సింహం చిత్తు ఒక అడవిలో సమీరం అనే ఎలుగు బంటి ఉండేది.దానికి పందెం కాయడమంటే ఇష్టం. సమీరం తెలివితేటల గురించి విన్న మృగరాజు తనతో పందెం కాయడానికి రమ్మని ఎలుగుబంటికి ఆహ్వానం పంపింది. ఎలుగుబంటి సింహం వద్దకు వచ్చింది. "నీ గురించి చాలా విన్నాను. నాతో ఏవైనా మూడు పందెంలు కాసి గెలువు చూద్దాం. నీవు అడిగింది ఇస్తాను"అంది సింహం. "మహారాజా!నన్ను చూసి భయపడి పెద్దపులి పారిపోతుంది" అంది ఎలుగు. "ఇది జరగని పని" అంది సింహం. "నా వెంట రండి" అని ముందుకు నడిచింది ఎలుగుబంటి.సింహం ఎలుగు వెంట నడిచింది. కొంతదూరం వెళ్ళాక తన నివాసం బయట పెద్దపులి నక్కతో కబుర్లు చెబుతూ కనిపించింది. ఎలుగుబంటు వేగంగా పులివైపు నడిచింది. సింహం చెట్టు చాటున నిలబడి చూడసాగింది. శబ్ధానికి నక్క, పులి తలతిప్పి ఎలుగుబంటును చూసాయి.భయంతో పులి పరుగందుకుంది. నక్క కూడా పులితో పాటు పరుగెత్తి పోయింది.అది చూసి సింహం ఆశ్చర్యంతో 'ఎలుగుకు భయపడి పులి పరుగెత్తిపోవడం ఏంటి?'అనుకుంటూ తలగోక్కుంది. ఎలుగు సింహం దగ్గరకు వచ్చింది. "నాకంతా అయోమయంగా ఉంది. రెండవపందెం ఏమిటో చెప్పు.మూడు పందాలు గెలిస్తే నీవు కోరినదిస్తాను" అంది సింహం. "మహారాజా! మరునాడు నా పుట్టినరోజు ఉంది.అందరినీ ఆహ్వానిస్తున్నాను. మీరు తప్పకుండా రావాలి. నా పుట్టినరోజు వేడుకలో గజరాజు చిందులేస్తుంది. ఇది రెండవపందెం"అంది ఎలుగు. 'గజరాజుఏంటి! ఎలుగుబంటి జన్మదిన వేడుకల్లో నాట్యం చేయడామా!ఇది జరగని పని' అనుకుంటూ 'సరే' అంది సింహం. "మహారాజా!నా పుట్టినరోజు వేడుకలకు చేపలరాజును,రాణిని ఆహ్వానించాను. వస్తారు.ఇది నా మూడవపందెం" అంది ఎలుగుబంటి. 'చేపలు జన్మదిన వేడుకలకు ఎలావస్తాయి? ఇది జరగని పని. అనుకుంటూ 'సరే' అంది సింహం. "మహారాజా!మీరు మూడు పందేలు గెలవమన్నారు.నేను అదనంగా నాలుగవ పందెం కూడా కాస్తున్నాను. నా పుట్టినరోజు వేడుకలకు వచ్చిన జంతువులన్నీ నా కాళ్ళు పట్టుకుని నమస్కరిస్తాయి. చూడండి" అంది ఎలుగుబంటు. సింహానికి మతిపోయినంత పనయింది. "సరేచూద్దాం" అంది.మృగరాజు ఎలుగు జన్మదిన వేడుకలకు వెళ్ళింది. జంతువులన్నీ కానుకలతో వచ్చాయి. "గజరాజా!నిన్ను ఒక కోరిక కోరుతున్నాను. నీవు నెమలితో కలిసి నాట్యం చేస్తూ, అందరినీ ఆనందపరచాలి" అంది ఎలుగు. ఏనుగు మారుమాట్లాడలేదు. తల, తొండం ఊపుతూ, కాళ్ళను లయబద్దంగా కదిలిస్తూ నాట్యం చేయసాగింది. అది చూసి సింహం ఆశ్చర్యంతో తలగోక్కుంది. ఇంతలో ఒక కోతి పల్లెనుండి తెచ్చుకున్న డబ్బాలో నీళ్లు నింపి,అందులో చేపలను ఉంచుకుని వచ్చింది.కోతి ఎలుగుతో "మిత్రమా! నీ పుట్టినరోజు వేడుకలకు వస్తామంటున్న చేపలరాజును,రాణిని తీసుకొచ్చాను" అంది.పుట్టినరోజు వేడుకలకు వచ్చిన చేపలను చూసి సింహానికి మతిపోయినంత పనయింది."శెభాష్! మూడు పందాలు గెలిచావు.పుట్టినరోజు కానుకగా ఏమి కావాలో కోరుకో!"అంది సింహం. "మహారాజా!నన్ను ఒకరోజు ఈ అడవికి రాజుగా ప్రకటించండి"అంది ఎలుగుబంటి. "అదెంతపని"అంటూ సింహం ఈక్షణం నుండి రేపటిదినం వరకూ అడవికి ఎలుగుబంటి రాజుగా ఉంటుందని ప్రకటించింది. వెంటనే జంతువులన్నీ పూలు చల్లి ఎలుగుబంటి కాళ్ళకు మ్రొక్కసాగాయి. "మహారాజా!నాలుగవ పందెం కూడా గెలిచాను"అంది ఎలుగు మెల్లిగా. సింహం విందు ఆరగించి జూలు గోక్కుంటూ గుహకు వెళ్లిపోయింది. "ఈ అడవిలోని నాలుగు ఎలుగుబంట్లలో ఒకదానికి భయంకరమైన అంటురోగం వచ్చిందని విన్నాను. అందుకే ఏ ఎలుగు బంటి కనిపించినా దూరంగా పరుగెడుతున్నానంటూ పులికి చెప్పి, పులి మా జోలికి రాకుండా చేశావు.నక్కమిత్రమా అందుకు కృతజ్ఞతలు"అంది ఎలుగు నక్కతో. "గజరాజా!ప్రతిరోజూ నీకు నేను తేనె తెచ్చి ఇస్తున్నందుకు ప్రతిగా మాట తప్పకుండా నా పుట్టినరోజు వేడుకల్లో నాట్యం చేసి అలరించావు.ధన్యవాదాలు"అంది ఏనుగుతో ఎలుగు. "నా కోరిక ప్రకారం చేపలను నా జన్మదిన వేడుకలకు తీసుకొచ్చిన నీకు కృతజ్ఞతలు" అంది కోతితో ఎలుగు. "నేను ఒకరోజు ఈ అడవికి రాజునవుతానని మీ అందరితో పందెం కాశాను. మీరు అది జరగని పని అన్నారు. అదే జరిగితే కాళ్ళు పట్టుకుని నమస్కరిస్తామన్న మీరు మాట నిలబెట్టుకున్నందుకు కృతజ్ఞతలు" అంది జంతువులతో ఎలుగు. సింహం గుహలోకెళ్లి 'ఈ తెలివైన ఎలుగుతో ఇంకెప్పుడూ పందెం కట్టకూడదు.పందెంలో ఒకరు గెలిస్తే వెయ్యిమంది ఓడిపోతారు. అసలు పందెం కట్టడమే చెడ్డ అలవాటు.' అనుకుంటూ నిద్రలోకి జారుకుంది.