,జయన్న ఆదర్శం - డి.కె.చదువులబాబు

Jayanna aadarsham

జయన్న నందవరంలో ఉండేవాడు. వాడి తండ్రికి ఐదు ఎకరాల పొలం ఉండేది. వ్యవసాయం చేసేవాడు. కొడుకును గురుకులంలో చదివించేవాడు. జయన్న చదువుతోపాటు చిత్రలేఖనం అభ్యసించేవాడు. చిత్రలేఖనమంటే జయన్నకు అమితమైన ప్రేమ. గొప్ప చిత్రకారుడు కావాలని కోరిక. ఒకరోజు జయన్న తండ్రి విషజ్వరంతో మరణించాడు.అకస్మాత్తుగా జరిగిన ఆసంఘటన వారి కుటుంబంలో విషాదాన్ని నింపింది.తల్లి,ఇద్దరు చెల్లెళ్ల బాధ్యత జయన్నపై పడింది. చదువు మానుకున్నాడు.ఊళ్లోవారి సహాయంతో కష్టపడి వ్యవసాయం నేర్చుకున్నాడు. వ్యవసాయం,పశువులపోషణతో తీరికలేకుండా కాలం గడుస్తోంది. మంచిమంచి చిత్రాలను సృష్టించాలనే కోరిక మనసులో బలంగా ఉంది. కానీఏమాత్రం తీరికలేకుండా పోయింది. ఇద్దరుచెల్లెల్లకూ మంచిసంబంధాలు చూసి వివాహం చేశాడు. తానూ వివాహం చేసుకున్నాడు. జయన్నకు ఇద్దరు కుమారులు. వారిని పెంచి చదివించాడు. జయన్న కష్టపడి మంచి పంటలు పండించగలిగాడు. పాడిని వృద్ధి చేశాడు.ఐదుఎకరాలభూమిని ఇరవై ఎకరాలు చేయగలిగాడు. పెద్దవాడికి కొలువు దొరికింది. చిన్నవాడు వ్యవసాయంలో స్థిరపడ్డాడు. కొడుకులకూ వివాహం చేశాడు. ఇంటి బాధ్యతలు వారికి అప్పజెప్పాడు. ఇప్పుడు జయన్న వయసు యాభ్బైఐదు సంవత్సరాలు.జయన్న మనసులోని మంచి చిత్రకారుడు కావాలనే బలమైనకోరికకు వయస్సు అడ్డుకాలేదు. గొప్ప చిత్రకారుడిగా పేరున్న గురువు వద్ద చేరాడు. చాలా కష్టపడి చిత్రలేఖనంలో మెలుకువలను అభ్యసించాడు.ఏడాది తిరక్కుండానే మంచి నైపుణ్యాన్ని సాధించాడు. ఆఏడాది రాజు విక్రమసేనుడు జన్మదినం సందర్బంగా ఏర్పాటు చేసిన చిత్రలేఖనం పోటీలో పాల్గొని ప్రథమబహుమతి సాధించాడు.స్వతహాగా చిత్రకారుడైన రాజు ప్రతి సంవత్సరం పోటీలు నిర్వహిస్తున్నాడు. 'ఎప్పుడూ పోటీలో కనిపించని ఈజయన్న ఎక్కడినుండి వచ్చాడు?ఇంతకాలం ఎక్కడున్నాడు?ఇంతటి ప్రతిభ ఉండీ పోటీలకెందుకు రాలేదు?' అని తోటి చిత్రకారులు,రాజు ఆశ్చర్యపడ్డారు. రాజు ఆవిషయం అడిగాడు. జయన్న తనవివరాలు రాజుకు వివరించాడు. "ఈవయస్సులో కూడా పట్టుదలతో ఎంతో శ్రమపడి తనలోని కళకు మెరుగులు దిద్దుకున్నాడు.అద్భుతమైన నైపుణ్యాన్ని ప్రదర్శించి,విజేతగా నిలిచాడు. ప్రతిభకు వయసు అడ్డుకాదని నిరూపించాడు. ఎందరికో స్ఫూర్తిగా నిల్చాడు జయన్న. జయన్నను ఆదర్శంగా తీసుకుని కృషిచేస్తే పిల్లలు,పెద్దలు ఏరంగంలోనైనా విజయాన్ని అందుకుంటారని"రాజు ప్రశంసించాడు. సభ చప్పట్లతో మార్మోగింది. జయన్న పేరు దేశమంతటా మార్మోగింది.

మరిన్ని కథలు

Prema falam
ప్రేమ ఫలం
- పి. రాజేంద్రప్రసాద్
Neethone nenunta
నీతోనే నేనుంటా
- కాశీవిశ్వనాధం పట్రాయుడు/kasi viswanadham patrayudu
Amlet damlet
ఆంమ్లేట్ - డాంమ్లేట్ .
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
REkkala kastam
రెక్కల కష్టం
- వరలక్ష్మి నున్న
ఓ breaking news
ఓ బ్రేకింగ్ న్యూస్
- బివిడి ప్రసాద రావు
chettu baadha
చెట్టు బాధ
- లక్ష్మీ కుమారి.సి