అప్పటివరకు చెత్త కుప్పలతో పేరుకుపోయిన ఆ స్థలంలో హఠాత్తుగా శుభ్రం చేసే పనులు మొదలయ్యాయి. ఎవరో స్థలాన్ని రెండు కోట్ల రూపాయలకు కొన్నారట.
పోనీలే ఇన్నాళ్లు చెత్త పడెయ్యడానికి బాగా వీలుగా ఉంటోంది అనుకున్న చాలా మంది అక్కడ ఉన్నట్టుండీ నిర్మాణాలు ప్రారంభం అయ్యేటప్పటికి ఒక రకంగా చాలా ఇబ్బందిగా అనిపించింది. అవును మరి .. ఉదయం ఏడు గంటలకల్లా చెత్తబండి వాడు పాటలు వేసుకుంటూ , అర్ధరాత్రి వరకు నిద్ర పట్టక అప్పుడప్పుడే ఒక కునుకు పడుతున్న వాళ్ళకు కూడా నిద్రా భంగం కలిగించి , కంగారు పడుతూ మంచాల మీద నుండి పడిపోబోయి లేస్తూ రెండు మూడు అంతస్తుల మెట్లు కూడా దిగి చెత్త పారేయడం అంటే అదో పెద్ద టాస్క్. దాన్ని తప్పించుకోవాలని ఎవరైనా ప్రయత్నిస్తున్నారు అంటే అది ఖచ్చితంగా ఎవరైతే వాళ్ళ ఇళ్ల పక్కన నిర్మాణాలు కాకుండా వదిలేసిన ఖాళీ ప్రదేశాలు ఉన్న వాళ్ళు మాత్రమే అని చెప్పక్కరలేదు.
మా కాలనీలో మా ఇంటి పక్కన సుమారుగా ఐదారేళ్లగా చెత్తతో నిండిన ప్రదేశం ఇప్పుడు ప్రొక్లైనర్ల చప్పుళ్లతో నిర్మాణానికి అంకురార్పణ జరిగింది. . మరోపక్క అక్కడ బోరింగ్ కూడా వేస్తున్నారు. దాని తాలూకు దుమ్ము, విపరీతమైన ధ్వని ఇంట్లో చిన్నపిల్లలలు ఉన్న కుటుంబాల వాళ్ళకు కలిగిస్తున్న అసౌకర్యం అంతా ఇంతా కాదు.
రోజులు ఎంత త్వరగా గడుస్తున్నాయి అని చెప్పడానికి ఉదాహరణ చూస్తుండగానే అక్కడ షాపింగ్ కాంప్లెక్స్ వెలవడం. కాసుకుకూర్చున్నట్టు అందులో ఎన్నో వెరైటీ షాపులు పెట్టడానికి ఎంతోమంది ముందుకు వచ్చి ప్రారంబించడమే కాకుండా అప్పుడే ఒక సంవత్సర కాలం కూడా ముగిసింది.
అప్పటివరకు ప్రశాంతంగా ఉండే ఆ కాలనీ వచ్చే పోయే జనాలతో హోరు ఎత్తిపోతోంది. మరోపక్క కారు, స్కూటర్ల పార్కింగ్ అంటూ అడ్డదిడ్డంగా ఎక్కడ పెడితే అక్కడ వాహనాలు నిలిపేస్తూ ట్రాఫిక్ కు అంతరాయం కలిగించేస్తున్నారు.
నేను సామాన్యంగా ఏ వస్తువు కొనాలన్నా ఎక్కడో దూరంగా రెండు మూడు కిలోమీటర్ల అవతల ఉన్న షాపులకు వెళ్లి వస్తూ ఉంటాను. అలా వెళ్లడంలో నా స్వార్ధం కూడా ఉంది. కనీసం రోజుకు పదివేల అడుగులైనా వేస్తేనే అది వాకింగ్ చేసినట్టు అని మాధ్యమాలలో నిపుణులు అరిచి చెపుతూ ఉంటే అదీ ఒకందుకు మంచిదే అని నేను నా పబ్బం కూడా గడుపుకుంటున్నాను .
ఈమధ్య ఎందుకో వయసు మీద పడుతూ ఉండటంవల్ల మోకాళ్లలో కీళ్లు అరిగిపోయి ఎక్కువ దూరం నడవలేక పోతున్నాను. అదృష్టవశాత్తు పక్కనే షాపులు రావడం వల్ల వాకింగ్ ఇంట్లోనే చేసుకుంటూ పక్క షాపుల్లో ఇంటికి కావలసిన సామాన్లు స్వయంగా వెళ్ళి నేనే తెచ్చుకుంటున్నాను. ఒకరకంగా నేను ఆన్లైన్ లో ఇంటికి కావలసిన సరుకులు తెప్పించుకోవడం విషయంలో వ్యతిరేకం. ఆ క్రమంలో రోజు కాలనీలో నన్ను గమనిస్తున్న షాపుల వాళ్ళతో నాకు బాగా అలవాటయింది. ఎప్పుడైనా తోచనప్పుడు షాపుల దగ్గర వేసిన కుర్చీలలో కూర్చుని వాళ్ళ వ్యాపారానికి సంబంధించిన విషయాలులో అడిగినా అడగకపోయినా సలహాలు ఇస్తూ ఉండేవాడిని. .
నాకు బాగా ఆశ్చర్యపరిచిన విషయం ఏంటంటే నేను అప్పుడప్పుడు ఎక్కువగా వెళ్లే షాపు యజమాని అదే కాంప్లెక్స్ లో నాలుగు షాపులకు ఓనర్ అని తెలిసి నోట మాట రాలేదు.
" ఇది చిన్న కాలనీ. ఎక్కువ మంది జనాభా కూడా లేరు. ఇంత పెద్ద షాపింగ్ కాంప్లెక్స్ లో నాలుగు షాపులు మీవే అంటే నమ్మశక్యంగా లేదు. అంత వ్యాపారం ఉంటుందంటారా?. చూస్తూంటే అంత డిమాండ్ ఉన్నట్టు కనిపించడం లేదు. అందరూ ఏవో ఫోనుల్లో బిజీగా ఉంటూ గడిపేస్తున్నట్టు నాకు అనిపిస్తోంది . ఇలా చేస్తే మీకు వ్యాపారంలో లాభాలు ఎక్కడనుండి వస్తాయి ?" అని అడిగాను. ఒకరోజు.
నేను అడిగిన ప్రశ్నకు ఆ షాపు ఓనర్ ఇబ్బంది పడినట్టు ఉన్నాడు. సమాధానం చెప్పకుండా నవ్వి ఊరుకున్నాడు. ఆయనకు 60 ఏళ్ళు పైన ఉంటాయి. లౌక్యం తెలుసు. వ్యాపార విషయాలు ఎవరితో పడితే వాళ్లతో మాట్లాడకూడదని తెలిసిన వ్యక్తి.చూస్తూంటే పక్కనే ఉందని నేను ఒక్కడినే ఎక్కువ సామాను కొంటున్నట్టుగా నాకు అనిపిస్తోంది. అయితే అటువైపు నుండి వెళ్తున్నప్పుడల్లా మనసులో నా సందేహాలు ఇంకా ఎక్కువైపోతూ ఉండేవి. .
ఆరోజు ఏదో సాఫ్ట్వేర్ కంపెనీలో పనిచేస్తున్న ఆయన కొడుకు షాపులో ఆటవిడుపుగా కూర్చోవడం గమనించాను. అతని చూస్తూంటే ఏమీ మనసులో దాచుకోకుండా మాట్లాడేస్తున్నాడని అనిపిస్తోంది. ధరలు కూడా ఏమీ తెలిసినట్టు లేవు. ఒక్కోసారి వస్తువు మీద ఉన్న రేటు కన్నా బాగా తక్కువగా ఇచ్చేయ్యడం గమనించి బాబూ " ఈ షాపులో ఏ వస్తువులు ఉన్నాయో కూడా మీకు సరిగ్గా తెలిసినట్టు లేదు. పైగా రెండు మూడు సార్లు బాగా పట్టి చూస్తే కానీ వాటి రేట్లు తెలియడం లేదు. మరోపక్క ఏ షాపుకు అంతగా గిరాకీ ఉన్నట్టుగా నాకు అనిపించడం లేదు. ఎలా నెగ్గుకు వస్తున్నారయ్యా బాబూ ? పైగా మీ నాన్న గారు చెపుతున్నట్టు మీకు మొత్తం ఈ కాంప్లెక్స్ లో నాలుగు షాపులు ఉన్నాయిటగా ? మరి రాబడి కూడా అదే క్రమంలో రావాలిగా ?" అన్నాను నా అనుమానాలు బయట పెడుతూ. అతను మనసులో ఏమీ దాచుకోడు అని నిర్ధారణ అయ్యాక అడిగిన ప్రశ్న అది .
"లేదు అంకుల్. ఈ నాలుగు షాపులే మాకు జీవనాధారం కాదు. పైగా ఈ షాపులు మా ఉమ్మడి వ్యాపార సంస్థలు. ఇవి మా బాబాయిల పేరు మీదటా, మా మామయ్యల పేరు మీదటా ఉన్నాయి.. అసలు వీటిమీదే మేము బ్రతకాలని లేదు. రోజూ ఇంత ఆదాయం వస్తేనే నడపగలం అనే ఆలోచన మాకు ఎవరికీ లేదు. ఈ షాపులను ఆఫీసులుగా ఉపయోగించుకుంటూ మరోపక్క కస్టమర్ల అవసరాలు తీర్చడానికి హోల్సేల్ వ్యాపారం కూడా చేస్తూ ఉంటాం. ఎయిర్పోర్టు దగ్గరలో మాకు కోట్ల రూపాయల విలువైన భూములు ఉన్నాయి. రియల్ ఎస్టేట్ వ్యాపారాలు చేసుకోవడానికి మా బంధువులు ఎంతో మంది ఉన్నారు. నిజానికి ఈ షాపులు మాకు నామ మాత్రమే. ఈ ఏరియాలో స్థలం కొద్దిగా చౌకగా రావడం వల్ల కొనేసి షాపింగ్ కాంప్లెక్స్ పెట్టాము. "అంటూ భోళాగా అసలు విషయం చెప్పేసాడు.
"ఓరి వీడి దుంపతెగిపోను ?ఇంటిగుట్టు రచ్చకెక్కించినట్టు అరటిపండు ఒలిచినట్టు వీళ్ళ వ్యాపారంలో ఉన్న అన్ని రహస్యాలు, లొసుగులు చెప్పేసాడే? వీడు అసలు వ్యాపారం చెయ్యడానికి ఏ మాత్రమూ పనికిరాడు. అందుకునే అనుకుంటా సాఫ్ట్వేర్ ఉద్యోగం చేసుకుంటున్నాడు. ఈ ఉద్యోగస్తులకు ఖర్చుపెట్టడం తప్ప కూడబెట్టడం రాదు " అనుకున్నాను మనసులో.
కొద్దిసేపు అక్కడ గడిపిన తర్వాత ఎటువంటి కాలక్షేపం లేక మిగిలిన షాపులు చూసుకుంటూ వెళ్తున్నాను .ఇందాక నేను వెళ్ళిన షాపులో ఎవరో గట్టిగా మాట్లాడుతూంటే వెనకనుండి రెండు షాపుల అవతల నిలబడి నిలబడి వినసాగాను.
"ఏరా అబ్బాయి . ఏమైనా అమ్మావా ? నీకు ధరలు తెలియవు. ఏ సరుకులు ఎక్కడున్నాయో కూడా గుర్తుపట్టలేవు. నేను బయటకు వెళ్ళినా పది నిమిషాలలో వచ్చేస్తాను. నువ్వు ఊరికే నీ ఫ్రెండ్స్ కు ఫోన్ చేస్తూ కూర్చో. ఏ సామాను అమ్మడానికి ప్రయత్నం చేయకు. నిన్ను జస్ట్ షాపుకు కాపలా పెట్టి వెళ్తున్నట్టు అనుకో. అన్నట్టు మన షాపుకు రెగ్యులర్ గా వచ్చే ముసలాయన ఏవైనా వ్యాపారానికి సంబంధించిన విషయాలు అడిగితే పొరపాటున కూడా చెప్పకు. నన్ను ఎన్నోసార్లు గుచ్చి గుచ్చి ఎన్నో యక్ష ప్రశ్నలు వేసి చంపే వాడు.. నేను మాట మార్చేసి బయటకు పంపించే వాడిని. నువ్వు అమాయకుడివి . నువ్వు వ్యాపారానికి దూరంగా ఉంటూ ఉద్యోగం చేసుకుంటున్నావని అందరికీ తెలుసు. నీ నుండి మొత్తం సమాచారం రాబట్టడానికి ప్రయత్నిస్తూ వాళ్ళే మన మీద ఇన్కమ్ టాక్స్ వాళ్ళకు సమాచారం అందించినా అందిస్తారు. కొంపదీసి నిన్ను కూడా ఏమైనా అడిగాడా చెప్పు ?" అని కొడుకుని అనుమానిస్తూ అడుగుతున్నాడు ఆ షాపుల యజమాని.
ఆయన గొంతు సహజంగా పెద్దగా ఉండటం వల్ల అతను కొడుకుతో మాట్లాడుతున్న ప్రతి మాటా లౌడ్ స్పీకర్ లో నుండి వింటున్నట్టుగా నాకు అనిపించింది.
** ** ** **
ఆ రోజు ఆదివారం . మా పక్కన ఉన్న షాపింగ్ యజమాని కొడుకు మా ఇంటి గేట్ ముందు తచ్చాడటం పై ఫ్లోర్ నుండి గమనించి కిందకు వచ్చి అడిగాను నవ్వుతూ "ఏం బాబూ .. ఏం కావాలి ?" అంటూ.
"ఏమీ లేదు అంకుల్. నేను మీ కోసమే వచ్చాను. నిన్న నేను మీతో చెప్పిన విషయాలు అన్నీ సరదా కోసం చెప్పినవి. మాకు ఈ షాపులు తప్ప వేరే ఆస్తులంటూ లేవు. కొత్తగా షాపులు ఓపెన్ చెయ్యడం వల్లే వ్యాపారం అంతంత మాత్రంగా ఉంది. మేమూ , మా బాబాయిలు అందరికీ ఈ వ్యాపారమే దిక్కు. అయితే మా ఇంట్లో నాకు ఒక్కడికే జాబ్ ఉంది . అది కూడా ఎన్నాళ్లు చేస్తానో తెలియదు. నేను కూడా త్వరలో ఉద్యోగం మానేసి మా నాన్నకు సాయంగా ఈ వ్యాపారం చూసుకోవాలని ఉంది . మళ్ళీ మరో సారి చెపుతున్నాను అంకుల్. మాకు ఈ షాపులు తప్ప వేరే ఆధారం లేదు. మీరు మా దగ్గరే కొంటూ , మీకు తెలిసిన వాళ్ళకు కూడా చెప్పి మా వ్యాపారాన్ని ప్రోత్సహించండి సార్ .అందుకోసమే చెపుదామని వచ్చాను ..ఏమీ అనుకోకండి ..." అంటూ అతను చెప్పింది నేను నమ్మాననుకున్న ఆత్మ విశ్వాసంతో బైక్ ఎక్కి వెళ్ళి పోయాడు.
"పోరా కుర్రకుంకా . అలా చెప్పక ఇంకా ఎలా చెపుతావు . నీ తండ్రి బాగా బ్రైన్ పోలిష్ చేశాడుగా. ఇప్పటికైనా తెలుసుకున్నావు . నిజాలు చెప్పడమనేది ఏ వ్యాపారస్తుని లక్షణం కాదు. అది ఒక్క రోజులో నువ్వు గ్రహించి మొత్తానికి తండ్రికి తగ్గ కొడుకువనిపించుకున్నావు . అయినా ఈ వ్యాపార సంబంధాలు గురించి నాకెందుకు ? నాకు కావాల్సింది కొనుక్కుని నోరుమూసుకుని పోవాల్సింది పోయి తను ఈ వ్యాపార సంస్థల గురించి ఎందుకు ఆలోచిస్తున్నాడు ? అయితే ఒకటి మాత్రం నిజం . ఈ ప్రపంచంలో సంపద అంతా కొంతమంది కుభేరుల చేతుల్లో బందీ అయ్యిందని,. మన కళ్ల ముందు కనిపించే ఈ ఆకాశ హార్మ్యాలు, బహుళ అంతస్తుల భవనాలు, పెద్ద పెద్ద స్టార్ హోటళ్ల ఓనర్లు ఎవరో చాలా మందికి తెలియక పోవచ్చుకానీ, లెక్కపెట్టుకోవడానికి కూడా సాధ్యం కానంత సంపదకు ఎంతోమంది వారసులు ఉన్నారన్నది నిర్వివాదాంశం. అయినా ఈ వ్యాపార సంబంధాలుతో ఏ మాత్రమూ సంబంధం లేని నాకెందుకు ఆలోచన ? ? నేను సగటు మనిషిని. ఈ వయసులో నేనే కాదు ఎవరైనా సరే ఇటువంటి వాటి గురించి అనవసరంగా ఆలోచించి బుర్ర పాడుచేసుకునే బదులు మనసును ఏ ఆధ్యాత్మిక విషయాల మీదకో మళ్లించి ప్రశాంతంగా జీవించడం ఉత్తముల లక్షణం .." అని మనసును పూర్తి ప్రక్షాళన చేసుకుని లౌకిక విషయాల గురించి ఆ క్షణం నుండి దూరంగా ఉండటం మొదలుపెట్టాను *****
సమాప్తం