శంఖచూడుడు
(పురాణ గాథలు-5)
మరీచిమహర్షి కుమారుడు కశ్యపమహర్షి. ప్రసూతి-దక్షప్రజాపతి దంపతులు తమ కమార్తెలు పదమూడు మందిని కశ్యపునకు ఇచ్చి వివాహం చేసారు. కశ్యప-ధను దంపతుల పౌత్రుడు దంభుడు. ఈ దంభుడు గొప్ప విష్ణు భక్తుడు. పుష్కర క్షేత్రంలో లక్ష సంవత్సరాలు కృష్ణమంత్రాన్ని జపిస్తూ తపస్సు చేసాడు. ఆ తపస్సుకు ఎంతో సంతోషించిన నారాయణుడు ప్రత్యక్షమై ఏమి కావాలో కోరుకోమని అడిగాడు. గొప్ప బలపరాక్రమాలు గలవాడు, తనను మించిన విష్ణుభక్తుడు, దేవతలందరినీ జయించగలవాడు అయిన కుమారుణ్ణి తనకు ప్రసాదించమని కోరాడు. శ్రీహరి అడిగిన వరాన్ని అనుగ్రహించాడు.
దంభుని భార్య గర్భం ధరించి ఒక శుభ ముహూర్తాన చక్కటి కుమారుడికి జన్మనిచ్చింది. తల్లితండ్రులు ఆ బాలునికి ‘శంఖచూడుడు’ అని నామకరణం చేసారు. ఈ శంఖచూడుడు పూర్వజన్మలో ‘సుధాముడు’ అనే గోపాలుడు. శ్రీకృష్ణునికి అత్యంత సన్నిహితుడు. ఒకసారి శ్రీకృష్ణుడి ప్రియురాలు రాధాదేవి జగన్మోహన సౌందర్యాన్ని చూసి మోహితుడయ్యాడు. అప్పుడు రాధ సుధాముని ‘దానవుడవు కమ్ము’ అని శపించింది. నిజానికి అది శాపం కాదు. సుధామునికి ముక్తి మార్గం. సుధామునిలో ఉండే కామభీజం కూడా నశిస్తేనే అతనికి గోలోక ప్రాప్తి లభిస్తుంది. రాధాదేవి ఇచ్చిన శాపానికి బయంతో వణికిపోతూ శ్రీకృష్ణుణ్ణి రక్షించమని ప్రార్థించాడు.
‘నీవు దానవుడుగా పుట్టి శివుని చేతిలో మరణిస్తావు. ఈ శాపం మూలంగా నీలో ఉన్న కొద్దిపాటి చెడుగుణం కూడా నశించి తిరిగి నా భక్తుడిగా గోలోకం చేరుకుంటావు’ అని కృష్ణుడు సుధామునికి నచ్చచెప్పాడు. ఆ కారణంగా సుధాముడు మరుజన్మలో శంఖచూడుడు అనే రాక్షసుడిలా పుట్టాడు.
పెద్దవాడయ్యాక శంఖచూడుడు బ్రహ్మకోసం తపస్సు చేసి దేవతలెవరూ తనను ఓడించకుండా వరం పొందాడు. బ్రహ్మదేవుడు అతనికి ‘కృష్ణ కవచం’ ఉపదేశించి మహా తపస్వి అయిన ధర్మద్వజుని కుమార్తె తులసిని వివాహం చేసుకుంటే అంతా మంచి జరుగుతుందని ఆదేశించాడు.
అప్పుడు శంఖచూడుడు “దేవీ! నువ్వు చెప్పినది సగం సత్యం, సగం అసత్యం. సంసారంలో భార్యా భర్తల మనసులు కలిసి, భార్య అనురాగవతి అయితే ‘అమృతం’, లేనిచో ‘విషం’. చతుర్విధ పురుషార్థాలకు స్థానం స్త్రీ. పురుషుని బలానికీ, ఉత్సాహానికి, సంతానానికి స్త్రీ పట్టుగొమ్మ. నేను కాముకుడను గాను. నేను పూర్వజన్మలో శ్రీకృష్ణుడి మిత్రుడైన సుధాముడను. రాధాదేవి శాపం వలన దానవేశ్వరుడిగా జన్మించాను. వాసుదేవుని వరంతో నాకు పూర్వజన్మ స్మృతి కలిగింది. నాతో వివాహాన్ని అంగీకరించు” అని చెప్పి విరమించాడు.
ఆ సమయంలో విధాత ప్రత్యక్షమై ఇద్దరినీ గాంధర్వ వివాహం చేసుకొని సుఖించమని, జన్మానంతరం ఇద్దరికీ వైకుంఠప్రాప్తి లభిస్తుందని చెప్పి నిష్క్రమించాడు. తులసిని వివాహం చేసుకొని వచ్చిన శంఖచూడుడికి దానవులు స్వాగత సన్నాహాలు చేసారు. శుక్రాచార్యులు శంఖచూడుని సమస్త దానవ లోకానికి సార్వభౌముడిగా పట్టాభిషేకం చేసాడు. శంఖచూడుడు తన సైన్యంతో దేవతలపై యుద్ధానికి వెళ్ళి ఇంద్రుణ్ణి ఓడించాడు. తన పరాక్రమంతో ముల్లోకాలను జయించి, దిక్పాలకులపై అధికారాలను, పంచభూతాలపై ఆధిపత్యాన్ని సాధించాడు.
దానవ వంశంలో జన్మించినా పరిపాలనలో దానవ లక్షణాలు ఎక్కడా లేవు. జన్మత వచ్చిన శతృత్వం వలన అతనికి దేవతలతో మాత్రమే వైరం. అతని రాజ్యంలో రోగాలు, అంటువ్యాధులు, దుర్భిక్షాలు లేవు. అనావృష్టి బాధలు లేవు. ప్రజలు సుఖ సంతోషాలతో ప్రశాంతంగా గడపసాగారు. అతని భార్య తులసి సాద్వీమణి, పతివ్రత. అన్నిటిలో భర్తకు తోడు నీడగా ఉండసాగింది. తులసి పుణ్యఫలం శంఖచూడునికి రక్షగా ఉంది.
శంఖచూడుడు పొందుతున్న ప్రజాభిమానాన్ని చూసి దేవతలు ఓర్వలేక పోయారు. బ్రహ్మగారితో కలిసి విష్ణుమూర్తిని ముప్పు తప్పించమని వేడుకున్నారు. విష్ణువు శంఖచూడుని పూర్వ వృత్తాంతం దేవతలకు తెలిపి, ఆ దానవుని చావు శంభుని చేతిలో ఉంది కావున అందరినీ శివలోకానికి తీసుకొని వెళ్లాడు. బ్రహ్మ, విష్ణువు, ఇంద్రుడు మిగిలిన దేవతలు నందీశ్వరుని అనుమతితో సర్వేశ్వరుని సన్నిధిని చేరుకున్నారు. రుద్ర ప్రమద భక్త గణాలు సేవిస్తుండగా శరీరం అంతా భస్మాన్ని పూసుకొని సుందరమూర్తియైన సర్వేశ్వరుడు దర్శన మిచ్చాడు.
ఆ దివ్యమంగళ రూపాన్ని దర్శించిన దేవగణాలు ఆనందంతో కన్నీరు కారుతుండగా శంఖచూడుని వృత్తాంతాన్ని మనవి చేసి తమ స్వర్గాధిపత్యాన్ని తిరిగి తమకు వచ్చేటట్లు చేయమని ప్రార్థించారు. అప్పుడు శంకరుడు “శంఖచూడుని వృత్తాంతం నాకు తెలుసు. ఆ దానవుణ్ణి నేను సంహరిస్తాను” అని అభయమిచ్చి పంపాడు. రుద్రుడు తన శిష్యుడైన పుష్పదంతుని శంఖచూడుని వద్దకు దూతగా పంపాడు.
పుష్పదంతుడు దానవుని నగరానికి వెళ్ళి రుద్రుడు పంపిన సందేశాన్ని ఇలా వినిపించాడు. “వెంటనే దేవతల సంపదను, రాజ్యాన్ని వారికి అప్పచెప్పి వారితో సఖ్యంగా ఉండు. లేదా నాతో యుద్ధం చేసి వీరమరణం పొందు. దేవతలు నా శరణు కోరారు కాబట్టి రెండింటిలో ఒకదానిని ఎంచుకొని నాకు సమాధానం పంపు”.
పుష్పదంతు కైలాసానికి తిరిగి వచ్చి శంఖచూడుని సమాధానాన్ని శివునికి యదాతథంగా వినిపించాడు. ఇది తెలిసి రుద్రగణాలు యుద్ధానికి సమాయత్తం కావడం మొదలెట్టాయి. శంఖ చూడుడు తన భార్య తులసిని జరిగిన విషయం తెలిపాడు. శంకరుని విషయంలో అనాదరణ వద్దని తులసి భర్తకు హితవు చెప్పింది. శంఖచూడుడు ప్రియురాలి మాటలు సున్నితంగా తిరస్కరించి ఆ రాత్రి సుఖంగా నిద్రించాడు.
మరునాడు శంఖచూడుడు విప్రులకు అంతులేని దానాలు చేశాడు. తన పుత్రుని సకల దానవలోకానికి సార్వభౌముని చేసి, భార్యను అప్పగించాడు. సైన్యాధిపతిని పిలిపించి యుద్ధానికి సన్నిద్ధం చేయించాడు. అపార సేనావాహినితో పుష్పభద్రానదీతీరంలో విడిది చేసాడు. ఒక దానవశ్రేష్టుని రుద్రుని వద్దకు రాయభారం పంపాడు.
శాస్త్రపారంగతుడైన ఆ దూత శివుని వద్దకు వచ్చి నమస్కరించి తన ప్రభువు మాటలను ఇలా వినిపించాడు. “విష్ణువు అకారణంగా మధుకైటభులను వధించడం, బలి చక్రవర్తిని పాతాళానికి పంపివేయడం, అన్నింటిని మించి క్షీరసాగర సమయంలో మోహిని వేషంలో వచ్చి అమృతంలో భాగం ఇవ్వకుండా దానవులను మోసగించడం అన్యాయం కాదా! దేవతలను యుద్ధంలో ఓడించి రాజ్యాధికారం పొందడం తప్పు ఎలాగవుతుంది?”
అప్పుడు శంకరుడు చిరునవ్వు నవ్వి “దూతా! నువ్వు చారిత్రక ఆధారాలతో చక్కగా తర్కించావు. వైరాన్ని మిత్రత్వంతో సాధించాలి. జగత్తంతా కాలానికి ఆధీనంలో ఉంటుంది. దానిని నిర్ణయించే కాలపురుషుణ్ణి నేనే. ఇప్పుడు మీకు కాలం అనుకూలంగా లేదు. మీ స్వామికి హితం చెప్పు” అని నిష్క్రమించాడు. దూత శంఖచూడునికి జరిగింది విన్నవించాడు.
యుద్ధభేరీలు మ్రోగాయి. దేవదానవుల మధ్య ధర్మయుద్ధం మొదలైంది. దానవవీరుల దాటికి దేవతలు తట్టుకోలేక పారిపోయారు. అప్పుడు వృషభాన్ని అధిరోహించి, వీరభద్ర, భైరవాదులు వెంటరాగా శంకరుడు యుద్ధభూమి చేరాడు. శంఖచూడుడు రథం దిగి సాంబునికి సాష్టాంగ దండ ప్రమాణం చేసి తరువాత యుద్ధం మొదలు పెట్టాడు. చిన్నగా మొదలైన యుద్ధం అతి త్వరలో భీకర సమరంగా మారింది.
కృష్ణకవచం వున్నంతవరకూ, అ దానవుని సతీమణి తులసి పాతివ్రత్యానికి భంగం కలగనంత వరకూ శంకచూడునికి చావు లేదని గుర్తించిన శంకరుడు మనస్సులో శ్రీహరిని తలిచి చెయ్యాల్సిన పని చెప్పాడు. విష్ణువు ముసలి బ్రాహ్మణ వేషం ధరించి శంఖచూడుని వద్దకు వెళ్ళి కృష్ణకవచాన్ని దానం చేయమని అడిగాడు. మహాదాత అయిన శంఖచూడుడు ఒక్క క్షణం కూడా ఆలోచించకుండా తన కవచాన్ని మాయా బ్రాహ్మణుడికి దారపోసాడు. ఆ కవచాన్ని చేత పట్టి శంఖచూడుని వలె రూపం ధరించి తులసి వద్దకు వెళ్లాడు. వచ్చినవాడు తన భర్త శంకచూడుడు అని తలచిన తులసి అన్ని సపర్యలు చేసింది. విష్ణువు కల్లబొల్లి కబుర్లతో తులసిని పానుపుపై చేర్చాడు. దాంపత్య సుఖాన్ని అనుభవించి ఆమె పాతివ్రత్యాన్ని భంగపరిచాడు. అక్కడ యుద్ధభూమిలో శివుడు తన త్రిశూలాన్ని శంఖచూడునిపై ప్రయోగించాడు. దానితో ఆ దానవుడు బూడిదయ్యాడు. శంఖచూడుడు శాపవిముక్తుడై గోలోకం చేరుకున్నాడు. శంకరుడు కైలాసానికి తిరిగి వెళ్ళిపోయాడు.
తనతో కలిసిన పురుషుడు తన భర్త శంఖచూడుడు కాదని తులసి గ్రహించింది. ‘ఎవరు నువ్వు’ అని నిలదీసింది. విష్ణువు తన నిజ రూపం చూపించాడు. “నా భర్త నీకు అత్యంత ప్రియభక్తుడు కదా! భక్తరక్షకుడవైన నువ్వు ఇలా ప్రవర్తించేవంటే నీది గుండె కాదు బండరాయి అయి ఉండాలి. ఇందుకు ప్రతిఫలంగా నువ్వు రాయివైపో” అని శపించి దుఃఖించ సాగింది.
తులసిని ఎలా ఓదార్చాలో తెలియక విష్ణువు శంకరుణ్ణి తలిచాడు. రుద్రుడు వెంటనే ప్రత్యక్షమయ్యాడు. ఆమెను ఓదార్చాడు. “గతంలో నీవు చేసిన పుణ్యానికి ఫలితంగా నీకు వైకుంఠప్రాప్తి కలుగుతుంది. ఈ మానవశరీరం వదిలి దివ్యదేహంతో వైకుంఠం చేరుకొని శ్రీహరితో సుఖించు. ఈ ప్రదేశంలో తులసి మొక్కగా జన్మిస్తావు. పూజా సామగ్రిలో ప్రధాన వస్తువు అవుతావు. విష్ణువు నిన్ను క్షణకాలం కూడా వదలకుండా తన వక్షస్థలంపై ధరిస్తాడు. నీవు విసర్జించిన మానవ శరీరం ‘గండకి’ అనే నదిగా పరిణామం చెందుతుంది. పవిత్రమైన సాగరసంగమం లభిస్తుంది. నీ శాపం వల్ల నారాయణుడు గండకీ నదీ తీరంలో శైలంగా మారి ఆ నదిలో స్నానం చేసినవారిని అనుగ్రహిస్తాడు. పదునైన దంతాలు గల కోట్లాది కీటకాలు ఆ కొండరాళ్ళను విష్ణుచక్ర ఆకారంలో మలుస్తాయి. అవి సాలగ్రామ శిలలవుతాయి” అని చెప్పాడు. తులసి, సాలగ్రామం, శంఖం మొదలైనవాటికి పవిత్రత సమకూర్చి శంకరుడు కైలాసం వెళ్ళిపోయాడు.
శంఖచూడునికి ప్రతీక ఐన శంఖం, తులసికి ప్రతీక ఐన తులసి దళం, విష్ణువుకు ప్రతీక ఐన సాలగ్రామ శిల ఈ మూడు ఎప్పుడూ కలిసే ఉండాలి.
*శుభం*