అనంతుడి నిర్ణయం - డి.కె.చదువులబాబు

Anantudi nirnayam

ప్రభవరాజ్యాన్ని ప్రభవసేనుడు అనే రాజు పరిపాలించేవాడు.ఆయన భార్య జయప్రభ .వారికి ప్రమధ్వరుడనే కుమారుడు.వాడికి మూడేళ్ళ వయస్సులో రాణి తన కుమారుడితో పుట్టింటికి బయల్దేరింది.పొరుగురాజ్యమే రాణి పుట్టిల్లు.అయితే రెండు రాజ్యాలకూ మధ్యలో దట్టమైన చిత్రిక అనే అరణ్యం ఉంది.ఆ అడవిలోకి కొత్తగా బంధిపోటు దొంగలముఠా ఒకటి వచ్చి చేరింది. ఆముఠా రాణి పరివారంపై దాడి చేసింది. రాజభటులు దొంగలతో పోరాడుతుంటే, రాణి ప్రమధ్వరుడిని తీసుకుని ఒక చెట్టు చాటుకెళ్లింది.అక్కడొక పెద్ద కొండచిలువ ఆమెకు కనబడింది. భయకరమైన దాన్ని చూసి, రాణి భయంతో స్పృహతప్పింది. కొద్దిసేపటికి రాజభటులు దొంగలను బంధించి రాణివద్దకు వచ్చారు. ఆమెను మూర్చనుండి తేరుకునేలా చేశారు. వారికెక్కడా ప్రమధ్వరుడు కనిపించలేదు. కొండచిలువా కనిపించలేదు. రాకుమారుడు కొండచిలువకు ఆహారమై ఉంటాడని అందరూ అనుకున్నారు. కానీ అలా జరగలేదు.కొండచిలువను చూసి రాణి భయపడింది.కానీ అది రాణిని చూడలేదు. తనవేట ప్రయత్నంలో హడావిడిగా పోతున్నదాచిలువ. తల్లి పెద్దగా కేకలుపెట్టి మూర్చపోవడంతో రాకుమారుడు కంగారుపడి అక్కడనుండి పరుగెత్తాడు. ఈవిధంగా అతడు దారితప్పాడు. కాసేపటికి పొరుగు రాజ్యానికి చెందిన ధర్మయ్య అనే రైతు తేనెకోసం అడవిలో వెదుకుతుండగా బాలుడు కనిపించాడు. అతని దుస్తులను బట్టి ఉన్నతకుటుంబీకుడే అయుంటాడని అనుకున్నాడు. ధర్మయ్యకు పిల్లలులేరు.ఆపిల్లవాడిని చూసి ధర్మయ్య ఎంతో ముచ్చటపడి ఇంటికి తీసుకెళ్ళాడు. ఆబాలుణ్ణి చూసి ధర్మయ్య భార్యకూడా ఎంతో సంతోషించింది. ఆదంపతులు ఆబాలుడికి అనంతుడనే పేరుపెట్టారు. అల్లారుముద్దుగా పెంచిపెద్దచేశారు. అనంతుడు వైద్యవిద్యను, చిత్రలేఖనాన్ని అభ్యసించాడు.చిన్నవయస్సులోనే ఘనవైద్యుడిగా పేరుసంపాదించాడు. ఎందరో పేదలకు ఉచితంగా వైద్యమందిస్తూ మంచి మనిషిగా పేరుపొందాడు. వైద్యం వృత్తిగా స్వీకరించాడు. చిత్రలేఖనం అతడి ప్రవృత్తి. ప్రమధ్వరుడు కనిపించకుండా పోయిన తర్వాత రాజదంపతులకు ఇద్దరు కుమారులు జన్మించారు. ప్రభవసేనుడికి సాహిత్యం,సంగీతం,చిత్రలేఖనం అంటే చాలా అభిమానం. ఆరాజ్యంలో చెన్నకేశవస్వామి ఉత్సవాల సందర్భంగా లలితకళల పోటీలు ఏర్పాటు చేశారు.చిత్రలేఖనం పోటీలకు అనంతుడు వచ్చాడు."మహారాజా!నాది సమీరరాజ్యం. మీరు దశాబ్దంక్రితం ఎలా ఉండేవారో, రెండుదశాబ్దాలక్రితం ఎలా ఉండేవారో, మూడుదశాబ్దాలక్రితం ఎలా ఉండేవారో చిత్రించగలను.ఈవిధంగా చిత్రీకరిస్తూ మీచిన్నప్పటి రూపాన్ని కూడా గీయగలను. అలాగే భవిష్యత్ కాలంలో ప్రతి పది సంవత్సరాలకూ మీరూపం ఎలా ఉంటుందో గీయగలను."అన్నాడుఅనంతుడు. రాజు ఆమాటలకు అబ్బురపడి అనుమతినిచ్చాడు.రాజును చూస్తూ ఆరురకాల చిత్రాలను గీశాడు. రాజు అనంతుడి నుదిటిమీద ఉన్న చక్రం ఆకారం లోని పుట్టుమచ్చను గమనించాడు. అలాంటి మచ్చ కనిపించకుండా పోయిన తనకుమారుడి నుదుటిమీద ఉండేది. ఈఅనంతుడు నాకుమారుడు కాదుకదా! అనుకున్నాడు. రాజు తనభవనంనుండి తన పాతచిత్రాలను తెప్పించాడు.ప్రభవసేనుడు దశాబ్దాలక్రితం ఆపాతచిత్రాల్లో ఎలాఉన్నాడో అచ్చం అలాగే అనంతుడు గీసిన చిత్రాలున్నాయి. అతని ప్రతిభకు రాజుతో సహా సభలో అందరూ ఆశ్చర్యపడ్డారు. సభాప్రాంగణం కరతాళధ్వనులతో మార్మోగింది. రాజు అనంతుడికి ప్రథమబహుమతి ప్రకటించాడు.అనంతుడి కుటుంబవివరాలు అడిగి తెలుసుకున్నాడు. రాజు కోరికమేరకు అనంతుడు ఆరోజు రాజభవనంలో బసచేశాడు. రాజు ఘనంగా అతిథి మర్యాదలు ఏర్పాటుచేశాడు. రాజు మంత్రితో సమీరరాజ్యంవెళ్ళి అనంతుడి వివరాలు సేకరించమని చెప్పాడు.మంత్రి అనంతుడివివరాలుచెప్పి వేగులను పంపాడు.వారివిచారణలో అనంతుడు ధర్మయ్య దంపతులకు పెంపుడు కొడుకని, ఛిత్రిక అరణ్యంలో దొరికాడని తెలిసింది. అనంతుడే ప్రమధ్వరుడని రాజు నిర్ణయించుకున్నాడు. రాత్రి భోజనానంతరం ప్రభవసేనుడు, అనంతుడు బసచేసిన భవనానికి వచ్చాడు.రాజు తనచేతిలోని చిత్రపటాన్ని అనంతుడికిచ్చాడు.ఆపటంలో ముద్దులు మూటగట్టినట్లు,చంద్రబింబంలాంటి పిల్లవాడున్నాడు. "ఈపిల్లవాడు నా ప్రథమ పుత్రుడు. పాతికసంవత్సరాలక్రితం 'ఛిత్రికా' అరణ్యంలో తప్పిపోయాడు. అప్పటికి వీడి వయస్సు మూడేళ్ళు. వీడు ఇప్పుడు ఎలాఉంటాడో నీవు గీసి చూపించాలి" చెబుతున్న రాజు కళ్ళలో నీళ్ళు తిరిగాయి. "అలాగేమహారాజా!ఉదయానికి పనిపూర్తిచేస్తాను"అన్నాడు అనంతుడు. రాకుమారుడు పాతిక సంవత్సరాల వయస్సులో ఎలాఉంటాడో చిత్రీకరిస్తే అనంతుడి రూపంలో చిత్రం తయారవుతుందని, అదిచూసి తాను రాకుమారుడినని అనంతుడు గుర్తించి, ఆశ్చర్యపడతాడని రాజు అనుకున్నాడు. తనభవనానికి వెళ్ళిపోయాడు. రాకుమారుడి చిన్నప్పటి చిత్రాన్ని ఏకాగ్రతతో చూస్తూ పదిసంవత్సరాల వయస్సులో ఎలాఉంటాడో చిత్రీకరించాడు. అప్పటికే అనంతుడికి ఆచిత్రంలో ఉన్న రాకుమారుడిని తానేయని అర్థమయింది. అనంతుడు చాలా ఆశ్చర్యపోయాడు. కొద్దిసేపటి తర్వాత తేరుకున్నాడు.తర్వాత రాకుమారుడు పాతిక సంవత్సరాల వయసులో ఎలా ఉంటాడో చిత్రీకరిస్తూ,తనరూపం రాకుండా జాగ్రత్తపడ్డాడు. మరోరూపాన్ని చిత్రీకరించి రాజుకు అందజేశాడు. రాజు ఏకాంతంగా అనంతుడిని కలిసి "నీనుదుటనున్న చక్రంఆకారంలోని పుట్టుమచ్చ చిత్రికఅరణ్యంలో కనిపించకుండా పోయిన నాకుమారుడి నుదుటిపై ఉండేది.నీగురించి వేగులు రహస్యంగా విచారించారు. నీవు చిత్రికారణ్యంలో దొరికావని తేలింది. నాకుమారుడు పాతిక సంవత్సరాల తర్వాత ఎలాఉంటాడో చిత్రీకరించే సమయంలో నీవే నాకుమారుడివని గుర్తించి ఉంటావు. మరి నీరూపాన్ని కాకుండా వేరేరూపాన్ని ఎందుకు చిత్రీకరించావు. కుమారా!నీకు రాజవిద్యలు నేర్పి ఈరాజ్యానికి రాజును చేయాలనుకుంటున్నాను.నిన్ను పెంచిన తల్లిదండ్రులుకూడా ఇక్కడే ఉండవచ్చు" అన్నాడురాజు. "మహారాజా!నాతల్లిదండ్రులు నన్ను ప్రాణంలా చూసుకుంటున్నారు. నేను రాజకుమారుడనని తెలిస్తే మునుపటిలా నాతో ఉండలేరు. మీరు కుమారుడిని పోగొట్టుకున్న దుఃఖం అనుభవించి ఉన్నారు.నేను మీకుమారుడినని తెలిస్తే వారుదూరమవుతారు.ఆదుఃఖాన్ని వారికి కల్గించలేను.అంతేకాకుండా నావైద్యసేవలకోసం ఎంతోమంది ప్రజలు నాకోసం ఎదురుచూస్తున్నారు. వారికి దూరం కావడం నాకిష్టంలేదు. నాకిష్టమైన వైద్యం,చిత్రలేఖనంతో తృప్తిగా జీవిస్తున్నాను. మీకు నేను లేకున్నా ఇద్దరు కుమారులున్నారు.వారితో తృప్తిగా జీవించండి. ఎక్కడఉన్నా నేను సుఖంగా ఉన్నాను.మీరూ సంతోషంగా ఉండండి. రాణిగారికి నావిషయం తెలియనివ్వకండి. నాతల్లిదండ్రులు,ప్రజలు నాకోసం ఎదురుచూస్తుంటారు.నేను వెళ్తాను" అనిచెప్పి ప్రయాణమయ్యాడు అనంతుడు. తల్లిదండ్రులకు, ప్రజలకు నిస్వార్థంగా సేవలందించడానికి ఎంతో ఆదర్శంగా వెళ్తున్న తనకుమారుడిని ప్రభవసేనుడు గర్వంగా చూస్తూండిపోయాడు.

మరిన్ని కథలు

Panipilla
పనిపిల్ల (క్రైమ్ కథ)
- చెన్నూరి సుదర్శన్
Bhavaateetam
భావాతీతం
- DODDIPATLA KALYAN KISHORE
Prema falam
ప్రేమ ఫలం
- పి. రాజేంద్రప్రసాద్
Neethone nenunta
నీతోనే నేనుంటా
- కాశీవిశ్వనాధం పట్రాయుడు
Amlet damlet
ఆంమ్లేట్ - డాంమ్లేట్ .
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
REkkala kastam
రెక్కల కష్టం
- వరలక్ష్మి నున్న