అంజనయ్య వ్యక్తిత్వం - డి.కె.చదువులబాబు

Anjanayya vyaktitwam

చెన్నవరంలో శరభయ్య అనే వైద్యుడు ఉండేవాడు.శరభయ్య అత్యాశపరుడు. చుట్టుపక్కల శరభయ్య ఒక్కడే వైద్యుడు కావడంతో అందరూ అతని వద్దకే వెళ్లేవారు. పేద,ధనిక తేడా లేకుండా వైద్యం కోసం వచ్చే వారినుండి ఎక్కువ మొత్తంలో ధనం వసూలు చేసేవాడు. అందరినీ పీల్చి పిప్పి చేసి లక్షాధికారి అయ్యాడు. అద్భుతమైన భవనాన్ని నిర్మించుకున్నాడు. శరభయ్య రకరకాల మొక్కలు, ఆకులు, వేర్లు,పువ్వులు,తేనె మొదలగు ఖర్చులేని వాటిని వైద్యానికి ఉపయోగిస్తాడు. ఏజబ్బుకు ఏవైద్యం చేయాలో, వేటిని ఎంత శాతం కలిపి పసుర్లు, గుళికలు, లేపనాలు తయారుచేసి ఎలా వాడాలో తెలియటం వల్ల మందుల తయారీకి తక్కువ పెట్టుబడి పెట్టి ఎక్కువ ధనం వసూలు చేసేవాడు. ఒకసారి అంజనయ్య అనే పేదవాడు అనారోగ్యంతో శరభయ్య దగ్గరకు వచ్చాడు. అతన్ని పరీక్షీంచి వైద్యానికి చాలా ఖర్చవు తుందని పెద్ద మొత్తం చెప్పాడు. "అయ్యా!నేను పేదవాడిని. భార్యా, బిడ్డలు కలవాడిని. అమ్మ, నాన్న కూడ నామీద ఆధారపడి ఉన్నారు. అంత ధనం ఇచ్చుకోలేను.దయవుంచి తగ్గించి చెప్పండి" అన్నాడు. "నేను అడిగినంత ఇస్తేనే వైద్యం ప్రారంభిస్తాను. లేదంటే వెళ్లిపోవచ్చు. మరో మాటకు తావులేదు" అన్నాడు శరభయ్య. అంజనయ్య ఎంతగా ప్రాధేయపడినా శరభయ్య మనసు కరగలేదు. మాట మారలేదు.అంజనయ్య తన బంధువుల వద్ద,మిత్రులవద్ద అప్పుచేసి ఆ ధనం శరభయ్యకిచ్చి వైద్యం చేయించుకున్నాడు. ఒకరోజు శరభయ్య ఇంటిలో నాగుపాము కనిపించింది.శరభయ్య కేకలు వేస్తూ భార్యా,పిల్లలతో రోడ్డు మీదకు పరుగెత్తుకొ చ్చాడు.ఏం చేయాలో శరభయ్యకు పాలు పోవడంలేదు.విషయం తెలిసి జనం గుంపయ్యారు. "ఇంతపెద్ద ఇంటిలో సర్పం ఎక్కడ వుందో?లోపలికెడితే ఏవైపు నుండి వచ్చి కాటు వేస్తుందో?ఇప్పుడు ఏంచేయాలి?" భయంతో వణికిపోతూ అంది శరభయ్య భార్య. "పాములను పట్టడం అంజనయ్యకు వెన్నతో పెట్టిన విద్య. పాములను పట్టగల మెలుకువలు తెలిసిన నేర్పరి అంజయ్య తప్ప ఈ చుట్టుపక్కలలేడు" అన్నారు జనం."అంజనయ్య దగ్గరకు వెళ్లి పిలుచుకుని రండి" అంది శరభయ్య భార్య. అంజనయ్య తనవద్దకు జబ్బుపడి వచ్చినప్పుడు పేదవాడినని ఎంత ప్రాధేయపడినా దయ తల్చకుండా ఆకు పసుర్లకు కూడా తాను అధిక ధనం వసూలు చేసిన విషయం గుర్తుకొచ్చింది శరభయ్యకు. అది మనసులో పెట్టుకుని అంజనయ్య ఎంతధనం అడుగుతాడో, అసలు రావడానికి ఒప్పుకుంటాడా?" అనుకుంటూ మరో మార్గంలేక అంజనయ్య ఇంటి దగ్గరకు వెళ్లి విషయం చెప్పాడు. వెంటనే అవసరమైన సామాగ్రితో బయలుదేరి వచ్చాడు అంజనయ్య. ఇంటిలోకి ప్రవేశించాడు.అందరూ ఆతృతగా చూస్తున్నారు. "ఇంత పెద్ద ఇంటిలో పాము ఎక్కడవుందో ఎలా వెదుకుతాడు? ఈలోగా పాము ఏమూలనుంచయినా వచ్చి కాటు వేస్తే ఎలా? ప్రాణాలకు తెగించి పామున్న ఇంట్లోకి వెళ్లాడు. ఏమి జరుగుతుందో?" అంటూ తలా ఒకమాట అంటున్నారు జనం. అందరూ ఊపిరి బిగబట్టి చూస్తున్నారు. దాదాపు రెండు గంటల తర్వాత బయటకు వచ్చాడు అంజనయ్య, అతని చేతిలోని సంచిలో సర్పం కదులుతోంది. "అమ్మా!ఈపామును తీసుకెళ్లి అడవిలో వదులుతాను.మీరు పిల్లలను తీసుకుని ఇంటిలోకి వెళ్లండి" అని శరభయ్య భార్యతో చెప్పాడు అంజనయ్య.ఆమె అంజనయ్యకు నమస్కరించి వెళ్లింది. శరభయ్య అంజనయ్య దగ్గరకు వచ్చి ఎంతధనం అడుగుతాడోనని సందేహపడుతూ "పామును పట్టినందుకు ఎంత ధనం ఇవ్వాలో చెప్పండి" అన్నాడు. "అయ్యా!ధనంకోసం నేను ఈపని చేయలేదు.ఇంటిలోకి పాము దూరి ఏంచేయాలో తెలియని పరిస్థితుల్లో భార్యా, పిల్లలతో వీధిలోపడిన మీపరిస్థితి చూసి నాకు చేతనైన సాయం చేశాను" అంటూ మరోమాటకు తావివ్వకుండా వెళ్లిపోయాడు అంజనయ్య.ఆనాడు తాను ప్రవర్తించిన తీరు గుర్తుకొచ్చి సిగ్గుతో తలదించుకున్నా డు శరభయ్య. మానవత్వంతో ప్రాణాలకు తెగించి సాయపడిన అంజనయ్య ఉన్నత వ్యక్తిత్వానికి మనసులోనే నమస్కరించాడు శరభయ్య.ఆరోజు నుండి పేదలకు ఉచితవైద్యం అందించాలని నిర్ణయించుకున్నాడు.ఆనిర్ణయంతో అంజనయ్యతో సహా పేదలకందరికీ మేలు జరిగింది.

మరిన్ని కథలు

Veedani todu
వీడని తోడు
- Dr. శ్రీదేవీ శ్రీకాంత్
Banglaw kukka
బంగ్లా కుక్క
- -పెద్దాడ సత్యప్రసాద్
Ekaaki
ఏకాకి
- ప్రభావతి పూసపాటి
Kalpita betala kathalu.3
కల్పిత బేతాళకథలు - 3
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
KalpitaBetala kathalu.2
కల్పిత బేతాళకథలు - 2
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
KalpitaBetala kathalu.1
కల్పిత బేతాళకథలు - 1
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
Manam
మనం
- మణి
Kanumarugai
కనుమరుగై
- ఐసున్ ఫిన్