నడి నెత్తిన సూరీడు ఎర్రగా మండిపోతున్నాడు. అనుభవాల జ్ఞాపకాలను వదిలేసిన నిర్జీవిలా పడివుంది రామన్న దేహం.
ఆఖరి చూపుగా తనను చూడడానికి ఎవరూ రాలేదు. కన్న కూతురు కూడా ఎవరూ రాకున్నా పరుగెడుతున్న కాలచక్రం ఆగదన్నట్లుగా పాడెమీద కదిలింది రామన్న దేహం. బంధుత్వ బాంధవ్యాలన్నీ తెగినా మీకు మేమున్నాం అంటూ నలుగురు యువకులు మోస్తున్న పాడెమీద ఈ ప్రపంచాన్ని వీడి వెళ్లిపోతోంది ఆ భౌతికదేహం.
శ్మశానం సమీపించింది.
దింపుడు కళ్లెం వద్ద దించారు రామన్నను. బతికినన్ని రోజులూ ఛీదరింపులు, చీత్కారాల ఘర్షణలతో అలసిసొలసిన రామన్న ఇప్పుడు కులమతాలు, రాగద్వేషాలు లేని మానవత్వం పరిమళిస్తున్న శ్మశానం వద్దకు చేరుకున్నాడు. ఇంకాసేపట్లో శాశ్వతంగా నిద్రించడానికి సమాధి స్థితికి చేరుకోవడానికి కొద్ది క్షణాలు మాత్రమే వున్నాయి.
‘‘ అన్నా.. రామన్నా..రామన్నా..రామన్నా..’’ మూడు సార్లు అరిచాడు పక్కింటి సుందరం.
పొగకుండ చేతపట్టుకున్న భార్య సీతమ్మ కళ్లలో కన్నీటి సుడులు ఆగలేదు.
ప్రేమానురాగాలు ప్రతిఫలింపజేసిన రామన్న స్మృతులను తన మనో ఫలకం నుంచి చెరిపివేయలేకపోతోంది. మానవత్వమున్న నిస్వార్థ జీవితో తన జీవనయానం సాగినందుకు సంతోషించింది. అలాంటి మహోన్నతుడు తనను విడిచివెళ్లిపోవడాన్ని జీర్ణించుకోలేకపోతోంది సీతమ్మ. గత స్మృతుల అలలు సుడులు తిరగడంతో దు:ఖం ఉప్పొంగింది.
‘‘ అమ్మా సమయం లేదు..’’ అంటూ పాడెను భుజాలకెత్తుకుని గుంత దగ్గరకు నడుస్తుంటే తన జీవితంలో గోతులు తవ్వి పొగబెట్టి ఏకాకిని చేసిన వారందరిని ఆ గోతిలో పాతిపెట్టేయాలన్నంత కోపం వచ్చింది సీతమ్మకి. పక్కనే వెక్కివెక్కి ఏడుస్తున్న కూతురిని సముదాయించింది.
మంచితనం, మానవత్వం పంచిన మహామనిషి సమాధి అయిపోతుంటే తల్లీకూతురు కన్నీరు పెట్టడం వారిని ఓదార్చడం ఎవరితరంకాలేదు.
సీతమ్మ తండ్రి పెద్ద భూస్వామి. ఎటు చూసినా కిలోమీటరు మేర పచ్చని పొలాలు, పండ్ల తోటలు వున్నాయి. ఆ తోటల మధ్యే ఫామ్ హౌస్ వుంది. చల్లని ప్రశాంత వాతావరణంలో సేదతీరుతున్నాడు సీతమ్మతండ్రి. ఆ పరిసరాలు ప్రశాంతమే తప్ప సీతమ్మ తండ్రి మాత్రం ఉగ్రుడే. అందుకే తన పేరు కూడా ఉగ్రనరసింహుడు అనే నామం సార్థకమయింది. ఎవరైనా తన ఆలోచనలకు ఎదురు తిరిగితే తలతీసేస్తాడు. అందుకే అందరి నోళ్లలో ఉగ్రనరసింహుడనే నామంతో నానుతూ ఆ ఊరి సర్పంచిగా అందరిని చండశాసనుడిలా శాసిస్తున్నాడు.
సరిగ్గా పద్నాలుగేళ్ల క్రితం సీతమ్మ పట్నంలో చదివే రోజుల్లో తన క్లాస్‌మేట్ రామన్నకు మనసిచ్చింది సీతమ్మ. టీచరు ట్రైనింగు చేస్తున్నప్పుడే ఇద్దరి మనసులు, ఆలోచనలు కలిశాయి.
వారి చదువుకు అది ఆఖరి రోజు..సీతమ్మ చేయి పట్టుకున్నాడు రామయ్య. పెళ్లిలో మంత్రోచ్ఛారణల మధ్య హోమం ముందు ఏడడుగులు వేసినట్లు గుడి చుట్టూ ఏడు అడుగులు వేసి వివాహ బంధంతో భార్యాభర్తలై ఒక్కటైనట్లు భావించి తన ఇంటి గుమ్మం ముందు నిల్చొంది సీతమ్మ.
రోహిణికార్తె.. ఎండ తీక్షణంగా వుంది. సీతమ్మ, సీతయ్య వళ్లంతా ముచ్చెమటలు పట్టాయి. శరీరమంతా వణికింది. నరసింహం ఆవేశంతో ఇద్దరి మీద నిప్పులు గక్కాడు. మెడపట్టి గెంటాడు.
ఆ క్రోదాగ్నికి భస్మం కాకముందే తప్పించుకు బయటపడ్డారు సీతమ్మ, రామన్న. ఆ తర్వాత ఇప్పటి వరకు ఆ గడప తొక్కలేదు. కోట్ల కొద్దీ ఆస్తి వున్నా తండ్రి తిరగలేని స్థితిలో ఏకాకిగా మంచం పట్టాడని తెలిసినా గుండెను రాయి చేసుకుని స్థిత ప్రజ్ఞరాలయ్యారు సీతారాములు.
కట్టుబట్టలతో వచ్చేసిన సీతారాములు ఉపాధికోసం ఊరూరు తిరిగారు. పాఠశాలలన్నీ అడిగారు. వారికి ఎక్కడా నచ్చలేదు. ఆఖరిగా కాసేపు విశ్రమిస్తామని ఓ బడి ముందు కూర్చున్నారు. తిరిగితిరిగి కాళ్లు నొప్పి పెడుతున్నాయి. నిరాశ, నిస్పృహలతో ప్రాణం స్తంభించినంత పనైంది. కాళ్లు కదలడం లేదు. ఎండలో అల్లాడిన తాము సేదతీరుతామని మొక్కలకు నీళ్లు పడుతున్న వాచ్‌మ్యాన్‌ని చూసి కాసేపు కూర్చున్నారు. చెట్లకు పడుతున్న నీటి తుంపర్లు వారి ముఖంపై పడ్డాయి. అలసటతో కూలబడ్డ ప్రాణం ఒక్కసారిగా లేసొచ్చింది. అప్పటికి సమయం ఇంకా ఎనిమిది దాటలేదు. కాలుతున్న కడుపును పక్కనే వున్న ఓ అంగట్లో చెరో రెండు ఇడ్లీలు తిని గ్లాసు మంచినీళ్లు తాగి చల్లబరిచారు. కష్టం ఎరుగని జీవితం తనది. బయటకు రాకుండా సకల సౌఖ్యాలు అనుభవించిన లగ్జరి లైఫ్.. జీవన యానం ఇలా కష్టాల కడలిలో సాగుతుందని కలలో కూడా ఊహించలేదు. నిజమే జీవితమంటే సుఖదు:ఖాల సంగమం. కష్టాలు, కడగళ్లతో పయనిస్తేనే జీవిత పరమార్థం తెలుస్తుంది. అందుకే తన తాహత్తుకు తగిన వ్యక్తి కాకపోయినా అతని చేతులు పట్టుకుని నడిచింది. ఈ సమాజ స్వరూపం తెలుసుకుని అనుభవ సారాలను పొదివి పట్టుకోవాలనే ధృడ నిశ్చయం తనను ముందుకు నడిపిస్తోంది.
ఏదో ఆలోచనలో వున్న తనకు ‘‘ అమ్మా... అంత్యక్రియలు ముగిశాయి.. ఇక ఇంటిదారి పట్టండి..’’ అంటున్న అరుపు విని ఈ లోకంలో కొచ్చింది సీతమ్మ. పక్కనే అమ్మాయి చేతులు పట్టుకుని అడుగుమీద అడుగు వేసి ఇంటికి చేరుకున్నారు.
ఆ రాత్రంతా భర్త జ్ఞాపకాలు సీతమ్మ మదిలో కదలాడాయి. దు:ఖం ముంచుకొస్తున్నా దిగమింగుకుంది. సమస్యల సుడిగుండాల్లో చిక్కుకుని బాధపడటం సీతమ్మకు ఇష్టంలేదు.
మరుసటి రోజు తన పనిచేస్తున్న ప్రైవేటు స్కూలు అధినేత్రి రమణమ్మ వచ్చి పరామర్శించింది. వారం రోజులు లీవులు తీసుకుని యథావిధిగా పాఠశాలకు వెళ్లింది సీతమ్మ. విద్యార్థులకు పాఠాలు చెబుతున్నా మనసంతా రామన్న చుట్టూ తిరుగుతోంది . మనసులో కకావికలం చేస్తున్న జ్ఞాపకాల దొంతరలను చిదిమేస్తూ ఆలోచనలకు అడ్డుకట్టవేసి విధులు నిర్వహించింది.
ఆ సాయంత్రం సీతమ్మ తండ్రి ఉగ్రనరసింహుడు ఇంటి ముందు ప్రత్యక్షమయ్యాడు. సీతమ్మ పడుతున్న వనవాస కష్టాలను చూసి చలించాడు తండ్రి.
బయట గుమ్మం ముందే నిల్చొన ఉగ్రనరసింహం ‘‘ అమ్మా సీతమ్మా..’’ అన్నాడు.
లోపల నుంచి బయటికి వచ్చి చూసింది సీతమ్మ కూతురు మహాలక్ష్మి.
లోపల స్టవ్‌పై అన్నం కుతకుత ఉడుకుతోంది. గరిటెతో తిప్పుతున్న సీతమ్మ ‘‘ ఎవరూ..?’’ అడిగింది.
‘‘ నేనూ అమ్మా..’’ అన్నాడు నరసింహం.
‘‘ ఎవరో బిచ్చగాడిలా వున్నాడు..’’ అంది మహాలక్ష్మి.
ఆ మాటతో అన్నం ఇంకా ఉడకలేదు.. కాస్త పక్క వీధి చుట్టుకు రమ్మని చెప్పు..’’ అంది.
ఉగ్ర నరసింహం విస్తుపోయాడు. కన్న కూతురును తీసుకుపోదామని వచ్చిన తనకు ఎదురైన చేదు అనుభవంతో వెనుదిరిగాడు.
సీతమ్మ రోజూ పాఠశాలలో చదువు చెబుతూనే తన భర్త ఆశయాలకు మొగ్గ తొడిగింది.
ఆ ఊళ్లో కొండ చివర ఓ గుడిసె వెలసింది. అది ప్రేమ బాధితులకు నిలయమైంది. తనలాంటి ప్రేమికులకు ఎదురయ్యే బాధలు తెలుసుకుంది. న్యాయ పరంగా ఎదురయ్యే సమస్యల పరిష్కారానికి న్యాయశాస్త్రం చదివింది. ఎన్నో కేసులు వాదించి న్యాయం చేసింది సీతమ్మ. సీతమ్మ తన జ్ఞాపకాలు రమణమ్మతో నెమరవేసుకుంది. రమణమ్మ జీవితమూ ఇదే బాటలోనే నడిచింది. రమణమ్మది ప్రేమ వివాహమే.. భర్త మరణించినా కృంగిపోలేదు. చదివిన విద్యతో పిల్లలకు ట్యూషన్లు చెప్పింది. వచ్చే వంద, రెండు వందలతోనే పూట గడిపింది. ట్యూషన్లు చెబుతూనే పది మందితో పాఠశాల ప్రారంభించింది. అది ఇంతింతై.. వటుడిరతై అన్నట్లు నేడు డిగ్రీ కళాశాల వరకు వెళ్లింది. ఇప్పుడు ఎటు చూసినా ఆకాశాన్ని తలదన్నే భవంతులు, వంద సంఖ్యలో అధ్యాపకులు పనిచేస్తున్నారు. తాను ఎంత ఎత్తుకు ఎదిగినా తన స్థాయిని మరువలేదు.. ఎవరికి ఏ కష్టం వచ్చినా ఆదుకుంటోంది. ఆమె చల్లని దీవెన నీడలో తలదాచుకుంటున్న సీతమ్మకు ఆర్థిక అండ దొరికింది.
నాలుగేళ్లు గడిచాయి.. సీతమ్మ ఇప్పుడు ఎంతో ఎత్తుకు ఎదిగిపోయింది. అందనంత ఎత్తుకు వెళ్లింది. ప్రిన్సిపల్ అభయంతో తనలా ఆధారం కోల్పోయిన ప్రేమ బాధితులను, అనాథలను చేరదీసింది. విద్య, కూడు, గుడ్డ, నీడ ఆధారం కల్పించింది. తనలా ఇంటి నుంచి గెంటివేతకు గురై నరకం అనుభవిస్తున్న వారి హక్కుల కోసం పోరాట బాట పట్టింది. ప్రేమ వివాహంలో తల్లిదండ్రుల నుంచి, బాహ్య సమాజంలో ఎదురయ్యే కష్టాలు ఎదుర్కోలేక ఆత్మహత్యకు చేరువైన దంపతులను గుర్తించి రక్షించి చేరదీసి ఆశ్రయం కల్పించింది. ఉన్నత చదువులు చదివించి జీవితంపై ఆశ పుట్టించి వెన్నెముకలా నిల్చింది. సీతమ్మ ఆశయానికి ప్రిన్సిపల్ ఆర్థిక సాయం చేసింది. కుల, మత ప్రేమ వివాహాల విద్వేషాల కుంపటిని ప్రేమ, దయ, కరుణ అనే చల్లటి నీటి జల్లులతో ఆర్పేసింది. సమాజంలో అడ్డుగోడలా నిలిచిన ఆచారాలు, సంప్రదాయాల మరుగున నిస్తేజమైన సమాజ ప్రగతిని మేల్కోలిపింది. అలనాడు సమాజాన్ని మేల్కోలిపిన రాజారాం మోహన్‌రాయ్, కందుకూరు వీరేశలింగ పంతులు ఆశయాలకు ఊపిరి పోసి మహోన్నత ఆశయాల వైపు ముందుకు సాగింది. రామన్న మధుర స్మృతులను గుండెల్లో పదిలంగా దాచుకుని ప్రేమ వివాహాల బంధుత్వాలు, బాంధవ్యాలు పెంచుతూ అందరికీ బంధువైంది సీతమ్మ.