ఆ ఆసుపత్రి అరుగుమీద చాలా కాలం నుండి చూస్తున్నాను. ఎవరో పిచ్చివాడు చుట్టూ చెత్త కాయితాలు,. పెరిగిపోయి రాగి రంగులో ఉన్న తైల సంస్కారం లేకుండా అట్టకట్టి పోయి ఉన్న జుట్టు ఎన్నేళ్లుగా అలా ఉన్నాడో కూడా ఎవరికీ తెలియదు.
కానీ అతనెప్పుడూ అరవటం కానీ, బూతులు తిట్టడం కానీ ఎవరూ చూసి ఎరగరు. ఏదో ఆలోచిస్తూ మగతగా ఉంటాడు. కళ్ల కింద నల్లని పెద్ద పెద్ద గీతలు జీవితంలో ఎంతో అలిసిపోయి ఓడిపోయినట్టుగా చెపుతున్నాయి. ప్రస్తుతం అతను పరిసరాలను గుర్తుపట్టేలా లేడు. అతని వాలకం చూసిన ఎవరికైనా అతనో పిచ్చి వాడు అయ్యి ఉంటాడని అనుకోక మానరు. ఎంత పిచ్చి వాడికైనా ఆకలి అనేది ఉంటుంది కదా. ఎవరు అతన్ని పట్టించుకుంటున్నారో లేదో తెలియదు కానీ నేను మాత్రం అప్పుడప్పుడు చిప్స్ ప్యాకెట్లు, మ్యారీ బిస్కట్లు అతను కూర్చున్న అరుగుమీద పెట్టేసి వెళ్ళి పోయే వాడిని. మా ఇంట్లో వారం రోజులు ఏదో ఒక పూజా, ప్రసాదం తప్పని సరి. అప్పుడప్పుడు కొద్దిగా అన్నం, ప్రసాదం ఒక అరిటాకులో పొట్లం లా కట్టి అతనికి అందిస్తే వాటివైపు చూస్తూ తనలో తనే నవ్వుకునే వాడు. నేను నా ఉద్యోగం అవీ చూసుకుని తిరిగి ఆ అరుగు వైపు చూస్తే నేను ఇచ్చిన అరటి ఆకులోని పదార్ధాలు తిని ఆకును కింద పడేసి నట్టుగా అనిపించి నేను చాలా సంతృప్తి చెందే వాడిని.
అప్పుడప్పుడు అతను ఆ ఆసుపత్రి అరుగుమీద కనపడే వాడు కాడు. అతనికి ఏమైనా అయ్యిందేమో అని కంగారు పడుతూ చుట్టుపక్కల చూసే వాడిని. ఏదో సెంటిమెంట్ వెంటాడి అతని కోసం ఆ చుట్టుపక్కల అంతా గాలించే వాడిని. తెలియకుండానే ఆ పిచ్చి వాడంటే ఏదో అవ్యక్తమైన అనుబంధం ఏర్పడింది. ఆ భావంతోనే అతను అక్కడ కనపడకపోయే సరికి అయిన వాడిని దూరం చేసుకున్నట్టుగా అనిపించేది. నా ఆలోచనలన్నీ అతని చుట్టే పరిభ్రమించ సాగాయి.
అప్పటివరకూ ఆ పిచ్చి వాడు ఆక్రమించిన అరుగును ఎలా ఖాళీ చేయించాలో తెలియక సతమతమవుతున్న ఆసుపత్రి స్టాఫ్ శుబ్రంగా అరుగును పినాయిల్ తో కడిగి అతను రాకుండా జాగ్రత్తగా చూసుకునే వాళ్ళు.
మా ఇంటికి ముందు పెద్ద అరుగు ఉండేది. నేను ఒక గ్రంధాలయంలో పనిచేస్తూ ఉండటం వల్ల మా ఇంటికి ముందుగా ఉదయం ఆరుగంటల లోపే అన్ని తెలుగు పేపర్లూ,ఆంగ్ల పేపర్లూ వచ్చేవి. రోజూ ఉదయం తొమ్మిది గంటల తర్వాత మా అటెండర్ వాటిని అన్నిటినీ మడతపెట్టి టౌన్ లో ఉన్న మా గ్రంధాలయానికి తీసుకు వెళ్ళే వాడు. ఆ లోపు ఆ చుట్టుపక్కల ఎంతోమంది మా అరుగుమీద కూర్చుని అన్ని పేపర్లూ చదివేసే వాళ్ళు.
ఒక రోజు నా దృష్టి ఆసుపత్రి దగ్గర అక్కడ సన్నివేశం మీద పడింది. వారం రోజుల తర్వాత ఆ పిచ్చి వాడు ఆసుపత్రి అరుగుల దగ్గర తన స్థావరం కోసం చూస్తున్నాడు. ఎవరు పడితే వాళ్ళు వచ్చి కూర్చుంటారని ఆసుపత్రి వాళ్ళు ఆ అరుగుమీద ఒక కార్డ్ బోర్డ్ షీట్ అడ్డంగా పెట్టి అరుగు మీద ఎవరూ కూడా కూర్చోవడానికి వీల్లేకుండా చేశారు. ఆ పార్టిషన్ చేసిన అరుగు గదిలో మందుల పెట్టెలు ఇంకేవో ఆసుపత్రికి సంబంధించిన సామానుతో నింపేశారు.
పాపం ఆ పిచ్చి వాడు చాలా సేపు చూసి చూసి అరుగు కింద తను తెచ్చుకున్న అట్టముక్కలు పరుచుకుని కూర్చున్నాడు. నా గుండెలు తేలికపడి కొద్ది క్షణాలు హాయిగా ఊపిరి పీల్చుకున్నాను. కానీ అతని పరిస్తితి చూశాక నాకు చాలా జాలి వేసింది. మనుషులు ఎంత కఠినంగా ఉంటారో అర్ధమయ్యింది. నాలో దాగిఉన్న మానవత్వం ఆ క్షణాన ఉవ్వెత్తున బయటకు వచ్చింది.
అప్పుడు అనుకున్నాను. మా ఇంట్లో వాళ్ళు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా కూడా మా విశాలమైన అరుగుమీద కాస్త ఆ పిచ్చి వాడికి చోటు ఇవ్వాలని అనుకున్నాను. అతన్ని మాటికి మాటికి పిచ్చి వాడు అంటూ సంభోదించడం నాకు చాలా ఇబ్బందికరంగా ఉంది. అతని పేరు తెలిసి ఉంటే నాకు ఈ ఇబ్బంది తప్పేది. అనుకున్నదే తడవుగా మా అటెండర్ సహాయంతో అతని మకాం మా అరుగుమీదకు మార్చాను. అతను కొద్ది క్షణాల పాటు రెప్ప వాల్చకుండా నావైపే చూశాడు. ఏదో అర్ధమయ్యి , అర్ధం కానట్టుగా ఉంది అతని పరిస్తితి. కానీ అతని కళ్ళల్లో అప్రయత్నంగా నీళ్ళు చిప్పిల్లడం గమనించాను.
మా ఇంటికి పేపర్ చదువుకోవడానికి వచ్చే వాళ్ళు అతను మా అరుగుల మీద కూర్చోవడం సహించలేకపోతున్నట్టు అర్ధమయ్యింది. ఇప్పుడు వాళ్ళ స్వేచ్ఛకు భంగం వాటిల్లినట్టుగా బాధపడుతున్నారు. మా ఇంట్లో ఆడవాళ్ళకు చెప్పి "అలాంటి వాళ్ళకు నడి వసారాలో చోటిస్తే మీకు ధరిద్రం పట్టుకుంటుంది. వెంటనే సార్ కు చెప్పి వాడిని ఇక్కడనుండి వెళ్లగొట్టించండి. ఆ పిచ్చి వెధవని చూస్తే ఇక మీ ఇంటికి ఎవరు రావాలన్న భయపడతారు. " అంటూ వాళ్ళ మనసు పాడుచెయ్యాలని అన్ని ప్రయత్నాలు చేశారు. కానీ నేను తలపెట్టిన ఏ పనినైనా మా ఇంట్లో ఎవరూ వ్యతిరేకించరు అన్న నమ్మకం నాకు ఉంది. . .
నా ఆలోచన ఏమిటంటే ముందు అతనెవరో ఎక్కడనుండి వచ్చాడో తెలుసుకోవడం నా కర్తవ్యంగా భావిస్తున్నాను. ఆ రోజు నేను ఒక ఆశ్చర్యకరమైన సన్నివేశాన్ని చూడాల్సి వచ్చింది. . ఎవరో స్టూడెంట్లు అతనికి కాయితం మీద ఏదో వ్రాసి ఇస్తున్నారు. దానికతను తనదగ్గర ఉన్న బొగ్గు ముక్కతో ఏదో తిరిగి వ్రాసి ఇస్తున్నాడు. నోటినుండి మాత్రం ఒక్క మాట కూడా బయటకు రావడం లేదు. . నేను ఆసక్తిగా కొద్దిసేపు అక్కడే నిలబడి చూస్తూంటే నాకు ఒక విషయం అర్ధమయ్యింది. . ఆ స్టూడెంట్లు ఇంగ్లిష్ గ్రామర్ గురించి కొన్ని ప్రశ్నలు అడుగుతూ ఉండటం దానికి ఆ పిచ్చివాడు సమాధానాలు వ్రాసి ఇవ్వడం వాళ్ళు అది చూసి ఆనందంగా తిరిగి వెళ్లిపోవడం నా కంట పడింది. నేను కూడా ఒక జనరల్ నాలెడ్జ్ ప్రశ్న ఒక కాయితమ్మీద వ్రాసి ఇచ్చాను. దానికి వెంటనే అతను సమాధానం అదే కాయితమ్మీద బొగ్గుముక్కతో వ్రాసి ఇచ్చాడు. నేను ఆనందంగా అతని కళ్ళల్లోకి చూసి ఏదో అడగాలని ప్రయత్నించాను. కానీ అతను అదేమీ పట్టనట్టుగా ఏదో ఇంగ్లిష్ పేపర్లోకి తొంగి చూసి నవ్వుకుంటున్నాడు. నా మెదడులో రకరకాల ప్రశ్నలూ -సందేహాలు.
ఈ సంఘటనతో నాకు అతన్ని గురించి తెలుసుకోవాలన్న కోరిక బలీయంగా కలిగింది. ఖాళీ సమయాలలో నా గ్రంధాలయంలో ఎన్నో పేపర్లు చదువుతున్నప్పుడు ఎంతోమంది దీన గాధలు పేపర్లలో వస్తూ ఉండటం నేను ఆసక్తిగా గమనించడం జరుగుతూ ఉన్న సమయంలో నాకు మా కాలనీలో ఆ పిచ్చి వాడు తటస్టించడం నా ఆలోచనలకు ఊపిరి పోసుకున్నట్టయ్యింది..
ఆ రోజు ఆదివారం . సెలవు దినం అవ్వడం వల్ల అందరమూ ఆలస్యంగా నిద్ర నుండి లేచాము. కిటికీ తలుపు తెరిచి చూశాను. యధాప్రకారంగా కాలనీలో వాళ్ళు ఒక మూలగా కూర్చుని పేపర్లు చదువుకుంటున్నారు. కానీ పిచ్చి వాడు మాత్రం కనపడలేదు. అక్కడ దృశ్యాన్ని చూసి విభ్రమ చెందాను. అక్కడ పిచ్చి వాడు స్థానంలో చెత్త కాయితాలు చిందరవందరగా పడేసి ఉన్నాయి.
నాకు కంగారు పుట్టింది. వెన్నులో సన్నటి జలదరింపు ప్రారంభమయ్యి మొహం చెమటతో ముద్దయ్యింది. మనసు ఎందుకో వికలం అయిపోయింది. వెంటనే వీధి తలుపు తెరిచి అక్కడ కూర్చున్న వాళ్ళను అడిగాను "ఇక్కడ రోజూ కూర్చుని ఉండే పిచ్చి అతను ఏమయ్యాడని ?"
"ఏమో మాస్టారు. పొద్దున్నే మేము ఇక్కడికి వచ్చేటప్పటికే కనపడలేదు. చెత్త అంతా వదిలి పోయాడు. పోనీలెండి మాష్టారు! పీడ వదిలింది. ఇటువంటి వాళ్ళు ఈ ప్రపంచంలో వీధి వీధికి కనిపిస్తారు. వీళ్ళనందరినీ ఉద్దరించడం మన వల్ల అవుతుందా ? చూసే చూడనట్టు వదిలేయ్యాలి. వాళ్ళ బ్రతుకు వాళ్ళు బ్రతుకుతారు. ఇప్పటికే మీరు చాలా చేశారు. దయచేసి ఇక అతన్ని వదిలేయ్యండి సార్. ఎక్కడికో పోయి ఉంటాడు. మీకే పాపం అంటుకోదు . మీరు వాడిని బలవంతాన గెంటేయ్యలేదు కదా. పిచ్చి వాళ్ళకు ఏముంది ? ఈ రోజు ఇక్కడ, రేపు ఇంకో చోట తిరుగుతూనే ఉంటారు. మనం పట్టించుకో కూడదు .." అని అందరూ కలిసి ఊకుమ్మడిగా చెపుతూ ఉంటే వాళ్ళ మాటలు నాకు అర్ధ రహితమైనవిగా తోచాయి. వాళ్ళవి ఎంత పాషాణ హృదయాలో అర్ధమవుతోంది. వాళ్ళంతా మానవతా విలువలకు నీళ్ళు వదిలేశారు. కనీసం కర్టెసీ తెలియని మనుష్యులులా అనిపించారు. ఆ విషయానికొస్తే అసలు నా అరుగుమీద ఏళ్ల తరబడి ఈ రోడ్ల మీద తిరిగే వాళ్ళందరికీ పేపర్లు చదువుకోవడానికి ఎందుకు ఆశ్రయం కలిగించాలి ? మొదటినుండి నాకున్న అభిలాషలు, పద్ధతులు వేరు. సాధ్యమైనంతవరకు జీవితంలో మంచి చెయ్యలేకపోయినా చెడు పనులు మాత్రం చేయకూడదు. చూస్తూ చూస్తూ ఎవరి హృదయాలను గాయపరచకూడదు. మనకున్నంతలో అవతలి వారికి సాయపడాలి. అది నా థీరీ.
ఎక్కడికెళ్ళాడు చెప్మా అనుకుంటూ కొద్దిసేపు అక్కడే నిలబడి పోయాను. ఎవరు తీసుకెళ్లారో తెలియదు. నాకు చాలా నిరాశగా అనిపించింది. లుంగీతోనే మా వీధి చివర క్లబ్బు దాకా వెళ్ళి చూశాను. ఎక్కడా అతని ఆనవాళ్ళు లేవు. .ఆ తర్వాత నాకో ఆశ్చర్యకరమైన విషయం తెలిసింది. తమ స్వాతంత్ర్యానికి భంగంగా ఆ పిచ్చి వాడు ఉంటున్నాడని మా ఇంటికి పేపర్లు చదువుకోవడానికి వచ్చే ఆ కాలనీ వాళ్ళే అతన్ని పోలీసు డిపార్ట్మెంట్లో ఎవరికో చెప్పి మా ఊళ్ళో ముష్టి వాళ్లందరికోసం ఏర్పాటు చేసిన ఒక ఆశ్రమానికి తరలించినట్టు తెలిసి షాక్ తిన్నాను. మళ్ళీ అతన్ని కలవడానికి వెంటనే అవకాశం రాలేదు. అతని గురించి ఆ చుట్టుపక్కల వాళ్ళందరూ పట్టించుకోవడం మానేశారు.
నాకు మాత్రం అతని గురించి అంతగా ఆలోచించాల్సిన అవసరం ఎందుకొచ్చింది అంటే అతను పూర్తి మానసిక వైకల్యంతో ఉన్నాడు అనుకుంటే నమ్మ బుద్ది కావడం లేదు. అలా అయితే ఎంతటి కఠినమైన ఇంగ్లిష్ గ్రామర్ కు జవాబులు కాయితం మీద వ్రాసి ఇస్తున్నాడు అంటే అలా ఎలా అనుకోవడం ? . దేశాల పేర్లు , ఇతర జనరల్ నాలెడ్జ్ కు సంబంధించిన ప్రశ్నలకు కూడా తడుముకోకుండా సమాధానం ఇస్తున్నాడు అంటే ఖచ్చితంగా అతను బాగా చదువుకున్న వాడు అయ్యి ఉండాలి. ఆ క్షణంలో నేను విచిత్రమైన భావోద్రేకానికి లోనయ్యాను. అతనలా మారడానికి బలమైన కారణాలు ఏవో ఉండి ఉండాలి. ఎలాగైనా అతని గురించి వివరాలు శోధించాలి.
చాలా రోజులనుండి మా ఇంటికి వచ్చి నన్ను కలవాలని అనుకుంటున్న నా కాలేజీ మిత్రుడు పాపారావు ఆ రోజు గణపవరం నుండి హటాత్తుగా ఫోన్ చేసి నన్ను చూడాలని అనిపించి వెంటనే బయలుదేరి వస్తున్నానని అని ఒక రెండు గంటల తర్వాత నా ముందు ఉండటంతో చాలా సంతోషం అనిపించింది. కానీ అతనితో మాట్లాడుతున్నాననే మాటే కానీ నా ధ్యాస అంతా ఆ పిచ్చి వాడిపైనే ఉంది. నేను ఎంతగా అతనితో కనెక్ట్ అయ్యానంటే అతను ఎక్కడో క్షేమంగా ఏదో అభాగ్యుల ఆశ్రమంలో ఉన్నా కూడా అతని గురించే ఆలోచన. నేను పరధ్యానంగా ఉండటంతో పాపారావు నన్ను గుచ్చి గుచ్చి అడగడంతో ఆఖరికి ఆ పిచ్చి వాడి గురించి చెప్పాల్సి వచ్చింది. నావీ, పాపారావువి మొదటినుండి ఒకటే తరహా ఆలోచనలు అవ్వడంతో అతను ఆ విషయాన్ని అంత తేలిగ్గా వదిలిపెట్టలేదు. దాని ఫలితమే మీమిద్దరం ఆ పిచ్చివాడు ఉంటున్న అభాగ్యుల ఆశ్రమానికి వెళ్ళడం . కొద్దిసేపు అతన్నే పరిశీలనగా చూశాక పాపారావు జేబులోంచి ఏదో ఫోటో తీసి ఆ పిచ్చి వాడినీ, ఆ ఫోటోనూ బాగా పరికించి చూస్తున్నాడు. అతని ముఖం గంభీరంగా మారిపోయింది. గట్టిగా ఒకసారి ఊపిరి తీసుకుని వదిలేశాడు. అతని పరిస్తితి చూస్తూ నేను అయోమయంగా నిలబడి పోయాను.
"ఇక వెళదామా ? నీతో ఒక ముఖ్య విషయం మాట్లాడాలి. ఇక్కడొద్దు. మీ ఇంటికి వెళ్లి తీరిగ్గా మాట్లాడుకుందాం " అన్నాడు పాపారావు .
ఎదురుచూడని అతని మాటలకు కొద్దిగా కలవరపడ్డాను. అతనేమీ చెప్పబోతున్నాడో చాలా సస్పెన్స్ గా అనిపించింది.
భోజనాలు అవీ అయ్యాక ఇద్దరం దొడ్లో కొబ్బరి చెట్ల కింద కూర్చున్నాం. " చెప్పారా బాబూ ! నువ్వేమి చెప్పాలనుకుంటున్నావో నేను కొద్దిగా కూడా గ్రహించలేక పోతున్నాను. ఆ పిచ్చి వాడిని అభాగ్యుల ఆశ్రమంలో చూశాక నీలో చాలా మార్పు వచ్చింది. నాకు నీనుండి సమాధానం కావాలి " అన్నాను అయోమయంగా చూస్తూ.
" రమణా !నేను ఇంత హటాత్తుగా ఫోన్ చేసి ఎందుకొచ్చానో తెలుసా ? ఈ రోజు ఉదయం పేపర్లో ఇక్కడ ఆశ్రమంలో ఉన్న పిచ్చివాడి గురించి ఫోటోతో సహా వచ్చింది. అతను మా వూరి వాడే అని వెంటనే గ్రహించాను. కారణం అప్పటికే ఇతని కోసం వాళ్ళ వాళ్ళు గత రెండు నెలలుగా తీవ్రంగా గాలిస్తున్నారు . ఇతను మా వూరి రిటైర్డ్ హెడ్ మాస్టర్ రామారావు గారి రెండవ అబ్బాయి .పేరు మధు. చదువులో జీనియస్. కాలేజీ టాపర్. ఇతని అన్నగారు నారాయణకు చదువు సరిగ్గా అబ్బలేదు. పైగా అతని కన్నా ముందే మధుకు మంచి ఉద్యోగం రావడం మా వూళ్ళో వాళ్ళందరూ నారాయణను అసమర్ధుడిగా లెక్కకట్టి అవమానించడం అది తట్టుకోలేక ఒకరోజు మధుకు నారాయణ ఏదో మందు పెట్టాడని అప్పటినుండి మధు ఎక్కడెక్కడో పిచ్చి పట్టిన వాడిలా తిరుగుతున్నాడని ఊళ్ళో వాళ్ళందరూ అనుకోవడం అందరితో పాటు నా దృష్టికి కూడా వచ్చింది. ఇదిగో ఈ రోజు పేపర్లో ఇతని ఫోటో చూడటం, నాకు అనుమానం వచ్చి రామారావు గారి దగ్గర నుండి మధు ఫోటో సేకరించడం జరిగిపోయాయి. పూర్తిగా కన్ఫర్మ్ చేసుకునే అంతవరకు నేను రామారావు గారికి పేపర్లో ఫోటో పడిన విషయం కానీ, నేను ఈ వూరు వస్తున్న విషయం కానీ చెప్పలేదు. ఇప్పుడు హండ్రెడ్ పెర్సెంట్ రూఢి అయిపోయింది అతను ఇతనే నని. రాగానే ఆ ఫోటో చూపించి నిన్ను ఆ వ్యక్తిని ఏమైనా చూశావా అని అడుగుదామని అనుకున్నాను. వెతకబోయిన తీగ కాలికి తగిలినట్టు నువ్వే ఆ విషయం ఎత్తడంతో నా పని విజయవంతంగా పూర్తి అయ్యింది. . ఇక మధుని తీసుకుని వాళ్ళ తల్లి తండ్రులకు అప్పగించడం, అతన్ని నాకు ఆ వూళ్ళో బాగా తెలిసిన ఒక మానసిక వైద్యుడికి చూపించే విషయం కూడా ఆలోచించేసాను" అని ఉద్వేగంగా చెప్పుకు పోతున్నాడు పాపారావు. .
అప్పటివరకూ పేరుకుపోయిన సందిగ్తత, స్తబ్దత, అనుమానాలు నాలో ఒక్కసారిగా పటాపంచలయ్యాయి. ఎప్పుడైతే బయట పిల్లలకు ఇంగ్లిష్ గ్రామర్కు సంబంధించిన సందేహాలకు సరైన సమాధానాలు చెప్పడం జరిగిందో అప్పుడే నేను ఇతడు బాగా చదువుకుని ఉండి ఉంటాడని గ్రహించడం జరిగిపోయింది. అతని మెదడులో కొన్ని టిస్యూలు పని చెయ్యకపోయినా కొన్ని జ్ఞాపకాలు మాత్రం చెక్కు చెదరకుండా సజీవంగా ఉన్నాయని అర్ధమయ్యింది.
ఆ పిచ్చి వాడు మధు విషయంలో నేను ఆచూకీ తీసి అతనెవరో ఎక్కడి వాడో తెలుసుకోవాలన్న నా ప్రయత్నానికి ఊపిరి పోసి నా ప్రియ మిత్రుడు పాపారావు పూర్తి భాధ్యత నెత్తిమీద వేసుకుని అతన్ని క్షేమంగా అతని తల్లి తండ్రులకు అప్పగించడం విషయంలో తీసుకున్న శ్రద్ద , నిజాయితీని నా జీవిత కాలంలో ఎప్పటికీ మర్చిపోలేని మధుర జ్ఞాపకంగా మిగిల్చింది. ******
సమాప్తం