విజయపురిలో పవనుడు అనే యువకుడు కట్టెలు కొట్టి జీవించేవాడు. ఒకసారి వాడికి అడవిలో ఒక విచిత్రమైన చెట్టు కనిపించింది .ఆచెట్టును గొడ్డలితో అలసట వచ్చేదాకా కొట్టినా చిన్న బెరడుముక్క కూడా ఊడలేదు. ఆచెట్టులో ఏం మాయ ఉందో అని చెట్టు పైకెక్కి పరీక్షించాలనుకున్నాడు. చెట్టుపైకెక్కాడు. పరిశీలించగా చెట్టుపైన ఒక రంధ్రం కనిపించింది. అందులో ఒక బంగారు కంకణం మెరుస్తూ కనిపించింది. ఆకంకణాన్ని తీసుకుని సంతోషంగా దిగబోయాడు.పట్టుదప్పి క్రింద పడ్డాడు. మొనదేలిన రాతిపై పడి కాలు లోతుగా చీరుకు పోయింది. 'అమ్మా!'అంటూ గాయం దగ్గర చేతులతో పట్టుకున్నాడు.వెంటనే గాయం నయమైపోయింది.పవనుడికి అంతా మాయలా అనిపించింది. తనచేతిలోని బంగారు కంకణం స్పర్శవల్లే అలా జరిగిందని గుర్తించాడు. ఆకంకణం మహిమకలదని అర్థమయింది. ఆరోజునుండి పవనుడు ధనికులకు, పేదలకూ ఎలాంటి గాయాలైనా కంకణం స్పర్శతో ఉచితంగా నయం చేయసాగాడు. ధనికులు ఇచ్చిన ధనంతో దానధర్మాలు చేస్తూ నిరాడంబరంగా జీవించేవాడు. పేదలనుండి ధనం తీసుకునేవాడు కాదు. విజయుడి పేరు రాజ్యమంతటా వ్యాపించింది. ఆరాజ్యాన్ని విక్రమసేనుడనే రాజు పరిపాలించేవాడు.ఆయన తండ్రి జయసేనుడు చాలాకాలంగా నయంకాని రాచపుండుతో బాధపడుతున్నాడు. ఏవైద్యానికీ ఆపుండు నయం కాలేదు. పవనుడి గురించి తెలిసి కబురంపాడు రాజు. పవనుడు వచ్చాడు. మహిమాన్వితమైన కంకణం స్పర్శతో పుండును పోగొట్టాడు. రాజు విక్రమసేనుడికి ఒకఆలోచన వచ్చింది .వెంటనే పవనుడితో "ఈకంకణం నీలాంటి సామాన్యుడి వద్ద ఉండదగినది కాదు.మాలాంటి రాజకుటుంబంలో ఉండాలి .ఈకంకణాన్ని ఉంచుకునే అర్హత నీకులేదు."అని కంకణాన్ని తీసుకున్నాడు. రాజుకు ఎదురుచెప్పలేక పవనుడు మౌనంగా, దిగులుగా ఇంటికెళ్ళిపోయాడు .విక్రమసేనుడి తండ్రి జయసేనుడికి విషయం తెలిసి నొచ్చుకుంటూ"ఈకంకణాన్ని మనదగ్గర ఉంచుకుంటే లాభమేమిటి? ఈకంకణం ద్వారా పవనుడు ఎందరో పేదలకు ఉచితవైద్యం అందిస్తున్నాడు. దానధర్మాలు చేస్తున్నాడు. అలా అందరికీ ఉపయోగపడినప్పుడే కంకణానికి సార్థకత .మనదగ్గర భవంతిలో మహిమాన్వితమైన కంకణం ఉందని అందరూ చెప్పుకోవడానికి తప్ప మరో ప్రయోజనం లేదు. మంచితనం, మానవత్వమున్న పవనుడికి మాత్రమే ఈకంకణాన్ని ఉంచుకునే అర్హత ఉంది" అన్నాడు. విక్రమసేనుడు తండ్రిమాటల్లోని నిజాన్ని గుర్తించాడు.'ఇతరులకు ఉపయోగపడినప్పుడే మన జీవితానికైనా దేనికైనా సార్థకత' అనుకుని కంకణంతోపాటు అనేక కానుకలనిచ్చి భటులను పవనుడి వద్దకు పంపించాడు.తిరిగివచ్చిన కంకణాన్ని చూసి పవనుడు చాలాసంతోషించాడు. ప్రజలకు ఉచితసేవ అందిస్తూ,సుఖంగా జీవించాడు.