అనుభవపాఠం - డి.కె.చదువులబాబు

Anubhava paatham

నెమళ్లదిన్నెలో కొండయ్య అనే రైతు ఉండేవాడు.ఆసంవత్సరం పంట బాగా పండి డబ్బు చేతికొచ్చింది. కొండయ్య కొడుకు రవీంద్ర పట్నంలో పదవతరగతి చదువుతున్నాడు.పండుగ సెలవుల్లో ఊరికివచ్చాడు.పంట అమ్మగా వచ్చిన డబ్బును చూశాడు." నాన్నా!ల్యాప్ టాప్ కొనివ్వమని అడిగితే, కొనిస్తానన్నావుగా!ముందు ముందు దాని అవసరం ఉంటుంది. ముందే తీసుకుంటే అనుభవం వస్తుంది. ఎలాగూ డబ్బు చేతికొచ్చిందిగా!తీసివ్వు"అన్నాడు రవీంద్ర. "ప్రస్తుతం కట్టవలసిన అప్పులున్నాయి. ఈసంవత్సరం వాటిని తీర్చేసి వచ్చేసంవత్సరం కొనిస్తాలే! అందాక ఓపికపట్టు"అన్నాడు కొండయ్య. "ల్యాప్ టాప్ తీసుకుని మిగిలిన డబ్బుతో అప్పుకట్టు.ఇంకా కట్టవలసిన అప్పు వచ్చే సంవత్సరం కడితే సరిపోతుంది కదా!" అంటూ సలహా ఇచ్చాడు రవీంద్ర. అందుకు కొండయ్య ఒప్పుకోలేదు. డబ్బు తీసుకెళ్లి అప్పులు కట్టి వచ్చాడు. మిగిలిన డబ్బు ఖర్చులకు ఉంచుకున్నాడు. ఆరోజు ఉదయం ఇంటిబయట అరుగుపై కూర్చుని కొడుకును పిలిచాడు కొండయ్య. మందులచీటీ ఇచ్చి, "కాలిపుండుకు పూతమందు తీసుకురా!" అన్నాడు. "పుండు నయమవుతోంది కదా! మందు వాడకున్నా నయమవుతుంది" అన్నాడు రవీంద్ర. "ఆసంగతి నాకు తెలుసులే! వెళ్లి తీసుకురా!"అన్నాడు కొండయ్య. రవీంద్ర వెళ్లి పూతమందు తెచ్చి ఇచ్చి అక్కడే అరుగుమీద కూర్చున్నాడు. ఇంతలో పక్కింటి చలపతి వీధిలో ఇంటి ముందు పోతూ కనిపించాడు. "చలపతీ...ఇలా వచ్చి కూర్చో" అని పిలిచాడు కొండయ్య. చలపతి కొండయ్యవైపు ఆశ్చర్యంగా చూసి తర్వాత తేరుకుని వచ్చి కూర్చున్నాడు. అది చూసి రవీంద్ర అవాక్కయ్యాడు. చలపతి,కొండయ్య పొలందగ్గర సమస్యతో వాదించుకున్నారు.చిన్నాపెద్దాచేరి పంచాయితీ చేసి సమస్యను పరిష్కరించారు. ఇది జరిగి మూడునెలలు కావొస్తోంది.ఆరోజునుండి ఇద్దరిమధ్య మాటల్లేవు.ఆవిషయం రవీంద్రకు తెలుసు. తనతండ్రి ఏమాత్రం మొహమాటం లేకుండా చలపతినిపిల్చి పక్కలో కూర్చోపెట్టుకోవడం రవీంద్రకు ఆశ్చర్యం కల్గించింది. కొండయ్య,రవీంద్రతో ఇంట్లోనుండి టీ తెప్పించి,చలపతికిచ్చి,తానూ తీసుకున్నాడు.తర్వాత సిగరెట్ తీసి చలపతికిచ్చి,తానూ వెలిగించి "చలపతీ...పొలందగ్గర ఏదో ఆవేశంతో కొట్లాడుకున్నాం.అవేవీ మనసులో పెట్టుకోకు. ఇలాంటి చిన్నచిన్న విషయాలకు స్నేహాన్ని వదులుకోవడం నాకిష్టముండదు" అన్నాడు. చలపతినవ్వి"నీగురించి నాకు తెలుసుకదా! జరిగిందేదో జరిగిపోయింది. కాలంతోపాటు నీపై కోపంకూడా తగ్గింది" అన్నాడు. ఇద్దరూ కబుర్లలో పడ్డారు. చివరిదాకా కాలిన సిగరెట్ ను చలపతి వీధిలోకి విసిరేయబోతే కొండయ్య అడ్డుకుని చేతిలోకి తీసుకుని అరుగుపై ఉంచాడు. తనచేతిలోని సిగరెట్ ముక్కను కూడా అక్కడే ఉంచాడు. రవీంద్రను పిల్చి గ్లాసుతో నీళ్లుతెమ్మని ఆనీళ్లు సిగరెట్ ముక్కలపై చల్లి ఆర్పేశాడు కొండయ్య. కొద్దిసేపు మాట్లాడి చలపతి వెళ్లిపోయాడు. ఇంటిపంచన నిల్చున్న రవీంద్ర తండ్రి దగ్గరకొచ్చి"మీమధ్య మూడునెలలుగా మాటల్లేవు.ఇంతకాలం ఆగి ఇప్పుడు పిల్చి మాట్లాడటమెందుకు?మాట్లాడకుంటే మనకు జరగదా? అదిచాలదన్నట్లు సిగరెట్టుముక్కను చేతిలోకి తీసుకుని అరుగుపై ఉంచి నీళ్లుచల్లి ఆర్పేశావు. మరీ అంత గౌరవమివ్వడం అవసరమా?" అన్నాడు. కొండయ్య నవ్వి "నువ్వు జీవితంలో తెలుసుకోవలసిన ముఖ్యమైన విషయాలు చెబుతానువిను."అన్నాడు. చెప్పమన్నాడు రవీంద్ర. "నీకు ల్యాప్ టాప్ కొనకుండా వాయిదావేసి అప్పులు కట్టాను. ఎందుకనుకున్నావు? అప్పు నిప్పు లాంటిది. నిర్లక్ష్యంచేస్తే పెరిగి కాల్చేస్తుంది.ఋణశేషం ఉండకూడదు. పుండు తగ్గుముఖం పట్టినా మందు వాడుతున్నాను.ఎందుకనుకున్నావు?మధ్యలో ఆపేస్తే దుమ్ము,వైరస్ చేరి ఎక్కువవుతుంది.కాబట్టి వ్రణశేషం ఉండరాదు.అలాగే చలపతితో మాటలు కలిపాను.ఎందుకంటే శత్రుశేషం ఉండరాదు. భవిష్యత్తులో సమస్యలు వస్తాయి. అలాగే నిప్పును వెంటనే ఆర్పేశాను. ఆర్పకుండా వదిలేసినా,విసిరేసినా దానిమీద కాలుపడి అది చెప్పులులేని వాళ్ల కాళ్లను కాలుస్తుంది .ఏచెత్తమీదైనా పడి రాసుకుని మంటగా మారి ప్రమాదాలకు దారితీయవచ్చు. కాబట్టి అగ్నిశేషం ఉండరాదు.మనిషికి ఋణశేషం, వ్రణశేషం,శత్రుశేషం,అగ్నిశేషం ఎప్పటికైనా సమస్యలు తెస్తాయి. అవిలేకుండా జాగ్రత్తపడాలి.నేను చేసింది అదే" అని వివరించాడు కొండయ్య. "నాన్నా!మీమాటలు అందరికీ ఆచరించదగినవి. కానీ మీరు తాగే ఒకటి లేదా రెండు సిగరెట్లను వదిలేయవచ్చు కదా!"అన్నాడు రవీంద్ర. "నేను శరీరానికి, మనసుకు సంబంధించిన ఈఅలవాటు మంచిది కాదని తెలియక అలవాటు పడ్డాను. తెలిశాక మానుకోవాలని శతవిధాలా ప్రయత్నించి మానుకోలేకున్నా తగ్గించగలిగాను. ఇంత చిన్నఅలవాటు మానుకోవడం కష్టంగా ఉంది.మరి ఏఅలవాటు చేసుకున్నా మానుకోలేమనే పాఠాన్ని సిగరెట్ నాకు నేర్పింది.ఆగుణపాఠంతోనే జీవితంలో నాకు మరి ఏవ్యసనం అలవాటు కాలేదు. ఏదురలవాటు చేసుకున్నా పూర్తిగా మానుకోవటం కష్టమైనపని. ఇవన్నీ నా అనుభవపాఠాలు"అన్నాడు కొండయ్య. ఎంతో అనుభవంతో తండ్రి చెప్పిన మాటలు జీవితాంతం గుర్తుపెట్టుకున్నాడు రవీంద్ర.

మరిన్ని కథలు

Prema falam
ప్రేమ ఫలం
- పి. రాజేంద్రప్రసాద్
Neethone nenunta
నీతోనే నేనుంటా
- కాశీవిశ్వనాధం పట్రాయుడు/kasi viswanadham patrayudu
Amlet damlet
ఆంమ్లేట్ - డాంమ్లేట్ .
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
REkkala kastam
రెక్కల కష్టం
- వరలక్ష్మి నున్న
ఓ breaking news
ఓ బ్రేకింగ్ న్యూస్
- బివిడి ప్రసాద రావు
chettu baadha
చెట్టు బాధ
- లక్ష్మీ కుమారి.సి