తమిళనాడు.. ‘ఎగ్ మోర్’ రైల్వే స్టేషన్ లోకి ప్రవేశించగానే నాల్గవ ప్లాట్ ఫాం దర్శనమిచ్చింది.. రద్దీ లేదు. భుక్తాయాసంతో ఉన్నట్టు పసిగట్టిన బెంచీలు.. శయనాసనమైనా ఆనందమే..! అన్నట్టు ఆహ్వానించాయి. కాని అది రైల్వే స్టేషన్. ప్రయాణీకులకు ఆశ్రమం. రైల్ల రాకపోకల సమయంలో బెంచీల మీద శయనించడం సంస్కారం కాదని.. నేనూ, నా మిత్రుడు రామకృష్ణ.. సేద దీర ఒక బెంచీ మీద కూర్చున్నాం.
రామకృష్ణ తన రెండు బ్యాగులను రెండు కాళ్ళ మధ్యలో పెట్టుకుని జాగ్రత్త పడుతున్నాడు. ఆ దృశ్యం చూస్తుంటే.. నా పెదవులపై చిరునవ్వు మొలిచింది. నిజమే..! ఎవరి సామానుకు వారే బాధ్యులు. అదీ నేను వివరించిన జాగ్రత్తలే. నిన్నటి అనుభవ ఫలితం.
చెన్నై తెలుగు వెలుగు సంక్షేమ సంఘం ఆహ్వానం మేరకు హైదరాబాదు నుండి రామకృష్ణ, నేను కలిసి వచ్చాం. పెరంబూరు రైల్వే స్టేషన్ దగ్గరలో శ్రీ ముక్కామల నమ్మాళ్ శ్రేష్టిగారి ఆడిటోరియం, డి.ఆర్.బి.సి.సి.సి. మహోన్నత పాఠశాల ప్రాంగణ వేదిక మీద మాకూ, మరో ఐదుగురికి ‘తెలుగు వెలుగు’ సాహిత్య పురస్కారాలు ప్రదానం చేసారు. ఆ తరువాత సాంస్కృతిక కార్యక్రమాలు కన్నుల పండువగా జరిగాయి. రాత్రి దాదాపు ఎనిమిదయ్యింది. భోజనాల అనంతరం అంతా కలిసి మేము బస చేసిన లాడ్జ్ కు కాలి నడకన బయలుదేరాం. విజయవంతమైన కార్యక్రమ విశేషాలు.. అంకిత భావంతో పని చేసిన కార్యకర్తల మీద ప్రశంసల ఝల్లు కురిపిస్తూ.. వారు ప్రదానం చేసిన జ్ఞాపికలను తడిమి, తడిమి చూసుకుంటున్నాం.
ఇంతలో.. “అయ్యో..! నా జ్ఞాపిక ఎక్కడో పడిపోయింది..” అంటూ రామకృష్ణ కెవ్వున కేక పెట్టినంత పనిచేసాడు. మ్రాన్పడి పోయాం. రామకృష్ణ చేతిలోని కవరు చిందర వందరగా ఉంది. దాన్ని చూడగానే నాకు చిరాకేసింది. నా కవరు చూపిస్తూ..
“సర్.. జ్ఞాపికను శాలువాలో చక్కగా మడిచి పెట్టి కవరులో ఇలా భద్రపరచుకోవాలి. కాని అలా అజాగ్రత్తగా పెట్టుకుంటే ఎలా సర్” అంటూ ‘ఎదుటి వారికి చెప్పేటందుకే నీతులు ఉన్నాయి’ అన్నట్టు వివరించాను. నా హితవు పూర్తి గాక ముందే రామకృష్ణ వెనుదిరిగి పరుగు తీసాడు.
మేము లాడ్జ్ ముందుకు చేరుకునేసరికి రామకృష్ణ అల్లంత దూరం నుండి వడి, వడిగా వస్తున్నాడు. అతని మోములో వెలుగు చూసి జ్ఞాపిక దొరికిందని అర్థమయ్యింది. అయినా నేను మరోసారి జాగ్రత్తలు చెప్పాను.
“సర్.. మన ట్రైన్ రావడానికి మరో గంట సమయముంది. ఇంకా ప్లాట్ ఫాం నంబరు వేయ లేదు” రామకృష్ణ అనేసరికి ఆలోచనల నుండి తేరుకొని డిజిటాల్ తెర వైపు చూసాను. నిజమే.. అన్నట్టుగా తలూపుతూ.. పక్కనే ఉన్న నా బ్యాగు వంక చూసాను. ఎవరిదో మరో పెద్ద బ్యాగు కనబడింది. ఆ బ్యాగుతో బాటు నా బ్యాగు గూడా తీసుకు వెళ్లరు గదా! అనే అనుమానం మదిలో మొలిచింది. వెంటనే నా బ్యాగు హాండెల్ ఒక చేతిలోకి తీసుకున్నాను. ‘ఎంతైనా జాగ్రత్త పరున్ని కదా!.’ స్వకుచమర్దనం చేసుకున్నాను. మరో చేతిలో నా చరవాణి నాట్యమాడుతోంది. నిన్నటి కార్యక్రమ ఫోటోలను మిత్రులకు పంపుతున్నాను. వారి అభినందనలకు.. ధన్యవాదాలు తెలుపుతున్నాను. మనసంతా మైమరిచి గాలిలో
తేలి పోతోంది. ఒక సారి రామకృష్ణ వంక చూసాను. తనూ అదే పనిలో ఉన్నాడు. చిరునవ్వు నవ్వుతూ.. నా బ్యాగు వంక చూసాను. గుండె గుభేలుమంది. బ్యాగు స్థానంలో శూన్యం నా కడుపును ఆవహించింది.
“సార్.. నా బ్యాగు లేదు” అంటూ నిన్న రామకృష్ణ పెట్టిన కేకను.. నేను కొనసాగించాను. గుండె అవిసి పోయింది. రిక్త హస్తాలతో ఇంటికి ఎలా వెళ్ళను?. జాగ్రత్తగా శాలువాలో భద్రపరచిన కవరు అందులోనే ఉంది. కాని బ్యాగు జాగ్రత్తగా నా కాళ్ళ దగ్గర రామకృష్ణలా పెట్టుకోవాలనే ఇంగిత జ్ఞానం నాకు లేకుండా పోయింది. నన్ను నేనే తిట్టుకుంటూ.. గాబరాగా ప్లాట్ ఫాం అంతా కలియ తిరిగాను. రామకృష్ణ నన్ను అత్యంత దీనంగా చూస్తూ ఉండడం .. నా కళ్ళు చెమర్చాయి. బ్యాగు తీసుకు వెళ్ళిన వారు ప్లై ఓవర్ బ్రిడ్జ్ ఎక్కి అవతలి ప్లాట్ ఫాం మీదకు వెళ్ళారేమో!. ఆరు ప్లాట్ ఫామ్స్ ఉన్నాయి. ఎక్కడని వెతకను? అయినా స్టేషన్ లోనే ఉంటాడనే గ్యారంటీ ఏమిటి?. బయటికి వెళ్లి ఉండవచ్చు కదా! అని పరి పరివిధాల మదన పడుతూ పిచ్చి వానిలా తిరుగుతుంటే.. పోలీసు స్టేషన్ కనబడింది. అందులో ఒక బెంచీ మీద నాలుగు నల్ల బ్యాగులు కనబడ్డాయి. నా బ్యాగు ఉందేమో! అనే అనుమానంతో స్టేషన్ లో అడుగు పెట్టాను. నన్ను చూడగానే ఒక కానిస్టేబుల్ పరుగు, పరుగున వచ్చి ఆరా తీసాడు. నేను విషయం చెప్పాను. ఆ బ్యాగులన్నీ తమ డిపార్ట్ మెంటు వాళ్ళవే అని చెప్పి..
“ఎక్కడ కూర్చున్నారు. పద చూద్దాం” అంటూ నన్ను అనుసరించాడు.
మేము పరుగు, పరుగున రావడం రామకృష్ణ ఏమయ్యింది? బ్యాగు దొరికిందా? అన్నట్టు లేచి నిలబడి చూడసాగాడు. అతని కాళ్ళ మధ్యలోని బ్యాగులు నన్ను వెక్కిరిస్తున్నాయి. నా ఎదలో దుఃఖం తన్నుకురాసాగింది. తమాయించుకుంటున్నాను.
నేను కూర్చున్న స్థలం చూపిస్తూ.. “సర్.. బ్యాగులో డబ్బులేవీ లేవు. కాని అత్యంత విలువైన సాహిత్యపురస్కార జ్ఞాపిక ఉంది. ఒక జత బట్టలు..” అని చెబుతుంటే.. బెంచీ వెనుకాల నిల్చున్న ఒక వృద్ధుడు మా దగ్గరికి వచ్చి.. “బ్యాగు కోసం చూస్తున్నారా? అదుగో అక్కడ ఉంది. ఎవరో పెట్టి వెళ్ళారు. మీదేనా చూడండి” అంటూ గదుమ కింద చెయ్యి పెట్టి చూడసాగాడు.
నేను ఒక్క అంగలో బ్యాగు ముందు దూకాను. నా బ్యాగే.. తప్పిపోయిన పిల్లవాడు దొరికినంతగా సంబరపడ్డాను.
“బ్యాగు తెరచి.. మీ వస్తువులు ఉన్నాయా చెక్ చేయండి” అంటూ కానిస్టేబుల్ తన దైన శైలిలో అడిగాడు. బ్యాగు తెరచి చూసాను. నా కవరు.. అందులో జ్ఞాపిక తీసి చూపుతూ.. “సర్.. నా బ్యాగే..” అన్నాను. కానిస్టేబుల్ నాకు జాగ్రత్తలు చెప్పి వెళ్ళాడు.
రామకృష్ణ నా వంక సహృదయంతో చూసినా.. నా ముఖం దోషిలా పశ్చాత్తాప పడింది. ఒకరికి జాగ్రత్తలు, నీతులు చెప్పే ముందు మనమెంత వరకు దానికి అర్హులమో! బేరీజు వేసుకోవాలని బుద్ధి చెబుతోంది. *