"విజయ లేఖలు" - యు.విజయశేఖర రెడ్డి

Vijayalekhalu

ఇంటర్ అయిపోయి డిగ్రీలో చేరిన రోజులు అవి. డిగ్రీతో పాటు టైప్‌‌‌‌‌‌‌‌‌‌రై‌‌టింగ్ ఉంటే బాగుంటుందని టైప్‌‌‌‌రై‌‌‌‌‌టింగ్ ఇనిస్టిట్యూట్‌‌లో చేరాను. నాకు సాయంత్రం నాలుగు గంటల నుండి ఐదు గంటల వరకు సమయం కేటాయించారు. నేను చేరిన రెండు రోజులకు నా పక్కన ఒక అమ్మాయి చేరింది. టైప్ చేశాక పేపర్ దిద్దాడానికి ఇ‌న్స్‌ట్రక్టర్ ముందు ఉన్న కూర్చిలలో కూడా నేను ఆ అమ్మాయి పక్కపక్కనే కూర్చునే వాళ్లము. ఒక రోజు టైప్ చేస్తుండగా ‘మీ పేరు’ అని అడిగింది ఆ అమ్మాయి ‘విజయశేఖర్’ అన్నాను. నేను కూడా ‘మీ పేరు’ అని అడిగాను ‘లత’ అని చెప్పింది.

అలా లతతో కొద్దిగా పరిచయం ఏర్పడింది ఒకరికి ఒకరం టైప్ చేసేప్పుడు ఏమైనా సమస్యలు ఉంటే చర్చించుకునేవారం. మూడు నెలలు గడిచాయి లత ఒక రోజు హడావిడిగా వచ్చి ‘శేఖర్ గారు నేను మా ఊరు వెళుతున్నాను.. మళ్లీ రావడానికి రెండు నెలల పైనే పట్టవచ్చు, ఇది మా ఊర్లో ఉండే ఇంటి అడ్రెస్ అని టైప్ చేసిన కాగితం ఇచ్చి ‘మీకు కుదిరినప్పుడు ఉత్తరం వ్రాస్తుండండి’ అని వెళ్లిపోయింది.

నా మిత్రుడు రవికి లత విషయం చెప్పాను. “ఇప్పుడు ఉత్తరం వ్రాయమని అడ్రస్ కూడా ఇచ్చిందంటే ఏదో జరుగుతోందన్నమాట” అన్నాడు. “నీ మొఖం లేరా.. అంతదాకా వెళ్ల లేదు” అన్నాను. “సరే ఇప్పుడెళ్లు..కాగితంపై కలంతో కుస్తీ పట్టు” అని రవి సలహా ఇచ్చాడు. ఇంటికెళ్ళి ఆలోచించాను. డైరీలో ఉత్తరం ఎలా వ్రాయలో సాధన చేశాను.

“లత ఎలా ఉన్నావు? నీతో పరిచయం కొన్ని నెలలే అయినా అది ఎంతో బలపడింది నీవు ఎప్పుడొస్తావా అని ఎదురు చూస్తున్నాను. నీవు లేక టైప్‌రైటింగ్ ఇ‌‌‌‌‌న్‌‌‌‌‌‌‌‌‌‌స్టిట్యూట్ బోసిపోయింది. నా పక్క సీటులో ఇంకో అమ్మాయి వస్తోంది..ఆమె టైప్ చేస్తుంటే రోటిలో ఏదో దంచుతున్నట్టు ఉంటోంది, నీవేమో ఎంతో సున్నితంగా చేస్తుంటావు..ఆమెను అని ఏం లాభం నేనే టైమ్ మార్చుకుంటా.. సరే ఉంటా.. నా ఉత్తరం అందగానే బదులు ఉత్తరం వ్రాయి నా అడ్రెస్ వ్రాసాను”... సెలవు ఇట్లు విజయ అని పోస్ట్ చేశాను.

నా ఉత్తరానికి బదులు ఉత్తరం వచ్చింది. “శేఖర్ గారు ఎంతో తెలివిగా విజయ పేరుతో ఉత్తరం వ్రాసి అమ్మాయి అనిపించుకునేలా చేశారు..వ్రాసింది అబ్బాయి అని నా స్నేహితురాళ్లకు చెప్పాను,వాళ్లు ఒకటే నవ్వు మీ వాడు చాలా తెలివైనవాడు అని కితాబు ఇచ్చారు. టైప్ టైమింగ్స్ మార్చుకుంటాను అంటున్నారు.. ఎమ్మా..! ఆ అమ్మాయి బాగా లేదా? ఇక విషయాలు ఏమీ లేవు ఈ ఉత్తరం అందగానే బదులు ఉత్తరం వ్రాయగలరు”....సెలవు.. ఇట్లు లత.

దీనికి సమాధానంగా నేను మరో ఉత్తరం వ్రాశాను. దాదాపు నెలరోజుల వరకూ బదులు ఉత్తరం రాలేదు. ఒక రోజు నాకు విజయ పేరుతో పెళ్లి పత్రిక వచ్చింది తీసి చూశాను.. లత వెడ్స్ కుమార్ అని ఉంది, పెళ్లి మదనపల్లెలో దానితో పాటు ఒక ఉత్తరం ఉంది ‘విజయ గారు నా పెళ్లి అనుకోకుండా మా బావతో కుదిరింది..వీలు చూసుకుని రాగలరు’ సెలవు...ఇట్లు లత.

“ఏమండోయ్ మిమ్మల్నే ఏ పాత జ్ఞాపకాలు వెంటాడాయి డైరీ తీసి చదువుతూ ఆనందిస్తున్నారు” అని చేతిలో కాఫీ కప్పుతో నా శ్రీమతి ఎదురుగా నిలబడితే గానీ నేనీ లోకంలోకి రాలేక పోయాను.ముఖ్యమైన విషయాలను ఇలా డైరీ‌లో వ్రాసుకుంటాను. లతకు వ్రాసిన ఉత్తరాలు “విజయ లేఖలు”గా వ్రాసుకున్నాను.. అవి మధురస్మృతులు అని వేరే చెప్పనక్కరలేదు.***

మరిన్ని కథలు

Panipilla
పనిపిల్ల (క్రైమ్ కథ)
- చెన్నూరి సుదర్శన్
Bhavaateetam
భావాతీతం
- DODDIPATLA KALYAN KISHORE
Prema falam
ప్రేమ ఫలం
- పి. రాజేంద్రప్రసాద్
Neethone nenunta
నీతోనే నేనుంటా
- కాశీవిశ్వనాధం పట్రాయుడు
Amlet damlet
ఆంమ్లేట్ - డాంమ్లేట్ .
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
REkkala kastam
రెక్కల కష్టం
- వరలక్ష్మి నున్న