అద్దం - డి.కె.చదువులబాబు

Addam

ఒకఅడవిలో జంతువులు, పక్షులు కలిసి,మెలిసి ఉండేవి. ఈ మధ్య ఆ అడవిలో దొంగతనాలు మొదలయ్యాయి. కొంగ తెచ్చుకున్న చేపలు దొంగిలించబడ్డాయి. కోతి తెచ్చుకున్న అరటిపండ్లు కనిపించకుండా పోయాయి. గుర్రం ఉడికించుకున్న గుగ్గిల్లు దొంగలించబడ్డాయి.ఏనుగు దాచుకున్న చెరుకుగెడలు దొంగిలించబడ్డాయి. అలా కొన్ని తిని, తర్వాత తిందామని దాచుకుంటే అడవిలోకి వెళ్ళి వచ్చేలోగా ఎవరో తినేస్తున్నారు. ఆ అడవిలో ఎప్పుడు ఏమూల దొంగతనం జరుగుతుందో తెలియక జంతువులు సతమతం కాసాగాయి. ఎక్కడ దొంగతనం జరుగుతుందో తెలిస్తే కాపుకాసి పట్టుకోవచ్చు. అలాచెప్పి దొంగతనం చేయరు కదా! మరి ఈ దొంగనెలా పట్టాలని జంతువులు బుర్ర బద్దలు కొట్టుకుంటూ ఆలోచనలో పడ్డాయి. ఆ అడవిలో చింటూ అనే కోతి ఉంది. అది అడవి పక్కనున్న పల్లెకెళ్ళి దేవాళయంలో రెండు కొబ్బరి చిప్పలు అడిగి తెచ్చుకుంది. ఒకటి తిని మరియొకటి చెట్టు తొర్రలో దాచుకుంటే అడవిలో తిరిగి వచ్చేలోగా కొబ్బరి చిప్ప కనిపించకుండా పోయింది. దాంతో కోతికి ఒళ్ళు మండింది. దొంగ ఆట కట్టించాలని ఆలోచించింది. దానికి ఉపాయం తట్టింది. చింటూ కోతి అరటిపండ్లు, మామిడిపండ్లు తీసుకుని పల్లెకెళ్ళింది. అక్కడ తనకు పరిచయమున్న అవ్వకిచ్చి బదులుగా ఒక అద్దం తీసుకుని వచ్చింది .తన దగ్గర మాయ అద్దముందని, అందులో చూసుకుంటే మనకున్న జబ్బులు మాయమవుతాయని అడవిలో కనిపించిన జంతువులన్నింటికీ చెప్పింది. ఈ సంగతి దొంగతనాలు చేస్తున్న నక్క చెవిన పడింది. ఎలాగైనా కోతి దగ్గరున్న మాయ అద్దాన్ని దొంగిలించాలనుకుంది నక్క. ఆ కోతి నివాసముంటున్న చెట్టుకు కొంతదూరంలో నున్న పొదల్లోకి ఉదయమే చేరుకుని దాక్కుని, చెట్టుపైనున్న కోతిని గమనించసాగిందినక్క.కొంతసేపటి తర్వాత కోతి చెట్టు దిగింది. తన చేతిలోనున్న అద్దంలో తన ముఖాన్ని చూసుకుంది. తర్వాత అద్దాన్ని చెట్టు తొర్రలో దాచి అడవిలోకి బయల్దేరింది. అవకాశం కోసం కాచుకుని కూర్చున్న నక్క, కోతి అలా వెళ్ళగానే పొదల మాటునుండి బయటకొచ్చింది.మెల్లిగా చెట్టు దగ్గరకు చేరుకుంది.తొర్రలో అద్దాన్ని తీసుకుంది.తన ముఖాన్ని అందులో చూసుకుంది. ఇప్పటికి అద్దాన్ని పొదల చాటున దాచి, రాత్రి వేళ వచ్చి అద్దాన్ని తన ఇంటికి తీసుకెళ్ళాలనుకుంది. అప్పుడే కోతి పరుగున వచ్చింది." దొంగను పట్టుకోవటానికే నేను ఈ పథకం వేశాను.నువ్వు నా బుట్టలో పడ్డావు. ఇంతకాలం దొంగతనాలు చేస్తున్న నీ బండారం బయటపడింది. అడవిలో అన్నింటికీ నీ గురించి చెబుతాను"అంది కోతి. "చింటూకోతిబావా!అద్దాన్ని దొంగిలించి ప్రతిరోజూ నా ముఖాన్ని చూసుకుంటే, ఆరోగ్యంగా ఉంటాననుకున్నాను. బుద్ది గడ్డి తిని ఇంత కాలం దొంగతనాలు చేస్తూ వచ్చాను.విషయం తెలిస్తే నా పరువు పోతుంది.సింహానికి తెలిస్తే నా ప్రాణం తీస్తుంది.నీ అద్దంలో నా ముఖాన్ని చూసుకున్నాను కదా! దొంగతనాలు చేసే నా రోగం నయమయింది. ఇంకెప్పుడూ దొంగతనాలు చేయను.నన్ను క్షమించు" అని వేడుకుంది నక్క. కోతి కిచ కిచ నవ్వి "ప్రతి ఒక్కరిలో లోపాలుంటాయి. అద్దంలో మన ముఖాన్ని చూసుకుని సవరించుకున్నట్లే, మన మనసులోకి చూసుకుని మన లోపాలు సరిదిద్దుకుంటే గౌరవంగా బతుకుతాము.లేకుంటే అభాసు పాలవుతాము. నీ లోపాన్ని సరిదిద్దుకుని పరువుగా బతుకుతానంటున్నావు గా! నీ గురించి ఎవరికీచెప్పనులే!" అంది కోతి. నక్కసంతోషంగావెళ్ళిపోయింది.

మరిన్ని కథలు

Guudivada
గుడివాడ
- బొమ్మిరెడ్డి పల్లి ప్రమీల రవి
Pareeksha
పరీక్ష
- తాత మోహనకృష్ణ
M B Company
M B కంపెనీ
- మద్దూరి నరసింహమూర్తి
A1 farmula
ఏ1 ఫార్ములా
- వై.కె.సంధ్యా శర్మ
Oke okkadu
ఒకే ఒక్కడు
- కందర్ప మూర్తి
Mitam
మితం
- ఆదిత్య ప్రణవ్
Bamma ki ichina mata
Bamma ki ichina mata
- Prabhavathi pusapati