ఉంగరం మహిమ - డి.కె.చదువులబాబు

Vungaram Mahima

జగన్నాథం సుజాతల ఏకైక సంతానం గోపీ. వాడికి చూసిన ప్రతి వస్తువూ కావాలనిపించేది.ఊరికేరాదు కాబట్టి దొంగతనం చేయాలనుకునేవాడు. ఒకరోజు అమ్మ చెక్కెర తెమ్మని అంగడికి పంపిస్తే రెండు పెన్నులు దొంగిలించుకుని వచ్చాడు.తాను చేసిన పనిని గొప్పగా చెప్పాడు. గోపీ నాన్న జగన్నాథం దొంగతనం చెడు అలవాటని ఎప్పుడూ అలాంటి పని చేయవద్దని మందలించాడు. తండ్రి మందలింపుకు అప్పటికి 'సరే'అన్నాడు,కానీ తన పద్దతి మార్చుకోలేకపోయాడు. మరునాడు షాపులో బంతి దొంగిలించుకుని వచ్చాడు.ఎక్కడిదని అమ్మ అడిగితే అబద్దం చెప్పబోయి దొరికిపోయాడు. రాత్రి ఇంటికి వచ్చిన భర్తతో గోపీ విషయం చెప్పింది సుజాత. జగన్నాథం గోపీ చెంప చెల్లుమనిపించి "ఒరే!నువ్వింకా కుర్రకుంకవు. నీకు చెబితే అర్థంకావడంలేదు.దుకాణం యజమాని చూడక సరిపోయింది కానీ,చూసివుంటే నీఎముకలు విరగ్గొట్టి ఉండేవాడు. నువ్వు దొంగతనం చేస్తూ ఎవరికంటనైనా పడ్డావంటే కీళ్ళు విరిచేస్తారు. తమాషా అనుకున్నావేమో!"అని గట్టిగా మందలించాడు. "అలా జరగదు నాన్నా! ఎవరికంటాపడకుండా దొంగిలిస్తాను." అన్నాడు గోపీ. "ఎవరికంటా పడకుండా ఉండటానికి నువ్వేం మాయలఫకీరువా? మంత్రవేత్తవా? ఇంకెప్పుడైనా దొంగతనంచేశావో వీపు చీరేస్తాను" అంటూ వాడి అమ్మ కూడా నాలుగు దెబ్బలు వేసింది. దెబ్బల్ని కూడా పెద్దగా లెక్కచెయ్యని గోపీ పైకి ఏడుపు మొహం పెట్టి ఇంకెప్పుడూ దొంగతనం చేయనని చెప్పి, భోజనం చేసి పడుకున్నాడు. వాడికి ఆరాత్రి ఓపట్టాన నిద్రపట్టలేదు. 'ఎవరికీ కనిపించని విద్య తనకూ వస్తే ఎంతబాగుండును'అనిపించింది.బామ్మ చెప్పిన మాయలఫకీరు కథ గుర్తుకొచ్చింది.ఊరి వెలుపలనున్న కాళికాదేవి ఆలయం గుర్తొచ్చింది. కాళికాదేవిని వేడుకుని ఎవరికీ కనిపించని మంత్రం నేర్చుకోవాలనుకున్నాడు. అందరూ నిద్రపోయాక ఇంట్లో నుండి ఆలయానికి వెళ్ళాలనుకున్నాడు. అర్ధరాత్రి పన్నెండుగంటలు. అందరూ నిద్రపోతున్నారు.మెల్లిగా లేచి తలుపుగొళ్ళెం తీసుకుని బయటకు నడిచాడు గోపి. వీధులన్నీ నిర్మానుష్యంగా ఉన్నాయి. చలికాలం కావడంతో అందరూ ఇళ్లలో పడుకుని ఉన్నారు. ఊరకుక్కలు వీధిలో మునగతీసుకుని పడుకుని ఉన్నాయి. దూరంనుండి నక్కలకూతలు వినిపిస్తున్నాయి. మెల్లిగా నడిచి భయం భయంగా ఊరి వెలుపలనున్న కాళికాదేవి ఆలయం చేరుకున్నాడు. చుట్టూ నిర్మానుష్యంగా ఉంది. కాళికాదేవి పాదాలకు భక్తితో నమస్కరించి"అమ్మా!నన్ను కరుణించు. నిన్ను నమ్మకుని వచ్చాను. నీ పాదాలచెంతచేరాను.ఎవరికీ కనిపించకుండా తిరిగే మంత్రాన్ని నాకు ప్రసాదించు"అంటూ పాదాలపై వాలిపోయాడు. తెల్లవారు ఝాము వరకూ పాదాలను వదలకుండా కళ్ళుమూసుకుని ప్రార్థిస్తూనే ఉన్నాడు. తెల్లవారు ఝామున కాళీమాత విగ్రహం నుండి "బాలకా!ఎముకలు కొరికే చలిలో నీవు చూపిన భక్తికి, నీ నమ్మకాన్ని మెచ్చాను. నీకు దగ్గరగా కుంకుమ భరిణ ఉంది చూడు. అందులో ఓ ఉంగరం ఉంది. ఆ ఉంగరాన్ని ధరిస్తే నీవు ఎవరికీ కనబడవు" అంటూ మాటలు వినపడ్డాయి. గోపీ కళ్ళు తెరిచి లేచి చూడగా కుంకుమ భరిణలో ఉంగరం కనిపించింది. ఆ ఉంగరాన్ని వ్రేలికి ధరించాడు. ఆనందంగా ఇల్లుచేరి పండ్లు తోమి, కాళ్ళు, ముఖం కడుక్కున్నాడు. గోపీ ఇంట్లో తిరుగుతున్నా వాడి తల్లిదండ్రులు వాడ్ని గుర్తించడం లేదు. గోపీ ఎక్కడికెళ్ళాడని వెదుకుతున్నారు. తాను కనిపించడం లేదని నవ్వుకుంటూ బయటకు నడిచాడు గోపి. ఓషాపులో కెళ్ళి పెన్నులు,స్టాప్లరు,కాంపాస్ బాక్సు తీసుకుని జేబులో పెట్టుకున్నాడు. ఎవరూ అడ్డు చెప్పలేదు. ఆకలిగా అనిపించడంతో నవ్వుకుంటూ ఓ మిఠాయిలదుకాణంలోకెళ్లి రకరకాల మిఠాయిలు కడుపు నిండా తిని ఠీవిగా బయటకు నడిచాడు. కొంతదూరంలో ఓకుళాయి కనిపించింది. అక్కడకెళ్ళి చేతులు బాగా కడుక్కొని నీళ్ళు తాగాడు.గోపీ ఆనందానికి అంతులేదు. తాను ఎవరికీ కనిపించడంలేదని సంతోషంగా నడుస్తున్నాడు. దారిలో ఒక వాచీలషాపు కనిపించింది. షాపులో కెళ్లి రెండువాచీలు తీసుకుని జేబులో వేసుకుని బయటకు రాబోయాడు. అది గమనించిన షాపుయజమాని "ఏరా!నాఎదుటే దొంగతనం చేస్తావ్? నీకెంత గుండె ధైర్యం?"అంటూవచ్చాడు.గోపీభయంతో పరుగందుకున్నాడు. షాపులో ఉన్న నలుగురు మనుష్యులు గోపీ వెంటపడ్డారు. ఆయాసపడుతూ పరుగెడుతున్నాడు. గోపీ పరుగెడుతూ చేతివైపు చూసుకున్నాడు ఉంగరం లేదు. కుళాయి వద్ద జారిపోయిందని గుర్తించాడు. కొంతదూరం వెళ్లి ఆయాసంతో పడిపోయాడు. వాళ్లు నలుగురూ గోపీ వద్దకు వచ్చి "వాచీలు తీసుకుని దొంగతనం చేస్తావురా?"అంటూ చితకతన్నసాగారు.దెబ్బలకు ఒళ్లు హూనం కాసాగింది.అమ్మా!అమ్మా!నన్ను చంపేస్తున్నారు." అంటూఅరవసాగాఢు. "ఎందుకలా కలవరిస్తున్నావు?తెల్లవారింది లెగు" అంటూ గోపీని అమ్మ తట్టి లేపింది. లేచి చూస్తే మంచం మీదున్నాడు. అంతా కలని అర్థమయింది. అయినా వణుకు తగ్గలేదు.ఇంకావాళ్లు తనను వెంబడించి చితకబాదుతున్నట్లే ఉంది.దొంగతనం యొక్క ఫలితం మనసులో మెదలుతుంటే భయంతో వణికిపోతూ ఇంకెప్పుడూ దొంగతనం చేయరాదని నిర్ణయించుకున్నాడు గోపీ.

మరిన్ని కథలు

Panipilla
పనిపిల్ల (క్రైమ్ కథ)
- చెన్నూరి సుదర్శన్
Bhavaateetam
భావాతీతం
- DODDIPATLA KALYAN KISHORE
Prema falam
ప్రేమ ఫలం
- పి. రాజేంద్రప్రసాద్
Neethone nenunta
నీతోనే నేనుంటా
- కాశీవిశ్వనాధం పట్రాయుడు
Amlet damlet
ఆంమ్లేట్ - డాంమ్లేట్ .
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
REkkala kastam
రెక్కల కష్టం
- వరలక్ష్మి నున్న