వాళ్ళకు వాళ్ళ పెళ్ళాం వైపు బంధువులు కావాలి . వాళ్లతోనే ఆనందాలు పంచుకోవాలి ..." అంటూ విశ్వం భార్య సులోచనతో తన అక్కసు వెళ్ళబుచ్చాడు.

"వాళ్ళను ఎవరినీ అవమానించకండి. మీకు ఇంటికి ఎవరూ రావడం ఇష్ఠం లేదు. ఎవరినీ భరించలేరు. ఆఖరికి సొంత కూతురుని , అల్లుడిని కూడా ఇంటికి రప్పించుకోలేక పోయాము. మనకు ఎవరినీ విమర్శించడానికి అర్హత లేదు. . నాకూ ఈ రోజు దిగులుగానే ఉంది. నేను ఈ రోజు ఇంట్లో ఏ స్పెషల్స్ చెయ్యడం లేదు. మీకు దణ్ణం పెడతాను. ..ఇంట్లో పండగ సరిగ్గా చేసుకోలేదని, ఏమీ వండుకోలేదని వాళ్లకూ వీళ్ళకూ ఫోనులు చేసి మాత్రం చెప్పకండి మీకు పుణ్యం ఉంటుంది. .ఇంట్లో విషయాలన్నీ ప్రతీదీ బయటకు ఊదేయ్యడం అలవాటేగా!. కనీసం ఈ రోజైనా సంయమనం పాటించండి .." అంది సులోచన . ఆమె మాటల్లో వ్యక్తం చెయ్యడానికి వీల్లేనంత అసంతృప్తి కనిపిస్తోంది. ,

కూతురు , అల్లుడు వాళ్ళ పెళ్లైన్నప్పటినుండి వరసగా మూడు సంవత్సరాలుగా పండక్కి ఇంటికి రాకపోవడం ఆమె మనసును కలచివేస్తోంది. అతనికి ఏవో అసంతృప్తులు .కనీసం చెప్పుకుంటే ఎంత కష్టమైనా తీర్చడానికి ప్రయత్నం చేయొచ్చు.

విశ్వానికి ఏమీ తోచడం లేదు. మాట్లాడటానికి భార్య తప్ప ఎవరూ లేరు. ఆమె సమస్యలు ఆమెకు ఉన్నాయి. ఫోన్ తీసి తోడల్లుడు కృష్ణమూర్తికి చేశాడు.

" ఏం చేస్తున్నారు ? పండగ బాగానే చేసుకున్నట్టున్నారు అనుకుంటా. . పొద్దున్నుండి కనీసం శుభాకాంక్షలు కూడా చెప్పలేదు ." అని జేవురించిన మొహం పెట్టుకుని అడిగాడు విశ్వం. . అతని మాటలు అసంబద్దంగానూ, అసందర్భంగానూ అతనికే అనిపించాయి.

" లేదండీ. ప్రస్తుతం మేము మైసూర్ లో ఉన్నాము. మా అమ్మాయి , అల్లుడు వాళ్ళు అక్కడ ఉన్నారు కదా. ఈ సారి పండక్కి వాళ్ళతో గడపాలని అనుకున్నాము. ఒక పది రోజులు అక్కడే ఉండి ఆ చుట్టుపక్కల ప్రదేశాలన్నీ చూసేసి రావాలని అనుకుంటున్నాము. ..వెనక్కి వచ్చాక మీకు ఫోన్ చేస్తాను లెండి బస్సులో ఉన్నాము. బాగా రొదగా ఉంది . ఏమీ అనుకోకండి ." అంటూ అవతల ఫోన్ పెట్టేశాడు తోడల్లుడు కృష్ణ మూర్తి.

"వెళ్లండయ్యా వెళ్ళండి. బాగా ఎంజాయ్ చేయండి. మీకు అంత మంచి అల్లుళ్లు ఎలా దొరుకుతున్నారో ఏమిటో ? అయినా మీకు మాత్రం పని ఏముంది ? ఎప్పుడు ఎక్కడికి వెళ్లాలా అని ఆలోచిస్తూ ఉంటారు. అవును మరి వచ్చే లక్ష రూపాయల పెన్షన్ డబ్బులు ఏం చేసుకుంటారు ? దేనికో దానికి ఉపయోగ పడాలిగా ! ఏనాడైనా మీరు కూడా వస్తారా అని ఎప్పుడైనా ఎవరైనా అడుగుతారేమో అని చూసినా మీ అందరికీ ఎంతమటుకూ మీ స్వార్ధమే తప్ప ఎవరూ గుర్తు రారు " అని స్వగతంలో రగిలిపోయాడు విశ్వం. మనసులో అనుకున్నా అనుకోకుండా కొన్ని మాటలు బయటకు రానే వచ్చాయి.

ఆ క్షణంలో అతనిలో కోపం, క్రోధం , ఆవేదన పొంగుకుంటూ వచ్చాయి. ఒక పక్క తన వాళ్లందరినీ ద్వేషిస్తూ మళ్ళీ వాళ్లందరి గురించే ఆలోచిస్తున్నాడు. తనలో కలిగిన విపరీత ఆలోచనల పరంపరను ఏమాత్రమూ అణుచుకోలేక కథల రూపంలో కనపడిన పత్రికలకల్లా పంపించేశాక కానీ విశ్వం మనసు కుదుటపడటం లేదు. .

కొన్ని రోజుల తర్వాత మళ్ళీ మాధవ్ తన తమ్ముడికి ఫోన్ చేశాడు. విశ్వం గొంతు బలహీనంగా పలికింది.

" ఈ మధ్య చూస్తున్నాను రా . నువ్వు వ్రాసే ప్రతి కథలోనూ ఎవరో మీద అక్కసుతో వ్రాస్తున్నట్టు కనిపిస్తోంది. ప్రతి వాక్యం లోనూ మన కుటుంబాలలో వారి మీద ద్వేష భావాన్ని కనపరుస్తున్నట్టుగా అర్ధమవుతోంది. నీ అస్తిత్వాన్ని, వ్యక్తిత్వాన్ని పూర్తిగా తాకట్టు పెట్టి అవతలి వారిని విమర్శించడమే పనిగా పెట్టుకుంటున్నట్టుగా నీ వ్రాతలు కనిపిస్తున్నాయి. ఎందుకో నీలో నువ్వే రగిలిపోతున్నట్టుగా అనిపిస్తోంది. ఇది ఎంతమాత్రమూ నీ ఆరోగ్యానికి మంచిది కాదు. నీలో ప్రశాంతత పూర్తిగా లోపించినట్టుగా ఉంది. అసహనం పాళ్ళు ఎక్కువగా కనిపిస్తున్నాయి. కొన్నాళ్ళ క్రితం నాకు ఫోన్ చేసినప్పుడు నువ్వేమన్నావు " ఈ ఉగాది నుండి బతికినన్నాళ్లు ఎవరితోనూ తగదా పెట్టుకోవడం కానీ, ద్వేషించడం కానీ ,అసూయలు పడటం కానీ చెయ్యదల్చుకోలేదని గట్టి నిర్ణయం తీసుకోబోతున్నట్టు చెప్పావు కదా". నీ మాటలు, నీ వాగ్ధానాల మీద నాకు నమ్మకం లేదు నువ్వు ఆచరించలేవు అని నేను ఆనాడే చెప్పాను . అప్పటినుండి నిజానికి అవన్నీ శ్రుతిమించి పోయాయి. నువ్వు ఏం మాట్లాడుతున్నావో ఏం వ్రాస్తున్నావో నీకే అర్ధం కావడం లేదు. నిన్ను దెప్పి పొడవడం నా ఉద్దేశ్యం కాదు. ఒకటి మాత్రం నిజం. నువ్వు మనవాళ్ళల్లో ఎవరికీ తక్కువ కాదు. అప్పుడప్పుడు కొన్ని పరిస్తితులు మనకు అనుకూలించవు. మనమే వాటిని సానుకూలంగా మలుచుకోవాలి. ఈ రోజుల్లో ఎవరి జీవితం వారిది. ఇంకొకరి జీవితంలోకి దూరి వాళ్ళను శాశించాలని చూస్తూ , వారిని అదే పనిగా ద్వేషిస్తూ మన విలువైన కాలాన్ని వృధా చేసుకోవడం చాలా తెలివి తక్కువ తనం. ఇప్పటికైనా నీలో మార్పు కోసం ప్రయత్నం చెయ్యి. అప్పుడే నీకూ అన్నిదారులూ తెరుచుకుంటాయి. ప్రేమగా నీ వాళ్ళను చేరదియ్యి .నీ కోసం అందరూ ప్రాణం ఇస్తారు. నువ్వేమిటో అందరూ తెలుసుకుంటారు. నేనూ నీ లాగా కథలు వ్రాయగలను. కానీ వాటి ద్వారా ఎంతోమందిలో చైతన్యాన్ని కలిగించ గలిగితే పర్వాలేదు.కానీ మన వ్రాతల వల్ల అవతలి వారిలో మనమంటే విద్వేషం కలిగి మనకు మరింత దూరం అయ్యేటట్టు చేసుకోవడం నాకు ఇష్టం లేదు. నీకు కూడా నువ్వు ఏమనుకున్నా కూడా అదే సలహా ఇవ్వాలనుకుంటున్నాను. ..." అంటూ ఇంకా సంభాషణను పొడిగించడం ఇష్టం లేక ఫోన్ పెట్టేశాడు మాధవ్.

విశ్వంలో ముఖంలో రియాక్షన్ కనిపిస్తోంది. మనసులో అంతర్మధనం ప్రారంభమయ్యింది. ఇప్పుడతనికి అనిపిస్తోంది.తన ఆలోచనలు పూర్తిగా తప్పని. తనకు సిట్యుయేషన్ మీద ఏ మాత్రం కంట్రోల్ లేదని అర్ధమవుతోంది. తన మీద ఉన్న గౌరవం తనకే తగ్గ సాగింది. ఆ క్షణంలో గట్టిగా తీర్మానించుకున్నాడు. . "అవును తను మారాలి. తన బలహీనతలతో నలుగురి మధ్య ఇంకా ఇంకా లోకువ కాకూడదు. ఎవరికో చెప్పడం కాదు తను ఈ క్షణం నుండి నిజంగానే ద్వేషం, అసూయ , కోపం నుండి పూర్తిగా బయటపడి అందరిలోనూ కలిసిపోవాలి. అప్పుడే పరిస్తితులు తనకు అనుకూలంగా మారుతాయి ..."

మనసును ప్రశాంతంగా రాగరంజితం చేసుకున్నాక తనకు తెలియకుండానే ఎన్నాళ్లుగానో పేరుకుపోయిన అశాంతికి ఇప్పుడు శాశ్వతంగా తెరపడినట్టయ్యింది. *****

సమాప్తం

మరిన్ని కథలు

Bhavaateetam
భావాతీతం
- DODDIPATLA KALYAN KISHORE
Prema falam
ప్రేమ ఫలం
- పి. రాజేంద్రప్రసాద్
Neethone nenunta
నీతోనే నేనుంటా
- కాశీవిశ్వనాధం పట్రాయుడు
Amlet damlet
ఆంమ్లేట్ - డాంమ్లేట్ .
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
REkkala kastam
రెక్కల కష్టం
- వరలక్ష్మి నున్న
ఓ breaking news
ఓ బ్రేకింగ్ న్యూస్
- బివిడి ప్రసాద రావు